Pages

Saturday, August 18, 2012

చివరి కోరిక

శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపైవుంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ వున్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వున్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారికేసి చూసింది. రాయలు ఆమెదగ్గరగా వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరకీ వినిపించ లేదు కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటులుకేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరుగెత్తారు. అది మామిడిపళ్ళు దొరికే సీజను కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడిపండు పట్టుకొచ్చాడు (ఎలా సంపాదించాడని అడక్కండి. ఆ రోజుల్లో కూడా పళ్ళు పా డవకుండా జగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో). కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు.

అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక వుపాయం చెప్పారు “మహారాజా! తమ తల్లి గారి కర్మ పన్నెండో రోజున భ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది” అని.

ఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడిపళ్ళు తయారుచేయించమని హుకుం జారీచేసారు.

“వెయ్యి బంగారు మామిడి పళ్ళూ!! అంటే ఎంతో ఖర్చు. ఈ దుబరా ఆపుచేసే మార్గమేలేదా” అని ఆలోచించి ఇందుకు తగిన వాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా వుపాయం ఆలోచించమని కోరారు. రామకృష్ణుడు సరే అని తలవూపి వెళ్ళిపోయాడు.

రాయల వారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచివున్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి “అయ్యలారా! ఈపక్క గదిలోంచి వరసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలువారు బంగారు మామిడిపళ్ళు ఇస్తారు. అయితే ఒక షరతు. ఆగదిలో ప్రతివారి వంటిమీద వాతపెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడిపళ్ళు ఇస్తారు” అని ప్రకటించాడు.

కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు. మిగిలినవారు ఒక్కొక్కరే లోపలకి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు వుండి “అయ్యలారా! మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడిపళ్ళు ఇస్తారు ఆనక మీ యిష్టం” అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండువాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు. రాయలువారు అతనిచేతిలో ఒక బంగారు మామిడిపండు పెట్టారు.

“అయ్యా! నేను రెండువాతలు పెట్టించుకున్నాను. మరి తమరు ఒక్క టే ఇచ్చారు” అని తన వీపుమీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు.

రాయలవారు నిర్ఘాంతపోయారు. “వాతలేమిటి?” అని అడిగారు.

“అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభూ!” అన్నాడు బావురుమంటూ.

రాయలవారు కోపంతో రామకృష్ణుడు వున్న గదిలోకి వచ్చి, వాతలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణునికేసి చూసి “ఏమిటి కవీశ్వరా! ఈపని? మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు?” అని గద్దించి అడిగారు.

“మహాప్రభో! నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించినరోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాతపెట్టేలోగా అమె కాస్తా గుటుక్కుమంది. ఆమె చివరకోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ వుండగా తమరు తమ తల్లి గారి ఆత్మ తృప్తికోసం బంగారుపళ్ళు ఇస్తున్నారని విని, వాతలు పెడతానంటే ఎవరూ వప్పుకోరని, వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవచేసి ఈనిర్ణయం తీసుకున్నా” అన్నాడు రామకృష్ణుడు.

“వూరుకోవయ్యా! బ్రాహ్మణులకు వాతలపెడితే ఆమె వాతరోగం పోతుందా?” అన్నారు రాయలవారు కోపంగా.

“చిత్తం. తమ తల్లిగారి కోసం ఎన్నోలక్షలు ఖర్చుపెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే, వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభూ!” అన్నాడు రామకృష్ణుడు.

రాయలవారికి కనువిప్పు కలిగింది. వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణునికేసి చూడడానికి సిగ్గుపడి లోపలకి వెళ్ళిపోయారు.

తిమ్మరసు ఆనందంతో రామకృష్ణుని కౌగలించుకున్నాడు

చందు – సూర్య

అనగనగాఓఅందమైన అడవి. అక్కడ ఉన్నవన్నీసాదుజంతువులుమాత్రమే. అన్నీకలసికట్టుగా సంతోషంగాఆటపాటలతోకాలంగడపుతూఉండేవి. ఆఅడవిలోనేఉండేవనదేవత వాటికి ఏకష్టమూరాకుండాకంటికిరెప్పలాకాపాడుతూఉండేది.

అక్కడ అన్నింటికన్నాచిన్నదిచందూఅనేకుందేలు. చందూఅంటేఅక్కడివారందరికీభలేముద్దు. అదిఅస్తమానంగెంతులేస్తూఅల్లరిచేస్తూఆటలాడుతూఉండేది.

చందూఇంటిపక్కనేసూర్య అనేఏనుగుఉండేదిచాలాఎత్తుగా, బలంగాచూడగానేబాబోయ్అనిపించేలాఉండేదది. ఎవరన్నామాటవినకుండాసతాయిస్తేవాళ్ళ అమ్మలుఅదిగోసూర్యనిపిలుస్తాననగానేవెంటనేఅల్లరిమానేవాళ్ళు.

అదిఎవరైనాసాయంకావాలంటేచేసిపెట్టేది. అందరికీఇండ్లూఅవీ కట్టుకోవడానికిసాయపడేది.

చందుకుందేలుకిసూర్య ఏనుగంటేచెప్పలేనంత ఆశ్చర్యం. సూర్యాకిఉన్నంత బలంనాకుంటేనా! అనిఎప్పుడూఅనుకునేది.

రానురానూచందూప్రతిదానికీసూర్యాతోపోల్చిచూసుకోవటంఎక్కువైపోయింది. “నేనేమోచిన్నగాముద్దుగాఉన్నానునన్నుచూసిఎవరూబయపడరు, సూర్యాఘీంకరించిందంటేఅడవంతావినిపిస్తుంది, నేనుఎంత అరచినాఇంటిబయటకుకూడావినపడదు” అనుకుంటూబాధ పడుతూఉండేది.

ఆసూర్య ఏనుగుకికూడాచందూనిచూస్తేచెప్పలేనంత ఇష్టం. “అందరూదాన్నిముద్దుచేస్తారు, ఎంత బుజ్జిగాఅందంగామెరిసిపోతుందో. ఇప్పుడేఇక్కడ కనిపిస్తుంది అంతలోకేమాయమైమరోపొదకింద ఉంటుంది! అబ్బ ఎంత హాయిగాచలాకీగాపరుగులుపెట్టేస్తుందో! దానిచర్మంఎంత మృదువుగాఉందీ! తనకేమోగరుకుగాఅసహ్యంగాఉంది. దానిచెవులెంత అందంగాఉన్నాయి! తనకేమోచాటల్లాఏంబావోలేవు”. అనుకునేది.

ఓసారిచందూసూర్యామాటల్లోతమ మనసులోఉన్న సంగతితెలుసుకున్నారు. ఇంకేం! వాటికిబోల్డంత ఆనందంవేసింది. ఇద్దరూకలిసివనదేవత దగ్గరికిబయల్దేరారు. వనదేవత తోతమ బాధ చెప్పుకునితమనితమకిష్టమైనట్టుగామార్చమనికోరారు.

వనదేవత చాలామంచిదికదామరికాదనకుండాసూర్య శరీరంలోకిచందూని , చందూబుజ్జిశరీరంలోకిసూర్యనిమార్చేసింది.

రెండూమారిన తమ శరీరాలుచూసుకునిబోల్డంత ఆనందపడిపోతూఇంటిమొహంపట్టాయి.

చందూకిపెద్ద ఏనుగుశరీరంభలేవింతగాఅనిపిస్తూఉంది, నేలపైనుండితనుచాలాఎత్తులోఉండటంగమ్మత్తుగాఉంది. ఆరోజంతాతన్నితానుచూసుకుంటూ, చెట్లకొమ్మల్నితొండంతోపట్టుకుఊపుతూచిన్న చిన్నాజంతువుల్నిసరదాగాబెదరగొడుతూఅలాగడిపేసింది.

ఇక్కడ సూర్యకేమోచందూశరీరంతేలిగ్గాహాయిగాఅనిపించిందిఅడవంతాగెంతులేస్తూ, అందరిఇళ్ళలోగారాబాలుపోతూఆరోజుగడపింది.

అలాఓరోజుగడవగానేచందూకిఆశరీరంకాస్తాబోర్కొట్టడంమొదలైంది “ఏంటోగెంతులేయడంకుదరదు, పల్టీలుకొట్టలేనుఅడవంతాపరిగెత్తలేను, నాస్నేహితులతోఆడలేను. నన్నుముద్దుచేసేపిల్లలంతానేనుదగ్గరికివెళ్ళగానేభయపడిపోతున్నారు! “ అనుకుంది. ” ఆడుకోనీకుండాఅందరూఏదోఓపనిచెపుతూనేఉన్నారుఓరిదేవుడోయ్ఏనుగులాఉండడమంటేఇంత కష్టమనుకోలేదు. “ అనిఏడ్చేసింది.

ఈసూర్య ఏమనుకుందంటే” ఈచిన్న శరీరంలోఇరుక్కుపోయాను, తనివితీరానదిలోస్నానంచేసిరెండురోజులైపోయింది, హాయిగానాకిష్టమైన వెలగ పండ్లుచెట్లపైనుండికోసుకుతినేదాన్ని అస్తమానంఈక్యారెట్లూపచ్చిగడ్డీనమలలేక చస్తున్నానుబాబోయ్! అందరూనాసాయంకోరివచ్చేవాళ్ళు, ఇప్పుడెవరూనన్నుపట్టించుకోరు. అందరికీసాయంచేసివాళ్ళ మెప్పుపొందడంఎంత బావుండేదో! అనిదిగులుపడడంమొదలెట్టింది. పనిలేక మహాబోరుగాఉందిఈచిన్న చిన్న కుందేళ్ళ తోఎంత సేపనిఆడనూ! అనుకుందివిసుగ్గా.

చివరకిఎవరిశరీరంలోకివాళ్ళువెళ్ళిపోవాలనిఅనుకుని, ఇద్దరూకలిసివనదేవత దగ్గరికివెళ్ళి“అమ్మావేరేవాళ్ళలాఉండడంమాకేంబావోలేదుమమ్మల్నిముందులామార్చేసేయీ”అనివేడుకున్నాయి.

వనదేవత చాలామంచిదనిముందేచెప్పుకున్నాంకదా, వేంటనేతిరిగిఎవరిశరీరంలోకివాళ్ళనిచేర్చేసింది.

అప్పుడుచందూగెంతులేస్తూహాయిగాపరిగెత్తింది.

సూర్యానదిలోకిదిగినీళ్ళుచిమ్ముతూహమ్మయ్య! అనుకుంది.

అసలైన ఆనందం

ఒక అడవిలో ఓ పెద్ద మామిడి చెట్టుపై రెండు కోకిలలు గూడు కట్టుకుని ఉంటుండేవి. పాటలు పాడుకుంటూ, ఆటలాడుతూ సరదాగా అడవి అంతా తిరుగుతూ హాయిగా కాలం గడిపేవి. కొన్నాళ్ళకి కోకిలమ్మ నాలుగు గుడ్లు పెట్టింది. ‘ఇన్నాళ్ళూ మనిద్దరమే ఉన్నాం, ఇకపై మనకి చిన్న చిన్న పిల్లలు రాబోతున్నాయి’ అని సంతోషంగా అనుకున్నాయి అవి. కోకిలమ్మ ఆ గుడ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోసాగింది. కొత్తగా రాబోయే పిల్లలకు ఆ చిన్ని గూడు సరిపోదని తలచి ఆ చెట్టుమీదే మరో ఎత్తైన బలమైన కొమ్మల్లో ఇంకో కొత్త గూడు కట్టడం మొదలెట్టాడు కోకిలయ్య.

గుడ్లను వదిలి ఒక్క క్షణమైనా అవతలికి పొయ్యేది కాదు కోకిలమ్మ. వాళ్ళ ఆట పాటలు అన్నీ మానుకున్నారు ఐనా ఎంతో సంతోషంతో ఉండేవారు.

అలా కొద్ది రోజులు గడిచాక ఓ నాడు గుడ్డులోంచి ఒక పిల్ల బయటకు వచ్చింది. కోకిలలు ఎంతో సంబర పడ్డాయి. ఆరోజే కోకిలయ్య కడుతున్న గూడు కూడా పుర్తయ్యింది. ఆ కొత్త గూడు ఎంతో విశాలంగా, సౌకర్యంగా చాలా బావుంది. కోకిలమ్మ దాన్ని చక్కగా అలంకరించింది. కోకిలయ్య మెత్తటి పరకలూ, వాటి పై దూదీ వేసి చక్కటి పడకలు తయారు చేశాడు.

ఆ తరువాతి రోజు ఇంకో గుడ్డులోంచి, మరునాడు మరో గుడ్డులోంచి కూడా పిల్లలు బయటకి వచ్చాయి. అవి మెల్లిగా కళ్ళు తెరచి చూస్తూ కోకిలయ్య తెచ్చి అందించే ఆహారాన్ని తినటం నేర్చుకోసాగాయి.

నాలుగో గుడ్డులోంచి పిల్ల ఇంకా బయటకి రాలేదేమానని కోకిలమ్మ కంగారు పడసాగింది. “ఈ చివరి బిడ్డను కూడా మాకు భద్రంగా అందించు దేవుడా” అని దేవుడిని ప్రార్ధించాడు కోకిలయ్య.

మూడు పిల్లలూ మెల్లిగా లేచి నిలబడటం, అడుగులు వేయటం, చక్కగా ఆహారం తినటం నేర్చేసుకున్నాయి. చివరకు కొద్ది రోజుల తరువాత ఆ నాలుగో గుడ్డులోంచి కూడా పిల్ల బయటకి వచ్చేసింది. ’హమ్మయ్య’ అనుకున్నాయి కోకిలలు. చివరకు దక్కదేమో అనుకున్న పిల్ల దక్కింది’ అనుకున్నాయి ఆనందంగా.

రోజూ అందరికీ ఆహారం తెచ్చేవాడు కోకిలయ్య. కోకిలమ్మ గూడువద్దే ఉండి పిల్లలను భద్రంగా చూసుకునేది. చక్కగా నడవటం, రెక్కలను ఉపయోగించడం నేర్పించేది. నాలుగో పిల్లంటే అందరికీ చాలా ముద్దు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే వారు.

మెల్లిగా మూడు పిల్లలూ ఎగరడం నేర్చుకున్నాయి. నాలుగోది మాత్రం నేర్చుకోలేది. పోనీలే పాపం చిన్నపిల్ల అసలే అది అపురూపమైంది, మెల్లిగా నేర్చుకుంటుంది అని సరిపెట్టుకున్నాయి కోకిలమ్మా కోకిలయ్యా.

మూడు పిల్లలు ఆడే ఆటలతో, అవి నేర్చుకునే పాటలతో ఆ చెట్టు ఎంతో సందడిగా మారింది. మన చెట్టు ముందెన్నడూ లేనంత అందంగా ఉంది అనుకున్నాయి కోకిలమ్మా కోకిలయ్యా.

ఓనాడు కోకిలయ్య ఆహారానికి వెళుతూవుంటే “మేమూ వస్తాం” అన్నాయి పిల్లలు. కోకిలమ్మ ఎంతో సంతోషించింది. వాళ్ళను పంపుతూ తనూ కూడా వెళ్ళాలని అనుకుంది. కానీ ఆ చిన్న పిల్లేమో ఇంతవరకూ ఎగరడం నేర్చుకోలేదు. హాయిగా అమ్మనోట్లో పెడితే తినడం దానికెంతో బావుంది. అందరూ దానిని గారాబం చేశారు అందుకే దానికి కష్టపడటం ఇష్టంలేదు.

చిన్న పిల్లగురించి కోకిలయ్య ఎంతో దిగులు పడుతూ ఉండేవాడు.

రోజూలాగే ఓనాడు ముగ్గురు పిల్లలతో కలిసి అడవిలో తిరుగుతున్న కోకిలయ్యకి ఓచోట తన చిన్ననాటి నేస్తమైన చిలుక కనిపించింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. కోకిలయ్య తన ముగ్గురు పిల్లల్ని చిలుకకు చూపించాడు. నాలుగో పిల్ల గురించి తన బాధ చెప్పుకున్నాడు. “ఎంతో ఆనందంగా ఉన్నాము కానీ ఆ చిన్న పిల్ల భవిష్యత్తు తలచుకుంతేనే ఈ ఆనందమంతా ఎగిరిపోతూ ఉంది.” అన్నాడు.

దానికి చిలక “నీ చిన్న పిల్ల సంగతి నేను చూసుకుంటాను. నా దగ్గరో ఉపాయంవుంది.” అంటూ “ రేపు మీరంతా చిన్న పిల్లను ఒంటరిగా గూటిలోనే వదిలేసి ఆహారానికి వెళ్ళండి.” అంది.

“అమ్మో అసలే సరిగా ఎగరలేని పిల్ల దాన్ని వదిలేసి ఎలా అందరం వెళతాం ! దాని దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే ! వాళ్ళ అమ్మ పాటలు పాడుతూ దాన్ని కనిపెట్టుకుని ఉంటుంది.” అన్నాడు కోకిలయ్య.

“మరేం పరవాలేదు దాని దగ్గర నేను ఉంటాను. మీరంతా ఉదయాన్నే లేచి వెళ్ళిపొండి. మళ్ళీ చెపుతున్నా ఎవ్వరూ దాని దగ్గర ఉండొద్దు.” అంది చిలక.

చిలక మాటలపై కోకిలయ్యకు ఎంతో గురి. “అది చాలా తెలివైంది, తన పిల్లను బాగు చెయ్యగలదు” అనుకున్నాడు. “సరే నీమాటపై నమ్మకంతో నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నువ్వు రేపు పెందలాడే రావాలి, మేం తిరిగి వచ్చేదాకా పిల్ల దగ్గరే ఉండాలి సుమా!” అన్నాడు.

“నీకేం భయం అక్కర్లేదు. రేపు మీరు తిరిగి మీ గూడు చేరుకునే సరికి మీ పిల్లను ఎగిరేలా చేస్తాను. నువ్వే చూస్తావుగా.” నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయింది చిలక.

వాళ్ళ పధకం ప్రకారం మర్నాడు ఉదయాన్నే కోకిలయ్య కోకిలమ్మనూ ముగ్గురు పిల్లలను తీసుకుని ఆహారానికై అడవిలోకి వెళ్ళిపోయాడు. చెట్టుమీద గూటిలో చిన్నపిల్ల ఒంటరిగా ఉండిపోయింది.

అప్పటికే అక్కడికి వచ్చిన చిలక ఓ గుబురు కొమ్మ పై ఆకుల చాటున కూర్చుంది. గూట్లో చిన్న పిల్లకు ఒంటరితనం విసుగ్గా ఉంది. తనతో మాట్లాడేవాళ్ళు లేరు, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఏఅడవి పిల్లి, ఇంకేదైనా వచ్చి తనను తినేస్తుందేమో నని భయం! మెల్లిగా మధ్యహ్నాం అయ్యింది. గూట్లోని చిన్న పిల్లకు భయం విసుగు ఎక్కువైపోయాయి. బయట ఏ చిన్న శబ్దం ఐనా ఉలిక్కి పడసాగింది. ఇంకాసేపటికి ఎడవటం మొదలెట్టింది.

అంతదాకా ఆకులచాటున దాగి ఉన్న చిలక చిన్నపిల్ల ముందుకు వచ్చి “ ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది?” అని ప్రశ్నించింది.

చిన్న పిల్ల ఏడుపు ఆపి చిలకను చూస్తూ “నేనొక్క దాన్నే ఉన్నాను భయంవేసి ఏడుస్తున్నాను. ఇంతకీ నువ్వెవరు?” అంది.

“నన్ను చిలక అంటారు. నేను కోకిలయ్య నేస్తాన్ని. ఇలా ఈ దారిలో వెళూతూ ఉన్నాను, నీ ఏడుపు విని వచ్చాను. నువ్వు చక్కగా ఉన్నావు అందరితో పాటు బయటకి వెళ్ళకుండా ఒంటరిగా గూటిలో ఎందుకున్నావ్? అని ఏమీ తెలియనట్టు అడిగింది చిలక.

“నాకు ఇలా ఉంటేనే బావుంటుంది. అందుకే ఈ రోజు దాకా వాళ్ళతో వెళ్ళలేదు. అదీ గాక నాకు ఎగరటం అంటే విసుగు. కష్టపడీ అవన్నీ నేర్చుకునేది తిండి కోసమే కదా. నాకు అమ్మా నాన్నా ఎంచక్కా తెచ్చి పెడతారు, అందుకే నేను ఎగరడం నేర్చుకోలేదు. మా గూడు ఇంత అందమైంది దీన్ని విడిచి బయటకు వెళ్ళవలసిన అవసరం ఏముంది! హాయిగా మెత్తగా ఇలా పడకపై పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో.” అంటూ కారణం వివరించింది పిల్ల.

“అయ్యో నువ్వెంత అమాయకంగా ఉన్నావు! ఎగిరితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఇలా పడుకుంటే కలిగే హాయికంటే ఎక్కువ హాయిగా ఉంటుంది. పందేలు, పల్టీలు, ఉయ్యాల్లు ఇలా ఎన్నెన్ని రకాల ఆటలు ఆడవచ్చో నీకు తెలియదల్లే ఉంది! ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది.” అంటూ ఊరించి చెపుతున్న చిలక వైపు “నిజంగానా!” అన్నట్టు ఆశగా చూసింది పిల్ల.

“ఊ మరేం అనుకున్నావ్? బయటకెడితే అడవిలో ఎన్నెన్ని వింతలు చూడవచ్చు విసుగనేదే ఉండదు. వేటాడొచ్చు, రకరకాల తిండి తినవచ్చు. కొత్త కొత్త స్నేహితులు దొరకుతారు. వాళ్ళతో బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. ఎన్ని వింతలూ అందాలు చూడవచ్చు. గొంతెత్తి పాడితే, రెక్క విప్పి ఎగిరితే, అడవంతా షికార్లు కొడితే అదీ అదే అసలైన ఆనందం.” అంటూ చెప్పింది చిలక.

“నిజమా! ఐతే నేను ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటా. దయచేసి నాకు సహాయం చేయవా?” అంది పిల్ల.

సాయంత్రం అమ్మా నాన్నా అన్నలు వచ్చే సరికి ఎంచక్కా ఎగరటం నేర్చేసుకుని వాళ్ళని ఆనందంలో ఆశ్చర్యంలో ముంచెత్తాలని నిర్ణయించుకుంది చిన్నపిల్ల.

మిత్రలాభం — చిత్రాంగుని కథ

కాకీ, ఎలుక, తాబేలు కలిసిమెలసి సంతోషంగా కాలం గడుపుతుండగా ఓ నాడు ఓ లేడి అక్కడికి రొప్పుతూ పరుగుతో వచ్చింది. దాన్ని చూసి భయంతో ఎలుక కలుగులోకి, తాబేలు చెరువులోకి కాకి చెట్టుపైకి వెళ్ళిపోయాయి. ప్రమాదంలేదని నిర్ధారించుకుని తిరిగి అన్ని ఒకచోట కూడాయి. “నువ్వు ఎవరివి? ఇలా పరుగుతో ఇక్కడికి ఎందుకొచ్చావు?” అంటూ ఆ లేడి ని అడిగాడు మంథరుడు.

“నా పేరు చిత్రాంగుడు.నన్నొక వేటగాడు తరమగా ఇలా వచ్చాను.” అని చెప్పి వారి మిత్రుడిగా తననూ చేర్చుకోమనీ, అక్కడ తనకు ఆశ్రయం ఇవ్వవలసిందని అడిగిందా లేడి.

లేడి సాధు స్వభావి కనుక దాని స్నేహం ఒప్పుకో తగ్గదే నంటూ మాలో ఒకడిగా ఇక్కడే ఉండవచ్చు అని అంగీకరించింది తాబేలు.
అప్పటినుండీ ఆ నలుగురూ స్నేహితులుగా ఎంతో సఖ్యంగా ఉండసాగారు.

ఓనాడు బయటకి వెళ్ళిన చిత్రాంగుడు తిరిగి రాలేదు. మంథరుడు ఆందోళనపడసాగాడు. లఘుపతనకం చిత్రాంగుడి జాడకోసం వెతుకుతూ వెళ్ళింది.
దానికి ఓ చోట వేటగాడి వలలో చిక్కుకున్న లేడి కనిపించింది.

లేడి కాకితో ఈ వెటగాడు రాకముందే నేను బయట పడాలి. నువ్వు త్వరగా వెళ్ళి హిరణ్యకుడిని తీసుకురా. తను ఈ వలకొరికి నన్ను విడిపించగలడు. అంది.

లఘుపతనకం వెంటనే ఎగిరివెళ్ళి మిగతా మిత్రులతో ఈ సంగతి చెప్పి. హిరణ్యకుడిని తన వీపుపై కూర్చోబెట్టుకుని ఎగురుతూ వచ్చి లేడి వద్ద వాలింది. ఎలుక ఆ వలని ముక్కలుగా కొరికివేయగా చిత్రాంగుడు వలనుండి బయటపడ్డాడు.

ముగ్గురూ కలిసి తామున్న చోటికి బయల్దేరి వస్తుండగా. హిరణ్యకుడు చిత్రాంగుడిని . ” నువ్వెంతో తెలివైన వాడివి. ఇలా ఆపదలో ఎలా చిక్కుకున్నావు”? అంటూ అడిగాడు.

తెలివైనవాడైనా తెలివితక్కువ వాడైనా ఎప్పడు ఏ ఖర్మ అనుభవించాలో అది అనుభవించక తప్పదు. అనే మాటకు నా జీవితమే నిదర్శనము.

అంటూ తన కథను ఇలా చెప్పింది.

పంచతంత్రం – ౩

బాల్యంలొ అడవిలో నా జాతి వారితో ఆడుతూ హాయిగా స్వేచ్చగా ఉండేవాడిని. ఓ వేటగాడు పన్నిన వలలోని పచ్చికను చూసి దానికై వెళ్ళి ఆ వలలో చిక్కుకున్నాను. ఆ వెటగాడు నన్ను ఆ దేశపు రాజుగారి కొడుకుకి బహుమానంగా ఇచ్చాడు. సైనికులు నన్ను జాగ్రత్తగా చూసుకునే వారు వేళకు ఆహారం అందేట్టుగా చూసేవారు.

ఓరోజు ఊరుచూడాలని కోటలోంచి బయటకు వెళ్ళాను. వీధుల్లోని పిల్లలు నావెంటపడ్డారు. నేను భయంతో పారిపోయి అంత:పురంలోని తోటలోకి వెళ్ళాను. అక్కడి దాసీలు నన్ను పట్టుకుని ఓ చోట కట్టివేసారు. అప్పుడు పెద్ద వర్షం కురవడం మొదలెట్టింది. ఆ వర్షం చూస్తే నాకెంతో ఆనందం కలిగి ’ ఆహ్హా ఈ వర్షంలో తడుస్తూ అడవిలో స్వేచ్చగా గంతులేస్తూ ఉంటే ఎంతహాయిగా ఉంటుంది! ఆ అదృష్టం నాకులేదు! అన్నాను. రాజకుమారుడి గది పక్కనే ఉన్నది. నా మాటలు విని రాజకుమారుడు బయటకు వచ్చి ఒక లేడి మాట్లాడం చూసి ఆశ్చర్యపోయి జోతిష్యుడిని పిలిచి విషయం చెప్పాడు. మృగము మానవ భాషలో మాటలాడటం అరిష్టము. వెంటనే దీన్ని పంపించివేయండి. శాంతి జరిపించండి అన్నాడు ఆ జోతిష్యుడు. సేవకులు నన్ను అడవిలో వదిలేశారు. అప్పుడే మీరు నాకు తరసపడ్డారు. అంటూ తనకథను వారికి వినిపించాడు చిత్రాంగుడు.

అంతలో వీళ్ళకి మంథరుడు ఎదురు వచ్చాడు. “ఎందుకింత సాసం చేశావు? ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అంటూ ప్రశ్నించాడు హిరణ్యకుడు.

మీరు ఎంతసేపటికీ రాకపోయే సరికి మీకేం ప్రమాదం జరిందోనని ఆందోళనతో ఒక్కడినే ఉండలేక ఇలా వచ్చాను” అంది తాబేలు. నలుగురూ మాట్లాడుకుంటూ నడవసాగారు.

ఆవెటగాడు వీరిని అనుసరిస్తూ రావడం మొదలెట్టాడు. ఆ సంగతి ఎగురుతున్న లఘుపతనం కనిపెట్టి. “వేటగాడు వస్తున్నాడు పారిపొండి” అంటూ కేకలు పెడుతూ ఓ చెట్టుకొమ్మల్లో దాక్కున్నాడు. పక్కనే ఉన్న కలుగులోకి దూరి దాక్కున్నాడు హిరణ్యకుడు. చిత్రాంగుడు వేగంగా పారిపోయాడు. నేలపై వేగంగా నడవలేని తాబేలుమంథరుడు వేటగాడికి దొరికి పోయాడు.

వెటగాడు తాబేలుని పట్టుకుని ఓకర్ర కు కట్టుకిని ఆ కర్ర బుజంపై పెట్టుకుని వెళ్ళసాగేడు.
తమ మిత్రునికి కలిగిన ఆపద చూసి అందరూ ఎంతో విచారించారు.

హిరణ్యకుడు మంథరుడిని విడిపించడానికై ఒక ఉపాయం చెప్పాడు. అది అందరికీ నచ్చింది.
దాని ప్రకారం చిత్రాంగుడు వెటగాడు వచ్చేదారిలో అక్కడికి దగ్గర్లోని చెరువు గట్టుపై చచ్చిన వాడివలె పడుకున్నాడు. కాకి అతడిపై చేరి ముక్కుతో కళ్ళను పొడుస్తున్నట్టుగా నటించసాగాడు.
వేటగాడు ఒడ్డున చచ్చినట్టు పడిఉన్న లేడీని చూసి, దానికోసం తన చేతిలోని తాబేలును నేలపై జారవిడిచి లేడి వద్దకు వెళ్ళాడు.
హిరణ్యకుడు వెంటనే వెళ్ళి తాబేలుని కట్టిన తాళ్ళను కొరికివేశాడు. తాబేలు చట్టుకున చెరువులోనికి వెళ్ళిపోయాడు. లఘుపతనకం కావు మంటూ ఎగిరిపోయింది. ఆసందేశం విని చిత్రాంగుడు మెరపు వేగంతో పారిపోయాడు.

ఇలా ఈ కథ లన్నింటినీ రాజకుమారులకు చెప్పిన విష్ణుశర్మ. మంచి స్నేహితులను సంపాదించుకుని ఒకరికొకరు తోడుగా హాయిగా జీవించాలి. స్నేహితుల వలన కలిగే లాభం ఏమిటో తెలిసింది కదా. అంటూ మిత్రలాభం కథలని ముగించాడు.
అలాగే మంచివారితో మంచి జరిగినట్టే చెడు స్నేహాల వల్ల నష్టం జరుగుతుంది. చెడుస్నేహాల జోలికి పోవద్దంటూ. హితవు పలికాడు.

మిత్రలాభాన్ని తెలుసుకున్నాం. మిత్రభేదాన్ని గురించి చెప్పండి. అంటూ రాజకుమారులు విష్ణుశర్మని అడిగారు.

అలాగే అంటూ మిత్ర భేదాన్ని చెప్పసాగాడు విష్ణుశర్మ.

పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి…

అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక పిల్ల ఉంది. అది అల్లరిది .. దానికి తొందరెక్కువ.. చెప్పిన మాట వినదు.. ఒకరోజు దానికి పరమాన్నం తినాలనే కోరిక పుట్టింది..

అది అమ్మ దగ్గరకు వెళ్లి దాని కోరిక చెప్పింది.. పరమాన్నానికి పాలు, బెల్లం, జీడి పప్పు , నెయ్యి అన్నీ కావాలమ్మా, నాన్న రాగానే వండుతా అని చెప్పింది అమ్మ.

అయినా సరే ” ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి” ఏడుపు మొదలు పెట్టింది పిచ్చుక పిల్ల. చేసేది లేక వాళ్ళ అమ్మే అన్నీ తెచ్చుకుని వంట మొదలు పెట్టింది.

వంట చేస్తున్నంత సేపు పిచ్చుక ఎప్పుడు పెడతావ్? ఎప్పుడు అవుతుంది ? అని అమ్మను విసిగించడం మొదలు పెట్టింది.. పరమాన్నం వండి చిన్న గిన్నెలో దానిని వేసి. “వేడిగా ఉంది కొద్ది సేపు ఆగమ్మా” అని చెప్పింది తల్లి ..

“లేదు లేదు నేను ఇప్పుడే తింటాను” అని ముక్కు పెట్టింది పిచ్చుక .. దానికి బాగా కాలింది.. అది ఏడుస్తూ కూర్చుంది …
చెప్పిన మాట వినవు కదా అని అమ్మ దానికి చల్లార్చి ఇచ్చింది.. అయినా పిచ్చుకకు బుద్ది రాలేదు… నేను బయటకు వెళ్లి తింటాను అని మళ్లీ గొడవ మొదలు పెట్టింది..

వద్దమ్మా..నువ్వు చిన్న పిల్లవు..నీకు లోకం తీరు తెలియదు అని అమ్మ ఎంత చెప్పినా వినలేదు..

దాని గిన్నె ముక్కుతో పట్టుకుని ఒక పెద్ద చెట్టు పై కూర్చుని తినడం మొదలు పెట్టింది..

ఎక్కడినుండో ఒక కాకి వచ్చింది.. “ఓయ్ ఆ గిన్నె నాకు ఇచ్చి వెళ్ళిపో” అని పిచ్చుక పై అరిచింది కాకి..

“ఇది మా అమ్మ వండింది నేను ఇవ్వను ” అని పిచ్చుక గొడవ చేసింది.. ఆ పెనుగులాటలో మొత్తం క్రింద ఇసుకలో పడిపోయింది … కాకి కి కోపం వచ్చి పిచ్చుకను ముక్కుతో బాగా పొడిచి గాయ పరచి వెళ్ళిపోయింది..

పిచ్చుకకు బుద్ది వచ్చింది.. అమ్మ దగ్గరకు ఏడుస్తూ వెళ్ళింది..

అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి…

ఉత్తమ బోధన

ఒక గ్రామంలో దేవర్షి అనే గురువు వద్ద బాలరాజు, ద్రోణుడు విద్యనభ్యసించారు. శిక్షణ పూర్తికాగానే వారిద్దరూ వేర్వేరుగా ఆశ్రమాలు స్థాపించారు.

బాలరాజు తన శిష్యులకు శాస్త్రం బోధించి నేర్పించేవాడు. వాళ్ళ సమయం వృథాకాకుండా తన సమక్షంలోనే చదివించేవాడు. ఏదైనా మార్పుచేస్తే సహించేవాడు కాదు. తాను చెప్పిన శాస్త్రాన్ని వల్లె వేయించేవాడు. తాను చెప్పిందే తు.చ. తప్పకుండా చెప్పాలనేవాడు. ద్రోణుడు తమ శిష్యులను మిత్రుల వలే చూసేవాడు. వారు వారి పక్కవారిని అడిగి తెలుసుకొని, ఆ పైన సొంతంగా ఆలోచించి చదివేవారు. ఆ సంవత్సరం రాజస్థానంలో విద్యాసభలు జరిగాయి. బాలరాజు శిష్యులు శాస్త్రాన్ని పొల్లుపోకుండా చెప్పి అందరి మెప్పు పొందారు.

ద్రోణుడు శిష్యులు శాస్త్రాలలో ఉండే రహస్యాలూ, అనుపానులు అన్నీ చెప్పి లోపాలను ఎత్తి చూపారు. సవరణలు కూడా సూచించారు. రాజు వారి ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాజు వారికి కానుకలు బహుకరించాడు.

బాలరాజు వాళ్ళ గురువు అయిన దేవర్షి వద్దకు వెళ్ళి “గురుదేవా! నేను మా శిష్యులకు బాగా పాఠం చెప్పి క్షణం వృథా కాకుండా శిక్షణనిచ్చాను. అయితే నా శిష్యులకన్నా ద్రోణుడి శిష్యులకు మంచిపేరు ఎలా వచ్చింది? సెలవీయండి” అని అడిగాడు.

దానికి దేవర్షి చిరునవ్వు నవ్వాడు. “వత్సాబాలరాజా! నీవు శిష్యులకు బాగా బోధించావు. కాదనటం లేదు. కాని వాళ్ళ ఊహాశక్తికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి చిలుక పలుకుల్లా నీవు బోధించేదే వాళ్ళు అభ్యసించారు. అలాకాక ద్రోణుడు తాను బోధించి, ఆ తర్వాత వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు ఆలోచించి, అవగాహన చేసుకొన్నారు. యథేచ్చగా చర్చించుకొని శాస్త్రంలోని అంశాలు లోతుగా తెలుసుకొన్నారు. మళ్ళీ ప్రశ్నించి వాళ్ళు తెలుసుకొన్న దానికి తుది మెరుగులు దిద్దుతాడు గురువు.

“ఆచార్యాత్ పాదమాదత్తె
పాదం శిష్యః స్వమేధయా!
పాదం సత్ బ్రహ్మ చారిభ్యః
పాదం కాలక్రమేణచ॥
అనే శ్లోకం వినలేదా!” అన్నాడు.

(శ్లోకం భావం; గురువు శిష్యునికి అందించే జ్ఞానము ఒక పావు భాగము మాత్రమే. శిష్యుడు సొంత తెలివి తేటలతో నేర్చుకొనేది మరో పావు భాగం. ఇక సమవయస్కులతో నేర్చుకొనేది మరొక పావు భాగం. మిగతా పావు భాగాన్ని కాలక్రమేణా అనుభవాలతో నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు. ఇదీ మన విద్యతత్వం)

దాంతో బాలరాజు తాను చేసిన పొరపాటేమిటో తెలుసుకొని, సిగ్గుతో తలవంచుకున్నాడు.

పని లోనే అందం

ఓ ఓళ్ళో ఓ కమ్మరి ఉండేవాడు. ఓసారి ఒక ఇనుప ముక్కతో రెండు నాగలి కొర్రులు తయారు చేశాడు. రెండిటిలో మొదటి దాన్ని ఓ రైతుకి అమ్మివేశాడు. అది చూసి రెండో నాగలి కొర్రు “నన్ను అమ్మొద్దు, నాకు పని చేయడం ఇష్టం లేదు. నీ దగ్గరే నన్ను ఉండనివ్వు” అని కమ్మరిని అడిగింది. కమ్మరి సరే నని ఆ రెండో దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు.

కొంత కాలం గడిచాక ఓ రోజు రైతు తను కొనుక్కున్న ఆ మొదటి నాగలితో కొర్రు తో కమ్మరి వద్దకు వచ్చాడు. ఆ కొర్రు తయారైన నాటి కంటే నిగ నిగ లాడుతూ పదును తేరి, ఎంతో అందంగా కనిపించింది.

కమ్మరి వద్దనున్న కొర్రు మాత్రం తుప్పు పట్టి ఓ మూలన పడి ఉంది.

“మనిద్దరినీ కమ్మరి ఒకేసారి తయారు చేశాడు ఒకే ఇనుప ముక్కనుండి పుట్టిన వాళ్ళం. నేను తుప్పు పట్టి ఈ స్థితిలో ఉన్నా! నువ్వు మెరిసి పోతున్నావ్. మొదటి కంటే అందంగా తయారైపోయావు! కారణం ఏమిటని?” అడిగింది రెండో నాగలి కొర్రు మొదటి నాగలి కొర్రుని

“పని చేస్తూ ఉంటాను కాబట్టి నేనిలా అందంగా పదునుగా ఉన్నాను. నువ్వు పనిలేక ఉంటావు గనక తుప్పుపట్టి నీరసించి పోయావు. పని చేయటంలోనే ఆనందం, ఆనందంలొనే అందం ఉంది.” అంది మొదటి కొర్రు.

దానితో రెండో నాగలి కొర్రు తన పొరపాటుని గ్రహించి, తననూ బాగు చేసి ఎవరైనా రైతు కి అమ్మివేయమని కమ్మరితో చెప్పింది.

గర్వము దరి చేరరాదు

అదొక పల్లెటూరు. అపుడే సూర్యుడస్తమించాడు. చీకటి నలుదెసల అలముకుంటున్నది. వీధి దీపాలు లేని కుగ్రామమది. పొలాలకు వెళ్ళిన కర్షకులు గేదెలను తోలుకొని ఇళ్ళకు చేరుతున్నారు. దోవ సరిగా కానరావడం లేదు. మిణుగురు పురుగులు ఆ చీకటిలో ఎగురుతూ అందమైన కాంతులనిస్తున్నాయి. “మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని గర్వంతో ఎగురుతున్నాయి.

కొద్దిసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమని ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాల వెలుగులో కొద్దిగా దోవ కనిపిస్తూ వున్నది. తమకంటే ఎక్కువ కాంతినిచ్చే నక్షత్రాలు ప్రకాశించడం వలన మిణుగురు పురుగుల గర్వమణిగింది. అపుడు”ఈ చీకటిలో మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని నక్షత్రాలు గర్విస్తున్నాయి.

మరికొంతసేపటికి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించి పిండారబోసినట్లు వెన్నెలను నలుదిక్కులా ప్రసరింపజేస్తున్నాడు. తమకంటే ఎక్కువ వెలుగునిచ్చే చంద్రుడు ప్రకాశించుటవలన నక్షత్రముల గర్వమణిగిపోయినది. అపుడు “నేను వెన్నెలనిస్తున్నాను, నేను వెన్నెలనిస్తున్నాను” అని చంద్రుడు గర్వించాడు. తన వలననే భూమి మీద జనులు వెన్నెట్లో తిరగగలుగుచున్నారని భావించాడు.

కొలది గంటల పిదప తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించాడు. అంతటితో చంద్రుని గర్వం తగ్గిపోయింది. ప్రకాశాన్ని కోల్పోయి చంద్రుడు వెలవెలపోయాడు. ప్రకృతిలోని ఈ సన్నివేశాన్ని గమనించి ఎవరూ తమకు విద్య ఉన్నదనీ, అందం ఉన్నదనీ, ధనమున్నదనీ గర్వపడకూడదు. విద్యార్థులు తమకంటే అధిక విద్యావంతులతో పోల్చుకొని గర్వాన్ని దూరం చేసుకోవాలి. గర్వం అభివృద్ధికి అడ్డంకిగా ఉంటుంది.

సరైన మార్గం

గిరి సీతానగరం హై స్కూలులో ఎనిమిదవ తరగతిలో కొత్తగా చేరాడు. ఆటలలో ప్రావీణ్యం చూపడంతో, చేరిన కొద్దిరోజులకే గిరి స్కూలులో అందరినీ బాగా ఆకట్టుకొన్నాడు.

స్కూలులో త్రైమాసిక పరిక్షలు జరుగుతున్నాయి. “గిరీ ఏమిటి నువ్వు చేస్తున్న పని, తప్పు కదు,” గద్దించారు (పర్యవేక్షకుడి) గా వచ్చిన లెక్కల మాస్టారు. పక్క విద్యార్థి జవాబు పత్రం నుంచి కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్న గిరి తల దించుకుని “క్షమించండి సార్! నేను సరిగా చదవలేదు. మార్కులు బాగా రాకపొతే మా అమ్మ- నాన్న గారు తిడతారు. అందుకని ఇలా చేసాను. ఇంకెప్పుడూ ఇలా చేయను మాస్టారు” అన్నాడు.

పరీక్ష రాయడం ఆపి గిరికేసి చూస్తున్న మిగతా విధ్యార్థులను పరిక్ష రాయమని హెచ్చరించి, పరిక్ష అయిపోయాక ఇంటికి వెళ్ళేముందు తనను కలిసి వెళ్ళమని గిరితో చెప్పి పరిక్ష రాస్తున్న విధ్యార్థులను గమనించసాగారు లెక్కల మాస్టారు. పరీక్ష అయిపోయాక, ఇంటికి వెళ్ళేముందు స్టాఫ్ రూమ్ కి వెళ్ళి లెక్కల మాస్టారిని కలిసాడు.

“మాస్టారు, దయచేసి ఈ విషయాన్ని మా అమ్మ, నాన్న గారికి చెప్పకండి” అంటూ బ్రతిమిలాడాడు.

“నువ్వు చాలా తెలివైన వాడివని విన్నాను. మరి ఇలా చేసావేమిటి? నీకు కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిజం చెపితే మీ వాళ్ళకు పిర్యాదు చెయ్యను. అసలు కారణం చెప్పు” అని అడిగారు లెక్కల మాస్టారు.

“కొన్ని పాఠాలు అర్ధం కాలేదు మాస్టారు. క్లాసులొ సందేహాలు అడుగుదామంటే మిగతా పిల్లలు నవ్వుతారేమో అని సంకోచించాను. వాటిని చదవకుండా వదిలేసాను. పైగా పరీక్షల ముందు టీవీలొ క్రిక్రెట్ మ్యాచ్ లు చూసాను. దాంతో పరీక్ష ముందు చదువుదామనుకున్నా ప్రశ్నలకు జవాబులు చదవలేక పోయాను. అందువల్ల ఇలా కాపీ కొట్టి మార్కులు పొందాలని ప్రయత్నించాను మాస్టారు” అని నిజాయితీగా తన తప్పు ఒప్పుకున్నాడు గిరి.

“చూడు గిరీ, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. ఇలా కాపీ కొట్టి మార్కులు సంపాదించుకొంటే అది తాత్కాలిక విజయం మాత్రమే! అది ఇప్పుడు నీకు, మీ వాళ్ళకు సంతొషాన్ని కలిగించినా, భవిష్యత్తులొ నీకు ఏ మాత్రం ఉపయోగ పడదు. కాపీ కొడితే మార్కులైతే సాధిస్తావేమో కానీ, ఆయా పాఠాలపై ఎప్పటికీ పట్టు సాధించలేవు. వాటిలోని విజ్ఞానాన్ని గ్రహించలేవు. పైగా ఈ సారి కాపీ కొట్టడంలొ సఫలమైతే, మరోసారి లేదా ప్రతీసారీ దానికే అలవాటు పడిపోతావు. అప్పుడు నీ భవిష్యత్తు ఏమిటి? తెలివితేటలు, జ్ఞాపకశక్తి, కస్టపడేతత్వం ఇలాంటి సుగుణాలన్నీ మరుగున పడిపోయి, నువ్వు ఇతరులపై ఆధార పడిపోయే వ్యక్తిలా మిగిలి పోతావు. నువ్వు ఇలా తయారవ్వాలని మీ తల్లి దండ్రులు కోరుకోరు కదా” అడిగారు లెక్కల మాస్టారు.

ఈ సంభాషన అంతా వింటున్న మరో మాస్టారు ” ఇంత వివరణ ఎందుకు మాస్టారు నాలుగు దెబ్బలు వేస్తే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయడు” అని అన్నారు. “అన్ని సంధర్భాలలోనూ దండన అవసరంలేదు మాస్టారు” అన్నారు లెక్కల మాస్టారు. ఆయనే మళ్ళీ మాట్లాడుతూ “గిరీ, విజ్ఞానాన్ని కష్టపడి గ్రహించాలి కానీ ఇలాంటి తప్పుడు పద్దతుల వల్ల కాదు. పాఠాలలోని విజ్ఞానాన్ని గ్రహించాలంటే క్లాసులో పాఠాలు శ్రద్దగా వినాలి. ఏవైనా సందేహాలుంటే, వెనుకాడకుండా వాటిని నివృత్తి చేసుకోవాలి. ఏ రోజు చెప్పిన పాఠాలు ఆరోజే చదువుకోవాలి. అలా ముఖ్యంగా విద్యార్థి దశలో క్రమశిక్షణ చాలా అవసరం. సమయాన్ని వృధాచేయకుండా, చదువుకు, మానసిక అభివృధ్ధికి ఉపయోగించుకొవాలి. అప్పుడే మీ తల్లి దండ్రులు ఆశించినట్టు నువ్వు జీవితంలో అభివృద్ధిలోకి వస్తావు” అని వివరించారు.

తన భావి జీవితాన్ని సరైన మార్గంలొ నడిపించడం కోసం, మాస్టారు చేసిన విలువైన సూచనను గ్రహించిన గిరి, ఆ తరువాత ఎప్పుడూ కాపీ కొట్టకుండా, కష్టపడి చదువుకున్నాడు.

అందిన ద్రాక్ష

” తాతయ్యా ..!తాతయ్యా..! ” అం టూ పిల్ల నక్క పరుగెట్టుకొచ్చింది, తాత నక్క దగ్గరకు.

” ఏంట్రా… చిన్నోడా..ఆ హడావుడి…” పిల్ల నక్కను పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది తాత నక్క.

”తాతయ్యా..! నిన్న నేనూ నా ఫ్రెండ్స్ కలసి అలా షికారు కెళ్ళాం . అక్కడ ఒక ద్రాక్ష తోట విరగ పండి వుంది తాతయ్యా..! గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతూ వుంది. దాన్ని చూడగానే నోరుఉరిందంటే నమ్ము….! ” అంది.

” నిజమే..! ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ..ఎవరికైనా నొరూరు తుంది. ” అంది తాత నక్క గతాన్ని గుర్తుకు తెచ్చు కుం టూ.

”నాకూ నోరూ రింది తాతయ్యా..! కానీ ఆ ఎర్ర నక్కొడు, పీసు నక్కొడు, తొర్ర నక్కొడు ద్రాక్ష పుల్లగా వుంటుందని…వాళ్ళ నాన్నలు చెప్పారని చెప్పారు. ఏంటి తాతయ్యా…ద్రాక్ష తియ్యగా వుండదా…? ” అడిగింది పిల్ల నక్క.

తాత నక్కకు ఏమి చెపాలో తోచ లేదు. ద్రాక్ష రుచి తనకూ తెలియదు. ఆ రోజుల్లో ద్రాక్ష తినాలని ఎంతగానో ప్రయత్నించి, వీలుకాక వదిలేసిన సంగతి గుర్తుకొచ్చింది. ఎగిరి ఎగిరి .. అందుకోలేక …వెల్లికిలా పడి, నడ్డి విరగ్గొట్టుకుని వెనక్కి వచ్చేసిన తను. …, ఆ రోజు నక్కలకి రాజైన తనే దానిని అందుకోలేక పోవటం తో , మిగిలిన నక్కలకు…’ అందని ద్రాక్ష పుల్లన ‘ అనే పుల్లటి అబద్దం చెప్పడం జరిగింది.

” ఏంటి తాతయ్యా ..ఆలోచిస్తున్నావ్…? ”

ఆలోచనల నుండి బయటకు వచ్చిన తాత నక్క ..” దాని రుచి నాకు మాత్రం ఏమి తెలుసురా..చిన్నోడా..! అందరు పుల్లన అంటా వుంటే..నేనూ అలాగే అనుకున్నాను. తింటే గాని రుచి తెలియదు…”

”అయితే నువ్వు కూడా యెప్పుడూ ద్రాక్ష తిన లేదా..? ”

” ప్రయత్నించాను…. కానీ, కుదర లేదు…”అని, తన అనుభవాన్ని .. ప్లాష్ బ్యాక్ స్టోరీ లాగ పిల్లనక్కతో చెప్పింది.

అది విన్న పిల్ల నక్కకు పట్టుదల పెరిగింది. తన తాత సాధించ లేనిది …. తను సాధించాలి..! తన జాతికి అందనిదిగా మిగిలిపోయిన పనిని తాను సాధించి తీరాలి. తన నిర్ణయం తాత తో చెప్పింది.

తాత నక్క నవ్వింది.

”చిన్నోడా..! మన జాతిలో ఎవరూ ఇప్పటిదాకా ద్రాక్ష తిన లేదు. నీకెందు కంత పట్టుదల …. వదిలేయ్..” అంది.

” లేడుతాతయ్యా..! ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. ఈ రోజు రాత్రికి నాతొ రా..! సాధించి తీరుతాను…” పట్టుదలగా అన్న పిల్లనక్క మాటలకు బదులు చెప్పలేక ” సరే,,! ” నని అంది తాత నక్క.
రాత్రి బాగా పొద్దు పోయాక తాతా మనవాళ్ళు బయలుదేరాయి. ద్రాక్ష తోటను చేరుకున్నాయి. తలెత్తి ద్రాక్ష గుత్తుల వంక చూసాయి. అవి ఎత్తులో వేలాడుతున్నాయి. పిల్ల నక్క ఎగిరి అందుకోవాలని రెండు సార్లు ప్రయత్నించి విఫల మైంది.

అది తన గత అనుభవమే..! నవ్వుకుంది తాత నక్క. ” వెళదాం రా..రా ..చిన్నోడా..! చెపితే విన్నావు కాదు..” విసుక్కొంది.

”తొందరేంటి..తాతయ్యా…! కాసేపాగు . ప్రయత్నించాలి…” పట్టుదలతో చెప్పింది పిల్ల నక్క.

విధి లేక ఓ చోట కూలబడింది తాతనక్క . ఎలా సాధించాలి… …అనే ఆలోచనలో పిల్లనక్క ..పరి పరి విధాలా ఆలోచించింది. చుట్టూ పరిశీలించింది. మెదడుకు పదును పెట్టింది.

పిల్లనక్క ఈ తరాని చెందింది. బుద్ధిబలం పెరిగిన తరానికి చెందినది. దాని బుర్రలో ప్లాష్ లా ఓ ఉపాయం …వెలిగింది.
గబ గబ ఆ వైపు నడిచింది. అక్కడ పెద్ద పెద్ద గంపలు వున్నాయి.

పండిన ద్రాక్ష తీసుక వెళ్ళటానికి క్రితం రోజు తోట యజమాని వాటిని తీసుకుని వచ్చాడు. కొన్ని గంపలతో క్రితం రోజు ద్రాక్ష తీసుకెళ్లగా మిగిలిన గంపలను ప్రక్కన పడేసి వెళ్ళాడు..

వాటి లోంచి ఒక గంపను లాక్కువచ్చింది పిల్లనక్క. గంపను ద్రాక్ష గుత్తుల క్రిందుగా బోర్లించింది.

పిల్లనక్కను తాతనక్క ఆశ్చర్యంగా చూస్తోంది.

బోర్లించిన గంప మీదికి ఎక్కింది పిల్లనక్క. దానికి ఇప్పుడు ద్రాక్ష గుత్తులు అందుతున్నాయి.

పిల్లనక్క కళ్ళలో సాధించాననే ఫీలింగ్… ! తాత నక్క కళ్ళలో ఆశ్చర్యం.. ఆనందం …!!

గబ గబా ద్రాక్ష గుత్తులు కోసింది. కడుపారా తిన్నాయి.

కొంత నోటితో పట్టుకుని అడవి వైపు పరుగు తీసాయి.

తాత నక్క గర్వపడింది….తను సాధించ లేనిది..తన మనవడు సాధించాడు…!

” అందిన ద్రాక్ష పుల్లనా .. తీయనా…!! ‘.. నక్కల నడిగి తెలుసుకుందాం…!

చెలిమి చేసిన మేలు

పినాకిని నదీ తీరం లోని ఒక ప్రదేశములో కొన్ని ఎలుకలు స్థావరం గా చేసుకొని , చుట్టుపక్కల దొరికిన ఆహార ధాన్యాలు తిని తిరుగుతూ వుండేవి. వాటిలో ఒక ఎలుక పిల్లకు హుషారు ఎక్కువ. ఎప్పుడూ ఆ పరిసరాల్లోనే తిరుగుతూ వున్నందున దానికి విసుగు పుట్టి ….అలా .. అలా తిరిగి ఏదైనా కొత్త ప్రాంతం చూడాలని , తోటి ఎలుకలు వారిస్తున్నా వినకుండా బయలుదేరింది.

కొత్త, కొత్త ప్రదేశాలను చూస్తూ ,ఎంతో వుత్సాహంగా …సాగిపొతూ వుంది. ఆ ఆనందం లో పరిసరాలను సైతం గమనించక పోవటముతో ఆహారము కోసము పొంచి యున్న ఒక పక్షి కంటిలో పడింది. తన కాళ్ళతో లటుక్కున ఎలుక పిల్లను పట్టేసింది పక్షి. ఉహించని పరిణామానికి బిత్తర పోయి కెవ్వున అరిచింది ఎలుకపిల్ల .

ఆ పైన తెప్పరిల్లి.. ” అయ్యో..అయ్యో..!నన్ను వదిలేయ్.. నీకు పుణ్యం వుంటుంది…’’ అంది ఎలుకపిల్ల.

“ పుణ్యం సంగతి దేవుడెరుగు..! రెండు రోజుల నుండి నేను … నా పిల్లలు తిండి దొరక్క అల్లాడిపోతున్నాము. లడ్డులా దొరికావు నిన్నెలా వదలను..” అంది పక్షి.

అంతలో అక్కడకు పక్షి పిల్లలు ఎగురుతూ వచ్చాయి. వాటిని చూసిన పక్షి. . “ ఇదిగో పిల్లలూ ..! మనకు మంచి ఆహారం దొరికింది. రండి… తిందురు గాని…” అని పిలిచింది .

” అమ్మా..పక్షి తల్లీ..! నాకు మరి కొంత కాలము బ్రతకాలని వుంది. దయ చేసి నన్ను వదలిపెట్టు…” ఎలుక పిల్ల దీనంగా ఏడుస్తూ …పక్షిని బతిమలాడ సాగింది.

ఆ దృశ్యం చూసిన పక్షి పిల్లలకు ” అయ్యో….! ” అనిపించింది.

” పోనీలేమ్మా అది భయపడి ఏడుస్తూ వుంది..మరికొంత కాలం బ్రతకాలని ఆశ పడుతూ వుంది. పాపం వదిలి పెడదాము..” అన్నాయి పక్షి పిల్లలు.

” వదిలి పెడితే మనకు ఆహారము ఎలా..?” అడిగింది పక్షి .

” పిల్లలూ మీరైనా మీఅమ్మతో చెప్పి నన్ను వదిలి వేయరూ….! మీరూ ..నేనూ.. నేస్తాలుగా వుందాము..” అంది. పక్షి పిల్లల మనసు కరిగింది. వాళ్ళమ్మను ఒప్పించి …ఎలుకపిల్లను విదిపించాయి. ఆ తర్వాత ఎలుక పిల్ల అక్కడే వుండిపొయింది. పక్షి పిల్లలతో చెలిమి చేసింది.

ఇలా వుండగా ఒక రోజున ఒక వేటగాడు వచ్చి పక్షుల కోసం వల పన్నాడు. అది తెలియని పక్షి పిల్లలు అందులో చిక్కుకు పోయాయి. తప్పించు కోలేక బిగ్గరగా అరవసాగాయి. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చి వలలోచిక్కుకుని వున్న తన నేస్తాలను చూసి, గబగబా పరుగెత్తుకొచ్చింది.

” నేస్తాలూ..భయపడకండి ..” అని, ధైర్యం చెప్పి, గబ గబ తన పదునైన పళ్ళతో వల తాళ్ళను పట పట కొరికి వేసింది. పక్షి పిల్లలు క్షేమంగా బయట పడ్డాయి.

సాయంత్రం పక్షి ఇంటికి రాగానే విషయమంతా చెప్పి , ” అమ్మా..! ఎలుకన్నతో చెలిమి చేయబట్టి మనకు ఎంతో మేలు జరిగింది. లేకపోతె ఈ పాటికి మా ప్రాణాలుపోయి వుండేవి..” అన్నాయి పక్షి పిల్లలు.

” నిజమే మరి.. ! ” అంది పక్షి. తన పిల్లలను సమయానికి రక్షించిన ఎలుక పిల్లకు కృతజ్ఞతలు తెలిపినది. అప్పటి నుండి వాటి మధ్య చెలిమి మరింతగా బలపడింది.

పరోపకారం

అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తూ దారిలో ఒక పాము గద్దను పట్టి బందించడం చూసాడు, వెంటనే కర్రతో పామును అదిలించి గద్దను విడిపించాడు.

తరువాత పొలం పనుల్లో ఉండిపోయి, మధ్యాహ్నం అన్నం తిందాం అని దగ్గర్లో ఉన్న కాలువ దగ్గర కాళ్ళు చేతులు కడుకోటానికి వెళ్ళాడు. రామ్మయ్య పై కోపంగా ఉన్న పాము, ఇదే అదునుగా తీసుకొని రామయ్య తెచ్చుకొన్న అన్నపు మూటలో విషం కక్కి, వెళ్ళి పొదలలో దాకొంది.

చెట్టు పైనుండి ఇది చూ సిన గద్ద తనకు సాయం చేసిన రామయ్య ని ఎలాగైన కాపాడుదాం అని, రామయ్య అన్నం మూట విప్పి ఒక్క ముద్ద నొట్లో పెట్టుకొనే సమయానికి వెళ్ళి తింటున్న అన్నాన్ని నేలపాలు చేసి ఎగిరిపోయింది. రామయ్య కి కోపం వచ్చి గద్ద ని తిట్టాడు. ఇంతలో ఓ కుక్క వచ్చి కింద పడ్డ అన్నాన్ని తిని అక్కడిక్కకడే చనిపోయింది. రామయ్య గద్ద ని తిట్టినందుకు బాధ పడ్డాడు. గద్ద చేసిన మేలు వల్ల అతడు ప్రాణాలతో బయట పడ్డాడు. తాను గద్దకి చేసిన ఉపకారం తన ప్రాణాలను నిలబెట్టిందని తెలుసుకున్నాడు.

సహకారంలోనే స్వర్గం ఉన్నది

మనుష్యులు చేసిన పుణ్యపాపాలను బట్టి కొందరు స్వర్గానికి వెళ్ళారు. మరికొందరు నరకానికి పోయారు. దేవతలు వీళ్ళను పరీక్షించుదామని ఒక సమస్య సృష్టించారు.

ఒకనాడు స్వర్గంలో వున్నవారికీ, నరకంలో వున్నవారికీ ఒకే రకమైన జబ్బు పట్టుకున్నది. ఆ జబ్బు ఏమంటే, వాళ్ళ చేతులు నిటారుగా బిర్రబిగిసి పోయాయి. చెక్కలాగా అయిపోయాయి. మోచేయి వద్ద ముడుచుకొనవు. దేవతలు బోలెడు లడ్లు తయారుచేయించి నరకంలో వున్నవారి వద్దకు పళ్ళెములలో పెట్టి పంపించారు. వారికి ఆకలి కూడా తీవ్రంగా ఉన్నది. కాని చేతులు ముడతకు రావడం లేదు. ఎంత ప్రయత్నించినా చేతులు వంగడం లేదు. అందుచేత ప్రతి ఒక్కడూ వచ్చి లడ్డును పట్టుకుంటాడేగాని నోటివద్దకు తీసుకుపోలేకపోతున్నాడు. అన్నీ వుండి కూడా నరకంలో అందరూ ఆకలితో అలమటిస్తూ వుండిపోయారు.

దేవతలు స్వర్గంలో వున్నవారికి గూడ రుచికరమైన లడ్లు తయారుచేయించి పళ్ళెములలో పెట్టి పంపించారు. అయితే వాళ్ళ చేతులు గూడ నిటూరుగా బిర్రబిగుసుకుపోయి మోచేయి వద్ద వంగడం లేదు.

అయితే వారిలో పరస్పరం సహకరించుకొనే గుణమున్నది. అందుచేత ప్రతి ఒక్కడూ తన చేత్తో లడ్డు తీసుకొని ఎదుటివాని నోట్లో పెట్టాడు. ఇలా అందరూ చేయడం వలన పళ్లెములు ఖాళీ అయినవి. ఒక్క లడ్డు గూడ మిగలలేదు!

స్వర్గం అంటే ఎక్కడో లేదు. సహకారం ఎక్కడ వుంటుందో స్వర్గం అంటే అక్కడే వుంటుంది. జీవితాన్ని మధురవంతంగా చేసుకొనే రహస్యమిదే!

ఒక చిట్టి కప్ప కథ

అనగనగా ఓ చిట్టడవి. ఆ అడవిలో ఒక గుంపుగా కలిసిమెలసి ఉండే ఒక కప్పల గుంపు. ఒక రోజు ఆ కప్పల గుంపంతా ఆ అడవిలో గెంతుతూ గెంతుతూ సరదాగా విహారానికి బయలుదేరాయి.

ఆ గుంపులో రెండు చిట్టి కప్పలు ఉన్నాయి. అవి మిగిలిన వాటికంటే మరీ ఉత్సాహంగా గెంతుతూ.. బెక బెకమని వాటి భాషలో కూని రాగాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అలా గెంతుతూ గెంతుతూ చూసుకోకుండా ప్రమాదవశాత్తూ ఒక లోతైన గుంటలో ఆ రెండు చిట్టి కప్పలూ పడిపోయాయి. ఇంకేముందీ.. మిగిలిన కప్పల గుంపంతా గుంట చుట్టూ చేరి తొంగి తొంగి లోపలకి చూడసాగాయి. గుంట చాలా లోతుగా ఉండడంవల్ల ఎక్కడో అడుగున ఉన్న చిట్టి కప్పలు కనిపించట్లేదు వీళ్ళకి. అలాగే లోపల చిట్టి కప్పల పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పుడు బయట ఉన్న కప్పలన్నీ తమ అనుభవ పరిజ్ఞానం అంతా ఉపయోగించి పరిస్థితిని బాగా అర్ధం చేసుకుని బెక బెక మంటూ సలహాలు చెప్పడం ప్రారంభించాయి.

“గుంట చాలా లోతుగా ఉంది కాబట్టి.. ‘మీరు ఈ గుంట నుంచి బయటపడటం అసాధ్యం” అని చాలా బాధపడిపోతూ తమ జాలినీ సానుభూతినీ ప్రకటించాయి. వాటి మాటల్ని పట్టించుకోకుండా ఆ రెండు చిట్టి కప్పలూ తమ శాయశక్తులా బయటపడడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

అలా ఒక అరగంటసేపు గడిచిపోయింది. గెంతీ గెంతీ పాపం చిట్టి కప్పలు అలసిపోయాయి. అప్పుడు మళ్లీ బయట నేల మీద ఉన్న కప్పలు తమ నైరాశ్యాన్ని ప్రకటిస్తూ “మీరు వెలుపలికి రాలేరు. ఇంక మీ ప్రాణాల మీద ఆశలు వదులుకోండి” అని సలహా ఇచ్చాయి. ఈ బయటి కప్పల మాటలని ఆలకించిన ఒక చిట్టి కప్ప తన ప్రయత్నాలు వ్యర్థమని తోచి గెంతడం విరమించింది. రెండో కప్ప మాత్రం ఈ బయట కప్పల మాటలని పరిగణించలేదు. గెంతుతూ గెంతుతూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చింది.

బయటి కప్పలు “ఎందుకు అనవసరంగా శ్రమిస్తావు? చచ్చిపోయే ముందు ఈ యాతన కూడా దేనికి? ఈ బాధంతా పడిన తరవాత కూడా చావు ఎలాగూ తప్పదు కాబట్టి.. ఉన్నట్టు ఉండిపోయి ప్రశాంతంగా చనిపోవడం మేలు కదా..!” అని సలహా ఇచ్చాయి.

కానీ మరి కొంతసేపు గడిచాక.. అందరూ ఆశ్చర్యపోయేట్టుగా.. గుంటలోని చిట్టి కప్ప మరింత గట్టిగా ఎగిరి గంతేసి గుంట వెలుపల నేల మీదికి వచ్చి పడింది. మిగతా కప్పలన్నీ ఆ చిట్టి కప్ప చుట్టూ చేరి “నీ పాటికి నువ్వలా ఎగురుతూనే ఉన్నవేంటి మా మాటలు వినిపించుకోకుండా..?” అని అడిగాయి ముక్తకంఠంతో. అప్పుడు తెలిసిన కొత్త సంగతేంటంటే.. మన ఈ చిట్టి కప్పకి చెవుడు ఉందని! అందుకే అ గుంటలో ఉన్నంతసేపూ కూడా ఆ బయటి కప్పలు తనని ప్రోత్సహిస్తూ ‘మరింత గట్టిగా ప్రయత్నించు’ అని చెప్తున్నాయని అనుకున్నదట. వాటికి ఆశాభంగం కలుగజేయకూడదని భావించి, తన శక్తినంతా పుంజుకొని, ఓపికంతా కూడగట్టుకుని ఎగరసాగిందట. చివరకి బయటపడగలిగింది.

మరి గుంట లోపలే మరో కప్ప ఉండిపోయింది కదా..! అది ఎక్కువసేపు అలా నీటిలోనే స్తబ్దుగా ఉండడం వల్ల దాని ప్రాణాల మీదకి వచ్చింది. ఈలోపు బయటనుండి అన్నీ కప్పలు బెక బెకమని దానికి హితబోధలు చేసి.. ఉత్సాహపరిచాయి. మొత్తానికి అది కూడా గెంతీ గెంతీ ఎలాగో కొన ప్రాణాలతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఏదో బ్రతికి బయటపడింది.

పట్టినపట్టు విడరాదనే తత్వం కప్పలకే కాదు మనుషులకు కూడా అవసరమే. సాక్షాత్తూ చెవుడే ఉండక్కరలేదు గానీ, ఏదయినా కార్యం తలపెట్టినప్పుడు ఇతరులు పెట్టే భయాలనూ, సంకోచాలనూ, చెవిన పెట్టకుండా ముందుకి సాగిపోయే ధైర్యముండాలి. అప్పుడు గానీ, విజయలక్ష్మి వరించదు. అంతే కాదు.. ఒక్కరు సాహసంతో చూపిన విజయపు బాట ఆ వెనుకగా ఎంతోమంది జీవితాలకి బాసటగా నిలుస్తుంది కూడా..! అదే ఈ చిట్టి కప్ప మనకి తెలియచెప్పే గొప్ప జీవిత సత్యం..!

రాజయోగం

కుంతల దేశపు రాజధాని నగరం పక్కనే వున్న ఓ సుభిక్షమైన గ్రామం సౌభాగ్యపురం. భట్టుమూర్తి ఆ గ్రామంలో పేరు మోసిన రైతు. ఆయన ఏకైక కుమారుడు శంతనుడు ఆ గ్రామానికి కొంచెం దూరంలో వున్న ముని ఆశ్రమంలో చదువుకుంటున్నాడు. అదే ఆశ్రమంలో శంతనుడి సహాధ్యాయిగా ఆ దేశపు రాజవంశీకుడు చంద్రసేనుడు వుండేవాడు. చంద్రసేనుడి కోసం అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చే రాజోద్యోగులను రాజభటులను చూసినప్పుడల్లా శంతనుడికి తాను కూడా రాజునైతే బావుంటుందని అనిపించేది. రాజరికంలోని దర్జా, హోదా, వైభోగాలను అనుభవించవచ్చని ఆశ పడేవాడు.

చదువు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చిన శంతనుడు ఏ పని చేపట్టక ఊరికే ఆలోచనలలో కాలం గడిపేవాడు. దేశానికి రాజవ్వాలన్న కోరిక రాను రాను అతనిలో బలపడ సాగింది. ఇదే కోరికను శంతనుడు తన మిత్రులతో చెప్పుకునే వాడు. “ఫలానా సాహస కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే, రాజకుమారిని ఇచ్చి వివాహం చేస్తానని, అర్ధ రాజ్యం ఇస్తానని” మహా రాజు ఏదైనా ప్రకటన చేస్తాడేమోనని శంతనుడు నిత్యం ఎదురు చూసేవాడు. ఎప్పుడూ ఊహాలోకాల్లో విహరించే శంతనుడికి, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమనో లేదా తమ భూముల్లో వ్యవసాయం చేపట్టమనో భట్టుమూర్తి పలు మార్లు చెప్పి చూశాడు. శంతనుడు తండ్రి మాటలను లక్ష్య పెట్టేవాడు కాదు. శంతనుడి సంగతి తెలుసుకున్న గ్రామస్తులు చాటుగా నవ్వుకునే వారు.

రాజపదవి పై శంతనుడి వ్యామోహం గురించి తెలుసుకున్న ఓ మోసగాడు భట్టు మూర్తి ఇంట్లో లేనప్పుడు జ్యోతిష్యుడి వేషంలో వచ్చి శంతనుడిని కలిసాడు. శంతనుడిని పరీక్షగా చూస్తున్నట్టు నటిస్తూ …. “ఆహా! ఏమి తేజస్సు! మొఖంలో మహారాజు లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఏదీ, నీ చేతి రేఖలు చూడనీ….“ అంటూ శంతనుడి చేతిని పరిశీలించసాగాడు.

కొన్ని క్షణాల తరువాత మళ్ళీ మాట్లాడుతూ .. ..”నాయనా! నీకు రాజయోగం ఉన్నది. నీవు ఒక యాగము చేస్తే ఈ దేశానికి రాజవుతావు. నాకు వంద బంగారునాణాలు ఇస్తే, నీ కోసం ఆ యాగాన్ని నేను జరిపిస్తాను. యాగానికి రేపు రాత్రే ముహూర్తం. రాజధాని నగరానికి ఆవలవున్న అడవిలోని పెద్ద మర్రి చెట్టు యాగానికి అనువైన స్థలము! నా దగ్గర నిప్పు తప్ప , యాగానికి కావలసిన అన్ని వస్తువులూ ఉన్నాయి. రేపు రాత్రి నువ్వు కాగడా తో నిప్పు తీసుకుని అక్కడికి వస్తే యాగం జరిపిస్తాను….” అన్నాడా జ్యోతిష్యుడు. తన చిరకాలవాంచ నెరవేరుతున్నందుకు శంతనుడు మురిసి పోతూ అతనికి వంద బంగారు నాణాలు సమర్పించు కున్నాడు. వాటిని పుచ్చుకున్న జ్యోతిష్కుడు మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు.

మర్నాడు చీకటి పడ్డాక, కాగడా పట్టుకుని అడవిలోని మర్రిచెట్టు వద్దకు చేరిన శంతనుడికి జ్యోతిష్కుడు కనబడలేదు. “ఏదో పనిమీద బయటకు వెళ్ళి వుంటాడు. రావటం ఆలస్యం అయి వుంటుంది” అని అనుకున్నాడు శంతనుడు.

ఎంతోసేపు వేచి చూసినా జ్యోతిష్కుడు రాకపోయే సరికి శంతనుడికి అనుమానం కలిగింది. ఆ జ్యోతిష్కుడిని వెతుకుదామని బయలు దేరబోయాడు. ఇంతలో అటువైపుగా గస్తీకి వచ్చిన రాజ భటులకు కాగడాతో తిరుగుతున్న శంతనుడి ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది. వారు అతన్ని బంధించి తీసుకుపోయి ఆ దేశపు మంత్రి ముందు హాజరు పరిచారు.

“ఎవరు నువ్వు? ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఏం చేస్తున్నావు? ఏ దేశపు గూఢచారివి? నిజం చెప్పు….” అంటూ మంత్రి గద్దించాడు. దాంతో కంగారు పడ్డ శంతనుడు…. తాను కుంతల దేశపు పౌరుడినేనంటూ మొదలు పెట్టి తాను ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇల్లు చేరిన సంగతి, నకిలీ జ్యోతిషుడికి వంద బంగారు నాణాలు సమర్పించుకున్న సంగతి…. అంతా వివరంగా చెప్పేశాడు.

శంతనుడి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన మంత్రి…” పదవీ వ్యామోహంలో పడి నువ్వు యుక్తా యుక్త విచక్షణ కోల్పోయావు. విద్యావంతుడవైనప్పటికీ, వివేకంలేకుండా మూర్ఖుడిలా ప్రవర్తించావు. రాజరికపు బాహ్య లక్షణాలైన వైభోగం, ఆడంబరాలు, దర్జా, హోదాలపట్ల ఆకర్షితుడవయ్యావు. కానీ వాటిని వెన్నంటి వుండే బాధ్యతలను, ప్రమాదాలను గుర్తించలేదు. దేశ రక్షణ జనరంజకమైన పాలన ఆర్ధిక వ్యవహారాలు… లాంటి క్లిష్టమైన బాధ్యతలెన్నో మహారాజుకుంటాయి. నీ ఇంటి బాధ్యతే వహించని వాడివి, ఇంత పెద్ద దేశపు బాధ్యతనంతా ఎలా వహించగలననుకున్నావు? కష్టపడి పనిచేస్తూ, నిజాయితీగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే! ఇంత చిన్న విషయాన్ని అర్ధం చేసుకోలేని నీ చదువు వృధా ….” అంటూ తీవ్రంగా మందలించి శంతనుడిని వదిలేయమని భటులను ఆదేశించాడు.

మంత్రి మందలింపుతో శంతనుడికి కమ్ముకున్న పదవీ వ్యామోహ పొరలు తొలగి పోయాయి. తన గ్రామం చేరుకుని, తండ్రి చెప్పినట్టు వ్యవసాయం చేపట్టాడు. కష్టించి పని చేయడంతోపాటు నాణ్యమైన ఎరువులు, మేలురకపు విత్తనాలు వాడటంతో పంటలు బాగా పండాయి. రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి శంతనుడు ఆ గ్రామంలోకెళ్ళా ధనవంతుడయ్యాడు. సేవాభావం అలవర్చుకొని, పేరు ప్రఖ్యాతులు ఆశించక తన ధనాన్ని సద్వినియోగం చేయసాగాడు. గ్రామంలోని రహదారులలో వీధి దీపాలు ఏర్పాటు చేయించాడు. దేశం నలుమూలల నుంచి రాజధానికి వచ్చే బాటసారుల కోసం రాజధాని వెలుపల ఒక ధర్మ సత్రం కట్టించాడు, ఇవి గాక ఎన్నో గుప్త దానాలు చేయసాగాడు. తన గ్రామంలో వారికేగాక , చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకోసాగాడు.

తమ మాటలలో శంతనుడి ప్రసక్తి వచ్చినప్పుడల్లా గ్రామస్తులు….”గొప్ప మారాజు! ఆయన కలకాలం సుఖంగా వుండాలి” అంటూ దీవించే వారు. ఈ మాటలు చెవిన పడ్డ శంతనుడు, జ్యోతిష్కుడు తనకు చెప్పిన రాజయోగం ఇదేననుకుని తృప్తిగా నవ్వుకున్నాడు

ఉత్తమ చెట్టు

పినాకిని నదీ తీర ప్రాంతం లోని ఒక రైతు పొలం లో ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు పక్క పక్కన మొలిచాయి. వాటిని గమనించిన పొలం యజమాని మామిడి చెట్టుకు పాదు చేసి, మంచి ఎరువు వేసి నీళ్లు పెట్టేవాడు. వేప చెట్టును గురించి పట్టించుకోలేదు.

తానూ గొప్పది కాబట్టి రైతు తన పట్ల శ్రద్ద చూపుతున్నాడనే భావం మామిడిలో కలిగింది. కాసింత అహంకారం కూడా పెరిగింది.

కాలక్రమంలో రెండు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. పూలు పూచి, కాయలు కాసాయి. మామిడి పండ్లు మధురంగా వుండగా వేప పండ్లు చేదుగా వున్నాయి. ప్రతి ఒక్కరూ తన మధుర ఫలాలని ఇష్టపడి తింటూ వుండటం తో మామిడికి మరింత గర్వం పెరిగి వేపతో మాట్లాడటం మానివేసింది .

అది గమనించిన వేప ” మామిడిగారూ ..! ఏమిటి ఇటీవల నాతొ మునుపటిలా వుండటం లేదు ..? ” అని అడిగింది .

” నాకూ .. నీకు ఏమి పోలిక. మధుర రసాలను యిచ్చు వృక్షాన్ని నేను. నోట పెట్టుకోను పనికిరాని చెడు ఫలాలు నీవి. నా కంటే తక్కువ దానివి నీతో నాకు స్నేహమేంటి ….? ” గర్వంగా చెప్పింది మామిడి .

” నీవి మధుర ఫలాలయినంత మాత్రాన గొప్ప దానివని మురిసిపోకు. నా విత్తనాలకూ మంచి గిరాకీ వుందని ఏరుకు పోతూ వున్నారు తెలుసా ..! అయినా అహంకారితో స్నేహం అవసరం లేదులే . .! ” అంది వేప .

అలా మామిడి , వేప వాదులాడుకోవడం వాటి పక్కన నిలువెత్తుగా పెరిగి వున్న కొబ్బరి చెట్టు వింది . రెంటి మధ్య మాటలు దానికి చిర్రెత్తి పోయి ” అబ్బా ..! ఆపండి మీ వాదులాట. వినలేకపోతున్నాను . .” అంది .

” అదేంటి కొబ్బరిగారూ .. అలా విసుక్కుంటారు . మా ఇద్దరిలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చుకోలేక పోతుంటే ..” అంది మామిడి .

” పోనీ మీరైనా చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్పో …! దాంతో ఈ గొడవ తీరిపోతుంది . ఎవరి మానాన వాళ్లు బతుకుతాం ..” అంది వేప.

”పిచ్చి మొఖాల్లారా …! ఒకరు గోప్పెంటి . ..మరొకరు తక్కువేంటి…! మన చెట్లు దేనికవే గొప్పవి. ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వుంటుంది . మీ వాదులాట మానుకోండి ..” అని మందలించింది కొబ్బరి .

కానీ తమలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చి చెప్పమని నిలదీసింది మామిడి .

”సరే ..! అంతగా అడుగుతున్నావు కాబట్టి చెపుతున్నాను …చెప్పాక బాధ పడకూడదు …” అంది కొబ్బరి .

” అలాగే ” అని తలలూపాయి మామిడి , వేప .

” నా దృష్టిలో వేప ఉత్తమ చెట్టు ..” చెప్పింది కొబ్బరి .

” ఎలా చెప్పగలవు …?” ప్రశ్నించింది మామిడి .

” మధురమైన మామిడి ఫలాలు తిన టానికి అందరూ ఇష్టపడతారు. తిన్నవారికి రుచినీ, తృప్తినీ ఇవ్వగలవు మరి వేప పండ్లు తిన టానికి చేదుగా వుంటాయి. అయినా వేప విత్తనాలు ఔషధ గుణాలు కలిగి, ఎన్నో వ్యాధులు నయం చేయడానికి ఉపయోగ పడతాయి. అలాంటి మంచి లక్షణాలు కలిగిన వేపను ఉత్తమ చెట్టుగా నిర్ణయించాను. ఇక మీ ఇష్టం …” చెప్పింది కొబ్బరి .

” అదేం లేదు. నీకు నేనంటే అసూయ. దానికి మద్దతుగా అలా చెప్పావు. నీ తీర్పును నేను అంగీకరించనుఅంది మామిడి .

కాలం సాగి పోతూ వుంది.

మామిడికి అంటు పట్టని చీడ పీడలు సోకాయి. వేరులో కుళ్ళు తెగులు పట్టింది . ఆకులు , కాయలు రాలి పోసాగాయి. కొమ్మలు కూడా అక్కడక్కడా ఎండు ముఖం పట్టాయి . మామిడికి పట్టిన తెగులు రైతు గమనించాడు . వెంటనే వేప చెట్టు క్రింద రాలివున్న కాయలను బాగా దంచి పొడిచేసి , దానిని మామిడి చెట్టు మొదట్లో వేసాడు . దానితో మామిడి వేరుకు పట్టిన పురుగు నశించి , తిరిగి మామిడి ఆరోగ్యంగా తయారైంది .
అప్పుడు మామిడికి కనువిప్పు కలిగింది .

కొబ్బరి చెట్టు చెప్పినట్లు ‘ తీపిని యివ్వటం గొప్ప కాదు . ఆరోగ్యాన్ని యివ్వటం గొప్ప ..’ అన్న విషయాన్ని తెలుసుకుంది. వేపని ఉత్తమ చెట్టుగా అంగీకరించి , తిరిగి స్నేహాన్ని కొనసాగించింది.

నీతి: ఎదుట వారి గొప్ప గుణాలను తక్కువగా ఎంచకూడదు.

ప్రకృతి ధర్మం

పూర్వం ఒక అడవి సమీపంలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ ఆయన కొంత మంది విద్ద్యార్థులకి  వేదాలు కూడా భోదించేవారు.

ఒక రోజు  అలా  వేదాలు  భోదిస్తున్నప్పుడు  హఠాత్తుగా  గాలి,  వాన  రావడంతో  ఆశ్రమంలో ఉన్న పర్ణశాలల కప్పులన్నీ ఎగిరిపోయాయి.  ఆశ్రమం అంతా చిందర వందరగా అయిపోయింది.  వీటిని అంతటినీ చూసిన ముని తన విచక్షణా జ్ఞానాన్ని ఒక్కసారిగా మరచిపోయి తన తపశ్శక్తితో “నీ విలయతాండవాన్ని ఇంక ఆపు” అని శాసించాడు.

ప్రకృతి శాంతించింది. ఆశ్రమం లోని వారంతా మునీశ్వరుని; వేనోళ్ల పొగిడారు. అప్పుడు ముని ఇక్కడ  వున్నవారే ఇంతగా నన్ను మెచ్చుకుంటున్నారు,  ఇంక లోకమంతా ఇంకెంత మెచ్చుకుంటుందో  అని తన మంత్ర శక్తితో మిగిలిన ప్రపంచం అంతా ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కళ్లు మూసుకుని ముని మిగిలిన ప్రపంచం ఏమనుకుంటుందో అని తెలుసుకోసాగాడు…

అప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. ముని వలన కొంత మంది ప్రాణాలు పోయాయని. అదీ ఎలా అంటే గాలి,  వాన వస్తున్నదని సముద్రంలో చేపల వేట కని వెళ్ళిన వారు తమ పడవలకి తెరచాపలని వేశారు. కానీ హఠాత్తుగా గాలి, వాన తగ్గిపోవడంతో ముందు కాపాడిన తెరచాపే వారిపాలిట మృత్యుపాశమై వారి పడవలని మునిగిపోయేలా చేసింది అని తెల్సుకున్న ముని ఎంతవారలైనా ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఊండాలని తనకి తెల్సిన నీతి సూత్రాన్నే ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.