Pages

Sunday, July 29, 2012

తెలివైన ఎలుక - వీడియో

మంచి ఏనుగు - వీడియో

పాముగా మారిన బాలుడు - పంచతంత్ర కధలు

దుష్టకాకి - పంచతంత్ర కధలు

తెలివైన కొడుకు - పంచతంత్ర కధలు

అక్బర్ మరియు బీర్బల్ ల అత్యాశ - అక్బర్ మరియు బీర్బల్ కధలు

తెలివైన వృద్దపక్షి - పంచతంత్ర కధలు

అత్యాశకి అంతులేదు - పంచతంత్ర కధలు

చాకలివాడి గాడిద - పంచతంత్ర కధలు

తీపి పరిమళపు ధర - పంచతంత్ర కధలు

మాటకారి తాబేలు - పంచతంత్ర కధలు

దయామయుడైన దొంగ - పంచతంత్ర కధలు

పాటపాడే గాడిద - పంచతంత్ర కధలు

ఇనుము తిన్న ఎలుక - పంచతంత్ర కధలు

మూడు చేపల కధ - పంచతంత్ర కధలు

ఎలుకలు మరియు ఏనుగులు - పంచతంత్ర కధలు

ఆకతాయి శిష్యుడు.. తెలివైన గురువు..!!

గణపతి స్వామి ఊరూరా తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు ప్రబోధిస్తుండేవారు. ప్రజలు ప్రేమతో ఇచ్చే దక్షణను ఆయన ఖర్చులకోసం స్వీకరించేవారు. అలా ప్రజలు ఇచ్చిన డబ్బులన్నీ ఆయనవద్ద పోగయ్యాయి. వాటిని మూటగట్టుకుని ఆయన బొడ్డులో దోపుకునేవారు. దీనిని గమనించిన ఓ ఆకతాయి ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశాడు.

ఓ చెట్టుకింద సేదతీరుతున్న గణపతి స్వామిని కలిసిన ఆ ఆకతాయి.. "అయ్యా.. నేనొక అనాధను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే, మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను" అని వేడుకున్నాడు. అతడి మాటలు నమ్మశక్యంగా అనిపించటంతో సరేనని అంగీకరించిన గణపతి స్వామి "సరే, అలాగే కానీ.. ఇదిగో ఈ జోలెను భుజానికి తగిలించుకో, వేరే ఊరికి వెళదాం.." అన్నాడు.

తన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించిన ఆ ఆకతాయి గణపతి స్వామికి శిష్యుడిగా చేరిపోయాడు. ఇక అప్పటినుంచి ప్రతిరోజూ ఊరూరా తిరుగుతూ, రాత్రివేళల్లో ధర్మసత్రాలలో బసచేస్తూ గడిపారు ఆ ఇద్దరు గురు శిష్యులు. ఎవరి జోలెను వారి పక్కన పెట్టుకుని వాళ్లు నిద్రపోయేవారు.

అలా కొన్ని రోజులు గడచిన తరువాత గణపతి స్వామి గాఢ నిద్రలో ఉండగా ఆయన డబ్బుల మూట కోసం శిష్యుడు వెదికాడు. ఎంత వెతికినా కనిపించలేదు. చప్పుడు చేయకుండా స్వామీజీ జోలెను కూడా తీసి అంతా వెదికాడు. ఎక్కడా డబ్బుల మూట జాడ తెలియలేదు.

"అబ్బా గురువుగారు చాలా గట్టివారే. డబ్బుల మూటను ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు" అంటూ మనసులో తిట్టుకున్నాడు ఆ ఆకతాయి శిష్యుడు. మరుసటి రోజు స్నానం చేసి వచ్చిన గురువుగారివద్ద డబ్బుల మూట ఎప్పట్లాగే కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు శిష్యుడు. ఆ రాత్రి కూడా డబ్బుల మూట కోసం అంతటా వెతికిచూశాడు. కానీ ఎక్కడా ఆ మూట కనిపించలేదు. అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం శిష్యుడికి కనిపించలేదు.

దీంతో విసుగుచెందిన ఆ దొంగ శిష్యుడు నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి "అయ్యా.. ఇలా ఊరూరా తిరుగుతూ ఎంతకాలం గడిపేది. ఏదైనా ఒక ఊళ్లో స్థిరపడి, ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని అనిపిస్తోంది. తమరు సెలవిప్పిస్తే వెళ్లిపోతాను" అని అన్నాడు.



"అలాగే.. తప్పకుండా వెళ్లిరా నాయనా..? ఎక్కడ జీవించినా మంచి బుద్ధితో నడచుకో..!" అని ఆశీర్వదించి పంపించాడు. అయితే అలా వెళ్లిన శిష్యుడు కాస్త దూరం వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగివచ్చాడు. "ఇప్పడే కదా వెళ్లావు. మళ్లీ ఇంతలోనే వచ్చేవేంటి నాయనా..?" అని ప్రశ్నించారు గణపతి స్వామి

"మరేం లేదు అయ్యా.. నాదో చిన్న సందేహం. అది తీర్చుకుని వెళదామని మళ్లీ తిరిగి వచ్చాను" అన్నాడు. "సందేహమా.. ఏంటో అడుగు నాయనా..?" అన్నారు గురువుగారు. "మరేంలేదు స్వామీ.. మీ మొలకు ఎప్పుడూ ఓ డబ్బుల మూట వేలాడుతూ ఉంటుంది కదా.. అతి రాత్రిపూట కనిపించదేంటి..? ఎక్కడ దాస్తున్నారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది చెప్పరూ..?" అన్నాడు.

"మొదట్లోనే నీ వాలకం నాకు అర్థమైంది నాయనా..? ప్రతిరోజూ రాత్రిపూట డబ్బుల మూట కోసం నీ వెదుకులాటను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. అందుకే నిద్రపోయేందుకు ముందుగా నా డబ్బుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను. మరుసటి రోజున నువ్వు లేచేందుకు ముందుగానే లేచి తీసుకుని నా జోలెలో పెట్టుకునేవాడిని" చెప్పాడు గణపతి స్వామి

"అలాగా..?" అంటో నోరెళ్లబెట్టాడు దొంగ శిష్యుడు. "చూడు నాయనా... ఇతరుల ధనాన్ని, వస్తువులను దోచుకోవాలని అనుకునేవాడు, తన దగ్గరున్నవాటిని ఎప్పటికీ గ్రహించలేడు" అని అన్నాడు గణపతి స్వామి.

సిగ్గుతో తలవంచుకున్న దొంగ శిష్యుడు "అయ్యా.. తప్పు చేశాను. నన్ను మన్నించండి. ఇకపై ఇలాంటి అపరాధం జరగదు. ఎల్లకాలం మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను. ఇకపై ఇతరుల సొమ్ముకు ఆశపడను" అంటూ ప్రాధేయపడ్డాడు.

తప్పు తెలుసుకుని ప్రశ్చాత్తాప పడుతున్న శిష్యుడిని పైకి లేపి... "ఇకనైనా బుద్ధిగా నడచుకుంటే అంతే చాలు నాయనా..? పదా పక్క ఊరికి వెళ్దాం..." అంటూ బయల్దేరాడు గణపతి స్వామి.

ఈ బిరుదానికి మీరే తగినవారు.. నేను కాదు..!

పూర్వకాలంలో హిమవంతుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులతూగే అతనెప్పుడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ప్రతిరోజూ విలాసాల్లో తేలిపోతుండేవాడు. ఆ రాజుకు తన సుఖం తప్ప, రాజ్య ప్రజలు ఎలా బ్రతుకుతున్నా పట్టేది కాదు. విలాస పురుషుడైన ఆ రాజు, తనకు తోచినప్పుడు వినోదాన్ని అందించేలాగా ఓ ఇద్దరు హాస్యగాళ్లను కూడా రాజ మందిరంలో ఉంచుకున్నాడు.

ఆ ఇద్దరిలోనూ ఎక్కువగా హాస్యాన్ని అందించే ఒకడికి "ఉత్తమ అవివేకవంతుడు" అనే బిరుదాన్నిచ్చాడు. అంతేగాకుండా ఆ పదాలను ఒక బంగారు పతకంలో చెక్కించి ఆ పతకాన్ని బిరుదుపొందిన హాస్యగాడి మెడలో తగిలించాడు రాజు హిమవంతుడు. అలా కాలం గడుస్తుండగా రాజు ముసలివాడు అయ్యాడు. వ్యాధితో మంచపట్టాడు.

ఓ రోజు ఉత్తమ అవివేవవంతుడికి కబురు పంపించాడు హిమవంతుడు. "బ్రతికినంతకాలం నాకు లెక్కలేనంత హాస్యాన్ని అందించిన మిత్రమా..?! ఇక నేను వెళ్లిపోతున్నాను" అన్నాడు రాజు బాధగా. 

వెంటనే అందుకున్న ఉత్తమ అవివేకవంతుడు "మహారాజా.. గుర్రపు బగ్గీ కట్టించేదా..?" అని అడిగాడు "ఒరేయ్ అవివేకి.. బుద్ధిహీనుడా.. నేను వెళ్లేచోటికి గుర్రపు బగ్గీలపై వెళ్లరు" అని అన్నాడు.

"అవునా ప్రభూ.. సరే అయితే ఏనుగును తెప్పించేదా..?" మళ్లీ అడిగాడు అవివేకి. "అబ్బా.. ఓరీ మూర్ఖా, అక్కడికి ఏనుగుపై కూడా వెళ్లరురా..?" గట్టిగా అరిచి చెప్పాడు రాజు హిమవంతుడు.



"పోనీలేండి ప్రభూ.. సరే పల్లకీ అయినా తెప్పించేదా..?" అన్నాడు అవివేకి. రాజుకు పట్టలేనంత కోపం, విసుగు వచ్చేసింది. వీడికి ఎలా చెబితే అర్థం అవుతుంది. "ఎలా చెప్పినా అర్థంచేసుకోలేని నీకు ఎలా చెప్పేదిరా.. అక్కడికి పల్లకీ కూడా వెళ్లదురా" అన్నాడు నీరసంగా.

"భలే చిత్రంగా ఉంది ప్రభూ.. పైన చెప్పిన వేటిపైనా వెళ్లలేని మీరు.. నడిచి వెళ్లేంత ఖర్మ ఎందుకొచ్చింది మహారాజా..?" అన్నాడు అవివేకి బాధగా. ఇంత తెలివితక్కువవాడితో ఇన్నాళ్లూ వేగినందుకు మరణశయ్యపైన కూడా నవ్వు ముంచుకొచ్చింది మహారాజుకు. అయినా తమాయించుకుని "ఓరీ పిచ్చి సన్యాసీ.. నేను వెళ్లే చోటికి నడిచి వెళ్లేందుకు కూడా వీలుకాదురా..?" అన్నాడు.

"ఆహా.. భలేగుందే.. అయితే ఆ చోటు ఏదో చూడాల్సిందే.. ప్రభూ, ప్రభూ.. ఆ చోటుకి నేను కూడా మీతో వచ్చేదా.." అడిగాడు అవివేకి. "ఛీ పోరా దుర్మార్గుడా.. నన్ను ఈ సమయంలో కూడా వేధించుకు తింటున్నావు. అక్కడికి ఎవరంతట వాళ్లే వెళ్లాలిగానీ, ఇంకొకరితో కలిసి కాదు." అన్నాడు రాజు.

"ఇదేం విచిత్రం మహాప్రభూ.. ఎప్పటికప్పుడు నా ఆతృతను మరింతగా పెంచేస్తున్నారు. దయచేసి మీరు ఎక్కడికి వెళుతున్నారో ఇప్పటికైనా సెలవియ్యండి" వేడుకున్నాడు అవివేకి. దాంతో ఆలోచనలో పడ్డ మహారాజు.. "నేను ఎక్కడికి వెళుతున్నానో నాకే తెలియదురా.." అన్నాడు.

వెంటనే ఆ ఉత్తమ అవివేకవంతుడు తన మెడలో వేలాడుతున్న బంగారు పతకాన్ని తీసి మహారాజుకి ఇచ్చేశాడు. అంతేగాకుండా.. "మహా ప్రభూ.. దీన్ని ధరించేందుకు మీరే అర్హులు. ఇంత పెద్ద రాజ్యానికి రాజుగా ఉన్నారు. అష్టైశ్వర్యాలను అనుభవించారు. చివరికి ఎక్కడికి వెళతారో ఏంటోనని, జీవితంలో ఒకసారి కూడా ఆలోచించలేకపోయారు. ఇంతకంటే అవివేకం వేరే ఏముంటుంది చెప్పండి. కాబట్టీ.. ఇన్నాళ్లూ నా మెడకు వేలాడిన ఈ బంగారు పతకం మీకే సరిగ్గా సరిపోతుంద"ని అక్కడినుంచి వెళ్లిపోయాడు ఆ హాస్యగాడు.

తలతిక్క బ్రహ్మం.. బుద్ధిచెప్పిన ఏనుగు..!!

పూర్వం వైకుంఠపాళి అనే నగరంలో ఓ గురువు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నాడు. "బ్రహ్మం అంటే దేవుడని అర్థమనీ, దేవుడు నీలో, నాలో, అందరిలోనూ.. అంతటా ఉన్నాడనీ, సర్వమూ బ్రహ్మమేనంటూ" గురువు శిష్యులకు బోధించాడు. గురువు చెప్పిన పాఠం ఆసక్తికరంగా ఉండటంతో, శివయ్యకు ఆ పాఠం బాగా నచ్చింది. దాన్ని గురువు ఎలా చెప్పాడో, అలాగే మనస్సులో ముద్రించుకున్నాడు.

ఒకరోజున శివయ్యకు వాళ్ల అమ్మ ఏదో పని చెప్పింది. దాంతో ఆ పనిమీద వీధిలో నడచివెళుతున్నాడు. సాయంకాలం కావటంతో రోడ్లపై జనంతో వీధులన్నీ సందడిగా ఉన్నాయి. ఇంతలో ఉన్నట్టుండి జనాలంతా కేకలుపెడుతూ పరుగులు పెడుతున్నారు. శివయ్యకు ఏమీ అర్థం కాలేదు. పక్కనే వెళుతున్న ఓ పెద్దాయనను ఆపి, జనమంతా అలా ఎందుకు పరుగులు పెడుతున్నారని ఆరా తీశాడు.

"ఏం లేదు నాయనా..? వీధిలో దేన్నో చూసి జడుసుకున్న ఓ ఏనుగు పరుగులు పెడుతోంది.. ఇక్కడే ఉంటే తొక్కేస్తుంది. నువ్వు కూడా పారిపో" అని చెప్పి మెల్లిగా పరిగెడుతూ వెళ్లిపోయాడు ఆ పెద్దాయన. పెద్దాయన చెప్పినట్లుగా ఏనుగు ఒకటి తనవైపు పరుగులు పెడుతూ రావటాన్ని శివయ్య గమనించాడు.

ఏనుగుమీద కూర్చున్న మావటివాడు "ఏనుగు బెదిరిపోయింది.. దాన్ని దారిలోకి తేవటం సాధ్యం కావటంలేదు. అందరూ పక్కకు తప్పుకోండి" అంటూ కేకలు పెడుతూ, ఏనుగుకు కళ్లెంవేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దీంతో జనాలంతా భయంతో పక్కకు తప్పుకుని వెళుతుంటే.. శివయ్య మాత్రం అలాగే నిలబడ్డాడు. పైగా "నేనెందుకు తప్పుకోవాలి. నేనూ బ్రహ్మాన్నే, ఏనుగూ బ్రహ్మమే. బ్రహ్మానికి, బ్రహ్మంవల్ల అపాయం ఏమీ రాదు కదా..?" అని మనసులో అనుకుంటూ ఉండిపోయాడు.

ఇంతలో ఏనుగు శివయ్యకు దగ్గరగా వచ్చేసింది. "పక్కకి తప్పుకోమంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తావేంటయ్యా.. తప్పుకోకపోతే ఏనుగుకింద పడి చచ్చిపోతావు" అంటూ మావటి హెచ్చరించాడు. అయినప్పటికీ శివయ్య అంగుళం కూడా కదల్లేదు. దీంతో ఏనుగు శివయ్య దగ్గరికి వచ్చి, తొండంతో పైకెత్తి పక్కకు విసిరేంది. అంతే శివయ్య దూరంగా స్పృహతప్పి పడిపోయాడు.



కళ్లు తెరిచి చూసేసరికి ఇంట్లో మంచంపై పడి ఉన్నాడు శివయ్య. పక్కనే తల్లి రోదిస్తూ.. "అందరూ అంతలా చెబుతున్నా అక్కడ్నించి ఎందుకు కదలలేదు నాన్నా..?" అంటూ కొడుకును సుతిమెత్తగా మందలించింది. కొన్ని రోజులకు కోలుకున్న తరువాత గురువు వద్దకు వెళ్లిన శివయ్య.. "మీరు ఆరోజు పాఠంలో అలా చెప్పారుగానీ.. ఏనుగు కూడా బ్రహ్మమే అయినప్పుడు అలా ఎందుకు చేసింది గురువుగారూ..?" అంటూ నిలదీశాడు.

"అయినా ఏనుగు బ్రహ్మం తప్పేముంది శివయ్యా..? నువ్వూ బ్రహ్మమే, ఏనుగూ బ్రహ్మమే.. సర్వమూ బ్రహ్మమే అయినప్పుడు.. మావటి బ్రహ్మం నిన్ను ముందుగానే హెచ్చరించింది కదా..? మావటి కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆయన చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు..?" అని ప్రశ్నించాడు గురువుగారు.

దాంతో ఆలోచనలో పడ్డ శివయ్య.. పాఠాన్ని మక్కీకిమక్కీగా అర్థం చేసుకున్న తన తెలివితేటలను నిందించుకున్నాడు. ఇకపై అలా ఉండకూడదని, గురువు చెప్పిన పాఠాలను సందర్భానికి తగినట్లుగా మంచి విషయాలకు అన్వయించుకుని.. తెలివితేటలతో జీవించాలని మనసులోనే అనుకున్నాడు శివయ్య.

పనికిరానివి ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే..!!

రామాపురం అనే ఊర్లో రాజయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు కష్టపడి పనిచేస్తూ.. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేవాడు. కానీ రెండోవాడు మాత్రం తల్లిదండ్రుల పనుల్లో ఏ మాత్రం సాయపడకపోగా, సోమరిపోతుగా, జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతుండేవాడు.

ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు, నలతగా ఉన్నప్పుడు తండ్రి చిన్నకొడుకును పిలిచి.. "ఈరోజు నేను పొలంపనికి వెళ్లలేను, నువ్వెల్లి వరిపొలానికి నీళ్లు పట్టేసి రా నాయనా..?" అని అడిగేవాడు. అయితే సోమరితనానికి బాగా అలవాటు పడిపోయిన చిన్నకొడుకు ఏదో ఒక సాకు చెప్పి సులభంగా తప్పించుకునేవాడు.

కాలం ఇలా గడుస్తుంటే.. ఒకరోజున తన స్నేహితుడైన రామయ్యతో రాజయ్య మాట్లాడుతూ.. "నా ప్రాణం ఉన్నంతవరకు చిన్నవాడిని ఎలాగైనా సరే పోషిస్తాను. నా ప్రాణం కాస్తా పోతే, వీడెలా బ్రతుకుతాడో"నని వాపోయాడు. దాంతో స్నేహితుడిని ఊరడించిన రామయ్య "నీ కొడుకును ఎలాగైనా సరే నేను మారుస్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టు" అని అన్నాడు.

మరుసటి రోజున వాకిట్లో కూర్చుని పళ్లు తోముకుంటున్న రామయ్యకు.. దార్లో రాజయ్య చిన్నకొడుతూ స్నేహితులతో కలిసి వెళుతుండటం కనిపించింది. వెంటనే అతడిని పిలిచిన రామయ్య.. "రోజంతా ఇలా జులాయిగా తిరుగుతూ ఉండకపోతే మీ నాన్నకు పొలం పనుల్లో సాయం చేయవచ్చుగా..!!" అని అన్నాడు. 

"ఆరుగాలం కష్టపడితే వచ్చేవి నాలుగు గింజలే. అలాంటి పని నావల్ల కాదు. నేను ఏదైనా పనిచేస్తే బోలెడన్ని డబ్బులు రావాలి. అలాంటి పని అయితేనే చేస్తాన"ని బల్లగుద్ది మరీ చెప్పాడు రాజయ్య చిన్నకొడుకు. దానికి చిరునవ్వు నవ్విన రామయ్య "అయితే నీకు మంత్రపు గింజలు కావాల్సిందేరా..!!" అన్నాడు.

"మంత్రపు గింజలా.. అవేంటి..? అయినా అవెందుకు..?" అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రాజయ్య చిన్నకొడుకు. "మరేం లేదురా.. వాటి గురించి నాకు ఓ స్వామీజీ చెప్పాడు. ఆ మంత్రపు గింజలను పొలంలో నాటి, వాటికి ప్రతిరోజూ నీళ్లు పోసి కాపాడితే.. వాటిలో గింజలకు బదులుగా డబ్బులు కాస్తాయట..!" అన్నాడు రామయ్య.



"అలాగా.. భలేగుందే.. నాక్కూడా ఆ గింజలు ఇప్పించండి.." అంటూ రాజయ్య కొడుకు బ్రతిమలాడాడు. "అలాగే తెచ్చిస్తాలే.. నువ్వు రేపోసారి వచ్చి కనబడు" అన్నాడు రామయ్య. మరుసటి రోజు ఓ గుప్పెడు వడ్ల గింజలు తెచ్చి రాజయ్య కొడుకు చేతిలో పోశాడు రామయ్య. వెంటనే ఆత్రంగా పెరట్లో మంచి స్థలం చూసిన అతను అక్కడ వాటిని నాటాడు. ప్రతిరోజూ నీళ్లుపోస్తూ భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ వడ్ల గింజలు కొన్ని రోజులకు మొలకెత్తాయి.

ఓరోజు రాజయ్య ఇంటికి వచ్చిన రామయ్య "ఏంట్రా చిన్నోడా.. మంత్రపు గింజలు మొలకెత్తాయా..?" అని అడిగాడు. "భలేగా మొలకెత్తాయి. రండి చూద్దురుగానీ.." అంటూ పెరట్లోకి తీసుకెళ్లాడు రాజయ్య కొడుకు. వాటిని చూసిన రామయ్య వెంటనే వాటిని పీకి అవతల పడేశాడు. "నేను ఇంతలా కష్టపడి పెంచి, కాపాడుకుంటే అలా పెరికి పారేశారేంటి..?" అంటూ కోపంగా నిలదీశాడు రాజయ్య కొడుకు.

"ఆహా.. అవి సరిగా పెరగలేదు అందుకే పీకేశాను. పనికిరానివి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.. నీలాగన్నమాట..!!" అన్నాడు రామయ్య అంతే కోపంగా. "అదేంటి నాలాగా.. అంటున్నారు..?" అన్నాడు రాజయ్య కొడుకు. "మరి నీలాగా కాకపోతే మరేంటి..? కొన్నిరోజులుపాటు నువ్వు పెంచిన మొక్కల్ని పెరికేస్తేనే అలా బాధపడుతున్నావే.. ఎన్నో ఆశలతో నిన్ను పెంచి పెద్దచేసిన మీనాన్న.. తన కొడుకు ఎందుకూ కొరగాకుండా పోతున్నందుకు మరెంతలా బాధపడుతాడో ఎప్పుడైనా ఆలోచించావా..?" అన్నాడు.

"అయితే మంత్రపు గింజలని చెప్పి ఇచ్చారు కదా.. వాటిని నాటితే డబ్బులు కాస్తాయని కూడా చెప్పారే.. ఎందుకలా..?" అన్నాడు రాజయ్య చిన్నకొడుకు. "మరేం లేదురా.. నిన్ను మార్చేందుకు నేనలా చెప్పానంతే. లోకంలో కష్టానికి మించిన మంత్రం మరొకటి లేదు. మీ నాన్న పొలంలో నాటే గింజలు మొలకెత్తి డబ్బులు ఇవ్వటం లేదా..? కష్టపడకుండా ఫలితం ఆశించకూడదని ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని, బుద్ధిగా మసలుకుంటే అంతే చాలు.." అన్నాడు రామయ్య.

అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకట..?!

సిద్ధవటం అనే ఊర్లో తిమ్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అనుభవించలేనంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినడు, ఇంకోళ్ళకు పెట్టడు. అందుకనే అతడిని ఆ ఊర్లో వాళ్లంతా పిసినారి తిమ్మయ్య అని పిలుస్తుండేవారు. అతను పిసినారి అయినప్పటికీ ఎంతో కొంత సాయం చేయకపోతాడా అన్న ఆశతో ఆ ఊరి ప్రజలు అతనివద్దకు సాయం కోరి వచ్చేవాళ్లు.

అయితే ఏ మాత్రం మనసు కరగని సిద్ధయ్య ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడేగానీ, గడ్డిపరకంత సాయంచేసి ఎరుగడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాయం కోరుతూ తన ఇంటిముందు వాలే బంధువులు, ఊరి జనాలు బాధను తప్పించుకునేందుకు సిద్ధయ్య ఒక పథకం వేశాడు. అలా అనుకున్నదే తడవుగా తన పొలాలు, నగలన్నింటినీ అమ్మేసి పెద్దఎత్తున బంగారం కొన్నాడు.

ఒకరోజు తన బంగారాన్నంతా ఒక బిందెనిండా కుక్కి దాన్ని గుడ్డతో గట్టిగా మూటకట్టాడు. ఊర్లో జనాలంతా నిద్రపోయిన తరువాత ఆ బిందెను తీసుకుని ఊరికి దూరంగా ఉండే పాడుబడ్డ బావిలో లోపల గొయ్యితీసి దాచిపెట్టాడు. ప్రతిరోజూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అన్నట్లుగా ఒక చెంబు చేతబట్టుకుని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తుండేవాడు సిద్ధయ్య. ఊర్లో జనాలంతా సిద్ధయ్యను చూసి బహిర్భూమికి వెళుతున్నాడనుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయేవాళ్లు.

అయితే ప్రతిరోజూ చెంబు పట్టుకుని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు సిద్ధయ్య వెళ్తుండటాన్ని ఒక దొంగ గమనించాడు. బావిలో సిద్ధయ్య ఏం చేస్తున్నాడో చూడాలనుకుని ఓ చోట నక్కి కూర్చున్నాడు. ఎప్పట్లాగే సిద్ధయ్య బావిలో పూడ్చిపెట్టిన బంగారాన్ని చూసి, అంతా భద్రంగా ఉందని తృప్తిగా మళ్లీ మూటకట్టి పూడ్చిపెట్టాడు. దీన్నంతా గమనించిన దొంగ మనసులోనే సంతోషించసాగాడు.



ఆ రోజు చీకటిపడేదాకా వేచి చూసిన దొంగ ఎంచక్కా బావిలోకి దిగి, సిద్ధయ్య పూడ్చిపెట్చిన బంగారం బిందెను తవ్వి మూటగట్టుకుని ఆనందంగా వెళ్లిపోయాడు. మరుసటి రోజు చెంబు చేతబట్టుకుని పాడుబడ్డ బావివద్దకు వచ్చిన సిద్ధయ్య, తాను దాచిపెట్టిన బిందె కోసం గాలించగా, దాన్నెవరో తవ్వి తీసుకెళ్లిపోయినట్లు అర్థం చేసుకుని బావురుమన్నాడు.

అంతే సిద్ధయ్య గుండె చెరువుకాగా.. కష్టపడి సంపాదించి, తినీ తినకా కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారే.. ఇప్పుడేం చేసేది దేవుడా అంటూ భోరున ఏడవసాగాడు. అలా నెత్తీ నోరూ బాదుకుంటూ, గుండెలవిసేలా ఏడుస్తూ సిద్ధయ్య ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు. ఆ దార్లో వెళుతున్న ఓ ముసలాయన సిద్ధయ్యను చూసి ఎందుకేడుస్తున్నావని? ప్రశ్నించాడు. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పాడు సిద్ధయ్య.

అంతా విన్న ముసలాయన.. "ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం. ఆ బంగారం నీవద్ద ఉన్నప్పుడు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించని ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడ్వటం దండగ. ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వరం నీకెందుకు చెప్పు..? పైగా దాన్ని కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డావు. అంత కష్టపడినా అది పోయింది. పోనీలే ఇలాగైనా నీ బాధ విరుగుడైంది. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని హాయిగా బ్రతికే మార్గం చూడు.." అంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు.

ముసలాయన వెళ్లిపోగానే ముక్కు చీదుకుంటూ సిద్ధయ్య ఇంటిదారి పట్టాడు. ఇంటికెళ్లాక ఇన్నిరోజులు డబ్బు సంపాదన కోసం, దాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని పాట్లు పడింది గుర్తు తెచ్చుకున్నాడు. ఎంత సంపాదిస్తే ఏం లాభం.. దాన్ని తాను అనుభవించలేకపోయాను, ఇతరులకు సాయం చేయలేకపోయాను. ఈ సమస్యలన్నింటికీ పిసినారితనమే మూలకారణం. ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ, ఇతరులకు సాయపడటంలోనే అసలైన ఆనందం ఉందని ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే బ్రతకటమే దండగ అని మనసులో అనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సిద్ధయ్య.

దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే.. మొదటికే మోసం..!!

అనగనగా ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఓ పాముల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా పాములుండేవి. అయినా అవి ఏరోజు గొడవపడకుండా ఎంతో ఐకమత్యంగా జీవిస్తుండేవి. ఒకరోజున బాగా బలిసిన ఒక ముళ్లపంది పాముల పుట్టకు దగ్గరగా వచ్చింది. దాని శబ్దానికి ఉలిక్కిపడిన పాములు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి.

"ఏయ్ ముళ్లపందీ.. మా పుట్టదగ్గరికి వచ్చి అలా గొణుగుతూ నిల్చున్నావేంటి..?" అంటూ హెచ్చరికగా అడిగాయి పాములు.

"ఆ మరేం లేదు పాములూ.. తిండి కాస్త ఎక్కువగా దొరకటంతో ఆబగా తినేశాను. భుక్తాయాసం ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకునేందుకు ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే ఎక్కడ చూసినా పక్షుల కూతలు, ఇతర జంతువుల శబ్దాలతో ఒకటే రొదగా ఉంది. అందుకే మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి, తరువాత వెళ్లిపోతాను" బ్రతిమలాడుకుంటూ అడిగింది ముళ్లపంది.

"అయినా మా పుట్టలో ఇప్పటికే చాలా పాములున్నాయి. మాకే చోటు సరిగా సరిపోవటం లేదు. ఇప్పుడు నీకు చోటివ్వాలంటే మాకు బాగా కష్టమైపోతుంది. ఎలా..?!" అన్నాయి పాములు.


"బాబ్బాబూ.. మీకు పుణ్యం ఉంటుంది. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఈ ఒక్కసారికి ఎలాగైనా సర్దుకోండి. ఇంకెప్పుడూ మీ సహాయం అడగను" అంటూ వేడుకుంది ముళ్లపంది.

"సరేలే రా.. మేమే ఎలాగోలా ఒదిగి పడుకుంటాం. ఈ మూలన నువ్వు సర్దుకుని పడుకో.."మని చెప్పాయి పాములు. అంతే ముళ్లపంది మెల్లిగా లోపలికి దూరింది. పుట్టలో ఎలాంటి శబ్దాలు లేకుండా వెచ్చగా ఉండటంతో హాయిగా నిద్రలోకి జారుకుంది.

ముళ్లపంది నిద్రపోయిందేగానీ, దాని ఒంటిమీదుండే ముళ్లన్నీ ఒక్కొక్కటీ విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. అంతే కోపంతో ఊగిపోయిన పాములన్నీ ఒక్కసారిగా లేచి బుసలు కొడుతూ, ముళ్లపందిని లేపి ఇక్కడినుంచి వెళ్లిపో అంటూ గట్టిగా కేకలు పెట్టాయి.

"చూడండి పాములూ.. ఇక్కడ నాకు చాలా హాయిగా, వెచ్చగా ఉంది. పైగా నిద్ర కూడా ముంచుకొస్తోంది. నా నిద్రను పాడు చేయకుండా మీ మానాన మీరు వెళ్లండి.. అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటికి వెళ్లిపోండి అంటూ ముళ్లను ఇంకాస్త పొడవుగా చాపుకుని పడుకుంది".



దాంతో ముళ్లపంది ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, ఆ ముళ్లు గుచ్చుకుని చనిపోయినా ఆశ్చర్యం లేదని అనుకున్న పాములన్నీ ముళ్లపందిని తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాయి. అంతే కథ కంచికి మనం ఇంటికి. ఇక ఈ కథ ద్వారా తెల్సుకోవాల్సిన నీతి ఏంటంటే.. దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సాములోరు కదా.. ఆకలి లేకుండా మంత్రం వేయొచ్చుగా..!!

పార్వతీపురంలో శీనయ్య అనే పండ్ల వ్యాపారి ఉండేవాడు. అతను పరమ పిసినారే కాకుండా, మితిమీరిన అహంకారంతో నడుచుకునేవాడు. ఓరోజు అతని అంగడిగుండా ఓ సన్యాసి చిన్న పిల్లవాడిని వెంటబెట్టుకుని వెళుతున్నాడు. ఇంతలో ఆ పిల్లవాడు ఆకలిగా ఉందని చెప్పటంతో, సన్యాసి అంగడివద్ద ఆగాడు.

వెంటనే శీనయ్యను "బాబూ.. పిల్లవాడు ఆకలిగా ఉందంటున్నాడు. ఓ పండును దానం చేయవూ..?" అని అడిగాడు సన్యాసి. అది విన్న శీనయ్య ఎగాదిగా చూసి, వెటకారంగా నవ్వుతూ.. "కాషాయం బట్టలతో సన్యాసం వెలగబెడుతున్న సాములోరికి చిన్నపిల్లాడు ఎక్కడినుంచి ఊడిపడ్డాడో..!!" అని అన్నాడు

"ఈ పిల్లాడొక అనాధ నాయనా.. ఎవరూలేక దారిలో ఏడుస్తుంటే వెంట తీసుకుని వెళుతున్నాను" అని బదులిచ్చాడు సన్యాసి. దానికి మరింత ఎగతాళి చేసిన శీనయ్య "తమరు తపస్సులు గట్రా చేసే సాములోరు కదా.. ఆకలి లేకుండా మంత్రం ఏదైనా వేయరాదూ...? అలా చేస్తే అడుక్కునే బాధయినా తప్పుతుంది కదా.." నవ్వుతూ అన్నాడు.

"ఆకలి దప్పికలనేవి మానవులందరికీ సహజమైనవే నాయనా.. వాటికోసం మహిమలను ఉపయోగించటం తప్పు కదా.." చాలా సహనంగా బదులిచ్చాడు సన్యాసి. దానికి పెద్ద పెట్టున శీనయ్య నవ్వుతూ.. "ఆహా.. తమరికేదో పెద్ద మహిమలున్నట్లు.. మేము నమ్మాలా.. అది సరేగానీ నువ్వు పట్టుకున్న కర్రకేదో పండు మూట కట్టినట్లుగా ఉందే, దాన్ని ఆ పిల్లాడికిస్తే సరిపోతుంది కదా..!!" అంటూ ఆరా తీశాడు.



"నువ్వన్నట్లు ఈ మూటలో ఉండేది పండే కానీ.. అది తినేందుకు పనికిరాదు నాయనా.." అన్నాడు సన్యాసి. దీనికి రెచ్చిపోయిన శీనయ్య "తినలేని పండా.. చాలా చిత్రంగా ఉందే.. ఏదీ చూపించు" అన్నాడు. దానికి సన్యాసి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో.. "అది తినలేనిదేగానీ, చూడలేనిది కాదు కదా.. ఏదీ చూపించు సాములోరూ.." అంటూ ఆటపట్టించాడు శీనయ్య.

ఎంత చెప్పినా వినకపోవటంతో చేసేదేమీలేక సన్యాసి మూటను విప్పి.. "చూడు నాయనా, చూడు. ఈ తినలేని పండును బాగా చూడు" అంటూ చూపించాడు. ఆత్రంగా తొంగిచూసిన శీనయ్యకు ఆ పండే కాదు, చుట్టూ ఉన్న మరేదీ కనిపించటం మానేసింది. చుట్టూ చిమ్మచీకటి ముసురుకున్నట్లు కళ్లు కనిపించకపోవటంతో, సాములోరి విషయంలో తాను చేసిన తప్పేంటో బోధపడింది శీనయ్యకు.

వెంటనే సన్యాసితో "నన్ను మన్నించండి సాములోరూ.. మీ మహిమలు తెలియక వెటకారం చేశాను.." అంటూ వేడుకున్నాడు శీనయ్య. "ఎవరైనా ఏదైనా అడిగితే చేతనైతే సాయం చేయాలేగానీ, అవమానించటం సరికాదు నాయనా.. ఇప్పుడు చూడు తినలేని పండు ఏదైనా కనిపిస్తుందేమో.." అన్నాడు ఆ సన్యాసి.

వెంటనే కళ్లు నులుముకుని మూటలోకి తొంగిచూసిన శీనయ్యకు అందులో విభూది ఉండ కనిపించింది. వెంటనే తనకు కళ్లు కనిపిస్తున్నందుకు సంతోషపడిన శీనయ్య.. ఇంకెప్పుడూ ఇతరులను అవమానించనని సన్యాసికి చెప్పి.. ఓ పండ్ల బుట్టను ఆయనకు కానుకగా ఇచ్చాడు. అయితే ఆ బుట్టలోని ఒకే ఒక్క పండును మాత్రం తీసుకున్న సన్యాసి, పిల్లవాడికి ఇచ్చి తన దారిన తాను వెల్లిపోయాడు. ఇక ఆ రోజునుంచి శీనయ్య ఎవ్వరినీ అవమానించలేదు, ఎగతాళి చేయలేదు. బుద్ధిగా జీవించసాగాడు.

ఈ గుడ్డును బల్లమీద నిటారుగా నిలబెడితే నువ్వే గొప్ప..!!

వెంగళాపురం జమీందారు ఊర్లో జరిగే ప్రతి పండుగకు రకరకాల పోటీలు పెట్టి, వాటిలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. అలాంటి పోటీలలో భీముడు అనే అబ్బాయే ఎప్పుడూ గెలిచేవాడు. దీంతో అతడికి గర్వం తలకెక్కి అందరిపై పెత్తనం చేసేవాడు. అయితే అదే ఊర్లో ఉన్న రాముడు అనే అబ్బాయి మాత్రం భీముడి ప్రయత్నాలను వారిస్తూ, బుద్ధిగా నడచుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవాడు.

బుద్ధిమంతుడిగా ఉంటూ, ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రాముడి గురించి తెలుసుకున్న జమీందారు ఒకసారి అతడిని సన్మానించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎలాగైనా సరే ఆ సన్మానాన్ని అడ్డుకోవాలని భీముడు తన స్నేహితులతో కలిసి సభకు హాజరయ్యాడు.

"అందరూ మంచివాడని పొగుడుతూనే ఉన్నారుగా.. మళ్లీ రాముడికి ప్రత్యేకంగా ఈ సన్మానం ఎందుకో..?" అంటూ సభలో చలోక్తులు విసిరాడు భీముడు. దీనికి అతని స్నేహితులు కూడా వత్తాసు పలికారు. జమీందారు ఎంతచెప్పినా వినకుండా.. సన్మానం పొందాలంటే రాముడు తన గొప్పదనం ఏంటో అందరిముందూ నిరూపించుకోవాలని భీముడు పట్టుబట్టాడు.

జమీందారు ఆలోచనలో పడిపోవటంతో.. మెల్లిగా చిరునవ్వు లేచి నిలుచున్న రాముడు.. "నాకు సవాళ్లంటే గిట్టదు. కానీ జమీందారుగారి నిర్ణయాన్ని భీముడు ధిక్కరిస్తున్నాడనే కలుగజేసుకోవాల్సి వచ్చిందని" వేదిక పైకి వచ్చాడు. అవేమీ పట్టని భీముడు తన స్నేహితులతో కలిసి వెటకారం చేస్తూ అల్లరి చేయసాగాడు.

"భీముడు నువ్వు చాలా బలవంతుడవు కదా.. నీకింత బలం రావడానికి రోజూ ఏం తింటున్నావేంటి..?" అని ప్రశ్నించాడు రాముడు.



"ఇంకేం తింటా.. కోడిగుడ్లే.." ఉత్సాహంగా అన్నాడు భీముడు.

"అయితే ఆ కోడిగుడ్డే నిన్ను ఓడించేలా చేస్తాను చూడు.." అంటూ రాముడు కోడిగుడ్డును తెప్పించాడు. కోడిగుడ్డు ఓడించటం ఏంటబ్బా అంటూ... అందరూ ఆసక్తిగా చూడసాగారు.

"ఇదిగో భీముడూ.. ఈ కోడిగుడ్డును నువ్వు బల్లమీద నిటారుగా నిలబెట్టగలిగితే.. ఈ ఊర్లో నువ్వే గొప్పవాడివి" అని సవాల్ విసిరాడు రాముడు. "ఓస్ అంతేనా..?" అని గొల్లున నవ్వారు ప్రజలంతా. భీముడు కూడా కాస్త జడుసుకున్నాడు. అయితే తన భయాన్ని బయటికి కనిపించకుండా, ఆ.. అలాగే అన్నాడు బింకంగా. వెంటనే వేదికపైకి వచ్చి బల్లపైన కోడిగుడ్డును నిలబెట్టేందుకు ప్రయత్నించాడుకానీ, అది పగిలిపోయింది. దాంతో భీముడు బిక్కమొహం వేసుకుని నిలుచున్నాడు.

వెంటనే రాముడు వేరే కోడిగుడ్డును తీసుకుని దాని మొనను బల్లమీద సుతారంగా కొట్టాడు. నిలబెట్టేందుకు వీలుగా గుడ్డు కాస్తంతే పగిలింది. దీంతో రాముడు దాన్ని సులభంగా బల్లపైన నిలబెట్టగలిగాడు. వెంటనే ప్రజలంతా రాముడికి మద్ధతుగా గట్టిగా చప్పట్లు కొట్టారు. భీముడు మాత్రం తలదించుకుని కిందికి దిగాడు.

తరువాత జమీందారు మాట్లాడుతూ... "భీముడూ.. బల గర్వంతో ప్రవర్తించి నువ్వు అవమానం పాలయ్యావు. తెలివిగా ప్రవర్తించి రాముడు విజేత అయ్యాడు. అందుకే తెలివి ఒక్కరి సొత్తే కాదనీ నువ్వు ఇకనైనా గుర్తు పెట్టుకో..." అంటూ మందలించాడు. రాముడిని ఘనంగా సత్కరించాడు.

నా సొమ్ముకూడా నువ్వే తీసేసుకో నాయనా..!!

విరాటపురం రాజు ఓ రోజు గుర్రమెక్కి తన పరివారంతో నగర సందర్శనానికి బయలుదేరాడు. తన పాలనలో నగరమంతా సంతృప్తిగా జీవిస్తోంది. వీధులన్నీ చక్కగా పరిచినట్లుగా అందంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆనందంతో తుళ్లుతూ కనిపించారు. ఎవరైనా ప్రజలను ఆపి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తే, "మీ పాలనలో సమస్యలా ప్రభూ..!!" అంటూ ఎదురు ప్రశ్నిస్తుండటంతో రాజుకు చాలా సంతోషమేసింది.

ప్రజల జవాబుతో మనసంతా ఆనందంతో నిండిపోగా, తిరిగి రాజభవనానికి తిరుగుముఖంపట్టాడు రాజు. అలా వెళ్తుండగా దారిప్రక్కన ఓ చెట్టుకింద కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఓ ముసలావిడ కనిపించింది. వెంటనే తన పరివారకులను ఆపమని చెప్పిన రాజు.. "ఏంటవ్వా.. ఇక్కడ కూర్చున్నావు.. నీకు ఇల్లు లేదా..?" అని అడిగాడు.

"ఈ లోకమే నాకున్న ఇల్లు, ఈ ప్రజలందరూ నా వాళ్లే"నంటూ వేదాంత ధోరణిలో రాజుకు బదులిచ్చింది ఆ ముసలావిడ. దీంతో వెంటనే రాజుకు చాలా జాలేసింది. "నువ్వు నాతో రా అవ్వా" అంటూ ఆమెను తనతోపాటు రాజభవనానికి తీసుకెళ్లేందుకు వెంటనే సేవకులను పల్లకి తెమ్మనిచెప్పి అందులో ఎక్కించి తీసుకురమ్మని బోయీలకు చెప్పాడు.

ఇంతలో రాజభవనం రానే వచ్చింది. భవనం మధ్యలో ఒకచోట ముసలావిడను కూర్చోబెట్టి, తాను ఇప్పుడే వస్తానని చెప్పి లోనికి వెళ్లాడు రాజు. భవనాన్నంతా పరికించి చూస్తున్న ముసలావిడకు లోపలి పూజామందిరంలోంచి దేవుడిని ప్రార్థిస్తున్న ఓ వ్యక్తి గొంతు వినిపించింది. మెల్లిగా అక్కడికి నడుచుకుంటూ వెళ్లింది.



అక్కడ మహారాజు దేవుడిని ప్రార్థిస్తూ.. "ఓ దేవుడా.. నన్ను చల్లగా చూడు. నీ కరుణాకటాక్షాలను నాపై ఎల్లప్పుడూ ప్రసరించేలా చూడు. నాకు ఆయురారోగ్యాలను ప్రసాదించు, నా వంశాన్ని ఉద్ధరించు. నా రాజ్యాన్ని విస్తరింపజేయి, నాకున్న ధన కనక వస్తు వాహనాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచు. నాకు ఎప్పుడూ తరగనంత కీర్తిని అనుగ్రహించు" అంటూ వేడుకుంటున్నాడు.

పూజ అయిపోయిన తరువాత మెల్లిగా ముసలమ్మ వద్దకు వచ్చాడు రాజు. "అవ్వా.. నువ్వేమీ భయపడకు. నీకు ఓ వంద బంగారు కాసులు ఇస్తాను. వాటితో నువ్వు సుఖంగా జీవించు. నీ చివరికాలం హాయిగా గడిచిపోతుంది" అని అన్నాడు. వెంటనే లేచి నిలబడిన ఆమె, ఓ చిన్న సంచిని బయటికి తీసింది.

"నువ్వు ఎందుకో రమ్మంటున్నావని వచ్చాను. బంగారు కాసులు ఇచ్చేందుకే ఇక్కడికి తీసుకొచ్చావా. రేపో మాపో పోయే ప్రాణం నాది. నాకెందుకు ఇంత డబ్బు..? కాయకష్టంతో జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాను. ఎంత వద్దనుకున్నా కొంత సొమ్మును పోగుచేశాను. ఎవడైనా కటిక దరిద్రుడికి దాన్ని ఇచ్చేద్దామని చూస్తున్నా. ఎవరికి ఇద్దామన్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక తృప్తితో బ్రతికేస్తున్నారు. ఎవ్వరూ కంటికి కనిపించలేదు. చివరికిలా నువ్వు దొరికావు" అంటూ ముగించింది.

రాజుకు ఏమీ అర్థంకాక అలా అయోమయంగా చూస్తూ ఉండగా.. ఇందాక నువ్వు దేవుడికి మొరపెట్టుకోవటం చూశాను నాయనా..! అయ్యో.. ఈ లోకంలో ప్రజలెవ్వరికీ లేనన్ని కోరికలు నీకున్నాయి. జీవితంలో ఎంత కొరతతో బతికేస్తున్నావు నీవు. ఎన్ని ఉన్నా నీకు ఇంకా ఎన్ని ఆశలున్నాయి..? అందుకే నాకు నీకంటే దరిద్రుడెవ్వడూ ఇప్పటిదాకా కనిపించలేదు. అందుకే ఇదిగో నా దగ్గర ఉన్న సొమ్మునంతటినీ నువ్వే తీసేసుకుని నీ కోర్కెలన్నింటినీ తీర్చుకోమని చెప్పి ఎంచక్కా వెళ్లిపోయింది ఆ ముసలావిడ. సిగ్గుతో మొహం కిందికి దించుకున్న ఆ రాజు లోకంలో తనకంటే దరిద్రుడు ఇంకెవడూ లేడేమోనని ప్రశ్చాత్తాపంతో కుంగిపోయాడు.

సూర్యచంద్రులు క్షమాపణలు చెబితే సరే సరి.. లేదంటే..?

వాల్మీకిపురం మహారాజు చిత్రగుప్తుడు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లంటూ హఠం చేసే ఓ మూర్ఖశిఖామణి. ఒకరోజు రాత్రిపూట ఆయన ఉద్యానవనంలో సంచరిస్తుంటే.. ఆకాశంలో వెన్నెల వెండి వర్షం కురిపిస్తున్నట్లుగా ఉంటుంది. తదేకంగా చందమామను చూసిన ఆ రాజుకు ఎంతో అసూయ కలిగింది.

ఆ క్షణంలో చంద్రుడు తనకంటే ఉన్నతమైనవాడిగా తోచాడు. అంతేగాకుండా సూర్యుడు, నక్షత్రాలు సైతం తన తలపైనే ఉంటారనే విషయం ఆయనకు గుర్తుకొచ్చింది. తన సింహాసనంకంటే ఎత్తులో వారుండటం అవమానంగా తోచింది చిత్రగుప్తుడికి. వారి సంగతి ఎలాగైనా సరే తేల్చాల్సిందే అనుకుంటూ తన భవంతిలోకి వెళ్లిపోయాడు.

మరుసటి రోజున సభలో మంత్రి వీర వర్మతో.. "మహామంత్రీ..! ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతమైన వ్యక్తులున్నారా..?" అంటూ ప్రశ్నించాడు. మహారాజు అసలే మొండితనం, మూర్ఖత్వం కలగలిసినవాడని తెలిసిన మంత్రి తెలివిగా.. "ఎవరూ లేరు ప్రభూ..!" అంటూ వినయంగా సమాధానం చెప్పాడు.

"పోనీ.. ఉన్నతులుగా నటిస్తున్నవారు ఉన్నారు. నీకు తెలుసా..?" అని అడిగాడు రాజు. వెంటనే "ఎవరు ప్రభూ.. ఆ దుర్మార్గులు. వారికి శిరచ్ఛేదం విధిద్దాం. వారెవరో సెలవివ్వండి" కాస్తంత కోపం నటిస్తూ అడిగాడు వీర వర్మ.

"వాళ్లవరో కాదు మహామంత్రీ... సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే. తక్షణం వారు ఆకాశం వీడి వచ్చి నాకు క్షమాపణలు చెబితే సరి. లేకపోతే, వారిపై దండయాత్ర చేద్దాం. క్షమాపణలు చెప్పిస్తారో, యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారో రెండుదినాల్లో తేల్చండి. నా మనస్సు అవమానభారంతో రగిలిపోతోంది" అంటూ సభలోంచి విసవిసా అంతఃపురంలోకి వెళ్లిపోయాడు మహారాజు.

సభికులతోపాటు వీర వర్మ, విదూషకుడు రాయవర్మలు తెల్లముఖం వేశారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించే బాధ్యత మీదే మహామంత్రీ.. అన్నట్లుగా అందరూ వీర వర్మవైపు తదేకంగా చూశారు.



మరుసటిరోజు సభ ప్రారంభంకాగానే వచ్చాడు వీర వర్మ. ఆయన వెనకాలే రాయవర్మ ఉన్నాడు. మహారాజుకి నమస్కరించి.. "రాజా..! మీ ఆజ్ఞ మేరకు సూర్యచంద్రులు, నక్షత్రాలకు కబురు పంపాము. అల్పప్రాణులమైన తమపై దండయాత్ర తగదని వేడుకున్నారు. రాబోయే శనివారం నాడు సూర్యుడు, ఆపై ఓ పక్షంరోజుల తర్వాత చంద్రుడు, నక్షత్రాలు ఉద్యానవనంలో మీకు క్షమాపణలు చెబుతామని విన్నవించుకున్నారు. కావునా యుద్ధసన్నాహాలు చేయించలేదు' సభికులు మంత్రముగ్ధులై వింటుండగా చెప్పాడు.

వెంటనే రాయవర్మ అందుకొని.. "వారి వేడుకోలుకు నేను కూడా సాక్షిని ప్రభూ..! వారు మాట తప్పితే మరుక్షణమే శిక్షించేందుకు యుద్ధానికి సమాయత్తమవుదాం. అప్పటివరకు మీరు శాంతించాలి" అంటూ రాజుని చల్లబరిచాడు.

వీర వర్మ చెప్పిన శనివారం వచ్చింది. ఉద్యానవనంలో సూర్యుడు క్షమాపణకై ఎదురుచూస్తున్న చిత్రగుప్తుడికి అమితాశ్చర్యం కలిగిస్తూ, ఆకాశంలో చీకటి కమ్ముకుంది. పక్షులు గూళ్లకు చేరుకోసాగాయి. "సూర్యుడు శరణు కోరేందుకు రాబోతున్నాడు. అయితే తను ప్రాధేయపడడమే మీకు వినబడుతుంది. ఎదురుపడితే మీరు కోపోద్రిక్తులవుతారని ఆయన భయపడుతున్నాడని" మెల్లగా చెప్పాడు మహామంత్రి.

అతను చెప్పినట్లుగానే ''భూపాలా..! నన్ను క్షమించు. నీకంటే అల్పుడను. అవసరార్థం ఆకాశంలో ఉండవలసి వచ్చింది. దయచేసి నాపై యుద్ధానికి రాకు.." అనే మాటలు వినిపించాయి. చిత్రగుప్తుడు ఎంతో సంతోషించాడు. కాసేపటికే చీకటిపోయి వెలుతురు వచ్చింది. అదేవిధంగా పక్షం రోజుల తర్వాత రాత్రి అదే ఉద్యానవనంలో చంద్రుడు, నక్షత్రాలు ఆకాశం నుంచి మాయమై చిత్రగుప్తుడిని క్షమాపణలు కోరారు. ఈ రెండు సంఘటనల తర్వాత విచిత్రగుప్తుడి కోపమంతా తగ్గిపోయింది.

ఇదిలా ఉంటే.. గండం గట్టెక్కినందుకు వీర వర్మ, రాయవర్మలు ఒకరినొకరు అభినందించుకున్నారు. అదే విధంగా ఇద్దరూ వెంటవెంటనే వచ్చిన సూర్య, చంద్ర గ్రహణాలకు ఓ నమస్కారం పడేశారు. ఆపత్కాలంలో మంచి సలహా ఇచ్చినందుకు వీర వర్మ రాయవర్మ పొగిడితే, రాయవర్మ మాత్రం "ఆ ఘనతంతా దీనిదే" అంటూ తన చంకలోని ఖగోళశాస్త్ర పుస్తకాన్ని చూపాడు.

ఆ పుస్తకంలో సూర్యకుటుంబంలోని గ్రహాల గతులు, సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడే తేదీలు వివరంగా ఉన్నాయి. అది చూసిన వీర వర్మ ''నీ హాస్యంతో సభికులను ఆనందింపజేయడమేగాక, విజ్ఞానం పట్ల నీకున్న ఆసక్తితో ఓ పెద్ద విపత్తు నుంచి రక్షించావు సుమీ'' అంటూ భుజం తట్టి సంతోషంగా అన్నాడు. "మన మూర్ఖ రాజు ముందు ముందు ఇంకెవరిమీద యుద్ధం చేస్తాడో, ఏంటో..?" అనుకుంటూ వారిద్దరు అక్కడి నుంచి నిష్క్రమించారు.

లేడిపిల్ల వెక్కిరింత.. జిరాఫీ సాయం..!!

ఒక అడవిలో రకరకాల జంతువులన్నింటితోపాటు ఒక లేడిపిల్ల, మరో జిరాఫీ కూడా నివసిస్తుండేవి. లేడిపిల్లకు కుందేలు, కంచరగాడిద, అడవిదున్న, జింక.. లాంటి స్నేహితులు ఎక్కువ. వాటితో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, గంతులేస్తూ ఆనందంగా జీవిస్తుండేది. అయితే జిరాఫీని చూస్తే మాత్రం వెంటనే గేలిచేస్తూ పొడవాటి మెడదానా అంటూ వెక్కిరించేంది. దాని మాటలు విన్న ఇతర జంతువులన్నీ పగలబడి నవ్వుతుండేవి.

అయినా అన్నింటినీ ఓర్చుకున్న జిరాఫీ "నా పుట్టుకే అలాంటిది. కొంగకు పొడవాటి మెడలాగే, ఏనుగుకు పొడవైన తొండంలాగే తనకు కూడా దేవుడు ఈ పొడవాటి మెడను ఇచ్చాడు. అయినా నా మెడ ఉపయోగం కూడా తెలిసివచ్చే రోజు ఏదైనా రాకుండా పోతుందా" అని మనసులోనే అనుకునేది.

ఒకరోజు జిరాఫీ దగ్గరికి వచ్చిన లేడిపిల్ల భళ్లున నవ్వుతూ.. "నీ మెడ చెట్టుమీది ఆకులు తినేందుకు తప్ప ఎందుకయినా పనికొస్తుందా..?" అంటూ గేలి చేసింది. దీనికి దాని స్నేహితులు కూడా విరగబడి నవ్వాయి. దాంతో "వీరి మాటలు గొడవకు దారితీసేలా ఉన్నాయే.. సాధు జంతువుల పోట్లాట, క్రూర జంతువులకు విందుగా మారే ప్రమాదం లేకపోలేదని" జిరాఫీ అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత లేడిపిల్ల దాని స్నేహితులు కలిసి కడుపునిండా పచ్చిక తిని, నది ఒడ్డుమీద హాయిగా గంతులు వేయసాగాయి. లేడిపిల్ల ఆడుకుంటూ, ఆడుకుంటూ వెళ్లి అమాంతం ఊబిలోకి పడిపోయింది. బయటికి రావాలని చాలానే గింజుకుంది కానీ, దానికి సాధ్యం కాలేదు. ప్రయత్నించేకొద్దీ ఇంకా లోపలికి వెళ్లసాగింది.



వెంటనే "నన్ను రక్షించండి మిత్రులారా..! నేను బురద గుంటలో దిగబడ్డాను" అంటూ వేడుకుంది. "అమ్మో అది ఊబి. మేం కూడా అక్కడికి వస్తే నీతోపాటు బురదలో కూరుకుపోతాము. నిన్ను బయటికి తేవటం మావల్ల కాదు. ఇంకెవరైనా వస్తారేమో చూద్దామని" అన్నాయి. "ఎవరైనా వచ్చేలోపు ఏ పులో, నక్కో చూసిందంటే నా పని అంతే. మీరే ఏదైనా ఆలోచించి బయటికి లాగండ"ని మళ్లీ అడిగింది లేడిపిల్ల.

అయినా తన స్నేహితుల వాలకం చూస్తుంటే ఇప్పట్లో కాపాడేలా లేవని అర్థం చేసుకున్న లేడిపిల్ల "నన్ను కాపాడండి, నేను ఆపదలో ఉన్నాన"ని గట్టిగా కేకలు పెట్టింది. దగ్గర్లోనే తిండికోసం వెతుకులాడుతున్న జిరాఫీకి లేడిపిల్ల కేకలు వినిపించాయి. వెంటనే కేకలు వినిపించినవైపుగా వేగంగా చేరుకుంది.

జిరాఫీని చూసిన లేడిపిల్ల "అహంకారంతో కళ్లుమూసుకుపోయి నిన్ను ఎన్నో మాటలన్నాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు" అంటూ ప్రాధేయపడింది. "అయ్యో.. దానికేం భాగ్యం తమ్ముడూ... మనం ఒకే అడవిలో కలిసి జీవిస్తుండేవాళ్లం. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిన్ను వెంటనే బయటికి లాగుతాను, అయితే కదలకుండా అలాగే ఉండు" అని చెప్పింది.

ఏ మెడ అయితే పొడవుగా ఉందని లేడిపిల్ల పదే పదే వేళాకోళం చేసిందో, అదే మెడను జింక కొమ్ముల మధ్యన దూర్చి, గట్టిగా పెనవేసి, బలంగా బయటకు విసిరింది. అంతే లేడిపిల్ల లేడిపిల్ల దభాలున ఒడ్డున పడింది. ఆనందంతో లేచి, ఒళ్లు దులుపుకుని జిరాఫీ వద్దకు పరుగులు తీసింది. "నీ మెడపై ఎంతగా గేలి చేశాను. అదే మెడే ఈరోజు నన్ను రక్షించింది. ఇంకెప్పుడూ ఎవరినీ ఎగతాళి చేయను, నాకు బాగా బుద్ధి వచ్చింద"ని జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసింది లేడిపిల్ల.

నేనేమో తేనె గుంటలో... మీరేమో మురికి గుంటలో..!!

ఒక రోజున శ్రీకృష్ణదేవ రాయలవారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆరోజు ఉదయాన్నే సభ ప్రారంభం అయిన తరువాత సభికులను ఉద్దేశించి తనకో బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు.

వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి "రామలింగా.. మీరూ, నేనూ ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికోగానీ మనం ఇద్దరిమే వెళుతున్నామట. నడుస్తూ, నడుస్తూ ఓ రెండు పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే, మరో గుంటనిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతోపాటు చెత్తా, చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది" అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు.

మళ్లీ కొనసాగించిన రాయలవారు "ఇద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యంకాక మీరూ, నేనూ పట్టుతప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడిపోతే, మీరేమో మురికిగుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తియ్యటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే.. మీరేమో..... అబ్బ నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికిగుంటలో పడిపోయారని" చెబుతూ ముక్కు మూసుకున్నారు.


రాయలవారు చెప్పింది విన్న సభికులంతా పడి పడి నవ్వారు. కొంతమందయితే సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. ఎప్పుడుచూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్తి జరిగిందనీ.. కనీసం రాయలవారి కలలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, మరికొందరయితే ఎగతాళి చేస్తూ "భళీ.. భళీ" అంటూ కేరింతలు కొట్టసాగారు.

సభికుల ఉత్సాహాన్ని చూసిన రాయలవారు కలను మరింత రంజుగా కొనసాగిస్తూ.. "తానేమో తాగగలిగినంత తేనెను తాగి, ఆ గుంట అంచును పట్టుకుని కష్టపడి, ఎలాగోలా పైకి వచ్చాను. అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ, ఇటూ జరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా పైకి ఎక్కబోయారు. అంతలోనే ఏమయిందో ఏమోగానీ ఒక్కసారిగా జారిపోయి దభీమని మళ్లీ ఆ గుంటలోనే తలక్రిందులుగా పడిపోయారనీ, అంతలోనే తనకు మెలకువ వచ్చేందని" చెప్పారు.

రాయలవారు చెప్పింది విన్న సభికులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఒక్క రామలింగడు తప్ప. అయితే అంతటినీ కిమ్మనకుండా విన్న రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఎంత రాయలవారు అయితేనేం, కవీంద్రుడిని ఇంతలా అవమానిస్తారా అంటూ వెంటనే మనసులో ఓ ఆలోచన చేయసాగాడు.



తర్వాతి రోజున రాయలవారు కొలువుతీరి ఉండగా.. రామలింగడు లేచి నిలబడి “మహారాజా..! నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు. రాత్రి నాకూ ఓ కల వచ్చింది. చిత్రంగా, అది తమరు ఆపిన చోటే మొదలయింది. ఏలినవారి శలవైతే, నేను వివరంగా మనవి చేసుకుంటాన”ని అన్నాడు.

“ఏదో నవ్వులాటకు మొదలుపెడితే, నాకే చుట్టేట్లున్నాడే..!” అని మనసులో అనుకున్నారు రాయలవారు. అయినా సరసులు కనుక, కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఆయనకు ఎక్కువయ్యింది. ఒకింత భయపడుతూనే, బింకంగా.. “చెప్పండి రామకృష్ణా" అన్నారు.

"మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కానీ నేను మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే, చాలాసార్లు ప్రయత్నించిన మీదట, చివరికి ఎలాగోలా పైకి చేరుకోగలిగాను. కానీ అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురయ్యింది" అంటూ కాసేపు ఆపాడు రామలింగడు.

ఏం సమస్య.. అంటూ ఆత్రంగా అడిగారు రాయలవారు. "ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్లటం..? అని ఆలోచించాం. దానికి పరిష్కారంగా నేను ముందు మీ ఒంటిమీద ఉన్న తేనెనంతటినీ శుభ్రంగా నా నాలుకతో నాకేశాను. ఆ తర్వాత మీరు కూడా నన్ను అలాగే శుభ్రం చేసేశారని" కలను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగడు.

రామలింగడు చెప్పినదాన్ని విన్న సభికులంతా ఆశ్చర్యంతో నోర్లెళ్లబెట్టారు. నివ్వెరపోయిన ప్రజలకు ఏడవాలో, నవ్వాలో కూడా అర్థం కాలేదు. మహారాజును పట్టుకుని అలా మాట్లాడిన రామలింగడి ధైర్యసాహసాలకు వారంతా మనసులో మెచ్చుకున్నా, సందేహంతో ఎలాంటి భావాలను బయటికి వ్యక్తం చేయకుండా అలాగే కూర్చుండిపోయారు. అయితే చివరకు రాయలవారే గట్టిగా నవ్వటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

అప్పటినుంచి "రామలింగడిని ఏడిపిస్తే చాలా ప్రమాదం" అని శ్రీకృష్ణదేవ రాయలవారికి అర్థం అయింది. ఇక అప్పటినుంచి ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు...!!

రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు.. నీ ఠీవి, గంభీరత అద్భుతం..

ఒక ఊర్లోని కోనేట్లో కోటి రకాల కప్పలు ఉండేవి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు... ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలసి మెలసి బ్రతుకుతూ.. ఎండా, వానా తేడా లేకుండా.. ఎర పొరుపులు రాకుండా కలకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూ, చింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవి.

కోనేటికి నాలుగువైపులా రాతి మెట్లుండేవి. సాయంత్రం అయ్యేసరికి నగరంలోని వాళ్లంతా మెట్ల మీదకు చేరుకునేవారు. వెన్నెల రాత్రుల్లో ఆ మెట్లమీదనే గడిపేవారు. వాళ్లు చేసే చర్చలు, వాదనలను కప్పలన్నీ జాగ్రత్తగా వింటూ ఉండేవి. అలా రాన్రానూ మనుషుల పద్ధతులన్నీ కప్పలకు బాగా అంటుకున్నాయి.

కొంత కాలానికి కప్పలకు ఓ సరికొత్త విషయం ఒకటి బోధపడింది. మనుషులు తమను పాలించుకునేందుకు ఒక రాజుని ఎన్నుకున్నారనేదే ఆ విషయం. ఈ వార్త విన్న కప్పలు.. మనుషులకే రాజు అవసరమైనప్పుడు తమకు మాత్రం ఎందుకు ఉండకూడదని అనుకున్నాయి. 


వెంటనే కప్పలు సూర్యుడిని ప్రార్థించాయి. సూర్యుడు వచ్చి.. "ఏం కావాలి..?" అని అడిగాడు. "వెంటనే మాకో రాజును ఇవ్వు ప్రభూ..!" అని వేడుకున్నాయి కప్పలు. "ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా...! ఇంకా రాజెందుకు..?" మళ్లీ ప్రశ్నించాడు సూర్యుడు. "మనుషులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండకూడదా..?" ఎదురు ప్రశ్నించాయి కప్పలు.

"పోనీ మీలేనే ఎవరో ఒకరిని ఎంచుకోరాదూ..?" సలహా ఇచ్చాడు సూర్యుడు. "ఉహూ.. మాకు కొత్త రాజే కావాలి.." పట్టుబట్టాయి కప్పలు. వాటి అమాయకత్వాన్ని చూస్తే సూర్యుడి జాలి కలిగింది. వెళ్తూ, వెళ్తూ.. పెద్ద జీలగ బెండును కోనేట్లో వేసి వెళ్లిపోయాడు. ఆ జీలగబెండును చూసి బెదిరిపోయిన కప్పలు.. రెండు, మూడు రోజులు దాని దగ్గరకే వెళ్ళలేదు.

ఆ తరువాత కాస్త బెదురు తీరగానే జీలగబెండు మీదికి చేరాయి కప్పలు. గెంతినా, పొర్లాడినా ఉలుకూ, పలుకూ లేదు జీలగబెండులో. తనివితీరా గెంతిన కప్పలు.. "ఓస్.. రాజంటే ఇంతేనా..?" అనుకున్నాయి. అయితే వాటికి ఆ రాజు నచ్చలేదు, మళ్లీ సూర్యుడిని వేడుకున్నాయి.



"దేవా..! మాకీ చచ్చురాజు పనికిరాడు.. మరో కొత్త రాజుని ఇవ్వు" అని అడిగాయి. "మీది అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలియకుండా ఉంది. పోనీ.. హాయిగా ఆడుకుంటారు కదా అని బెండుని ఇస్తే.. కాదు కూడదంటున్నారు" మందలించాడు సూర్యుడు. "ఇంతకంటే మంచి రాజును ఇవ్వు దేవా..!" ప్రాధేయపడుతూ అడిగాయి కప్పలు.

చాలా సేపు ఆలోచించిన సూర్యుడు.. చంద్రుడిని ఇచ్చాడు. అప్పట్నించి కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు, ఆడుకునేవాడు. కలసిమెలసి తిరిగేవాడు. చల్లగా పండు వెన్నెల ఇచ్చేవాడు. అయితే తినగా తినగా గారెలు చేదయినట్లుగా.. చంద్రుడి మీద కూడా కప్పలకు అసంతృప్తి కలిగింది. వెంటనే సూర్యుడిని ప్రార్థించాయి.

"ఎంతసేపూ పనికిమాలినవాళ్ళనే రాజుగా ఇస్తున్నావుగానీ.. కాస్త కరుకైన వాళ్లను రాజుగా ఇవ్వు దేవా..!" అని వేడుకున్నాయి కప్పలు. "మీరు మూర్ఖులు.. రాజును ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని ఇచ్చాను. అయినా ఏం లాభం.. వాళ్ళ మంచి మీకు చేదయింది" కోపగించుకున్నాడు సూర్యుడు.

"మీరు ఏమైనా అనండి.. మాకు రాజు కావాలి" పట్టుబట్టాయి కప్పలు. "రాజు కింద ఎన్నెన్ని బాధలు వస్తాయో మీకు తెలీదు.." అనునయిస్తూ అన్నాడు సూర్యుడు. "బాధలు ఎన్ని వచ్చినా సరే.. మాకు రాజు కావాలి" పట్టుబట్టాయి కప్పలు. చివరికి విసుగెత్తిన సూర్యుడు.. అనుభవిస్తేగానీ మీకు తెలీదు అని మనసులో అనుకుంటూ.. కొల్లేటి కొంగను రాజుగా ఇచ్చి వెళ్లిపోయాడు.

జీలగబెండు, చంద్రుడిలాగా కాకుండా.. నిబ్బరంగా గట్టుమీద కూర్చుంది కొల్లేటి కొంగ. మహా బెట్టు చేస్తున్న కొంగను చూసిన కప్పలకు అదేదో గొప్ప లక్షణంలా కనిపించింది. "ఓహో కొంగరాజా..! నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకుముందున్న రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు. నీ ఠీవి, గంభీరత అద్భుతం..! మాకు అన్నివిధాలా నచ్చావు. చంద్రాయుధం లాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్మల్ని పరిపాలించటానికి" అంటూ పొగడ్తల వర్షం కురిపించాయి.

కొంగ ఏమీ మాట్లాడలేదు. కోనేటివైపు చూస్తూ కూచుంది. కప్పల పొగడ్తలకు లోలోనే మురిసిపోయింది. ఆ మరుసటి రోజునుంచి తన ప్రతాపం చూపించింది. రోజుకొక కప్ప చొప్పున తినేయటం ప్రారంభించింది. కొద్దిరోజుల్లోనే కప్పలకు విషయం అర్థమైపోయింది. ఏ ముక్కును పొగిడాయో, ఆ ముక్కే మృత్యువయ్యింది.

రోజురోజుకూ మాయమైపోతున్న సహచరులను తలచుకుని కుళ్లి కుళ్లి ఏడవసాగాయి. వెంటనే.. "ఓ సూర్య దేవుడా.. మమ్మల్ని రక్షించు.. మాకు రాజూ వద్దూ.. గీజూ వద్దూ..! ఈ బాధలను తప్పించు" అంటూ వేడుకున్నాయి. అయితే సూర్యుడు మళ్లీ కనిపించనూ లేదు.. కొల్లేటి కొంగ రాజరికం పోనూ లేదు....!!!

ఇసుక రేణువులను ఎన్నని లెక్కించగలను..?

విదర్భ దేశస్థుడైన సూర్య నారాయణ శాస్త్రి తన పాండిత్యంతో కోశల దేశానికి చెందిన పండితుడు శంకర శాస్త్రిని ఓడించాలని బయలుదేరాడు. ఇంకాస్త దూరంలో కోశల దేశం చేరుకుంటాడనగా ఒక పశువుల కాపరి ఆయనకు ఎదురుపడ్డాడు.

సూర్య నారాయణ శాస్త్రిని ఎగాదిగా చూసిన పశువుల కాపరి, ఊరికి ఇతడెవడో కొత్తవానిలా ఉన్నాడనుకున్నాడు. వెంటనే "స్వామీ.. నమస్కారం. మీరెవరో కొత్తవారిలా ఉన్నారు. ఎందాక మీ ప్రయాణం..?" అంటూ వినయంగా ప్రశ్నించాడు.

"సకల శాస్త్రాలూ ఔపోశన పట్టిన ఉద్ధండ పండితుడిని. నా పేరు సూర్య నారాయణ శాస్త్రి. మీ కోశల దేశంలో ఉండే శంకర శాస్త్రిని ఓడించేందుకు విదర్భ దేశం నుండి వస్తున్నా"నని జవాబిచ్చాడు శాస్త్రి.


"అలాగా..! మంచిది స్వామీ.. నేనొక చిన్న ప్రశ్న వేస్తాను. జవాబు చెప్పగలరా..?" మళ్లీ అడిగాడు పశువుల కాపరి.

"ముందే చెప్పాను కదా.. ఎంతటి గొప్ప ప్రశ్నకైనా క్షణకాలంలో జవాబు చెప్పగల పండితుడినని.. అడుగు చెప్పేస్తా..." అన్నాడు శాస్త్రి.

అలాగే స్వామీ అన్న పశువుల కాపరి... శాస్త్రి చూస్తుండగానే, నేలమీదికి వంగి, తన కుడిచేతి నిండా ఇసుక తీసుకున్నాడు. వెంటనే "స్వామీ... ఈ ఇసుక రేణువుల పరిమాణం ఎంత..?" అని అడిగాడు.

"ఇసుక రేణువులను ఎన్ని రేణువులని తను లెక్కించగలడు..? అది తనకు సాధ్యమయ్యే పనేనా..?" అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శాస్త్రి.

కాసేపటి తరువాత పశువుల కాపరి.. "స్వామీ...! నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు.." అంటూ మళ్లీ ప్రశ్నించాడు.

"నువ్వే చెప్పవయ్యా..!!" అన్నాడు శాస్త్రి.

"ఒక పిడికిట్లో ఉన్న ఇసుకను పిడికెడు ఇసుక అంటారని చెప్పలేని మీరు ఏం పండితుడివయ్యా..!!" అంటూ ఎగతాళిగా నవ్విన పశువుల కాపరి.. పిడికిట్లో ఉన్న ఇసుకను నేలమీద పడేసి తన దారిన తను వెళ్లిపోయాడు.

"ఒక పశువుల కాపరి అడిగిన అతి చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేని నేను.. శంకర శాస్త్రిని ఎలా ఓడించగలను..?" అని తనను తానే ప్రశ్నించుకున్న సూర్య నారాయణ శాస్త్రి.. పశువుల కాపరికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.

అది లగాయితు సుబ్బయ్యకు జ్యోతిష్యం అంటే వణుకు..!!

సూరంపల్లి సుబ్బయ్య దీపావళి పండుగకు ఒక రోజు ముందుగానే అత్తగారి ఊరికి భార్యతో సహా బయల్దేరాడు. ఇంటికెళ్లాక మధ్యాహ్నం భోంచేసి మంచంమీద పడుకున్నాడు. ఇంతలో అతని భార్య కమలమ్మ వచ్చి, "మా అమ్మ మీకు ఇష్టమని గారెలు చేసింది తిందువు లే మామా..!" అంది.

అది విన్న సుబ్బయ్య వెంటనే "మీ అమ్మ ఎన్ని గారెలు చేసిందో చెప్పనా..?" అన్నాడు. "ఏదీ చెప్పండి చూద్దాం" అంది కమలమ్మ. "ఇరవై ఎనిమిది" అన్నాడు. మంచంమీద పడుకున్నాక నిద్ర పట్టక అటూ, ఇటూ పొర్లుతూ ఉంటే, అత్తగారు గారెలు వేయటం మొదలెట్టింది. సుబ్బయ్యకు ఏమీ తోచక పోవటంతో సుయ్‌మన్నప్పుడల్లా లెక్కపెట్టడం మొదలెట్టాడు. అందుకే అత్తగారు వేసిన గారెల లెక్కను సరిగ్గా లెక్కపెట్టగలిగాడు.

ఇదంతా తెలియని కమలమ్మ వెంటనే లోనికివెళ్లి "అమ్మా మీ అల్లుడు నువ్వు 28 గారెలే చేసినట్లు చెబుతున్నాడు. ఇంకా ఎవరూ తినలేదు కదా. ఒకసారి లెక్కపెట్టి చూడమ్మా.." అంది. వెంటనే లెక్కపెట్టిన ఆమె.. "అవునే అల్లుడుగారు చెప్పింది నిజమే, ఆయనకు జ్యోతిష్యం తెలుసా..?" అంటూ ఆశ్చర్యంగా అడిగింది. వెంటనే పొంగిపోయిన కమలమ్మ "అవునమ్మా.. మా ఆయన జ్యోతిష్యంలో దిట్ట" గారాలుపోతూ చెప్పింది.

ఆ విషయం అలా ఊరంతా పాకిపోయింది. సాయంత్రం షికారుకెళ్లిన సుబ్బయ్య ఇంటిబయట తిన్నెమీద కూర్చుని అలా వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి "బాబూ.. ఆకలేస్తోంది. ఒక రూపాయి ఇవ్వవూ..?" అన్నాడు. "ఎవరు నువ్వు..? దుక్కలా ఉన్నావే, అలా అడుక్కోవచ్చా..?" అన్నాడు సుబ్బయ్య.

"నా పేరు భీమయ్య బాబూ..! నేను మీ పక్కింటి యల్లమ్మ భర్తనే. మా ఇంట్లో రెండువేలు పోయాయి. నేనే తీశానని నా భార్య నన్ను తిట్టి, ఇంట్లోంచి వెళ్లగొట్టేసింది. అందుకని పదిరోజులుగా ఇలా ఈ వీధిలోని గుట్టుగా అడుక్కుంటున్నానని" అన్నాడు. "అయితే ఆ డబ్బు నువ్వు తీయలేదా..? మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు..?" ప్రశ్నలు గుప్పించాడు సుబ్బయ్య. "మా ఇంటికి పాలేరు తప్ప మరెవ్వరూ వచ్చేవారు కాదయ్యా..!!" చెప్పాడు భీమయ్య.



"అది సరే.. నీవు ఏ భయం లేకుండా ఇంటికెళ్లు. రేపు సరిగ్గా పదిగంటలకు ఇల్లు చేరుకో, మిగతా కథను నేను నడిపిస్తానని" అన్నాడు సుబ్బయ్య. తరువాత ఇంట్లోకి వెళ్లిన సుబ్బయ్యతో భార్య కమలమ్మ "ఏమండీ.. పక్కింటి యల్లమ్మ పిన్ని మిమ్మల్ని ఏదో అడగాలని వచ్చింద"ని చెప్పింది. "చూడమ్మా నీ భర్త రేపు పదిగంటలకల్లా ఇంటికొస్తాడు. మీ ఇంట్లో డబ్బు కాజేసింది మీ పాలేరు నాగన్నే.." అని అన్నాడు.

తానే యల్లమ్మను పిలిచి విషయం చెబుదామనుకునేంతలోనే, ఆమె వచ్చి తనను జ్యోతిష్యం అడగటంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు సుబ్బయ్య. యల్లమ్మ వెంటనే పాలేరుమీద మునసబుకు ఫిర్యాదు చేసింది. పొద్దున్నే వచ్చిన భర్తను చూసి సంతోషించింది. పాలేరు వచ్చి తప్పు ఒప్పుకుని ఆమె పాదాలపై పడ్డాడు. ఇంకేముందీ జ్యోతిష్యుడంటే సుబ్బయ్యే అని తెగ పొగిడేశారు యల్లమ్మ దంపతులు.

ఆ తరువాత ఓ చాకలామె వచ్చి.. "అయ్యా మూడు రోజుల నుంచి నా గాడిద కనిపించటం లేదు, రేవుకెళ్లాల్సిన గుడ్డలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి" అంటూ తన సుబ్బయ్య ముందు గోడు వెల్లబోసుకుంది. "దిగులుపడకమ్మా రేపు తెల్లారేసరికల్లా నీ గాడిద నీ ఇంటిముందు ఉంటుంది" అన్నాడు. చెప్పేదేమో చెప్పాడుగానీ, తనకు జ్యోతిష్యం తెలియదని ఊర్లో అందరికి తెలియకుండా ఉండాలంటే, ఆ గాడిదను తానే వెతికి ఆమె ఇంటిముందు ఉంచాలని మనసులో అనుకున్నాడు.

రాత్రి అందరూ నిద్రపోయాక ఊరంతా వెతికినా గాడిద కనిపించలేదు. మరింత గాబరాగా వెతకగా, ఓ అరటితోటలోంచి గాడిద ఓండ్ర వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లిన సుబ్బయ్య.. గాడిద తనదే ఇవ్వమని తోటవాడిని అడిగాడు. అయితే అది తోటలోని అరిటాకులను నమిలి, మొక్కల్ని నాశనం చేసింది కాబట్టి 500 రూపాయలు ఇచ్చి తోలుకెళ్లమని అన్నాడు తోటవాడు. చేసేదేమీలేక డబ్బులిచ్చి గాడిదను తీసుకొచ్చి చాకలామె ఇంటిముందు కట్టేసి వెళ్లిపోయాడు సుబ్బయ్య.

తెల్లారగానే.. "కమలమ్మా నా గాడిద దొరికింది, మీ ఆయన మాటకు తిరుగులేదు" అంటున్న చాకలామె మాటలు సుబ్బయ్యకు వినిపించాయి. "సొమ్మూపోయి దిమ్మా పట్టిందన్నట్లు" అటు 5 వందలుపోయి, ఇటు గాడిద మెడకున్న తాడును లాగి లాగి చేతులు బొబ్బలెక్కినందుకు మనసులోనే తిట్టుకున్నాడు సుబ్బయ్య. ఆ తరువాత.. వెనుకింటి, ఎదురింటి అమ్మలక్కలు ఏదో సమస్యతో ఇంటిముందుకు రావటం గమనించిన అతను.. చెప్పాపెట్టకుండా సూరంపల్లికి చెక్కేశాడు. అది లగాయితు సుబ్బయ్య జ్యోతిష్యులు అన్నా, జ్యోతిష్యం అన్నా ఒకటే వణుకు..!

ఇంత బ్రతుకూ బ్రతికి గాడిదచేత తన్నులా...?!

ఒక పెద్ద అడవిలో బాగా బలిసిన సింహం ఒకటి జీవిస్తుండేది. ఈ సింహానికి సహజంగా వచ్చిన బలపరాక్రమాలతోపాటు, అంతులేని అహంకారంతో మిడిసిపడుతుండేది. అడవిలో బ్రతికే జంతువున్నింటిచేతా అది అడ్డమైన చాకిరీ చేయించుకుంటుండేది. తను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా.. అడ్డూ, ఆపూ లేకుండా అడవికి మహారాజుగా పెత్తనం చెలాయిస్తూ ఉండేది.

అలా ఉండగా.. ఆ సింహం అడవిలో ఒకసారి బాగా కరువు వచ్చింది. ఆ కరువుకు తట్టుకోలేని ఇతర జంతువులన్నీ తట్టా, బుట్టా సర్దుకుని తలోదారి పారిపోయాయి. జంతువులకు రాజయితే మాత్రం సింహానికి తిండీ తిప్పలు ఊరికే వచ్చేస్తాయా..? ఇతర జంతువులన్నీ ఉన్నంతకాలం వాటిలో ఏదో ఒకదాన్ని గుటుక్కుమనిపించి తన ఆకలి తీర్చుకునేది. ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క జంతువు కూడా ఆ అడవిలో లేదు.

అయినా బెట్టుగా అదే అడవిలో కొన్నాళ్లపాటు నీల్గుతూ కాలం వెళ్లబుచ్చింది సింహం. కానీ ఆకలికి తట్టుకోలేక వేరే అడవికి బయలుదేరింది. ఆ అడవిలో ఒక నక్క, గాడిద, ఎద్దు కలిసి స్నేహంగా జీవిస్తుండేవి. వాటి తిండీ తిప్పలు వేరువేరయినా కూడా కలసిమెలసి ఉండేవి. వాటి దగ్గరికి చేరింది సింహం.

వలస వచ్చినా గర్వాన్ని వదలని ఆ సింహం.. ఈ అడవికి కూడా తానే రాజునని అంది. అయినా ఎద్దు, నక్క, గాడిద ఒప్పుకోక పోవటంతో వాటితో ఒక ఒప్పందం చేసుకుంది. ఎలాంటి ఆహారం దొరికినా అందరూ సమానంగా పంచుకుని తినాలని అంది సింహం. దానికి మిగతావి కూడా సరేనన్నాయి. ఒకరోజు ఆహారం దొరికింది. అందరికీ సమానంగా పంచిపెట్టాలని ఎద్దును కోరింది సింహం.

ఆహారాన్ని నలుగురికీ 4 వాటాలుగా వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దుమీదికి దూకి పంజాతో చరిచింది. అంతే ఎద్దు చచ్చిపోయింది. నక్క, గాడిదా లోలోపలే ఏడుస్తూ కూర్చున్నాయి. ఈసారి నక్కవైపు తిరిగిన సింహం.. నువ్వు పంచు అంది. అయితే తెలివిగల నక్క.. ఈ ఆహారాన్ని పంచటం నావల్ల కాదు, నువ్వే పంచు అంది.



దాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది. సరే నేనే పంచుతానని, ఆహారాన్ని మూడు వాటాలు చేసింది. నేను మృగరాజును గనుక ఒక వాటా నాది, రెండోవాటా మీతో పంచుకోవాలి గనుక ఇంకోటి కూడా నాదే అని చెప్పింది సింహం. అలాగే ఇక మిగిలింది మూడో వాటా.. మీ ఇద్దరికీ దమ్ములుంటే దీన్ని తీసుకోండి అంటూ రెచ్చగొట్టింది.

దాంతో జడుసుకున్న నక్క, గాడిద భయపడిపోయాయి. దౌర్జన్యంగా ఆహారాన్నంతా కాజేసిన సింహం కడుపునిండా తిని హాయిగా నిద్రపోగా.. నక్క, గాడిద మాత్రం ఆకలితో అల్లాడిపోయాయి. అయితే ఒక్కసారిగా దొరికిన ఆహారాన్ని ఆత్రంకొద్దీ గబగబా తినేసిన సింహం ఆ మరుసటిరోజు జబ్బుపడింది. పడుకున్న చోటునుంచి కదలలేకుండా అయిపోయింది.

అది చూసిన ఇతర జంతువులన్ని కసితీరా సింహాన్ని తిట్టి, తన్ని, కొట్టి వెళ్లేవి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లు ఉరిమి చూసి మూలిగేది, కానీ ఏ ప్రాణి కూడా భయపడేది కాదు. బ్రతికి బట్టకడితే మీ సంగతి చూస్తానని వాటిని సింహం బెదిరించేది అయినా అవి లెక్కచేసేవి కావు.

ఒక రోజున గాడిద తన దగ్గరకు రావటం చూసిన సింహం.. నువ్వు కూడా తన్నిపోయేందుకే వచ్చావా..? అంటూ గుడ్లురిమి చూసింది. ఇంకా గుడ్లురుముతున్నావా మృగరాజా... చింత చచ్చినా పులుపు చావలేదే అంటూ వెక్కిరించింది గాడిద. సింహం మళ్లీ గుడ్లు ఉరిమి చూడటంతో కోపం నషాలానికెక్కిన గాడిద తన వెనుకకాళ్లతో సింహం మొహంపై తన్నింది. వెంటనే సింహం రెండు కళ్లూ రాలి నేలమీద పడ్డాయి.

ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిదచేత కూడా తన్నులు తిని చావవలసిందేనా..? అయ్యో..? నాదెంత దిక్కుమాలిన చావు.. అనుకుంటూ ఏడ్చి దొర్లాడింది సింహం. అయినా కూడా ఏ ఒక్క జంతువూ దానిపై జాలి చూపించలేదు. ఇన్ని రోజులు తమను కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటూ ఆరోజు నుంచి జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి.

విద్య వల్ల వినయం రావాలేగానీ.. అహంభావం కాదు..!

శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థానానికి సూర్య శాస్త్రి అనే పండితుడు విచ్చేశాడు. రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలో ప్రవేశించిన సూర్య శాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు. ఇంతలో "మహారాజా..! నేను అవునన్నది కాదనీ, కాదన్నది అవుననీ వాదన చేసి విజయం సాధిస్తాను. మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని" సవాలు విసిరాడు సూర్య శాస్త్రి.

సూర్య శాస్త్రి పాండిత్యం దిట్ట అనీ, అతడిని ఓడించటం అంటే కొరివితో తల గోక్కోవటం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్ట దిగ్గజ కవులు మౌనం వహించారు. దీంతో అష్ట దిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మరుసుతో "అప్పాజీ.. మన అష్ట దిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికే తీరని మచ్చ. నేనే అతడితో వాదిస్తానని చెప్పండ"ని అన్నాడు.

అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడి "ప్రభూ.. ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి. పెద్దన, తిమ్మరుసు లాంటి కవులు ఉన్నారు కదా.. అని నేను మౌనం వహించాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్య శాస్త్రితో నేనే వాదిస్తానని" అన్నాడు.


రాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా "సరే"నని అన్నాడు. వెంటనే రామలింగడు సూర్య శాస్త్రితో వాదనకు దిగాడు. మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు. మిగిలిన అష్ట దిగ్గజ కవులు, సభలోని పెద్దలు, విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు.

రామలింగడు సూర్య శాస్త్రితో ఇలా అన్నాడు. "అయ్యా.. మీరు నేను అవునంటే, కాదని వాదిస్తారు కదూ..?" అన్నాడు. "అవునోయ్.. నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నాన"ని గర్వంగా బదులిచ్చాడు సూర్య శాస్త్రి. వినయంగా తలవంచిన రామలింగడు "మీ అమ్మాయి విధవ కాదు కదా...!!" అన్నాడు. వెంటనే సూర్య శాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయ్యింది. "సౌభాగ్యవతి అయిన కూతురును విధవ అంటే ఎంత తప్పు. ఏ తండ్రి అయినా విధవ అని ఎలా చెప్పగలడు" అని మనసులో మధనపడ్డాడు సూర్య శాస్త్రి.

కళ్లలో నీళ్లు గిర్రున తిరుగగా.. "రామలింగా.. నాలోని అహంకారాన్ని జయించావు. నీకు వేనవేల నమస్కారాలు" అని బదులిచ్చాడు సూర్య శాస్త్రి. వెంటనే రాయలవారివైపు తిరిగిన సూర్య శాస్త్రి "మహారాజా.. నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను. నన్ను మన్నించండని" దీనంగా సభను విడిచి వెళ్లిపోసాగాడు.

అలా వెళ్లిపోతున్న సూర్య శాస్త్రిని ఆపిన రామలింగడు "అయ్యా.. తర్కంలో మీరు ఉద్ధండ పండితులే, విద్య వల్ల వినయం రావాలేగానీ, అహంభావాన్ని ప్రదర్శించకూడదు. ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని" అన్నాడు. అలాగే రాయలవారితో "మహారాజా.. దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండని" అన్నాడు.

"తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగా.." అన్నాడు సంతోషంగా రాయలవారు. అంతేగాకుండా సూర్య శాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించాడు శ్రీ కృష్ణ దేవరాయలు.

వేటగాడికి జ్ఞానోదయం చేసిన భల్లూకాలు...!

ఓ వేటగాడు తన పొడవైన తుపాకీని భుజానికి తగిలించుకుని... మరో భుజంమీద తూటాల పెట్టెను పెట్టుకుని అడవికి బయలుదేరాడు. చాలా దూరం వెళ్లిన అతను ఓ లోయ వద్దకు చేరుకున్నాడు. "ఈ లోయ దాటుకుని అటువైపు ఉన్న అడవిలోకి వెళితే అక్కడ రేగుపండ్ల చెట్లు చాలా ఉన్నాయి. అక్కడికి ఎలుగుబంట్లు చాలా వస్తుంటాయి. సులభంగా వేటాడవచ్చు" అని మనసులో అనుకుంటూ మెల్లిగా లోయను దాటి.. రేగుపండ్ల చెట్ల వద్దకు వెళ్లాడు.

వెంటనే రేగుపండ్ల చెట్లకు దగ్గరగా ఓ సన్నటి బాటగుండా ఒక చిన్న ఎలుగుబంటి వెళుతుండటం గమనించాడు వేటగాడు. తాను ఇప్పుడు తుపాకీ గనుక పేలిస్తే.. ఈ పిల్ల ఎలుగుబంటి లోయలో పడిపోతుంది కాబట్టి లాభం లేదని అనుకుని అలాగే ముందుకెళ్లసాగాడు. అయితే పిల్ల ఎలుగుబంటికి ఎదురుగా మరో పెద్ద ఎలుగుబంటి అటువైపు నుంచి వస్తుండటం వేటగాడి కంటబడింది.

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి నడిచేందుకు కూడా వీలు లేనంత ఆ సన్నటి దారిలో ఒకరు వెనకకు తిరిగితేగానీ.. రెండోవాళ్లు వెళ్లేందుకు దారి ఉండదు. ఆ క్రమంలో వెనుకకు వెళ్లేందుకు ఇష్టపడని ఆ ఎలుగుబంట్లు రెండూ ఎదురుపడి.. పోట్లాడుకుని చివరకు లోయలో పడి చనిపోతాయని అనుకున్నాడు. 


"పోనీ ఒకదాన్ని కాల్చేస్తే.. ఆ సౌండ్‌కు రెండోది లోయలో పడిపోతుంది.. కాబట్టి వాటిని ఏం చేసినా తనకు ఏ ప్రయోజనమూ ఉండదు" అని గట్టిగా నిర్ణయించుకున్నాడు వేటగాడు. అది సరే.. ఇప్పుడు ఆ సన్నటి దార్లో అవి రెండూ ఏం చేస్తాయోనన్న ఆసక్తి కలిగింది అతగాడికి. అందుకే పక్కనే ఉన్న చెట్లలో దాక్కుని ఆ రెండింటినీ ఆసక్తిగా గమనించసాగాడు.

అంతలోనే ఆ ఎలుబంట్లు రెండూ ఒకదానికి ఒకటి ఎదురుపడ్డాయి. అవి వాటి భాషలో ఏం మాట్లాడుకుంటున్నాయో వేటగాడికి అర్థం కాలేదు. కాసేపటి తరువాత పెద్ద ఎలుగుబంటి మౌనంగా కూర్చుండిపోగా.. చిన్న ఎలుగుబంటి దానిమీద ఎక్కి ఇటువైపుకు వచ్చేసింది. తరువాత వేటి దారిన అవి వెళ్లిపోయాయి.

ఇదంతా కన్నార్పకుండా చూసిన వేటగాడు.. "జంతువులు ఇంత తెలివిగా ఉంటాయా..? మూర్ఖులైన మనుషులే ఎప్పుడు చూసినా నేనే గొప్ప.. నేను గొప్ప అనుకుంటూ అహంకారంతో గొడవపడుతుంటారే..?" అనుకున్నాడు. "ఇంత మంచిగా జీవిస్తున్న ఈ నోరులేని జీవాలనా తాను చంపబోయింది" అనుకోగానే అతడికి ఎవరో చెంపమీద కొట్టినట్లయ్యింది. అంతే అక్కడికి నుంచి ఇంటికి వెళ్లిన ఆ వేటగాడు ఆరోజు నుంచి వేట మానేసి.. కష్టించి పనిచేసి భార్యాపిల్లలను పోషిస్తూ ఆనందంగా జీవించసాగాడు.

వీరసింహుడు.. లక్ష వరహాల బహుమానం...!

బీద, సాద ప్రజలకు మేలు చేస్తూ.. వారికి మంచి చేయటం కోసం ప్రాణాలకు కూడా లెక్కచేయని రారాజుగా, కోసల రాజ్యాధిపతి వీరసింహుడి పేరు దేశ విదేశాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న పొరుగుదేశపు రాజు అయిన విదర్భ చక్రవర్తి విరూపాక్షుడికి చాలా అసూయ కలిగింది.

"ఇంత పెద్ద రాజ్యానికి చక్రవర్తినైన తనకు లేని కీర్తి ఆ వీరసింహుడికా వచ్చేది..?" అంటూ కోపంతో ఊగిపోయాడు విరూపాక్షుడు. వెంటనే అదనుచూసి తన సైన్యంతో దండెత్తి కోసల రాజ్యాన్ని వశపరచుకున్నాడు. అదే సమయంలో వేట కోసం అడవికి వెళ్లిన వీరసింహుడు ఇదంతా తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

వీరసింహుడి కోసం విరూపాక్షుడు దేశమంతటా వెదికించాడు. అయినా సరే అతని జాడ తెలియలేదు. దాంతో "ఎవరైనా సరే, వీరసింహుడిని పట్టిస్తే, వారికి లక్ష వరహాలను కానుకగా ఇస్తాన"ని చాటింపు వేయించాడు. అదలా ఉంటే.. అజ్ఞాతంగా అడవుల్లో తిరుగాడుతూ జీవనం సాగిస్తుంటాడు వీరసింహుడు.


ఒకరోజు వీరసింహుడికి కొంతమంది పండితులు ఎదురై.. "అయ్యా... కోసల రాజ్యాధిపతి వీరసింహుడిని కలవటం కోసం తాము ఎంతో దూరం నుంచి వస్తున్నామనీ, అడవిలో దారి తప్పిన తమకు దారి చూపించాలని" వేడుకున్నారు. దాంతో "మీరెందుకు ఆయనను కలవాలని అనుకుంటున్నారని?" ప్రశ్నించాడు వీరసింహుడు.

"ఆయనో గొప్ప దయగల మారాజు. నిరుపేదలైన తాము ఆయనను అర్థించి ధన సహాయం పొందాలని బయల్దేరాం.." అని బదులిచ్చారు పండితులు. వెంటనే విషయం అర్థం చేసుకున్న వీరసింహుడు.. "పదండి మీకు నేను దారి చూపిస్తా"నంటూ వారిని స్వయంగా వెంటబెట్టుకుని విరూపాక్షుడి రాజధానికి బయలుదేరాడు.

విరూపాక్షుడు కొలువుతీరి ఉండగా సభలోకి ప్రవేశించిన వీరసింహుడు.. "వీరసింహుడిని పట్టిస్తే లక్ష వరహాలు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు కదా..? ఆ సొమ్ము ఈ పండితులకు ఇప్పించండి. నేనే వీరసింహుడిని" అంటూ ఏ మాత్రం భయం లేకుండా నిర్భయంగా అన్నాడు.

దీంతో వీరసింహుడి ధైర్యానికి, ప్రజలపట్ల ఆయనకున్న నిబద్ధతకు ఆశ్చర్యపోయాడు విరూపాక్షుడు. ప్రజలంతా వీరసింహుడిని ఎందుకలా కీర్తిస్తున్నారో, తన కంటే అతనెంతటి ఉన్నతుడో అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలు తీర్చటం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని అతడి ఔధార్యానికి చలించిపోయాడు విరూపాక్షుడు. 

వెంటనే సింహాసనం దిగి వచ్చిన విరూపాక్షుడు "వీరసింహా.. నన్ను మన్నించు. అసూయతో నీ రాజ్యాన్ని వశపరచుకున్నాను. కానీ నీ గొప్పదనం ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రజలను ఎళ్లవేళలా కంటికి రెప్పలాగా కాపాడే నువ్వే అసలైన చక్రవర్తివి. నా రాజ్యాన్ని కూడా నువ్వే పాలించు" అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు. విరూపాక్షుడికి ఆ విధంగా కనువిప్పు కలిగినందుకు సభికులంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు.