Pages

Monday, August 6, 2012

అపాయంలో ఉపాయం - చిట్టి కథ

పులి, నక్క, గాడిద మంచిమిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి.
ఓసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటుకి చేరింది.

ఆ రోజు పులి మాంచి ఆకలిమీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వాటాలెయ్యమని అడిగింది.
‘‘వయస్సులో పెద్దది గాడిద. కనుక ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బాగుంటుంది...’’ అని నక్క తెలివిగా తప్పుకుంది.

నక్క మాటలతో గాడిద ‘‘అబ్బో మనకింత పెద్దరికం ఇస్తున్నారే...’’ అనుకుని ఉప్పొంగిపోయింది.
జింక మాంసాన్ని గాడిద మూడు వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది.

‘‘ఏంటీ గాడిదా, నీకూ నాకూ సమానా వాటానా?’’ అని పులి అమాంతం గాడిదమీద పడి చంపేసింది.
తర్వాత నక్క వంక చూసింది పులి.
‘‘నక్కా నక్కా ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి?’’ అడిగింది పులి.

అప్పుడు నక్కేమందో తెలుసా?
‘‘మిత్రమా, నువ్వు నీక్కావలసిందంతా తినగా మిగిలినదేమైనా ఉంటే అది చాల్లే నాకు. అదే నా భాగ్యమనుకుంటాను’’ అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించింది. ‘‘అన్నట్టు స్నేహితుడా...నీకింతటి తెలివి ఎలా వచ్చింది?’’ అని పులి అడిగింది.

‘‘ఏం చెప్పమంటావు? ఈ గాడిద నుంచే నాకంత తెలివొచ్చింది’’ అని నక్క వినయంగా చెప్పి అటూ ఇటూ చూసింది.

పనిలో మెళకువలు! - చిట్టి కథ

అడ్డదిడ్డంగా చెట్లు, తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూలమొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటిని నరికి చదును చేయాలి కదా! అందుకోసం రాముడు, భీముడు అని ఇద్దరు పనివాళ్లని పెట్టుకున్నాడు. భీముడు పేరుకు తగ్గట్లుగా బలంగా, లావుగా ఉంటే, రాముడేమో సన్నగా, బక్కపల్చగా ఉన్నాడు.

ఇద్దరూ చెట్లు నరకడం మొదలు పెట్టారు. మొదటిరోజు ఇద్దరూ సమానంగానే నరికారు. రెండవరోజు భీముడి కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు. మూడవరోజూ, నాలుగవ రోజూ కూడా అంతే! రాముడికన్నా ఎక్కువ పని చేయాలన్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింతగా కష్టపడ్డాడు. కాని, అదేమి చిత్రమో రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసినా, అతనే ఎక్కువ చెట్లు నరికాడు. దాంతో భీముడికి తన శక్తిసామర్థ్యాల మీద అనుమానం వచ్చింది.
అదే విషయం రాముణ్ణడిగాడు.

రాముడు నవ్వేస్తూ ‘‘అన్నా, నువ్వు చెట్లు నరకడం పైనే దృష్టి పెట్టావు కానీ, విశ్రాంతి తీసుకోవడం, నీగొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు. దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు, నే నేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను. పైగా ఆ సమయంలో గొడ్డలికి పదును పెట్టుకునేవాడిని కాబట్టి నా పని మరింత సులువయింది’’ అని జ వాబిచ్చాడు. దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది.

నీతి: కష్టపడి పని చేయడమే ముఖ్యం కాదు, ఓ ప్రణాళిక ప్రకారం పని చేయడం కూడా అవసరం. అప్పుడా పని మరింత తేలికవుతుంది కూడా!

ఎవరు గొప్ప? - చిట్టి కథ

అనగనగా రెండు కాకులు. బోలు, గోలు వాటి పేర్లు. రెండూ మంచి మిత్రులు. ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని చిన్న వాదన మొదలైంది. చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్తా పెరిగి పెద్దై, ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది.చివరికి ఆ రెండూ ఓ పందెం వేసుకున్నాయి. రెండూ కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి. ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప. అయితే ఉట్టిగా ఎగరడం కాదు, ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట!

ఈ రెంటిలోనూ బోలు కొంచెం గడుసైనది. గోలు కాస్తంత అమాయకురాలు. బోలు ఏం చేసిందంటే - ఒక సంచిలో కొన్ని దూది ఉండలు, మరో సంచిలో ఉప్పురాళ్లు పెట్టి, వాటిని మూటల్లా కట్టింది. దూది సంచినేమో తను తీసుకుంది, ఉప్పుమూట కట్టిన సంచిని గోలు కిచ్చింది. 
సరే, రెండూ ఎగరడం ప్రారంభించాయి. బోలు ముక్కుకున్న సంచి తేలికగా ఉండటంతో అది సునాయాసంగా ఎగరసాగింది. చూస్తుండగానే గోలును మించిపోయింది. దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లిపోయింది. 

ఇంతలో వర్షం కురవడం మొదలైంది. బోలు ముక్కుకున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది. గోలు ముక్కుకున్నది ఉప్పుమూట కావడాన వానకు ఆ ఉప్పంతా కరిగి, తేలిగ్గా మారిపోయింది.

దాంతో బోలు ఆయాసంతో వెనకపడిపోతే, గోలు మాత్రం సులువుగా ఎగిరి పైపైకి వెళ్లిపోయింది. విజేతగా నిలిచింది. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయింది బోలు పరిస్థితి!
నీతి: మోసంతో తాత్కాలికంగా గెలవచ్చేమో కాని, అంతిమ విజయం మాత్రం న్యాయానిదే!

తోక తెగిన నక్క!

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. అది జిత్తులమారిదే కాదు. ఆకతాయిది కూడా! ఓ రోజది అనుకోకుండా ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది.

దాని నుంచి బయట పడడానికి రకరకాలుగా ప్రయత్నించింది. ఎట్టకేలకు బయటపడింది. కాని దాని తోక మాత్రం అందులో ఇరుక్కుపోవడంతో గట్టిగా లాగేసరికి పుటుక్కున తెగిపోయింది. బయటకి వచ్చాక తనకు తోక లేకపోవటం చూసి నాలుక్కరుచుకుంది. తోక లేకపోతే అడవిలోని మిగిలిన నక్కలన్నీ తనను ఎగతాళి చేస్తాయే, ఎలాగా అనుకుంది. చివరికి ఓ ఉపాయం ఆలోచించింది, అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. తానో మహారాజులాగా అభినయిస్తూ ఇలా ప్రసంగించింది.

‘‘మిత్రులారా! తోక వల్ల మనకు ఎన్ని ఇబ్బందులెదురవుతున్నాయో తెలుసా! ఒక్కోసారి వేటగాళ్లకు ముందుగా మన తోకే దొరుకుతుంది. దాంతో మనం వాళ్లకి దొరికిపోతాం. ఆ తర్వాత నానా తంటాలూ పడాల్సి వస్తుంది. అందుకే మనందరం మన తోకలను తెంపేసుకుంటే సరి! ఏమంటారు?’’ అంది ఎంతో తెలివిగా! అడవిలోని జంతువులన్నింటికీ దీని సంగతి బాగా తెలుసు. అందుకే దాని అతి తెలివికి అవన్నీ ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత తెలివి తెచ్చుకున్నాయి.

‘‘నీ జిత్తులు మా దగ్గర చూపించకు, గతంలో ఆ తోక గురించి ఎన్ని కబుర్లు చెప్పేదానివి! అసలు తోకే లేకుంటే మనకు అందమే ఉండేది కాదన్నావు, ఇప్పుడు నీ తోక తెగేసరికి మా అందరి తోకలూ కత్తిరిద్దామని కుతంత్రం పన్నావు. నీ ఆటలు మా దగ్గర సాగవు. నీలాంటి తోకలేని నక్క ఈ అడవిలోనే ఉండటానికి వీల్లేదు’’ అంటూ దాన్ని దూరంగా తరిమికొట్టేశాయి. నీతి: అతి తెలివి అన్నివేళలా పని చేయదు సరికదా ఒక్కోసారి అది అనర్థాలకు కూడా దారితీస్తుంది!

కాకి ఎద్దు - చిట్టి కథ


అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు గడ్డిని నెమరేస్తుండే ది. రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి

‘‘మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు, కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్లంతా హూనం చేసుకుంటున్నావు.

నీ గిట్టలన్నీ అరిగిపోయాయి. మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు! నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్కపెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు తెంచుకో! పచ్చికబయళ్లలో హాయిగా స్వేచ్ఛగా విహరించు’’ అంటూ హితబోధ చేసింది.

అంతా విన్న ఎద్దు ‘‘మిత్రమా! నీవ నుకుంటున్నట్లు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు’’ అని తాపీగా చెప్పింది.

ఆ మాటలతో కాకికి కళ్లు తెరుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
నీతి: ఇతరుల దగ్గర్నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండికన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్న. 

వద్దంటే సంపద


 వలీదాద్‌ వడ్రంగి పని చేసేవాడు. అతనికి నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. అతను సంపాదించిన దాన్లో ఎక్కువ ఖర్చయ్యేది కాదు. మిగిలిన డబ్బంతా ఒక పాత్రలో వేసి దాచిపెట్టేవాడు. ఎవరికే సహాయం కావాలన్నా చేసేవాడు. ఊళ్లో అందరికీ తల్లో నాలుకలా మెలిగేవాడు. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు.
అదే వూరి వాడైన సాహెబ్‌కి వలీ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందరూ వలీనే పొగుడుతున్నారని అసూయపడేవాడు. ఎలాగైనా ఊరందరి ముందు వలీని చెడ్డవాడిగా చిత్రించాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలేవీ ఊరి ప్రజలు నమ్మేవాళ్లు కాదు.
కొన్ని రోజులకు వలీ దాచుకున్న డబ్బుతో పాత్ర నిండిపోయింది. 'వెంటనే దీన్ని ఖాళీ చెయ్యాలి. లేకపోతే ఇకపై సంపాదించేది దాచడానికి వేరే పాత్ర లేదు' అనుకున్నాడు వలీ.
ఆ పాత్రను ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లి అతని ముందు కుమ్మరించాడు. 'ఆ డబ్బుకు సరిపడా ఒక బంగారు కంకణం ఇవ్వమని కోరాడు.
అందంగా నగిషీలు చెక్కిన బంగారు కంకణం వలీకి ఇచ్చాడు నగల వ్యాపారి.
అయితే ఆ కంకణాన్ని ఏం చెయ్యాలో వలీకి అర్థం కాలేదు. తనెటూ పెట్టుకోడు కనుక ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఓ చెట్టుకింద కూర్చున్నాడు. అంతలో అతనికి ఒంటెల బారు, వీటిమీద సరుకులు, ఒక వర్తకుడు కనిపించాడు.
''అయ్యా! తమరెక్కడికి వెళ్తున్నారు?'' అడిగాడు వలీ.
''రాజమందిరానికి. యువరాజుగారు కొన్ని కొత్త దుస్తులు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అవి తీసుకెళ్తున్నా'' అన్నాడు వర్తకుడు.
''దయచేసి ఈ కంకణం అతనికి ఇవ్వండి. ఇది వలీ కానుక అని చెప్పండి'' అని ఆ కంకణాన్ని వర్తకుడికి అందజేశాడు.
వలీ పంపిన కంకణం యువరాజుకి ఎంతో నచ్చింది. ప్రతిగా అతను కొన్ని అందమైన సిల్కు వస్త్రాలు అదే వర్తకునితో పంపాడు.
వీటిని తీసుకుని తిరుగు ప్రయాణంలో వలీకి అందజేశాడు వర్తకుడు.
''వీటిని నేనేం చేసుకోను?'' అన్నాడు వలీదాద్‌.
''నీకు అవసరం లేకపోతే ఎవరికన్నా ఇవ్వు. యువరాజుగారు పంపించారు. నీను ఇస్తున్నాను. అంతే. ఇక వాటిని ఏమైనా చేసుకో'' అన్నాడు వర్తకుడు.
''ఎవరికి ఇవ్వను? నాకెవరూ లేరు. ఇటువంటి సిల్కు దుస్తులు నేనెప్పుడూ వేసుకోలేదు. వీటిని ఎవరికి ఇస్తే బాగుంటుందో నువ్వే చెప్పు?'' అన్నాడు వలీ.
''పక్కరాజ్యంలోని సుల్తాన్‌ మహారాజుకు ఇవ్వు. ఆయనికి ఇటువంటి సిల్కు దుస్తులంటే చాలా ఇష్టం. వీటిని తప్పక తీసుకుంటారు. నీకు మంచి బహుమానం ఇస్తారు'' చెప్పాడు వర్తకుడు.
బహుమానం అవసరం లేదు. వీటిని తీసుకుంటే చాలనుకుని, వర్తకుడు చెప్పిన ప్రకారమే వాటిని సుల్తాన్‌ మహారాజుకి పంపించాడు వలీ.
వాటిని చూసి సుల్తాన్‌ చాలా సంతోషించాడు. వాటికి బదులుగా ఆరు మేలుజాతి గుర్రాలను వలీకి కానుకగా పంపించాడు.
వాటిని ఏం చేసుకోవాలో తెలీక తిరిగి యువరాజుకి పంపించాడు వలీ.
''ఈ వలీ ఎవరు? నాకెందుకు కానుకలు పంపిస్తున్నాడు?'' యువరాజు తన స్నేహితులను అడిగాడు.
''ఇతనెవరో తన సంపదతో మీ మనసు చూరగొనాలని ఇలా విలువైన కానుకలు పంపుతున్నాడు. ఈ సారి అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప కానుక పంపించండి. దాంతో అతని గర్వం అణుగుతుంది'' అన్నారు వాళ్లు.
వెంటనే వలీకి 20 గుండిగల నిండా వెండి నాణేలు పంపాడు యువరాజు.
''ఒంటరిగా ఉండేవాణ్ణి. ఇంత సంపద నేనేం చేసుకోను'' అనుకున్న వలీ దాన్ని సుల్తాన్‌ మహారాజుకు పంపించాడు. అంత సంపదను చూసి సుల్తాన్‌ ఆశ్చర్యపడ్డాడు.
''ఈ వలీ ఎవరు? నాకెందుకు ఇన్ని కానుకలు పంపిస్తున్నాడు? అని సుల్తాన్‌ తన సలహాదారుణ్ణి అడిగాడు.
ఇతనెవరో చాలా గొప్ప ధనవంతుడిలా ఉన్నాడు. తన సంపదతో మీ మనసును ఆకట్టుకోవాలని, తన గొప్పను ప్రదర్శించుకోవాలని ఇంత విలువైన సంపదను పంపిస్తున్నాడు మహారాజా. అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప బహుమతిని పంపించండి. అప్పుడు మీరంటే ఏంటో అతనికి తెలుస్తుంది'' అన్నారు వాళ్లు.
20 గంగాళాల నిండా విలువైన రత్నాలు పంపించాడు సుల్తాన్‌.
ఇంత సంపద నేనేం చేసుకోను? అనుకున్న వలీ వాటిని తిరిగి యువరాజుకి పంపాడు.
ఇంత విలువైన రత్నాలు పంపించాడు... అసలు ఎవరితను? ఎలాగైనా అతన్నొక సారి చూడాలనుకున్న యువరాజు తన స్నేహితులను వెంటబెట్టుకుని వలీ ఉన్న ఊరికి వచ్చాడు. అలాగే సుల్తాన్‌ మహారాజు కూడా వలీని చూద్దామన్న కుతూహలం కొద్దీ తన అనుచరులతో బయల్దేరాడు.
ఎలాగో కష్టపడి వలీ ఇంటిదగ్గరికి చేరుకున్నారు యువరాజు, సుల్తాన్‌ మహారాజులు. కానీ అతను ఇంటిదగ్గర లేడు. అటుగా వెళ్తున్న సాహెబ్‌ని వలీ అంటే ఎవరని అడిగారు.
జరిగిందంతా తెలుసుకున్న సాహెబ్‌ తానే వలీనని చెప్పి వారి దగ్గర్నుండి విలువైన కానుకలు పొందాలనుకున్నాడు. వారి దగ్గరికి వెళ్లి తనే వలీనని చెప్పాడు కూడా. అది నిజమేనని నమ్మిన సుల్తాన్‌ మహారాజు, యువరాజులు అతనికి విలువైన కానుకలు ఇవ్వబోయారు.
అంతలోనే వలీ వచ్చి తన ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన సుల్తాన్‌, యువరాజులు నిజమైన వలీ ఎవరో తెలుసుకోవాలనుకున్నారు.
వెంటనే ఆ ఊరిపెద్దలను పిలిపించారు. వారు సాహెబ్‌ ఎటువంటి వాడో, వలీ ఎంత మంచివాడో చెప్పారు. నిజం తెలుసుకున్న మహారాజు, యువరాజు సాహెబ్‌ని వంద కొరడా దెబ్బలతో శిక్షించారు. వలీని తమ రాజ్యంలో కోశాధికారిగా నియమించాడు సుల్తాన్‌.
వలీ నిజాయితీ, నిస్వార్థం యువరాజుకి ఎంతగానో నచ్చాయి. అతణ్ణి తన స్నేహితుడిగా చేసుకున్నాడు.

సోమరి పని


సభలో కొలువుతీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి ''అయ్యా, మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్తవయసు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాడ్ని పోషించాల్సి వస్తోంది. ఏ పనికి వెళ్లమన్నా వెళ్లడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటివాళ్ళంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి, దారిలో పెట్టాలి'' అని వేడుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు.
''ఏంటి పాండయ్యా! ఏ పనీ చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా?'' అడిగారు రాయలువారు.
''అయ్యా! నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పట్నించీ పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పనిరాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు'' చెప్పాడు పాండయ్య.
''నేను నిన్ను పనిలో పెట్టుకుంటా'' అని చెప్పి...
భటులతో ''వీడ్ని తీసుకెళ్లి గుర్రపు శాలలో లద్దె ఎత్తించండి'' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు.
భటులు పాండయ్యని తీసుకెళ్లారు.
''మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనిమంతుడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్లండి'' అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు.
దండంపెట్టి వెళ్లిపోయారా దంపతులు.
లలల
తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య. ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు. తీరా చూస్తే అదంతా చిందర వందరగా, అసహ్యంగా ఉంది. ''నేనీ పని చెయ్యను. వెళ్లిపోతాను'' అని పేచీ పెట్టాడు.
''లద్దె ఎత్తి, పెంటదిబ్బ మీద పడేసి, గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో, పనిచేయకుండా రోజుకో వంద కొరడాదెబ్బలు తింటావో నీ ఇష్టం. నిర్ణయించుకో... ఇది రాజుగారి ఆజ్ఞ'' అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య.
''లద్దే ఎత్తుతాను. కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది. అసలే గారబంగా పెరిగాను'' అని తట్ట తీసుకుని లద్దె ఎత్తడం మొదలు పెట్టాడు పాండయ్య.
ఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహా కనిపించింది. చప్పుడు చేయకుండా, ఎవరికీ కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య. ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. కాని దొరకలేదు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిడండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహా ఇచ్చాడు. పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది.
మరుసటి రోజు తెల్లవారు జామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహా కనిపించింది. దాన్నీ జేబులో వేసుకుని, గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు. అక్కడ దొరికే వరహాల కోసం, జ్వరం వచ్చినా, నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్లేవాడు. ఆ వరహా మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు. ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది. ఖాళీగా ఉండాలన్నా ఉండలేక పోతున్నాడు. వరహా దొరక్కపోయినా సరే ఎప్పటిలాగే పనిచేయసాగాడు. అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు.
ఆ రోజు పనికెళ్లిన పాండయ్యతో ''ఇంక నువ్విక్కడ పని చేయనవసరం లేదు. ఇంటికెళ్లి పోవచ్చు'' అన్నాడు గుర్రపుశాల కాపలా దారు కాంతయ్య.
పాండయ్య బేర్‌మన్నాడు. ఇంటికెళ్లి జరిగిన విషయమంతా చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడు. రాజుగారిని అడుగుదామని ముగ్గురూ సభకు వెళ్లారు.
''అయ్యా! మావాడు పనిచేసిన ప్రతిరోజూ గుర్రపుశాలలో ఒక వరహా దొరికింది. వరహా కోసం వాడు రోజూ పనికి వెళ్లాడు. ఈ వరహాలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి. కాబట్టి అవన్నీ మీకే చెందాలి. మొదటి రోజే ఇద్దామనుకున్నాను. కాని మావాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు'' అని మూడు వందల అరవై ఐదు వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు.
రాయలు చిన్నగా నవ్వాడు.
''తమరివల్ల మావాడి సోమరితనం పోయింది. పని లేకపోతే, పిచ్చివాడై పోతున్నాడు. ఇలా అర్థాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు. దయచేసి, ఏదో ఒక పని ఇప్పించి, మా కుటుంబాన్ని ఆదుకోండి'' అని వినయంగా నమస్కరించారా దంపతులు.
శ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి ''మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు. ఆ వరహాలన్నీ మీవే. పాండయ్య ఇంతకాలం పని చేసినందుకు ప్రతిఫలం. వాటితో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ బతకండి. చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు. కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను'' అని చెప్పాడు.

పేద గొప్ప - చిట్టి కథ


అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు. పెద్ద భవనం... బోలెడంత మంది పనివాళ్లు... ఇంటినిండా బంధుమిత్రులతో వైభవంగా జీవించేవాడు.
ఆ భవనానికి కొద్దిదూరంలో ఓ పేదవాడు. చిన్న పూరిగుడిసె... వారసత్వంగా వచ్చిన తోట... అందులో పండ్లచెట్లు, పూల మొక్కలు పెంచుతూ వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి ఫలసాయంతో పొట్టపోసుకునేవాడు.

ధనికుడికి ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోవడంతో కడుపునిండా తినడానికి, కంటినిండా నిద్రపోవడానికి నోచుకోలేదు. దాంతో అసంతృప్తితో బాధపడేవాడు. పేదవాడు మాత్రం ఎంతో హాయిగా, ఆనందంగా జీవించేవాడు. అన్నీ ఉన్న తనకు లేని సంతోషం ఏమీలేని ఆ పేదవాడికి ఎలా దక్కుతోందో తెలుసుకోవాలనుకున్నాడు ధనికుడు.

దాంతో ఓ రోజు పేదవాడి దగ్గరకెళ్లి, అతడి సంతోషానికి కారణమేంటో చెప్పమన్నాడు. కష్టపడి పని చేయటం, ఉన్నదానితో తృప్తి పడటమే తన ఆనందానికి కారణాలని చెప్పాడు పేదవాడు. ధనికుడు ఎంతో సంతోషంతో అతణ్ని తన ఇంటికి పిలుచుకెళ్లి, విందుభోజనం పెట్టి, వెయ్యి బంగారునాణాలు కానుకగా ఇచ్చాడు.

ఆ రోజు రాత్రి ధనికుడికి కంటినిండా నిద్రపడితే, తన దగ్గరున్న డబ్బును ఎవరైనా దోచుకుపోతారేమోనన్న భయంతో పేదవాడికి కునుకే కరువైంది. దాంతో అతడు మర్నాడు ఆ డబ్బు మూటను తిరిగి ధనికుడికిచ్చేసి వ చ్చేశాడు. ఆ రోజు యథాప్రకారం హాయిగా నిద్రపోయాడు.

తెలివి తక్కువ తోడేలు!

ఒక సముద్రతీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది. ఒకరోజు అది మాంసం కోసం అడవిలోకి వెళ్లింది. అక్కడ ఓ తోడేలు ఎదురుపడింది.
‘‘నక్కా నువ్వు ఎక్కడ ఉంటున్నావు?’’ అని అడిగింది తోడేలు.

‘‘నేను ఇక్కడికి దగ్గర్లో ఉన్న సముద్రతీరాన ఉంటున్నాను’’ అని జవాబిచ్చింది నక్క.
‘‘ఏంటీ? సముద్రమా? ఆ మాటే నేనిప్పటిదాకా వినలేదు’’ అని తోడేలు ఆశ్చర్యంగా చూసింది.
‘‘నా ముందంతా నీళ్లే. మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో. నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను’’ అని నక్క తోడేలును తన వెంట సముద్రతీరానికి తీసుకుపోయింది.

అవి రెండూ సముద్ర తీరం చేరాయి. అప్పుడు ఒక అల తీరంకేసి వ స్తోంది. ఆ కెరటాన్ని చూసిన నక్క ‘‘రా, కెరటమా రా, నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. వాడికోసారి కనిపించి మళ్లీ వెనక్కి వె ళ్లిపోవాలి’’ అంది. అల వచ్చి వెళ్లిపోయింది. తోడేలు విస్తుపోయింది.

‘‘కె రటమా... నువ్వు వచ్చిపోతుండు. నేనూ నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం’’ అని నక్క తోడేలుతో మాటల్లో పడింది. అలలు వస్తున్నాయి. పోతున్నాయి.
‘‘నీ అధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది. వెళ్లొచ్చా?’’ అనడిగింది తోడేలు. వెళ్లమంది నక్క.

సముద్రంలోకి అడుగుపెట్టిన తోడేలు కొంచెం దూరం వెళ్లిందో లేదో పెద్ద అలొచ్చింది. ఆ అల తాకిడికి తట్టుకోలేక పల్టీకొట్టింది. దాంతో ఊపిరాడక చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చింది.
నీతి: ఎవరైనా ఏదైనా చెప్పింది వినడం తప్పుకాదు. కానీ ఆ మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ముందు వెనుకలు ఆలోచించడం అవసరం.

బీర్బల్ కిచడి - అక్బర్ బీర్బల్ కథలు

పంచదార ఇసుక - అక్బర్ బీర్బల్ కథలు

మూడు బొమ్మలు - అక్బర్ బీర్బల్ కథలు

మూడు కాలాలు - అక్బర్ బీర్బల్ కథలు

మర్యాద రామన్న కథలు - మర్యాద రామన్న

మర్యాద రామన్న కథలు - వరప్రసాదం

పరమానందయ్య శిష్యుల కథ - జీబు టాబు 6

పరమానందయ్య శిష్యుల కథ - జీబు టాబు 5

పరమానందయ్య శిష్యుల కథ - జీబు టాబు 4

పరమానందయ్య శిష్యుల కథ - జీబు టాబు 3

పరమానందయ్య శిష్యుల కథ - జీబు టాబు 2

పరమానందయ్య శిష్యుల కథ - జీబు టాబు 1

పరమానందయ్య శిష్యుల కథ - మిస్టరీ 3

పరమానందయ్య శిష్యుల కథ - మిస్టరీ 2

పరమానందయ్య శిష్యుల కథ - మిస్టరీ 1

పరమానందయ్య శిష్యుల కథ - గుర్రం గుడ్డు

పరమానందయ్య శిష్యుల కథ - గురువుగారి కిడ్నాప్ 2

పరమానందయ్య శిష్యుల కథ - సూపర్ హీరోస్ 2

పరమానందయ్య శిష్యుల కథ - సూపర్ హీరోస్ 1

పరమానందయ్య శిష్యుల కథ - శిష్యులు రాకుమారి 2

పరమానందయ్య శిష్యుల కథ - శిష్యులు రాకుమారి

పరమానందయ్య శిష్యుల కథ - గురువుగారి కిడ్నాప్ 1

పరమానందయ్య శిష్యుల కథ - నిధి పార్ట్ 2

పరమానందయ్య శిష్యుల కథ - ఉగాది

పరమానందయ్య శిష్యుల కథ - నిధి

పరమానందయ్య శిష్యుల కథ - శిష్యరికం

పరమానందయ్య శిష్యుల కథ - సంజీవిని శంఖం

పరమానందయ్య కథ - గురువుగారి ఉంగరం

పరమానందయ్య కథ - మృదువుగా చెప్పాలి

పరమానందయ్య కథ - ప్రయాణంలో పకపకలు పార్ట్ 2

పరమానందయ్య కథ - జీబు పార్ట్ 1

పరమానందయ్య కథలు పార్ట్ 1

ఐకమత్యమే మహాభలం - పంచతంత్ర కథలు

కుందేలు తెలివి - పంచతంత్ర కథలు

నిదానమే ప్రధానం - పంచతంత్ర కథలు

పిల్లి పోరు - పంచతంత్ర కథలు

సింహం చిట్టెలుక - పంచతంత్ర కథలు

తెలివైన రైతు - అక్బర్ బీర్బల్ కథలు

చిట్టి చీమ - పంచతంత్ర కథలు

విక్రమార్కుడు - బేతాళ కథ

గంగ మంగ - పంచతంత్ర కథలు

కాకి తెలివి - పంచతంత్ర కథలు

మంచి మిత్రులు - పంచతంత్ర కథలు

కోనంగి - పంచతంత్ర కథలు

కోటి బావ, ముసలి మామ - పంచతంత్ర కథలు

పచ్చని చిలుక, నల్లని కాకి - పంచతంత్ర కథలు

పాల కడలి - పంచతంత్ర కథలు



పోకిరి నాని పిరికి తోడేలు - పంచతంత్ర కథలు

పుల్లని ద్రాక్ష - పంచతంత్ర కథలు