Pages

Tuesday, August 21, 2012

ఎరగ్రులాబి

శాలదేశంలో సోమేశ్వరం అనే గ్రామంవుంది. అక్కడి రైతులు వ్యవసాయoలో మరింత ఫల సాయo పొందుతున్నారు. వ్యాపారులు న్యాయoగా వుంటూనే లాభాలార్జిస్తున్నారు. గ్రామస్థులందరు సత్ప్రవర్తన అలవరుచుకుని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సుఖంగావుంటున్నారు. సోమేశ్వర గ్రామంలోని జనార్దన స్వామి ఆలయo ప్రసిద్ధికెక్కిన కారణంగా ఎక్కడెక్కడివారూ స్వామిని దర్శించుకోవాలని అక్కడకు వెళ్ళేవారు.

క్రమంగా సోమేశ్వరుడి గొప్పతనం గురించి, ఆ దేశపురాజు దేవనందుడిదాకా వెళ్ళింది. ఆయన మంత్రి గంగుభద్రుణ్ణి పిలిచి, ‘‘మంత్రివర్యా! అక్కడి జనార్దనుడి ఆలయo  వెయళ్ళనాటిది. కానీ నాకు తెలిసి పది సంవత్సరాల క్రితం వరకూ, ఆ గ్రామం ఇంత గొప్పగా లేదు. కాబట్టి అక్కడి వైభవానికి దేవుడి మహిమకాకుండా, ఇంకేదో కారణముండాలని, నా అనుమానం. మీరేమంటారు?'' అని అడిగాడు.

దానికి మంత్రి వెంటనే, ‘‘ప్రభూ! ఇలాంటి విషయాలు చారుల ద్వారా విచారించి ప్రెూజనముండదు. మనమే స్వయoగా మారువేషాల్లో, ఆ గ్రామంలో సంచరించి అసలు విషయo తెలుసుకుందాం,'' అంటూ రాజుకు కర్తవ్యబోధ చేశాడు. ఆ ప్రకారం రాజు, మంత్రి జ్యోతిష్కుల వేషాల్లో సోమేశ్వరం చేరుకున్నారు. అక్కడి వైభవం వారికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు జోస్యం చెబుతామంటూ ఒక ఇంటికి వెళితే, ఆ గృహస్థు, ‘‘ మీ ముఖంలో తేజస్సు చూస్తూంటే విద్యావంతులనిపిస్తున్నది.

కానీ ఇలా జోస్యం చెప్పడం వల్ల, మీ విద్య వృధా అవుతుంది. ఎందుకంటే, మనిషి ఏమి సాధించాలన్నా కృషి చేయాలి. కృషికి అదృష్టం తోడైనప్పుడు ఫలితం బాగుంటుంది. అదృష్టమెలావున్నా, మనిషి సమర్థతకు తగిన కృషి మానకూడదు. ఫలితమెలాగున్నా, కృషి మానని మనిషికి జోస్యంతో పనేముంటుంది?'' అన్నాడు.రాజు, ఆ గృహస్థు వివేకానికి ఆశ్చర్యపడి, ‘‘జనార్దనస్వామిదయవల్ల, మీ గ్రామస్థుల సుఖసంతోషాలకు లోటులేదు. మావంటివారిని మీవంటివారే ఆదరించాలి; కాదనకూడదు,'' అన్నాడు. దీనికా గృహస్థు నవ్వి, ‘‘అయ్యా! దేవుడు మనకు జన్మనిచ్చాడు; మంచి వనరులిచ్చాడు. మనిషి అంతకుమించి ఆయన నుంచి ఆశించకూడదంటాడు, మా ఊరి రామనాధం. ఆయన మాటలు వినడంవల్లనే, మా గ్రామానికింత వైభవం పట్టింది. పదేళ్ళ క్రితం ఆయనను మా ఊరికి పంపడమే, దేవుడు మా మీద చూపించిన దయ  అని మేమంతా అనుకుంటూంటాం.

మీరొక్కసారి ఆయన్ను కలుసుకోండి. మీ విద్యకూ, సమర్థతకూ తగిన పని ఏమిటో ఆయనే చెబుతాడు,'' అన్నాడు. అప్పుడు రాజుకూ, మంత్రికీ, ఆ ఊరి వైభవానికి కారణం, రామనాధం సలహాలేనని తెలిసింది. వారు రామనాధాన్ని కలుసుకున్నారు. ఆయన వారు చెప్పింది విని, ‘‘అయ్యాలారా! జ్యోతిషం గొప్ప శాస్ర్తమే. కానీ దాన్ని మనుషుల భవిష్యత్తు చెప్పడానికి ఉపెయోగించడంవల్ల నష్టాలెక్కువ; లాభం స్వల్పం. శాస్త్రాన్ని సరిగ్గా ఉపెూగిస్తే వాన, వరద, తుఫాను, భూకంపం, కరువు వగైరాల గురించి ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

జ్యోతిషాన్ని మీరా దృష్టితో అధ్యయoనం చేయoడి,'' అన్నాడు. ఆ వెంటనే వారు తమ నిజరూపాలు బయటపెట్టారు. ఆనతో, ‘‘మహానుభావా! రాజు ఎన్ని శాసనాలు చేసినా, నీవంటి పండితుల ప్రబోధాలే ప్రజలకు ఎక్కువ ప్రెయోజనాన్నిస్తాయి. మేము నీ వద్దకు కొందరు మెరికల్లాంటి యువకుల్ని పంపుతాం. వారికి నీవు శిక్షణ ఇవ్వాలి. తర్వాత వారు, నీ సలహాలకు గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారు.

ఆ విధంగా నీ పేరు చెప్పి, మన దేశం మరింత సుభిక్షమవుతుంది,'' అన్నారు. ఇందుకు రామనాధం సరేనన్నాడు. ఆ విధంగా ఆయున ఆరు మాసాల్లో ఇరవైమంది యువకులకు శిక్షణ ఇచ్చాడు. వారు వివిధ గ్రామాలకూ వెళ్ళి, ఆయన సలహాలు ప్రచారం చేశారు. కానీ ఏడాది గడిచినా, ఆయా  గ్రామాల్లో ఏ మార్పూ కనబడలేదు. పైగా, ఏ గ్రామస్థులూ ఆ సలహాలపట్ల ఆసక్తిని చూపలేదు. ఇది రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

సోమేశ్వర గ్రామవైభవానికి దేవుడి మహిమే కారణమా అని కూడా ఆయనకు అనుమానం వచ్చింది.  అయితే, మంత్రి గంగుభద్రుడు ఆయనతో, ‘‘ప్రభూ! అది దేవుడి మహిమే అనుకుంటే, మనం ప్రజలకు చేయగలదే లేదు. రామనాధం మహిమే అనుకుంటే, ఆయన నివాసం మరో గ్రామానికి మార్చితే, ఆ విషయo ఋజువౌతుంది,'' అన్నాడు. రాజుకీ సలహా నచ్చింది. ఆయన రామనాధాన్ని ఐలవరం అనే గ్రామంలో నివాస ముండవలసిందిగా కోరాడు. ఆ గ్రామంలో నాలుగేళ్ళుగా కరువు విలయతాండవం చేస్తోంది.

ప్రజలు వున్న పూట తింటూ, లేని పూట పస్తులుంటూ, ఎందుకొచ్చిందిరా అన్నట్లు బ్రతుకులీడుస్తున్నారు. రామనాధం తన భార్య మీనాక్ష, పిల్లలు రాము, గీతలతో ఆ గ్రామం చేరుకున్నాడు. గ్రామస్థులాయన వుండేందుకు శిథిలావస్థలో వున్న ఒక ఇంటిని ఇచ్చారు. ఆయన అందులో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇంట్లో అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు.
మీనాక్ష ఇల్లు చక్కదిద్దుకుంటే, ఆయన పిల్లలకు కాసేపు చదువు చెప్పి, ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఒక్కొక్కరినే పలకరించి విశేషాలడిగి తెలుసుకుని, వారివారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవాడు. ఆయన మాటల్లో ఎంతటి అద్భుత శక్తివున్నదో, నెలరోజులు తిరక్కుండానే ఊరివారంతా ఆయన వద్దకు సలహాలకోసం రాసాగారు. రామనాధం వాళ్ళకు, ఊళ్ళో ఎక్కడెక్కడ తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు.

తక్కువ నీటితో పండేపంటల గురించి చెప్పాడు. పంటలు పండనప్పుడు, పట్నం వెళ్ళి తాత్కాలికంగా డబ్బు సంపాయించేందుకు అవసరమైన వృత్తి విద్యల గురించి చెప్పాడు. పలు ఆరోగ్యసూత్రాలను వారికి వివరించి చెప్పి, ‘‘ఈ భూమ్మీద ఎడారులున్నాయి. అడువులున్నాయి. మంచు పర్వతాలున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ మనుషులు సుఖజీవనం చేస్తున్నారు. ఇదితెలుసుకుంటే, మనిషి ప్రకృతి బీభత్సాలకు భయపడ్డం మానేసి, ప్రకృతి వనరులను చూసి సంతోషించడం నేర్చుకుంటాడు,'' అన్నాడు.

ఆరు మాసాలు తిరిగే సరికి పాడుపడినట్లుండే రామనాధం  ఇల్లు పచ్చదనంతో కళకళలాడింది. ఊరికి కూడా కొత్త కళవచ్చింది. ఈ మార్పుకు కారణమైన రామనాధానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక ఇవ్వాలని వారనుకున్నారు.  అయితే, రామనాథం నవ్వి, ‘‘మీరందరూ నన్నెంతో గౌరవిస్తూ, నా సలహాలు పాటిస్తున్నారు. అంతకు మించిన కానుక మరేమీ లేదు,'' అన్నాడు. అప్పుడు గ్రామస్థులు, ఆయన భార్య మీనాక్షతో, ‘‘అమ్మా! పాడుబడ్డ ఇంట్లో కాపరం ప్రారంభించి, ఆ ఇంటిని స్వర్గతుల్యం చేశావు కాబట్టి, నీ భర్త మా అందరికీ మేలుచేసే సలహాలివ్వగలిగాడు. ఒక విధంగా, ఈ ఊరి అసలు బాగుకు కారణం, నువ్వు. నీకోసం ఏదైనా తెచ్చి ఇవ్వాలని, మా కోరిక.

ఏదైనా అడిగి, మా మనసులకు పూర్తి సంతోషం కలిగించు!'' అని వేడుకున్నారు. మీనాక్ష, ‘‘ఒకప్పుడు బీడులావున్న ఇంటి పెరడు ఇప్పుడు పచ్చని మొక్కలతో, రంగు రంగుల పూలతో కళకళలాడుతున్నది. అయితే, ఇంటి తోటకు ఎరగ్రులాబీ లేక పోవడం పెద్ద లోటు. మీరు నాకా మొక్క సంపాదించియిస్తే, మీ మేలు మరవను,'' అన్నది. ఆ రోజు నుండీ గ్రామస్థులు ఎరగ్రులాబీ మొక్క కోసం అన్వేషణ ప్రారంభించారు.

గ్రామంలోనేకాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ అది దొరకలేదు. ఈలోగా ఐలవరం గ్రామం సాధించిన అభివృద్ధి గురించి రాజు దేవనందుడికి తెలిసింది. ఆయన మంత్రి గంగుభద్రుడితో సంప్రదించి కబురంపగా, ఐలవరం నుంచి కొందరు గ్రామపెద్దలు రాజధానికి వచ్చారు. వాళ్ళు మంత్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ, రామనాధం కారణంగా, గ్రామం బాగు పడిందని చెప్పారు. గంగుభద్రుడు వారితో, ‘‘ ఇక రామనాధం లేకున్నా మీగ్రామాభివృద్ధికి ఏలోటూరాదు.

మహారాజుగారు ఆయన్ను యోగవరం గ్రామానికి పంపాలనుకుంటున్నారు,'' అన్నాడు. ఇది వింటూనే గ్రామస్థులు తమలో తాము చర్చించుకుని రాజుతో, ‘‘ప్రభూ! రామనాధం గృహిణి మీనాక్ష కోరగా ఎర్ర గులాబీ మొక్క తెచ్చియిస్తామని చెప్పాము. అది ఇంతవరకూ మాకు లభ్యంకాలేదు. త్వరలోనే సాధించగలమని, మా ఆశ. కొంత గడువు ఇవ్వవలసిందిగా ప్రార్థన,'' అన్నారు. రాజుకు వాళ్ళ కోరిక ఉచితమనిపించింది. అయితే ఆర్నెల్లు గడిచినా ఎరగ్రులాబీ మొక్క దొరికినట్లు లేదు. ఈ విషయమై విచారిస్తూనే వున్న మంత్రి గంగుభద్రుడు రాజుతో, ‘‘ప్రభూ! ఐలవరం గ్రామస్థులకు ఎర్ర గులాబీ మొక్క దొరికినట్టులేదు.మనమే దాని కోసం ప్రయత్నిద్దాం. సమస్య పరిష్కారమౌతుంది,'' అన్నాడు. ఇందుకు రాజు సరేనన్నాడు. భటుల ద్వారా ప్రయత్నించగా, పొరుగు దేశంలోని ఓ కుగ్రామంలో దొరికిందో ఎరగ్రులాబీ మొక్క. ఒక శుభదినాన దేవనందుడు, మంత్రితో సహా ఐలవరం చేరుకున్నాడు. అక్కడ విలువైన కానుకలతో రామనాధాన్ని సత్కరించి, ఆ మొక్కను గ్రామస్థుల తరఫున తనే స్వయoగా ఆయన కిచ్చి, ‘‘నీ అర్ధాంగి కోరిక తీరింది.

నీవిక యోగవరం తరలివెళ్ళి, ఆ గ్రామానిక్కూడా మేలు కలిగించాలి,'' అన్నాడు. ఆ మరుక్షణం మీనాక్ష కలుగజేసుకుని, ‘‘ప్రభూ! ఇక్కడ మా ఇంటి తోటలో, ఈ మొక్కను నాటి బ్రతికించి, మొగ్గతొడిగించి, ఒక్కటంటే ఒక్క పువ్వు పూయగా చూసి వెళ్ళాలని, నా కోరిక,'' అన్నది. ఈ మాటలకు దేవనందుడు ఆశ్చర్యపడి, ‘‘అమ్మా! ఈ గ్రామం విడిచి పెడుతూ దీన్నిక్కడ పాతడమెందుకు? నీతో యోగవరం తీసుకుని వెళ్ళు,'' అన్నాడు.

‘‘ప్రభూ! ఈ మొక్కను నేనడిగింది, ఈ ఇంటి తోట కోసమే. మేమున్నా లేకున్నా ఈ మొక్క ఆ తోటలోనే వుండాలి,'' అన్నది మీనాక్షి. అప్రయత్నంగా రాజామెకూ, ఆ వెంటనే రామనాధానికీ చేతులు జోడించి నమస్కరించి, మీనాక్షతో, ‘‘అమ్మా! నాకిప్పుడు మీ కుటుంబం ప్రత్యేకత అర్థమైంది. ఏ ఇంట్లో వుంటే ఆ ఇల్లు తనదనుకుని, ఏమనుషులతో మసిలితే, ఆ మనుషులు తనవాళ్ళనుకుని అంకితభావంతో కృషిచేయడంవల్లనే, మీ ప్రబోధాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

గొప్ప తనం ప్రబోధాలలోనే వుంటే శాస్ర్తం చదివిన ప్రతివాడూ మహాత్ముడే అయ్యాoవాడు. ఉత్తమ ఫలితాలను మీరు మాత్రమే సాధించగలరు. ఇక మీదట మీరు నేను చెప్పానని కాక, మీ వీలును బట్టి సంచరిస్తూ, మనదేశ పౌరులను ప్రభావితం చేయవలసిందిగా వేడుకుంటున్నాను,'' అన్నాడు. ఆ తర్వాత రామనాధం ప్రబోధాలే కాక, ఆయన కథ కూడా విశాలదేశ పౌరులను ప్రభావితం చేయగా, ఆ దేశం నిత్యకళ్యాణం పచ్చతోరణాలతో కలకాలం వర్థిల్లింది.

తపస్సు వలన వచ్చే విద్య వలన జరిగే అనర్ధాలు

రైభ్యుడు, భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రిని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై "ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు ? "అని అడిగాడు. యువక్రీతుడు "నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి " అని కోరాడు. ఇంద్రుడు " ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖత॰ నేర్చుకోవడం ఉత్తమం " అన్నాడు.అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు.

ఇంద్రుడు వెళ్ళి పోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చీసి యువక్రీతుడు నవ్వి " వృద్ధుడా! ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది " అన్నాడు. ఆ వృద్ధుడు "నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను " అన్నాడు. ఇంద్రుడు నిజరూపం చూపి "యువక్రీతా ! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు అంతే నిరర్ధకం. కనుక నీ ప్రయత్నం మానుకో " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందేనని పట్టు పట్టాడు. ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు.

తన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి " మీరు యువక్రీతుని వధించండి " అని పంపాడు. ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు.వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరవాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు. తరవాత కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు.

యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆస్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావాశూ ఎదో క్రూరమృగం వస్తుంది అనుకుని ఎదురుగా వస్తున్న రైభ్యుని ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పాడు. పరావసు అర్ధవసుతో "అన్నయ్యా ! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించ్ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆ యాగాన్ని పోయి ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి " అన్నాడు.

అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు " మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు " అన్నాడు.రాజు అనుచరులు పరావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు. అర్ధావసు రాజును చూసి " రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మ హత్యకు నేను పెరాయశ్చిత కర్మలు చేసి వస్తున్నాను. అతడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడిని చేసాను " అని సత్యం చెప్పాడు.

అందుకు దేవతలు సంతోషించి " అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగారు. అర్ధవసుడు "అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతున బ్రతికించండి అలాగే నాతమ్ముని దోషం కూడా పరిహరించండి " అని కోరుకున్నాడు. దేవతలు అందరిని బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి " దేవతలారా! నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి? " అని అడిగాడు. దేవతలు " యువక్రీతా! గురుముఖత॰ నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు. అని పలికి స్వర్గాలికి వెళ్ళారు.

నాగదేవత

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను, '' అంటూ ఇలా చెప్పసాగాడు:

ధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపాలోచించి, ‘‘ఏ నేరంపైన అయినా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివనీ తెలుసు, భూష…య్య మోసగాడనీ తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే, నీవువెయ్యి వరహాలు ధరావతు కట్టాలి. ఎవరైనా నీగురించి హామీ ఇవ్వాలి,'' అన్నాడు.

అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బులేదు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకింతో అంతో పరపతివుంది కాబట్టి అప్పు పుడు తుందనుకున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి, ఎవరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు.
ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాధుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే, అదే సమయంలో విశ్వనాధుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్ళి సంబంధం వచ్చింది. పెళ్ళి ఖర్చులకు అయిదు వేల వరహాలదాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాధుడు శతవిధాల ప్రయత్నిస్తూంటే భూషయ్య అతణ్ణి కలుసుకుని, ‘‘నీకు నేను సాయపడతాను. బదులుగా నువ్వు నాకు సాయపడాలి,'' అన్నాడు.

విశ్వనాధుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీవుండడానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయింది.అప్పుడు ధర్మాంగదుడికి, భూషయ్య మీదకంటే విశ్వనాధుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకు డనిపించుకుని ఉరికంకంబ మెక్కాల్సివస్తుంది.

పోనీ, విశ్వనాధుణ్ణి కసితీరాకొడదామన్నా - అప్పుడూ అందరూ తనను పరమదుష్టుడని అసహ్యించుకుంటారు!విశ్వనాధుడి మీద పగతీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు, ఊరిచివర కొండగుహలో వుండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడనీ, ఆయన మహిమలు చేయగలడనీ అంతా చెప్పుకుంటారు. బైరాగి, ధర్మాంగదుడు చెప్పింది విని, ‘‘తన స్వార్థంకొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాధుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాధుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వూ మంచి మిత్రుడివి కావు!'' అన్నాడు.

‘‘స్వామీ, అపకారం చేసింది విశ్వనాధుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను,'' అన్నాడు ధర్మాంగదుడు. ‘‘ఇప్పుడు నీ మనసునిండా పగవుంది. పాముకు విషమెలాంటిదో, మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచి పెట్టిరా. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం,'' అన్నాడు బైరాగి. ‘‘స్వామీ! నామనసులోని పగపోయే మార్గం కూడా, మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టు కోలేకుండావున్నాను,'' అన్నాడు ధర్మాంగదుడు.

బైరాగి కొద్దిసేపు ఆలోచించి, ‘‘అయితే విను. నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగ అంతా విషంగా మారి, నీతలలో చేరుతుంది. ఆ విషం బారినుంచి బయట పడగానే, నీకు తిరిగి మనిషిరూపు వస్తుంది. పాము రూపంలో వున్నంత కాలం నీకు పూర్వజ్ఞానం వుంటుంది కానీ, బుద్ధులు మాత్రం పామువే వుంటాయి. ఎటొచ్చీ పాము రూపంలో వుండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆరూపంలోనే మరణిస్తావు!'' అన్నాడు. ధర్మాంగదుడు మారాలోచనలేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతణ్ణి పాముగా మార్చేశాడు.పాముగా మారిన ధర్మాంగదుడు, అక్కణ్ణించి పాకుతూ పొలాలవైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కరన్రు నేలకు తాటిస్తూ వస్తూంటే, దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది.

అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి, ధర్మాంగదుడితో, ‘‘నువ్వా మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడడం మనకు ప్రమాదం అని తెలుసుగదా!'' అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషివల్ల అపకారం జరిగినా, ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది, ధర్మాంగదుడికి. కానీ విశ్వనాధుడు తన శత్రువు. అతణ్ణి మాత్రం కాటువేయాలి. అప్పుడు విశ్వనాధుడి ప్రాణాలు పోతాయి. తనకు శిక్షావుండదు!

ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని, ఎవరికంటా పడకుండా విశ్వనాధుడి ఇల్లు చేరాడు. ఇంట్లోని ముందరిగదిలో విశ్వనాధుడి కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో, ‘‘పాము!'' అని గట్టిగా అరిచాడు. ఆ కురవ్రాణ్ణి కాటేసి విశ్వనాధుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ, తనకే అపకారమూ చేయనివాడి జోలికి వెళ్ళడం తప్పని, అతడికి అనిపించింది. అందుకని అక్కణ్ణించి చరచరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు.

ఇంతలో ఇంటిల్లపాదీ విశ్వనాధుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పిందివిని, అంతా పూజగదిలోకి వెళ్ళారు. చూస్తే, అక్కడ పూజామందిరంలో, పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. ‘‘నాగదేవత! కళ్ళు మూసుకుని నమస్కరించండి. ఎవరికీ ఏ అపకారమూ జరగదు! ఈ రోజుతో మనకూ, మనవాళ్ళకూ వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగి పోవాలని నాగదేవతకు మొక్కుకో నాయనా,'' అన్నది విశ్వనాధుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పామురూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కి పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు.

‘‘ఛీ! నాయీ విషంవల్ల ఏ ప్రయోజనమూ లేదు,'' అనుకుంటూ ధర్మాంగదుడు తనకోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బ…యట పడగానే, అతడి పాము రూపంనశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే వుండడంతో తనూ లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాధుడి తల్లి, మందిరంలో నాగదేవత మాయంకావడం చూసి, మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాముపుట్టలో పాలు పోసివచ్చేది.

ఎలాంటి కష్టాలు వచ్చినా, నాగదేవత కరుణవల్ల తొలిగి పోతాయని కొడుకుకు చెపుతూండేది. విశ్వనాధుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి, పక్కనేవున్న ధర్మాంగదుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలి…యక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, ‘‘మిత్రమా! నీ అవసరం నీచేత చేయించిన పనివల్ల, నాకు పొలం పోయింది. అంత మాత్రాన, అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగాలేను,'' అన్నాడు.

ఈ మాటలకు విశ్వనాధుడితో పాటు, అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశానికెత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళోవారందరు కూడా, ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా, ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! విశ్వనాధుడు, ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా వుంటూ, ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ, అతడికి సహాయం నిరాకరించాడు.అటువంటి మిత్రద్రోహి మీద పగసాధించేందుకు ధర్మాంగదుడు, మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడుగదా? కానీ, పూజామందిరంలో అవకాశంవున్నా అతడు, విశ్వనాధుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకూ, పాముగా అతడి ప్రవర్తనకూ పొంతన వున్నట్టు లేదుకదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు.

 దానికి విక్రమార్కుడు, ‘‘మనుషులలాగే పశుపక్ష్యాదులక్కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావమంటూ ఒకటి వుంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాపోహలతో, పాములకు తను సహజంగా వున్నవనుకుంటున్న దుష్టస్వభావం, పగల గురించి ఆలోచించాడు. బైరాగి, అతడికి పాముగా పూర్వజ్ఞానం వుంటుందనీ, బుద్ధిమాత్రం పాములదేననీ చెప్పాడు! ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు, ఆ పాము - పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయనీ, వాటికి పగ అన్నది తెలి…యదనీ చెప్పింది.

ఆ సమయాన, బుద్ధి విషయంలో పాముల స్థాయిలో వున్న ధర్మాంగదుడికి, అది ఆచరించదగిందిగా తోచింది. పైగా, విశ్వనాధుడు, ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే, ఆ సమయంలో విశ్వనాధుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్ళి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండడం వల్ల, స్నేహితుడు కోరిన సాయం చేయలేక పో…యాడు. అయితే, ధర్మాంగదుడు అది గ్రహించలేక, ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాధుడి తల్లి అన్నమాటలతో ధర్మాంగదుడికి తన పొరబాటు తెలియవచ్చింది. అందువల్లనే, అతడు విశ్వనాధుణ్ణి కాటువేయలేదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

సుకుమార రాకుమారి

ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని గులక రాళ్లు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ  గులక రాళ్ల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు.

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.

విక్రమసింహుడు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది. చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.

రెండు నాలుకల ధోరణి

ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.

విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది.

కోడిపుంజును చూసి భయపడిన సింహం

ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.

విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది.

రాజు తెలివితేటలు

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి." అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.

ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.

ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

సంతోషమైన ముఖం

అనగనగా ఒక ఊరిలో సంతోష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు ఒకరోజు ఆడుకుంటూ వాళ్ల ఇంట్లో పాత సామాన్లు ఉన్న గదిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్దం కనిపించింది. నగిషీలు చెక్కి ఉన్న చెక్క ఫ్రేమ్‌లో ఆ గుండ్రటి అద్దం సంతోష్‌కి బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లికి చూపించి, ‘అమ్మా! నేను ఈ అద్దాన్ని తీసుకుంటాను’ అని చెప్పాడు. తల్లి ‘‘సరే నాయనా! కాని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మన పూర్వీకులది. పాడు చేయకూడదు ’’ అని చెప్పింది. సరేనన్నాడు సంతోష్.

ఆ అద్దాన్ని తీసుకున్న సంతోష్ దాన్ని శుభ్రంగా తుడిచి అందులో ముఖం చూసుకున్నాడు, అతని ముఖం దిగులుగా కనిపించింది. ‘అదేంటి నా ముఖం ఎందుకు దిగులుగా ఉందబ్బా అనుకున్నాడు. తన ఆట వస్తువుల్ని తీసుకుని ఆడుకున్న తర్వాత మళ్లీ అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు కూడా ముఖంలో దిగులు కనిపించింది. కాసేపటి తర్వాత తనకి ఇష్టమైన తిండి తిన్నాడు. తిన్న తర్వాత అద్దంలో ముఖం చూసుకున్నా ముందులాగే కనిపించింది.

‘ఛీ! ఈ అద్దంలో ముఖం చూసుకోకూడదు’ అని తనను తను తిట్టుకున్నాడు సంతోష్,ఆ రోజు సాయంత్రం తల్లికి చెప్పి పార్కులో ఆడుకోవటానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా సంతోష్‌కి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు, ఆ బాబు పక్కన పెద్దవాళ్లు ఎవరూ లేరు. బాబు తప్పిపోయాడని గ్రహించాడు సంతోష్. తన దగ్గర ఉన్న డబ్బులతో బాబుకి వేరుశనగకాయలు కొని వాటిని ఒలిచి తినిపించాడు. మంచినీళ్లు కూడా తాగించాడు, అప్పుడు ఆ చిన్న బాబు ఏడవటం ఆపాడు. బాబుని ఆడిస్తూ తల్లిదండ్రుల కోసం వెతకసాగాడు. ఈలోగా బాబు తల్లిదండ్రులు కనిపించారు. బాబుని చూసి చాలా సంతోషించారు. బాబుని జాగ్రత్తగా చూసుకున్నందుకు సంతోష్‌ని మెచ్చుకున్నారు.

తమ ఇంటికి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు సంతోష్, తల్లి కూడా సంతోషించింది. అప్పుడు అద్దం గుర్తుకు వచ్చి అద్దంలో ముఖం చూసుకున్నాడు. ముఖం అద్దంలో వెలిగిపోతూ కనిపించింది.

నీతి: ఇతరులకు సహాయం చేయటం భగ వంతుడిని పూజించటంతో సమానం. అప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయమైనది.

ప్రమాదంలో పడ్డ బాతు

అనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజూ ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్లేటపుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. బాతు పిల్లలు ఆ జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారే ఈదడం మొదలుపెట్టాయి.

ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నవైపుకి వెళ్లింది. ‘‘ నీరు వేగంగా వెళ్లేచోట ఈదకూడదు. నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి. అందుకే అటువైపు వెళ్లకూడదు’’ అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి ‘‘నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా! ప్రమాదం ఏమీ ఉండదులే!’’ అనుకుంది ఆ బాతుపిల్ల. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది.

బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పినమాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధ పడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది.

అక్కడ చెట్టు మీద ఉన్న ఒక పెద్ద కోతి అంతా గమనించింది. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీది నుంచి నదిలోకి వేలాడుతూ తోకతో బాతుపిల్లను చుట్టి బయటికి లాగేసింది. బాతుపిల్ల ప్రమాదం నుంచి బయటపడింది. బాతుపిల్లలు రెండూ కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది.

కిట్టూ

అనగనగా ఒక ఊరిలో కిట్టూ అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టూ తల మీద జుట్టు ఎక్కువ ఉండేది కాదు. దాంతో ఆ ఊరిలో ఉండే ఆకతాయి పిల్లలు కిట్టూని ‘గుండూ... గుండూ...’ అని ఏడిపించేవారు. అందుకే కిట్టూ ఆడుకోవడానికి బయటికి వెళ్లే వాడు కాదు. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆ ఊరి పిల్లలందరూ ఆడుతూ ఉంటే కిట్టూ ఇంటి లోపల నిలబడి చూసేవాడు.

రోజూ సాయంత్రం ఆ వీధిలో నుంచి ఒక తాతగారు నడుచుకుంటూ వెళ్లే వారు. అక్కడ ఆడుకుంటున్న వారిలో ఆకతాయి పిల్లలు ఎంత హేళనగా మాట్లాడినా ఆయన పట్టించుకోకుండా వెళ్లి పోయేవాడు. దాంతో తాతగారికి చెవులు సరిగా వినిపించవని అనుకున్నారు వాళ్లు. అప్పటినుంచి ఆయన ఆ దారిలో వెళుతున్నపుడల్లా ‘చెవిటి తాతా’ అని అరిచేవారు. ఆయన ఏమీ వినబడనట్టే వెళ్లి పోయేవాడు.

ఒక రోజు కిట్టూ గేటు దగ్గర నిలబడి చూస్తున్నాడు. రోజూ అక్కడ ఆడుకునే పిల్లలు ఎవరూ ఆ రోజు ఇంకా రాలేదు. రోజూ లాగే తాతగారు ఆ వీధిలో నుంచి వెళ్తున్నారు. రోజూ ఎవరో ఒకరు ఆ తాతని ఏదో ఒక మాట అనడం గుర్తు వచ్చిన కిట్టూ ‘‘చెవిటి తాతా! నీ పేరేంటి?’’అని అరిచాడు. వెంటనే తాత గారు కిట్టూ దగ్గరగా వచ్చి ‘‘నా పేరు

రాఘవయ్య’’ అని చెప్పాడు. కిట్టూ ఆశ్చర్యంతో నోరు తె రిచాడు. భయంగా లోపలికి పారిపోబోయాడు. అప్పుడు రాఘవయ్య కిట్టూని చేతిలో పట్టుకొని ఆపాడు.

‘‘చూడు బాబూ! నిన్ను వాళ్లు హేళన చేస్తారనే కదా నువు ఆడుకోవడానికి వెళ్లకుండా ఉంటున్నావు. మరి నువ్వు కూడా వాళ్లలాగే ప్రవర్తిస్తే ఎలా? నాకు చెవుడు లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ అందరూ నాలాగా ఉండరు కదా! నీలాగ బాధ పడే వాళ్లు కూడా ఉంటారు.

కాబట్టి హేళనగా మాట్లాడడం మంచిది కాదు. ఇదంతా మిగిలిన వాళ్లెవరికీ చెప్పకుండా నీతో మాత్రమే ఎందుకు చెపుతున్నానంటే, నువు మంచి పిల్లాడివి. మంచి విషయాలు చెపితే అర్థం చేసుకునే మనసు నీకు ఉందని నా నమ్మకం’’ అని రాఘవయ్య వెళ్లిపోయాడు. ఆయన చెప్పిన మాటల గురించే కిట్టూ చాలా సేపు ఆలోచించాడు. ఆయన చెప్పినది బాగా నచ్చింది కిట్టూకి. ఆ రోజు తర్వాత కిట్టూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. అంతే కాకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా బయటికి వెళ్లి ఆడుకోవడం మొదలు పెట్టాడు.

రాజకుమార్తెలు

కర్మపూరు రాజయిన బోపదేవుడికి మగ పిల్లలు లేరు. ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కవలపిల్లలు. కాని వారిలో ఒకతె తెల్లనిది. ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది. ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్నా, ఇద్దరూ ఒకే పోలిక. ఇద్దరు పిల్లలూ చాలా గారాబంగా పెరిగి పదేళ్ళ వయసుగల వాళ్లయ్యారు.

ఒకనాడు శ్వేతా, కృష్ణా ఉద్యానంలో నడుస్తూండగా, ఒక చెట్టు మీది నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి, పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారకులు పరిగెత్తుతూ వచ్చి, పక్షిగూడు చూశారు. అందులో రెండు గుడ్లు ఉన్నాయి. పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లెపొదలలో పారేసి, రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకుపోయారు.కాని భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. ఆస్థాన వైద్యుల చికిత్సలతో ఆ జ్వరం ఏమాత్రం తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్యభాషలో రాజుతో ఇలా అన్నది:

‘‘రాజా, నేను దేవతా పక్షిని. నేను ఈ తోటలో ఒక చెట్టుమీద గూడుకట్టి, అందులో రెండు గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి, నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కాని, మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు.'' ‘‘నేను ఇప్పుడే ఆ గుడ్లను వెదికి తెప్పిస్తాను,'' అన్నాడు రాజు. ‘‘అది ఇప్పుడు సాధ్యం కాదు. అవి చిట్లటమూ; వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరి పోవటమూ జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండశిఖరం మీద ఉంనువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి, వాటిని తీసుకువచ్చి, వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తిపడితే నీకు రెండు గుడ్లు ఇస్తాయి. అయిదేళ్ళ అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండశిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది,'' అన్నది పక్షి.

‘‘ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవరూ, ఎన్నడూ ఎక్కి ఉండలేదు,'' అన్నాడు రాజు. ‘‘నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలీదు. కాని నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం ఎలాంటి చికిత్సలు చేసినా తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబి రంగులో ఉంటుంది.

శ్వేత, గులాబి రంగుగల వజ్రాన్ని తీసుకోవాలి. కృష్ణ, తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి. అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే,'' అని చెప్పి పక్షి మాయమయింది. బోపదేవుడు వెంటనే నిద్రలేచి, రాణికి తన కల గురించి చెప్పాడు. మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి. వారితో తన కల గురించి చర్చించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేక పోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు.

అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము ఇవతలికి వచ్చి, గోడ మీదికి పాకి, మళ్ళీ గోడ దిగి, రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, ‘‘మహారాజా, దేవుడు తమపట్ల అనుగ్రహించి, తమకు సహాయంగా ఉడుమును పంపాడు,'' అన్నాడు. ‘‘ఇది నాకు ఎలా సహాయపడుతుంది, శాస్ర్తిగారూ?'' అన్నాడు రాజు. ‘‘అదే చూపింది గద! కోటగోడలలాటివి ఎక్కటంలో ఉడుములాటిది మరొకటి లేదు. దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండశిఖరం మీదికి పంపితే, ఆ తాడు పట్టుకుని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు,'' అన్నాడు రాజపురోహితుడు ఎంతో నమ్మకంతో.

ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు, రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా, ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు. ఒక రోజు ఉదయం రాజు తన ఖడ్గమూ, ఆహారమూ, నీరూ తీసుకుని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు. ఉడుము నడుముకు తేలికగానూ, దృఢంగానూ ఉండే తాడు కట్టి, శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు. వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది. ఇద్దరూ పట్టి లాగినా ఉడుము తన పట్టు వదలలేదు. తరవాత రాజు దైవధ్యానం చేసుకుని ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులూ, రాణీ భయపడుతూ నిలబడి ఉన్నారు.

రాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి, పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడదీసి, దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనబడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక రెండు తలల పాము చుట్టుకుని ఉండి, ఆయనను చూసి తన రెండు పడగలూ విప్పి, నోళ్ళు తెరిచి, కోరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి, పాముతలలు నరికేశాడు.

బోపదేవుడు చెట్టు మీది పక్షులనూ, ఉడుమునూ తీసుకుని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవారవస్తున్నది. కింద ఉంచగానే, ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకుని, ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునే సరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి, మాయమైపోయాయి.
రాజు ఆ గుడ్లను ఒక వెండిబుట్టలో ఉంచి, దాన్ని ఇనపపెట్టెలో భద్రం చేయించాడు. అయిదేళ్ళు గడిచాయి. శ్వేతా, కృష్ణా పెరిగి, పదిహేనేళ్ళవాళ్ళు అయ్యారు. రాజు ఇనపపెట్టె తెరవగానే దానినుంచి కాంతికిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు ధగధగా మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉన్నది. రెండోది గులాబి రంగుగా ఉన్నది. వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు.

రాజు వారితో, ‘‘అమ్మళ్ళూ, ఈ వజ్రాలు మీకే! ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంకాలం మీ కిద్దరికీ తెల్ల సంపంగిపూలు కూజాల్లో పెట్టి ఇస్తాను. మీరు రోజూ ఆ పూలను గమనిస్తున్నట్టయితే, ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది,'' అన్నాడు. ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, ‘‘వజ్రాలు వచ్చాయి. ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది,'' అన్నాడు. ‘‘అదంతా మీరే సులభంగా చెయ్యవచ్చు గదా, మహారాజా! శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగిపూల పాత్రలో కొంచెం ఎరస్రిరా కలిపి, పూలకాడలు అందులో ముణిగేటట్టు అమర్చటమే గదా! క్రమంగా పూల రెక్కలు వాటంతట అవే గులాబిరంగుకు మారతాయి. ఇదంతా రెండు రోజులకు ముందే మీకు వివరంగా చెప్పేశానుగా?'' అన్నాడు మాయాపాలుడు.

‘‘చెప్పావనుకో, అయినా అది నీ చేతి మీదుగా జరిగితేనే బాగుంటుంది గదా!'' అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి శ్వేతకూ, కృష్ణకూ రెండు గుత్తుల తెల్ల సంపంగిపూలు పాత్రలతో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లూ స్పష్టంగా రాసి ఉన్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమతమ గదులలో ఉంచుకుని, పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండి పోయాయిగాని, శ్వేత కిచ్చిన పూలు మర్నాటికే రంగు మారనారంభించాయి.

ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, ‘‘అమ్మాయిలూ, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది గద?'' అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలు చూపాడు. శ్వేత, గులాబీ వజ్రాన్ని తీసుకున్నది. కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది. మాయాపాలుడి మాటా? ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది.

గురువుగారు చేసిన ఉపదేశమేమిటి?

విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో, భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరిజనం అందరూ వారం రోజులుగా శాస్ర్తిగారి గీతోపన్యాసాలు విని పరవశించి పోతున్నారు. ఆ దినం ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్ర్తిగారు ఇలా చెప్పారు: ‘‘మహాజనులారా! ఈసారికి దైవం నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమంవుంది. మోక్షసాధనకై నిరంతరం ప్రయత్నిస్తూవున్నప్పుడే, మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.''

ఊరిజనం బరువెక్కిన హృదయాలతో, శాస్ర్తిగారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు. భగవద్గీత సప్తాహం శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే భూస్వామ్య మిత్రులు ఇంటికి తిరిగిరాగానే, వీర్రాజు పరవశంతో, ‘‘అమ్మమ్మా! ఆ శాస్ర్తిగారు ఎంతటి మహాపండితులో గదా! జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా!'' అన్నాడు పేర్రాజుతో. ‘‘అవునవును, ఆయన సరస్వతీ పుత్రులు!'' అన్నాడు పేర్రాజు. వీర్రాజు ఒక క్షణం ఆగి, ‘‘శాస్ర్తిగారి మాటలు విన్నప్పటి నుంచీ, నాలో ఒక ఆవేదన బయలుదేరిందయ్యా, పేర్రాజూ. సద్గురువును వెతికి పట్టుకుని, ఆయన పాదాల దగ్గర ఈ జీవితాన్ని సమర్పణ చేసుకుని తరించాలనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్ళపాటు నా వ్యవసాయాన్నీ, ఇంటి పనులనూ చూసి పెడతానంటే, నేను ఆ పనిమీద వెళతాను, ఏమంటావ్‌?'' అని అడిగాడు.

‘‘నీ వ్యవహారాలు చూసి పెట్టడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ, ఒక్క మాటగురువును వెతికి పట్టుకుని పరీక్షించి, మనకు తగినవాడో కాడో నిర్ణయించుకునే స్థితిలోనే కనుకమనంవుంటే, మనకు అసలు గురువుతో పనేముంటుంది? ఆలోచించుకో,'' అన్నాడు పేర్రాజు.

‘‘నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయూనికి వచ్చానయ్యా. శ్రీశైలం దగ్గర ఎవరో ఒక మహానుభావుడున్నాడట. గాలిలో అలా తేలుతున్నాడనీ, నీళ్ళపై నడుస్తాడనీ, నిప్పుల్లో నర్తిస్తున్నాడనీ చెప్పుకుంటున్నారు. పగలు పరమకరుణతో భక్తులను అనుగ్రహిస్తూ, రాత్రి సమయాల్లో మాయమై, హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారట. నేను వెళ్ళి ఆ సాధువు సంగతేమిటో తెలుసుకుని వస్తాను,'' అన్నాడు.

వీర్రాజులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న పేర్రాజు, ‘‘నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. శీఘ్రకాలంలో నీకు మంచి గురువు దొరికి ఆత్మ తృప్తితో తిరిగిరావాలని దైవాన్ని ప్రార్థిస్తూవుంటాను,'' అన్నాడు. వీర్రాజు ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్ళే సరికి, నిత్యానంద స్వామి ఆశ్రమం దగ్గర పెద్ద తీర్థంలావుంది. ఆ జనసందోహాన్ని చూసే సరికి వీర్రాజుకు మహానందం కలిగింది. శిష్యులు అతని సమాచారాన్ని వివరంగా తెలుసుకుని, స్వామీజీకి నివేదించారు. స్వామీజీ అనుగ్రహించాడు. శిష్యులతో వీర్రాజు, స్వామీజీ వుండే ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. స్వామీజీని చూస్తూవే వీర్రాజు, ‘‘ఆహా, ఏమి తేజస్సు! ఏమి వర్చస్సు!'' అనుకుంటూ, అమితమైన భక్తితో ఆయన పాదాల ముందు వాలిపోయూడు. ‘‘లే, వీర్రాజూ! నీకు కొన్ని భవబంధాలు వున్నాయి. అవన్నీ వదిలిపోవాలంటే కొంత కాలం సాధన చెయ్యక తప్పదు.

ఆ తర్వాత నువ్వు కోరుకున్న పరమార్థం లభిస్తుంది. హరిః ఓం తత్సత్‌!'' అని ఆశీర్వదించారు గురువుగారు. ‘‘ఆహా! నా గురించి సర్వజ్ఞులైన మీకు అంతా తెలిసిపోయింది. ఈ జన్మతో నాకు మోక్షాన్ని ప్రసాదించండి,'' అంటూ వేడుకున్నాడు వీర్రాజు. గురువు మందహాసం చేసి, ‘‘అంతా నీ చేతుల్లోనే వుంది, వీర్రాజూ. నీలో వైరాగ్యం పెరగాలి. ఇదుగో, ఈ ప్రసాదం భక్తితో కళ్ళకద్దుకుని ఆరగించు,'' అంటూ స్వామీజీ గాలిలోకి చేయిచాపి, ఒక సీతాఫలం అందుకుని, వీర్రాజు చేతుల్లో ఉంచాడు.వీర్రాజు ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. అనుగ్రహ ఫలం ఆరగిస్తుంటే అతడిలో ఎన్నెన్నో సంకల్పాలు.

ఈ విధంగా-వీర్రాజు ఇల్లొదిలి, నిత్యానంద స్వామి ఆశ్రమం చేరి ఆరు నెలలు దాటింది. ఏవిధమైన సమాచారం తెలియక ఊరిజనం, అతణ్ణి గురించి తలా ఒకరకంగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడని కొందరూ, సన్యాసుల్లో కలిసిపోయాడని మరికొందరూ చెప్పుకోసాగారు. వీర్రాజు భార్యా, కొడుకూ, కూతురూ, ఆ గాలికబుర్లు వింటూ, లబోదిబోమని గోలపెడుతూ ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నారు. పేర్రాజు ఆ కుటుంబానికి అండగా నిలబడి, వాళ్ళకు ధైర్యం చెబుతూ, ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

పులిమీద పుట్రలా ఒకరోజున వీర్రాజు నుండి రెండు ఉత్తరాలు వచ్చాయి. ఒకటి అతడి భార్యకు, మరొకటి పేర్రాజుకు: ‘నేను శ్రీ శ్రీ శ్రీ నిత్యానంద స్వామివారి ఆశ్రమంలో వుంటున్నాను. పరమ పూజ్య గురుదేవులు భవబంధాలను తెంచుకోమని ఉపదేశించారు. ఇక్కడే పరమ ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. నా భార్యా పిల్లలకు భుక్తికిలోటు లేకుండా ముగ్గురికీ మూడెకరాలూ, ఇల్లూ వుంచి తక్కిన భూమి, తోట అమ్మేసి, ఆ సొమ్ముతో ఇక్కడ స్థిరపడి భక్తిసాధన చేసుకుంటాను. తగిన బేరం చూసి అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తే, నేను వచ్చి, భూమిని స్వాధీనం చేసి, తక్కిన వ్యవహారాలన్నీ చక్కబరిచి, తిరిగి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నాకు, నా గురువుగారే తప్ప ఎవరు ఏ విధంగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం వుండదని గ్రహించగలరు!' అని వీర్రాజు ఆ ఉత్తరాల్లో రాశాడు.

ఉత్తరం చూసిన వీర్రాజు భార్యాపిల్లలు గోలగోల చేస్తూ పేర్రాజు ఇంటికి వెళ్ళారు. పేర్రాజు వాళ్ళను ఓదార్చి; నేను చెప్పినట్టుగా చెయ్యండి. మీ సమస్య పరిష్కారమవుతుందని నచ్చ చెప్పాడు. తర్వాత పేర్రాజు రెండు ఉత్తరాలూ తీసుకుని, గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు పేర్రాజు ఇదివరకే, వీర్రాజు విషయమంతా చెప్పివుంచాడు. ఇప్పుడు ఈ రెండు ఉత్తరాలూ చూసి గ్రామాధికారి, పేర్రాజుతో కాస్సేపు చర్చించాడు.

నెల తిరక్కుండా వీర్రాజు ఉరుకులు పరుగుల మీద గ్రామానికి తిరిగి వచ్చాడు. తిన్నగా గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి, ‘‘అయ్యా! ఇంతటి అన్యాయం, మిత్రద్రోహం లోకంలో ఎక్కడా వుండదు. నమ్మి నా ఆస్తిపాస్తులను, భార్యాబిడ్డలను తనకు అప్పగించి వెళితే, ఈ మిత్రద్రోహి పేర్రాజు ఇంత పని చేస్తాడా? నా ఆస్తినంతా సొంతం చేసుకుని, నా భార్యాపిల్లల్ని దిక్కులేని వారిని చేసి, ఇంట్లోంచి గెంటేసి వీధిపాలు చేస్తాడా? వెంటనే వాడిని పిలిచి విచారణ చెయ్యండి. తగిన విధంగా వాణ్ణి శిక్షించి, నాకు న్యాయం జరిపించండి,'' అంటూ గొడవ చేశాడు.

గ్రామాధికారి చాలా ప్రశాంతంగా వీర్రాజు మొహంలోకి చూస్తూ, ‘‘ఇంతకూ నీకు జరిగిన అన్యాయమేమిటి? పేర్రాజు మీద నీ అభియోగాలేమిటి?'' అని అడిగాడు. ‘‘ఇంతకు ముందే పేర్రాజు చేసిన ద్రోహం గురించి విన్నవించుకున్నాను. నేను గురువును అన్వేషించడానికి బయలుదేరుతూ, నా ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొంత కాలం చూసి పెట్టమని అడిగాను. ఇప్పుడా ద్రోహి నా ఆస్తిపాస్తులన్నిటినీ తన సొంతం చేసుకున్నాడు. మరి ఇది అన్యాయం కాదా?'' అన్నాడు వీర్రాజు ఆవేశంగా.

‘‘అది సరే. ఇంతకూ మీ గురువుగారు, నీకు చేసిన ఉపదేశమేమిటి?'' అని అడిగాడు గ్రామాధికారి. ‘‘భవబంధాలన్నీ పూర్తిగా వదిలించుకువస్తే, తిరుగు లేని మోక్ష సాధన మార్గం ఉపదేశిస్తామన్నారు,'' అని చెప్పాడు వీర్రాజు. ‘‘అయితే, నీకున్న అసలు భవబంధాలేమిటి?'' అని ప్రశ్నించాడు గ్రామాధికారి నెమ్మదిగా. ‘‘భవబంధాలంటే-భార్యాపిల్లలూ, బంధుమిత్రులూ. ఆస్తులూ అప్పులూ, ఇలాంటివన్నీ,'' అన్నాడు నసుగుతూ వీర్రాజు.

‘‘నీలో వైరాగ్యం బలపడిందనీ, భవబంధాలను వదిలించుకుంటున్నాననీ, నీ ఉత్తరాల్లో రాశావుకదటయ్యా. ఇక నీకు, ‘నాది, నాకు' అంటూ ఏముంటుంది చెప్పు? కనుక నువ్వు నీ గురువుగారి దగ్గరకు తిరిగిపోయి, ఆయన చెప్పినట్లుగా భాగవతసేవ చేసుకుంటూ చక్కగా తరించు. మరింక వెళ్ళిరా!''

అన్నాడు గ్రామాధికారి. ‘‘పని పూర్తికాకుండా తిరిగి రావద్దని మా గురువుగారు మరీమరీ చెప్పారు.నా ఆస్తి నాకు దక్కకుండా, ఇక్కడ నుంచి కదలను,'' మొండిగా చెప్పాడు వీర్రాజు. ఆ మాటలకు గ్రామాధికారి పెద్దగా నవ్వి, ‘‘నువ్వనే ఆ ఆస్తిపాస్తులు తనవేనంటూ పేర్రాజు దగ్గర పక్కాగా పత్రాలున్నాయి. అతడికి ఇప్పుడే కబురు పెడతాను, సరా!'' అన్నాడు. ‘‘ఆ పత్రాలన్నీ అతడు సృష్టించివుంటాడు,'' అన్నాడు వీర్రాజు కోపంతో ఊగిపోతూ. ‘‘నువ్వు అన్నీ వద్దనుకుంటున్నావు. నీకెందుకీ గొడవలన్నీ?''

అన్నాడు గ్రామాధికారి గంభీరంగా. ‘‘వద్దను కోవటమేమిటి? కావాలనే కదా వచ్చాను,'' అన్నాడు వీర్రాజు. ‘‘ఏం కావాలని వచ్చావయ్యా, వీర్రాజూ? ఆస్తిపాస్తులూ, భార్యాబిడ్డలా? లేక నీ గురువూ, ఆయన చెప్పిన భాగవతసేవా? నీలో పిసరంత వైరాగ్యం కూడా కనిపించడంలేదు,'' అన్నాడు గ్రామాధికారి కాస్తకటువుగా. అది వింటూనే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. గ్రామాధికారి అడిగినదాంట్లో తిరకాసు అతడికి అర్థమైంది. ‘‘మహాప్రభూ! నేను చేసిన పొరబాటు, నాకిప్పుడు అర్థమయింది. నన్ను మన్నించండి. నాకళ్ళు తెరుచుకున్నాయి!'' అంటూ గ్రామాధికారి కాళ్ళమీద పడ్డాడు. గ్రామాధికారి ప్రేమగా వీర్రాజును లేవదీసి, ‘‘సంతోషం, వీర్రాజూ!

నీలో ఇలాంటి మార్పురావడం కోసమే నేనూ, పేర్రాజూ ఈ నాటకమాడాం. నీ ఆస్తికీ, నీ కుటుంబానికీ చిన్నమెత్తు నష్టం కూడా లేదు, చూడు!'' అంటూ అతణ్ణి లోపలి గదిలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ పేర్రాజూ, వీర్రాజు భార్యాపిల్లలూ ఆతృతగా అతడికోసం ఎదురు చూస్తూ నిలబడివున్నారు.

పేర్రాజు, వీర్రాజును కౌగలించుకుని, ‘‘నీకు అప్పుడే చెప్పబోయాను; కానీ వినేస్థితిలో లేవని వూరుకున్నాను. నీకు కావలసింది ఇచ్చేవాడు, నీకు గురువు అవుతాడుగానీ, నీ నుంచి ఆశించేవాడు బరువు అవుతాడు తప్ప, గురువు ఎలా అవుతాడు?'' అన్నాడు చిన్నగా నవ్వుతూ. వీర్రాజు సిగ్గుతో తలదించుకుని చేతులు జోడించాడు.

తిట్ల భూతం

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వుదేన్ని సాధించగోరి, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో, ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక వత్తిళ్ళుకు గురై విసిగి వేశారి, చివరకు తాముసాధించదలచినదేమిటో కూడా మరిచిపోతూండడం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి, ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక, ఇతరుల మేలుకోసం కోరింది. నువ్వు అలాంటి పొరబాటు చేయకుండా వుండేందుకు ఆమెకధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్ప సాగాడు.

వీరమ్మ పరమగయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్ళిచేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచానపడివుంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారూ, మనశ్శాంతి లేక మామగారూ ఎంతోకాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ, భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకూ, కూతురూ పుట్టారు. వీరమ్మ వాళ్ళనూ సాధిస్తూండేది. కూతురు పెద్దదై పెళ్ళి చేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. భీముడు, వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడిలా వుంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా ఒంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు, తల్లికి మాత్రం భయపడేవాడు.

 ఒకసారి భీముడు తల్లికోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టు చీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు. కొడుక్కురంగులు, చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా, తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీరకనబడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని, భీముడికి తెలుసు. అందుకని, ఏం చేయాలో తోచక, ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టుకింద దిగులుగా కూర్చున్నాడు.
 ఆ సమయంలో కొందరాడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజూ ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలుచేసి, బిందెలతో నీళ్ళు తీసుకుని వెళతారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి, చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి, "ఎవరయ్యా, సిగ్గులేదూ, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు!" అని చీవాట్లు పెట్టింది.  భీముడు దీనంగా ముఖంపెట్టి, తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పికున్నాడు. అది వన్న అరుణ హేళనగా నవ్వి, "హా, గొప్ప తెలివైనదే, మీ అమ్మ! చీరల ఎంపికకు తను రావాలి; ఎవరైన ఆడవాళ్ళను పంపాలి. మగవాణ్ణి - అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా! సరేలే, నీకు నేను సాయపడతానుకానీ, నువ్వు ఇక్కణ్ణుంచి లేచి, ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్యగారిల్లెక్కడా అని అడిగి తెలుసుకుని, ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక, మీ అమ్మ బాగుబాగు అని మెచ్చే చీర, నీ చేత కొనిపిస్తాను," అన్నది.

 భీముడు అక్కడినుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి, సాంబయ్య ఇల్లు తెలుసుకుని, ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి, వాణ్ణి పలకరించి, వీరమ్మ చూపులకెలా వుంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని, ఒక నేతగాడి ఇంటికివెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది

ఇలా పని ముగిశాక అరుణ, భీముడితో, "ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత, ఆమెతో - నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్ని విని, అచ్చం అలాంటి చీరే ఆరేళ్ళక్రితం ఈదేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులుగల మరొక స్త్రీ ఉన్నందుకు, అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా, అమ్మకు తృప్తి కలక్కపోతే - మహారాణి జాతకురాలికి, ఈ చీర నచ్చి తీరుతుందనీ, ఒక వేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయుండదనీ అన్నాడు నేతగాడని చెప్పు. నీకే ఇబ్బందీవుండదు," అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది.

భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి, అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి, భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. "వాడు, తండ్రితో జరిగిందంతా చెప్పి, "అరుణ ఈ ఇంటికోడలైతే, అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా వుంది," అన్నాడు. మర్నాడు వాడు పనిమీద పొరుగూరుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి, గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ, గబగబా వాడి దగ్గరకు వచ్చి, "మీ అమ్మ నిన్ను బాగా చీవాట్లు పెట్టిందా?" అంది, భీముడి మీద జాలిపడుతూ.

" లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను," అన్నాడు భీముడు.దానికి అరుణ ఆశ్చర్యపోయి, " ఏమిటా ముఖ్య విషయం?" అని అడిగింది. భీముడు కాస్త బెరుకు బెరుకుగా, "నిన్ను పెళ్ళాడాలని వుంది," అన్నాడు. "నువ్వు నన్నడుగుతావేమిటి? మీ పెద్దలతో, మా పెద్దలను అడగమని చెప్పు," అన్నది చిరాగ్గా అరుణ.

"పెద్దల సంగతి తర్వాత. నాకు నువ్వు నచ్చావు. నేను నీకు నచ్చానో లేదో తెలుసు కుందామనే, ఇప్పుడిలా వచ్చాను," అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడి ముఖంకేసి చూసి, "నువ్వు అందంగా వున్నావు. మంచి వాడివి. నచ్చావుకాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను," అంటూ సిగ్గుపడింది.అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, "నీ తెలివి తేటలతో, మా అమ్మను మార్చగలవా? బాగా ఆలోచించుకో!" అన్నాడు.ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వమహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశసంచారం చేస్తూ, గంగవరం వచ్చి, కాలువ ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడతపడడంతో ఆయన లేవలేక అవస్థపడుతూంటే, స్నానానికి వచ్చిన ఆడపిల్లలు, ఆయన్ను అపహాస్యం చేయడమే కాక, తొందరగా అక్కణ్ణించి వెల్ళిపొమ్మని కేకలు వేశారు.

అరుణ వాళ్ళను మందలించి, బిల్వమహర్షికి తగిన శుశ్రూషచేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడాయన అరుణతో, "అమ్మాయీ, నీ సేవలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను!" అన్నాడు. అయితే, ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వమహర్షి సరేనని, "కళ్ళు మూసుకుని మూడుమార్లు నాపేరు తలచు కుంటే ప్రత్యక్షమై, నీకోరిక తీరుస్తాను," అని వెల్ళిపోయాడు.

అరుణ ఇప్పుడు భీముడికి, బిల్వమహర్షి కధ చెప్పి, "మీ అమ్మను మార్చడం మామూలు మనుషులవల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. మనం బిల్వమహర్షి సాయం అర్ధిద్దాం!" అంటూ, ముమ్మూరు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వమహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకుని, భీముడితో, "పద నాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం," అన్నాడు.

మహర్షి భీముడితో వాళ్ళ ఊరుచేరి, భీముడి ఇంట్లో ప్రవేశించి, మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, "అమ్మా, నాకు భిక్ష కావాలి!" అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చుని, "బిచ్చం కోసం వచ్చావు. మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా?" అంటూ మహర్షిని తిట్టడం మొదలు పెట్టింది.

"అమ్మా! ఇష్టముంటే బిచ్చం వెయ్యి; లేకుంటే పొమ్మని చెప్పు. నీ తిట్లు భూతమై నిన్నే బధిస్తాయి, "అన్నాడు బిల్వ మహర్షి. "తిట్టడం నాకు అలవాటు. అమ్మనాన్నలను తిట్టాను. నాకేమి కాలేదు. అత్తమామలను తిట్టాను, వాళ్ళే పోయారు. మొగుణ్ణీ, కొడుకునూ తిడుతున్నాను. చచ్చినట్టు పడుతున్నారు. నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు!" అన్నది వీరమ్మ నిరసనగా.

"నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది. అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడా తిట్టు నీ దగ్గరే వుండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్ధంకావడం కోసం, ఈ క్షణంలోనే -- అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్టున్నాను," అన్నాడు బిల్వమహర్షి.

అంతే! ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకరాకారంలో ఒక భూతం నిలబడి, " అహొ, వీరమ్మా! నేను నీ తిట్లభూతాన్ని! ఇంకొక నాలుగేళ్ళ తర్వాత, నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను. కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే, భూత రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు. లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను," అన్నది.

వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కు తోచక, మహర్షి కాళ్ళమీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, "భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటుమామిడి చెట్టుంది కదా! దాన్ని నాశనం చెయ్యమని చెప్పు. భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచి పెడుతుంది," అన్నాడు. వీరమ్మ సరేననగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే, అక్కడ మామిడి చెట్టు లేదు.

అప్పుడు బిల్వమహర్షి ఎంతో శాంతంగా, "వీరమ్మా! నువ్వికనుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు. అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా వుంటే, నిన్నే భూతమూ బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి! నీ కొడుక్కు, గంగవరంలో వుండే అరుణ అనే అమ్మయితో పెళ్ళి చేయి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే, క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో. నీ కష్టసుఖాలిక నీలోనే వున్నాయి," అని చెప్పి, బిల్వ మహర్షి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

తర్వాత కొద్దిరోజుల్లోనే భీముడికీ, అరుణకూ పెళ్ళయింది. భేతాళుడు ఈ కధ చెప్పి, "రాజా, బిల్వమహర్షి ఇచ్చిన వరాన్ని, అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనబడదు. ఆ వర ప్రభావంతో ఆమె, ఏ గొప్ప ధనవంతుడి ఇంటికోడలో అయి సర్వసుఖాలూ అనుభవించవచ్చు. ఆమె వరాన్ని, తనకోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలుకోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పాక పోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు.

దానికి విక్రమార్కుడు, "ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెల్ళి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనేగదా కోరుకునేది! ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనబడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికొస్తే - సాధారణంగా మగవాళ్ళకు చిరాకెక్కువ. అలాంటప్పుడు, ఎన్నిమాటలన్నా నోరెత్తకుండా వుండే భీముడులాంటివాణ్ణి ఏ ఆడపిల్లయినా కోరుకుంటుంది. అట్లని, తిట్లభూతం శక్తి చూసిన అరుణ, భీముడిపట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏ మాత్రం లేదు. ఈ కారణాలవల్ల అరుణ, మహర్షి ఇచ్చిన వరాన్ని తనకూ, తన వాళ్ళకూ శుభంకలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల, అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు," అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

పరమానందయ్య శిష్యుల కథలు

పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది.  దానికి కొంత డబ్బు అవసరమయింది.  అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు  విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని  బయలుదేరారు. నాలుగయిదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమయిపోయింది.

దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది.  అది చూసిన శిష్యుడికి బాగా కోపమొచ్చింది.  “మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్భుద్దేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు, అనుకుని “గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకొండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం” అంటూ గురువుగారికి విశ్రాంతి నిచ్చారు.

శిష్యులంతా బాగా అలోచించి.. ఏరుకి ‘చురుకెయ్యడానికి ‘ నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు.  ఆ కాగడాను శబ్ధం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు.  ఆ  కాగడాని ఏరులో ముంచాడు.  వెంటనే అది చుయ్మని శబ్ధం చేసింది. దానికి, ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకొంటూ వచ్చి పడ్డాడు. ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు.  ఆయనకు గాఢనిద్ర పట్టేసింది.  అది చూసిన మిగతా శిష్యులు , “ఏమయిందిరా?” అని అడిగారు. “ఏరు పడుకోలేదురా.. మెలకువగానే ఉంది.  నేను వాతపెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెర్టాలతో నన్ను కాటేసింది” అంటూ వణికిపోతూ … భోరుమని ఏడిచేశాడు.

అదే సమయంలో అటునునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు.  ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ! ఏరు నిద్దరోతుందేమో.. అందుకే వాడినేమి అనలేదు అనుకుని.. “ఇది మంచి సమయం. ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా.. మనం కూడా దాటేద్దాం” అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని.. ఆంజనేయ  దండకం చదువుతూ  ఏటి ఒడ్డుకు బయలుదేరాడు.  ఏరులోకి వెల్ళి మెల్లగా శబ్ధం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు.  కాగడాకి నిప్పులేదు కనుక నీళ్ళు ఏ శబ్ధం చేయలేదు.

ఏటినుండి ఏ శబ్ధం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి – “ఏరు నిద్దరోతోంది. ఇదే మంచి సమయం. అందరూ తయ్యారవ్వండి” అని హడావిడి చేశాడు. శిష్యులు – గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామనుకున్నారు.  అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని, మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు.అయినా గురువుగారికి మెలకువ రాలేదు.  ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు.  అందరూ గోల ఏయకుండా నిశ్శబ్ధంగా వరుసలో నిలబడ్డారు.

“ఎందుకు?” అని అడిగాడు ఓ శిష్యుడు. “మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో” అని అన్నాడా శిష్యుడు. “ఐతే ఇప్పుడేం చెయ్యాలి? అనం పన్నెండు మందిమి. గురువుగారు కాక శిష్యులం పన్నెండుమందిమి.” ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.  అతన్ని వదిలి మిగిలిన పదకొండుమందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. “బాబోయ్ .. మనలో ఒకర్ని ఏరు మింగేసింది” అని గట్టిగా అరిచాడతను. “అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో” అన్నాడు ఓ శిష్యుడు. లేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా” చెప్పాడు శిష్యుడు. “అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట” అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, “మీరెవరు?  ఎందుకు బాధపడ్తున్నారు” అని ప్రశ్నిచాడు.

“మా గురువుగారు పరమానందయ్యగారు, మేము ఆయన పన్నెండుమంది శిష్యులం.  మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది.” అని చెప్పారు శిష్యులు. “బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది.  అందుకే వారిని ఆటపటించాలనుకున్నాడు “నేనెవరిని” అని అడిగాడు బాటసరి శిష్యులని. “తెలియదు” అన్నారు శిష్యులు “ఇంతకీ మీరెవరు?” అన్నాడు ఓ శిష్యుడు. “నేనెవరో ఓరికే చెప్పేస్తానా? మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను” అన్నాడు బాటసారి చాలా తెలివిగా.
మనం అన్ని విషయాలు తెలుసుకొవాలని గురువుగారు చెప్పారు కదా? అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి “చెప్పు నువ్వెవరు?” అని అడిగారు.“నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని. భూత పిశాచాలను పారద్రోలుతాను”.  అన్నాడు“నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా?” అన్నాడు ఓ శిష్యుడు. “తీసుకువస్తాను కాని కొంచం ఖర్చవుతుంది” అన్నాడు బాటసారి.
“మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట” అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు.  అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో అంకే లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా పన్నెండుమంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాటసారి, “చూశావా మీ వాడిని తెప్పించేశాను” అన్నాడు .

శిష్యుల ఆనందానికి, ఆశ్చర్యానికి  అవధులు లేవు. “మీరు సామాన్యమానవులు కారు. ఏరు మింగేస్న మావడిని తెప్పించగలిగారు.   మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని?.. అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకొంటాం అంటు మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడనుండి వెళ్ళిపోయాను బాటసారి. అప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు.  వాళ్ళ తెలివితక్కువతనానికి నెత్తినోరు బాదుకొన్నారు గురువుగారు

చీమలు దూరని చిట్టడవి

చీమలు దూరని చిట్టడవి లో ఓ సింహం ఉంటూ ఉండేది.  సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు.  మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది.  అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది.  సింహం ఆడిందే ఆట, పాడిందే పాట.  ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది.  ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి.  మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది.  కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి.  వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.

సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు.  కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద – మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది.  అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి.  సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి.  సింహం ఎద్దు వేపు చూసి ‘ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ’ అని అంది.  ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది.  ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది.  ఎద్దు చచ్చిపోయింది.  నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.

సింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది.  నక్క తెలివిగలది.  చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది.  ‘సరే! నేనే పంచుతాను’ అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :

‘నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!’  అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి,  ‘దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!’ అని అంది.  కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది?  ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి.  ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.

సింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది.  కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు.  ‘బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా’ ననేది.  గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.

ఓ రోజున గాడిద వచ్చింది. ‘నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?’ అని గ్రుడ్లురిమి చూసింది సింహం.  ‘ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా!  చింత చచ్చినా పులుపు చావలేదే!’ అంది గాడిద.  సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది.  గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది.  సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది.  దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.

‘ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది.  అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?’ అని ఏడ్చింది సింహం.  కాని ఎవరికి జాలి?

వడ్డికాసుల చెట్టు!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ప్రతి ఒక్కసారీ కార్యభంగం కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగిందే.

కానీ, లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ, నిగూఢంగానూ వుంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి, ఆత్మబంధువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్యా పరస్పర అనుమానాలూ, ద్వేష భావాలూ కల్పిస్తూంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి వుంటారన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా వుండేందుకు, జడనాధుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు: భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచి వారు; దానశీలురు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చినవారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి.

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు! ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యే సరికి, వారికి తాతలనాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు. నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నదీ గుణదీపుడికి తెలియదు. వాడు అదే ఊళ్ళోని జడనాధుడనేవాడితో కలిసి దూరప్రాంతాలకు వెళ్ళి, వైద్యవిద్యనభ్యసించాడు. కొడుకు గుణదీపుడికేకాక జడనాధుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతూండేవాడు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భద్రపురం వచ్చేసరికి, గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసివచ్చాయి.

‘‘పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేసి, నాచేతికి చిప్పనిచ్చావు. ఇప్పుడేం చేయాలో నాకు పాలుపోవడం లేదు,’’ అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో. ‘‘నాయనా! సంపదలు మనవెంట రావు. మన మంచి మనలను సర్వదా కాపాడుతుంది.  నీ తండ్రి చేసిన పనులన్నింటి వెనకా, నా ప్రోత్సాహం కూడా వుంది. అది తప్పని నీవనుకుంటే, ఆ తప్పు మా ఇద్దరిదీ. ఇప్పటికీ మనకు వచ్చిన లోటులేదు. నిలువ నీడ వుంది. నువ్వు వైద్యవృత్తి ప్రారంభించావంటే, నీకు బోలెడు ఆదాయం వస్తుంది,’’ అంటూ కొడుకును సముదాయించింది వేదవతి.

గుణదీపుడు వైద్యవృత్తిని స్వీకరించాడు. అంతో ఇంతో ఆదాయం బాగా వస్తున్నా, అతడికి తృప్తిగా వుండేది కాదు. అందుకు కారణం జడనాధుడు. సంవత్సరం తిరక్కుండానే జడనాధుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది. వైద్యం కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే రోగులతో, అతడి ఇల్లు కిటకిటలాడిపోతూండేది. క్రమంగా అతడివద్ద సంపద పెరగసాగింది.  ‘‘నీ డబ్బుతోనే వైద్యవిద్య నేర్చుకుని, నీ కొడుక్కే పోటీగా తయారయ్యాడీ జడనాధుడు! నీ మూలంగా నా ఆస్తీ పోయింది. నేర్చిన వైద్యవిద్యా అక్కరకు రావడం లేదు,’’ అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు.

‘‘నాయనా! ఇప్పుడు నీ ఆదాయం తక్కువేంకాదు. వైద్యవృత్తిలో సేవాధర్మమే ప్రధానం. నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు. అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు. నీకు జీవితంలో ఏ లోటూ వుండదు,’’అని మణిదీపుడు, కొడుక్కు హితవు చెప్పాడు కానీ, గుణదీపుడి దృష్టంతా సంపాదన మీదనే వుండేది. అదేమో పెరక్కుండా వుంది! ఈ విషయం ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి  తెలిసింది. ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు. తనకు మగబిడ్డలు లేనందున, ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని  చూస్తున్నాడు. అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకుని, ‘‘బాబూ!

నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. నీ పూర్వీకులు ఎన్ని దానధర్మాలు చేసినా, మీ కుటుంబం సిరిసంపదలతో వర్థిల్లుతూండేది, అది వారి జాతకబలం. నీ తల్లిదండ్రులు నష్టజాతకులు! వారితో కలిసివుంటే నీకు ఏమీ  అచ్చిరాదు. నా కూతుర్ని పెళ్ళిచేసుకో. నా ఇంటికి ఇల్లరికం వచ్చేయి. నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు,’’అంటూ తనకు అనుకూలంగానూ, అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు. ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి. అటుపైన రత్నమాల అందం కూడా అతణ్ణి ఆకర్షించింది. తానామెను పెళ్ళాడాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు వాళ్ళు, ‘‘నాయనా! నీవు పెద్దవాడివయ్యావు. నీ మంచిచెడ్డలు నీకే బాగా తెలుసు. మేము నిన్ను దీవిస్తున్నాం!’’ అన్నారు.

దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి, ‘‘మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు. కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద వుంది. నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే, లోకులు నన్ను దుమ్మెత్తిపొయ్యరా?’’అని అడిగాడు. మణిదీపుడు నవ్వి, ‘‘లోకాపవాదుకు భయపడి, నీవు మమ్మల్ని చేరదీయవద్దు. మా గురించి నీకు ఏ బెంగా వద్దు. నారు పోసినవాడే నీరూ పోస్తాడు,’’ అన్నాడు  గుణదీపుడు, రత్నమాలను పెళ్ళిచేసుకుని, అత్తవారింటికి  వెళ్ళిపోయాడు. ఈ లోగా జడనాధుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది. అతడు వారిని చూడబోతే వాళ్ళు, ‘‘మేము సుఖంగా వున్నాం. మా అబ్బాయి ఎంత బ్రతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు. మా కట్టెలు, ఈ ఇంటనే వెళ్ళిపోవాలని మా కోరిక!’’ అంటూ, పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు.

జడనాధుడు కొద్దిక్షణాలు మౌనంగా వూరుకుని, ‘‘నేనిక్కడికి స్వార్థంతో వచ్చాను. మీ పెరట్లో ఒక చెట్టు వుంది. దాని పేరు ఎవరికీ తెలియదు. అయితే, ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని, నాకు తెలిసింది. అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే వుంటుంది గదా. ఒక్కోకాయ పది బంగారు కాసుల విలువచేస్తుంది. ఐతే, అంత ధర నేనివ్వలేను.  మీరు  రోజూ నాకు ఒక కాయ ఇస్తే, నేను మీకు ఒక్క బంగారు కాసు ఇవ్వగలను. మీరు జీవించి ఉన్నంతకాలం,  ఆ చెట్టు కాయలు మరెవరికీ అమ్మబోమనీ, ప్రతిరోజూ నాకొకకాయ తప్పక అమ్మగలమనీ పత్రం రాసి ఇస్తే, నాకెంతో మేలుచేసినవారౌతారు,’’ అని చెప్పాడు.

మణిదీపుడు ఆలోచనలో పడి, ‘‘నీవు చెప్పేవరకూ నాకు మా చెట్టుకాయల విలువ  తెలియదు. వాటిని నీవడిగిన ధరకు తప్పక ఇవ్వగలను. కానీ నేను నీకు పత్రమెందుకు రాయాలో తెలియడంలేదు,’’ అన్నాడు. ‘‘అయ్యా! ఈ కాయల విలువ బయటి వాళ్ళకు తెలిస్తే ప్రమాదం. వాటిని అమ్మమని చాలామంది అడుగుతారు.  ఆ కాయలను  ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది; మరొకరకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు.  ఇవి నావంటివాడి చేతిలో వుంటేనే దురుపయోగం కాకుండా వుంటాయి. మీరు పత్రం రాయడం వల్ల, మీపై వేరెవరూ ఒత్తిడిచేసే అవకాశం లేదు,’’ అని జడనాధుడు వివరించి చెప్పాడు. మణిదీపుడు, జడనాధుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచీ మణిదీపుడి దశ తిరిగింది. ఆయన తను సుఖంగా తింటూ, అవసరంలో వున్నవారిని ఆదుకుంటూ, ఎప్పటిలా పరోపకారం కొనసాగిస్తున్నాడు.

తండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడినట్టు గ్రహించిన గుణదీపుడు, కారణం అర్థంకాక సతమతమయ్యాడు. అతడి భార్య రత్నమాల, అతడితో, ‘‘నీ తండ్రి నిన్ను మోసం చేశాడు. ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా వుండి వుంటుంది. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అందులో వాటా అడుగు,’’ అంటూ రెచ్చగొట్టింది

గుణదీపుడు, తండ్రిని కలుసుకుని, ఆస్తివిషయమై నిలదీశాడు. మణిదీపుడికి  పెరటిచెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు. ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి, అవి వేల సంఖ్యలో వుండడంతో గుండెలు బాదుకుని, ‘‘ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచడమేకాక, నాతో సంప్రదించకుండా కాయల గురించి పత్రం కూడా రాశావు.  ఇది చాలా అన్యాయం.  నా వాటాకోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను,’’ అంటూ గొడవ చేశాడు. ఈ సంగతి గ్రామాధికారిదాకా వెళ్ళడం ఇష్టంలేక, మణిదీపుడు, జడనాధుడికి కబురుపెట్టాడు. అతడు వచ్చి సంగతి తెలు సుకుని, ‘‘గుణదీపుడి మాటల్లో న్యాయముంది. నేనొక ఉపాయం చెబుతాను. ఈ చెట్టు కాయల్లో నాలుగువేల కాయలను తీసుకుని వెళతాను.

అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున, పదకొండు సంవత్సరాలు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి, మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది. అందువల్ల నేను, మీరు  జీవించి వున్నంతకాలం రోజుకొక్క బంగారు కాసు ఇచ్చుకుంటాను. ఈ రోజు నుంచీ, ఈ చెట్టుపైనా, దాని కాయలపైనా సర్వాధికారాలు గుణధీపుడికే విడిచిపెడదాం,’’ అన్నాడు మణిదీపుడితో.  ఇది గుణదీపుడికీ నచ్చింది. ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే, ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే  ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు. చివరకు గుణదీపుడు, జడనాధుడి వద్దకే వెళ్ళి, ‘‘నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో,’’ అన్నాడు. జడనాధుడు నవ్వి, ‘‘ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను?’’ అన్నాడు.

‘‘అవి పిచ్చికాయలా?  వాటికేగా నువ్వు కాయకు బంగారుకాసు చొప్పున వెల గట్టావు!’’ అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా. ‘‘నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే, ఆ కాయలు నాకు విలువైనవి. మీ పెరటిచెట్టు వడ్డికాసుల చెట్టు! నీతండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయలనది కాస్తుంది!’’ అన్నాడు జడనాధుడు. ఆ జవాబుకు గుణదీపుడి ముఖం వెల వెలపోయింది. అతడు తలవంచుకుని కొంతసేపు మౌనంగా వూరుకుని, ‘‘జడనాధా! నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు. ఏమైనా నాకళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు!’’ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! వైద్య విద్య పూర్తిచేసి తిరిగివచ్చినప్పటి నుంచీ, మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాధుడి ప్రవర్తన  విచిత్రంగానూ, నిగూఢంగానూ వున్నట్టు తెలుస్తూనే వున్నది కదా?  తన సహాధ్యాయి అయిన గుణదీపుడు, తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాదరణ, జడనాధుడికి తెలియంది కాదు. ఐనా, అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు. వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన వున్నది గనక, మణిదీపుడి పెరటిచెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్టు కనబడుతున్నది. అది తను వైద్యవిద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాదా, కృతఘ్నతా అనిపించుకుంటుంది గదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,’’ అన్నాడు.

దానికి విక్రమార్కుడు, ‘‘జడనాధుడి ప్రవర్తనలో విచిత్రం, నిగూఢత కాక; ఆర్థికంగా, మానసికంగా స్థాయీభేదాల్లో వుండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులు కోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది. ఎంత నిరాదరణకు గురైనా నిర్మల మనస్కు లైన తల్లిదండ్రులు,  తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు. ఆ కారణం వల్లనే మణిదీపుడు, జడనాధుడితో - మా అబ్బాయి  ఎంత బతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు, అన్నాడు.

అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక, తనకు మేలు చేసినవారి పట్ల కృతజ్ఞత కనబరచడానికి, జడనాధుడు పెరటిచెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి,  మణిదీపుడికి సాయపడ్డాడు. ఆ తర్వాత, గుణదీపుడు చెట్టుకాయలకు తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాధుడు - నీతండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు. ఆ జవాబుతో, జరిగిన వాస్తవం, తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ, ఏమిటో గ్రహించిన గుణదీపుడు, నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళి పోయాడు,’’ అన్నాడు.  రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు