Pages

Tuesday, September 3, 2013

దేశమును ప్రేమించుమన్న

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !

పాడిపంటలుపొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !

ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకులు నమ్మవెలె నోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !

వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్ !

పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !

దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్ల లోయి !

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !

మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి !

దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలె నోయి !

ఆకులందున అణగి మణగీ
కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి !

No comments:

Post a Comment