Pages

Thursday, September 6, 2012

రాజుగారి ఔదార్యం!


ఈనాడు బీజింగ్‌ రాజధానిగా వున్న చైనాదేశం, ఈ ఉదంతం జరిగిన కాలంలో లేదు. అతి విశాలమైన ఆ భూభాగం చిన్నచిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అలాంటి చిన్న రాజ్యాలలో ముఖ్యమైనది.

దాదాపు 2600 సంవత్సరాలకు పూర్వం చూ రాజ్యాన్ని జువాంగ్‌ అనే రాజు పరిపాలించేవాడు. ఆ కాలఘట్టంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి …యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. అలా జరిగిన ఒక యుద్ధంలో పొరుగు రాజ్యం మీద జువాంగ్‌ రాజు విజయం సాధించాడు. ఆ సందర్భంగా యుద్ధంలో విజయానికి తోడ్పడిన సేనాధిపతులు, దళనా…యకులు, మంత్రులు, అధికారుల గౌరవార్థం రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు.

రాజభవన ప్రాంగణంలో అందమైన పందిళ్ళువేశారు. వీనుల విందుగా సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా, వేదిక మీద అందమైన నర్తకీమణులు నయనానందకరంగా నాట్యం చేయసాగారు. రకరకాల వంటలతో, పానీయాలతో అతిథులకు రుచికరమైన విందు భోజనాలు వడ్డించారు. ఆహూతులందరూ పరమానందంతో విందుభోజనం చేస్తున్నారు. రాజు తన కుమార్తె …యువరాణి జూను స్వయంగా వెళ్ళి, ప్రాంగణంలోని అతిథుల మీద పరిమళ ద్రవ్యాన్ని చిలకరించమని చెప్పడంతో అతిథుల ఆనందం అవధులు దాటింది. రాజ్యంలోనే అపురూప అందాల రాశిగా యువరాణి పేరుగాంచింది. ఆమె స్వ…యంగా తమ వద్దకు రావడం, తమనెంతో ప్రత్యేకంగా గౌరవించినట్టు అతిథులు భావించి పొంగి పోయారు.

 ఉన్నట్టుండి ప్రాంగణంలోకి బలంగా గాలి వీచడంతో, ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి. చుట్టూ చీకటి అలముకున్నది. చాందినీ వేయబడిన స్తంభాలు అటూ ఇటూ ఊగసాగాయి. ఒక్కసారిగా, సంగీతం, నాట్య ప్రదర్శన ఆగిపోయిందే తప్ప, అతిథుల మధ్య ఎలాంటి కలకలం చెలరేగలేదు. భటులు వచ్చి మళ్ళీ దీపాలు వెలిగించేంతవరకు అతిథులు కదలకుండా ఓర్పుతో అలాగే కూర్చున్నారు.

అయితే యువరాణి జూ మాత్రం సజల నయనాలతో తండ్రి వద్దకు పరిగెత్తి వచ్చి, ‘‘నాన్నా, ఘోరం జరిగిపోయింది. చీకటి కమ్ముకోగానే ఒక దళనాయకుడు నన్ను అతడికేసి లాక్కోబోయాడు. అయితే, నేను వెంటనే వాడి చేయిని విడిపించు కుని ఇవతలికి వచ్చేశాను  అలా వచ్చేప్పుడు వాడి అంగీనుంచి, రిబ్బన్ను లాక్కొచ్చేశాను. దీపాలు వెలిగించమని ఆజ్ఞాపించండి. ఈ రిబ్బను సాయంతో దోషిని సులభంగా పట్టుకోవచ్చు,’’ అన్నది చెవిలో రహస్యంగా.
రాజు కుమార్తెను, ఆప్యాయంగా మంచి మాటలతో ఓదార్చాడు. ఆ తరవాత ఆసనం నుంచి లేచి నిలబడి, ‘‘ప్రియమైన అతిథులందరికీ ఒక సంగతి చెప్పదలచాను!’’ అన్నాడు. తన తండ్రి ఏం చెప్పనున్నాడో యువరాణి ఊహించుకోసాగింది. సమ్మతి లేకుండా యువరాణిని తాకడం భయంకరమైన నేరం. తక్షణ మరణ శిక్షే దానికి తగిన దండన. ఆమెతో హద్దు మీరి ప్రవర్తించిన దళనాయకుడికి మరణశిక్ష తప్పదు!

‘‘దళనాయకులారా! ఒక మాట,’’ అంటూ రాజు మళ్ళీ ఇలా అన్నాడు: ‘‘ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రాత్రి చాలా ముఖ్యమైనది. భయకరమైన యుద్ధం ముగిసి, ఇప్పుడు మనం శాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. దళనాయకుల అంగీ మీద ఉన్న రిబ్బన్లు, వారి సైనిక స్థాయిని తెలియజేసే చిహ్నాలు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ శాంతి ప్రియులుగా కూర్చుని వున్నాం. మనకు శాంతిపట్లవున్న ప్రేమకు గుర్తుగా, మీరందరూ మీ మీ అంగీల మీద ఉన్న రిబ్బన్లను తొలగించాలని కోరుతున్నాను. వెంటనే తీసి వేయండి.’’

రాజుగారి సూచనకు అతిథులు హర్షాతిరేకంతో ఆమోదం తెలియజేస్తూ తమ రిబ్బన్లను తొలగించారు. భటులు దీపాలు వెలిగించసాగారు. మళ్ళీ యథాప్రకారం సంగీతం, నాట్య ప్రదర్శన ఆరంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు విందులు వినోదాలు కొనసాగాయి.

అతిథులందరూ వెళ్ళిపోయాక రాజు కుమార్తెతో, ‘‘బిడ్డా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ పట్ల అగౌరవం కనబరచిన దళనాయకుడు కొద్దిగా తాగిన మత్తులో ఉండి ఉంటాడు. అయినా, మన రాజ్య రక్షణకోసం ధైర్యంగా పోరాడిన వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అది. ఒక్కసారి అతడి అపరాధం బట్టబయలయితే, అతన్ని శిక్షంచక తప్పదు. అప్పుడు విందు కార్యక్రమం ఎలా మారిపోయి ఉండేదో ఊహించి చూడు. అంతటా బాధ, విచారం అలముకుని ఉండేవి. తమ సహచరుడొకడు మరణశిక్ష పొందడం ఇతర దళనాయకులకు మధురస్మృతి కాజాలదు కదా. పైగా, ఆ దళనా…యకుడి చర్యకు అసలు ఉద్దేశం ఏమిటో మనకు ఇతమిత్థంగా తెలి…యదు. ఆ సమయంలో అతన్ని పట్టుకుని, ఆరాతీ…యడం అంటే అప్పటి ఉత్సవ వాతావరణాన్ని పాడుచేయడమే అవుతుంది. కాబట్టి దాన్ని క్షమాహృదయంతో క్షమించి, ప్రశాంతంగా ఉండు,’’ అన్నాడు ఓదార్పుగా.


ఒక సంవత్సరం గడిచింది. పొరుగున వున్న శత్రురాజ్యం సేనలు హఠాత్తుగా చూ మీద దండెత్తి వచ్చాయి. జువాంగ్‌ రాజు స్వయంగా నాయకత్వం వహించి సేనలను శత్రువుల మీదికి నడిపించాడు. ఘోరయుద్ధం జరిగింది. అనుకోని విధంగా జువాంగ్‌ యుద్ధభూమిలో శత్రు సేనల మధ్య ఒంటరిగా చిక్కుకున్నాడు. ఎంత పోరాడినా అక్కడినుంచి తప్పించుకోలేక పోయాడు. శత్రు దళనాయకులు చుట్టుముట్టారు. ఆయన శత్రు సైనికుడి చేతిలో బలికానున్న సమయంలో, మెరుపులా ఒక వీరుడు శత్రువలయంలోకి దూకి, రాజును తెగటార్చడానికి కత్తిదూసిన వాడి తలను తెగనరికాడు. దాంతో యుద్ధం మలుపు తిరిగింది.

శత్రుసేనలు వెనుదిరిగాయి. జువాంగ్‌ రాజు విజయం సాధించాడు. మరునాడు సభ జరిగింది. సమయానికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన దళనాయకుడితో రాజు, ‘‘నీ ధైర్యం అనుపమానం. నీ సాయం మరువరానిది. నిన్ను ఘనంగా సన్మానించాలి,’’ అన్నాడు పరమానందంతో. ‘‘ప్రభూ, అది ఇప్పుడు అవసరం లేదు. ఒక్క సంవత్సరం క్రితమే మీరు నాకు ప్రాణభిక్ష పెట్టి ఘనంగా సన్మానించారు కదా!’’ అన్నాడు దళనాయకుడు వినయంగా.

‘‘ఏమిటి, నువ్వుంటున్నది?’’ అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ఆనాడు విందు సమయంలో …యువరాణికి బాధ కలిగించినవాడు తానేనన్న విషయం దళనాయకుడు బయటపెట్టాడు. అయితే, అది ఉద్దేశపూర్వకంగా చేయలేదనీ - భయంకరమైన గాలి తాకిడికి యువరాణికి వెనకవున్న స్తంభం ఆమె మీద పడబోవడంతో, దాన్నుంచి రక్షంచే ప్రయత్నంలో ఆమె చేయిపట్టి ఇవతలికి లాగవలసి వచ్చిందనీ చెప్పాడు. తన చర్యను గురించి ఆలోచించే సావకాశం కూడా లేదనీ వివరించాడు. రాజే గనక అతన్ని శిక్షంచాలని నిర్ణయించి వుంటే. అసలు సంగతి వివరించే అవకాశం కూడా ఉండేది కాదు. రిబ్బను ద్వారా తనను పట్టుకోవాలని యువరాణి భావించివుండవచ్చు.

అయితే, ఉదార హృదయుడైన రాజు, దళనాయకులందరినీ రిబ్బన్లు తొలగించమని ఆదేశించాడు. అది ఆయన గొప్పతనం. ఆనాడు తనను క్షమించిన రాజుగారిపట్ల గల కృతజ్ఞతాభావంతోనే, దళనాయకుడు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా యుద్ధభూమిలో రాజును కాపాడాడు!

రాజు దళనాయకుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఈ సంగతి విన్న …యువరాణి కళ్ళ నుంచి కృతజ్ఞతాభావంతో రెండు కన్నీటిబొట్లు రాలాయి. ఒకటి తన తండ్రి దళనాయకుణ్ణి క్షమించి వదిలినందుకు. రెండవది దళనాయకుడు తన తండ్రి ప్రాణాలను రక్షంచినందుకు!

పిశాచిసాయం


గౌరీపట్నంలో గంటమ్మ పూటకూళ్ళు నడుపుతూండేది. ఒక రోజున ఆమె అర్ధరాత్రిదాకా, వచ్చిన బాటసారులకు వడ్డన చేసింది. ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆమె అనుకుంటూండగా, ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు.

గంటమ్మ, అతడితో, ‘‘వేళకాని వేళ! ఇది అర్ధరాత్రి అయినా, ఈ పూటకూళ్ళమ్మ ఎవరినీ ఆకలితో నిద్రపోనీయదు. క్షణాల మీద వంట చెయ్యగలను. భోజనం చేస్తావా?’’ అని అడిగింది. పండు ముసలి తన భుజాన్నుంచి వేళ్ళాడుతున్న జోలెను కిందికి దింపుతూ, ‘‘గంటమ్మా! భగవంతుడి ద…యవలన, నాకు ఆకలి దప్పులు లేవు. కాస్త ఈ పక్కనవున్న అరుగు మీద పడుకోనివ్వు,’’ అన్నాడు.

ఆ మాటలకు గంటమ్మ ఆశ్చర్యపోతూ, ‘‘ఆకలిదప్పులు లేకపోవడానికి నువ్వేమైనా యోగివా?’’ అని అడిగింది.
ముసలివాడు నవ్వి, ‘‘ఒక విధంగా యోగినే. నా పేరు రామేశం. నాదీ ఈ గౌరీపట్నమే. నేను యవ్వనంలో వుండగా, నా ఇంటికి అగ్నిప్రమాదం జరిగింది. తండ్రి, తల్లి, భార్య, చెల్లెలు - ఇలా నా కుటుంబమంతా అగ్నిలో దహనమై పోయింది. నేను విరక్తితో గ్రామం వదిలిపోయాను. అప్పట్లో మీ అమ్మ జోగమ్మ పూటకూళ్ళు నడిపేది. నువ్వు చిన్నపిల్లవు; నీ పేరు నాకు గుర్తుంది. నేను ఊరువదిలి తీర్థాలూ, పుణ్యక్షేత్రాలూ, నదీ నదాలూ దర్శిస్తూ, ఒక యోగికరుణవల్ల ఇచ్ఛాశక్తి, దివ్యదృష్టి సంపాయించాను. అందుచేత, నేను ఆకలిదప్పులను అదుపులో వుంచుకోగలను. ఎవరి భవిష్యత్తు ఎలా వుండబోతుందో చెప్పగలను,’’ అన్నాడు.

గంటమ్మ కుతూహలంగా, ‘‘ఎవరో సామాన్య బాటసారి అనుకున్నాను, క్షమించండి! నా భవిష్యత్తు ఎలావుంటుందో చెప్పగలరా?’’ అన్నది.


రామేశ యోగిలా ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచి, గంటమ్మ కేసి అబ్బుర పడుతూన్నట్టు చూసి, ‘‘గంటమ్మా! నువ్వు డబ్బు తీసుకుని అన్నం పెట్టినా, బాటసారుల ఆకలి తీర్చిన అన్నపూర్ణవు. భగవంతుడు నిన్ను మెచ్చాడు. నాకు కాలం సమీపిస్తున్నది. నా ఇచ్ఛాశక్తిని, దివ్యదృష్టిని సంతోషంగా నీకు దానం చేసి, శ్రీశైలం వెళ్ళి శివసాన్నిధ్యంలో ముక్తి పొందుతాను. ఈ తెల్లవారు జామున మన ఊరి చెరువుగట్టున వున్న ఊడల మర్రికింద, వాటిని నీకు ధారాదత్తం చేస్తాను,’’ అన్నాడు.

తెల్లవారు జామున ఇద్దరూ చెరువుగట్టుకు చేరుకున్నారు. గంటమ్మ చెరువులో స్నానం చేసివచ్చింది. రామేశం తన శక్తులను ఆమెకు దానం చేసి, ‘‘గంటమ్మా! ఈ యోగశక్తుల్ని ఎట్టి పరిస్థితులలోనూ స్వార్థంకోసం దుర్వినియోగం చే…యకూడదు. అలా చేస్తే, నువ్వు మతిభ్రమకులోనై ఊళ్ళు పట్టుకు తిరగవలసివస్తుంది!’’ అని హెచ్చరించాడు.

గంటమ్మ, ఆ హెచ్చరిక విని తెల్లబోయింది. తనకు ఉపయోగపడని, ఈ శక్తులవల్ల ఏంప్రయోజనం! ఆమె అలా ఆలోచిస్తున్నంతలో, రామేశం చెట్టు కింది నుంచి లేచి చకచక అడుగులు వేసుకుంటూ క్షణాల మీద కను మరుగయ్యాడు.

గంటమ్మ దిగులుగా ఇంటికి తిరిగి వచ్చి, తనకున్న శక్తుల్ని గురించిన మాటను పక్కకు పెట్టి, మామూలు పూటకూళ్ళమ్మ లాగే జీవించ సాగింది. గంటమ్మలో ఇదివరకటి ఉత్సాహం లేకపోవడం, ఆమె పెంపుడుకొడుకు గోవిందరాజు గమనించాడు. ఒక నాడు అతడు గుచ్చిగుచ్చి రెట్టించి అడిగాక, గంటమ్మ అనుకోకుండా తనకు లభించిన దివ్యశక్తుల్ని గురించి అతడికి చెప్పి, వాటిని ఉపయోగిస్తే తనకు కలగబోయే ప్రమాదాన్ని గురించి వివరించివాపోయింది.

గోవిందరాజుకు ఇదంతా ఏదో కలలాగా తోచింది. అయినా దానిని గురించి మరువ లేకపోయాడు. ఆమర్నాటి మిట్టమధ్యాహ్నం వేళ అతడు ధైర్యంగా చెరువుగట్టునవున్న ఊడలమర్రి దగ్గరకు వెళ్ళాడు. అతడు చెట్టుపైకి ఒకసారి చూసి కూర్చోబోయేంతలో, చెట్టుపై నుంచి ఒక వింత ఆకారం దిగింది. అది పిశాచమని గుర్తించిన గోవిందరాజు నిలువెల్లా వణకసాగాడు.


పిశాచం భయపడకు అన్నట్టు చేయి ఊపి, ‘‘నేను, నిన్ను పెంచిన గంటమ్మ పెద్దమ్మకు శక్తులిచ్చిన రామేశం యోగికి తండ్రిని. కుటుంబంతో పాటు మంటల్లో బలవన్మరణం చెందడంవల్ల, ఇలా పిశాచాన్నయ్యాను. నువ్వు, నీ పెద్దమ్మకు కొడుకుతో సమానం కాబట్టి, ఆమె తన దివ్యదృష్టినుపయోగించి, నీ భవిష్యత్తు చెబితే, అది స్వార్థమే అవుతుంది. కానీ, గంటమ్మకున్న శక్తులవల్ల నీకు శుభం కలిగేలా, నేను చేయగలను,’’ అన్నది.

ఆ మాటలతో గోవిందరాజు మొండి ధైర్యం తెచ్చుకుని, ‘‘మా పెద్దమ్మ శక్తులు నాకు శుభం కలిగించేలా ఎలా చేయగలవు?’’ అని అడిగాడు పిశాచాన్ని. అప్పుడు పిశాచి రూపంలోని రామేశం తండ్రి, ‘‘నేను మరణించాను కాబట్టి, నాకు బంధుత్వాలు అంటవు. నీగంటమ్మ పెద్దమ్మను, నా భవిష్యత్తేమిటని అడుగు!’’ అన్నది.

 రామేశం తండ్రి కోరికకు సరేనన్న గోవిందరాజు, ఇంటికి తిరిగి వచ్చి, గంటమ్మకు జరిగింది చెప్పాడు.
తన శక్తుల్ని పరీక్షంచుకునే అవకాశం వచ్చినందుకు గంటమ్మ చాలా సంతోషించింది. అయితే, పిశాచి భవిష్యత్తును దివ్య దృష్టిలో చూసి గంటమ్మ గతుక్కుమన్నది. ఎందుకంటే, ఆ పిశాచానికి తన సహాయంవల్ల, పిశాచి రూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఒక వేళ తన స్వార్థం అవుతుందేమో అని శంకించి, ఆమె అప్పటికప్పుడే, గోవిందరాజును వెంటబెట్టుకుని ఊడలమర్రి దగ్గరకు వెళ్ళింది.


పిశాచి చెట్టుదిగి వచ్చి గంటమ్మకు నమస్కరించి, ‘‘నేను రామేశం తండ్రి నన్న సంగతి విన్నావు కదా! ఆనాడు మంటల్లో మరణంపాలైనవాళ్ళల్లో, రామేశం చెల్లెలైన, నా కూతురు గిరిజ కూడా వుంది. ఇప్పుడా గిరిజ, మన పక్క గ్రామమైన శివపురంలో, నాతమ్ముడి కొడుకైన శివరాజుకు మనమరాలుగా పుట్టి యుక్తవ…యస్కురాలైంది. దానికి మాటలు రావు! నీ ఇచ్ఛాశక్తి దానికి మాట తెప్పిస్తుంది. ఈ గోవిందరాజుకు, శివరాజు మనమరాలినిచ్చి పెళ్ళి చేయడం, నా కోరిక అని చెప్పు. శివరాజు మంచి ఆస్తి పరుడు గనక, గోవిందరాజుకు పొలం కట్నంగా ఇస్తాడు. అందువల్ల, నీ పెంపుడు కొడుకు ఐశ్వర్యవంతుడవుతాడు. నాకు పిశాచరూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో నీ స్వార్థం అంటూ ఏమీ లేదు, పుణ్యం తప్ప!’’ అంటూ పిశాచం, గంటమ్మకు మరొకసారి నమస్కరించి చెట్టుపైకి వెళ్ళిపోయింది.

పిశాచి మాటలు శ్రద్ధగా విన్న గంటమ్మకు, అన్ని సంశయాలూ తీరిపోయాయి. ఆమె, గోవిందరాజుతో పాటు శివపురంవెళ్ళి, తన యోగ శక్తితో శివరాజు కూతురుకు మాటలు వచ్చేలా చేసింది. గంటమ్మ ద్వారా సంగతంతావిన్న శివరాజు, తనకుమార్తెకు గోవిందరాజుతో పెళ్ళి జరిపించడమేగాక, కొంత పొలం కట్నంగా కూడా ఇచ్చాడు.

గంటమ్మ యోగశక్తుల్ని గురించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోయింది. క్రమంగా ధనవంతులూ, వ్యాపారులూ తమతమ భవిష్యత్తు ఎలావున్నదో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు రాసాగారు.

గంటమ్మ తన ఓగశక్తులతో వాళ్ళకు భవిష్యత్తు గురించి వివరించేది. వాళ్ళు ఇవ్వజూపిన ప్రతిఫలాన్ని తీసుకోవడం స్వార్థం అవుతుంది గనక, వాళ్ళ చేత ప్రజోపయోగకరమైన పాఠశాలలూ, వైద్యాలయాలూ స్థాపించేలా డబ్బు ఖర్చుపెట్టించేది.

ఈ విధంగా, పూటకూళ్ళ గంటమ్మ, యోగశక్తుల గంటమ్మగా నలుగురి చేతా గౌరవింపబడుతూ, సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తూ, చాలాకాలం సుఖంగా జీవించింది.



రంగు రంగుల మనుషులు


ప్రపంచ సృష్టి జరిగిన తొలిరోజులలో భూమి మీద కొండలూ, లోయలూ, నదులూ, సముద్రాలూ మాత్రమే ఉండేవి. ఒక్క పురుషుడు గాని, స్ర్తీగాని లేరు. అప్పటికి మానవ సృష్టి జరగలేదు.

ఒకనాటి ఉషోదయం సమయంలో సంతోషంగా నిద్ర నుంచి లేచిన మానీటూ దేవుడు, భూమికేసి చూసి మనుషులను సృష్టించవలసిన సమయం ఆసన్నమయిందనుకున్నాడు. నదీ తీరం నుంచి గుప్పెడు బంకమన్ను తెచ్చి, తనకు నచ్చిన రీతిలో జాగ్రత్తగా ఒక అందమైన మనిషి బొమ్మను తయారు చేశాడు. మన్ను గట్టిపడి అది దృఢంగా వుండడానికి ఇక చేయవలసిందల్లా, దానిని కాల్చడం ఒక్కటే మిగిలింది. దేవుడు మట్టి బొమ్మను పోయ్యిపై వుంచి, పుల్లలతో నిప్పు రాజిల్లేలా చేశాడు.

ఆ తరవాత, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల, విశ్రాంతి తీసుకోవడానికి దాపులనున్న ఒక చెట్టునీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి కునుకు పట్టడంతో, అలాగే నిద్రలోకి జారుకుని చాలా సేపు నిద్రపోయాడు. ఏదో మాడుతున్న వాసన రావడంతో ఉలిక్కి పడి లేచాడు. పొయ్యిపై కాలుతూన్న మట్టిబొమ్మ జ్ఞాపకం వచ్చింది. ఒక్క గెంతున వెళ్ళి, పొయ్యిని తెరిచి చూశాడు. మనిషి బొమ్మ బాగా మాడిపోయి బొగ్గులా నల్లగా వుంది.

దానిని చూసిన మానీటూ, ‘‘ఫరవా లేదు,’’ అనుకుంటూ, ‘‘ఇది నల్లజాతి ప్రజలకు మూల మవుతుంది,’’ అని బొమ్మను భూమి మీదికి వదిలాడు. మరురోజు మానీటూ మరొక మట్టి బొమ్మను తయారు చేశాడు. ఈసారి దానిని కాల్చడానికి అత్యంత జాగ్రత్తను తీసుకున్నాడు. దానిని ఎక్కువసేపు కాల్చితే మాడిపోయి మళ్ళీ నల్లగా అయిపోతుందేమో అన్న అనుమానం కొద్దీ, తొందరపడి ముందుగానే పొయ్యిమీది నుంచి తీసేశాడు.


దాంతో బొమ్మ కాలీ కాలకుండా పేలవంగా తెల్లగా తయారయింది. ‘‘ఫరవా లేదు. ఇది శ్వేతజాతి ప్రజలకు మూలమవుతుంది,’’ అనుకుంటూ మానీటూ ఆ బొమ్మను భూమిమీదికి వదిలాడు.

మూడవరోజు మానిటూ మరింత జాగ్రత్తగా మరొక బొమ్మను తయారుచేశాడు. ఎక్కువ సేపు కాలినా నల్లగా మారకూడదన్న ఉద్దేశంతో బొమ్మకు నూనె పూసి పొయ్యిమీద పెట్టాడు. అయినా ఈ ప్రయత్నం కూడా విజయవంతంకాలేదు. బొమ్మ, నల్లగానూ లేదు, తెల్లగానూ లేదు. పసుపురంగుగా తయారయింది. ‘‘సరే, వీళ్ళు పసుపు రంగు ప్రజలు!’’ అనుకుంటూ దానిని భూమిమీదికి వదిలిపెట్టాడు.

 నాలగవరోజు తెల్లవారగానే మానీటూ పట్టుదలగా కూర్చుని నాలగవ బొమ్మను చక్కగా తయారుచేశాడు. దానిని ఇప్పుడు ఎలా పక్వంగా కాల్చాలో ఆ…యనకు బాగా తెలిసిపోయింది. బొమ్మకు తగినంత నూనె రాసి పొయ్యిమీద పెట్టాడు. ఆ తరవాత పొయ్యిలో సరిగ్గా కావలసినన్ని కట్టెలు పెట్టి నిప్పు రగిలించాడు. బొమ్మ ఎలా కాలుతున్నదో జాగ్రత్తగా చూశాడు. ఆ విధంగా పరిపూర్ణమైన మనిషిని సలక్షణ రూపంతో తయారుచేశాడు. ఆ మనిషి అద్భుతమైన ఊదా-ఎరుపు రంగులో ఉన్నాడు.

 ‘‘వీరే ఎరజ్రాతి ప్రజలు! నేను తయారు చేసిన సర్వోత్తమమైన మనిషిబొమ్మ ఇదే!’’ అంటూ దానిని కూడా భూమీమీదికి వదిలాడు. వారే ఆ తరవాత రెడ్‌ ఇండి…యన్లుగా పిలవబడ్డారు.

ఈ విధంగానే వివిధ జాతుల సృష్టి భూమి మీద జరిగిందని రెడ్‌ ఇండి…యన్ల పూర్వగాథ చెబుతుంది. ఈ సృష్టి చేసిన మానీటూ రెడ్‌ ఇండియన్ల ఆరాధ్యదేవుడు.

విద్యాధికారి


కాంచనపురిని పరిపాలించే చంద్రసేనుడు మంచి పరిపాలనాదక్షుడు. తండ్రి తరువాత అతి పిన్నవయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి, అతడు పరిపాలనాపరంగానే కాక, సామాజికంగా కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాడు. యువకుడు, సంస్కరణాభిలాషి కావడంచేత, విద్యాబోధనలో మార్పురావాలని తలచాడు, చంద్రసేనుడు. ఆస్థాన విద్వాంసులనూ, రాజగురువునూ, ప్రముఖకవి, పండితులనూ ఆహ్వానించాడు. సుదీర్ఘచర్చల అనంతరం, రాజ్యమంతటా ఒకే విధమైన విద్యాబోధన జరగాలనీ, విద్యార్థులు వేద వేదాంగాల్ని అభ్యసిస్తూనే, తమకిష్టమైన వృత్తి విద్య, సామాజికనీతి, రాజనీతి వంటివి కూడా తప్పని సరిగా నేర్వాలనీ, వారు నిర్ణయించారు.

ఆపత్సమయంలో ఆత్మరక్షణ కూడా ముఖ్యమే! అందుచేత, శారీరక దృఢత్వం కోసం …యువకులు, వ్యాయామం, శస్త్రాస్ర్త విద్యలూ కూడా నేర్వాలని నిర్ణయం జరిగింది. ఇందుకుగాను, సమర్థుడైన ఒక విద్యాధికారిని నియమించి, ఆయన ఆధ్వర్యంలో రాజ్యంలోని గురుకులాలన్నీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవాలని తీర్మానించారు.

అయితే, విద్యాధికారి పదవి సామాన్యమైనది కాదు గనక, ఆ పదవిని అలంకరించే వ్యక్తిగొప్ప విద్యావంతుడూ, యుక్తాయుక్తాలు క్షుణ్ణంగా తెలిసినవాడూ అయివుండాలి. ఇందుకుగాను, రాజు చంద్రసేనుడు, విద్యాధికారిని నియమించే అధికారం, రాజగురువు మహేంద్రభట్టుకు అప్పగించాడు. మంచి ఉన్నత స్థానం, రాజుగారి వద్ద ప్రత్యేక ప్రాపకం, తగిన పారితోషికం లభించే విద్యాధికారి పదవి కోసం సహజంగానే పోటీ మొదలయింది. ఎంతో మంది యువకులు తమ అదృష్టాన్ని పరీక్షంచుకోవడానికి రాజధానికి రాసాగారు. రాజగురువు మహేంద్రభట్టు అనన్య సామాన్యమైన మేధావి. ఆయన అభ్యర్థులను ముందుగానే వ్యక్తిత్వ పరీక్షలకు  గురిచేసి, ఆ పిమ్మట మౌఖిక పరీక్షలు నిర్వహించదలచాడు.


 ఈ విధంగా, వ్యక్తిత్వ పరీక్షలలోనే చాలామంది వెనుదిరగవలసి వచ్చింది. కాంచనపురి రాజ్యంలోని సుందరవరం అనే గ్రామంలో, ఇంద్రదత్తుడు అనే యువకుడుండేవాడు. అతడు గురుముఖంగా శాస్ర్తాలన్నీ నేర్చి, చిన్నతనంలోనే కాశీ వెళ్ళి గొప్ప పాండిత్యం సంపాయించాడు. తర్వాత, తన స్వగ్రామానికి తిరిగివచ్చాక, తను నేర్చిన విద్యలను ఇతరులకు బోధించాలన్న కుతూహలం కలిగింది. ఆ తరుణంలోనే ఇంద్రదత్తుడికి, రాజాస్థానంలో విద్యాధికారి పదవి విషయం తెలియవచ్చింది. అతడు వెంటనే రాజధానికి బయలుదేరాడు. రాజధాని చేరిన తర్వాత, ఇంద్రదత్తుడు ఒక పూటకూళ్ళ ఇంటిలో బసచేశాడు. రెండు రోజులపాటు రాజధానీ నగరం అంతా కలయ తిరిగి ముఖ్యమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఎందరో యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే తపనలోవున్నారని, అతడికి అర్థమయింది. అభిరుచివున్నా అవకాశం లేక ఎందరో యువకులు విద్యార్జన చే…యలేక పోవడం అతణ్ణి కలవరపరిచింది.

మూడవ రోజు ఉదయాన్నే ఇంద్రదత్తుడు, రాజగురువు దర్శనార్థం వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ తుదిపోటీకి సైనికాధికారి కొడుకు దుర్జ…యుడు, కోశాధికారి కొడుకు విక్రముడు మిగిలారని అతడికి తెలిసింది. ఇంద్రదత్తుడిని చూస్తూనే మహేంద్రభట్టుకు సదభిప్రాయం కలిగింది. ఆయన, అతణ్ణి గురించిన వివరాలు అడిగి తెలుసుకుని, ‘‘సరే, నీవు రాజధానికి వచ్చిన తర్వాత, రెండు రోజులు కాలయాపన చేయడానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు.

‘‘ఆర్యా, క్షమించాలి, అందుకు కారణం కొంత వివరంగా చెబుతాను. నేను ఆశించే పదవి చాలా బాధ్యతాయుతమైనది. ఆ కారణంగా చాలా సమాచారం సేకరించవలసి వచ్చింది. మన నగరంలో మొత్తం ఎనిమిది విద్యాలయాలున్నాయి. రాజ్యం మొత్తంలో గురుకులాలనూ, విద్యాలయాలనూ కలిపితే, నూరుకు మించవు. మన రాజ్యంలోని విద్యార్థుల సంఖ్యకూ, సంస్థలకూ పొంతన కుదరడం లేదు, గురువుల అభిరుచిని బట్టి విద్యనేర్పడం జరుగుతున్నది. అందుచేత విద్యార్థుల మనస్తత్వాన్ని బట్టీ, అర్హతలను బట్టీ అందరికీ అవకాశం కల్పించే సంస్థలు కావాలి.


ఈ సమాచార సేకరణకు, నాకు రెండు రోజుల సమయం అవసరం అయింది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. విద్యాధికారి పదవీబాధ్యతలను, అంత బాగా ఊహించిన ఇంద్రదత్తుడి మీద అభిమానం కలిగింది, మహేంద్రభట్టుకు.
‘‘ఈ పదవి నీకే లభిస్తుందని, ఎలా అనుకుంటున్నావు?’’ అని అడిగాడు మహేంద్రభట్టు. ‘‘పూనిన ఏ కార్యాన్నయినా సాధించి తీరాలన్నది నా నైజగుణం. అంతే కాక, ఆశ అనేది లోపిస్తే, భవిష్యత్తు శూన్యం అవుతుంది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ఆ సమాధానానికి తృప్తి చెందిన మహేంద్రభట్టు, ఇంద్రదత్తుణ్ణి, దుర్జయ, విక్రములతో పాటుగా పరీక్షంచేందుకు పిలిచి, ‘‘అతి వేగంగా పయనించేది మనసుగదా, సరే! ఆ తర్వాత రెండవ స్థానంలో వుండేది ఏది?’’ అని అడిగాడు. ‘‘గాలి!’’ అన్నాడు దుర్జయుడు. ‘‘కాదు, అగ్ని!’’ అన్నాడు విక్రముడు.

 ‘‘నా ఉద్దేశంలో, మీ ప్రశ్నకు సమాధానం, వార్త! అది కేవలం కొన్ని నిమిషాలలోనే గాలి కన్నా, అగ్నికన్నా వేగంగా పయనిస్తుంది. ఎక్కడో మారుమూలనున్న మా గ్రామానికి, ఈ పోటీ గురించి మీరు ప్రకటించిన వార్త వెంటనే చేరిపోయిందంటే, వార్త యొక్క వేగం ఊహించవచ్చు!’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ‘‘మరొక ప్రశ్న. మనిషిని కాల్చేది ఏది?’’ అని ప్రశ్నించాడు మహేంద్రభట్టు. ‘‘నిప్పు!’’ అన్నాడు వెంటనే దుర్జయుడు.


‘‘అవును, నిప్పు మనిషినే కాదు, దేనినైనా కాలుస్తుంది!’’ అన్నాడు విక్రముడు. ‘‘ఆర్యా! నిప్పును మించి కాల్చి బాధించేది అపనింద! నిప్పువల్ల మనిషిలో మార్పురావచ్చు కానీ, అపనింద మనిషిని అంతర్గతంగా దగ్థం చేస్తుంది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ‘‘తదుపరి ప్రశ్న: మృత్యువును మన దగ్గరికి చేర్చేది?’’ ‘‘అనారోగ్యం!’’ అన్నాడు దుర్జయుడు. ‘‘చింత!’’ అన్నాడు విక్రముడు.

‘‘ఆర్యా! అనారోగ్యం, చింత, మృత్యువును దగ్గరికి చేర్చేవే కానీ, ఆ రెంటికీ కూడా ముఖ్య కారణం క్రోధం! అది మనలోని వివేకాన్ని దూరం చేస్తుంది. అకారణ ద్వేషాన్ని పెంచుతుంది. అనేక ప్రకంపనలకు లోనైన శరీరాన్ని మృత్యువు తేలికగా కబళించగలదు,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ఈ సమాధానానికి మహేంద్రభట్టు చిరునవ్వు నవ్వి, ‘‘ఇంద్రదత్తా! నువ్వు సమాధానం చెప్పిన తీరు బావుంది.

అయితే, నీకీ విద్యాధికారి పదవి లభిస్తే, ఎలా నిర్వహిస్తావు?’’ అని అడిగాడు. ‘‘పెద్దల అభిప్రాయాలను మన్నిస్తాను. దేశంలో ఎందరో …యువతీ…యువకులు, తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలన్న తపనతో వున్నారు.
అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఒక్కొక్కరూ ఒక్కొక్క విద్యాసంస్థగా మారి, విద్యాభ్యాస అవకాశాలు లేక నిర్లిప్తతకులోనై వున్నవారికి ఉత్సాహం కలిగించి, విద్యాబోధ చేయగలరు. నాకున్న విజ్ఞానాన్ని, తమబోటి విజ్ఞుల అనుభవంతో మిళితం చేసి, కాంచన పురి రాజ్యంలోని ప్రతి యువతినీ, యువకుణ్ణీ అపర సరస్వతీ మూర్తిగా రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.

ఆ విశ్వాసం నాకున్నది!’’ అన్నాడు ఇంద్రదత్తుడు ఉత్సాహంగా. ఆ తర్వాత, వారం గడవకుండానే, విద్యాధికారి పదవికి ఇంద్రదత్తుడు తగినవాడని నిర్ణయించాడు మహేంద్రభట్టు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. విద్యాధికారిగా ఇంద్రదత్తుడు అత్యంత ప్రతిభాశాలి అనిపించుకున్నాడు. ఆ విధంగా, రాజు చంద్రసేనుడి పాలనలో కాంచనపురం విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా చిరకాలం నిలిచింది.



ఋణవిముక్తి


ఒక గ్రామంలో రంగనాథం అనే పరమ లోభి ఒకడు ఉండేవాడు. అతను తన ఇంటి మీద పిచ్చుక వాలినా సహించలేక పోయేవాడు ; బోలెడంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బతికేవాడు. రంగనాధం భార్య చచ్చిపోయింది. తెలివి తేటలు లేని కొడుకు ఒకడు ఉన్నాడు.

రంగనాధం వాడికి గంజినీళ్ళు మాత్రమే పెట్టేవాడు. వాడు తిండికి ముఖం వాచి , కానీ దొరికితే చాలు , మిఠాయి దుకాణానికి పోయి , ఏదో ఒకటి కొనుక్కుతినేవాడు. డబ్బు కూడబెట్టటానికి రంగనాధం ఒక ఉపాయ చేశాడు. అతను తన ఇంట్లో ఒక మూల గొయ్యితీసి , అందులో ఒక బిందె పాతిపెట్టి , దాని మీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి , ఆ సందు తప్ప , పైకి బిందెజాడ ఏమీ కనబడకుండా చేశాడు. అతను తనకు వచ్చే డబ్బులో స్వల్పంగా ఖర్చుకు ఉంచుకుని , మిగిలినది బిందెలోకి జారవిడిచేవాడు.

తండ్రి ఇలా చెయ్యటం కొడుకు ఒకనాడు చూశాడు గాని , డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నదీ ఊహించలేకపోయాడు. వాడు తన తండ్రిని , ‘‘ అదేమిటి , నాన్నా ? ఇంకోపూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులు భూమిలోకి అలా జారవిడుస్తున్నావు ?’’ అని అడిగాడు.

రంగనాధం వాడితో , ‘‘ చూడు , బాబూ , భూమిలో మనకు అప్పుపెట్టిన ఋణదాతలున్నారు. వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది. మనం పేదవాళ్ళం గనక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేం. అందుకే రోజూ కొంచెం కొంచెంగా వారికి ముట్ట జెప్పుతున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వా వారికి ముట్టుతుంది ,’’ అన్నాడు.

ఈ మాట కొడుకు నమ్మేసి , తన తండ్రి లోభిగా బతకటం ఇందుకే కాబోలుననుకున్నాడు. వాడికి ఋణదాతల మీద పట్టరాని కోపం కూడా కలిగింది. వాడు తండ్రితో , ‘‘ వాళ్ళమూలాన్నేగదా మనం ఇలా రోజూ  కడుపు కట్టుకుంటున్నాం ? వాళ్ళకు ఇవ్వటం మానేసి మనం రెండు పూటలా కావలసినంత కడుపు నిండా తింటే సరి ,’’ అన్నాడు.

కొడుకు ధోరణి చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డంతగిలేటట్టు కనిపించేసరికి , వాణ్ణి బెదరగొట్టటానికి రంగనాధం , ‘‘ చూడు , బాబూ! వాళ్ళు సామాన్యులు కారు. ఒక్క రోజు మనం డబ్బులు వెయ్యటం మానితే , పెద్దపెద్ద కత్తులతో వాళ్ళు మనని నరకటానికి వస్తారు ,’’ అన్నాడు.

రంగనాధం కొడుకు బురల్రో ఈ మాటలు నాటుకున్నాయి. చలికాలంలో ఒక రాత్రి భోజనాలవేళ ఒక బైరాగి , ‘‘ ధర్మదాతలు , పట్టెడు అన్నం పెట్టించండి ,’’ అంటూ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసి రంగనాధానికి పట్టరాని ఆగ్రహం వచ్చి , ‘‘ ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు ,’’ అని అరిచాడు. బైరాగి బిత్తరపోయి , ‘‘ అయ్యా , భోజనం సంగతి దేవుడెరుగు. ఈ రాత్రికి నన్నీ వసారాలో పడుకోనివ్వండి ,’’ అని ప్రాధేయపడ్డాడు.

రంగనాధం మరింత మండిపడి , ‘‘ చెప్పుతూంటే మనిషివి కాదూ ? నీకు పరిచర్యలు చెయ్యటానికి నేనేమన్నా బాకీ ఉన్నానా ? వెళ్ళు! ’’ అంటూ ఆ బైరాగిని మెడపట్టి బయటికి గెంటాడు. ‘‘ నాకు కాకపోతే మరెవరికో బాకీ ఉండటం మూలాన్నే ఇలా పస్తులుంటూ కూడబెట్టుతున్నావు. నువ్వు సంపాదించినదంతా మరెవడికో దక్కుతుంది. దాన్ని అనుభవించే అర్హత నీకుండదు ,’’ అన్నాడు బైరాగి. ‘‘ నీలాటి పాపిష్ఠి ముఖాలను ఇంట్లోకి రానిస్తే అదే జరగవచ్చు.

ఈ రాత్రి బయట చలిలో అఘోరించావంటే నీకూ తెలుస్తుంది అనుభవం ,’’ అన్నాడు రంగనాధం కసిగా. ‘‘ సమయం వస్తే నీకూ అదేగతి పట్టుతుంది మిడిసిపడకు! ’’ అన్నాడు బైరాగి. ‘‘ లంకంత ఇల్లు ఉండగా నా కెందుకు అలా జరుగుతుందిరా ? వీధులన్నీ ఉన్నవి నీలాంటి వెధవల కోసమేరా! ’’ అంటూ రంగనాధం దభీమని తలుపు మూశాడు. కొన్నాళ్ళ అనంతరం రంగనాధానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో , ‘‘ ఒరేయ్ , ఇల్లు జాగ్రత్త. రోజూ వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు. నేను రెండు , మూడు రోజుల్లో తిరిగి వస్తాను ,’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

  రంగనాధం కొడుకు , చేతికి అందిన చిల్లరడబ్బులు భూమిలో వెయ్యటం ఇష్టంలేక , దానితో మిఠాయి కొనుక్కు తినసాగాడు. రెండు రోజులు గడిచాయి. మూడో రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రివేళ ఎవరో తలుపుకొట్టారు. రంగనాధం కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్ళి తలుపుతీశాడు. ముగ్గురు దొంగలు కత్తులూ , కటార్లతో లోపలికి వచ్చారు. కురవ్రాడికి వాళ్ళను చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది.

వాళ్ళు తప్పక ఋణదాతలై ఉంటారనుకున్నాడు వాడు. తాను రెండు రోజులుగా వాళ్ళకు డబ్బువెయ్యలేదు! వాడు వాళ్ళతో , ‘‘ అయ్యా , ఋణదాతలూ! మన్నించండి! డబ్బు చేతికి రానందున రెండు రోజులుగా భూమిలో డబ్బు వెయ్యనిమాట నిజమే. మా నాన్న గనక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వెయ్యకుండా నిద్రపోయేవాడు కాడు. ఆయన ఊళ్ళోలేడు. నాకు ఆ పని చెయ్యటం చేతకాలేదు. రేపు మీ డబ్బు మొత్తం అంతా ఎలాగైనా సరే అందులో వేస్తాను.

ఈ సారికి నన్ను వదిలి వెయ్యండి! ’’ అన్నాడు. వాడు ఏ మంటున్నదీ వాళ్ళకు అర్థంకాలేదు. కాని డబ్బు ఎక్కడో తమకోసం వేస్తున్నట్టు వాళ్ళకు స్పష్టమయింది. వారిలో ఒకడు కురవ్రాడితో , ‘‘ ఏదీ ? మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు ? చాలాకాలంగా మాకు డబ్బు చేరలేదు ?’’ అన్నాడు. రంగనాధం కొడుకు అక్కడవున్న మంచం పక్కకు నెట్టి , బిందె పాతినచోటు దొంగలకు చూపాడు. దొంగలు అక్కడ తవ్వి , బిందెను పైకి తీశారు. దాని నిండా మొయ్యలేనంత చిల్లర ఉన్నది.

దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రంగనాధం ఊరు నుంచి తిరిగి వచ్చి , బిందె ఉండవలిసిన చోట గొయ్యి చూసి , లబో దిబో మన్నాడు. ‘‘ నా బిందె! నా డబ్బు! ’’ అంటూ బావురుమని ఏడుస్తూ , జుట్టు పీక్కున్నాడు.

తండ్రి ప్రవర్తన చూసి కొడుకు , ‘‘ అదేమిటి , నాన్నా , మన సొమ్మంతా దొంగ లెత్తుకుపోయినట్టు బాధ పడుతున్నావూ ?’’ అని అడిగాడు. ‘‘ అయితే , తీసి దాచావా ?’’ అని రంగనాధం కొడుకును అడిగాడు ఆశగా. ‘‘ నువ్వేమీ కంగారు పడకు. అది వాళ్ళసొమ్మే గనక వాళ్ళను తీసుకు పోనిచ్చాను ,’’ అన్నాడు కొడుకు.

రంగనాధానికి ఒళ్ళు మండిపోయింది. అతను తన కొడుకు గొంతు పట్టుకుని , ‘‘ ఎవర్రా వాళ్ళు ? నా సొమ్ము వాళ్ళదెలా అవుతుంది ?’’ అని అరిచాడు. ‘‘ అదే , నాన్నా! ఆనాడు నువ్వు చెప్పావు చూడూ , ఆ ఋణదాతలే వచ్చారు ,’’ అంటూ కొడుకు రంగనాధానికి జరిగినదంతా వివరించాడు. ‘‘ ఒరేయ్ , బుద్ధి గడ్డి తిని నీతో అలా చెప్పాను! ఆ వచ్చింది పచ్చి దొంగలురా! ముక్కూ మొహమూ తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టితే , బుద్ధి ఉన్నవాడివైతే తలుపులు తీస్తావుట్రా ?’’ అన్నాడు రంగనాధం. అవును!

తనవల్ల పొరపాటే జరిగింది. ఇంకెప్పుడూ అలా చెయ్యరాదని నిర్ణయించుకున్నాడు రంగనాధం కొడుకు.
తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే తన డబ్బు గురించి అందరికి తెలిసిపోతుందని , రంగనాధం రాత్రివేళ దొంగలను అన్వేషిస్తూ చుట్టుపట్ల గ్రామాలు తిరగసాగాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు మతిమాలిన వాడయినందుకు విచారిస్తూ , రంగనాధం వీధి తలుపుకు చేరగిల బడ్డాడు.

చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది. తెల్లవార్లూ చలికి బిగిసి , తెల్లవారగట్ల రంగనాధం కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న బైరాగి రంగనాధాన్ని తట్టిలేపి , ‘‘ అయ్యా , లంకంత ఇల్లు ఉండగా , ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావేం ?’’ అని అడిగాడు. ‘‘ ఏం చెప్పమంటావు ? ఆనాడు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి.

ఒకడికి పెట్టకుండా , నేను తినకుండా కూడబెట్టినదంతా దొంగలు దోచుకున్నారు ,’’ అన్నాడు రంగనాధం.
‘‘ అలా అనుకోవద్దు. వాళ్ళు దొంగలుకారు , ఋణదాతలు , ఋణవిముక్తి అయినందుకు సంతోషించండి ,’’ అంటూ బైరాగి సాగిపోయాడు. ఆ నాటి నుంచీ రంగనాధం మారిపోయి , తాను తింటూ , ఇతరులకు ఇంత పెట్టుతూ , సుఖంగా చాలాకాలం జీవించాడు.



కరుణా హృదయుడు కొచ్చుణ్ణి!

షర్‌వూడ్‌ అడవుల్లోని రాబిన్‌హూడ్‌ సాహసకృత్యాల గురించి మీకు తెలుసు. అవునా? వందలాది సంవత్సరాలకు పూర్వం ఇంగ్లాండులో జీవించిన రాబిన్‌హూడ్‌ ధనికులను దోచి పేదలకు పంచిపెట్టేవాడు. దాదాపు అదే పద్ధతిలో కేరళ ప్రాంతంలో కొచ్చుణ్ణి కొన్నేళ్ళ క్రితం ధనికులకు సింహస్వప్నంగా ఉండేవాడు. ముఖ్యంగా పేదలను దోచుకునే వారన్నా, వేధించే వారన్నా కొచ్చుణ్ణికి అసలు గిట్టదు. అతడు ధనికుల నుంచి దొంగతనాలు చేసిన మాట వాస్తవమే. అయితే, అలా దొంగిలించిన దానిలో చిల్లిగవ్వ కూడా తన సొంతానికి ఉపయోగించుకోలేదు. అంతా పేదలకు ఇచ్చేసేవాడు. ఆ రోజుల్లో ‘కాయాంకుళం కొచ్చుణ్ణి’ పేరు చెబితే చాలు, డబ్బున్న వారి గుండెలు దడదడలాడేవి. దక్షణ కేరళలోని కాయాంకుళం పరిసర ప్రాంతంలో అతడు ఉండేవాడు.

 అదే ప్రాంతంలో ఒక భూస్వామి ఉండేవాడు. అతడు వ్యవసాయంతో పాటు వడ్డీవ్యాపారం కూడా చేసేవాడు. నగలు తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాడు. వడ్డీ డబ్బులతో అచిరకాలంలోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. అప్పు తీర్చే శక్తిలేక కొందరు తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అలాగే వదిలేసేవారు. అలాంటి నగలు కూడా అతని సొంతమైపోయేవి.

ఇలా కూడబెట్టిన ధనంతో అతడొక ఇల్లు కట్టాడు. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు. చిన్నకోటలాంటి భవంతి. ఇంటి గోడలు మరీ దృఢంగా ఉండేలా కట్టించాడు. ఇంటి మీద అంత డబ్బు ఎందుకు వెచ్చిస్తున్నావని మిత్రులు అడిగితే, ‘‘కొచ్చుణ్ణి గురించి మీకు తెలియదా? ఆ దుర్మార్గుడు ఇంటికి కన్నం వేయడానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు?


ప్రజలు తాకట్టు పెట్టిన నగలను కాపాడే బాధ్యత నాకున్నదికదా? అందుకే దృఢమైన గోడలు కట్టిస్తున్నాను. ఒక్కడు కాదు; పదిమంది కొచ్చుణ్ణిలు వచ్చినా లోపలికి రాలేరు,’’ అనేవాడు గొప్పగా.  భూస్వామి చెప్పుకునే గొప్పలు ఆ నోటా ఈ నోటా పడి కొచ్చుణ్ణి చెవిన పడ్డాయి. భూస్వామికి తగిన గుణపాఠం నేర్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.

ఒకరోజు కొచ్చుణ్ణి బాగా ఆలోచించి భూస్వామి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పు అడిగాడు. భూస్వామి మారు మాట్లాడకుండా అడిగినంత డబ్బు ఇచ్చేశాడు. కొచ్చుణ్ణి ఇక చేసేది లేక భూస్వామి ఇంటిని పరిశీలనగా చూసి తిరిగి వచ్చాడు. కొన్నాళ్ళ తరవాత, కృష్ణన్‌ నాయర్‌ అనే వ్యక్తి నగలు తాకట్టుపెట్టి, భూస్వామి దగ్గర వెయ్యి రూపాయలు అప్పుపుచ్చుకున్నాడు. ఇది కొచ్చుణ్ణికి తెలియవచ్చింది. ఒకనాడు చీకటి పడుతూండగా,  కొచ్చుణ్ణి భూస్వామి ఇంటిని సమీపించాడు.

ఆ సమయంలో భూస్వామి శరీరానికి నూనె పట్టించుకుని స్నానం కోసం పెరట్లోవున్న చిన్న కొలను దగ్గరికి వెళుతున్నాడు. దానిని చూసిన కొచ్చుణ్ణి చకచకా ఇంటి గుమ్మం  సమీపించి, ‘‘ఇలా చూడు, కృష్ణన్‌ నాయర్ అప్పు చెల్లించడానికి వచ్చాడు.  డబ్బు తీసుకుని, పట్టు సంచీలో వున్న అతని నగల్ని తెచ్చి ఇవ్వు,’’ అన్నాడు భూస్వామి కంఠస్వరంతో భార్యను ఆజ్ఞాపిస్తున్నట్టు.  భూస్వామిభార్య ఇంటిలో నుంచి గుమ్మంలోకి వచ్చింది.

 అక్కడ నిలబడ్డ మనిషిని చూసి, అతడు ఇచ్చిన డబ్బు సంచీని తీసుకుపోయి లోపల పెట్టి, పట్టుసంచీలో ఉన్న నగలను తెచ్చి ఆ మనిషి చేతికిచ్చింది.  మనిషి వచ్చినదారినే హడావుడిగా వెళ్ళిపోయాడు.  ఇదంతా జరుగుతున్నప్పుడు భూస్వామి పెరటి కొలనులో హాయిగా స్నానం చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమీ తెలియదు. కొన్నాళ్ళు గడిచింది. గడువు సమీపించడంతో, కృష్ణన్‌ నాయర్‌, వడ్డీతో సహా అప్పు తిరిగి చెల్లించి నగలు తెచ్చుకోవడానికి భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. డబ్బులు తీసి జాగ్రత్తగా లెక్కపెట్టిన తరవాత భూస్వామి, ఇంటి లోపలికివెళ్ళి పెట్టె తెరిచి చూసి దిగ్భ్రాంతి చెందాడు. కృష్ణన్‌ నాయర్‌ నగలతో ఇచ్చిన పట్టు సంచీ అక్కడ కనిపించలేదు!


 భూస్వామి భార్యను పిలిచి సంచీని గురించి అడిగాడు. ‘‘అప్పుడే మరిచి పోయారా? బావుంది. ఇంత మతిమరుపయితే వ్యాపారం చేసినట్లే. నిన్నగాక మొన్ననే కదా మీరు కృష్ణన్‌ నాయర్‌ డబ్బు తెచ్చాడు. డబ్బు తీసుకుని అతనికి నగలు ఇచ్చి పంపించు, అని చెప్పారు?’’ అన్నది భార్య.

‘‘అలాగా మరి డబ్బు ఎక్కడ?’’ అని అడిగాడు భూస్వామి ఏమి జరిగిందో అంతుబట్టక. ‘‘పెట్టెలోనే వుంది. ఎరబ్రట్టలో మూటగా కట్టివుంది. నెమ్మదిగా చూడండి,’’ అన్నది భార్య. భూస్వామి ఎర్ర మూటను విప్పి చూశాడు. అందులో డబ్బులేదు. ఎందుకూ పనికిరాని రాగి, సత్తు నాణాలు ఉన్నాయి. భూస్వామి మౌనంగా గుమ్మంలోకి వచ్చాడు. కృష్ణన్‌ నాయర్‌కి జరిగిన సంగతి వివరించి క్షమాపణలు చెప్పుకున్నాడు.  నగలు ఎంత ఖరీదువో అతని నుంచి తెలుసుకుని, ఆ మొత్తాన్ని చెల్లించాడు. కృష్ణన్‌ నాయర్‌ దానిని పుచ్చుకుని తృప్తిగా వెళ్ళిపోయాడు. జరిగిన మోసానికి, భూస్వామీ అతని భార్యా తెగబాధ పడిపోయారు, పట్టరాని విచారంతో. తమను ఇంతగా మోసగించినవాడు ఎవడై ఉంటాడా, అని ఆలోచించారు. ‘‘ఆ రోజు సాయంకాలం వచ్చిన వాడి ముఖం నీకు గుర్తుందా!’’ అని అడిగాడు భూస్వామి ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ. ‘‘నాకెలా గుర్తుంటుంది? డబ్బు పుచ్చుకుని  నగలు ఇవ్వమని నన్ను పురమాయించింది సాక్షాత్తు మీరు. వచ్చినవాడే కృష్ణన్‌ నాయర్ అనుకున్నాను,’’ అన్నది భార్య.

‘‘ఆ రోజు వచ్చినవాడు కొచ్చుణ్ణి అయివుంటాడా? నా కంఠస్వరంతో మాట్లాడి, నా భార్యనే మోసగించినవాడు మరెన్ని ఘోరాలు చేస్తాడో ఏమో!’’ అనుకుంటూ భూస్వామి విచారంతో కుమిలిపోసాగాడు. కొంత సేపటికి, ‘‘ఏమయింది? ఆలుమగలు విచారంతో తెగబాధపడి పోతున్నారు?’’ అంటూ కొచ్చుణ్ణి అక్కడికి వచ్చాడు. భూస్వామి నోరు తెరవలేకపో…ూడు. అతని భార్య జరిగిందంతా పూసగుచ్చినట్టు కొచ్చుణ్ణికి వివరించింది. కొచ్చుణ్ణి చిన్నగా నవ్వుతూ, బట్టల్లో దాచిన పట్టు సంచీని తీసి భూస్వామి చేతికి ఇస్తూ, ‘‘నగలన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకుని, కృష్ణన్‌ నాయర్‌కు కబురు చేసి రమ్మని, అతని నగలు అతనికి అప్పగించి, నీ డబ్బు  నువ్వు తిరిగి పుచ్చుకో. ఏదో నీ కోటలోకి నేను అడుగుపెట్టలేనని నువ్వు ప్రగల్భాలు పలికావని విన్నాను.


అందుకే ఈ చిట్కా ప్రయోగించాను,’’ అన్నాడు. భూస్వామి చేతులు జోడించి కొచ్చుణ్ణికి క్షమాపణలు చెప్పుకున్నాడు. కొచ్చుణ్ణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తరవాత భూస్వామి పేదల నుంచి అధిక వడ్డీలు గుంజకుండా, వేధించకుండా తన పద్ధతులను మార్చుకున్నాడు. ఆ సంగతి తెలిసి సంతోషించిన కొచ్చుణ్ణి మరెప్పుడూ భూస్వామి జోలికి పోలేదు. భూస్వామి కూడా కొచ్చుణ్ణి  పట్ల గౌరవమర్యాదలు చూపేవాడు. అదే ప్రాంతంలో క్రైస్తవుడైన ఒక ఎండు కొబ్బరి వ్యాపారి ఉండేవాడు.
అతనికి ఎంత ప్రయత్నించినా వ్యాపారం కలిసిరాలేదు. తరచూ అందిన చోట అధిక వడ్డీలకు అప్పులు చేసేవాడు. వీలైప్పుడు అప్పులు వడ్డీలతో సహా తీర్చేవాడు. వీలుకానప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి వేరొక చోట అప్పులు చేసేవాడు.
అయినా మునుముందు వ్యాపారం బాగా నడిచి, లాభాలు ఆర్జించి అప్పులు లేని బతుకు సాగించకపోతామా అన్న గంపెడాశతో అతడు కాలం గడపసాగాడు. ఒకరోజు ఆ వ్యాపారి అలెప్పీకి వెళ్ళి సరుకు అమ్మి తిరుగు పడవలో ప్రయాణమయ్యాడు. వ్యాపారం లాభసాటిగా జరగలేదు. పడవలో విచారంగా తలవంచుకుని కూర్చుని ఈ పరిస్థితుల్లో ఎలా నెట్టుకు రావడమా అని తీవ్రంగా ఆలోచించ సాగాడు. సాయంకాలం బాగా పొద్దు పోయింది. పడవ వెళుతోంది. ఉన్నట్టుండి వేగంగా వచ్చే పడవ తెడ్ల శబ్దం వినిపించింది.

 ఆ పడవ దగ్గరికి రాగానే అందులో నుంచి ఒక మనిషి, వ్యాపారి వెళుతూన్న పడవలోకి దూకాడు. అతన్ని చూడగానే వ్యాపారి భయంతో గడగడా వణకసాగాడు. అతడు కొచ్చుణ్ణి. ‘‘ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు?’’ అని గద్దించి అడిగాడు కొచ్చుణ్ణి. ‘‘కొబ్బరి వ్యాపారిని. అలెప్పీ నుంచి వస్తున్నాను,’’ అన్నాడు వ్యాపారి భయంభయంగా. ‘‘అలాగా! అలెప్పీలో మంచి లాభాలే సంపాయించావు కదా? నీ దగ్గరున్నదంతా మర్యాదగా ఇలా ఇవ్వు!’’ అని గద్దించాడు కొచ్చుణ్ణి. ‘‘బాబూ, నేను నిరుపేద వ్యాపారిని. నన్నేం చేయకు, నీకు పుణ్యముంటుంది,’’ అని వేడుకున్నాడు వ్యాపారి. ‘‘నేను కొచ్చుణ్ణిని. నేను చెప్పింది చేయకపోతే, ఏం జరుగుతుందో తెలుసుకదా?’’ అని హెచ్చరించాడు కొచ్చుణ్ణి. వ్యాపారి మరేం మాట్లాడకుండా, రొండిన దోపుకున్న డబ్బు దాచిన చిన్న గుడ్డసంచీ తీసి కొచ్చుణ్ణికి ఇచ్చాడు.

‘‘అందులో ఎంత ఉందేమిటి?’’ అని అడిగాడు కొచ్చుణ్ణి.


‘‘రెండు వందలా యాభై రూపాయలు. వ్యాపారంలో మరీ నష్టమొచ్చింది,’’ అన్నాడు వ్యాపారి క్షమించమనే ధోరణితో.
‘‘సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు,’’ అంటూ కొచ్చుణ్ణి మెరుపులా పక్కనున్న తన పడవలోకి దాటుకున్నాడు. క్షణాల్లో పడవ చీకట్లో కలిసిపోయింది.

వ్యాపారి గాఢంగా నిట్టూర్చి, పేరు మోసిన దొంగనుంచి ఎలాంటి హానీ లేకుండా తనను కాపాడినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థించాడు.

ఇంటికి చేరి భార్యను చూడగానే కళ్ళనీళ్ళ పర్యంతమైపోయాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయగలం? ఎక్కడికి వెళ్ళగలం. చేయగలిగిందల్లా ఒక్కటే. ఉన్న ఇల్లు అమ్ముకుని, వచ్చే డబ్బుతో కాలం గడుపుదాం,’’ అన్నది భార్య ఓదారుస్తూ. వ్యాపారికి భార్య సూచన సరైనది గానే తోచింది.
ఇల్లు కొనగలవారి కోసం వెతకసాగాడు.

కష్టాల్లో ఉన్నాడు. ఎటొచ్చీ అమ్మక తప్పదు అన్న సంగతి తెలిసి పోవడంవల్ల ఇంటికి మంచిధర ఇవ్వడానికి ఒక్కరూ ఇష్టపడలేదు. అంత చిన్నమొత్తానికి అమ్మినా తమ వ్యాపారం కొనసాగించలేనన్న అనుమానంకొద్దీ వ్యాపారి ఇల్లు అమ్మడానికి వెనుకాడుతూ తటపటాయించ సాగాడు. ఒకనాటి సాయంకాలం కొచ్చుణ్ణి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వ్యాపారి అతన్ని చూడగానే లేచి నిలబడ్డాడు. ‘‘భయపడకు. నిన్ను దోచుకోవడానికో, వేధించడానికో నేనిప్పుడు రాలేదు.

 నీ దగ్గరి నుంచి దోచిన డబ్బు తిరిగి ఇవ్వడానికే వచ్చాను. నువ్వు డబ్బుగల వ్యాపారివి కావని ఆ రోజే పసిగట్టాను. ఆ తరవాత నిన్ను గురించి ఆరాతీస్తే భాధల్లో ఉన్నావని తెలిసింది. ఆ రోజు డబ్బుకు మరీ అవసరమొచ్చి, నువ్వు కష్టపడి సంపాయించిన కొద్ది మొత్తాన్ని దోచుకు పోయాను. నన్ను క్షమించు. ఇదిగో నీ డబ్బు సంచీ. తీసుకో,’’ అంటూ సంచీని వ్యాపారి చేతిలో పెట్టి, తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కొచ్చుణ్ణి. ఇది కలా? నిజమా అని తెలియనంతగా ఆశ్చర్యపోయాడు వ్యాపారి. సంచీ విప్పి చూశాడు.

అందులో కొచ్చుణ్ణి ఎత్తుకుపోయిన తన డబ్బుకు నాలుగింతల ఎక్కువ డబ్బున్నది. ఈ మొత్తంతో వ్యాపారం కొనసాగించడమే కాదు; ఇది తనకు ఊహించని పెద్ద పెట్టుబడి కూడా! వ్యాపారి ఆకాశంకేసి చేతులెత్తి, ‘‘ప్రభూ! కొచ్చుణ్ణిని ఆశీర్వదించు. అతడు కరుణాహృదయుడు!’’ అని మౌనంగా ప్రార్థించాడు.



గోవర్థనుడి ఎన్నిక

రంగాపురంలో గోవర్థనుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయనకు నూరెకరాల పొలంతో పాటు, నాలుగు రకాల వ్యాపారాలు కూడావున్నాయి. ఇవన్నీ చూసుకునేందుకు ఆయన వద్ద చాలా మంది నౌకర్లు పనిచేస్తున్నారు. అయితే, తనను కనిపెట్టుకుని వుంటూ, తను చెప్పిన పనులు చేసే ఒక నమ్మకమైన మనిషి కోసం ఆయన చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి, ఆయన వద్దకు సీతయ్య, భీమయ్య, రాజయ్య అనేవాళ్ళు వెళ్ళారు.
గోవర్థనుడు ముందుగా సీతయ్యను పిలిచి, అతడి గురించి చెప్పమన్నాడు. సీతయ్య వినయంగా, ‘‘నేను బాగా చదువుకున్నాను. కలిగిన కుటుంబంలో పుట్టాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఇలా వచ్చాను. మీరేపని చెప్పినా శ్రద్ధగా చేస్తాను. ఎందుకంటే, జీవితంలో పైకి రావాలంటే మీ వంటి గొప్పవారి దగ్గరే కదా నేర్చుకోవాలి!’’ అన్నాడు.

‘‘అయితే, నీవు ఇప్పుడే మార్కాపురం వెళ్ళి రాములయ్యను కలుసుకో. నేను చెప్పానని ఆయన వద్ద కొన్ని రోజులుండి వంట చేయడం నేర్చుకుని రా!’’ అన్నాడు గోవర్థనుడు వెంటనే.

‘‘మీక్కావలసింది అన్ని విధాలా సహాయకుడుగా వుండే మనిషి కదా! మీరు వంట గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా వుంది,’’ అన్నాడు సీతయ్య.

‘‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నేను ఇంటి వంటలే తప్ప బయటితిళ్ళు తినను. సొంత వ్యవహారాల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు, నా భార్య నాతో పాటు వుండదు కదా! భోజనం వేళకు ఇల్లు చేరకపోతే, నువ్వే నాకు ఇంత ఉడకేసి పెట్టాలి,’’ అన్నాడు గోవర్థనుడు.

‘‘నాకు వంట చేయడం రాదు. కానీ ఏదైనా క్షణాల మీద నేర్చుకోగలను. వంట కోసం మార్కాపురం వెళ్ళడమెందుకు? మా అమ్మ ఎంతో రుచిగా వంట చేస్తుంది.


 ఆమె దగ్గర నేర్చుకుని వస్తాను,’’ అన్నాడు సీతయ్య. ‘‘ఎవరెంత రుచిగా వండినా, నాకు రాములయ్య వంటలే ఇష్టం. రాములయ్య దగ్గర నేర్చుకోవలసిన ఇంకో విశేషముంది. చుట్టు పక్కల మనకు ఏవి లభ్యమైతే వాటి నుంచే రకరకాల తినుబండారాలు చేయగలడు. నీళ్ళు, నిప్పు, ఉప్పు లేకుండా కూడా వంటలు చేయగలడు. రాములయ్య దగ్గర శిక్షణ పొందినవారు నడిసముద్రంలో చిక్కుకున్నా ఎడారిలో దారి తప్పినా, చిట్టడవిలో ఇరుక్కు పోయినా సరే - తిండికి మాత్రం ఇబ్బంది పడరు. అందుకే, నిన్ను రాములయ్య వద్దకు పంపాలనుకుంటున్నాను,’’ అన్నాడు గోవర్థనుడు. ఈ మాటలకు సీతయ్య నిరుత్సాహ పడి, ‘‘అయ్యా! తమరివద్ద రకరకాల పనులు నేర్చుకుని, గొప్ప వ్యవహారవేత్తను కావాలనుకున్నాను. కానీ, తమరిక్కావలసింది వంటవాడు; నా వంటి వాడుకాదు,’’ అన్నాడు.

‘‘నేను నిన్ను వ్యవహారవేత్తను చేయాలని పిలవలేదు!’’ అని గోవర్థనుడు, సీతయ్యను పంపేసి భీమయ్యను పిలిచాడు. భీమయ్య తన గురించి చెబుతూ, ‘‘నేను బాగా చదువుకున్నాను. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయగలనని, నా గురించి అంతా అంటారు. నాలుగైదు ఊళ్ళనుంచి కొందరు భాగ్యవంతులు, నాకు పని ఇస్తామని కబురుపెట్టారు. కానీ మీ గురించి గొప్పగా వినడం వల్ల, మీ వద్దనే పని చేయాలని ఆశపడి ఇలా వచ్చాను,’’ అన్నాడు.

 అప్పుడు గోవర్థనుడు, భీమయ్యకు, సీతయ్యకు చెప్పినట్లే రాములయ్య గురించి చెప్పాడు. భీమయ్య ఎంతో ఉత్సాహ పడి, ‘‘ఇప్పటికే నాకు వంట బాగా వచ్చు. మా ఇంట్లో అమ్మకు నలతగావుంటే నేనే వంట చేసేవాణ్ణి. తమరి పుణ్యమా అని రాములయ్య దగ్గర, నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకోగలను,’’ అన్నాడు.

గోవర్థనుడు పెదవి విరిచి, ‘‘అయ్యో! రాములయ్య బొత్తిగా వంటరానివారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు. నీకాయన వంట నేర్పడు,’’ అన్నాడు. భీమయ్య వెంటనే, ‘‘అ…య్యా! నాకు వంట వచ్చిన విషయం రాములయ్యకు చెప్పను. నాకు బొత్తిగా వంటరాదని ఆయనకు చెప్పి శిక్షణ తీసుకుని వస్తాను,’’ అన్నాడు. ‘‘అసలు విష…ుం నీకు అర్థం కాలేదు. ఎంతో కొంత వంటచే…ుడం వచ్చిన వారికి నేర్చుకుందామన్నా రాములయ్య పాకప్రావీణ్యం అబ్బదు.


  కాబట్టి నువ్వు నాకు పనికి రావు,’’ అన్నాడు  గోవర్థనుడు. భీమయ్య దీనంగా, ‘‘అయ్యా! గొప్పకు పోయి అబద్ధం చెప్పాను. నా చదువు కూడా అంతంత మాత్రం. నాకు తమరు పనియిస్తే, తమవద్ద నమ్మకంగా పడివుంటాను,’’ అన్నాడు. గోవర్థనుడు తల అడ్డంగా వూపి, ‘‘నీవు నాకు అబద్ధాలు చెప్పావని ముందే ఊహించాను. నీవు మొదట నీ గురించి అన్నీ నిజాలు చెప్పివుంటే, నేను తప్పక పనికి తీసుకునేవాణ్ణి.

నీవిక వెళ్ళవచ్చు,’’ అని భీమయ్యను పంపేశాడు. తర్వాత రాజయ్య ఆయన్ను కలుసుకుని, ‘‘అయ్యా! నేను పేదవాణ్ణి. పని శ్రద్ధగా చేస్తే మళ్ళీమళ్ళీ చెబుతారని నిర్లక్ష్యంగా చేయడం వల్ల, ఎవరూ నాకేపనీ చెప్పేవారు కాదు. ఇంట్లో అమ్మానాన్నల పెత్తనం పోయి, అన్నావదినెల పెత్తనం వచ్చింది. నాకాళ్ళ మీద నన్ను నిలబడమని నన్ను ఇంట్లోంచి గెంటేశారు. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి కడుపు నింపు కుందామనిచూస్తే, నిజం తొందరగానే బయటపడి, అంతా నన్ను నమ్మడం మానేశారు. చివరకు దొంగతనాలకు దిగాను. రెండుసార్లు పట్టుబడలేదు కానీ, మూడోసరి దొరికిపోయాను. ఏడాది పాటు కారాగారంలో వుండి కఠినశిక్షలలు అనుభవించాను.

శిక్షలతో పాటే వంటతో సహా బోలెడు పనులు నేర్చుకున్నాను. నా ప్రవర్తనకు మెచ్చి నన్ను కాస్త ముందుగా కారాగారం నుంచి విడుదల చేశారు. అయితే, బయటకు వచ్చాక, నేను దొంగనని ఎవరూ నాకు పని ఇవ్వడంలేదు. తమరు దయార్ద్రహృదయులని తెలిసి ఇలా వచ్చాను. తమరు నాకు అవకాశమిస్తే, మిమ్మల్ని మెప్పించగలననే నా నమ్మకం,’’ అని తన గురించిన వివరాలు చెప్పాడు.

అంతావిన్న గోవర్థనుడు, అతడికి రాములయ్య గురించి చెప్పి, ‘‘నీకు ఇప్పటికే వంట వచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు. నేను నమ్మకస్థుడి కోసం వెతుకుతున్నాను. కానీ నీవు దొంగతనాలు చేసి కారాగారంలో శిక్షననుభవించి వచ్చావు. నీవు నాకు తగిన మనిషివనిపించడంలేదు. నువ్వేమంటావు?’’ అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా రాజయ్య, ‘‘అయ్యా! తమరికి రాములయ్య వంట తెలుసు, నా వంట తెలియదు. నేను కూడా రాములయ్య లాగే వండుతానేమో! తమరు నావంట రుచి చూసి నచ్చకపోతే పనిలోకి తీసుకోకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తమకు సరిపడదన్నారు. నన్ను కొన్నాళ్ళు పనిలో వుంచుకుని, ఒక్క అబద్ధపుమాట నా నోటివెంటవస్తే, అప్పుడు పనిలోంచి తీసేయండి. మీబోటివారి వద్ద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే, ఇతరులు కూడా నన్ను మెచ్చుకుని, నాకు పనియిస్తామని అంటారు. తమరు నాకు ఒక అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను,’’ అన్నాడు. గోవర్థనుడు కాసేపాలోచించి రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు.

ఇది తెలిసిన గోవర్థనుడిభార్య కలవర పడుతూ, ‘‘కలిగినింటివాడైన సీతయ్యనూ, సచ్ఛరిత్ర కలిగిన భీమయ్యనూ వదిలి, అబద్ధాల పుట్టా, మోసగాడూ, దొంగా అయిన రాజయ్యను పనిలోకి తీసుకున్నారు. దీనివల్ల మనకు కీడుజరుగుతుందని, నాకు భయంగా వుంది!’’ అన్నది.

గోవర్థనుడు, భార్యను సముదాయ పరుస్తూ, ‘‘సీతయ్య కలిగినవాడు. నా దగ్గర అన్నీ నేర్చుకుని స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతాడు. భీమయ్య తన అవసరం కోసం అబద్ధాలాడే తరహా మనిషి. అతడి అబద్ధాలకు శిక్షపడాలి. అప్పుడే అతడికి తన తప్పు తెలుస్తుంది. అందుకే నేనతణ్ణి పని ఇవ్వనని పంపేశాను.

ఇక రాజయ్య విషయానికొస్తే - అతడు చాలా తప్పులు చేసి, వాటికి శిక్షననుభవించాడు. వాడిలో మంచి మార్పు వచ్చిందని కారాగారపు అధికారులు కూడా తెలుసుకున్నారు. మీదుమిక్కిలి రాజయ్య తన గురించి ఏ చిన్న విషయమూ దాచకుండా తన నిజాయితీని ఋజువు చేసుకున్నాడు. కారాగారంలో మారిన తన ప్రవర్తన, నేర్చిన పనుల సహాయంతో నన్ను మెప్పించగలనన్న నమ్మకంతోవున్నాడు.

ఆ నమ్మకానికి ప్రాణం పోయడం మానవత్వమనిపించుకుంటుంది. అదీ కాక, మనం పనిలోంచి మానిపిస్తే, అదివరకే దొంగగా పేరుపడ్డ రాజయ్యకు వేరెవ్వరూ పని ఇవ్వరుకాబట్టి, అతడు మనల్నే అంటి పెట్టుకుని వుండే ప్రయత్నం చేస్తాడు,’’ అన్నాడు.

ఆయన నిర్ణయాన్ని భార్య మెచ్చుకున్నది. తర్వాత రాజయ్య, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

గుణపాఠం నేర్చుకున్న మతబోధకుడు!


మత సంబంధమైన విషయాలను కూలంకషంగా అభ్యసించిన ఒకానొక పండితుడు తన మత ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించడంలో అమితోత్సాహం కనబరచేవాడు. దేశదేశాలు పర్యటించి ప్రార్థనలు ఎలా చేయాలో ప్రజలకు బోధించడంలో అమితానందం చెందేవాడు.  మతబోధకుడి బోధనావిధానం, ఆ దేశాన్నేలే రాజుకు ఎంతగానో నచ్చింది.

రాజుకూడా బోధకుడి మతానికే చెందినవాడు. ఆయన బోధకుడు దూర దేశాలకు వెళ్ళడానికి వీలుగా ఉండేందుకు ఒక ఓడను ఏర్పాటు చేశాడు. రాజు తన పట్ల చూపుతూన్న అపూర్వ ఆదరాభిమానాలకు బోధకుడు ఎంతో సంతోషించాడు.  ఓడలో ఒకసారి ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తూండగా మార్గమధ్యంలో ఒక చిన్న దీవి కనిపించింది. దానిని చూడగానే ఓడను నడిపేవాళ్ళ నాయకుడు, ‘‘మహాత్మా, ఈ దీవిలో ముగ్గురే ముగ్గురు సన్యాసులు ఉన్నారు. ఇంతకు ముందు ఇదే మార్గంలో వస్తూ మంచినీళ్ళ కోసం ఆ దీవిలోకి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు వాళ్ళను చూశాను. అపరిచితులతో మాట్లాడరు. మౌనంగా కూర్చుని ఏవో ప్రార్థనలు చేస్తూ ఉంటారు,’’ అన్నాడు. 

‘‘అలాగా! అయితే మనం వెంటనే వెళ్ళి వారికి సాయపడాలి. నన్ను అక్కడికి తీసుకు వెళతావా?’’ అని అడిగాడు బోధకుడు ఉత్సాహంగా.  ‘‘మహాభాగ్యంగా భావిస్తున్నాను, మహాత్మా,’’ అంటూ నావికుడు ఓడను దీవికేసి నడిపించాడు. ఓడ దీవిని సమీపించింది. అరకొర బట్టలతో ముగ్గురు సన్యాసులు ఓడకేసి వింతగా చూడడం బోధకుడు గమనించాడు.

వారి తెల్లటి పొడవాటి గడ్డాలు గాలికి కదలాడుతున్నాయి.  బోధకుడికి వారి పట్ల కనికరం కలిగింది.  ‘దేవుడు వారిపట్ల కరుణ చూపుతున్నాడు.  అందుకే వారికి సరైన ప్రార్థనా విధానం బోధించడానికి ఇవాళ ఇక్కడికి రాగలిగాను,’ అనుకుంటూ ముందుకు నడిచాడు. తనకేసి నిర్లిప్తంగా చూస్తూ నిశ్చలంగా నిలబడ్డ ముగ్గురు సన్యాసులను సమీపించి, ‘‘మిత్రులారా, బావున్నారుకదా! దేవుడు మీ పట్ల కరుణ చూపుతున్నాడు,’’ అన్నాడు బోధకుడు చిరనవ్వు నవ్వుతూ. బోధకుడి మాటలు అర్థంకానట్టు ఒకరినొకరు చూసుకున్నారు ముగ్గురూ. బోధకుడు మళ్ళీ ఒకసారి అదేమాట అన్నాడు.


అప్పుడు ఆ ముగ్గురిలో ఒకడు, ‘‘దేవుడు కరుణలేకుండా ఎలావుండగలడో మాకు తెలియడం లేదు,’’ అన్నాడు.
ఆ మాటతో గతుక్కుమన్న బోధకుడు మరుక్షణమే తేరుకున్నాడు. వారికి ఎలాగైనా ప్రార్థనా విధానాన్ని, పవిత్ర ప్రార్థనా వాక్యాలనూ బోధించాలనుకున్నాడు. ‘‘మిత్రులారా! మీరు ప్రార్థన చేస్తారని నాకు అర్థమయింది. ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు?’’ అని అడిగాడు.

మళ్ళీ ఒకరినొకరు వాళ్ళు విచిత్రంగా చూసుకున్నారు. వాళ్ళు ఎలాంటి ప్రత్యేక విధానాన్నీ అనుసరించడం లేదు. బోధకుడు రకరకాలుగా ప్రశ్నించి వాళ్ళనుంచి అసలు విషయం రాబట్టాడు. వాళ్ళు, ‘‘దేవుడా, నువ్వున్నావు, మేమున్నాము,’’ అని మళ్ళీ మళ్ళీ అంటారు.

‘‘అంతేనా!’’ అంటూ బిగ్గరగా నవ్విన బోధకుడు, ‘‘మిత్రులారా, శాంతినీ, శక్తినీ ప్రసాదించే ఉత్తమ ప్రార్థనా విధానాన్ని మీకు నేను బోధిస్తాను,’’ అన్నాడు. సన్యాసులు మరేమీ మాట్లాడలేదు. బోధకుడి నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.

బోధకుడు ధ్యానానికి ఎటు తిరిగి ఎలాంటి భంగిమలో కూర్చోవాలి? ప్రార్థనా సమయంలో పవిత్ర గ్రంథాలనుంచి ఏ ఏ శబ్దాలను ఎలా ఎలా చెప్పాలి? మొదలైన విషయాలను గంట సేపు వివరించాడు. ఆ తరవాత ఒక గొప్పపని చేశానన్న తృప్తితో ఓడలోకి వచ్చి ప్రయాణాన్ని కొనసాగించాడు. ‘‘ప్రార్థన సముద్ర ప్రయాణం లాంటిది. సరైన మార్గం తెలియాలి. లేకుంటే పయనం కొనసాగించినా ఎప్పటికీ గమ్యస్థానం చేరుకోలేము!’’ అన్నాడు నావికుడితో. ‘‘అవును, మహాత్మా! తమరే గనక దయచూపకుండా ఉన్నట్టయితే, పాపం ఆ సన్యాసులు, తమ శేషజీవితాలను వృధా ప్రయాసలతో నిష్ప్రయోజనంగా గడిపి ఉండేవారు!’’ అన్నాడు నావికుడు, అలాంటి గొప్ప బోధకుడి సాన్నిహిత్యం లభించినందుకు ఎంతో పొంగిపోతూ.

అంతగొప్ప బోధకుణ్ణి, దీవిలోకి తీసుకువెళ్ళి, మూఢులైన సన్యాసులకు ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించినందుకు అతనిలో కొంత గర్వంకూడా తలెత్తింది. ఓడ కొంత దూరం ముందుకు వెళ్ళింది. మరికొంత సేపటికి సూర్యాస్తమయమై క్రమంగా చీకటి కమ్ముకోసాగింది. అర్ధ రాత్రి సమయంలో దట్టంగా మబ్బులు కమ్ముకుంటూ నాలుగో జాముకల్లా తుఫాను గాలులు వీచసాగాయి. ఉరుములు మెరుపులతో వర్షం; కొండల్లా అలలు ఎగిసి పడడంతో, ఓడ అటూ ఇటూ ఓలలాడుతూ, ఓడలోని వారిని ‘‘మహాత్మా, మీ దైవ ప్రార్థనలే మనల్ని ఇప్పుడు ఈ ఘోర ప్రమాదం నుంచి రక్షంచాలి,’’ అన్నాడు దీనంగా.భయభ్రాంతుల్ని చేసింది. నావికుడూ, సిబ్బందీ విచార వదనుల…య్యారు. నావికుడు బోధకుడితో,  బోధకుడికి దిక్కుతోచలేదు. ఇది తన శక్తికి మించిన పని అని అతడికి మాత్రమే తెలుసు. అయినా నౌకా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఏదో ఒకటి చేసితీరాలి. అతడు వానకూ, ఉరుములకూ భయపడకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తూ ఓడ పైభాగానికి చేరాడు. హఠాత్తుగా తూరుపు దిశలో తుఫాను ఆగినట్టు అతడు గమనించాడు. అటుకేసి పరిశీలనగా చూశాడు. మేఘాలు విడిపోతున్నాయి. నీళ్ళ మీద మూడు చిన్న ఆకారాలు ఓడకేసి వస్తున్నాయి. అవి దగ్గరికి వస్తున్న కొద్దీ పెద్దవిగా కనిపించ సాగాయి. వర్షం పూర్తిగా ఆగిపోయింది. గాలిమెల్లగా వీచసాగింది. ఆ వస్తూన్న ఆకారాలు మనుషులని గ్రహించి బోధకుడు ఆశ్చర్యపోయాడు. అతడు దీవిలో చూసిన ముగ్గురు సన్యాసులు!

అరుణోదయకాంతిలో, అలల మీద ఉరుకులతో పరుగులతో వాళ్ళు రావడం చూసి బోధకుడు దిగ్భ్రాంతి చెందాడు. వారినుంచి వెలువడిన ప్రకాశమే తుఫాను మేఘాలను విడిపోయేలా చేసి, తుఫాను గాడ్పులను శాంతింప చేసింది!
వారు ఓడను సమీపించి బోధకుణ్ణి చూడగానే, ‘‘అయ్యా, తమరు బోధించిన ప్రార్థనా విధానం మరిచిపోయాం. మళ్ళీ ఒకసారి నేర్పుతారా?’’ అని అడిగారు నీళ్ళపై నిలబడి. తాము నీళ్ళపై నిలబడడం ఒక అద్భుతమైన విషయం అన్న సత్యం కూడా వారికి గుర్తు లేదు. బోధకుడు ఓడపై మోకరిల్లి, ‘‘దేవుడి బిడ్డలారా! మీకు బోధించడానికి ప్రయత్నించిన నా దుందుడుకుతనాన్ని క్షమించండి. మరువరాని గుణపాఠం నేర్చుకున్నాను. నన్ను క్షమించండి! నన్ను క్షమించండి!’’ అన్నాడు వణుకుతూన్న కంఠస్వరంతో.

‘‘కృతజ్ఞతలు!’’ అంటూ సన్యాసులు వెనుదిరిగి నీళ్ళమీద వచ్చిన వేగంతోనే వెళ్ళిపోయారు.
బోధకుడు ఓడ పైభాగాన సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. అసలు జరిగిందేమిటో ఎరుగని నావికుడు ఓడ పైభాగానికి వచ్చి, ‘‘మహా అద్భుతం చేసి చూపారు మహాత్మా,’’ అన్నాడు బోధకుడితో ఆనందంగా.

ఆ మాటకు బోధకుడి కళ్ళవెంట మరిన్ని కన్నీళ్ళు పెల్లుబికాయి. తాము చేస్తున్నదేమిటో తెలియకుండానే ఇన్ని అద్భుతాలను చేసిందెవరో అతడికి మాత్రమే తెలుసు. దేవుడిలోనే ఉంటూన్న మహానుభావులని గ్రహించక, వారికే తను మిడిమిడి జ్ఞానంతో దేవుణ్ణి చేరడానికి సరైన మార్గం ఏమిటో చూపడానికి ప్రయత్నించాడు!  

రంగాచారి జోస్యం


 రామాపురం అనే ఒక జమీందారీ గ్రామంలో, రంగాచారి అనే పేరుమోసిన జ్యోతిష్కుడుండేవాడు. తన దగ్గరకు వచ్చేవారి జాతకాలు పరిశీలించి, వారి భవిష్యత్తు చెప్పడమేగాక, జాతకం లేనివారికి, వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం తయారు చేసి జ్యోస్యం చెప్పేవాడు. అంతేకాక, కొందరికి గ్రహశాంతులూ అవీ అవసరమంటూ శాంతి పూజలూ, హోమాల పేరుతో, వారివారి తాహతును బట్టి డబ్బు వసూలు చేసేవాడు.


రంగాచారి అదృష్టమో, కాకతాళీయమోగాని చాలా సందర్భాల్లో అతడి జోస్యం ఫలించేది. ఒక్కొక్కసారి ఫలించనివాళ్ళు, అతణ్ణి గట్టిగా ప్రశ్నించినప్పుడు, ఏవేవో కల్లబొల్లి మాటలతో సంతృప్తి పరచాలని చూసేవాడు.రంగాచారి దూరపు చుట్టం పొరుగూరి గోవిందాచారి, ఒకసారి అతడికి అంగడి వీధిలో ఎదురుపడి, ‘‘రంగాచారీ! నువ్వు జ్యోతిశ్శాస్ర్తంలో మహాపండితుడివనుకున్నాను. కిందటి సారి నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆర్నెల్లలో మా అమ్మాయికి నిక్షేపంలాంటి సంబంధం కుదురుతుందని చెప్పావు.


ఏడాది గడిచినా ఒక్క మంచి సంబంధం కూడా రాలేదు సరికదా, వచ్చిన ఒకటి, రెండు నాసిరకం సంబంధాలు కూడా బెడిసికొట్టినయి. పిల్లకి పెళ్ళీడు కూడా దాటిపోతున్నది. బంధువని కూడా చూడకుండా, నా దగ్గర డబ్బు మాత్రం బాగా గుంజావు. నువ్వేమన్న జ్యోతిష్కుడివయ్యా!’’ అంటూ నిలదీశాడు.

అందుకు రంగాచారి ధుమధుమలాడుతూ, ‘‘కాస్త మాటలు తూచివాడడం నేర్చుకో. అయిదేళ్ళ పాటు కాశీలో మహా పండితుల దగ్గర శిష్యరికం చేసి, జ్యోతిశ్శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించినవాణ్ణి. నా జ్యోస్యాన్నే తప్పు పడతావా? నువ్వు నా వద్దకు తెచ్చిన జాతకమే తప్పుల తడక అయిఉంటుంది,’’ అన్నాడు.


దానికి గోవిందాచారి, ‘‘మా అమ్మాయి జాతకం రాసింది, నువ్వే కదయ్యా! అది కూడా మరిచిపోయావా?’’ అన్నాడు వెటకారంగా.
కొద్దిక్షణాలు మౌనంగావున్న రంగాచారి తేరుకుని, ‘‘అయితే, నువ్వు మీ అమ్మాయి జన్మ నక్షత్రం తప్పుగా చెప్పివుంటావు. లేదా ఆమె పుట్టిన సమయం సరిగ్గా చెప్పివుండవు. జనన సమయంలో ఒక్క విఘడియ తేడా వచ్చినా, గ్రహాలు తారుమారే అవకాశంవుంది. ఈ విషయాలన్నీ నీబోటి పామరులకు అర్థంకావు. వెళ్ళు! వెళ్ళు!’’ అని గోవిందాచారిని దబాయించి పంపేశాడు.



ఇలా గోవిందాచారిలాగా ప్రశ్నించే ధైర్యం లేనికొందరు, ‘‘అంతా మనప్రారబ్ధం. ఒకర్ని అని ఏం లాభం!’’ అని సమాధానపడి మిన్నకుండి పోయేవారు. జోస్యం పేరుతో రంగాచారి చేస్తున్న మోసాల గురించి జమీందారుకు తన ఉద్యోగుల ద్వారా తెలుస్తూనే వున్నది.


అయితే, పదిమందికీ అతడు బూటకపు జ్యోతిష్కుడని తెలిసేలా చేయడం ఎలాగా అని ఆ…యన ఆలోచించసాగాడు.
అలాంటి సమయంలో రాజ ప్రతినిధి ఒకరు గ్రామాల వెంట పర్యటిస్తూ, రామాపురం వచ్చాడు. జమీందారు, ఆయనకు తగువిధంగా అతిథి మర్యాదలు చేసి, రంగాచారి గురించి చెప్పి, ‘‘ఈ బూటకపు జ్యోతిష్కుడివల్ల మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలవాళ్ళు కూడా మోసపోతున్నారు. ఇతగాడి నిజరూపం అందరికీ ఎరుక పడేలా చేయడం ఎలాగో అర్థంకావడంలేదు,’’ అన్నాడు.


ఇందుకు రాజప్రతినిధి కొంతసేపు మౌనంగావూరుకుని, తర్వాత జమీందారుకు ఇలాంటి కపట జ్యోతిష్కుల పీడ ఎలా వదిలించుకోవాలో చెప్పి, అప్పటి కప్పుడే రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాడు.ఆ మర్నాటి అర్ధరాత్రి రంగాచారి ఇంట్లో దొంగలు పడి, ఇనప్పెట్టెలోని డబ్బు, నగానట్రా అంతా దోచుకుపోయారు.తెల్లవారే సరికి ఈ వార్త గ్రామమంతా పాకి పోయింది. ప్రతి ఒక్కరూ అదేమాట.

అందరికీ భూత భవిష్యత్‌ వర్తమానాలు జోస్యం చెప్పే రంగాచారికే ఇలా జరగడం చూసి కొందరు ముక్కు మీద వేలేసుకుంటే, మరికొందరు తిక్క కుదిరిందంటూ నవ్వుకున్నారు. రంగాచారి తన ఇంట జరిగిన దొంగతనం గురించి, ఇరుగుపొరుగులకు చెప్పుకుని గగ్గోలు పడుతూంటే, జమీందారు నుంచి రమ్మంటూ కబురు వచ్చింది.


 దొంగలు దొరికి పోయారేమో అన్న ఆశ  కొద్దీ హడావుడిగా అతడు వెళ్ళే సరికి, జమీందారు దివాణంలో కొలువు తీరివున్నాడు. అక్కడ చాలా మంది గ్రామస్థులు గుమిగూడి గుసగుసలాడుతున్నారు. దీనవదనంతో వచ్చిన రంగాచారిని, జమీందారు ఒక సారి పరీక్షగా చూసి, ‘‘ఏం, రంగాచారీ! అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిన సామెతగా-పరగణా అంతటికీ జోస్యం చెప్పే నీ ఇంట దొంగలు పడతారనే సంగతి ముందుగా గ్రహించలేకపోయావా?’’ అని అడిగాడు.


ఆ ప్రశ్నకు ఖంగుతిన్న రంగాచారి తమాయించుకుని, ‘‘అ…య్యా! రాత్రి దొంగతనం జరుగుతుందని, నాకు ముందే తెలుసు. కానీ, జరిగేది జరగక మానదుగదా, అన్న వివేకంవున్నవాడిని గనక, నేను పెద్దగా పట్టించుకోలేదు,’’ అన్నాడు.


అప్పుడు జమీందారు, అతడి కేసి తీవ్రంగా చూస్తూ, ‘‘నువ్వు చెప్పిందే నిజమైతే, నువ్వు ఒకటికి రెండు నేరాలు చేసినట్టవుతుంది. మొదటిది, ఇంట దొంగలు పడే సంగతి ముందుగా తెలిసి కూడా, ఆ విషయం దాచిపెట్టి, దొంగలు తప్పించుకు పోవడానికి నువ్వు పరోక్షంగా సాయపడ్డావు. జరిగేది జరగక మానదని తెలిసి కూడా ఇంతకాలం జోస్యం పేరుతో అమాయక ప్రజల్ని నమ్మించి, కల్లబొల్లి కబుర్లు చెప్పి ధనార్జన చేయడం రెండో తప్పు. ఏమంటావు?’’ అని ప్రశ్నించాడు.


 ‘‘ప్రభువులంతవారు అన్నదాన్ని, నేను కాదనగలనా?’’ అంటూ రంగాచారి తలవంచుకుని చేతులు జోడించాడు. ఇది చూసి అక్కడ చేరినవాళ్ళందరూ గొల్లుమంటూ నవ్వారు.

జమీందారు చిన్నగా నవ్వి, ‘‘రంగాచారీ! నీ జోస్యం మాటకేంగాని - నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్న వచ్చాడే, ఆ రాజప్రతినిధి - యువకుడుగా కాశీలో మంత్రశాస్ర్తాలూ, గయాప్రయాగల్లో జ్యోతిశ్శాస్ర్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు.


ఆయన నిన్న ఉదయం ప్రయాణమైపోతూ, రాత్రికి గ్రామంలో ఒక ఇంట దొంగలు పడబోతున్నారనీ, కాపలావాళ్ళను తగు హెచ్చరికగావుంచమనీ చెప్పిపోయాడు. ఆ కారణంగా కాపలావాళ్ళు దొంగల కోసం మాటువేశారు. అయితే, అది గమనించిన దొంగలు భయంకొద్దీ, నీ ఇంట దొంగిలించిన వస్తువుల్ని వీధిలో జారవిడిచి పారిపోయారు!’’ అన్నాడు. ‘‘అంటే, నా డబ్బూ, నగలూ దొంగల బారిన పడలేదన్న మాట. అంతా, ప్రభువులవారి దయాభిక్ష!’’ అన్నాడు రంగాచారి.


ఆ వెంటనే జమీందారు, అందరూ వినేలా పెద్దగొంతుతో, ‘‘అవన్నీ ఇప్పుడే ఎత్తుకుపో. ఈ రోజు నుంచీ జ్యోతిష్కుడనని ఎక్కడా చెప్పుకోకు. ఉన్న డబ్బుతో వర్తకమో, ఇంత పొలం కొని ఏ వ్యవసాయమో చేసుకో. ఏమంటావు?’’ అని అడిగాడు. ‘‘తమ ఆజ్ఞను కాదనగలనా, ప్రభూ! ఈ క్షణం నుంచీ నేను జ్యోతిష్యుణ్ణి కాదని తమ సమక్షంలో ప్రమాణం చేసి మరీ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను!’’  అన్నాడు రంగాచారి. తరవాత జమీందారు అక్కడి ప్రజలతో, ‘‘భవిష్యత్తు పట్ల భయంకొద్దీ అమాయక ప్రజలు ఏర్పరుచుకునే మూఢవిశ్వాసాల ఆసరాతోనే రంగాచారిలాంటి కపట జ్యోతిష్కుల ఆట సాగుతోంది. మనలో ఆ బలహీనత ఉన్నంతకాలం ఇలాంటి వారి బాధ తప్పదు. ఈ రోజు రంగాచారి పోతే, రేపు వేరొకరు పుట్టుకొస్తారు. ఇలాంటి వారిపీడ శాశ్వతంగా విరగడ కావాలంటే మొదట మనం మూఢవిశ్వాసాల నుంచి బయట పడాలి,’’ అన్నాడు.



దయ్యాల సంచీ


ఒకానొకప్పుడు ధనికులైన భార్యాభర్తలు ఉండేవారు. వారికి జిన్‌హో అనే కొడుకు ఉండేవాడు. కొడుకును పెంచడానికి వాన్‌క్యూన్‌ అనే ఒక వృద్ధ సేవకుణ్ణి ని…యమించారు. అతడు పిల్లవాడికి రకరకాల కథలు చెప్పేవాడు. పిల్లవాడు కథల్ని చాలా ఇష్టంగా వినేవాడు. ఆతడు చెప్పే కథల్లో భయంకరమైన వింతజంతువులు, క్రూరమైన పులులు, దేవదూతలు, అందమైన యువరాణులు, వీరులు, కరుణాహృదయులైన రాజులు వచ్చేవారు.
వీరితో పాటు ప్రతి కథలోనూ ఒకద…య్యం తప్పకుండా వచ్చేది. ఆ కథలు జిన్‌హోకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల వాటిని తను మాత్రమే వినాలని పట్టుబట్టాడు. అందువల్ల ఆ కథల్ని సేవకుడు ఇతరులకు చెప్పడానికి అనుమతించేవాడు కాదు. తను కూడా విన్న కథలను వేరెవ్వరికీ చెప్పేవాడుకాదు. అలా చేయడం వల్ల కథల్లోని ద…య్యాలను మరెక్కడికీ వెళ్ళనివ్వకుండా కట్టిపడవేయవచ్చునన్న ఆలోచన!

కథలు చెప్పే సేవకుడైన వాన్‌క్యూన్‌ దయ్యాలకని ప్రత్యేకంగా ఉచ్చుదారంతో ఒక తోలు సంచీని తయారు చేసి, దాన్ని జిన్‌హో పడక గదిలోని గోడకు తగిలించాడు. ప్రతిరాత్రి జిన్‌హో నిద్రపోయే ముందు సేవకుడు సంచీని ఒడిలో వుంచుకుని కథ చెప్పేవాడు. కథ ముగుస్తున్నప్పుడు సంచీ మూతిని తెరిచేవాడు. కథలోని దయ్యం అందులోకి వెళ్ళేది. అదే కథను మళ్ళీ ఎవరైనా చెబితే తప్ప ఆదయ్యం ఆ సంచీ నుంచి వెలుపలికి రాలేదు. వాన్‌క్యూన్‌ సంచీ మూతిని గట్టిగా బిగించి మళ్ళీ గోడకు తగిలించేవాడు.

ఇలా రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలూ గడిచాయి. వాన్‌క్యూన్‌ ఒకసారి చెప్పిన కథను మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. జిన్‌హో కూడా తను విన్న కథను మరెవ్వరికీ చెప్పలేదు. సంచీలో చేరిన దయ్యాలు వెలుపలికి వచ్చే మార్గం లేక తపించసాగాయి. కథలు చెప్పడంలో వాన్‌క్యూన్‌, వినడంలో జిన్‌హో నిమగ్నులై పోవడం వల్ల తోలు సంచీలో దయ్యాలు బాధతో పుట్టించే శబ్దాలను వినలేకపోయేవారు అంతలోనే జిన్‌హో పదిహేనేళ్ళవాడయ్యాడు.


అప్పటి ఆచారం ప్రకారం పెళ్ళీడు కొచ్చాడు. వాడి తల్లి దండ్రులు ఒక చక్కని అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. ధనిక వర్తకుడి కూతురైన ఆ అందమైన అమ్మాయి పేరు మిన్‌జీ. పెళ్ళిరోజు రానేవచ్చింది.
పెళ్ళి కొడుకు జిన్‌హో, అతని తండ్రి పెళ్ళికూతురు ఇంటికి బయలుదేరడానికి ఉదయమే సిద్ధమ య్యారు. రానున్న పెళ్ళికూతురికి ఆప్యాయంగా స్వాగతం పలకడానికి ఇంట్లోని పనివాళ్ళందరూ ఏర్పాట్లలో, హడావుడిగా ఉన్నారు. ముసలి సేవకుడు వాన్‌క్యూన్‌, ఇంట్లోని ఒక్కొక్క గదినీ పరిశీలించి చూస్తూ, ఏర్పాట్లను గమనించసాగాడు.

అలా వస్తూ, జిన్‌హో గదిలోకి తొంగిచూశాడు.  ఏవో గుసగుసలు వినిపించాయి. ఒక్క అడుగు వెనక్కు వేసి సద్దు చేయకుండా ఆలకించాడు. విభిన్న కంఠస్వరాలు వినిపించాయి. ఎవరూ లేని చోట ఇన్ని కంఠస్వరాలు ఎలా వచ్చాయా అన్న ఆశ్చర్యంతో గది లోపలికి వెళ్ళాడు. అతని చూవులు తోలుసంచీ మీద పడ్డాయి. అది అటూ ఇటూ కదులుతోంది. ఆ సంచీలోంచే గుసగుసలు వినిపించాయన్న సంగతి అతడు ఊహించాడు. అవి ద…య్యాల మాటలు అని గ్రహించగానే అతడు, పిల్లిలా అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి, సంచీకి చెవులు ఆనించి గుసగుసలను విన్నాడు.

‘‘కురవ్రాడికి ఈరోజు పెళ్ళి కాబోతున్నది. మనల్ని ఇన్నాళ్ళిలా ఊపిరాడ కుండా బంధించినందుకు మన పగతీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వాణ్ణి చంపేద్దాం. వాడు చచ్చాక, ఎవరో ఒకరు ఈ సంచీ మూతి విప్పి మనకు విముక్తి కలిగించకపోరు!’’ ‘‘అవును, అవును, అలాగే చంపేద్దాం. అయితే ఎలా?’’ ‘‘నేను విషపు బావి కథలోని దయ్యాన్ని. పెళ్ళికూతురు ఇంటికి వెళుతూన్న దారిలో నేనా బావిని వచ్చేలా చేస్తాను. దప్పిక గొన్న వాడు బావిని చూడగానే నీళ్ళు తాగడానికి ఆగుతాడు. అంతే ... ఆ పైన అంతే సంగతులు ఆ హా హా!’’ ‘‘బావుంది. ఒకవేళ వాడు బావివద్ద ఆగి నీళ్ళు తాగకుండానే వెళ్ళిపోయాడే అనుకుందాం. విషపు తుప్పపళ్ళ కథలోని ద…య్యమైన నేను ఊరుకుంటానా? దారికి పక్కనే చెట్టుగా చేతికి అందే పళ్ళతో కనిపించి ఊరిస్తాను.


పండు కోసి రుచి చూశాడంటే చాలు! వాడిపని అయిపోతుంది. ఆ హా హా!’’ ‘‘ఒకవేళ దానిని కూడా తప్పించుకుని పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నాడే అనుకుందాం. నా కథలో కనకనలాడే మేకు వుంది. దానిని నేను అతడు కాలు పెట్టే మెత్తకింద దాస్తాను. కాలు మోపగానే ... ఆ హా హా!’’ ‘‘దాన్ని కూడా తప్పించుకుంటే, నా కథలోని విష నాగ సర్పాన్ని పెళ్ళి కూతురు పడకకింద ఉంచుతాను.

అర్ధరాత్రి సమ…యంలో అది వెలుపలికి వచ్చి, వాణ్ణి కాటేస్తుంది... దాన్నుంచి తప్పించుకోవడం వాడితరంకాదు, ఆ హా హా!’’ దయ్యాల కుట్రను విన్న వాన్‌క్యూన్‌ దిగ్భ్రాంతి చెందాడు. అవి సంచిలోపల ఉన్నప్పటికీ హాని కలిగించగల శక్తి వాటికివున్న సంగతి అతనికి తెలుసు. వాన్‌క్యూన్‌ గబగబా ఇంటినుంచి వెలుపలికి వచ్చాడు. పెళ్ళికొడుకు తెల్లగుర్రం మీద వెళుతూన్న పరివారాన్ని చేరుకున్నాడు. తిన్నగా జిన్‌హో దగ్గరికి వెళ్ళి, ‘‘అ…య్యా, ఈ రోజు, నీ గుర్రాన్ని నేను ముందుండి నడుపుతాను,’’ అంటూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ‘‘వద్దు, నువ్వు ఇంటికి తిరిగివెళ్ళు. అక్కడ నీకు బోలెడన్ని పనులున్నాయి!’’ అన్నాడు జిన్‌హో.

వాన్‌క్యూన్‌ అక్కడి నుంచి …యజమానిని సమీపించి, ‘‘అయ్యా, ఈ రోజు చాలా గొప్ప రోజు కదా! ఈ రోజు చిన్న యజమాని గుర్రాన్ని నడిపించాలన్నది నా చిరకాల వాంఛ,’’ అన్నాడు.‘‘సరే, అలాగే కానివ్వు. అనుమతి ఇస్తున్నాను,’’ అన్నాడు జిన్‌హో తండ్రి. వాన్‌క్యూన్‌ పరమానందం చెందాడు. ఎలాగైనా చిన్న యజమానిని దయ్యాల నుంచి కాపాడాలన్న కృతనిశ్చయంతో, గుర్రం ముందు నడవసాగాడు. వాన్‌క్యూన్‌ అనుమానించినట్లే, దారి పక్కన బావి కనిపించగానే, నీళ్ళు తెమ్మన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, బావిలోనుంచి నీళ్ళు తోడడానికి చాలా సేపవుతుంది.

అంతసేపు మీరు ఈ మండే ఎండలో ఉన్నట్టయితే, పెళ్ళి దుస్తులు చెమటకు తడిసిపోగలవు,’’ అంటూ వాన్‌క్యూన్‌ ఆగకుండా ముందుకు వెళ్ళిపో…యాడు. దాహంగా ఉన్నప్పటికీ, సేవకుడి మాటల్లోనూ నిజం ఉందని గ్రహించిన జిన్‌హో మరేం మాట్లాడలేక పోయాడు. మరికొంతదూరం ముందుకు వెళ్ళాక, బాట పక్కన వున్న చెట్టుకు తుప్పపళ్ళు చేతికి అందేలా నేలబారుగా కనిపించడంతో, ‘‘వెళ్ళి ఆ పళ్ళు కోసుకురా.


వాటిని తిని దాహం చల్లార్చుకుంటాను,’’ అన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, ఇవాళ తమకు పెళ్ళి. వధువు గారి ఇంట షడ్రసోపేతంగా విందు కాచుకుని వున్నప్పుడు, ఈ తుప్పపళ్ళు తింటారా?’’ అంటూ, జిన్‌హో సమాధానానికి ఆగకుండా, గుర్రం కళ్ళాన్ని పట్టుకుని వేగంగా ముందుకు నడవసాగాడు. జిన్‌హో, సేవకుడితో వాదన ఎందుకని మౌనం వహించాడు. ఊరేగింపు ముందుకు సాగి కొంత సేపటికి పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నది. పెళ్ళి కొడుకు గుర్రంపై నుంచి కిందికి కాలుమోపి దిగడానికి వీలుగా, ఇద్దరు సేవకులు చిన్న మెత్తను తెచ్చివేశారు. వాన్‌క్యూన్‌, దాన్ని దూరంగా తీసివేస్తూ, ‘‘చూడండి, అవి ఎంతమెత్తగా ఉన్నాయో! మా యజమాని కాలు జారితే మరేమన్నా ఉందా. వెళ్ళి చెక్కబల్ల తీసుకు రండి,’’ అన్నాడు.

ఒక సేవకుడి దుందుడుకు ప్రవర్తనకు, జిన్‌హో, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రితో సహా అక్కడవున్న వారందరూ విస్తుపోయారు. అయినా, సేవకులు వెళ్ళి కొయ్యబల్ల తెచ్చి వేయడంతో వాన్‌క్యూన్‌ చేయి అందివ్వగా, పెళ్ళికొడుకు గుర్రం పైనుంచి, కొయ్య బల్లపై అడుగు మోపి కిందికి దిగాడు. పెళ్ళికొడుకు బృందం అలంకరించబడిన ఉద్యానవనంలోకి చేరింది. అందమైన దుస్తులతో ఆభరణాలతో అలంకరించిన పెళ్ళి కూతురు మిన్‌జీని వేదిక మీదికి తీసుకువచ్చారు. పెళ్ళి ఘనంగా జరిగింది. విందు భోజనాలు ఏర్పాటయ్యాయి. అవి ముగిశాక, పెళ్ళికొడుకూ కూతురూ పడక గదికి చేరడానికి ముందే, వాన్‌క్యూన్‌ పెద్ద కత్తితో లోపలికి వెళ్ళాడు. పడక మీది పట్టుపరుపులను తొలగించి, వాటి కింద దాక్కునివున్న సర్పాన్ని తెగనరికాడు.

అంతలో అందరూ అక్కడికి చేరారు. ఆ దృశ్యాన్ని చూసిన జిన్‌హో, ‘‘నాన్నా, వాన్‌క్యూన్‌ మన ప్రాణాలు కాపాడాడు!’’ అన్నాడు కృతజ్ఞతతో. మరునాడు జిన్‌హో పెళ్ళికూతురును వెంటబెట్టుకుని తన పరివారంతో స్వగృహానికి తిరిగివచ్చాడు. విందు జరుగుతున్న సమయంలో, వాన్‌క్యూన్‌ జిన్‌హోను సమీపించి, నిన్నటి తన వింత ప్రవర్తనకుగల కారణాన్నీ, సంచీలోని దయ్యాల గురించీ చెప్పాడు. అంతావిన్న పెళ్ళికూతురు భర్తతో, ‘‘జిన్‌హో! ఈరోజు నుంచి నువ్వు నాకు ఆ కథలు చెప్పు. ఒక్కొక్క దయ్యంగా వదిలిపెడదాం,’’ అన్నది సంతోషంగా.



లంచగొండి 2


ఒకానొక జమీందారు దగ్గర శ్రీకాంతుడనే దివానువుండేవాడు. ఆయనకింద పన్నులూ అవీ వసూలు చేసేందుకు కొందరు ఉద్యోగులుండేవారు. వాళ్ళల్లో శోభనాద్రి అనేవాడు పెద్ద లంచగొండి అని దివానుకు తెలిసింది. ఆయన, అతణ్ణి పిలిచి విచారించాడు. కాని, శోభనాద్రి తను నిర్దోషిననీ, గిట్టనివాళ్ళు తనపై నిందలు మోపుతున్నారనీ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అయితే, దివానుకు వాస్తవమేమిటో తెలుసు! ఆయన, శోభనాద్రిని గట్టిగా హెచ్చరించి, చాలా దూర గ్రామానికి బదిలీ చేశాడు.

అక్కడా శోభనాద్రి చిన్న చిన్న రైతుల నుంచీ, వ్యాపారుల నుంచీ లంచాలువసూలు చేయసాగాడు. ఆ పరిస్థితిలో గ్రామస్థుల్లో ఒకడికి, తన తమ్ముడి పొలం పట్టా మంజూరు చేయించుకునే సమస్య ఎదురైంది.  అతడు, ఒకనాటి ఉదయం శోభనాద్రి కచేరీ గదిలోకి వెళ్ళి, అక్కడ బల్ల మీద ఒక బంగారు నాణెంపెట్టాడు. తర్వాత, శోభనాద్రి కచేరీకి వస్తూండగా కలుసుకుని, తన తమ్ముడి సమస్య చెప్పి, ‘‘వాడిప్పటివరకూ కచేరీలో కూర్చుని, అవసరమైన పని మీద ఇంటికి వెళ్ళాడు,’’ అన్నాడు. శోభనాద్రి కచేరీ గదిలోకి పోతూనే, బల్లమీదవున్న బంగారు నాణాన్ని తీసి జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత వారం జరిగినా, పట్టా మంజూరు జరగక పోవడంతో, గ్రామస్థుడు, శోభనాద్రిని కలుసుకుని, ‘‘ఆ పట్టా మంజూరు విషయం అట్లాగే వుండి పోయింది,’’ అన్నాడు. దానికి శోభనాద్రి చిరుకోపంగా, ‘‘మీ తమ్ముడికి ఆ విషయం పట్టినట్లేలేదు. వారం కిందట వచ్చి పోయినట్లు, తరచూవచ్చి పోతూండాలిగదా!’’ అన్నాడు.
‘‘వాడు దివాను దగ్గర కొలువులో చేరడం వల్ల రాలేదు. పట్టా మంజూరుకు ఏంకావాలో, ఎంతకావాలో కనుక్కోమన్నాడు,’’ అన్నాడు గ్రామస్థుడు.

ఆ మాటతో గతుక్కుమన్న శోభనాద్రి, ‘‘మీ తమ్ముడి పట్టా ఎప్పుడో సిద్ధమయింది. తీసుకెళ్ళు,’’ అంటూ అప్పటికప్పుడే పత్రాలను తీసి ఇచ్చాడు.

వెండిదీపం కుందె


హేలాపురి న్యాయాధికారి సమక్షంలో, ఒక వెండి దీపంకుందె దొంగతనం గురించి విచారణ జరుగుతున్నది. కుందె పోగొట్టుకున్న కేశవుడు, ‘‘అయ్యా! ఆ రోజు శ్రావణ శుక్రవారం. నా భార్య వ్రతం చేసుకుంటూ ముత్తయిదువులను పేరంటానికి పిలిచింది. వ్రతం పూర్తయి పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయాక చూసుకుంటే,అప్పుడు తెలిసింది దొంగతనం జరిగిన విషయం. ఆదొంగిలించింది ఎవరో కాదు, మాధవుడి భార్య గుణవతి, ...’’ అంటూ ఇంకా చెప్పబోతూంటే- న్యాయాధికారి మధ్యలో అడ్డుపడి, ‘‘అయితే, ఆ కుందె దొంగిలించింది మాధవుడి భార్య గుణవతి అని ఎలా అనుమానించావు?’’ అని అడిగాడు.

‘‘అయ్యా! వారం రోజుల క్రితం గుణవతి ఇంట్లో జరిగిన శుభకార్యానికి, నా భార్య కూడా వెళ్ళింది. అప్పుడు పూజలో పెట్టబడివున్న, మా వెండి దీపంకుందెను, నా భార్య గుర్తించింది. దయచేసి దాన్ని మా కిప్పించండి,’’ అన్నాడు కేశవుడు.

‘‘అది మీదే అనడానికి గట్టి ఆధారం ఏమిటి? వెండి దీపంకుందెలు ఎన్ని ఇళ్ళల్లో లేవు!’’ అంటూ ప్రశ్నించాడు, న్యాయాధికారి. ‘‘అ…య్యా! మా దీపంకుందె ఓం ఆకారంలో వుంటుంది,’’ అన్నాడు కేశవుడు. ‘‘అలాగా!’’ అంటూ న్యాయాధికారినవ్వి, ‘‘ఆ మాటకొస్తే, మా ఇంట్లోనూ ఓం ఆకారంలో వున్న దీపపుకుందె వున్నది,’’ అన్నాడు.

‘‘అయ్యా! ఆ విషయమే తమకు మనవి చేయబోయాను. తమరు అవరోధం కలిగించారు. వ్రతం రోజున మా ఇంట్లో దొంగిలించిన ఓం ఆకారపు దీపపు కుందెను, మాధవుడి భార్య తెలివిగా తమ భార్యగారికే అమ్మిందని తెలిసింది. ఇప్పుడది వాళ్ళింట్లోలేదు. తమ ఇంట్లోనే ఉంది,’’ అన్నాడు కేశవుడు. అది విన్న న్యాయాధికారితో పాటు, అక్కడవున్న వాళ్ళందరూ నివ్వెరపోయారు.

అమ్మవారి మహత్తు


గరికపాడు అనే గ్రామంలో వున్న వాళ్ళందరూ చిన్నకారు రైతులు. చదువులేని అమాయకులు. అందరివీ పూరి ఇళ్ళు. ఒక్క మునసబు, కరణాలకు మాత్రం పెంకుటిళ్ళు వుండేవి. గ్రామం మధ్య అమ్మవారి గుడి వుండేది.

గ్రామంలోని రైతుల మధ్య ఐక్యత వుండేది కాదు. ప్రతి స్వల్ప విషయంలోనూ తరచుగా తగవులాడుకుంటూండేవారు. ఒకనాటి ఎండాకాలంలో అర్ధరాత్రి, గ్రామంలోని ఒక పూరింటికి నిప్పంటుకుని భగ్గు మంటూ మంటలు లేచినై. అది చూసిన గ్రామస్తులు కేకలు పెడుతూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దాపులనున్న చెరువుకు పోయి కడవలతో నీళ్ళు తెచ్చి, మంటలు ఇతర ఇళ్ళకు పాకకుండా ఆర్పివేశారు.

ఆ తర్వాత తృప్తిగా తమ తమ ఇళ్ళకు పోతున్న గ్రామస్తులను గుడి పూజారి ఆగమంటూ చెప్పి, ‘‘మీరందరూ గ్రహించి వుండరు. మన గుడి అమ్మవారు, తన మహత్తును మనకళ్ళ ఎదుట కట్టి చూపింది!’’ అన్నాడు. పూజారి మాటలు గ్రామస్తులకు ఎవరికీ అర్థంకాలేదు. అందరూ మౌనంగా ఊరుకు న్నారు. అప్పుడు పూజారి గొంతెత్తి, ‘‘మన అమ్మవారే గనక ఇంతటి కటిక చీకట్లో మంటల ద్వారా వెలుగు చూపక పోతే, అవి ఎక్కడున్నవో తెలుసుకుని ఆర్పడం మనకు సాధ్యపడేది కాదు గదా!’’ అన్నాడు.

దేవుడి ఉనికి


రామదేవుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది విద్యార్థులలో, చైతన్యుడు చురుకైనవాడు. ప్రతి విషయాన్ని తరచి చూసి, పరిశోధించి తెలుసుకునేవాడు. అతడి కుశాగ్ర బుద్ధికి రామదేవుడు చాలా సంతోషించాడు. తనకువున్న పాండిత్యాన్ని సంపూర్ణంగా ప్రియశిష్యుడికి అందించాడు. ఇప్పుడు చైతన్యుడు పద్ధెనిమిదేళ్ళవాడు.

ఇకవాడు గురుకులంలో వుండి నేర్వదగినది ఏమీలేదన్న నిర్ణయానికి వచ్చిన రామదేవుడు, ‘‘నా…యనా! నీ చదువు పూర్తయింది. దానికి తగిన సంస్కారం, వినయసంపద కూడా, నీకు మెండుగావున్నాయి. ఇక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని సేవించు. ఆ దైవం నీకు ఎల్లప్పుడూ అండగావుంటాడు!’’ అన్నాడు.

చైతన్యుడు, గురువుగారికి తలవంచి నమస్కరించి, ‘‘గురువర్యా! మీరు నాకు ఎన్నో విద్యలు నేర్పారు. కానీ, ఇప్పుడుచెప్పిన ఆ దేవుడిని మాత్రం ఏనాడూ నాకు చూపించ లేదు. ఎక్కడా కనిపించని ఆ దేవుడు, నాకు అండగా వుంటాడంటే నమ్మకం కుదరడం లేదు,’’ అన్నాడు.

చైతన్యుడు హేతువాది. ప్రత్యక్షంగా కనిపించేది మాత్రమే నిజం అనే యదార్థవాది.రామదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి, ‘‘చైతన్యా! నీ ప్రశ్నకు జవాబు తరవాత చెబుతాను. ముందుగా ఒకపని చెయ్యి. ఇక్కడికి ఉత్తర దిక్కునవున్న అడవిని దాటితే సుశాంతం అనే నగరం వస్తుంది.

అక్కడికి ఆమడ దూరానవున్న భవానీపురం  అనే గ్రామంలో, నా సోదరుడు నివసిస్తున్నాడు. నువ్వు అతడి వద్దకు వెళ్ళి క్షేమ సమాచారాలు తెలుసుకునిరాగలవా?’’ అని అడిగాడు.ఇందుకు సరేనన్న చైతన్యుడు, మర్నాడు వేకువజామునే బయల్దేరాడు. గురుపత్ని అతడికి రెండు రోజులకు సరిపోయే రొట్టెలనూ, ఇతర తినుబండారాలనూ ఒక సంచీలో పెట్టియిచ్చింది.చైతన్యుడు కాస్త వేగంగా నడుస్తూ, మిట్ట మధ్యాహ్నంవేళకు అడవిలో కొంతదూరం వెళ్ళాడు.


 దాహం వేయడంతో, ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని అతడు పరిసరాలను పరికించి చూస్తున్నంతలో, ఒక గుడ్డి ముసలివాడు - అడవిచెట్ల ఆకులను తడిమి చూస్తూ, వాసన పీలుస్తూవుండడం కంటబడింది.చైతన్యుడు, ఆ గుడ్డి ముసలివాణ్ణి సమీపించి, ‘‘ఏం, తాతా! దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే!’’ అన్నాడు.‘‘నాయనా, ఏదీ పోలేదు. నేను దాపులనున్న కోయగూడెంవాడిని; అందరూ నన్ను మందులతాత అని పిలుస్తారు. మందుగా వాడేందుకు పనికివచ్చే ఆకుల్ని ముట్టుకుని, వాసన చూసి కోసుకుపోతున్నాను. పుట్టు గుడ్డినిగదా మరి!’’ అన్నాడు తాత.

‘‘అలాగా! అయితే, నీ చేతిలోవున్న ఆ తీగ దేనికి పనికివస్తుంది?’’ అని అడిగాడు చైతన్యుడు.‘‘ఇదా! ఇది విషహారిణి, నాయనా! పాము కాటుకు ఇది తిరుగులేని మందు. పాముకాటు తిన్న మనిషి నోట్లో, ఈ తీగ పసరు పిండితే, క్షణాల్లో విషం విరిగిపోయి, పోయే ప్రాణం తిరిగి వస్తుంది. కావాలంటే వుంచు. అడవిలో తిరుగుతున్నావు, అవసరం కలగవచ్చు,’’ అంటూ తీగను కొంత తుంచి, చైతన్యుడికిచ్చాడు తాత.చైతన్యుడు ఆ తీగను దుస్తుల్లో భద్రపరచుకుని, తాతను, ‘‘ఈ దగ్గర్లో ఎక్కడైనా నీరు దొరుకుతుందా?’’ అని అడిగాడు.

‘‘ఈ దరిదాపుల్లోనే మంచినీళ్ళ బావివుంది. కాస్త వెతికి చూడు,’’ అన్నాడు తాత.చైతన్యుడు కొంచెం ముందుకు నడిచి నలువైపులా పరీక్షగా చూశాడు. అతడికి ఒక మద్దిచెట్టు పక్కన బావి కనిపించింది. అతడు అక్కడ భోజనం చేసి, చెట్టుకింద విశ్రమించాడు. అంతలో కునుకుపట్టింది. హఠాత్తుగా తన మీద ఏదో పడినట్లయి అతడు కళ్ళు తెరిచాడు. దూరంగా పరిగెడుతున్న కుందేలు అతడి కంట బడింది. అంతలో చెట్టు కొమ్మ ఒకటి  పెద్ద ధ్వనితో విరిగి పడింది.

చెతన్యుడు చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. కుందేలు అలికిడి లేకపోతే, తను కునుకు పాటులో వున్న సమయంలో కొమ్మ అతడి మీద పడివుండేది. ఎవరో ఆ కొమ్మను వంట చెరుకు కోసం సగం నరికి వదిలిపోయారు!చైతన్యుడు తిరిగి నడక సాగించాడు. అతడు అడవి దాటి నగర పొలిమేర ప్రాంతాలు చేరే సరికి అక్కడ ఒక పేదవాడు, అతడి భార్యాపిల్లలు డొక్కలు ఎండిపోయి ఆకలితో అలమ టిస్తూ, అతిదీనంగా ముష్టి ఎత్తుకోవడం కనిపించింది.


వెంటనే చైతన్యుడు, గురుపత్ని తనకు తిరుగు ప్రయాణానిక్కూడా సరిపోయేటట్లు కట్టియిచ్చిన ఆహారాన్ని పేదవాడి చేతుల్లో పెట్టి ముందుకు సాగాడు. అతడు నగరం చేరే సరికి బాగా చీకటి పడింది. ఆ రాత్రికి తలదాచుకునేందుకు ఒక సత్రం చేరి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో చుట్టూ కలకలం ప్రారంభమయ్యే సరికి, చైతన్యుడు లేచికూర్చున్నాడు. ఎవరో బాటసారి సత్రం వసారాలో నురగలు కక్కుతూ గిలగిలా కొట్టుకోవడం అతడికి కనిపించింది. అంతలో గోడవారగా చరచరా పాకిపోతున్న నల్లత్రాచు కంటబడింది.
వెంటనే, ఆ బాటసారిని కాటు వేసిందని గ్రహించిన చైతన్యుడు, తన దగ్గరవున్న విషహారిణి తీగపసరు అతడి నోటిలో పిండాడు. క్షణాల్లో అతడి శరీరం నీలి రంగు నుంచి, సహజమైన ఛాయలోకి మారింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన  ఆ బాటసారి ఎవరో కాదు; సుశాంతనగర మంత్రి. ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు మారువేషంలో నగర సంచారం చేస్తూ, సత్రంలో పాముకాటుకు గురయ్యాడు.ఆయన చైతన్యుణ్ణి పరిపరి విధాల మెచ్చుకుని, ‘‘నా ప్రాణాలు కాపాడావు. ప్రత్యుపకారంగా, నేనేం చేసినా ఋణం తీరదు. అయినా, నాకు తోచిన సాయం చేయదలచాను.

 రాజాస్థానంలో నీకు మంచి పదవి ఇప్పిస్తాను. ఏ మంటావు?’’ అని అడిగాడు.చైతన్యుడు, మంత్రికి కృతజ్ఞత చెప్పుకుని, తాను అత్యవసరం అయిన పని మీద దాపుల నున్న భవానీపురం వెళుతున్నాననీ, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటాననీ చెప్పి, తెల్లవారగానే బయల్దేరి భవానీపురంలోని గురువుగారి సోదరుడి ఇల్లు చేరి, క్షేమ సమాచారాలు తెలుసుకుని, వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు.


అతడు సూర్యాస్తమయ సమయానికి గురుకులానికి చేరి, గురువుకుతన ప్రయాణ విశేషాలన్నీ ఒక్కపొల్లు కూడా పోకుండా చెప్పాడు.గురువు సంతోషించి, ‘‘నాయనా, చైతన్యా! నువ్వు అడిగిన ప్రశ్న - దేవుడిని చూపమని కదా? నా అవసరం లేకుండానే, నువ్వే చూడగలిగావు దేవుణ్ణి!’’ అన్నాడు.‘‘నేనా! నాకే దేవుడూ కనిపించలేదు!’’ అంటూ ఆశ్చర్యపోయాడు చైతన్యుడు.

ఆ జవాబుకు రామదేవుడు చిరునవ్వు నవ్వి, ‘‘ఇక్కడా అక్కడా అని లేకుండా, అప్పుడు ఇప్పుడు అని కాక, ఎక్కడ బడితే అక్కడ - ఏ ఒక్క రూపానికో పరిమితంకాకుండా కనిపిస్తాడు, ఆ సర్వాంతర్వామి. గమనించే విజ్ఞత వుంటే చాలు!’’ అన్నాడు.చైతన్యుడు అర్థంకాలేదన్నట్టు విస్తు పోతూ, గురువుకేసి చూశాడు. అప్పుడు రామదేవుడు, ‘‘విను! నీకు విషహారిణి తీగగురించి తెలియజెప్పిన, గుడ్డి ముసలి కోయవాడు దేవుడు. అడవిలో కూడా అవసరం కలుగుతుందేమో అని, బావి తవ్వించిన వ్యక్తి కూడా దేవుడే.

నీ ప్రాణం కాపాడిందే, ఆ అల్పజీవి కుందేలు కూడా దైవాంశమే. పాముకాటుకు గురై ప్రాణాపదలోవున్న మంత్రిని కాపాడిన నీలో కూడా, నీకు తెలియకుండానే, ఆ దేవుడున్నాడు. చూశావా! ఇన్ని రూపాలతో ప్రత్యక్షమైన, ఆ దేవుడికి - ఇంత చూసినా, ఉనికిలేదనే అంటావా?’’ అని అడిగాడు. దానితో జ్ఞానోదయమైంది చైతన్యుడికి.

జాలి, దయ గల మనసులోనే దేవుడు కొలువుంటాడని గ్రహించి, గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు.ఆ తర్వాత చైతన్యుడు, గురువు వద్ద వీడ్కోలు తీసుకుని, తల్లిదండ్రులను వెంట బెట్టుకుని సుశాంతనగరం చేరి, మంత్రి దర్శనం చేసుకున్నాడు. ఆయన సహాయం వల్ల, చైతన్యుడికి ఆస్థానంలో మంచి పదవి లభించింది.