Pages

Monday, August 20, 2012

ఏడు చేపలు – చెక్కిలిగిలి కథ

అనగా  అనగా  ఒక ఊళ్ళో ఒక రాజుగారు  ఉన్నారు.  ఆయనకి  ఏడుమంది  కొడుకులు  ఉన్నారు. ఓరోజు  వాళ్ళు  వేటకి  వెళ్ళి  ఏడు చేపలు  తెచ్చారు.  వాటిని  ఎండలో  పెట్టారు.  అందరి  చేపలూ  ఎండాయి  కానీ  చివరి  అబ్బాయి  చేప  ఎండలేదు. అప్పుడు  ఆ  చిన్న  అబ్బాయి  చేపని  ఇలా  అడిగాడు.
“చేపా  చేపా  ఎందుకు ఎండలేదు?”

“ఎండ  సరిగా  తగలకుండా  గడ్డిమోపు  అడ్డంగా  ఉంది.” అంది  చేప

“గడ్డి మోపు  గడ్డి మోపు  ఎందుకు  అడ్డంగా  ఉన్నావు?”  అని  గడ్డిమోపుని  అడిగాడు  అబ్బాయి.

“నన్ను  ఆవు  మేయలేదు  అందుకే అలా అడ్డంగా ఉన్నా.” అంది  గడ్డిమోపు.

“ఆవూ  ఆవూ  ఎందుకు  గడ్డి  మేయలేదు?”  అడిగాడు  అబ్బాయి.

“పిల్లవాడు  మేపలేదు.”  అంటూ  చెప్పింది  ఆవు.

“పిల్లవాడా.. పిల్లవాడా  ఎందుకు  ఆవుని  మేపలేదు.” అని  అడిగాడు  అబ్బాయి.

“అమ్మ  అన్నం  పెట్టలేదు,  అందుకే  నేను  ఆవుని మేపడానికి  వెళ్ళలేకపోయాను.”  అంటూ  బదులిచ్చాడు  గొల్లపిల్లవాడు.

“అమ్మా  అమ్మా  ఎందుకు  అన్నం  పెట్టలేదు?”  అమ్మనడిగాడు  అబ్బాయి.

“చిన్ని పాప  ఏడుస్తోంది.” అందుకే వండలేదంది  అమ్మ.
“చిన్ని పాప  చిన్ని పాప  ఎందుకేడుస్తున్నావు?”  అన్నాడు  అబ్బాయి.

“నన్ను చీమ కుట్టింది.”  అంది  చిన్ని పాప

“చీమా  చీమా  ఎందుకు  కుట్టావు?”   చీమని  ప్రశ్నించాడు  అబ్బాయి.

“మరి  నా  బంగారు  పుట్టలో  వేలు పెడితే.. కూట్టనా..కుట్టనా… కుట్టానా……. అంటూ  కుట్టేసింది  చీమ.

No comments:

Post a Comment