Pages

Friday, September 14, 2012

గజ్జెల సవ్వడి


గంగవరం జమీందారు దివాణంలో పనిచేస్తూన్న జయంతుడు బుద్ధిమంతుడు. మంచి తెలివితేటలు కలవాడు. అందుకే దివాణంలో చేరిన కొద్ది కాలానికే అందరిలో మంచిపేరు సంపాదించాడు. జయంతుడి తల్లిదండ్రులు అతనికి పదిహేనేళ్ళు వచ్చేవరకు లలితాపురం అనే పల్లెటూళ్ళో ఉండేవారు. ఆ తరవాత గంగవరం వచ్చారు. అయినా, జయంతుడికి స్వగ్రామంలోని బాల్యస్నేహితులతో సంబంధాలు తెగిపోలేదు. అవకాశం కలిగినప్పుడు కలుస్తూండేవాళ్ళు.
 
 సంక్రాంతి పండగ సందర్భంగా కచేరీకి సెలవులు ఇవ్వడంతో, ఎప్పటి నుంచో పల్లెకు రమ్మని పిలుస్తూన్న బాల్యస్నేహితుల కోరిక మన్నించి, జయంతుడు లలితాపురం బయలుదేరాడు. అతన్ని చూసి అతని స్నేహితులు మహేంద్రుడు, శివదాసు, కులశేఖరుడు, మనోహరుడు ఎంతో ఆనందించారు. ఆ నలుగురి ఇళ్ళూ పక్కపక్కనే ఉన్నాయి. జయంతుడు అక్కడ నాలుగు రోజులు ఉంటాడు కాబట్టి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నేహితుడి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి ఒప్పందం కుదిరింది.
 
మొదటిరోజు జయంతుడు మహేంద్రుడి ఇంట్లో బసచేశాడు. భోజనాలు అయ్యూక మిత్రులు నలుగురూ కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. చిన్ననాటి ముచ్చట్లను సంతోషంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పటి తమ స్థితితుల గురించి చెప్పుకున్నారు. ఊరి ప్రజల బాగోగుల గురించి చర్చించుకున్నారు. ఆ తరవాత మిగిలిన ముగ్గురూ తమ ఇళ్ళకు వెళ్ళారు. రాత్రి పడుకోబోయే ముందు మహేంద్రుడు ఎంతో భక్తితో ఆంజనేయ దండకం చదవడం గమనించిన జయంతుడు, ‘‘దైవభక్తి పెరిగినట్టుంది. సంతోషం!''  అన్నాడు చిన్నగా నవ్వుతూ.


‘‘అదేం కాదు. భయం పెరిగింది,'' అన్నాడు మహేంద్రుడు విచారంగా. ‘‘ఎందుకు?'' అని అడిగాడు జయంతుడు. ‘‘అదొక పెద్ద కథ. ఇప్పుడది చెప్పి నీ నిద్ర చెడగొట్టడం నాకిష్టం లేదు. పడుకో,'' అన్నాడు మహేంద్రుడు. జయంతుడు ఆపై మరేం మాట్లాడకుండా నిద్రకు ఉపక్రమించాడు.
 
అర్ధరాత్రి సమయంలో జయంతుడికి మెలకువ వచ్చింది. అప్పుడతనికి లీలగా గజ్జెల సవ్వడి వినిపించింది. పక్కకు తిరిగిచూస్తే, మహేంద్రుడు నిండా దుప్పటి కప్పుకుని భయంతో వణుకుతూ కనిపించాడు. కొంతసేపయ్యూక గజ్జెల సవ్వడి వినరాలేదు. తెల్లవారిన తరవాత జయంతుడు, మహేంద్రుడితో తాను రాత్రి విన్న గజ్జెల సవ్వడి గురించి చెప్పాడు.
 
‘‘నీకూ వినిపించిందన్న మాట. ఏం చెప్పమంటావు? నెలరోజుల నుంచి ఈ కామినీ పిశాచం ఇటు తిరుగుతున్నది. ఇల్లు ఖాళీ చేద్దామంటే సొంత ఇల్లయి కూర్చుంది. ఆ పిశాచం బారిన పడకుండా ఉండడానికి భూతవైద్యులకూ, తాయెత్తులకూ చాలా ఖర్చు పెట్టాను,'' అని వాపోయూడు మహేంద్రుడు.
 
‘‘ఈ రోజుల్లో దయ్యూలు, పిశాచాలు ఏమిటి?'' అన్నాడు జయంతుడు. ‘‘అలా తీసి పారెయ్యకు. ఆ గజ్జెల సవ్వడి వినిపించడం మొదలైనప్పటి నుంచి మా ఇంట్లో అరిష్టాలు మొదలయ్యూయి,'' అన్నాడు మహేంద్రుడు. ‘‘మరి, ఈ విషయం మన స్నేహితులతో చర్చించలేకపోయూవా?'' అని అడిగాడు జయంతుడు.
 
‘‘పిరికివాడినని గేలిచేస్తారని భయపడి చెప్పలేదు,'' అన్నాడు మహేంద్రుడు. రెండో రోజు జయంతుడు శివదాసు ఇంట్లో బసచేశాడు. ఆ రాత్రి కూడా అతనికి గజ్జెల సవ్వడి వినిపించింది. క్రితం రాత్రి లీలగా వినిపించిన సవ్వడి, ఈ రాత్రి మరింత స్పష్టంగా వినిపించింది. మరుసటి రోజు జయంతుడు ఆ విషయం శివదాసు వద్ద ప్రస్తావించినప్పుడు, ‘‘పెద్దగా మాట్లాడకు. ఆ గజ్జెల సవ్వడి గురించి గుడి పూజారి దగ్గర చెప్పాను. ఆ గజ్జెల సవ్వడి మహాలక్ష్మిదనీ, ఆమె మా ఇంట్లోకి రావాలా, వద్దా అని తటపటాయిస్తున్నదనీ, పూజారి చెప్పాడు.

ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నాను,'' అన్నాడు శివదాసు. జయంతుడు మరేం మాట్లాడలేదు. ‘‘ఈ విషయం మన మిత్రులకు చెప్పకు. అసూయ పడగలరు,'' అన్నాడు శివదాసు ఏదో రహస్యం చెబుతున్నట్టు. మూడోరోజు రాత్రి జయంతుడు కులశేఖరుడి ఇంట గడిపాడు. ఆ రోజు రాత్రి గజ్జెల సవ్వడి మరింత దగ్గరగా వినిపించింది. కులశేఖరుడు మేలుకొని ఉండడం గమనించిన జయంతుడు, ‘‘ఏదో గజ్జెల సవ్వడి వినిపిస్తున్నది కదా?'' అన్నాడు.
 
‘‘అవును, కొద్ది రోజుల నుంచి నేనూ ఆ సవ్వడి వింటున్నాను. మా పెద్దలు చెప్పినదాన్ని బట్టి, మా పెరట్లో లంకెబిందెలున్నాయి. అవి బయట పడడానికి ఆరాట పడుతూ చేసే శబ్దమే అది. రహస్యంగా పెరడంతా తవ్విస్తున్నాను.అయినా నిధి మాత్రం దొరకడం లేదు. ఈ విషయం వేరెవ్వరివద్దా అనకు,'' అన్నాడు కులశేఖరుడు.
 
ఈ ముగ్గురు మిత్రులు చెప్పేకారణాలు కాకుండా గజ్జెలసవ్వడికి అసలు కారణం మరేదో ఉంటుందని జయంతుడు ఆలోచిస్తూ పడుకున్నాడు. నాలుగోరోజు మనోహరుడి ఇంట్లో గడిపినప్పుడు, ఆ రాత్రి జయంతుడికి గజ్జెలసవ్వడి మరింత దగ్గరలో వినిపించింది. ఆ సవ్వడి వినగానే, మనోహరుడు లేచి పక్కగదిలోకి వెళ్ళడం జయంతుడు గమనించాడు. కొంత సేపటికి ఆ సవ్వడి ఆగిపోయింది. మనోహరుడు వచ్చి మంచం మీద పడుకున్నాడు.

తెల్లవారాక, జయంతుడు తను విన్న గజ్జెల సవ్వడి గురించి మనోహరుడి దగ్గిర ప్రస్తావించి, అతడేమి చెబుతాడో అని ఆసక్తిగా చూడసాగాడు. మనోహరుడు తలవొంచుకుని, ‘‘నాకీ మధ్యనే వివాహమైన సంగతి నీకు తెలుసుకదా? నా భార్యకు నిద్రలో నడిచే వ్యాధి ఉంది. నేను నిద్రపోకుండా మెలకువగా ఉండి, ఆమెను కనిపెట్టుకుని కూర్చోవడం కష్టంగా అనిపించి, ఆమె కాళ్ళకు గజ్జెలు కట్టడం అలవాటు చేసుకున్నాను. ఆమె నిద్రలో నడిచినప్పుడు ఆ గజ్జెల సవ్వడికి నాకు మెలుకువ వస్తుంది. వెళ్ళి ఆమెను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెడతాను. ఒకసారి అలా పడుకోబెడితే, మరిక లేవదు,'' అని వివరించాడు.
 
‘‘మరి, నీ భార్య గజ్జెల సవ్వడి పగటి పూట వినిపించలేదే?'' అని అడిగాడు జయంతుడు అనుమానంగా. ‘‘ఆమెకు గజ్జెలు కట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు. అందుకే ఆమె నిద్రపోయూక కాళ్ళకు గజ్జెలు కట్టి, ఆమె నిద్రలేవక ముందే తీసేస్తాను. పెళ్ళయిన కొత్తకదా? నెమ్మదిగా చెప్పి గజ్జెలు అలవాటు చేయూలనుకుంటున్నాను,'' అన్నాడు మనోహరుడు.
 
‘‘బావుంది. అయినా, ఎన్నాళ్ళని ఇలా అవస్థపడతావు. నీ భార్యను ఒకసారి పట్నం తీసుకురా. మంచి వైద్యుణ్ణి చూసి నిద్రలో నడిచే వ్యాధికి తగిన వైద్యం చేయిద్దాం,'' అన్నాడు జయంతుడు. అసలు సంగతి తెలుసుకున్న జయంతుడు, మరునాడు మిగిలిన మిత్రులను కలుసుకున్నప్పుడు సంగతి వివరించి, ‘‘మీరు విన్నది కామీనీ పిశాచం, మహాలక్ష్మి, లంకెబిందెల తాలూకు సవ్వడికాదు. మనోహరుడి భార్య కాలి గజ్జెల సవ్వడి. ఇంకా మూఢనమ్మకాలతో డబ్బు వృథా చేసి, ఆరోగ్యానికీ, మనశ్శాంతికీ దూరం కాకండి,'' అని సలహా ఇచ్చాడు.
 
గజ్జెల సవ్వడి అసలు రహస్యం తెలుసుకున్న ముగ్గురు మిత్రులు మొదట తమ అవివేకానికి తలలు వంచుకున్నారు. ఆ తరవాత ఒకరినొకరు చూస్తూ బిగ్గరగా నవ్వుకున్నారు.

No comments:

Post a Comment