Pages

Monday, June 29, 2015

ఈ మహర్షి కధ... లోకానికి ఆదర్శం!!!

దేహ సౌందర్యం కన్నా మనః సౌందర్యం ముఖ్యం. ఎంత కష్టపడైనా సరే, తల్లిదండ్రులని సేవించుకోవాలి. ఈ ధర్మం పిల్లలకు తల్లిదండ్రులే నేర్పాలి... మాటలతో కాదు, చేతలతో...
తల్లిదండ్రుల సేవతో పునీతులైన వారు పురాణాలలో కోకొల్లలు. అందులో ఒకరు అష్ఠావక్రుడు. తండ్రి శాపానికి గురై 8 వంకరల దేహం తో పుట్టినా, ఆ తండ్రి మీద కోపం గానీ, ద్వేషం గానీ పెంపొందించుకోకుండా అదే తండ్రిని వరుణ దేవుని పాశాల నుండి రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చాడు. 12 సం వత్సరాలకే జనక మహారాజు ను ఓడించిన అపర మేధావి.
తండ్రి కహూడ మహర్షి శిష్యులతో అహోరాత్రులూ వేదాధ్యయనం చేయించేవాడు. ఆ వేదఘోషలూ, వేదార్థజ్ఞానమూ తల్లి గర్భంలో ఉండగానే విని పుట్టక ముందే సకల విజ్ఞానాన్నీ రంగరించాడు అష్టావక్రుడు.
ఒకరోజు రాత్రి తల్లి గర్భం నుంచే నుంచి తండ్రితో "తండ్రి, విశ్రాంతి లేకుండా చదువుతున్నందున నిద్ర మత్తులో శిష్యులు స్వరాలు తప్పు పలుకుతున్నారు." అన్నాడు. దానికి తండ్రి శిష్యుల ముందు అవమానించినందుకు అలోచనారహితంగా ఇంకా పుట్టని శిశువును అష్ట వంకర్లతో పుట్టు మని శపించాడు.
సంపదను ఆర్జించడానికి జనక మహారాజు వద్దకు వెళ్లాడు కుహూడుడు. అక్కడ వంది అనే ఆస్థాన పండితుడి చేతిలో ఓడి నీటిలో బలవంతంగా ముంచబడతాడు.
అష్టావక్రుడు మేనమామ దగ్గర సమస్త విద్యలూ అభ్యసిస్తాడు. 12 ఏళ్లకే మహా జ్ఞాని అయ్యి తన తండ్రి అన్వేషణ లో జనక మహారాజు రాజ్యానికి వచ్చి మహారాజు ను ఓడిస్తాడు.
జనకుడు 'బాల మహర్షి‘ అంటూ నమస్కరిస్తాడు, దాంతో వంది కూడా ఓటమి ని ఒప్పుకుంటూ, "నేను ఎవరినీ నీటిలో ముంచలేదు. మా నాన్నగారు వరుణ యాగం చేస్తున్నారు. దాని కోసం మహా పండితులు కావలసి వచ్చింది. యాగం పూర్తి అయ్యింది." అంటూ వరుణ దేవుడిని ప్రార్ధించి అష్టావక్రుడి తండ్రితో సహా అందరు పండితులనూ బయటకు రప్పించాడు.
దానితో తండ్రి సంతోషించి తన మంత్రశక్తిని సమంగా నదిలోకి ప్రవేశపెట్టి కుమారుడిని స్నానం చేయమనగా మహర్షి అష్టావక్రుడు ధగద్ధగాయమానమైన తేజస్సు తో బయటకు వచ్చాడు.
అష్టావక్రుడి జీవితం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు...
ఊకదంపుడు విద్యలు చేటు ను కలిగిస్తాయినీ...
జ్ఞానం తో కూడుకున్న సలహా చిన్నవారు చెప్పినా వినాలనీ...
ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయాలు కీడు మాత్రమే చేస్తాయనీ...
ఏ సంఘటనైనా తాత్కాళికంగా బాధ కలిగించినా నిగ్రహవంతునికి, జ్ఞానికీ మేలే జరుగుతుందనీ తెలుసుకోవచ్చు.

Thursday, June 25, 2015

సింహం-నక్క-ఎలుగుబంటి

సింహం-నక్క-ఎలుగుబంటి దీనిలాంటి కథే ఒకటి స్కాంద పురాణంలో ఉంది. ఇది చదివాక, మంచి-చెడు, ధర్మం-అధర్మం గురించిన ఆలోచనలు రేకెత్తించే అద్భుతమైన ఆ కథ ను కూడా చదివి చూడండి!
గండకీ నదీ తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క- ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి.
నక్క ముసలిది- సొంతగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి ఇప్పుడు లేదు. ఎలుగుబంటిది మంచి మనసు. తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకూ కొంచెం పెట్టేది అది.
ఒకనాడు నక్క , ఎలుగుబంటి కలసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూండగా ఆకలిగొన్న సింహం ఒకటి వీటికి ఎదురైంది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి, నక్కతో "మిత్రమా, నక్కా! నువ్వేమో ఇప్పుడు పెద్దగా ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నావు.
ఆ సింహమేమో ఆకలిగొని ఉన్నది; మన వైపే వస్తోంది- దానికి చిక్కామంటే అంతే. అందుకని నువ్వు నా వీపును కరచుకో; నేను ఈ మహావృక్షాన్ని ఎక్కుతాను" అన్నది.
ఆ సరికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే తటాలున దాని వీపును కరచుకున్నది. ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది!
చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి-నక్క కదలక మెదలక ఉండగా చెట్టుకింద సింహం వాటివైపే చూస్తూ కూర్చున్నది. ఎలుగు-నక్క చెట్టు దిగలేదు. సింహం ఎంతకీ పక్కకు కదలలేదు.
'ఇంక కుదరదు' అనుకున్న ఎలుగుబంటి, చెట్టుపైనే కొన్ని కొమ్మలు విరిచి, పడుకోవడానికి ఒక పక్కను ఏర్పాటుచేసింది. చీకటిపడ్డాక అది నక్కతో- "మిత్రమా! సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో‌ మనం‌ ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే, ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి" అన్నది. నక్క సరేనన్నది.
అప్పుడు ఎలుగుబంటి "వయసు పైబడ్డ దానివి- ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్ర లేపి, ఆపైన నేను నిద్రపోతాను- నువ్వు కాపలా కాద్దువు" అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది.
చెట్టుక్రిందనే వీటికోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో అన్నది- "ఓ మిత్రమా, ఎలుగు బంటీ! నువ్వు ఆ ముసలి నక్కకి కాపరివని నాకు తెలుసు. అయినా నా మాట విను- నువ్వు గానీ ఆ నక్కను కిందకి తోసేశావంటే, నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళి పోతాను. అట్లా నా ఆకలీ తీరుతుంది; నీకు ఆ ముసలినక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువూ తగ్గుతుంది" అని.
ఎలుగుబంటి టక్కున జవాబిచ్చింది- "చూడు, సింహరాజా! ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు.
నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను. అది నన్నే నమ్ముకుని బ్రతుకుతోంది. నామీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతోందో చూడు.
ఏ జీవికీ నిద్రాభంగం కలిగించకూడదు. అది మహా పాపం. నిద్రలోనే కదా, అన్ని ప్రాణులూ బడలికను పోగొట్టుకొని హాయినీ, సుఖాన్నీ పొందేది? నేను దీన్ని మోసం చేయటం అసంభవం. ఎన్ని రోజులైనా సరే, నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను" అని. అంతలోనే రాత్రి మూడవ జాము ప్రవేశించింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి, తాను పడుకున్నది.
కొంత సేపటికి, ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక, చెట్టు క్రింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది- "నక్కబావా! నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో గదా! ఈ ఎలుగుబంటి తను తినదు; నిన్ను తిననివ్వదు- నాకు తెలుసు.
నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను- నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందికి తోసెయ్యి- నేను దాన్ని చంపి తిని, మిగిలిన మాంసాన్ని నీకూ పెడతాను; నువ్వూ తినొచ్చు. మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడినుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయించేసుకున్నాను. నా నిశ్చయం ఎంత దృఢమైనదో నీకు తెలుసు- తెలివైనదానివి- ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ ఎలుగును తోసెయ్యి" అన్నది, నక్కను ప్రలోభ పెడుతూ.
నక్క కాసేపు ఆలోచించి- ఎలుగుబంటిని కిందికి తోసేసింది.
కిందపడ్డ ఎలుగు దగ్గరకొచ్చి నిలబడి, సింహం ఎగతాళిగా నవ్వుతూ- "ఎలుగుబంటీ, చూశావా?! ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందికి తోసెయ్యకపోతివే; అది చూడు, నిన్ను ఊరకనే కిందికి తోసేసింది- చూస్తివా, నక్క తెలివి?" అన్నది.
ఎలుగుబంటి విచారంగా నవ్వి, "సింహరాజా! ఆ ముసలినక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది. ఈరోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను- ఎందుకంటే నామీద నాకు విశ్వాసం ఉంది. నేను కౄరజంతువునే; కానీ ఏ ప్రాణికీ కావాలని హాని తలపెట్టను. నా మంచితనం వల్ల నాకు హాని వాటిల్లదు- అనేది నా విశ్వాసం.
నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని, నీ ఆకలి తీర్చుకుంటావు- నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే. కానీ నక్క-?! దానంతట అది క్రిందికి దిగలేదు; మరి చెట్టు మీద దానికి ఆహారమూ దొరకదు. చివరికది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది; లేదా చెట్టు మీది నుండి క్రిందపడి ఎముకలు విరిగి చస్తుంది. ఇది సత్యం.
ఇక ఈ 'నక్క తెలివైనది కాదు' అనేది స్పష్టం. దానికి ఉన్నది కేవలం మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప, తెలివి కాదు. నిజానికి నక్క తిక్కది- అందుకనే ముందుచూపు లేక, ఈ పనికి ఒడి గట్టింది" అన్నది ఎలుగుబంటి, ధైర్యంగా.
"నేను నిన్ను తినకుండా వదిలేస్తాను- మరి ఇప్పుడయినా చెట్టెక్కి నక్కను క్రిందికి తోసేస్తావా?" అంది సింహం.
"అలా చేయను. ఎందుకంటే, 'మోసం చేసినవాడు తనంతట తానే నష్టపోతాడు' అని దీని ద్వారా అందరికీ తెలియాలి" అన్నది ఎలుగు బంటు.
ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను తింటే అది నాకు మంచిది కాదు- నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే- నీ దారిన నువ్వు పో" అని బయలుదేరింది సింహం. ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళింది.
నక్క మాత్రం అటు చెట్టు దిగలేక, ఇటు ఆహారమూ లేక అలమటించి, చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు విడిచింది.

అంతా మన మంచికే

అనగనగ ఒక రాజు గారు. ఆయన దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటుండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకి వెళ్ళినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా అంతా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు.
.
కాని రాజు వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు. వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. ‘‘నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?’’ అనడిగాడు. అప్పుడు మంత్రి ‘‘నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతో పాటు నన్నూ పట్టుకునేవాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు. అందుకే ఏం జరిగినా "
అంతా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు..!

Sunday, June 21, 2015

అంతా మన మంచికే!

అనగనగ ఒక రాజు గారు. ఆయన దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటుండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకి వెళ్ళినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా అంతా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు.
కాని రాజు వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు. వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. ‘‘నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?’’ అనడిగాడు. అప్పుడు మంత్రి ‘‘నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతో పాటు నన్నూ పట్టుకునేవాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు. అందుకే ఏం జరిగినా "అంతా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు.

Thursday, June 18, 2015

స్నేహం

 ములుగు అడవిలో ఒక చెట్టుకింద నెమలి మరియు పాము నివాసముండేవి. ఆ రెండింటికీ స్నేహం కుదిరింది.
ఓరోజు ముంగిస వచ్చి పాము మీద దాడి చెయ్యబోయింది. పాము మిత్రమా! రక్షించు’మని అరిచింది. వెంటనే నెమలి వచ్చి ముంగిస ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది.

ముంగిస పామును వదిలేసి పారిపోయింది. మరోసారి పాము, నెమలి మాట్లాడు కుంటున్నాయి. వేటగాడు వచ్చి నెమలి మీద వలవెయ్య బోయాడు. అది గమనించిన పాము పరిగెత్తుకెళ్లి వాని కాలు కాటేసింది. వాడు  బోదిబోమంటూ పరిగెత్తాడు.

ఆ రెండూ ఇలా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారు. అదే అడవిలో తిరుగుతున్న తోడేలుకు ఆ నెమలి మాంసం తినాలని నోరూరింది. పాముతో కలిసుంటే నెమలి చిక్కదనుకుంది. ఆ రెంటికీ వైరం పెట్టాలనుకుంది.

పాము చాటుకు వెళ్లగానే నెమలితో తోడేలు ‘ఓసి పిచ్చి నెమలీ! పాము నిన్ను చంపాలని చూస్తుంది. జాగ్రత్త సుమా! నా సాయం కావాలనుకున్నప్పుడు పిలువు’ అంది. మరోసారి పాము చాటుకు నెమలితో అయ్యో, అమాయకురాలా! ఆ దుర్మార్గ నెమలి ముంగిసతో మాట్లాడేటప్పుడు నేను చూసాను.

నిన్ను చంపించాలని చూస్తుంది. జాగ్రత్త సుమా! నా సాయం కావాలంటే అడుగమంది. పాము, నెమలి తోడేలు చెప్పిన దాని గురించి ఆలోచించాయి. అకారణంగా పాము ననె్నందుకు చంపాలనుకుంటుంది? అని నెమలి, అదేవిధంగా పాము ఆలోచించాయి. రెండూ కలిసి తోడేలు తమతో చెప్పిన విషయం చెప్పుకుని నవ్వుకుంటున్నాయి.
దూరంనుండి తోడేలు అటే వస్తోంది. ఆ రెండు అది గమనించి పోట్లాడుకుంటున్నట్టు నటించసాగాయి. అది నిజమే అనుకున్న తోడేలు సంతోషించి పాముతో ‘నేనా నెమలిని పట్టి ఇవ్వాల్నా?’ అని అడిగింది. దాని పన్నాగం రెండూ గ్రహించి సైగ చేసుకున్నాయి. రెండూ కలిసి తోడేలు మీద మెరుపు దాడి చేసాయి.

పాము దాని కాళ్లను కాటేసింది. నెమలి దాని ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది. అది భరించలేక తోడేలు కుయ్యో, మొర్రో అంటూ పారిపోయింది.

పేదరాశి పెద్దమ్మ కధ

 సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య.. "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.
మొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి.

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చింది. ఆమెని చూసిన రాజు ఆనంద పడి రెండో భార్యని వెళ్ళగొడతాడు.

అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి 

తెనాలి రామలింగడు...సంచిలో ఏనుగు..!!

 ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయలవారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు, ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు "మహారాజా...! మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైంద"ని చెప్పాడు.

అంతే ఫక్కున నవ్విన రాయలవారు... "రామలింగా...! ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావుగానీ, చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా.. చెప్పు..?" అన్నాడు. "లేదు మహారాజా..! చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు. అంతకంటే, కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి" అన్నాడు రామలింగడు.
అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోడం లేదని అన్నాడు రాయలవారు.


నిజం "మహాప్రభూ...! చిన్నపిల్లలు అది కావాలి, ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా, తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటిని వేగడం, వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండీ..!!" అని వివరించి చెప్పాడు రామలింగడు.

మహారాజు దీనికి కూడా ఏ మాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి.. "సరే మహారాజా..! కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగానూ, మీరు తండ్రిగానూ నటిద్దాము. పిల్ల చేష్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను" అన్నాడు. దీనికి సరేనన్నాడు రాయలవారు.
అంతే ఇక మారాం చేయటం మొదలెట్టాడు రామలింగడు. మిఠాయి కావాలని అడిగాడు. ఓస్ అంతేగదా.. అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారుకు పోదామని గోల చేశాడు రామలింగడు. సరేనని బజారుకు తీసుకెళ్ళగా... వీధిలో అటూ, ఇటూ పరుగులెత్తాడు, తన వెంటే రాజును పరుగులెత్తించాడు. రంగు రంగుల సంచీ చూపించి కొనివ్వమని రాజును అడిగాడు.

సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేదిలేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే...! ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాం చేశాడు.

సంచిలో ఏనుగెలా పడుతుంది రామలింగా..? మరొకటి ఏదైనా అడుగు" అన్నాడు రాయలవారు. "వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి. నాకింకేమీ వద్దు" అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు. అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకుంటూ అక్కడినుంచి ఇంటికి బయలుదేరాడు.

తెనాలి రామలింగడు.. లెంపకాయ ఖరీదు..!!

 ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా.. ఎవరో వెనకనుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కిందపడిపోయాడు. ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి, ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు.

తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు.. "నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా..? నన్నెందుకయ్యా కొట్టావు..?" అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారుపడుతూ.. "అయ్యా..! తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనుకనుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టానంతే..!" అని చెప్పాడు.

"సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా..?" అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి, జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా.. తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగయినా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

"పోనీలేవయ్యా రామలింగా..! ఏదో తెలియక పొరపాటు చేశాడు. ఏమనుకోవద్దంటున్నాడుగా.. ఊరుకో..!!" అన్నాడు మంత్రి. అయితే రామలింగడు ససేమిరా అన్నాడు. సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి. ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే, సందుచూసి పారిపోయాడు. ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది.

మంత్రిగారికి దగ్గరిగా వెళ్లిన రామలింగడు.. "అయితే మంత్రిగారూ..! నాకు తెలియక అడుగుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుందే..!!" అన్నాడు. "అంతేగా మరి..!" అన్నాడు మంత్రి. "ఓహో..! అలాగా...!!" అని నవ్వుతూ అన్నాడు రామలింగడు.

వెంటనే మంత్రి గారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగడు. మంత్రి "కుయ్యో.. మొర్రో.." అంటూ.. "ఎందుకయ్యా రామలింగా.. నన్ను కొట్టావు..!!" అని అడిగాడు. "మంత్రిగారూ..! నాకు అవతల బోలెడంత పని ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా..! నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి, మీరు దాన్ని ఉంచుకోండ"ని చెప్పి ఎంచక్కా అక్కడినుంచి వెళ్లిపోయాడు తెనాలి రామలింగడు.

తెలివైన ఆసామి!!!

 ఒక ఊళ్లో ఒక ఆసామి వుండేవాడు. అతను ఏమి చదువుకోక పోయినా మంచి తెలివి తేటలు గల వాడు. ఒకసారి, అతనికి పది రూపాయలు అవసరమయ్యింది. దాన్ని సంపాదించడానికి అతను ఒక ఉపాయం ఆలోచించాదు.

పట్నం లో అతనికి తెలిసిన ప్లీడరు ఒకాయన ఉన్నాడు. ఆసామి ఆయన వద్దకు వెళ్లి, "ప్లీడరు గారు, మీరు చదువుకున్నవారు, తెలివి గల వారు. నేను చదువుకోని పల్లెటూరి మొద్దును. నేను తమర్ని ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పలేక పోతే ఇరవై రూపాయలు ఇవ్వాలి, మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి, సమాధానం చెప్పలేక పోతే పది రూపాయలు ఇచ్చుకుంటాను. పేదవాణ్ణి కదా!"అన్నాడు.

అందుకు ప్లీడరు గారు ధైర్యంగా ఒప్పుకున్నారు.

" మూడు కాళ్లూ, రెండు ముక్కులూ గల పక్షి ఏది?" అని అడిగాడు.

ప్లీడరు సమాధనం చెప్పలేక ఓడినట్టు ఒప్పుకొని ఆసామికి ఇరవై రూపాయలు ఇచ్చి, "నేను నిన్ను ఆ ప్రశ్నే అడుగుతున్నాను. సమాధానం చెప్పు" అన్నాడు.

"ఓడిపోయాను!" అంటూ ఆసామి పది రూపాయలు ప్లీడరు గారికి ఇచ్చి, మిగిలిన పది జేబులో వేసుకొని చక్కా వెళ్లిపోయాడు.