Pages

Friday, September 14, 2012

ఎవరి బాధలు వారివి!


చిలకలపూడి జమీందారుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల్లో సుకుమారుడు, మనోహరుడు అనే ఇద్దరు యువకులుండేవారు. వారిద్దరిమధ్యా పరిచయం ఏర్పడి క్రమంగా మంచి స్నేహితులయ్యూరు. రోజూ సాయంత్రం వేళ గోవిందయ్య అనే తినుబండారాల వ్యాపారి దివాణం దగ్గరకు వచ్చేవాడు. చాలా మంది ఉద్యోగులు అతడి దగ్గర, అరిసెలు, లడ్లు, గారెల్లాంటివి కొని తినేవారు. సుకుమారుడు మాత్రం ఎన్నడూ కొనేవాడు కాదు.
 
మనోహరుడికి మాత్రం రోజూ కొనుక్కుని తినడం అలవాటు. మనోహరుడు తరుచూ, ‘‘నువ్వెప్పుడూ కొనవేంటి?'' అని సుకుమారుణ్ణి అడుగుతూండేవాడు. దానికి సుకుమారుడు, ‘‘ఉదయం కడుపునిండా తిని వస్తాను. మధ్యాహ్నం ఎలాగూ భోజనానికి వెళ్ళానుగదా. ఇంకేం తినగలను!'' అనేవాడు. ‘‘అలాగా, అదృష్టవంతుడివి! నీ భార్య ఉదయూనే లేచి వండిపెడుతున్నది. నా భార్య బారెడు పొద్దెక్కితేగాని లేవదు.
 
ఈ విషయమై మా మధ్య గొడవలు జరుగుతూంటాయి,'' అని చెప్పాడు మనోహరుడు. దానికి, ‘‘ఎవరిబాధలు వారివి!'' అంటూండేవాడు సుకుమారుడు. సుకుమారుడు ఇలా అన్నప్పుడల్లా, మనోహరుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలుగుతుండేది. ఒకనాడు సుకుమారుడు, మనోహరుడితో, ‘‘రేపు నా పుట్టిన రోజు. ఉదయం రా. ఇద్దరం ఫలహారం చేసి దివాణానికి బయల్దేరదాం,'' అన్నాడు. మర్నాడు మనోహరుడు, సుకుమారుడింటికి వచ్చాడు.
 
సుకుమారుడి భార్య ఎంతో మర్యాదగా మనోహరుణ్ణి కూర్చోమని, ‘‘ఫలహారం తెస్తాను,'' అంటూ, గారెలు, బూరెలు తెచ్చి, భర్తకూ అతడికీ వడ్డించింది. ఒక గారెను నోట్లో పెట్టుకున్న మనోహరుడు భయభ్రాంతుడై పోయూడు. ఇటుకముక్కలా వుండి నవలబోతే పళ్ళు జివ్వుమన్నాయి.
 
సుకుమారుడు మాత్రం తాపీగా వాటిని నవిలి చేతులుకడుక్కున్నాడు. ఇద్దరూ దివాణానికి బయలుదేరారు. దారిలో సుకుమారుడు, మనోహరుణ్ణి, ‘‘ఎలావుంది ఫలహారం?'' అని అడిగాడు. ‘‘నువ్వు తరుచూ, ‘ఎవరి బాధలు వారివి!' అని ఎందుకంటావో ఇప్పుడు అర్థమైంది!'' అన్నాడు మనోహరుడు ఉస్సురుమంటూ.

No comments:

Post a Comment