Pages

Friday, September 14, 2012

మంచిదొంగ


సుమేరు రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు కురవక కరువు ఏర్పడింది. ఆహార పదార్థాల కొరత ఏర్పడడంతో దొంగతనాలు ఎక్కువయ్యూయి. దొంగలను పట్టుకునే బాధ్యతను కేవలం రక్షకభటుల మీదనే ఉంచకుండా, ప్రజలలో ఎవరైనా దొంగలను పట్టుకుని అప్పగిస్తే వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని రాజు శ్రుతకీర్తి ప్రకటించాడు.
 
రాజు చాటింపు ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చింది. దొంగను పట్టుకుంటే బంగారు నాణాలు బహుమతిగా వస్తాయన్న ఆశతో పలువురు యువకులు రాత్రులలో గస్తీలు తిరగడం మొదలు పెట్టారు. దాంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి.
 
ఇలావుండగా ఒకనాటి రాత్రి హఠాత్తుగా నగరంలోని ప్రముఖ వర్తకుడు రత్నగుప్తుడి ఇంట్లో దొంగతనం జరిగింది. రక్షక భటులు దొంగ వెంటబడ్డారు. వాడు చాకచక్యంగా నగరం పొలిమేర చేరుకుని ఒక పూరింటి తలుపు తట్టాడు. అది యశోదమ్మ అనే పేదరాసి పెద్దమ్మ ఇల్లు. ఆమె బాటసారులకు భోజనాలు పెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుతో కాలం వెళ్ళబుచ్చుతోంది. యశోదమ్మ వచ్చి తలుపు తీసింది.
 
‘‘అవ్వా, నేను పనిమీద నగరం వెళుతున్నాను. సమయం మించిపోయింది. నాకు ఈ పూట భోజనం పెట్టి, ఈ రాత్రి ఆశ్రయం ఇస్తే పదివరహాలు ఇస్తాను,'' అన్నాడు దొంగ. యశోదమ్మ అందుకు ఒప్పుకుని వాడికి భోజనం పెట్టింది. ఆ ఇంట్లో ఆమెతో పాటు ఒక యువతి ఉండడం గమనించిన దొంగ, ‘‘అవ్వా, ఆ అమ్మాయి ఎవరు?'' అని అడిగాడు భోజనం ముగించి చేయి కడుక్కుంటూ.

‘‘నా మనవరాలు నాయనా. నా కూతురూ అల్లుడూ పడవ ప్రమాదంలో చచ్చిపోయూరు. ఇద్దరు మనవరాళ్ళు బతికి బయటపడ్డారు. పెద్దమ్మాయికి ఎలాగో పెళ్ళి చేయగలిగాను. ఈ చిన్నమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాలి. కరువు కారణంగా బాటసారుల రాకపోకలు బాగా తగ్గిపోయూయి. నా వ్యాపారం సరిగ్గా సాగడం లేదు. పిల్లకు పెళ్ళీడు దాటి పోతున్నది. ఏం చెయ్యూలో తెలియడం లేదు. నేనా పండుటాకునై పోయూను. ఎప్పుడు రాలిపోతానో తెలియదు,'' అన్నది యశోదమ్మ విచారంతో.
 
‘‘నీ మనవరాలి పెళ్ళికి ఎంత డబ్బు కావాలి అవ్వా?'' అని అడిగాడు దొంగ. ‘‘ఆర్చేవాడివా? తీర్చేవాడివా? ఆ వివరాలన్నీ నీకెందుకు?'' అన్నది ఆమె కాస్త విరక్తిగా. ‘‘ఆర్చేవాడినే, తీర్చేవాడినే,'' అంటూ దొంగ తన దగ్గరున్న నగలమూట విప్పిచూపాడు. ఆ నగలను చూసి దిమ్మెరపోయిన యశోదమ్మ, ‘‘ఎవరు నువ్వు? నిజం చెప్పు? నిన్ను చూస్తే వ్యాపారిలా లేవు. ఈ నగలను దొంగిలించావా?'' అని నిలదీసింది. ‘‘అవును, నా పేరు వీరన్న. ఈ నగలను ఒక వర్తకుడి ఇంటి నుంచి దొంగిలించుకుని వచ్చాను. నీకెన్ని కావాలో తీసుకుని నీ మనవరాలి పెళ్ళి హాయిగా జరిపించు,'' అన్నాడు వాడు.
 
‘‘ఛీ... నేను పేదదాన్నే కాని నీతిలేని దాన్ని కాను. దొంగసొమ్ముతో నా మనవరాలి పెళ్ళి చచ్చినా చెయ్యను. దానికి పెళ్ళి కాకపోయినా ఫరవాలేదు,'' అన్నది యశోదమ్మ కోపంతో ఊగిపోతూ. ‘‘సరే! నువ్వు నిజంగానే నీతీ నిజాయితీ ఉన్నదానివైతే, దొంగనైన నన్ను రాజుకు అప్పగించు. ఆయన వెయ్యి బంగారు నాణాలు నీకు బహుమతిగా ఇస్తాడు. వాటితో నీ మనవరాలి పెళ్ళి జరిపించు. నాకెందుకో నీకు సాయపడాలని ఉన్నది,'' అన్నాడు వీరన్న.
 
యశోదమ్మ కొంతసేపు మౌనంగా ఆలోచించి, వీరన్నను రాజుకు అప్పగించడానికి ఒప్పుకున్నది. మరునాడు యశోదమ్మ వీరన్నను వెంటబెట్టుకుని వెళ్ళి, వాణ్ణీ, చోరీ జరిగిన నగల మూటనూ రాజుకు అప్పగించింది. రాజు ఆజ్ఞకాగానే భటులు వీరన్న చేతికి సంకెళ్ళు తగిలించారు. రాజు వెంటనే వెయ్యి బంగారు నాణాలు తెప్పించి యశోదమ్మకు బహూకరించబోయూడు.

అయితే ఆమె, ‘‘మహారాజా! నాకీ బంగారు నాణాలు వద్దు. వేరొక బహుమతి కావాలి,'' అన్నది. ‘‘ఏమిటది?'' అని అడిగాడు రాజు. ‘‘ప్రభూ! దొంగతనం చేసిన వీరన్నను క్షమించి విడుదల చెయ్యండి. అదే నేను కోరే బహుమతి!'' అన్నది యశోదమ్మ. ‘‘దొంగను క్షమించి వదలడమా? వాణ్ణి విడుదల చేయడం వల్ల నీకేంలాభం?'' అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ‘‘వీరన్న దొంగే అయినా మంచివాడు. నేను అతణ్ణి పట్టి ఇవ్వలేదు. తనంతట తానే లొంగిపోయూడు.
 
అతడు జాలిగుండెకలవాడు,'' అంటూ తన ఇంట్లో రాత్రి జరిగిన సంభాషణను వివరించింది యశోదమ్మ. రాజు ఆమె చెప్పినది నిజమేనని గ్రహించాడు. లేకుంటే యువకుడైన వీరన్నను ముసలమ్మ వెంటబెట్టుకురావడం సాధ్యం అయ్యేపని కాదు. రాజు వీరన్న కేసి తిరిగి, ‘‘ఆమె కోరిక ప్రకారం నిన్నిప్పుడు వదిలిపెడితే, మళ్ళీ దొంగతనాలు చేయవని నమ్మకం ఏమిటి?'' అని అడిగాడు. ‘‘నేను మరో మార్గంలేక వర్తకుడి ఇంట్లో నగలను దొంగిలించాను. కాని కష్టాల్లో ఉన్న ఆ అవ్వను ఆదుకోవడం సాటి మనిషిగా నా బాధ్యత అనిపించింది.
 
అందుకే ఈ నిర్ణయూనికి వచ్చాను. బతకడానికి మరేదైనా మార్గం ఉంటే దొంగతనం చెయ్యవలసిన అవసరమే నాకు ఉండదు,'' అన్నాడు వీరన్న. ‘‘అతడు సరేనంటే అతనికే నా మనవరాలినిచ్చి పెళ్ళిచేస్తాను. నా దగ్గరే వుండి కష్టపడి బతుకుతాడు గనక, దొంగతనాల జోలికి పోడు ప్రభూ!'' అన్నది యశోదమ్మ.
 
రాజు వీరన్నతో, ‘‘నీలోని దయూగుణం చూసి నిన్ను క్షమించి వదిలి పెడుతున్నాను. సత్ప్రవర్తనతో మెప్పించావంటే భటుడి ఉద్యోగం ఇస్తాను,'' అని చెప్పి ముసలమ్మ కేసి తిరిగి, ‘‘ఇంత మంచి దొంగను పట్టి తెచ్చి అప్పగించినందుకు నీకు వెయ్యినాణాలు బహుమతి ఇచ్చి తీరాలి,'' అంటూ నాణాల మూటను అందించాడు.

No comments:

Post a Comment