Pages

Friday, September 14, 2012

పంజరం చిలుకలు


రామ్‌, శ్యామ్‌ స్నేహితులు. రామ్‌ ఒక రైతు; శ్యామ్‌ వ్యాపారి. ఒకసారి శ్యామ్‌కు వ్యాపారంలో అపార నష్టం ఏర్పడింది. వాటిల్లిన నష్టం భరించలేనంతగా బతుకును ఛిన్నాభిన్నం చేయడంతో, అతడు సాయూన్ని అర్థిస్తూ రామ్‌ దగ్గరికి వెళ్ళాడు. రామ్‌ ఏమాత్రం వెనుకాడకుండా తన పొలంలో కొంత భాగం శ్యామ్‌కు ఇచ్చాడు. శ్యామ్‌ పొలం దున్నుతూండగా, బంగారు ఆభరణాలుగల ఒక కంచు పాత్ర దొరికింది. అతడు ఆ పాత్రను తీసుకుపోయి, సంగతి చెప్పి రామ్‌కు ఇచ్చాడు. అయితే, దాన్ని పుచ్చుకోవడానికి రామ్‌ తిరస్కరించాడు. పొలం శ్యామ్‌కు ఇచ్చేయడంతో, అందులో దొరికినవి శ్యామ్‌కే చెందుతాయని చెప్పాడు. అందుకు శ్యామ్‌ ఒప్పుకోలేదు. ఇద్దరూ గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమకు న్యాయం చెప్పమన్నారు. గ్రామాధికారి మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశాడు.
 
ఆ రోజు రాత్రి రామ్‌ గ్రామాధికారిని కలుసుకుని, ‘‘నా స్నేహితుడు చాలా నిజాయితీపరుడు. ఎవరి సాయమూ తీసుకోడు. వ్యాపారంలో కోలుకోలేని నష్టం కలగడం వల్ల, నేనిచ్చిన పొలాన్ని అయిష్టంగానే పుచ్చుకున్నాడు. అయితే, ఆ పొలం అతనికి చాలదని నాకు అనిపించి, నా భార్య సుశీల, కూతురు సంగీత నగలను వారి సంపూర్ణ సమ్మతితో తీసుకుని, వాటిని శ్యామ్‌కిచ్చిన పొలంలో నేనే పాతి పెట్టాను. రేపు తమరు అతనికి అనుకూలంగా తీర్పుచెప్పాలి,'' అని వేడుకున్నాడు.
 
మరునాడు పొలం శ్యామ్‌ ఆధీనంలో ఉండడంవల్ల, అందులో దొరికిన నగలు శ్యామ్‌కే చెందుతాయని గ్రామాధికారి తీర్పు చెప్పాడు. శ్యామ్‌ అయిష్టంగానే తీర్పును అంగీకరించాడు. పొలంలో అరుదైన ఫలవృక్షాలు నాటితే లాభదాయకంగా ఉండగలదని నిర్ణయించాడు. శ్యామ్‌ కొడుకు ఆదిత్యను పిలిచి, నగలు ఇచ్చి, వాటిని అమ్మి ఆ సొమ్ముతో అరుదైన ఫలాల చెట్ల విత్తనాలను కొనుక్కురమ్మని చెప్పాడు. మరునాడు ఆదిత్య సమీపంలోవున్న పట్నం కేసి బయలుదేరాడు. దారిలో ఒకడు కొన్నిఅందమైన చిలుకలను ఒక పంజరంలో బంధించి అమ్మడానికి తీసుకు వెళ్ళడం చూశాడు.

అవి చాలా అరుదైన జాతి చిలుకలనీ, సంతలో వాటికి మంచి ధర పలకగలదనీ ఆ మనిషి చెప్పాడు. పంజరం లోపల అవస్థపడుతూన్న ఆ పక్షులకు చూస్తూంటే, ఆదిత్య మనసు విలవిలలాడింది. వాటికి స్వేచ్ఛ కలిగించాలనుకున్నాడు. తన దగ్గరవున్న నగలను ఇచ్చి, పక్షులను కొనాలనుకున్నాడు. అందుకు ఆ మనిషి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆదిత్య పంజరం తలుపు తెరిచి పక్షులను వదిలిపెట్టాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళడం చూసి అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
 
పక్షులకు స్వేచ్ఛ కలిగించినందుకు ఆనందించినప్పటికీ, తండ్రి చెప్పిపంపిన పని చేయలేక పోయూను కదా అని ఆదిత్య బాధ పడ్డాడు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. పట్నంలో ఏదైనా ఒక పని చూసుకుని, కొంత కాలం డబ్బు కూడబెట్టి, తండ్రి చెప్పిన విత్తనాలను తీసుకుని వెళ్ళాలని నిర్ణయించాడు. అతనికి ఒక ధనిక వర్తకుడి వద్ద మంచి ఉద్యోగం లభించింది. రెండేళ్ళపాటు కష్టపడి పనిచేసి అనుకున్న మొత్తాన్ని కూడ బెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు.
 
ఆ సమయంలో అతని తండ్రి తన స్నేహితుడు రామ్‌తో మాట్లాడుతున్నాడు. తన కొడుకును చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుని, ‘‘నీ ఉదాత్త చర్యతో మమ్మల్ని గర్వపడేలా చేశావు. నగలు పోయూయని బాధపడకు. మనం మొక్కలు కొనవలసిన అవసరం కూడా లేదు. నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల తరవాత అందమైన చిలుకలు గుంపుగా వచ్చి మన పొలంలో ఫలవృక్షాల విత్తనాలను తెచ్చి పడేశాయి. ఇప్పుడు మన పొలంలో ఫలవృక్షాలు పెరుగుతున్నాయి,'' అన్నాడు.
 
‘‘ఆహా! అద్భుతం. చిలుకలు నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేశాయన్న మాట,'' అన్నాడు ఆదిత్య. ‘‘మరో విషయం శ్యామ్‌, ఆదిత్య చేసిన ఉదాత్త చర్యను గురించి వినగానే, నా కూతురు అతని పట్ల అభిమానం పెంచుకున్నది. పెళ్ళాడాలనుకుంటున్నది. మీకూ, మీ అబ్బాయికీ అంగీకారమయితే మాకూ ఇష్టమే,'' అన్నాడు రామ్‌. ‘‘నీ కూతురును మా ఇంటి కోడలుగా చేసుకోవడం మాకూ సంతోషమే. ఏమంటావు ఆదిత్యా?'' అంటూ కొడుకుకేసి చూశాడు శ్యామ్‌ నవ్వుతూ. ఆదిత్య అంగీకార సూచకంగా తల ఊపాడు.

No comments:

Post a Comment