Pages

Sunday, May 25, 2014

పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.


చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.


బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. "బానా బానా దొర్లు,దొర్లు" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి "సరే" అని వదిలి పెట్టింది.


పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.

మంచి మిత్రుడు (పావురం - ఎలుక)

పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది.


'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.


ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు' అంటూ హెచ్చరించాడు.


ఆ గుంపులో ఉన్నా ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి 'చిత్రగ్రీవా! నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశములో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించతగ్గ విషయం ఏ మాత్రం కాదు. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవితినటానికి మనం క్రిందకు దిగుదాం!' అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది.


ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్ని నూకలను తినటానికి నేలమీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.


చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలిపావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ 'మిత్రులారా! వివేకవంతుడు కూడా ఒక్కొక్క సారి ఆవేశంవల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిదికాదు' అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్ని శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి 'ఆహ! పొద్దున్నే ఎవరి మొహం చూసానోగానీ... ఈ రోజు నా పంట పండింది' అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు.


వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి 'మిత్రులారా! వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు' అని మిగిలిన పావురములతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి.


వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడకి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్ని ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్య బారి పోయాడి. వెంటనే తెలివితెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్ని ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివశిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్ధమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టుతొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు 'మిత్రమా! నేను చిత్రగ్రీవుడిని' అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్ని కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధ పడ్డాడు.


చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి 'మిత్రమా! స్నేహితుడు ఆపదలో ఉన్నపుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని రక్షించు' అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ 'మిత్రమా! నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను' అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి... ' అలాగే కానివ్వు మిత్రమా! కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు' అన్నాడు.


'చిత్రగ్రీవా! తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము' అన్నాడు హిరణ్యకుడు. 'హిరణ్యకా... మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం. అదే న్యాయం, అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. 'చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను.


చూసారా! ప్రతివారికీ అపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి. 'మిత్రలాభము కంటే మించిన లాభము లేదు' అన్నది ఈ కధలోని నీతి. నాలుగు రూపాయలను వెనకేసుకోవటం కంటే నలుగురు మిత్రులను సంపాయించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పటం కూడా ఈ కధలోని ఉద్దేశం.

తెలివైన ఎలుగుబంట్లు

ఒక వేటగాడు వేటకోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలా దూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు, దానిమీద కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ఒకేసారి ప్రయాణించలేరు.


వంతెనకు ఒకపక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు అటుగా వచ్చే ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.


కాస్సేపు గడిచాక నేరేడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతడికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని ఊహించాడు.


వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కింద కూర్చుని చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి. వేటగాడు ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని గ్రహించాడు.

చెరపకురా... చెడేవు!

ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు.


సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరలకు పంచి పస్తులుండేవాడు.


ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు, ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు. ఆమె ఒక దుర్మార్గపు పన్నగం పన్నింది.


వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, "అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాస్సేపు కూర్చుని వెళ్ళు" అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. 


ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటినుంచి జీవితాంతం మంచి తనంతో మెలిగింది.

దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు

శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటివారినయినా తన తెలివితో    ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నోపొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలనిపథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు.రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకిపోయాడు.

 అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు. 

నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.


రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.

లంచగొండికి శిక్ష తప్పదు

హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ.

 మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. రెండు వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది. ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజూ ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకుని కోశాధికారి రెండు వరహాలు ఇస్తున్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర రెండు వరహాలు తీసుకున్నాడు. తిన్నగా యింటిదారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు.

'నన్ను రోజూ రాజుగారి దగ్గర చూస్తున్నారు కదా! నేను రాజుగారి మంగలిని. రోజూ రాజుగారికి మర్దన చేస్తాను' అన్నాడు ఆ మనిషి. అవును. మిమ్ములను అక్కడ చూశాను. ఇంతకూ నాతో ఏమిటి పని? అన్నాడు పుండరీకుడు. నేను రోజూ రాజుగారికి మర్దన చేస్తాను. ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు. అంటే ఆ సంతోషం నావల్లనే కదా వస్తోంది! నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది.

 నేను కోశాధికారికి చెబితే నీకు రావలసిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలీ అంటే నువ్వు ఒక పనిచేయాలి. నాకు రోజూ నీకు వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి. రోజూ అర వరహా కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. వాడి పేరు చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత "నేను నీకు లంచం ఇవ్వను" అని తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య, శర్మను వదలలేదు. రోజూ దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య. 'రాజుగారు మీమీద కోపంగా ఉన్నారు' అన్నాడు చెన్నయ్య శర్మతో.

ఎందుకూ? అన్నాడు శర్మ. 'మీరు ముక్కు నుండి వదిలేగాలి వాసన వస్తోందట. ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకుని రమ్మని చెప్పారు' అన్నాడు చెన్నయ్య. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు వొత్తుతూ 'కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్నచూపు చూస్తూ ఉంటారు' అన్నాడు చెన్నయ్య. 'ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు?' అన్నారు మహారాజు. తమరి నుండి రోజూ రెండు వరహాలు తీసుకు వెళ్ళే బ్రాహ్మణుడు. అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతున్నాడు. ఏమిటి సంగతి? అని అడిగాను నేను. రాజుగారి నోటినుండి చెడువాసన వస్తోంది. అది తట్టుకోవాలీ అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు మహారాజా! అన్నాడు చెన్నయ్య వినయంగా! మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకూ, మూతికీ ఎర్రని గుడ్డ కట్టుకుని రాజుగారిని కలిశాడు. రాజుగారు సంగతి ఏమిటి? అని శర్మను అడిగారు.

 'నా ముక్కు నుండి చెడు వాసన వస్తోంది. దానివల్ల మీకు చిరాకు కలుగుతోంది. దానిని నివారించడానికే మహారాజా!' అన్నాడు శర్మ అమాయకంగా! రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ.

మరురోజు శర్మకు రెండు ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. 'ఈ రెండో ఉత్తరం చెన్నయ్యకి ఇవ్వండి. మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి' అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు. నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. "చెన్నయ్యా! నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధ పడుతున్నాను. ఈ రోజు నాకు డబ్బు అక్కరలేదు. ఈ ఉత్తరం తీసుకు వెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో" అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. "నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు. నీ నోటిని సూదీ దారంతో కుట్టమని మహారాజుగారి ఆజ్ఞ. నీ లంచగొండి తనానికి యిదే తగిన శిక్ష" అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు.

వింతపరిష్కారం - తెనాలి రామలింగడి కథలు

శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు.

ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.

మొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! " నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.

మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది.

ధర్మవ్యాధుని కథ

పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.


ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.

అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.

కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు.

 కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.

ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.

సాహసయువకులు

పజలు నిప్పు ఉపయోగం తెలుసుకోవడానికి పూర్వం జరిగిన కథ ఇది: ప్రజలకు నిప్పు గురించి తెలుసు కాని, ఆ కాలఘట్టంలోదాన్ని ఎలా త…యారు చేయాలో తెలియదు. ఫిజీ దీవులలోని రోటుమా పర్వతాలలోని ఒక గుహలో టుంబా అనే రాక్షసుడు ఉండేవాడు. భయంకరాకారుడైన టుంబా నోట్లో నిప్పు జ్వాలలు విరజిమ్మే కణకణలాడే కోరపళ్ళు ఉండేవి.
 
పెద్ద కొలిమినుంచి వెలువడే జ్వాలల్లా వాడు నోరు తెరిచినప్పుడల్లా అగ్నిజ్వాలలు వీచేవి. అదృష్ట వశాత్తు ఆ రాక్షసుడు ఎప్పుడూ తన గుహలో పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతూండేవాడు. అరుదుగానే వెలుపలికి వచ్చేవాడు. అతడు కొండపైనుంచి పెద్ద పెద్ద అంగలతో నడిచేప్పుడు వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వెలువడే అగ్నిజ్వాలలకు దాపులనున్న చెట్టు చేమలు భస్మమయ్యేవి.
 
కొండ పాదతలంలో, సముద్రం ఒడ్డున నివసిస్తూన్న గ్రామస్థులు, రాక్షసుణ్ణి చూసి గడగడలాడేవారు. వాడు గుహను వదిలిరాకుండా నిద్ర పోతూనే ఉండాలని దేవుణ్ణి ప్రార్థించేవారు.
 
ఆ గ్రామంలో లెకబారు, డకువాకా, మసిలాకా, టువేసీ అనే నలుగురు చురుకైన కుర్రాళ్ళు ఉండేవారు. జ్వాలలు చిమ్మే రాక్షసుణ్ణి చూసినప్పుడల్లా, వాడి నోటినుంచి అగ్నిజ్వాలను లాక్కుంటే ఎంత బావుణ్ణు అని ఆలోచించేవారు.
 
‘‘మనవద్దే గనక నిప్పు ఉంటే మన జీవితం ఎంత హాయిగా ఉండేది!'' అన్నాడు టువేసీ. ‘‘మనస్ర్తీలు రుచికరమైన వంటలు చేయగలరు!'' అన్నాడు డకువాకా. ‘‘చీకటి రాత్రులలో సైతం మనకు వెలుగూ, వెచ్చదనం లభించేది,'' అన్నాడు మసిలాకా.
 
‘‘మరి ఆలస్యం దేనికి? రండి ఇప్పుడేవెళ్ళి రాక్షసుడి నుంచి కాస్త నిప్పును దొంగిలించుకుని వచ్చేద్దాం!'' అన్నాడు లెకబారు.
 
ధైర్యవంతులైన ఈ నలుగురు యువకులూ, కొన్ని ఎండిన కొబ్బరి ఆకులను తీసుకుని రాక్షసుడున్న గుహకేసి బయలుదేరారు. వాళ్ళు రాక్షసుడున్న గుహను సమీపించారు

రాక్షసుడు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాడి ఒక్కొక్క శ్వాసతో పాటు, కణకణలాడే దంతాలుగల నోటి నుంచి అగ్నిజ్వాల వెలుపలికి వస్తూ, లోపలికి పోతూ వింతగా కనిపిస్తున్నాయి.
 
ఆ అగ్నిజ్వాలల వెలుతురులోనే యువకులు, ఏమాత్రం చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ గుహలోపలికి వెళ్ళారు. రాక్షసుడికి నిద్రాభంగం కలగకుండా తమ వెంట తెచ్చుకున్న ఎండు కొబ్బరాకులను వాడి నోటి దగ్గర పెట్టారు. వాటికి నిప్పంటుకున్నది. యువకులు అమితోత్సాహంతో వెనుదిరగ బోయారు. అప్పుడు టువేసీ అనే…యువకుడు మితిమించిన ఉత్సాహంతో, గెంతడంతో అతని చేతిలోని మండుతూన్న కొబ్బరాకు టుంబా పెదవులకు తగిలింది. దాంతో వాడు కళ్ళుతెరిచి చూశాడు. నలుగురు …యువకులూ మండుతూన్న కొబ్బరాకులతో, గుహ నుంచి వెలుపలికి పరిగెత్తుతున్నారు.
 
‘‘నా నిప్పును దొంగిలించే సాహసం చేసిందెవరు?'' అని గర్జిస్తూ లేచి కూర్చున్న రాక్షసుడు, ‘‘ఈ దీవిలో నాదగ్గర మాత్రమే నిప్పు ఉండాలి,'' అంటూ నిప్పులు కక్కుతూ కురవ్రాళ్ళ వెంటబడ్డాడు. కురవ్రాళ్ళు వాడి చేతికి అందకుండా అటుతిరిగి, ఇటుతిరిగి గ్రామసమీపంలో వున్న ఒక కొండగుహలోకి జొరబడి, గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండను పెట్టారు. ‘‘ఆహా! టుంబా నుంచి ఇక మనం తప్పించుకున్నట్లే. వాడికి బరువులెత్తడం అసలు చేతకాదు. ఈ బండను అంగుళం కూడా కదిలించలేడు,'' అన్నాడు డకువాకా.
 
‘‘అలా అని మనం ఎప్పటికీ గుహలోపలే ఉండిపోలేం కదా?'' అని హెచ్చరించిన వాళ్ళందరిలోకీ తెలివైన లెకబారు, ‘‘టుంబా పీడవదిలించుకుని మన మందరం క్షేమంగా ఇళ్ళకు చేరే మార్గం ఆలోచించాలి,'' అన్నాడు. అంతలో గుహ ద్వారం చేరిన టుంబా అటూ, ఇటూ తిరుగుతూ, వాళ్ళను వెలుపలికి రమ్మని కేకలు పెట్టసాగాడు.
 
అయినా, వాళ్ళు ఉలుకూ పలుకూ లేకుండా అలాగే ఉండిపోయారు. రాక్షసుడికి ఆగ్రహంతో పిచ్చిపట్టినట్టయింది. వాడి ముకుపుటాల నుంచీ, చెవుల నుంచీ మంటలూ, పొగలూ రాసాగాయి. వాడి నుంచి అంటుకున్న మంటల కారణంగా చుట్టు పక్కల అడవిలో కారుచిచ్చు వ్యాపించింది.
ఆ వేడి తగలడంతో వాడికి ఓర్పునశించింది. గుహలోపలి యువకులకు కూడా బ…యటి వేడిని భరించడం కష్టమయింది. ఎలాగైనా గుహలోపలి నుంచి బ…యటపడితేనే ప్రాణాలతో తప్పించుకోగలమని భావించారు. టుంబా సైతం అక్కడ నిలబడలేక పోయాడు. గుహకు అడ్డుగా ఉన్న బండ దగ్గర నిలబడి, ‘‘ఒరే, నాయనలారా, చుట్టూ మంటలు. మీరు నన్ను లోపలికి అనుమతిస్తే మీకు నేనొక చక్కని పాట పాడివినిపిస్తాను,'' అన్నాడు మంచిగా.
 
యువకులు టుంబాను ఆటపట్టించాలనుకుని, బండను కొద్దిగా పక్కకు తోశారు. దాన్నిచూసిన టుంబా, ‘‘ఇంత చిన్న సందులో నేనెలా దూరగలను? బండను ఇంకొంచెం పక్కకు జరపండి,'' అన్నాడు.
 
లోపల వున్న యువకులలో ఒకడైన లెకబారుకి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. దానిని తన మిత్రులకు మెల్లగా చెప్పాడు. నలుగురూ భుజంభుజం కలిపి బండను ఇంకొంచెం పక్కకు నెట్టారు. కొద్ది వెసులుబాటు రాగానే టుంబా అందులోకి తలదూర్చి లోపలికి చూశాడు. అంతే! లెకబారు, ‘‘ఇప్పుడే!'' అని హెచ్చరించాడు. నలుగురూ కలిసి బండను ఒక్కసారిగా ముందుకు తోశారు. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోగానే టుంబా తల నుగ్గు నుగ్గయింది. వాడి నోటి నుంచి దూరంగా పడ్డ నిప్పుపళ్ళు చల్లారి నల్లబడిపోయాయి.
 
బండను పక్కకు తోసి, …యువకులు గుహనుంచి వెలుపలికి వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పిలిచి, ‘‘మేమా రాక్షసుణ్ణి చంపేశాం. వాడి పళ్ళు ఇకపై మంటలు విరజిమ్మవు. అయినా, నిప్పును మాత్రం మేము తీసుకువచ్చాం. ఇక ముందు మనకు రాక్షసుడి బెడద ఉండదు. నిప్పు ఉంది గనక, మన బతుకులు సుఖంగా సాగుతాయి!'' అన్నారు. గ్రామస్థులు ఆ మాటలకు పరమానందం చెందారు. …యువకుల సాహసాన్ని మెచ్చుకున్నారు. నిప్పును తమలో తాము పంచుకుని దుంపలు, చేపలు హాయిగా వండుకోగలిగారు.

పండిత పుత్రుడు

రత్నపురి రాజ్య ఆస్థాన పండితుడు వరదాచారి. ఆయన ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో చిత్తు చేసేవాడు. ఎంత గొప్ప పండితుడినైనా తన అమోఘ పాండిత్యంతో అవలీలగా ఓడించేవాడు. దాంతో ఆయన కీర్తి నలుదిక్కులా మారుమోగిపోసాగింది.

వరదాచారి కుమారుడు సుబుద్ధి. అతడికి చదువు మీద ఆసక్తి లేదు. ‘చదువే బంగారు భవిష్యత్తుకు పునాది’ అని ఎవరైనా హితవు పలికితే అతడికి తగని చిరాకు. ‘కష్టపడి చదవవలసిన అవసరం నాకు లేదు. చదువు లేకున్నా నేను హాయిగా, దర్జాగా బతకగలను. మా నాన్న గొప్ప పండితుడు. మా ఇంటి నిండా బంగారు నాణాలు, రత్న మాణిక్యాలు ఉన్నాయి’ అని గొప్పగా చెప్పేవాడు. రోజూ ఆట పాటలతో సమయం వృథా చేసేవాడు. అది గమనించిన ఓ వ్యక్తి ‘‘పండిత పుత్రః పరమశుంఠః’’ అన్నాడు.

ఆ మాటలు విన్న సుబుద్ధి పండితుడి పుత్రుణ్ని పరమశుంఠ అని గౌరవంగా పిలుస్తారని భావించి, ఎంతో పొంగిపోయాడు. ఒకరోజు సుబుద్ధి రాజుగారి ఉద్యానవనంలో ఆడుకుంటున్నాడు. అంతలో అటుగా వెళుతున్న మంత్రి, ‘‘ఎవరు బాబూ నీవు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను పండిత వరదాచారి పుత్రుడిని. పరమశుంఠను’’ అని గర్వంగా చెప్పాడు సుబుద్ధి.

అంతలో ఏదో శబ్దం వినిపిస్తే ఇద్దరూ అటువైపు చూశారు. అక్కడ ఓ చెట్టుపై కొన్ని కోతులు ఉన్నాయి. అవి ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతున్నాయి. అంతలో ఓ కోతి పట్టు తప్పి కిందపడింది. వెంటనే మిగిలిన కోతులు దానిని వెలివేసి, అక్కడ నుంచి వెళ్లిపోయాయి.

సుబుద్ధి బాధపడుతూ, ‘‘ఆ కోతులు కింద పడిన కోతిపై ఎందుకు జాలి చూపలేదు?’’ అని అడిగాడు. అందుకు మంత్రి, ‘‘బాబూ! కోతి జాతిలో ఓ పద్ధతి ఉంది. కోతులు ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకేటప్పుడు కింద పడవు. ఏ కోతైనా పొరపాటున కింద పడితే, అది తమ కోతి జాతికే అవమానంగా కోతులు భావిస్తాయి. అందుకే ఆ కోతిపై జాలి చూపక దాన్ని వెలివేసి వెళ్లిపోతాయి.

ఎందుకో తెలుసా? కోతులు దేన్నైనా సహిస్తాయి కాని, చేతకానితనాన్ని మాత్రం సహించలేవు’’ అని చెప్పాడు. అది విన్న సుబుద్ధి, ‘‘అయితే పండితుల పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. కానీ చదువు రాని నేను వాళ్లందరి ముందూ చేతకానివాడిని అవుతాను కదా! మరి అందరూ నన్ను వెలివేస్తారా?’’ అని ఉద్వేగంగా అడిగాడు.

మంత్రి అతడి భుజంపై చెయ్యేసి, ‘‘అవును నాయనా. నీవు చదువుకోకుంటే అందరూ నిన్ను ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అంటారు. పరమ శుంఠ అంటే తెలివితక్కువవాడు అని అర్థం’’ అన్నారు.
సుబుద్ధి కాసేపు ఆలోచించుకుని, ‘‘నేను బాగా చదువుకుని గొప్ప పండితుడిని అవుతాను. తండ్రిని మించిన కొడుకు అన్న పేరు తెచ్చుకుంటాను’’ అన్నాడు. మంత్రి అతడిని మనసారా ఆశీర్వదించారు.

వేటగాడి దురాశ

ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. అది అక్కడే ఉన్న సరస్సులో నివసించే ఒక కప్పతో స్నేహం చేసింది. కొద్దిరోజుల్లోనే అవి రెండూ మంచి స్నేహితులై పోయాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. సరస్సు దగ్గరున్న నెమలిని చూసాడు. వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. అది చూసి కప్ప బాధతో విలవిల్లాడి పోయింది.

‘‘దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది.‘‘నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేం లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది’’ అన్నాడు వేటగాడు.కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ‘‘ఒకవేళ నీకు ధనం ఇస్తే నెమలిని వదిలిపెడతావా?’’ అని అడిగింది.‘‘తప్పకుండా!’’ అన్నాడు వేటగాడు.

కప్ప నీటిలోకి మునిగి, కాస్సేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ‘‘ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అని అంది.వేటగాడు ఆ ముత్యాన్ని చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య ‘‘వెర్రినాగన్న! ఇది ఎంతో విలువైన ముత్యం. ఒక్కటే తీసుకుని వచ్చావు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్ళి మొత్తం పట్రా!’’ అని చెప్పింది.

వేటగాడు తిరిగి అడవికి బయలుదేరుతుంటే అతని భార్య ‘‘ఈ ముత్యం తీసుకెళ్ళి ఆ కప్పకు చూపించి ఇలాంటివే ఇంకొన్ని తీసుకురమ్మని చెప్పు. లేదంటే ఇంకేదైనా పట్టుకుని వస్తుంది’’ అంది. వేటగాడు సరస్సు దగ్గరకు వెళ్ళి కప్పను కలుసుకున్నాడు. ‘‘మళ్ళీ వచ్చావేమిటి?’’ అని అడిగింది కప్ప.

‘‘నాకు ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను’’ అని బెదిరించాడు.‘‘సరే, నీ చేతిలోని ముత్యం ఇలా ఇవ్వు. అలాంటివే వెదికి తెస్తాను’’ అంది కప్ప. వేటగాడు ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా ఈది వెళ్ళి ‘‘అత్యాశతో చేతిలో ఉన్నది కాస్తా పొగొట్టుకున్నావు. నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళిపోయింది. నీకు దొరకదు. నేను కూడా దొరకను. వస్తా’’ అని చెప్పి బుడుంగున నీటిలోకి మునిగిపోయింది.

వింతగొర్రె

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.

వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.

ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.

ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి

రంగడికి బుద్ధొచ్చింది

రామాపురం అనే గ్రామంలో రంగడు అనే బాలుడు ఉండేవాడు. వాడికి సోమరితనం ఎక్కువ. ఒక్కపని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బడికి వెళ్ళమని పంపిస్తే మధ్యలో బడి ఎగ్గొట్టి ఊరవతలి మైదానానికి వెళ్ళి ఆడుకునేవాడు. తల్లితండ్రులు ఎంత చెప్పినా, కొట్టినా తన ప్రవర్తనను మార్చుకునేవాడు కాదు.

ఒకరోజు రంగడికి ఆడుకోవడానికి ఎవరూ కనిపించలేదు. సరిగా ఆ సమయంలో వాడికి ఒక చీమ కనబడింది. ఆ చీమ ఆహారం మోసుకుని హడావుడిగా వెడుతోంది. ‘‘చీమా, చీమా ఎక్కడికి ఆ పరుగు. కాసేపు ఆగు. ఆడుకుందాం’’ అని అడిగాడు.

‘‘నాకు అంత సమయం లేదు. వానాకాలం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆహారం సంపాదించకపోతే రేపు నేను చాలా కష్టపడతాను. నేను రాను’’ అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది చీమ.

ఏమీ తోచక అలా బయటకు వెళ్లిన రంగడికి, చెట్టు కొమ్మ మీద కూర్చుని అరటిపండు తింటున్న ఒక కోతి కనిపించింది. ‘‘కోతి బావా! కోతి బావా! కోతికొమ్మచ్చి ఆడుకుందామా?’’ అని అడిగాడు.

‘‘అమ్మో! నీతో నేను ఏ ఆటా ఆడలేను. మా యజమానితో నేను పట్నానికి వెళ్ళాలి. ఎన్నో తమషా ఆటలు ఆడి డబ్బు సంపాదించి పెట్టాలి. అతని కోసం ఎదురుచూస్తున్నాను. అదుగో మాటల్లోనే వచ్చేశాడు. ఇంకెప్పుడైనా ఆడుకుందాం. వస్తాను’’ అంటూ కోతి చెట్టు దిగి పరుగెత్తింది.

రంగడికి ఎంతో నిరాశ కలిగింది. సరిగ్గా అప్పుడే ఒక ఎద్దు పొలం వైపు వెళ్తూ కనిపించింది. ‘‘ఎద్దు మామా! ఎద్దుమామా! నాతో కాసేపు ఆడవా?’’ అని అడిగాడు.

‘‘ఇప్పుడు నేను పొలానికి వెళ్ళాలి. పంటలు పండించడానికి బోలెడంత పని చేయాలి. ఇప్పటికే నాకు ఆలస్యం అయ్యింది. రైతు అక్కడ నా కోసం ఎదురుచూస్తూంటాడు. నేను రాలేను!’’ అని చెప్పి ముందుకు కదిలింది ఎద్దు. అది విని రంగడు ఆలోచనలో పడ్డాడు. ‘అమ్మానాన్నలు పనుల్లోకి వెళ్ళారు. పిల్లలంతా చదువుకోవడానికి వెళ్ళారు. ఇళ్లలో ఉన్న ముసలివారు కూడా ధాన్యం బాగు చేయడం లేదా, చిన్న పిల్లల్ని చూస్తూ ఇంటికి కాపలా ఉన్నారు. ఇలా ప్రతివారూ ఏదో ఒక పని చేస్తున్నారు. తనొక్కడేనా ఏ పనీపాటా లేకుండా ఉన్నది?’ ఈ ఆలోచన కలుగగానే రంగడికి తను చేస్తున్న తప్పేమిటో అర్థం అయింది. ఇక ఆరోజు నుండి తన ప్రవర్తన మార్చుకుని బుద్ధిగా బడికి వెళ్ళసాగాడు.

కప్ప- రాకుమారుడు

ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది. 

"అయ్యో నా అందమైన బంతి", అంటూ ఏడ్చిందా యువరాణి. "ఏమయింది యువరాణి?" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది. "నా బంతి బావిలో పడిపోయింది" ఏడుస్తూ చెప్పింది యువరాణి.

"ఏడవకు", అంది కప్ప. "నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?" అని అడిగింది. "నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?" అని అడిగింది యువరాణి."అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను". అంది కప్ప. "సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.

అంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. "ఆగు, ఆగు", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది.

"ఏమయింది, తల్లీ?" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి."ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు" అన్నాడు రాజు.యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. "నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది.

"నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు.

నిజమైన మేధావి

రాజు తెలివైన కుర్రాడు.ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో  గొంతు   వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.


చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.


తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది.


దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు.

మేకపోతు గాంభీర్యం

అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలీక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది. 


కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకుముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కానీ తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలి పెట్టదు అని కృష్ణుడికి అర్ధం అయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు, ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది.


చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్ధం అయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగోఅలా తెల్లవారుఝాముదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండకతప్పదు అని సింహం అనుకుంది.


మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురుపోలేదు. "నేను సింహాన్ని . . . మృగరాజును. నేనే ఈ అడవికి రాజును." అంది భయం భయంగా."నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, వెయ్యి వరకు ఏనుగులను చంపాను. అది కూడా నా వాడి కొమ్ములతో ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేసాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపేవరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిఙ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే" అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది.


అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యేవరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత ఖంగారుపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని భయపడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు". అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు. కృష్ణుడు ఆ తర్వాత మేకల మందతో కలిసి ఇంటి దారి పట్టాడు.

పాము-కోడిపెట్ట

అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి పది గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకుని కోడిపిట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరుబయటకు తీసుకువె ళ్లింది. గింజలు ఏరుకుని ఎలా తినాలో నేర్పించసాగింది.


అంతలో హఠాత్తుగా పొద చాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని ఇవతలకు వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జిబుజ్జి పిల్లల్ని పారిపొమ్మని హెచ్చరికగా అరిచింది. ప్రమాదాన్ని అర్థం చేసుకుని కోడిపిల్లలు చెల్లాచెదరయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. పాము దాన్ని నోటితో కరుచుకుని వెళ్లిపోయింది.

అది మొదలు ఆ పాము పొదల వెనుక, చెట్ల చాటున మాటువేయడం, అదను దొరకగానే కోడిపిల్లను పట్టుకుని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు పాముకు ఆహారమవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్లింది. కొద్దిదూరంలో ఒక చెట్టు కింద పాము పుట్ట ఉంది. పాము అందులో నుంచి బయటకు వస్తూ కనిపించింది.

వెంటనే దాని దగ్గరకు వెళ్లి, ‘‘నువ్వు ప్రతిరోజూ నా పిల్లల్ని తింటున్నావు. నీకిది న్యాయం కాదు. నాకు రెండు పిల్లలు మాత్రమే మిగిలాయి. దయచేసి వాటిని తినకు’’ అంటూ ప్రాధేయపడింది. పాము నిర్లక్ష్యంగా ‘‘పోవమ్మా! నేను నా ఆహారాన్ని తింటున్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? రేపు వచ్చి వాటిని కూడా తినేస్తాను’’ అంది.

కోడిపెట్ట ఎంత బతిమాలినా పాము వినిపించుకోలేదు. పాముకి తగిన శాస్తి చేయాలనుకుంది కోడిపెట్ట. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందామనుకుంది. అనుకున్నదే తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరకు వెళ్లి విషయమంతా విడమర్చి చెప్పి తనకు సహాయం చేయమని అర్థించింది. తేనెటీగలు ఒప్పుకున్నాయి.

తేనెతుట్టెలో ఉండే తేనెను బయటకు తీసి దానిని పాము పుట్టలో పోశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో మునిగిపోయింది. కొద్దిసేపటికే చీమలు తేనె వాసనను పసికట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్ట నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకుని వాటిని బయటకు తరిమేసింది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. చీమలను చూసి పాము భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే చీమలు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా దాని మీదకు దాడి చేసి కసిదీరా కుట్టాయి. లబోదిబోమంటూ పాము అక్కడి నుండి దూరంగా పారిపోయింది.పాము బెడద తప్పిన కోడిపెట్ట మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది.

కుందేలు నేర్చుకున్న పాఠం

ఒక అడవిలో ఒక చిట్టి కుందేలు ఉండేది. దానికి పిరికితనం ఎక్కువ. పెద్ద జంతువులను చూడాలంటేనే భయం. తనకంటే పెద్ద జంతువులు వస్తున్నట్లు తెలిస్తే చాలు... ఏ చెట్టు వెనకో, పుట్ట వెనకో దాక్కునేది. చిన్న శబ్దం వచ్చినా, చివరకు ఆకులు గలగలమన్నా కూడా బెదిరిపోయి పరుగెత్తేది. దానిని మిగతా కుందేళ్ళు పిరికిదని వెక్కిరించేవి.


కొన్ని రోజుల తరువాత కుందేలుకు జీవితం మీద విరక్తి కలిగింది ‘ఛీ... ఛీ.... నా అంత పిరికివాళ్ళు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. అనుక్షణం భయపడుతూ బతికేకంటే చచ్చిపోయినా బాగుణ్ణు’ అనుకుని ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరింది. నీటిలో దూకి ప్రాణం తీసుకోవాలని సరస్సు వైపు వెళ్ళింది.


ఆ సరస్సు ఒడ్డున కొన్ని కప్పలు ఉన్నాయి. పెద్ద కప్పలు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాయి. చిన్న కప్పలు నీటిలోంచి ఒడ్డుకు, ఒడ్డు నుండి నీటిలోకి గెంతుతూ ఆడుకుంటున్నాయి. కుందేలు రాకను పసికట్టిన ఒక కప్ప ‘‘అటు చూడండి. ఒక కుందేలు ఇటువైపే వస్తోంది’’ అని గట్టిగా అన్నది.


దాంతో కప్పల్లో కలకలం బయలుదేరింది. ‘‘అమ్మో ఇక్కడుంటే ప్రమాదం. పదండి... దాక్కుందాం పదండి’’ అని ఒకదానిని మరొకటి హెచ్చరించుకున్నాయి. వెంటనే దబ్బు దబ్బుమని సరస్సులోకి దూకాయి. కుందేలు అక్కడికి చేరేసరికి అక్కడున్న కప్పలన్నీ నీటిలోకి చేరిపోయి తల మాత్రం బయటికి పెట్టి కుందేలు వైపు భయంగా చూడసాగాయి. అది చూసి కుందేలు నోరు వెళ్ళబెట్టింది. ‘ఇదేమిటి, అవి నన్ను చూసి ఎందుకు భయపడ్డాయి. నేను వాటినేం చేయనుగా!’ అనుకుని ఆశ్చర్యపోయింది.


అప్పుడు కుందేలుకు ఒక సత్యం బోధపడింది. ‘ఈ ప్రపంచంలో తనకన్నా బలహీనమైన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికీ భయపడటం సరైనది కాదు. ఆపద కలిగినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకానీ ఆపద కలుగుతుందేమోనని ఊహించి భయపడటం మూర్ఖత్వం’ అనుకుంటూ అక్కడ నుంచి తన స్థానానికి బయలుదేరింది. ఆ సంఘటన కుందేలులో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పటి నుంచి ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది. ఇక ఆరోజు నుండి చీటికీ మాటికీ భయపడకుండా, హాయిగా ఉండసాగింది. ఈ కుందేలులో వచ్చిన మార్పు మిగిలిన కుందేళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అన్నీ దాన్ని మెచ్చుకోసాగాయి.


కపటబుద్ధి

అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒకసింహం. నక్క, ఒంటె సింహానికి సేవచేసేవి. కొన్ని సంవత్సరాల తరువాత సింహం బాగా ముసలిదైపోయింది. అంతకుముందులా చురుకుగా పంజా విసరడం, జంతువుల మీదకు లంఘించడం వంటివి చేయలేకపోయింది. అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండేది. ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు.

అప్పుడు సింహం నక్కను పిలిచి ‘‘నాకు బాగా ఆకలిగా ఉంది.తినడానికి ఏమైనా తీసుకురా!’’ అని అడిగింది. ఆ సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తోంది. అప్పుడు ఆ జిత్తులమారి నక్క ‘‘ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా ఒంటె ఏమైనా ఉపయోగపడుతుందా రాజా?’’ అని అమాయకంగా అడిగింది. ‘‘ఆ విధంగా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం? అతను నా సేవకుడు. అతడిని రక్షించడం నా బాధ్యత,’’ అంది సింహం కోపంగా.

‘‘కానీ, రాజా! ఒకవేళ ఒంటె తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే...’’ అంది నక్క. సింహం ఒక్క క్షణం ఆలోచించి ‘‘అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అంది. అప్పుడు నక్క నెమ్మదిగా ఒంటె దగ్గరకు వెళ్ళి రహస్యంగా, ‘‘మిత్రమా! మన రాజును సంతోషపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకుందాం. రాజుగారు చాలా సంతోషించి మనకు మంచి బహుమతులు ఇస్తారు’’ అంది.

అందుకు సమాధానంగా ఒంటె, ‘‘అయితే మిత్రమా! ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో’’ అంది. నక్క ఒప్పుకుంది. రెండూ కలిసి లోపలికి వెళ్ళాయి. ముందుగా నక్క సింహంతో, ‘‘రాజా! మీరు ఆకలితో ఉన్నారు. దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’’ అని ఎంతో వినయంగా పలికింది. అది విని సింహం చాలా సంతోషించినట్టు కనిపించింది. ‘‘నువ్వు నా సేవకుడవయినందుకు నాకు ఆనందంగా ఉంది. నీకేం కావాలో కోరుకో’’ అని చెప్పింది. అది వినగానే ఒంటె కూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తొందరపడింది. ‘‘ఓ రాజా! నక్కను వదిలిపెట్టండి. దానికి బదులుగా నన్ను తినండి’’ అంది.

ఒంటె నుండి ఆ మాటల కోసమే ఎదురుచూస్తోంది సింహం. అంతే ఒక్కసారిగా ఒంటెపై దాడి చేసింది. ‘‘అయ్యో... రాజా! ఇదేమిటి? బహుమతి ఇస్తారనుకుంటే ఇలా చేస్తున్నారు?’’ అని ఆందోళనగా అంది ఒంటె. కపటమైన నక్క ‘‘ఇదే నీకిచ్చే గొప్ప బహుమతి. నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టే నీ యజమాని చేతిలో మరణిస్తున్నావు,’’ అంది కుటిలంగా నవ్వుతూ.



ఒంటె మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నది. మిగిలిన మాంసాన్ని నక్క తినేసింది. 

సింహభాగం

ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు వేటకు వెళుతూ తనతో పాటు తోడేలు, నక్కలను తీసుకు వెళ్ళింది. ఆ మూడూ కలవడంతో ఆ రోజు అడవిలోని చాలా జంతువుల ప్రాణాలు అపాయంలో పడ్డాయి.

తోడేలు, నక్క జంతువుల జాడలను పసికట్టి, వాటిని భయపెట్టి సింహం ఉన్న వైపునకు తోలాయి. సింహం ఏ మాత్రం శ్రమ లేకుండా ఆ జంతువులను చంపింది. నక్క, తోడేలు వాటి మాంసాన్ని సింహం గుహ ముందు కుప్పగా పోశాయి. ‘‘బాగా అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఇక వేట చాలు. వీటిని మూడు సమభాగాలుగా చేసి మీ వాటా మీరు తీసుకు వెళ్ళండి’’ అంది సింహం.

సింహం అలా చెప్పగానే తోడేలు ఉత్సాహంగా ముందుకు వచ్చింది. చాలా జాగ్రత్తగా జంతువుల మాంసాన్ని మూడు భాగాలు చేసి, ‘‘మీ వాటా తీసుకోండి రాజా!’’ అంది. అది చూసి సింహానికి చాలా కోపం వచ్చి తోడేలును చంపేసింది. వాటాలు పంచమని ఈసారి నక్కతో చెప్పింది. నక్క చాలా తెలివిగా తోడేలు వేరు చేసిన కుప్పలను కలిపేసి, అందులోంచి కొంచెం పక్కకి తీసింది. ‘‘నాకు ఇది చాలు మహారాజా! అదంతా మీరు తీసుకోండి’’ అంది. సింహం సంతోషించి ‘‘ఇంత బాగా వాటాలు వేయడం ఎక్కడ నేర్చుకున్నావు?’’ అని అడిగింది.‘అనుభవంతో సింహరాజా!’’ అంది నక్క.

బంగారుపళ్లెం

అనగనగా ఒక ఊరిలో సోము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు సోము తండ్రి పాతకాలం నాటి ఇనుపపెట్టెను శుభ్రం చేస్తూ ఉంటే, సోము దానిలో ఉండే బంగారు పళ్లాన్ని బయటికి తీసి, దానితో ఆడుకోసాగాడు. అది చూసిన తండ్రి సోము వీపు మీద రెండు దెబ్బలు వేసి దాన్ని లాక్కుని, ‘‘ఇది ఆడుకునే వస్తువు కాదు. దీన్ని మన వంశప్రతిష్ఠకి గుర్తుగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం.


ఇంకెప్పుడూ దీనితో ఆడకు’’ అని కోప్పడ్డాడు. బంగారు పళ్లాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు సోము చాలా బాధ పడ్డాడు. ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు నడిచాడు.


ఊరి చివర తోటలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడసాగాడు. అంతలో ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి, ఆ చెట్టుకి మరో వైపున కూర్చున్నారు. వాళ్లు దొంగిలించిన నగల్ని పంచుకోవడానికి గొడవ పడసాగారు. వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్న సోముకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే లేచి చప్పుడు కాకుండా నడుస్తూ అక్కడికి దగ్గర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి, బావిలోకి చూస్తూ , ‘బంగారు పళ్లెం’, ‘బంగారు పళ్లెం’ అని గట్టిగా ఏడ్వసాగాడు. అది విన్న దొంగలు ఆ బావి దగ్గరికి వెళ్లారు.


సంగతేంటని అడిగారు. ‘‘మా ముత్తాత గొప్ప పండితుడు. అప్పట్లో ఆయనకి రాజుగారు పే...ద్ద బంగారు పళ్లెం బహుమతిగా ఇచ్చారు. మా ఇంట్లో పెట్టెలో ఉన్న ఆ పళ్లాన్ని తీసి, ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటే అది బావిలో పడిపోయింది. దాన్ని ముట్టుకున్నానని తెలిస్తేనే మా నాన్న కొడతాడు. ఇక అది పోయిందని తెలిస్తే చంపేస్తారు’’ అని సోము పెద్దగా ఏడవసాగాడు. దొంగలకి దాన్ని తీసుకోవాలనే ఆశ పుట్టింది. ‘‘నేను తీసిస్తానంటే నేను తీసిస్తాను’ అంటూ పోటీ పడ్డారు. వాళ్ల చేతుల్లో ఉన్న నగలమూటని కింద పెట్టి ఇద్దరూ బావిలో దూకారు.


సోము వెంటనే ఆ నగల మూటని తీసుకొని ఊరిలోకి పరుగెత్తాడు. ఊర్లో పెద్దలకి దొంగల సంగతి చెప్పి వారిని బావి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకొని రాజభటులకి అప్పగించారు. ఆ నగలు ఎవరివో కనుక్కొని వారికి అందచేశారు. సోము తెలివిని, సమయస్ఫూర్తిని ఊరివారంతా మెచ్చుకున్నారు. సోము తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.

రంగు వెలిసిన ఏనుగు

అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు ‘నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో!’ అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు. ఇంతలో వర్షం మొదలయ్యింది. చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

గుణపాఠం

ఒక అడవిలో బన్నీ అనే ఒక అందమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. తన స్నేహితులను చూసుకుని ఎంతో గర్వపడేది. ఒకరోజు బన్నీని కొన్ని వేటకుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తింది. ‘‘మిత్రమా! కొన్ని వేటకుక్కలు ఇటు వైపే వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి’’ అంది బన్నీ.


‘‘నిజమే! చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఎలుగుబంటిని అడుగు’’ అని చెప్పింది దుప్పి. బన్నీ అక్కడి నుండి ఎలుగుబంటి దగ్గరకు పరిగెత్తింది. ‘‘నేస్తం! నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేటకుక్కలు నా వెంటబడ్డాయి. వాటిని తరిమేసి నన్ను కాపాడు’’ అని ప్రాధేయపడింది. ‘‘నన్ను క్షమించు. నేనిప్పుడు చాలా అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఆహారం వెతుక్కోవాలి. నీకు సహాయం చేయలేను’’ అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఎలుగుబంటి. బన్నీ కోతి దగ్గరకు వెళ్ళి అడిగింది. ‘‘అమ్మో నేనా? ఆ కుక్కలు నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను’’ అంది కోతి.

ఏనుగు, పొట్టేలు, జింక.... ఇలా బన్నీ స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. బన్నీకి చాలా బాధేసింది. వేటకుక్కల బారినుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేటకుక్కలు అటువైపు వచ్చి బన్నీ దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనేం వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది.

ఆ సంఘటనతో బన్నీ ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని బన్నీ తెలుసుకుంది.