Pages

Monday, August 20, 2012

ఒక్క వెంట్రుక రాణి

అనగనగా  ఒకరాజుకి  ఇద్దరు  భార్యలున్నారు.  పెద్ద భార్యకి  రెండు  వెంట్రుకలు  ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాళి, ఎవరితోనూ సరిగ్గా  నడచుకోదు.  రాజుగారి  చిన్న భార్యకి ఒక్కటే  వెంట్రుక ఉంది. ఈవిడ చాలా  నెమ్మది  గుణం కలది  అందరితో  స్నేహంగా  దయగా  ఉండేది.

పెద్ద  భార్యకి  తనకి  రెండు వెంట్రుకలున్నాయని  అందుకని  ఒకటే  వెంట్రుక  ఉన్న చిన్న రాణీ కంటే  తనే  అందంగా ఉన్నానని   అనుకునేది.  ఓ రోజు రాజుతో  ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యంగా ఉంది  ఆమెని  ఇంట్లోంచి  వెళ్ళగొట్టేయమని  చెప్పింది. దానితో   రాజు  చిన్న  రాణీని  అడవికి  పంపించేసాడు.

చిన్న  రాణి  అడవిలో  అలా  వెళుతూ  ఉంటే  దారిలో ఆమెకి  ఆవులు కనిపించాయి

“మాకు కాస్త  కుడితి  కలిపి  పెట్టి వెళ్ళవా.”   అని  అడిగాయి.   ఆమె  సరేనని  ఎంతో  దయతో   వాటికి  కుడితి  కలిపి  పెట్టి  తన  దారిన  తను  వెళ్ళసాగింది.

అలా  కొంత దూరం  అలా వెళ్ళాక   ఆమెకి  ఓచోట   దారికి  రెండువైపులా  గులాబీ తోట   కనిపించింది.  ఆ  గులాబీ  మొక్కలు  చిన్న  రాణిని  చూడగానే

“ఇక్కడ ఉన్న  బావినుండి  నీళ్ళు  తోడి  మాకు  పోయావా.”  అని  అడిగాయి.   ఆమె  వాటికి  కావలసినన్ని  నీళ్ళు  తోడి  పోసింది.

ఇంకాస్త  ముందుకెళ్ళగానే    ఆ  దారిలో  ఎన్నో  చీమలు  వెళుతూ  ఉన్నాయి  అవి  ఆమెతో

“దయచేసి  మమ్మల్ని  తొక్కకుండా  వెళ్ళు.”  అని  అన్నాయి.
ఆమె  వాటిని  తొక్కకుండా  జాగ్రత్తగా  నడవసాగింది.

కొద్దిదూరం నడిచాక   ఆమెకి  ఒకచోట  పెదరాసి  పెద్దమ్మ  ఇల్లు  కనిపించింది.  అక్కడికి  వెళ్ళగానే  పెదరాసి  పెద్దమ్మ  చిన్నరాణీని  పిలిచి

“నా  ఇంటిని  అలికి,  అలంకరించి,  నాకు  కాస్త  వంట చేసి  పెడతావా?  నాకు  ఈరోజు  అస్సలు  ఓపిక లేకుండా పోయింది.”  అంది.

దానికి  చిన్న  రాణీ  ’అయ్యో పాపం  ముసలమ్మ  అన్ని  పనులు  చేసుకోలేదు  కదా’  అనుకుకుని  పెదరాసి  పెద్దమ్మ  ఇల్లు  అలికి  ముగ్గులేసి,  వంటచేసింది.

“ఎందుకిలా  అడవిలోకి  వచ్చావు ?”  అని  చిన్న రాణిని  అడిగింది  పెద్దమ్మ.
తనకు  ఒకటే  వెంట్రుక  ఉందని  పెద్ద  రాణీ  రాజుతో  చెప్పి  వెళ్ళగొట్టించేసింది  అంటూ  జరిగింది  చెప్పింది  ఆమె.

“నీకు  చాలా పొడవుగా వత్తుగా  జుట్టు రావాలంటే నేను  చెప్పినట్టు  చెయ్యి,   కనిపించే ఆ నది  వద్దకెళ్ళి  ఈ  కొబ్బరి కాయ  కొట్టి  నమస్కరించి  నదిలో  మూడు  సార్లు  మునిగి బయటకు వచ్చేసేయి.” అని  చెప్పింది
పెదరాసి పెద్దమ్మ

పెద్దమ్మ  చెప్పినట్టుగానే  మూడుసార్లు  నదిలో  మునిగి  లేచేసరికి  చిన్న  రాణికి  బారెడు జుట్టు  వచ్చేసింది.
ఆమె  సంతోషంతో  ఇంటికెళదామని  అనుకుంది  కానీ  ఇంటికి  ఎలా  వెళ్ళాలో  దారి  తెలియలేదు.  అప్పుడు  అక్కడే  ఉన్న  చీమలన్నీ  కలిసి  మీ  ఇంటికి  దారి  మేము  చూపిస్తాము  అంటూ  బారులుగా  ముందు  నడుస్తూ  దారి  చూప  సాగాయి.

అలా  వెళ్తుండగా   గులాబీతోటలోని  పూలన్నీ  “ఓ రాణీ  నువ్వు  నీళ్ళు  తోడిపోసినందునే  మా తోటంతా  ఇలా  పువ్వులతో  నిండిపోయింది,  ఇలా  వచ్చి  నీకు  కావలసినన్ని  పువ్వులు  తీసుకుని వెళ్ళు.”  అన్నాయి.
ఆమె  కావలసినన్ని  పూలు  తలలో  పెట్టుకుని  అందంగా  ముస్తాబై   వెళ్ళసాగింది.

అలా  కొద్ది దూరం వెళ్ళాక  మొదట  ఆమె  కుడితి  పెట్టిన  ఆవులు  ఆమెని  చూసాయి.
“చిన్న  రాణీ  నువ్వు  ఎంతో  మంచిదానివి  మేమూ  మీ ఇంటికి  వచ్చేస్తాం  రోజూ  పాలు ఇస్తాం, నువ్విలా  నడుస్తూ  ఎందుకువెళ్ళడం  అదిగో  ఒక  బండి  ఉంది  దానికి  మమ్మల్ని  కట్టి  బండిపై  హాయిగా  వెళ్ళు.”  అన్నాయి.

ఎంచక్కా బండిలో  కూర్చుని  చీమలు  దారిచూపిస్తుండగా  ఇంటికి  వచ్చేసింది  చిన్నరాణీ.  అప్పుడు  ఆమెని  చూసిన  రాజు  ఎంతో  సంతోషంతో ఇంట్లోకి  పిలిచి,  రెండే  వెంట్రుకలు ఉన్న  పెద్దరాణీ  ని  ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు.

పెద్దరాణీని రాజు  అడవికి  పంపేసాడు  అక్కడ  రాణీ కి కొన్ని  ఆవులు  కనిపించాయి    అవికూడా  కుడితి  కోసం  పెద్ద  రాణిని  అడిగాయి.  పెద్ద  రాణి  వాటిని  పట్టించుకోకుండా  తనదారిన  తాను  వెళ్ళసాగింది.

గులాబీ తోట లోంచి  వెళుతోంటే  అవి  చిన్న  రాణిని  అడిగినట్టే  పెద్ద రాణీని  కూడా  నీళ్ళు  తోడి  పోయమని  అడిగాయి.

పెద్దరాణి  “ఇక నాకేం  పనిలేదా  మీకు  నీళ్ళు  పోస్తూ ఉండాలా.” అంటూ  కోపంతో  తన  దారికి అడ్డంగా ఉన్న  కొమ్మలని  విరిచేస్తూ  వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక  ఆమెకి  చీమలు  కనిపించాయి “దయచేసి  మమ్మల్ని  తొక్కకుండా  వెళ్ళు.” అన్నాయి.
పిచ్చి  చీమలు  మీవల్ల  ఏం ఉపయోగం  అంటూ  వాటిని  తొక్కేస్తూ  కాళ్ళతో  నలిపేస్తూ  నడిచింది  పెద్దరాణీ.

కాసేపటికి  ఆమె  పెదరాసి పెద్దమ్మ  ఇల్లు చేరుకుంది. “నా  ఇల్లు అలికి  అలంకరించి, నాకు  వంటచేసి  పెట్టు.”  అంది  పెద్దమ్మ.

“హు నేను  రాణీని  నేను  అలాంటి  పనులు  చేయను.”  అంటూ  విసుక్కుంది  పెద్దరాణి.

“సరే  ఈ  అడవిలోకి  ఎందుకొచ్చావు?”  అంటూ  అడిగింది  పెద్దమ్మ.

“ఎక్కువ వెంట్రుకలు  ఉన్నవాళ్ళే  అందమైన  వాళ్ళని  నేను  రాజుతో  చెప్పాను  అందువల్ల  ఇప్పుడు  చిన్నరాణికి   నాకంటే  ఎక్కువజుట్టు  వచ్చేసింది  అందుకే  నన్ను  వెళ్ళగొట్టేసాడు.”  అని  జరిగిందంతా  చెప్పింది  పెద్దరాణీ.

“కనిపించే  ఆ  నది  దగ్గరకు  వెళ్ళి ఈ  కొబ్బరికాయ  కొట్టి  నమస్కరించి,  నదిలో  మూడుసార్లు  మునగి  లేస్తే  నీకుకూడా  చిన్న  రాణి  జుట్టంత  జుట్టు  వస్తుంది.”  అంటూ  చెప్పి  కొబ్బరికాయ  ఇచ్చింది  పదరాసి  పెద్దమ్మ.

నది దగ్గరికెళ్ళి  కొబ్బరికాయ  కొట్టి  నదిలో  మూడు సార్లు  మునిగింది  పెద్దరాణీ.  ఆమెకీ  చిన్న  రాణి కున్నంత  జుట్టు  వచ్చేసింది.

’చిన్న  రాణి కున్నంతే  ఉంటే  ఇంక  నా  గొప్ప ఏముంది!  రాజుతో  చెప్పి  మళ్ళీ  ఆమెని  వెళ్ళగొట్టించేసేయాలంటే  ఆమెకంటే  పెద్దజుట్టు  నాకు  ఉండాలి  అనుకుంది  పెద్దరాణీ.
వెంటనే  ఇంకో మూడు  మునకలు  వేసింది.   అంతే  ఉన్న  జుట్టంతా  ఊడిపోయి  బోడిగుండై  పోయింది.

“అయ్యో  నాకున్న  రెండువెంట్రుకలూ  పోయాయే.”  అని  ఏడ్చుకుంటూ  వెళ్ళింది  పెద్దరాణీ.
అడవిలో   దారి తప్పిపోయింది  చీమలని  అడిగినా  అవిచెప్పలేదు  పైగా  ఆమెని  బాగా  కుట్టేసాయి.

గులాబీ  తోటలోకి  రాగానే  ఎండిపోయిన  గులాబీ  కొమ్మలన్నీ  ఆమెని  ముళ్ళతో  బాగా  కొట్టాయి.
అంతలోకి  అక్కడికి  వచ్చిన  ఆవులు  ఆమెని  తమ  కొమ్ములతో  పొడుస్తూ  అడవిలోకి  తరిమేసాయి.

No comments:

Post a Comment