Pages

Thursday, June 18, 2015

స్నేహం

 ములుగు అడవిలో ఒక చెట్టుకింద నెమలి మరియు పాము నివాసముండేవి. ఆ రెండింటికీ స్నేహం కుదిరింది.
ఓరోజు ముంగిస వచ్చి పాము మీద దాడి చెయ్యబోయింది. పాము మిత్రమా! రక్షించు’మని అరిచింది. వెంటనే నెమలి వచ్చి ముంగిస ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది.

ముంగిస పామును వదిలేసి పారిపోయింది. మరోసారి పాము, నెమలి మాట్లాడు కుంటున్నాయి. వేటగాడు వచ్చి నెమలి మీద వలవెయ్య బోయాడు. అది గమనించిన పాము పరిగెత్తుకెళ్లి వాని కాలు కాటేసింది. వాడు  బోదిబోమంటూ పరిగెత్తాడు.

ఆ రెండూ ఇలా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారు. అదే అడవిలో తిరుగుతున్న తోడేలుకు ఆ నెమలి మాంసం తినాలని నోరూరింది. పాముతో కలిసుంటే నెమలి చిక్కదనుకుంది. ఆ రెంటికీ వైరం పెట్టాలనుకుంది.

పాము చాటుకు వెళ్లగానే నెమలితో తోడేలు ‘ఓసి పిచ్చి నెమలీ! పాము నిన్ను చంపాలని చూస్తుంది. జాగ్రత్త సుమా! నా సాయం కావాలనుకున్నప్పుడు పిలువు’ అంది. మరోసారి పాము చాటుకు నెమలితో అయ్యో, అమాయకురాలా! ఆ దుర్మార్గ నెమలి ముంగిసతో మాట్లాడేటప్పుడు నేను చూసాను.

నిన్ను చంపించాలని చూస్తుంది. జాగ్రత్త సుమా! నా సాయం కావాలంటే అడుగమంది. పాము, నెమలి తోడేలు చెప్పిన దాని గురించి ఆలోచించాయి. అకారణంగా పాము ననె్నందుకు చంపాలనుకుంటుంది? అని నెమలి, అదేవిధంగా పాము ఆలోచించాయి. రెండూ కలిసి తోడేలు తమతో చెప్పిన విషయం చెప్పుకుని నవ్వుకుంటున్నాయి.
దూరంనుండి తోడేలు అటే వస్తోంది. ఆ రెండు అది గమనించి పోట్లాడుకుంటున్నట్టు నటించసాగాయి. అది నిజమే అనుకున్న తోడేలు సంతోషించి పాముతో ‘నేనా నెమలిని పట్టి ఇవ్వాల్నా?’ అని అడిగింది. దాని పన్నాగం రెండూ గ్రహించి సైగ చేసుకున్నాయి. రెండూ కలిసి తోడేలు మీద మెరుపు దాడి చేసాయి.

పాము దాని కాళ్లను కాటేసింది. నెమలి దాని ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది. అది భరించలేక తోడేలు కుయ్యో, మొర్రో అంటూ పారిపోయింది.

పేదరాశి పెద్దమ్మ కధ

 సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య.. "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.
మొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి.

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చింది. ఆమెని చూసిన రాజు ఆనంద పడి రెండో భార్యని వెళ్ళగొడతాడు.

అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి 

తెనాలి రామలింగడు...సంచిలో ఏనుగు..!!

 ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయలవారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు, ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు "మహారాజా...! మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైంద"ని చెప్పాడు.

అంతే ఫక్కున నవ్విన రాయలవారు... "రామలింగా...! ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావుగానీ, చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా.. చెప్పు..?" అన్నాడు. "లేదు మహారాజా..! చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు. అంతకంటే, కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి" అన్నాడు రామలింగడు.
అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోడం లేదని అన్నాడు రాయలవారు.


నిజం "మహాప్రభూ...! చిన్నపిల్లలు అది కావాలి, ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా, తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటిని వేగడం, వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండీ..!!" అని వివరించి చెప్పాడు రామలింగడు.

మహారాజు దీనికి కూడా ఏ మాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి.. "సరే మహారాజా..! కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగానూ, మీరు తండ్రిగానూ నటిద్దాము. పిల్ల చేష్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను" అన్నాడు. దీనికి సరేనన్నాడు రాయలవారు.
అంతే ఇక మారాం చేయటం మొదలెట్టాడు రామలింగడు. మిఠాయి కావాలని అడిగాడు. ఓస్ అంతేగదా.. అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారుకు పోదామని గోల చేశాడు రామలింగడు. సరేనని బజారుకు తీసుకెళ్ళగా... వీధిలో అటూ, ఇటూ పరుగులెత్తాడు, తన వెంటే రాజును పరుగులెత్తించాడు. రంగు రంగుల సంచీ చూపించి కొనివ్వమని రాజును అడిగాడు.

సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేదిలేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే...! ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాం చేశాడు.

సంచిలో ఏనుగెలా పడుతుంది రామలింగా..? మరొకటి ఏదైనా అడుగు" అన్నాడు రాయలవారు. "వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి. నాకింకేమీ వద్దు" అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు. అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకుంటూ అక్కడినుంచి ఇంటికి బయలుదేరాడు.

తెనాలి రామలింగడు.. లెంపకాయ ఖరీదు..!!

 ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా.. ఎవరో వెనకనుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కిందపడిపోయాడు. ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి, ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు.

తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు.. "నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా..? నన్నెందుకయ్యా కొట్టావు..?" అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారుపడుతూ.. "అయ్యా..! తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనుకనుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టానంతే..!" అని చెప్పాడు.

"సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా..?" అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి, జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా.. తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగయినా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

"పోనీలేవయ్యా రామలింగా..! ఏదో తెలియక పొరపాటు చేశాడు. ఏమనుకోవద్దంటున్నాడుగా.. ఊరుకో..!!" అన్నాడు మంత్రి. అయితే రామలింగడు ససేమిరా అన్నాడు. సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి. ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే, సందుచూసి పారిపోయాడు. ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది.

మంత్రిగారికి దగ్గరిగా వెళ్లిన రామలింగడు.. "అయితే మంత్రిగారూ..! నాకు తెలియక అడుగుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుందే..!!" అన్నాడు. "అంతేగా మరి..!" అన్నాడు మంత్రి. "ఓహో..! అలాగా...!!" అని నవ్వుతూ అన్నాడు రామలింగడు.

వెంటనే మంత్రి గారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగడు. మంత్రి "కుయ్యో.. మొర్రో.." అంటూ.. "ఎందుకయ్యా రామలింగా.. నన్ను కొట్టావు..!!" అని అడిగాడు. "మంత్రిగారూ..! నాకు అవతల బోలెడంత పని ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా..! నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి, మీరు దాన్ని ఉంచుకోండ"ని చెప్పి ఎంచక్కా అక్కడినుంచి వెళ్లిపోయాడు తెనాలి రామలింగడు.

తెలివైన ఆసామి!!!

 ఒక ఊళ్లో ఒక ఆసామి వుండేవాడు. అతను ఏమి చదువుకోక పోయినా మంచి తెలివి తేటలు గల వాడు. ఒకసారి, అతనికి పది రూపాయలు అవసరమయ్యింది. దాన్ని సంపాదించడానికి అతను ఒక ఉపాయం ఆలోచించాదు.

పట్నం లో అతనికి తెలిసిన ప్లీడరు ఒకాయన ఉన్నాడు. ఆసామి ఆయన వద్దకు వెళ్లి, "ప్లీడరు గారు, మీరు చదువుకున్నవారు, తెలివి గల వారు. నేను చదువుకోని పల్లెటూరి మొద్దును. నేను తమర్ని ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పలేక పోతే ఇరవై రూపాయలు ఇవ్వాలి, మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి, సమాధానం చెప్పలేక పోతే పది రూపాయలు ఇచ్చుకుంటాను. పేదవాణ్ణి కదా!"అన్నాడు.

అందుకు ప్లీడరు గారు ధైర్యంగా ఒప్పుకున్నారు.

" మూడు కాళ్లూ, రెండు ముక్కులూ గల పక్షి ఏది?" అని అడిగాడు.

ప్లీడరు సమాధనం చెప్పలేక ఓడినట్టు ఒప్పుకొని ఆసామికి ఇరవై రూపాయలు ఇచ్చి, "నేను నిన్ను ఆ ప్రశ్నే అడుగుతున్నాను. సమాధానం చెప్పు" అన్నాడు.

"ఓడిపోయాను!" అంటూ ఆసామి పది రూపాయలు ప్లీడరు గారికి ఇచ్చి, మిగిలిన పది జేబులో వేసుకొని చక్కా వెళ్లిపోయాడు.