Pages

Saturday, June 15, 2013

ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవచనాలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. "వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.

రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.

మా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి "పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.

ఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత "కథ అంతా పుక్కిటి పురాణం" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు.

No comments:

Post a Comment