Pages

Wednesday, September 18, 2013

దురాశ దుఃఖానికి చేటు

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.

ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

బలం కన్నా బుద్ధి గొప్పా

మిణుగురు పురుగు సమయస్ఫూర్తి
అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “యేమిటది” అని అడిగింది.“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది. ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది!

శిబి చక్రవర్తి దానశీలత

మహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!
ఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.


అయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... "ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?" అంటూ ప్రశ్నించాడు.అప్పుడు శిబి చక్రవర్తి "ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను..." అని చెప్పాడు.


దానికి డేగ మాట్లాడుతూ... "అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు" అని అంది.దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.


సరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.

గుర్రం

ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం వుండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు వుంచి, ఒరూరు తిరిగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఆరాట పడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తి గానే వుండేది.
***
ఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేసాడు. ఆ సమయంలో వ్యాపారి ఘాడ నిద్రలో వున్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు.
***
జరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్సబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెల్లుతుండటంతో....
***
"అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి" అని అడిగింది.
***
"ఎందుకు?" దొంగ అడిగాడు.
***
"ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు"
***
"మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?" దొంగ అడిగాడు.
***
"కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను" అంది.
***
దాని మాటలకు ఒక్క క్షణం అలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. "అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి.
***
"నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాసం వున్నా అడ్డు పడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం" అంది గుర్రం.
***
గుర్రం మాటలకు నవ్వాడు దొంగ, " కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు క్రుతగ్నతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పని వాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు..." అంటూ అక్కడి నుంచి నిశ్సబ్దంగా జారుకున్నాడు దొంగ.
***
ఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.