Pages

Friday, September 14, 2012

ఎవరికెంత ప్రాప్తమో...


కైతేపల్లి అనే గ్రామంలో వున్న గంగయ్య, రంగయ్యలు ఇరుగుపొరుగులు. భార్యలు చేసిన అప్పడాలు, ఒడియూలు పట్నంలో అమ్ముకొని రావడం వాళ్ళ వృత్తి. చాలీ చాలని ఆదాయం కారణంగా, వాళ్ళ భార్యలు ఎప్పుడూ అసంతృప్తిగా వుండేవాళ్ళు. ఒక రోజున గంగయ్య భార్య గౌరమ్మ, నులకమంచం మీద గుమ్మడి వడియూలు పెడుతూ, రంగయ్య భార్య రాజమ్మతో, ‘‘చూడు, ఇప్పుడే బతకడానికి కటకటగా వుంది.
 
రేపు మనకు పిల్లా జెల్లా పుడితే, ఈ చాలీ చాలని ఆదాయంతో ఇల్లు గడవడం ఎలా?'' అన్నది ఉస్సురుమంటూ. ‘‘అవును మరి. నాకూ అదే దిగులుగా ఉంది. మన మగవాళ్ళకు వేరే ఏదైనా మంచి ఉద్యోగం వుంటే తప్ప, లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందుల్లో పడతాం,'' అన్నది రంగయ్య భార్య. తరచూ వాళ్ళిద్దరి మధ్యా ఇలాంటి సంభాషణ జరుగుతూండేది.
 
ఈ పరిస్థితుల్లో, రాచూరి జమీందారు, మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళుతూ, ఆ రాత్రి గ్రామ శివార్లలో విడిది చేస్తారన్న వార్త తెలిసింది. వేకువ జామునే ఆయన ప్రయూణం కొనసాగిస్తారనీ, రాత్రి భోజనానికి ముందు ఆయన దర్శనం దొరుకుతుందనీ, గ్రామంలో చెప్పుకోసారు. ‘‘మన మగవాళ్ళు జమీందారు దర్శనం చేసుకుని, ఏదైనా ఉద్యోగం సంపాయించగలిగితే, మన కష్టాలు తీరిపోతాయి!'' అనుకున్నారు గౌరమ్మ, రాజమ్మలు.
 
ఇద్దరూ తమ తమ భర్తలతో, ‘‘రాత్రి మీరు జమీందారుగార్ని కలుసుకుని, దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాయించండి,'' అంటూ గట్టిగా చెప్పేశారు. ‘‘అప్పడాలు అమ్మడానికి పట్నం వెళ్ళి సాయంత్రానికి తిరిగిరాలేక పోతే, జమీందారు గార్ని దర్శించలేను.

అందువల్ల, ఈ రోజు పట్నం వెళ్ళను,'' అన్నాడు గంగయ్య భార్యతో. ‘‘గంగయ్య పట్నం రాడట! నేను మాత్రం వెళతాను. చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను,''అంటూ, అప్పడాల సంచీ నెత్తిన పెట్టుకుని బయల్దేరాడు రంగయ్య. రంగయ్య పట్నంలో సాయంత్రానికల్లా సంచీలోవున్న అప్పడాలు అమ్మేసి తిరుగు దారి పట్టాడు. త్వరగా గ్రామం చేరాలని అతడు అడవిలోని ఒక అడ్డదారిన నడుస్తూండగా, పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది.
 
దానితో పాటు చీకటి కమ్ముతూండడంతో, దూరంగా నక్కలా, ఇతర అడవి జంతువులా అరుపులు మొదలయినై. రంగయ్య భయంతో నలు దిక్కులూ చూసి, దారి పక్కన పాడుపడిన ఒక అమ్మవారి గుడి కనబడడంతో, గబగబా అక్కడికి చేరి, బయటినుంచే భక్తితో రెండు చేతులూ జోడించాడు. ఇంతలో, ‘‘రంగయ్యూ, బావున్నావా?'' అంటూ గుడిలోంచి, ఒక శ్రావ్యమైన కంఠస్వరం వినిపించింది. రంగయ్య నిర్ఘాంతపోయి, ‘‘నువ్వెవరివి, తల్లీ! ఈ గుడిలోని అమ్మవారి దేవతవా?'' అని అడిగాడు.
 
‘‘ఈ గుడిలో కొంత కాలంగా అమ్మవారు లేరు. నేను శిథిలావస్థలో వున్న గుడులూ, ఆలయూలూ సందర్శిస్తూ తిరిగే దేవతను. నీ భక్తిభావం నాకు సంతోషం కలిగించింది. నీకో వరం ఇవ్వదలిచాను, కోరుకో!'' అన్నది అదృశ్య దేవత. ‘‘నా మీద దయ చూపినందుకు, వెయ్యి దణ్ణాలు, తల్లీ! విష సర్పాలూ, భయంకరమైన అడవి మృగాల అరుపుల మధ్య, ఈ చీకట్లో చిక్కుకు పోయూను.
 
నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు,'' అన్నాడు రంగయ్య. ‘‘వెళ్ళిరా! నీకెలాంటి ప్రమాదం కలగదు,'' అన్నది అదృశ్యదేవత నవ్వుతూ. ఆ విధంగా క్షేమంగా ఇల్లు చేరాడు రంగయ్య. అంతలో గంగయ్య అక్కడికి వచ్చి, ‘‘మనం జమీందారును కలవాలి కదా! ఇంత ఆలస్యంగా వచ్చావేం? వేగిరం బయల్దేరు,'' అన్నాడు. అప్పుడు రంగయ్య, అడవిలో జరిగిందంతా చెప్పి, ‘‘ఇంకా ఆలస్యమై ఉండేది.

ఆ అదృశ్యదేవత వరం పుణ్యాన క్షేమంగా ఇల్లు చేరాను,'' అన్నాడు. ‘‘అలాగా!'' అంటూ భర్త గంగయ్య పక్కనే వున్న గౌరమ్మ తలవూపింది. పావు గంట తర్వాత రంగయ్యూ, గంగయ్యూ జమీందారును చూసేందుకు కదలబోతున్నంతలో ఆమె, పెద్దగా అరిచి, పక్కనేవున్న నులక మంచం మీద వాలి, విలవిలలాడిపోతూ, భర్తతో, ‘‘నన్ను వెంటనే పట్నం వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళక పోతే, నీకు దక్కను,'' అన్నది.
 
గంగయ్య కంగారుపడి పరుగున వెళ్ళి బాడుగ బండిని తీసుకువచ్చాడు. ఆయనా, రంగయ్యూ కలిసి గౌరమ్మను బండిలో పడుకోబెట్టారు. ‘‘నేను కూడా నీకు సాయంగావస్తాను, గంగయ్యూ!'' అన్నాడు రంగయ్య. ‘‘వద్దన్నయ్యూ! నువ్వు జమీందారుగారిని కలవాలిగదా,'' అన్నది గౌరమ్మ ఆయూసపడుతూ. తర్వాత, బండి అడవిని సమీపించగానే, గౌరమ్మ లేచి కూర్చున్నది. ఆమె బండివాడికి బాడుగయిచ్చి పంపేసింది.
 
ఇదంతా వింతగా చూస్తున్న గంగయ్య, ఆమెను, ‘‘ఇక్కడ దిగడం దేనికి? నీగుండె నొప్పి ఎలావుంది?'' అని అడిగాడు. ‘‘గుండెనొప్పీ లేదు, వల్లకాడూ లేదు!ఆ వెర్రిబాగుల రంగయ్య, అదృశ్యదేవతను పనికి మాలినవరం కోరాడు. అతగాడికి అంతే ప్రాప్తం మరి! చూస్తూండు, నేను మన జాత కాలు మార్చేస్తాను,'' అన్నది గౌరమ్మ ఎంతో ధీమాగా. 


వాళ్ళు పడుతూలేస్తూ, అమ్మవారి గుడిని చేరేసరికి అర్ధరాత్రి అయింది. గౌరమ్మ గుడి ముందు నిలబడి చేతులు జోడించి, ‘‘తల్లీ! కనబడని దేవతమ్మా! నాకూ ఒక వరం ఇవ్వు,'' అంటూ పెద్దగా గొంతెత్తి వేడుకున్నది. ‘‘నోరు విడిచి అడిగావు కదా, నీకూ వరంఇస్తాను,''అన్నది అదృశ్యదేవత నవ్వుతూ. ‘‘తల్లీ! నేను మనసులో ఏం అనుకుంటే అది జరిగిపోయే వరం ఇవ్వు,'' అన్నది గౌరమ్మ. ‘‘వరం ఇచ్చాను, ఇక వెళ్ళు! నేనూ మరొక గుడిని సందర్శించేందుకు వెళుతున్నాను,'' అన్నది అదృశ్యదేవత.
 
గౌరమ్మ ఆనందంతో పొంగిపోతూ, ‘‘ఈ కటిక చీకటిలో బుద్ధివున్నవాళ్ళెవరూ ఇంటి దాకా నడిచి వెళ్ళరు. దేవత ఇచ్చిన వరం వుందికదా!'' అని భర్తతో అంటూ, కళ్ళు మూసుకుని మనసులో, ‘‘మేం కళ్ళు మూసి తెరిచేలోపల మా ఇంటి ముందువుండాలి!'' అనుకున్నది. ఆ మరుక్షణం భార్యాభర్తలిద్దరూ, వాళ్ళ ఇంటి ముందున్నారు. ఆసరికే రంగయ్య, జమీందారును చూసి తిరిగి వచ్చాడు. ఉల్లాసంగా వున్న గౌరమ్మతో, ‘‘నాకు జమీందారు దివాణం ఉద్యోగం దొరికింది.
 
ఇంతకూ, నీ గుండెనొప్పి ఎలావుంది, చెల్లెమ్మా?'' అన్నాడు. ‘‘నా గుండెనొప్పి మాటకేంగాని నీకు జమీందారు దగ్గర బండచాకిరీ చేయూలని రాసి పెట్టివున్నది. మాకా ఖర్మ పట్టలేదు. నేను అదృశ్యదేవత నుంచి అద్భుత వరం సంపాయించాను,'' అన్నది గౌరమ్మ ఎంతో గొప్పగా. ‘‘అవునా! మరి, ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది.
 
ఇంతకూ నువ్వు దేవత నుంచి సంపాయించిన వరం ఏమిటీ?'' అని అడిగింది, పక్కనే వున్న రంగయ్య భార్య రాజమ్మ. ‘‘నేను మనసులో ఏమనుకుంటే, అది జరిగే వరం! ఇంతకు ముందు అడవిలో వున్న మేం, రెప్పపాటు కాలంలో, మా ఇంటి ముందువుండాలని కోరుకున్నాను. అనుకున్నది అక్షరాలా జరిగింది,'' అన్నది గౌరమ్మ ఆనందంగా.

గంగయ్య, భార్య ఆనందానికి అడ్డు పడుతూ, ‘‘కళ్ళు మూసి తెరిచేలోపల ఇంటి ముందుండాలి అని పనికిమాలినవరం కోరి, దేవత ఇచ్చిన వరాన్ని వృథా చేశావేమో అన్న అనుమానం, నాక్కలుగుతున్నది. ఇకపై నీ మనసులో అనుకున్నవేవీ జరక్కపోవచ్చు!'' అన్నాడు దిగులుగా. భర్త చెప్పిన దాంట్లో ఏదో వాస్తవంవున్నదనుకున్న గౌరమ్మ, ‘నిజంగానే ఇక వరం పని చేయదేమో! అనుకున్నవి జరగవేమో!' అని మనసులో ఆందోళన పడుతూ, పైకి మాత్రం బింకంగా, ‘‘చూడు, నా వర మహిమ! మన పెంకుటిల్లు పెద్ద భవంతి అయిపోవాలి,'' అని మనసులో ఒకటికి రెండు సార్లు అనుకున్నది.
 
ఐతే, పెంకుటిల్లు, పెంకుటిల్లుగానే వుండి పోయింది. భవంతిగా మారలేదు! దాంతో అందరికీ గౌరమ్మ చేసిన పొరబాటు తెలిసిపోయింది. మరునాడు రంగయ్య సామానులు సర్దుకుంటూ మిత్రుడితో, ‘‘గంగయ్యూ, రేపే మా ప్రయూణం,'' అన్నాడు. ‘‘వెళ్ళిరండి రంగయ్యూ. నిన్న రాత్రి నీతో వచ్చి జమీందారును కలుసుకుని ఉంటే, ఇప్పుడు నేను కూడా నీతో పాటు బయలుదేరేవాణ్ణి.
 
అయినా, నేను ఇక్కడే అవస్థలు పడాలని ఉన్నది. ఎవరికెంత ప్రాప్తమో ఎవరూ చెప్పలేరు కదా!'' అన్నాడు గంగయ్య. ‘‘ఎందుకలా బాధపడతావు గంగయ్యూ. నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక, పట్నంలో నీకొక కిరాణా దుకాణం ఏర్పాటు చేస్తాను. వ్యాపారం చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళిద్దరూ ఇన్నాళ్ళిక్కడ అక్కాచెల్లెళ్ళలా ఉన్నారు కదా, మీరూ మాతో రండి,'' అన్నాడు రంగయ్య. ఆ మాట వింటూ అక్కడికి వచ్చిన గౌరమ్మ, ‘‘అత్యాశకు పోయి వచ్చిన అవకాశం జార విడుచుకున్నాను.
 
అదృష్టంలో మిమ్మల్ని మించి పోవాలనుకున్న నాకు, అదృశ్యదేవత మంచి గుణపాఠం నేర్పింది. నీ మేలు ఈ జన్మకు మరిచిపోము అన్నయ్యూ,'' అన్నది. రంగయ్య మిత్రుడి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. గంగయ్యూ, గౌరమ్మలు రంగయ్య కేసి కృతజ్ఞతగా చూశారు.

No comments:

Post a Comment