Pages

Thursday, September 12, 2013

బంగారుపళ్లెం

అనగనగా ఒక ఊరిలో సోము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు సోము తండ్రి పాతకాలం నాటి ఇనుపపెట్టెను శుభ్రం చేస్తూ ఉంటే, సోము దానిలో ఉండే బంగారు పళ్లాన్ని బయటికి తీసి, దానితో ఆడుకోసాగాడు. అది చూసిన తండ్రి సోము వీపు మీద రెండు దెబ్బలు వేసి దాన్ని లాక్కుని, ‘‘ఇది ఆడుకునే వస్తువు కాదు. దీన్ని మన వంశప్రతిష్ఠకి గుర్తుగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం.

ఇంకెప్పుడూ దీనితో ఆడకు’’ అని కోప్పడ్డాడు. బంగారు పళ్లాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు సోము చాలా బాధ పడ్డాడు. ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు నడిచాడు.

ఊరి చివర తోటలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడసాగాడు. అంతలో ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి, ఆ చెట్టుకి మరో వైపున కూర్చున్నారు. వాళ్లు దొంగిలించిన నగల్ని పంచుకోవడానికి గొడవ పడసాగారు. వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్న సోముకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే లేచి చప్పుడు కాకుండా నడుస్తూ అక్కడికి దగ్గర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి, బావిలోకి చూస్తూ , ‘బంగారు పళ్లెం’, ‘బంగారు పళ్లెం’ అని గట్టిగా ఏడ్వసాగాడు. అది విన్న దొంగలు ఆ బావి దగ్గరికి వెళ్లారు.

సంగతేంటని అడిగారు. ‘‘మా ముత్తాత గొప్ప పండితుడు. అప్పట్లో ఆయనకి రాజుగారు పే...ద్ద బంగారు పళ్లెం బహుమతిగా ఇచ్చారు. మా ఇంట్లో పెట్టెలో ఉన్న ఆ పళ్లాన్ని తీసి, ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటే అది బావిలో పడిపోయింది. దాన్ని ముట్టుకున్నానని తెలిస్తేనే మా నాన్న కొడతాడు. ఇక అది పోయిందని తెలిస్తే చంపేస్తారు’’ అని సోము పెద్దగా ఏడవసాగాడు. దొంగలకి దాన్ని తీసుకోవాలనే ఆశ పుట్టింది. ‘‘నేను తీసిస్తానంటే నేను తీసిస్తాను’ అంటూ పోటీ పడ్డారు. వాళ్ల చేతుల్లో ఉన్న నగలమూటని కింద పెట్టి ఇద్దరూ బావిలో దూకారు.

సోము వెంటనే ఆ నగల మూటని తీసుకొని ఊరిలోకి పరుగెత్తాడు. ఊర్లో పెద్దలకి దొంగల సంగతి చెప్పి వారిని బావి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకొని రాజభటులకి అప్పగించారు. ఆ నగలు ఎవరివో కనుక్కొని వారికి అందచేశారు. సోము తెలివిని, సమయస్ఫూర్తిని ఊరివారంతా మెచ్చుకున్నారు. సోము తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.

రంగు వెలిసిన ఏనుగు

అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు ‘నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో!’ అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు. ఇంతలో వర్షం మొదలయ్యింది. చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

నిజమైన మేధావి

రాజు తెలివైన కుర్రాడు.ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.

చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.

తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది.

దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు.

నిజాయతీ

ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకొంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చెయ్యాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చెయ్యాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు.

మరునాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలు పెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తి అయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే! ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడుకి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సరుగులో బహుమతిగా ఇవ్వతగిన వస్తువును వెదుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిలుచున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్లలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు.

ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, "నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. ఆ బాలుడు, "అయ్యా ! లెక్కలన్ని సరిగా చేశాననిగదా, మీరు నాకు బహుమతి ఇస్తున్నారు! ఈ లెక్కలు అన్ని నేను చెయ్యలేదు. వీటీలో ఒక లెక్క నా స్నేహితుడు అన్న గారి చేత చెప్పించుకొని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనటానికి నేను తగను." అన్నాడు. అయితే, ఏడవటం ఎందుకు? అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్ని విద్యార్థులు స్వయంగా చెయ్యాలని గదా, మీ ఉద్దేశం? కాని నేను ఒక లెక్కను ఇతరులచేత చెప్పించుకొని చేసి, మిమ్ములను మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి. అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టడు.

ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా నిన్ను శిక్షించటం కాదు. అభినందించాలి. నీకు బహుమతి తీసుకొనటానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు. అంతకంటే గొప్ప పనికి! నీ "నిజాయితీకి" అని ఆ బాలుడుకి బహుమతిని ఇచ్చాడు ఉపాధ్యాయుడు.

ధర్మరాజు నరక ప్రయాణం

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజు కు దారి లో వైతరణి నది కనిపిస్తుంది. ఈ నది ఎన్నో వేల వైశాల్యం కలిగి, ఎముకలు,చీము,రక్తము మరియు బురద కలిగిన మాంసము తో నిండి ఉంది. ఈ నది నిండా పెద్ద పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, విశ్వం లో మాంసాహారం భుజించే సకల జీవాలు అందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. దోవ అంతా దుర్గందపూరితం గా ఉంది. దానిని భరించలేక ధర్మరాజు మూర్చపోయాడు. జన్మలో ఎటువంటి తప్పు చెయ్యని నాకు ఈ దురవస్థ ఏమిటని ధర్మరాజు ఇంద్రుని అడిగాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజు తో 'కురుక్షేత్ర సంగ్రామాన, అశ్వద్ధామ హత: అని బిగ్గరగా పలికి, కుంజర: అని హీన స్వరం తో పలికి గురుదేవుని వంచించిన ఫలితమిది' అని చెప్పాడు. అబద్దం ఆడిన వారికే నరక దర్శనం తప్పకపోతే ఇక పాపాలు చేసే వారి పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి