భీమిరెడ్డి సన్నకారు రైతైనా
ఉన్న ఆ అయిదెకారాల పొలం మెట్టకావడం వల్ల, ప్రతిసంవత్సరం వర్షాల మీద
ఆధారపడి నిత్యం కనిపించని దేవునికి మొక్కుకోవడమే. తిండికీ, బట్టకీ కరువు
లేకుండా పరువుకూ ప్రతిష్ఠకూ అరువులేకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా
ఎన్నాళ్లు కష్టంగా బతుకు వెళ్లదీసుకురావాలని ఆలోచించిన కొద్దీ
అప్పోసొప్పోజేసి మెట్టపొలాన్ని మడికట్టుగా మార్చాలన్న తపన ఎక్కువయ్యింది.
అప్పుజేయడానికి పరువు అడ్డొచ్చింది. అలా మెట్టని మడికట్టుగా మార్చాలన్న
అతని పంతం ముందు భార్య మహాలక్ష్మి మెడలోని నాలుగు తులాల కెంపులనెక్లెస్సు,
మూడుతులాల రెండుమాసాలన్నర ఉండే పుస్తెలతాడు, చివరాకరికి తాను ఎంతో ఇష్టపడి
చేయించుకున్న రెండుతులాలన్నర నల్లపూసలదండకూడా హరించుకుపోయాయి.
కూతురు వైష్ణవి
పెళ్లీడుకొచ్చింది. అప్పోసొప్పో జేసి పిల్లపెళ్లి జేయాల్సింది పోయి.
మడికట్టు కట్టాలని పంతం బట్టి కూర్చున్న భీమిరెడ్డి ప్రవర్తన గ్రామస్తులకు,
బంధుమిత్రులకే కాదు చివరాకరికి కట్టుకున్న పెళ్లాం మహాలక్ష్మికి కూడా
విచిత్రంగా అనిపించింది. బోరువేసి అందులో నీళ్లు వచ్చినంత మాత్రాన
భీమిరెడ్డి పంటపండేయదు. దానికి కరెంటులైను, మోటారు, పైపులు వగైరావగైరా
ఖర్చులుంటాయి. మెట్టపొలాన్ని మడికట్టుగా మార్చాలన్నా ఎంతో ఖర్చుతో
కూడుకున్నపని. అందరూ భీమిరెడ్డికి మతిచెడిందని అంటుంటే వెనకేసుకొచ్చిన
మహాలక్ష్మి చివరకు “నిజంగానే ఈయనకు మతి చెడలేదు కదా!” అనుకుంది. అదీ తనకు
ఎంతో ఇష్టమైన నల్లపూసల దండను బలిపెట్టినప్పుడు కూడా బోరులో
నీళ్లుపడకపోవడంతో బోరుమన్న మహాలక్ష్మితో ఆ రోజు రాత్రి ఇంకో బోరువేసి
చూద్దామని పంతంగా భీమిరెడ్డి అన్నప్పుడు అలా అనుకోక తప్పింది కాదు. అదే మాట
దైర్యం చేసి భీమిరెడ్డితో కూడా అన్నది. ‘పంతొమ్మిదేళ్ళ దాంపత్యంలో ఏనాడు
అనుమానించని మహాలక్ష్మీ తననలా అనుమానించడంలో తప్పులేదు. కానీ ఆమే అర్థం
చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. తమకున్న కష్టాల్లోంచి గట్టెక్కే
మార్గం ఏది’. ఆ రాత్రల్లా జాగారం చేసి, చేయించి చివరాకరకు
తెల్లతెల్లవారుతుండగా ఒప్పించగలిగాడు.
“అయితే మనకు అప్పుచేయక తప్పదన
మాట” అన్నది భీమిరెడ్డికి ఛాయ్ ఇస్తూ. పరధ్యానంగా ఎటో చూస్తూ ఛాయ్
అందుకుంటూ “తప్పదు లక్ష్మీ” అన్నాడు భీమిరెడ్డి ముక్తసరిగా.
అదే రోజు అన్న పరంధాములురెడ్డి
దగ్గరకెళ్లి పదియేనువేల రూపాయలు తీసుకువచ్చింది. అన్న పరంధాములురెడ్డిది
ప్రక్కనున్న గ్రామం ఇక్కారెడ్డిగూడెం. చెన్ వెళ్లికి ఇక్కారెడ్డి గూడేనికి
కిలోమీటరున్నర దూరం మాత్రమే. అన్న పరంధాములురెడ్డి కూడా వ్యవసాయదారుడే
అయినప్పటికీ మడికట్టుపొలాలలో ఎప్పటినుంచో వ్యవసాయం చేసి పంటదిగుబడులు
కాస్తంతా ఎక్కువ సాధించడం వల్ల చుట్టుపట్ల గ్రామాలలో పలుకుబడి ఎక్కువగానే
ఉంది. చెల్లెలు అడిగిన కొద్దిసేపట్లోనే పదియేను వేలరూపాయల
అప్పుపుట్టించగలిగినా “బావగారు ఇలా చేయడం నాకే మాత్రము ఇష్టం లేదమ్మా” అంటూ
చిన్నగా చివాట్లు వేసారు. మరుసటిరోజే బోరు బండిని తెప్పించి ఈసారి ఏ
జ్యువాలజిస్టును, ఏ మంత్రాగాణ్ణి సంప్రదించకుండానే తానే స్వయంగా ఒక స్థలం
చూపించి బోరు వెయ్యమంది మహాలక్ష్మి. ‘మొగడితో పాటు ఈమెకు మతిపోలేదు కదా’
అని జనాలు చెవులుకొరుక్కున్నారు. మొత్తం మీద మహాలక్ష్మి వేదన దేవుడు
విన్నాడో, ఆ గంగమ్మకే కరుణపుట్టిందో తెలియదు గానీ… మొత్తం మీద మూడువందల
యాభైయారు ఫీట్లలోతులో నీళ్ళు పడ్డాయి. అది గుడ్డిలో మెల్లలా రెండున్నర
ఇంచుల నీళ్ళు. “ఆ మాత్రమన్న చాలు మమ్మల్ని దేవుడు కరుణించాడు” అనుకున్నారు
భార్యభర్తలిద్దరూ. నీళ్లు పడ్డంతమాత్రాన పంటపండేయదు కదా. ఇతరత్రా ఖర్చులు,
మడులు కట్టడాలు కలిసి తడిసి మోపెడై మొత్తం మీద లక్షాపదియేను వేల
లెక్కతేలింది. అదీ పరంధాములురెడ్డిగారి పరపతి మీద మూడురూపాయల ధర్మవడ్డికి. ఆ
సంవత్సరం టమాట పంటమీద ఖర్చులు పోను యాభై వేల రూపాయలు వచ్చాయి. అసలు కొంత,
వడ్డికొంత చెల్లిద్దామంటే వల్లకాదన్నాడు సేటు. వడ్డి చెల్లించండి. మొత్తం
అసలు చెల్లించగలిగితేనే అసలు జోలికి వెళ్లండని తిరకాసు పెట్టడంతో ‘అబ్బాయి
రుత్విక్ రెడ్డి చదువులకు, ఇతరత్రా ఇంటి ఖర్చులు, వ్యవసాయఖర్చులకు డబ్బు
ఎలాగు అవసరం కదా!’ అని ఆలోచించి కేవలంలో ఇరవై వేలు మాత్రం చెల్లించి నోటు
తిరగ రాయించుకున్నారు. అలా తిరగరాయించుకున్న నోటు అసలు, వడ్డి కలిపి
ఒకలక్షా యాభైయారువేల నాలుగు వందలు కాగా చెల్లుపెట్టిన ఇరవై వేలు పోను ఒక
లక్షా ముప్ఫైయారువేల నాలుగు వందలకు కొత్త నోటు తయారైంది. వైష్ణవి పెద్దది
కాగా, రుత్విక్ రెడ్డి చిన్నవాడు. ఇప్పుడు వైష్ణవికి పద్ధెనిమిది యేళ్లు
ఉంటాయనుకుంటే సరిగ్గా రెండు సంవత్సరాలు చిన్న అయిన రుత్విక్ కు పదహారు
యేండ్లు ఉంటాయి.
‘మహాలక్ష్మీ!… మనకు బోరులో
నీళ్లయితే పడనీ నీకు మునుపున్న ఆభరణాలతో పాటు కొత్తవికూడా చేయిస్తాన’ని ఆ
రోజు రాత్రి ఊరించాడు. ‘తనకు వేసుకోవడానికి కొత్తవి లేకున్నా సరే
తనకూతురికి మంచి సంబంధం దొరికి పెళ్లైతే చాలుననుకుంది మహాలక్ష్మి.
‘తానారోజు ఊహించినట్టే బోరులో నీళ్ళు పడ్డాయి. తన భర్తకలగన్నట్టే మడికట్టు
తయారైంది. మరి జీవితాలలో మార్పింకారాదేం’. ఈ మధ్య మహాలక్ష్మిని
తొలుస్తున్న ప్రశ్న ఇదే. మొత్తం మీద రాత్రనక, పగలనక కష్టం చేస్తే
రెండుసంవత్సరాలకి గానీ బోరుకు చేసిన అప్పుతేరి పోయినట్టయ్యింది. ఇంకా
అక్కడక్కడా కొన్ని చిల్లర అప్పులు అలాగే మిగిలి ఉన్నాయి. మహాలక్ష్మికి
ఇప్పటికీ ఇదంతా ఒక కలలా ఉంది. మెట్టపొలంతో వ్యవసాయం చేసినప్పుడు,
మడికట్టుకట్టి వ్యవసాయం చేస్తున్నప్పుడు తమ జీవితాలలో ఎటువంటి
మార్పురాలేదు. కానీ ఏదో కాస్తంతా కొత్తమార్పు మాత్రం వచ్చినట్టు
అనిపిస్తుంది. పుట్టింటివారు కూడా మునుపటిలాగా ఇప్పుడు సౌకర్యవంతమైన జీవితం
గడపడం లేదు. తరచి చూస్తే ఈ రెండేళ్లలో ఎంతో మార్పు వచ్చినట్టుంది.
మునుపటిలా కూరగాయల మండిలోని సేట్లు రైతులకు పెద్దమొత్తంలో అప్పులు ఇవ్వడం
లేదు. డిమాండ్ ఉన్నప్పుడు బెంగళూరు, మహారాష్ట్ర తదిరప్రాంతాల నుండి లారీల
మీద సరుకులు తెప్పించుకోవడం వల్లనైతేమి, కొత్త కొత్తవంగడాలు మార్కెట్టలోకి
రావడం వల్లనైతేమి మడికట్టు రైతులకు కూడా మెట్టరైతులకు వలె పెద్దగా
గిట్టుబాటు జరగడం లేదు. బోరులో నీళ్లపడితే తమదశనే తిరిగిపోతుందని కలలుగన్న
మహాలక్ష్మికి భూమి గుండ్రంగా ఉంటుందన్న కఠోర సత్యం తెలిసొచ్చింది. వైష్ణవి
పెళ్ళీడు దాటుతుందని అందరూ హెచ్చరిస్తున్నారు.
ఎంతో పంట పండినట్టు అనిపిస్తున్నా దమ్మిడీ కూడా కూడ బెట్టలేక పోతున్నారు. మహాలక్ష్మి మెడలోంచి హరించుకుపోయిన బంగారం తిరిగి సమకూరలేదు సరికదా. పిల్లపెళ్లికైనా మాసం తాసం అన్నా కూడబెట్టలేక పోయారు. చివరాకరికి ఒక మంచి సంబంధం దొరికిందని, పిల్లాడు మెడికల్ కంపెనీలో సెల్స్ రిప్రజెంటివ్ గా చేస్తాడని కనీసం ఇరవైతులాల బంగారం, పెట్టిపోతలు, లాంఛనాలు, ఆడపిల్లకట్నాలనీ అవన్నీ, ఇవన్నీ ఖర్చుచేసి చివరాకరుకు చూసుకుంటే పన్నెండు లక్షలపైనే అప్పయికూర్చుంది. ‘మెట్టను మడికట్టుగా మార్చి రెండుసంవత్సరాలు అవుతున్న దాదాపు దాని అప్పేతీర్చలేక పోయాము పైగా నాదగ్గరున్న బంగారం అంతా హరించుకుపోయింది. ఇప్పుడీ పిల్ల అప్పెలా తీర్చాలిరా భగవంతుడా’ అని తలపట్టుకు కూర్చుంది మహాలక్ష్మి.
ఎంతో పంట పండినట్టు అనిపిస్తున్నా దమ్మిడీ కూడా కూడ బెట్టలేక పోతున్నారు. మహాలక్ష్మి మెడలోంచి హరించుకుపోయిన బంగారం తిరిగి సమకూరలేదు సరికదా. పిల్లపెళ్లికైనా మాసం తాసం అన్నా కూడబెట్టలేక పోయారు. చివరాకరికి ఒక మంచి సంబంధం దొరికిందని, పిల్లాడు మెడికల్ కంపెనీలో సెల్స్ రిప్రజెంటివ్ గా చేస్తాడని కనీసం ఇరవైతులాల బంగారం, పెట్టిపోతలు, లాంఛనాలు, ఆడపిల్లకట్నాలనీ అవన్నీ, ఇవన్నీ ఖర్చుచేసి చివరాకరుకు చూసుకుంటే పన్నెండు లక్షలపైనే అప్పయికూర్చుంది. ‘మెట్టను మడికట్టుగా మార్చి రెండుసంవత్సరాలు అవుతున్న దాదాపు దాని అప్పేతీర్చలేక పోయాము పైగా నాదగ్గరున్న బంగారం అంతా హరించుకుపోయింది. ఇప్పుడీ పిల్ల అప్పెలా తీర్చాలిరా భగవంతుడా’ అని తలపట్టుకు కూర్చుంది మహాలక్ష్మి.
“కాస్తోకూస్తో అన్ని వృత్తులు
బాగుపడుతున్నాయి, అన్నికులాలు బాగుపడుతున్నాయి. మన వృత్తి, మనకులం
బాగుపడడంలేదు నాన్న. బహుశా మనం వ్యవసాయం చేసేతీరు, ఆడంబరాలకు పోయి సంబరాలు
చేసుకునే తీరు మార్చుకోవాలేమో!” అంటున్న రుత్విక్ రెడ్డి మాటలు
మహాలక్ష్మిని, భీమిరెడ్డిని దీర్ఘాలోచనలో పడేసాయి.
No comments:
Post a Comment