Pages

Monday, August 13, 2012

దొంగపిల్లి

భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరధ్గవమనే ముసలి గ్రద్ధ ఉండేది. ఆ గ్రద్ధకు కళ్ళు కనిపించవు అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహరంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయ్యింది అనుకొని 'అయ్యా ! నా పేరు దీర్ఘకర్ణము నేను పిల్లిని' అని చెప్పింది. వెంటనే జరధ్గవము...' నీవు పిల్లివా! ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలను తీస్తాను' అంటూ హెచ్చరించింది.

అయ్యా! కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లిజాతి అయినా నాకూ ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను. పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని, మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంది. దీర్ఘకర్ణుడి మాటలకి జరధ్గవము సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు అయ్యాయి. ప్రతిరోజూ దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరధ్గవము దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి.

చెట్టుపై నున్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసి కట్టుగావచ్చి జరధ్గవమును తమ పిల్లలు మాయం అయపోతున్నాయి అన్న విషయం అడిగాయి. జరధ్గవము తంకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరధ్గవము తొర్ర లోపలకు వెళ్ళి చూసాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు, బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవము తొర్రలో తెలివిగా పడేసినవి.

పక్షులన్నీ జరద్గవమే తమ పిల్లలను చంపి తింటోందని అనుకుని ఆ ముసలి గ్రద్ధను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి చంపాయి. అయ్యా! పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలు నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది నాకు. అనిగ్రద్ధ ప్రాణాలు విడిచింది.

చూసారా! పూట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్ధకు ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్ళు చెప్పీ మాటలను మనం నమ్మరాదు. నమ్మితే జరద్గవములా మనం కూడా చిక్కుల్లో పడతాం.       

No comments:

Post a Comment