Pages

Sunday, August 30, 2015

సువర్ణ సాహసం :-

అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు.
ఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.అయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్తుకెళ్లిపోయిన తమ కొడుకును గురించే బాధపడుతూ ఉండేవారు. సువర్ణకూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది.
అలా వెళ్ళిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దు:ఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్లవ్వ ఇంట ఆగి, అక్కడి విశేషాలను కనుక్కున్నది: "ఒక రాక్షసుడు ఏరోజుకారోజు అక్కడి పిల్లలను ఎత్తుకు పోతున్నాడు. నగరమంతా హాహాకారాలు అలుముకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు."
"అయితే నేను వెళ్లి వాడి పనిపడతా"నన్నది సువర్ణ.
"నీకెందుకమ్మా? అదీకాక ఆడపిల్లవు. నీ వల్ల ఏమి అవుతుంది?. మా మహారాజే ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా!" అంది అవ్వ. కానీ సువర్ణ తన పట్టు విడువలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడునాడంటున్న అడవిలోకే పోయింది. కానీ ఎంత వెతికినా రాకాసి జాడ లేదు.
అలసిన సువర్ణ ఒక చెట్టుకిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి ఆమెకు. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరునూ ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి, పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి, ఏదైనా సహాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ.
"ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడకాదు. వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూతా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూతా కొరివిదెయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్లాలంటే ముందుగా ఆ కనబడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకుగాను నేను ఈ పాదరక్షలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దెయ్యాలకు కనిపించవు. ఆ దెయ్యాలను దాటిన తరువాత నువ్వు గుహకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణిని ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు" అని పాదరక్షల్నీ, మణినీ సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని, పాముకు కృజ్ఞతలు చెప్పి అక్కడినుండి గుహవైపుకు బయలుదేరింది.
గుహను చేరుకొని, ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దెయ్యాలకు కనిపించలేదు. ఆపైన ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు- ఆమె మెడలోని మణిప్రభావం చేతనే!
అలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప, అక్కడ జనసంచారమనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలాసేపటికి ఒక పండుముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ "అమ్మా పాపా! ఇంత వరకూ తమంతట తాముగా ఇక్కడికి ఏ నరపురుగూ రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీచేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తోస్తున్నది. ముందుజాగ్రత్తగా నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటిదాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు" అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది.
కోట లోపలచూస్తే ఒక్కరు తక్కువగా పదివేలమంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్నపిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆరోజు సాయంత్రం రాక్షసుడు వచ్చీరాగానే అవ్వను "పదివేలమందీ పూర్తయ్యారా?" అని అడిగాడు. "అయ్యార"న్నది అవ్వ. "అయితే బలికి అన్నీ సిద్దం చేయమన్నాడు రాకాసి. అవ్వ అన్నీ సిధ్ధంచేసి, మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది.
రాక్షసుడు సురర్ణను చూసి వికవికా నవ్వాడు. "పాపా, నువ్వు స్వర్గం చేరుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాతకు మోకరిల్లు" అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని.
సువర్ణ రెండు చేతులూ జోడించి అమ్మకు మొక్కింది. "అలాకాదు పాపా, వంగి, నేలబారుగా పడుకొని నమస్కరించాలి" అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. "నాకు తెలియదు, నువ్వే చేసి చూపించు" అన్నది సువర్ణ. "అయ్యో! ఆ మాత్రం తెలీదా, ఇలా పడుకొని, ఇలా మొక్కాలి" అని రాక్షసుడు నేలబారున పడుకోగానే, ప్రక్కనున్న కత్తిని తీసుకొని, సువర్ణ ఒక్కవేటుతో అతని శిరస్సును ఖండించివేసింది.
రాక్షసుడు చనిపోగానే, అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన పదివేలమంది పిల్లలకూ వాళ్ల వాళ్ల రూపాలు లభించాయి. అవ్వకుకూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి! అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావులకు వారు చేరుకున్నారు.
ఆ పిల్లల్లోనే ఒకడు, రవివర్మ! అలా అనుకోకుండా తన అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకూ వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దానధర్మాలు చేసి, ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు.

నేను కొనబోయే ఆవు కథ : -

పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.
భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని.
భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని.
మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: " ఏం కొనుక్కొచ్చావు?" అని."ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!" అన్నది భార్య.
"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌" అడిగాడు భర్త.
"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌" అన్నది భార్య.
"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.
ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని.
"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.
ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని.
" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త.
"మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్.
"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!"
"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్.
భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని.
"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.
"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.
"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్.
"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?"
"నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి.
పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు.

గుర్తింపు

చంటి వాళ్ళ మావయ్య దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎంతో మంది పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెళ్ళ వాళ్ళు వస్తున్నారు. చాలా ప్రశ్నలు వేసి, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా సహజమే మరి, మావయ్య తీసిన పక్షుల ఫోటోకి జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి వచ్చింది!
విలేఖర్లడిగే ప్రశ్నలన్నింటికీ మావయ్య చిరునవ్వుతో సమాధానాలు చెప్తున్నాడు. "మీ ఈ ఛాయాగ్రహణ విద్యకు వారసులెవరైనా ఉన్నారా" అని ఒకరడిగిన ప్రశ్నకి, మావయ్య తనను ఒళ్ళోకి తీసుకుంటూ- "ఏం చంటీ, నువ్వు కూడా నాలాగే ఫోటోగ్రాఫర్ అవుతావు కదూ" అని అడిగాడు. చంటిగాడికి ఆ పక్షుల ఫోటో తీసిన రోజు గుర్తుకొస్తోంది:
మావయ్య ఫోటోలు తీయడానికని దగ్గర్లో ఉన్న చిట్టడవికి వెళ్తూ కేమెరాలు, లెన్సులూ సర్దుకుంటుంటే ఎప్పటిలాగానే తనూ వస్తానన్నాడు. అడవుల్లో తిరుగుతూ అక్కడి పక్షుల్నీ, జంతువుల్నీ కళ్ళారా చూడటం భలే మజాగా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది గానీ, మావయ్య పక్కనే ఉంటాడుగా. ముక్కాలిస్టాండు మీద పెద్ద పెద్ద కేమెరాలు బిగించి, క్షణంలో మాయమైపోయే జంతువుల ఫొటోలు తీసే మావయ్య హీరోలా కనిపిస్తూ ఉంటాడు తన కళ్ళకి. పెద్దయ్యాక తను కూడా మంచి ఫోటోలు తీస్తానని చాలా సార్లు అనుకున్నాడు కూడా.
ఆ రోజు మావయ్య ముందుగానే పక్షుల ఫోటో తీద్దామని నిర్ణయించుకున్నట్లున్నాడు, ఒక గుబురు చెట్టు మీద పెద్ద పక్షి గూడు కనిపించగానే ఆగిపోయాడు. గూటిలోంచి అప్పుడప్పుడు చిన్నగా 'కూకూ' శబ్దాలొస్తున్నాయి. పక్షి పిల్లలు మాత్రమే ఉన్నాయనుకుంటా- 'వాళ్ళమ్మ, నాన్న పిల్లలకి ఆహారం తేవడానికి వెళ్ళుంటాయి; అవి కూడా వచ్చాక, అన్నింటికీ కలిపి ఫోటో తీయాలి' అన్నాడు మావయ్య.కేమెరాని సిద్ధం చేసుకుని వాటి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఇద్దరూ. ఎర్రని ముక్కులతో తెల్లగా ఉన్న పక్షిపిల్లల తలలు మాత్రం కనిపిస్తున్నాయి తనకు అప్పుడప్పుడూ. ఎంత ముద్దుగా ఉన్నాయో అవి! మావయ్య దృష్టి మాత్రం వాటి అమ్మానాన్నల మీదే ఉన్నట్లుంది. కానీ అవి ఎంతకీ రాలేదు.
సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు. ఎండ బాగా పెరిగిపోయింది. తెచ్చుకున్న బిస్కట్లు, మంచి నీళ్ళు అయిపోవచ్చాయి.
ఇక ఉండబట్టలేక మావయ్య "పెద్ద పక్షులు కూడా ఇక్కడికి దగ్గర్లోనే తిరుగుతూ ఉండి ఉంటాయి, నువ్వెళ్ళి ఈ కర్రని ఆ గూడుకి తాకించడానికి ప్రయత్నించు" అని ఒక పొడుగాటి కర్రని తనకిచ్చాడు. మావయ్య చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు కానీ, తన కన్నా ఓ మూడు రెట్లు పొడుగున్న ఆ కర్రని పట్టుకుని పక్షి గూడు కింద ఎగరడం మొదలుపెట్టాడు తను- కర్ర ఆ గూటికి తగలకుండా జాగ్రత్త పడుతూనే. మావయ్యేమో కేమెరా ఫోకస్ చేసుకుని, ఫోటోలు తీసుకుంటూనే, "ఇంకొంచెం చంటీ ఇంకాస్త ఎత్తుకి ఎగరాలి" అంటూ తనను ప్రోత్సహించాడు.
అయితే అలసట వల్ల తన చెయ్యి పట్టు తప్పింది! తన చేతిలోని కర్ర వెళ్ళి పక్షిపిల్లల గూటి కింద తగిలింది. పిల్లలేమౌతాయో అన్న బాధతో, భయంతో తను కళ్ళు తిరిగి పడిపోవటం, ఎక్కడినుంచో పెద్ద పక్షులు తమ పిల్లల్ని రక్షించుకోటానికి రావడం ఒక్కసారే జరిగిపోయాయి.
తరువాత మావయ్య నన్ను తెగ మెచ్చుకున్నాడు, "నాక్కావల్సినట్లు ఫోటో వచ్చిందిరా, ఒక అద్భుతమైన ఫోటో తీయడానికి సాయం చేసావు" అంటూ. కొంచెం చెదిరిన గూడు, దానిలోపల, తమ చిన్ని చిన్ని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భయంతో పక్షిపిల్లలు, తమ రెక్కలతో గూడును పడిపోకుండా పట్టుకుని, వాత్సల్యంతో పిల్లలవంకే చూస్తున్న రెండు పెద్ద పక్షులు - ఇదీ ఆ "అద్భుతమైన" ఫోటోలోని దృశ్యం. మావయ్యకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందికూడా ఆ ఫోటో వల్లనే!
ఆ రోజు గుర్తుకు రాగానే ఎనిమిదేళ్ళ చంటిగాడు మావయ్య చేతుల్ని విదిలించుకుంటూ చెప్పేశాడు - "నీలాంటి ఫోటోగ్రాఫర్ని మాత్రం నేనెప్పటికీ కాను" అని. ఆ పెద్ద పక్షులు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే, ఆ చిన్ని పక్షి పిల్లలు తన మూలంగా చనిపోయేవన్న నిజాన్ని మర్చిపోవడానికి వాడికి నెల రోజులు పట్టింది మరి!

బావురు పిల్లి

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుమంది భార్యలు. పిల్లలు కలగక పోవడం చేత ఆయన ఏడు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తరువాత చివరి భార్య గర్భవతి అయ్యింది. "ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు. ఎలాగైనా చివరామెను బయటకి వెళ్ళగొట్టాలి" అనుకున్నారు మిగిలిన భార్యలు.
ఒకనాడు రాజు వేటకని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి, పెళ్లాలందరూ కలసి ఇద్దరు నమ్మకస్తులైన భటులను పిలిచారు. వాళ్ళకు చాలా ధనమిచ్చి, "చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి, ఆమె కన్నులు పీక్కురమ్మ"ని చెప్పి పంపారు. ధనాశచేత ఆ భటులు, చిన్న రాణిని తీసుకుపోయి, ఆమె కన్నులు పీక్కొని, చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు.

వేట ముగించుకొని తిరిగొచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో నాలుగు మాయ మాటలు చెప్పి నమ్మించారు.
ఇక అడవిలో పడ్డ ఆరాణి పాపం, కళ్లు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చీ ఏడ్చీ అలిసిపోయి, ఒక చేనులో కందిచెట్టు కింద కూర్చొని మూర్ఛపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి, చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కానీ పురిట్లోనే ఆ రాణి చనిపోయింది!

అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురుపిల్లి పిల్లవాడి ఏడ్పులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకొనిపోయి, బాగా పెంచుకున్నది. ప్రతిరోజూ అది ఊరి లోనికి వెళ్లి, ఆహారం సంపాదించి, దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు.
ఒకనాడు ఆ పిల్లవాడు బావురుపిల్లితో " ఈరోజు ఊళ్లోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో"అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంతచెప్పినా వినకుండా అబ్బాయి, "ఊళ్లోకి నేనే వెళతా" అని మొండిపట్టు పట్టాడు. చేసేదిలేక `సరే' అని ఒప్పుకుంది పిల్లి. వెళ్లేముందు "నాయనా! ఎటువైపుకైనా పో, కానీ, దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన మూడు దిక్కులలో ఎటువైపుకైనా సరే పో. పోయి వాళ్ల ఇండ్లవద్ద నిలబడి,"రాజుకు ఏడుగురు భార్యలంట

కడతట్టాయమ్మ మాఅమ్మ
కందిచెట్టు కింద నీళ్లాడ
బావురుపిల్లి నన్ను సాకె
బావురు బిక్షం పెట్టండి."
అని పాట పాడు" అని, పాటని నేర్పించి పంపింది ఆ పిల్లి.
సరే'నని వెళ్లిన ఆ అబ్బాయిపిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది? ఆ వైపున ఏముందో తెలుసుకోవాల'ని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకుని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి

"రాజుకు ఏడుగురు భార్యలంట
కడతట్టాయమ్మ మా అమ్మ
కందిచెట్టు కింద నీళ్లాడ
బావురుపిల్లి నన్ను సాకె
బావురు బిక్షం పెట్టండ"ని పాట పాడాడు.

ఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నాడు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు, భవనం ముందు నిల్చుని పాట పాడిన పిల్లవాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి! రాజు ఆ అబ్బాయినీ, ఆ అబ్బాయి పాటనూ అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ఆధారంగా ఊహించుకోగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యలమీద అనుమానం కలిగింది. వాళ్లని పిలిపించి, గట్టిగా అడిగేసరికి వాళ్లంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్లందరినీ కఠినంగా శిక్షించి, ఆ పిల్లవాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశాడు. ఇంకొంతకాలానికి ఆ పిల్లవాడే రాజై, రాజ్యాన్ని బాగా పాలించాడు.

మిత్రులు

అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు.

ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో "ఒరే! మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి, ఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను ఇస్తాను"అని చెప్పాడు.

రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు "నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి వెళ్లి, ఆ పువ్వును తీసుకొచ్చి, నీకు చూపిస్తాను!" అని సోముతో పందెం కాశాడు.

ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చిలైటును తీసుకొని, ఆరోజు రాత్రి రాజు వెంట తనూ పెద్ద బంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా, చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లనిపించింది! వెంటనే రాజు భయపడి, గట్టిగా "దెయ్యం!దెయ్యం!" అని అరిచాడు. అప్పుడు లలిత "భయపడకు రాజూ! నా దగ్గర టార్చిలైట్ ఉంది కదా! అదేమిటో చూద్దాం, ఆగు- ఒక్క నిముషం-" అంటూ అటు వైపుకు టార్చిలైటును వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు- భయం భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది! 'హమ్మయ్య!' అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు.

బంగళా వచ్చేసింది- కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగళా గేటు తీసేసరికి, రాజు ఏపనీ చెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.అప్పుడు లలిత తనే పెద్ద పూలచెట్టు పైకెక్కి, ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి.. దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మిణుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి.. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి! రాజు అలా భయపడుతూండగానే వాళ్లిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి, టాటా చెప్పి, వాళ్ల ఇంటికి పోయింది.

ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్ళి సోముకు ఇచ్చాడు. కానీ, సోము మాట నిలుపుకోలేదు. పది నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు.
"రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి, ఈ పువ్వును తీసుకు వచ్చావు. -లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ!" అని సోము రాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్లి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు.

"ఒక వేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే- అదిగో చూడు , లలిత అక్కడ ఉంది. నువ్వు వెళ్లి, ఆమెను ఒక దెబ్బ కొట్టిరావాలి!" అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని, అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు పది నెమలి ఈకల్ని ఇచ్చేశాడు.
రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి- కానీ, ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది!