Pages

Sunday, August 30, 2015

గుర్తింపు

చంటి వాళ్ళ మావయ్య దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎంతో మంది పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెళ్ళ వాళ్ళు వస్తున్నారు. చాలా ప్రశ్నలు వేసి, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా సహజమే మరి, మావయ్య తీసిన పక్షుల ఫోటోకి జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి వచ్చింది!
విలేఖర్లడిగే ప్రశ్నలన్నింటికీ మావయ్య చిరునవ్వుతో సమాధానాలు చెప్తున్నాడు. "మీ ఈ ఛాయాగ్రహణ విద్యకు వారసులెవరైనా ఉన్నారా" అని ఒకరడిగిన ప్రశ్నకి, మావయ్య తనను ఒళ్ళోకి తీసుకుంటూ- "ఏం చంటీ, నువ్వు కూడా నాలాగే ఫోటోగ్రాఫర్ అవుతావు కదూ" అని అడిగాడు. చంటిగాడికి ఆ పక్షుల ఫోటో తీసిన రోజు గుర్తుకొస్తోంది:
మావయ్య ఫోటోలు తీయడానికని దగ్గర్లో ఉన్న చిట్టడవికి వెళ్తూ కేమెరాలు, లెన్సులూ సర్దుకుంటుంటే ఎప్పటిలాగానే తనూ వస్తానన్నాడు. అడవుల్లో తిరుగుతూ అక్కడి పక్షుల్నీ, జంతువుల్నీ కళ్ళారా చూడటం భలే మజాగా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది గానీ, మావయ్య పక్కనే ఉంటాడుగా. ముక్కాలిస్టాండు మీద పెద్ద పెద్ద కేమెరాలు బిగించి, క్షణంలో మాయమైపోయే జంతువుల ఫొటోలు తీసే మావయ్య హీరోలా కనిపిస్తూ ఉంటాడు తన కళ్ళకి. పెద్దయ్యాక తను కూడా మంచి ఫోటోలు తీస్తానని చాలా సార్లు అనుకున్నాడు కూడా.
ఆ రోజు మావయ్య ముందుగానే పక్షుల ఫోటో తీద్దామని నిర్ణయించుకున్నట్లున్నాడు, ఒక గుబురు చెట్టు మీద పెద్ద పక్షి గూడు కనిపించగానే ఆగిపోయాడు. గూటిలోంచి అప్పుడప్పుడు చిన్నగా 'కూకూ' శబ్దాలొస్తున్నాయి. పక్షి పిల్లలు మాత్రమే ఉన్నాయనుకుంటా- 'వాళ్ళమ్మ, నాన్న పిల్లలకి ఆహారం తేవడానికి వెళ్ళుంటాయి; అవి కూడా వచ్చాక, అన్నింటికీ కలిపి ఫోటో తీయాలి' అన్నాడు మావయ్య.కేమెరాని సిద్ధం చేసుకుని వాటి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఇద్దరూ. ఎర్రని ముక్కులతో తెల్లగా ఉన్న పక్షిపిల్లల తలలు మాత్రం కనిపిస్తున్నాయి తనకు అప్పుడప్పుడూ. ఎంత ముద్దుగా ఉన్నాయో అవి! మావయ్య దృష్టి మాత్రం వాటి అమ్మానాన్నల మీదే ఉన్నట్లుంది. కానీ అవి ఎంతకీ రాలేదు.
సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు. ఎండ బాగా పెరిగిపోయింది. తెచ్చుకున్న బిస్కట్లు, మంచి నీళ్ళు అయిపోవచ్చాయి.
ఇక ఉండబట్టలేక మావయ్య "పెద్ద పక్షులు కూడా ఇక్కడికి దగ్గర్లోనే తిరుగుతూ ఉండి ఉంటాయి, నువ్వెళ్ళి ఈ కర్రని ఆ గూడుకి తాకించడానికి ప్రయత్నించు" అని ఒక పొడుగాటి కర్రని తనకిచ్చాడు. మావయ్య చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు కానీ, తన కన్నా ఓ మూడు రెట్లు పొడుగున్న ఆ కర్రని పట్టుకుని పక్షి గూడు కింద ఎగరడం మొదలుపెట్టాడు తను- కర్ర ఆ గూటికి తగలకుండా జాగ్రత్త పడుతూనే. మావయ్యేమో కేమెరా ఫోకస్ చేసుకుని, ఫోటోలు తీసుకుంటూనే, "ఇంకొంచెం చంటీ ఇంకాస్త ఎత్తుకి ఎగరాలి" అంటూ తనను ప్రోత్సహించాడు.
అయితే అలసట వల్ల తన చెయ్యి పట్టు తప్పింది! తన చేతిలోని కర్ర వెళ్ళి పక్షిపిల్లల గూటి కింద తగిలింది. పిల్లలేమౌతాయో అన్న బాధతో, భయంతో తను కళ్ళు తిరిగి పడిపోవటం, ఎక్కడినుంచో పెద్ద పక్షులు తమ పిల్లల్ని రక్షించుకోటానికి రావడం ఒక్కసారే జరిగిపోయాయి.
తరువాత మావయ్య నన్ను తెగ మెచ్చుకున్నాడు, "నాక్కావల్సినట్లు ఫోటో వచ్చిందిరా, ఒక అద్భుతమైన ఫోటో తీయడానికి సాయం చేసావు" అంటూ. కొంచెం చెదిరిన గూడు, దానిలోపల, తమ చిన్ని చిన్ని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భయంతో పక్షిపిల్లలు, తమ రెక్కలతో గూడును పడిపోకుండా పట్టుకుని, వాత్సల్యంతో పిల్లలవంకే చూస్తున్న రెండు పెద్ద పక్షులు - ఇదీ ఆ "అద్భుతమైన" ఫోటోలోని దృశ్యం. మావయ్యకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందికూడా ఆ ఫోటో వల్లనే!
ఆ రోజు గుర్తుకు రాగానే ఎనిమిదేళ్ళ చంటిగాడు మావయ్య చేతుల్ని విదిలించుకుంటూ చెప్పేశాడు - "నీలాంటి ఫోటోగ్రాఫర్ని మాత్రం నేనెప్పటికీ కాను" అని. ఆ పెద్ద పక్షులు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే, ఆ చిన్ని పక్షి పిల్లలు తన మూలంగా చనిపోయేవన్న నిజాన్ని మర్చిపోవడానికి వాడికి నెల రోజులు పట్టింది మరి!

No comments:

Post a Comment