Pages

Monday, June 17, 2013

నక్షత్రాల లెక్క

మహారాజా క్రిష్ణ చంద్ర గారి దర్బారుకు గౌరవనీయ నవాబుగారి సమ్ముఖం నుండి ఒక ఫర్మానా వచ్చింది. ఈ భూమి మొత్తాన్నీ - ఆ వైపు నుండి ఈ వైపు వరకూ; ఆ చివరి నుండి ఈ చివరి వరకూ- కొలిచి పెట్టమన్నారు నవాబుగారు. దానితోబాటు మహారాజావారుగనక ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ లెక్కించే పనిని సొంత పనిలాగా చేపట్టితే సంతోషిస్తామని కూడా తమ ఫర్మానాలో రాసి పంపారు.

క్రిష్ణచంద్ర మహారాజుగారు నిర్ఘాంతపోయారు."నేను మీ ఆజ్ఞను మీరదల్చుకోలేదు- కానీ, మీరు.. అసాధ్యమైనవి అడుగుతున్నట్లుంది?!" అని కబురు పంపారు నవాబుకు.
"అయినా చేయాల్సిందే" నన్నారు నవాబుగారు కఠినంగా.

దాంతో మహారాజావారి మనస్సు విరిగిపోయింది. ఆయన ఏకాంత మందిరంలో కూర్చుని 'నవాబు కోరికల్ని తీర్చే విధానం ఏంటా', అని ఆలోచనలో మునిగిపోయారు.

అనతికాలంలో గోపాల్ భాండ్ కు సంగతి తెల్సింది. ఆయన రాజభవనానికి వచ్చి, చింతాక్రాంతుడై ఉన్న రాజావారిని కలిసి, "మహారాజా! నేనేం చూస్తున్నాను? మీకేమైనా కష్టం వచ్చిందంటే ఈ గోపాల్ కు చెబితే చాలు, అన్నీ చక్కబడతాయి" అన్నాడు.

రాజావారు అంత సులభంగా తేరుకోలేదు. ఆయనన్నారు 'లేదు, గోపాల్! ఈ సమస్య నీకు కూడా కొరుకుడు పడనిది. భూమండలాన్నంతా- ఆ పక్కనుండి ఈ పక్కకు; ఆవైపు నుండి ఈ వైపుకు- మొత్తం కొలిచి పెట్టాలని నవాబుగారు హుకుం జారీ చేశారు. అది చాలదన్నట్లు. నేను ఆకాశంలోని నక్షత్రాలన్నింటిని కూడా లెక్కించాలట!" అని.
గోపాల్ ఏ మాత్రం తొణకలేదు- "అయ్యో, మహారాజా! వీటంత సులభమైన ప్రశ్నలు ఇంక వేరే ఏవీ ఉండవు. నన్ను మీ అధికారిక 'భూమండల కొలతల అధికారి'గాను, 'నక్షత్ర గణకుడి'గాను నియమించండి. ఆ పైన నిశ్చింతగా ఉండండి. నా పని పూర్తయ్యాక, నాకు నేనుగా ఫలితాన్ని తీసుకెళ్లి, నవాబుగారిని కలిసి వస్తాను. ఒక్క సాయం మాత్రం చేయండి: పని పూర్తి చేసేందుకు నవాబుగారిని ఒక సంవత్సరం గడువూ, ఖర్చుల కోసం ఒక పది లక్షల బంగారు నాణెలు కోరండి. ఒక్క సంవత్సరంలో నేనాయనకు ఫలితాలనందిస్తాను" అన్నాడు.


మహారాజుగారు చాలా సంతోషపడ్డారు. ఆయన ఆందోళన మాయమైపోయింది - ఎందుకంటే, పని ఒకవేళ పూర్తవ్వకపోతే తెగేది- తన తల కాదు! గోపాల్ భాండ్ తల!! అందుకని ఆయన గోపాల్ కోరిన విధంగా చేసి, సంతోషంగా చేతులు దులుపుకున్నారు.
ఇక గోపాల్ భాండ్ ఆ పది లక్షల బంగారు నాణాలతో ఇష్టం వచ్చినట్లు జల్సా చేసుకున్నాడు. రాజ్యంలోని రకరకాల ఆహార పదార్థాలు రుచి చూశాడు, పెద్ద పెద్ద బంగళాలు, ఏనుగులు, వజ్రవైఢూర్యాలు, బంగారం, దాస దాసీజనాలను సమకూర్చుకున్నాడు. అలా అతను సంవత్సరాన్నంతా అద్భుతంగా గడిపి, సంవత్సరం చివర్లో మహారాజుగారి దగ్గరికి తిరిగి వెళ్లి, తీసుకున్న పది లక్షల బంగారు నాణేలకుగానూ తన వద్ద మిగిలిన నాలుగు రాగి నాణేలను చూపిస్తూ- "మహారాజా, నిజంగా నేను అనుకున్న దానికంటే చాలా కష్టమైంది ఈ పని! అయితే నేను ఆ పనిని మొదలుపెట్టడం మటుకు చాలా‌బాగా చేశాను- ఫలితాలన్నీ చాలా ఆశాజనకాలుగా కనబడుతున్నై. కానీ నాకు ఇంకొక సంవత్సరం గడువు అవసరం. మరి అలాగే, ఇంకో పది లక్షల బంగారు మొహరీలు కావాలి...-ఖర్చులు!" అన్నాడు కొంచెం ఆందోళన పడుతున్నట్లు ముఖం పెట్టి.

అయిష్టంగానే మహారాజుగారు నవాబుగారికి మనవి చేసుకున్నారు. నవాబుగారు కూడా అయిష్టంగానే అదనపు సమయాన్నీ, అదనపు పదిలక్షల్నీ మంజూరు చేశారు. దాంతో గోపాల్ ఈ సంవత్సరాన్ని మొదటిసారి కంటే మరింత జల్సాగా గడిపాడు- అనుభవం ఎక్కువైంది గదా మరి!

ఇక కచ్చితంగా రెండు సంవత్సరాలు అవుతుందనగా, గోపాల్ భాండ్ పెద్ద పటాలాన్ని ఒకదాన్ని వెంటబెట్టుకొని, నవాబుగారి దర్బారును చేరుకున్నాడు. అతనితోబాటు పదిహేను ఎద్దులబండ్లు! ఒక్కో బండి నిండా, బండి అంచులు దాటేట్లు గట్టిగా నొక్కి నొక్కి పెట్టిన- అతి సన్నని దారం, వంకరలు తిరిగి, చిక్కుపడిపోయి, అతుక్కుపోయి- ఉన్నది. ఇవికాక, ఒత్తైన బొచ్చుతో, ముద్దుగా ఉన్న ఐదు గొర్రెలు కూడా.

ఈ వింత పటాలాన్ని తీసుకొని గోపాల్ రాజప్రాసాదంలోకి ప్రవేశించి, నవాబుగారి దర్బారుకు చేరుకున్నాడు. నవాబుకు వంగి ఓ పెద్ద సలాం చేసి "హుజూర్! మీరు కోరిన విధంగానే మొత్తం పనినీ పూర్తి చేశాను. భూమిని ఆ చివరి నుండి ఈ చివరి వరకూ, ఆ పక్కనుండి ఈ పక్క వరకూ కొలిచి తెచ్చాను. ఆకాశంలోని నక్షత్రాల్ని కూడా ఖచ్చితంగా లెక్కించి తెచ్చాను" అన్నాడు.

"భళా! చెప్పు! అంకెల్ని ఇప్పుడు బయట పెట్టు! కచ్చితమైన కొలతలు వినిపించు!" అన్నారు నవాబుగారు, ఉత్సాహంగా.

"అంకెలా హుజూర్?!" అన్నాడు గోపాల్- "అవి లేవు, ఒప్పందంలో! అయితే నేను మాత్రం మీరు ఆదేశించినట్లే లెక్కించాను పూర్తిగా. చూడండి- ఈ మొదటి ఏడు ఎద్దులబండ్లలో తెచ్చిన దారం ఎంత పొడవు ఉన్నదో, భూమి అంత వెడల్పు ఉన్నది. ఇక, తర్వాతి ఎనిమిది బండ్లలో ఉన్న దారం ఎంత పొడవు ఉన్నదో, కచ్చితంగా అంత పొడవు ఉన్నది, భూమి! ఇకపోతే, నేను నక్షత్రాల్నికూడా కచ్చితంగా లెక్కించాను హుజూర్! ఈ ఐదు గొర్రెల మీద బొచ్చులో ఎన్ని వెంట్రుకలున్నాయో, ఆకాశంలో కచ్చితంగా అన్నే నక్షత్రాలున్నై! నిజానికి, ఇలా కచ్చితమైన సంఖ్యలో వెంట్రుకలుండే గొర్రెలు దొరికించుకునేందుకే, నాకు చాలా సమయం పట్టింది!" అన్నాడు.

నవాబుగారికి ఇక ఏమి అనేందుకూ వీలు లేకపోయింది. "అసాధ్యం! నేను ఆ దారాన్నీ కొలవలేను, ఈ బొచ్చులోని వెంట్రుకలనూ లెక్కించలేను! అయినా ఒప్పందం ప్రకారం మీరు చేయాల్సిన పని మీరు చేశారు!! కనుక అందుకోండి, మేమిచ్చే బహుమానం; పది లక్షల బంగారు మొహరీలు!" అని నవాబుగారు గోపాల్ ని మర్యాదగా సాగనంపారు.


గోపాల్ వాటితో మరికొంత కాలం కులాసాగా గడిపాడు!! 

బ్రహ్మరాక్షసుడి సంగీతం

పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది.


అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.


అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది.


బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు.

"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు.



ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు.


పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని.

"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు.

'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు.


బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను.

 నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని.

బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆపైన అతను కాశీకి పోయి, గంగలో స్నానం చేసి, వెనక్కి తిరిగివస్తూండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతను అష్టకష్టాలూ పడి, చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది - "ఏం చెప్పను. మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది, దాన్ని ఎవ్వరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడినవారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారుకూడాను" అని.

ఈ సంగతి వినగానే'మంచిరోజులొచ్చాయని' బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్లి, "ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకున్నదని లోనికి కబురంపాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవ్వరూ నమ్మలేదు; కానీ 'ప్రయత్నిస్తే తప్పేంట'ని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు.

అంత:పురాన్ని చేరుకోగానే, బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్లిపొమ్మన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక, బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు: "నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్లిపోతాను. కానీ- నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో- నేను ఇప్పుడు వెళ్లే చోటుకుగనక -తప్పిజారైనా సరే- వచ్చావంటే మాత్రం, నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను." అన్నాడు.
ఆపైన, పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువరాణిగారు మామూలుగా అయిపోవటం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు - బంగారం, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెండ్లాడి, పట్టణంలోనే ఇల్లు కట్టుకొని, పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు.

ఇక మైసూరు యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు, నేరుగా కేరళ రాజ్యానికి పోయి, ట్రావన్ కూర్ యువరాణిని ఆవహించాడు. ట్రావన్ కూర్ రాజుగారు కూడా, పాపం తన బిడ్డను భూతం బారినుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక రోజున ఆయనకెవరో చెప్పారు - మైసూరు యువరాణిని సరిగ్గా ఇదేలాంటి భూతం పూనినప్పుడు, ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికెలో ఎలా స్వస్థపరిచాడో. వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూరు రాజుకు ఒక ఉత్తరం రాశారు- తన బిడ్డనుకూడా ఆ భూతం బారినుండి తప్పిస్తే బ్రాహ్మణుడిని తగిన విధంగా సన్మానిస్తామని.

మైసూరురాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి, ట్రావన్ కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, ఆ యువరాణికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవటం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్లు చల్లబడింది. వణుకు మొదలైంది. అయినప్పటికీ, రాజుగారి ఆజ్ఞాయె! అతిక్రమించే వీలు లేదాయె! చాలాసేపు ఆలోచించీ, ఆలోచించీ అతను ఒక నిర్ణయానికి వచ్చాడు: తనకేమన్నా అయితే తన భార్యా బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి, తను ట్రావన్ కూర్ కు బయలుదేరివెళ్లాడు.
అయితే ఒకసారి అక్కడకు చేరుకున్నాక కూడా, బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనట్లు నటిస్తూ అతను మూర్ఛపోయాడు. అలా దాదాపు రెండు నెలలపాటు తన గదిలోంచి కాలు బయట పెట్టలేదు. అయినా రెండు నెలల తర్వాత ఇక దాటవేసేందుకు వీలులేకపోయింది. యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి!

ఇక అతను ప్రాణాలు అరచేతబట్టుకొని, యువరాణీవారిని చూడటం కోసం బయలుదేరాడు. తనను ఈ గండం నుండి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ, అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకుని, అక్కడినుండి అంత:పురంలో యువరాణీవారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతణ్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు - "నిన్ను చంపేస్తాను! ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను. నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది? నిన్ను వదిలేది లేదు" అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకలిని చేతబట్టుకొని బ్రాహ్మణుని మీదకు ఉరికాడు.

 బ్రాహ్మణుడి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనుక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి, లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు- "చూడు, నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా ఈ యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా?, లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా? అతనైతే ఈ అంత:పురంలో కూర్చొని రాత్రింబవళ్లూ చక్కగా తనశైలిలో సంగీత సాధన చేస్తాడు మరి, నీకు అభ్యంతరం లేకపోతే!" అని.

'సంగీతకారుడు' అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతమూ, దాని కారణంగా తను పడ్డ బాధా ఒకేసారి గుర్తుకొచ్చాయి. ఆ బాధను తలుచుకొని వాడు భయంతో వణికిపోయాడు- "వద్దు! వద్దు! అతన్ని మాత్రం పిలువకు! నేను వెళ్లిపోతున్నాను" అని అరుస్తూ వాడు యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమయిపోయాడు.

అటుపైన ట్రావన్ కూర్ యువరాణి ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది. రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడంటే, ఆ మొత్తాన్నీ బండ్లల్లో నింపుకొని, మైసూరు చేరుకొన్న బ్రాహ్మణుడు, తన భార్యాపిల్లలతో కలిసి ఇంకా ఆ డబ్బును లెక్కపెడుతూనే ఉన్నాడు! 

నోటిలో కొంగ

బ్రాహ్మణుడొకడు ఒకనాడు ఒక పొలంగుండా నడుస్తూ ఇంటికి పోతున్నాడు. దారిలో అకస్మాత్తుగా అతనికి ఒక దగ్గు పొర వచ్చింది. దగ్గీ, దగ్గీ చివరికతను గట్టిగా నేలమీద ఉమ్మాడు. అయితే చూడగా, అతను ఉమ్మిన కళ్లెలో తెల్లటి ఈక ముక్క ఒకటి కనబడింది! అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు అతనికి.

ఇంకొంత సేపట్లో అతనికి ఇక కంగారు మొదలైంది. తను కొంగ ఈకను ఉమ్మాడన్న సంగతి అతని ఆలోచనను వదలకుండా వెంటబడింది. త్వరలో అది ఇక భరింపరానంత స్థాయికి చేరుకున్నది!

ఇంటికి చేరుకోగానే అతను భార్యను పిలిచి, "నన్ను ఒక సంగతి చాలా బాధిస్తున్నది. దాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పుకోవలసిందే- లేకపోతే నా తల పగిలిపోతుంది. నీకు నేను ఆ సంగతి చెప్తాను- అయితే దాన్ని ఇక వేరే ఎవ్వరికీ చెప్పనని ముందుగా మాట ఇస్తావా?" అని అడిగాడు.

"ఓ! నిర్భయంగా చెప్పు. నేను ఒక్క చీమకు కూడా తెలీనివ్వనని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను" అన్నది భార్య. అప్పుడతను నిశ్చింతగా, తన ఉమ్మిలో కనబడ్డ తెల్లటి ఈక గురించి చెప్పాడు భార్యకు. అయితే, భార్య మాటైతే ఇచ్చింది కానీ, ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాయటం ఆమె వల్ల కాలేదు. ఆమె ఆలోచనల నిండా తెల్లటి ఈకలే మరి!

అందుకని, పొరుగింటి సుబ్బమ్మ కనబడగానే బ్రాహ్మణుడి భార్య ఆమెకు దగ్గరగా వెళ్లి- "నా మనసంతా ఒక రహస్యంతో నిండి పోయి ఉంది. నేను ఆగలేక పోతున్నాను. నీకు ఆ రహస్యం చెప్పేస్తాను- అయితే ముందు నాకు ఓ మాట ఇస్తావా? దాన్ని నువ్వు వేరే ఎవ్వరికీ చెప్పకూడదు- ఎవ్వరికీ తెలీనివ్వనని నేను మా వారికి మాట ఇచ్చాను, మరి!" అన్నది.

పొరుగింటి సుబ్బమ్మ ఒప్పుకున్నది. "నెను రహస్యాల్ని ఎంత చక్కగా కాపాడతానో నీకు తెలీదా? నేను చీమక్కూడా తెలీనివ్వను- చెప్పు!" అన్నదామె ఉత్సాహంగా.

"ఎవ్వరికీ చెప్పవు కదా?"
"నీకంత అపనమ్మకమైతే చెప్పకు. నేనెన్నడైనా నీ రహస్యాన్ని ఇతరులకు చెప్పానా?"
"సరే, సరే. చెప్పేస్తాను నీకు. నువ్వు మంచి స్నేహితురాలివని నాకు తెలుసు. నువ్వెవ్వరికీ చెప్పవు. మా ఆయన ఇంటికి వస్తూ పొలాన్ని దాటుతుండగా ఏమైందో తెలుసా? ఆయన ఏమి ఉమ్మేశాడో తెలుసా? ఆయన.. ఆయన ఉమ్మి నిండా కొంగ ఈకలు! ఎన్ని ఈకలో! ఆయనకు ఏమౌతోందో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం చాలా భయం వేస్తున్నది!"

"అయ్యో నువ్వేమీ ఆందోళన పడకు. ఒక్కోసారి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. కానీ, దాన్ని గురించి ఎవ్వరికీ తెలీకపోవడమే మంచిది. ఊరికే అందరూ పుకార్లు రేపుతారు, లేకుంటే".
కానీ ఆ రహస్యాన్ని ఐదు నిమిషాలపాటు దాచుకోవటం కూడా ఆమె వల్ల కాలేదు. అది ఆమెలోంచి తన్నుకొని బయటికి వచ్చేస్తున్నట్లు అనిపించిందామెకు. హడావిడిగా ఆమె ఇంకా ఇంటికి పరిగెత్తుతూ ఉండగానే 'తనకిప్పుడు ఎవరు కనబడతారో, వాళ్లకి ఈ రహస్యం చెప్తే ఎలా స్పందిస్తారో' అన్న ఊహ ఆమెను తబ్బిబ్బు పరిచింది. ఆమెకో మిత్రురాలు కనబడగానే ఆమె ఇక ఆపుకోలేక బయటికి కక్కేసింది.

"ఎవ్వరికీ చెప్పనని మాట ఇవ్వు ! నేను ఆమె రహస్యాన్ని కాపాడతానని బ్రహ్మణుడి భార్యతో ప్రమాణం చేశాను. ఇవ్వాళ ఏం జరిగిందో తెలుసా? పూజారిగారు పొలంలోంచి పోతూ పూర్తి కొంగనొకదాన్ని కక్కుకున్నారట! బ్రాహ్మణులు శాకాహారులేనని నేను అనుకునేదాన్ని. కానీ మనకేం తెలుసు, నిజానికి?" అన్నదామె.
"పూర్తి కొంగనా? అంత పెద్ద పక్షి! ఎలా కక్కుకున్నాడబ్బా!? వింత మనిషే! కానీ- నేను ఎవ్వరికీ తెలీనివ్వనులే., నన్ను నమ్ము."

ఎంతో సేపు కాలేదు, వేరే ఒకాయనకు ఎవరో చెప్పగా తెలిసింది- పండితుడి నోట్లోంచి రెక్కలల్లార్చుకుంటూ అనేక కొంగలు వెలువడ్డాయని!

ఇక ఆరోజు సాయంత్రానికల్లా పట్టణమంతా తెల్సిపోయింది అందరికీ- పండితుడి నోట్లోంచి కొంగల గుంపులూ, బాతుల మందలూ, ఇంకా రకరకాల పెద్దపెద్ద పక్షులన్నీ ఎగురుకుంటూ బయటికి వస్తున్నాయని! చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఆ సంగతి ప్రచారమైంది- దాంతో గ్రామాలకు గ్రామాలే ఎద్దుల బండ్లు వేసుకొని ఈ భయంకర ఘటనను చూసేందుకు పండితుడుండే ఊరికి తరలి వచ్చాయి. ఇదేదో నిజంగా అద్భుతం గదా, మరి? - రకరకాల పక్షులు, అన్ని రంగులవీ, అన్ని సైజులవీ,- కొన్ని సుదూర పక్షులు కూడా- పండితుడి నోట్లోంచి ఊడిపడి, ఆకాశాన్ని కప్పేస్తున్నాయట!


బ్రాహ్మణుడికి పిచ్చెక్కినట్లయింది. అతను అందరి నుండీ‌ పారిపోయి కొండమీద, ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈ పుకారు పూర్తిగా సద్దుమణిగి, ఇంకోటి తలెత్తేంత వరకూ బయట తిరిగే సాహసం చెయ్యలేదు! 

బావురు పిల్లి

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుమంది భార్యలు. పిల్లలు కలగక పోవడం చేత ఆయన ఏడు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తరువాత చివరి భార్య గర్భవతి అయ్యింది. "ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు. ఎలాగైనా చివరామెను బయటకి వెళ్ళగొట్టాలి" అనుకున్నారు మిగిలిన భార్యలు.


ఒకనాడు రాజు వేటకని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి, పెళ్లాలందరూ కలసి ఇద్దరు నమ్మకస్తులైన భటులను పిలిచారు. వాళ్ళకు చాలా ధనమిచ్చి, "చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి, ఆమె కన్నులు పీక్కురమ్మ"ని చెప్పి పంపారు. ధనాశచేత ఆ భటులు, చిన్న రాణిని తీసుకుపోయి, ఆమె కన్నులు పీక్కొని, చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు.

వేట ముగించుకొని తిరిగొచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో నాలుగు మాయ మాటలు చెప్పి నమ్మించారు.

ఇక అడవిలో పడ్డ ఆరాణి పాపం, కళ్లు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చీ ఏడ్చీ అలిసిపోయి, ఒక చేనులో కందిచెట్టు కింద కూర్చొని మూర్ఛపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి, చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కానీ పురిట్లోనే ఆ రాణి చనిపోయింది!


అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురుపిల్లి పిల్లవాడి ఏడ్పులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకొనిపోయి, బాగా పెంచుకున్నది. ప్రతిరోజూ అది ఊరి లోనికి వెళ్లి, ఆహారం సంపాదించి, దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు.


ఒకనాడు ఆ పిల్లవాడు బావురుపిల్లితో " ఈరోజు ఊళ్లోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో"అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంతచెప్పినా వినకుండా అబ్బాయి, "ఊళ్లోకి నేనే వెళతా" అని మొండిపట్టు పట్టాడు. చేసేదిలేక `సరే' అని ఒప్పుకుంది పిల్లి. వెళ్లేముందు "నాయనా! ఎటువైపుకైనా పో, కానీ, దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన మూడు దిక్కులలో ఎటువైపుకైనా సరే పో. పోయి వాళ్ల ఇండ్లవద్ద నిలబడి,

"రాజుకు ఏడుగురు భార్యలంట
కడతట్టాయమ్మ మాఅమ్మ
కందిచెట్టు కింద నీళ్లాడ
బావురుపిల్లి నన్ను సాకె
బావురు బిక్షం పెట్టండి."
అని పాట పాడు" అని, పాటని నేర్పించి పంపింది ఆ పిల్లి.
సరే'నని వెళ్లిన ఆ అబ్బాయిపిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది? ఆ వైపున ఏముందో తెలుసుకోవాల'ని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకుని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి
"రాజుకు ఏడుగురు భార్యలంట
కడతట్టాయమ్మ మా అమ్మ
కందిచెట్టు కింద నీళ్లాడ
బావురుపిల్లి నన్ను సాకె
బావురు బిక్షం పెట్టండ"ని పాట పాడాడు.


ఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నాడు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు, భవనం ముందు నిల్చుని పాట పాడిన పిల్లవాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి! రాజు ఆ అబ్బాయినీ, ఆ అబ్బాయి పాటనూ అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ఆధారంగా ఊహించుకోగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యలమీద అనుమానం కలిగింది. వాళ్లని పిలిపించి, గట్టిగా అడిగేసరికి వాళ్లంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్లందరినీ కఠినంగా శిక్షించి, ఆ పిల్లవాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశాడు. ఇంకొంతకాలానికి ఆ పిల్లవాడే రాజై, రాజ్యాన్ని బాగా పాలించాడు. 

గువ్వ కథ

ఒక ఊర్లో గువ్వంట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముల్లు గుచ్చుకుందంట. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరకుపోయి "మనవడా! మనవడా! నా కాలిలో ముల్లు తీస్తావారా?" అని అడిగిందంట.

" నేను తీయను. నన్ను అవ్వ కొడుతుంది- పో " అన్నాడట వాడు.

"అట్లనా!" అని, ఆ గువ్వ అవ్వ దగ్గరకి పోయి, "అవ్వా! అవ్వా! నా కాలి ముల్లు తీస్తావా అవ్వా?", అని అడిగిందట.
"నన్ను తాత కొడతాడు. నేను రాలేను- పో" అని అవ్వ చెప్పిందంట.

"సరేలె"మ్మని, ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందంట. పోయి, "తాతా! తాతా! నా కాల్లోంచి ముల్లు తీస్తావా తాతా?" అని అడిగిందట.

"నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్టా!" అని తాత అన్నాడట.

"సరే"నని ఆవుదగ్గరికెళ్లి, "ఆవూ! ఆవూ! నా కాలి ముల్లు తీస్తావా, ఆవూ?" అని అడిగిందట గువ్వ.
అప్పుడు ఆవు, "నన్ను దూడ కొడుతుంది" అని చెప్పిందట.

"సరే అయితే. నేను దూడని అడుగుతాను ఉండు" అని దూడ దగ్గరికెళ్లి, "దూడా! దూడా! నా కాల్లో ముల్లు తీస్తావా దూడా?" అని అడిగిందంట గువ్వ.

దూడేమో, "ఊ...నేను తేనీగతో ఆడుకోవాలమ్మా! లేకపోతే అది నన్ను తిట్టదూ?" అని చెప్పిందట.
"ఐతే నేను తేనీగను అడుగుతాలే" అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ.

"అయ్యో పాపం! నీ కాళ్లో గుచ్చుకున్న ముల్లును తీసెయ్యించడానికే ఇంత కథ నడిచిందా? ఉండు, నేను చూసుకుంటానుగానీ" అని, అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిందట. ఆవుపోయి తాతను గుద్దిందంట. తాత పోయి అవ్వను కొట్టాడంట. అవ్వ పోయి మనవడ్ని వేళ్లతో పొడిచిందంట. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముల్లును తీసేశాడట.


ముల్లు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకుని ఎగిరిపోయిందంట!! 

పగటి కలలు

ఈ కథ చంద్ర సొంత కథ అని తెలుస్తూనే ఉన్నది..పగటిపూట కనే కలల్ని పగటి కలలు అంటారా? మీరే చెప్పాలి.
రచన: యం.చంద్రశేఖర్, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.



వాసు, వాసంతి అన్నా చెల్లెళ్ళు. వాళ్లిద్దరూ కలసి ఆడుకునేవాళ్లు, పాడుకునేవాళ్లు, చక్కగా బడికి పోయేవాళ్లు.

ఒకసారి వాళ్ల ఇంటికి బంధువుల అబ్బాయి చంద్ర వచ్చాడు. ఒట్టి చంద్ర కాదు వాడు- `కలల చంద్ర'. చంద్రకు కలలు కనడమంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకుని, కలల్లో తేలిపోతుండేవాడు.

చాలా కాలానికి తమ ఇంటికొచ్చిన చంద్రను వెంటపెట్టుకొని, వాసు, వాసంతిలు వాళ్ల తోటకు వెళ్ళారు.

తోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుదామనుకున్నారు ముగ్గరూ. చంద్రకు కూడా ఉయ్యాల ఊగటం అంటే చాలా చాలా ఇష్టం. తనే మొదట ఊగుతానన్నాడు వాడు.


`సరే' నువ్వే మొదట ఊగమని, వాడిని ఊపడం మొదలుపెట్టాడు వాసు.



ఉయ్యాలలో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి:
ఊగే ఉయ్యాలలోంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ రాకెట్ లోకి ఎగిరిపోయాడు చంద్ర. అక్కడినుండి ఏకంగా ఒక గ్రహం మీదికి దూకాడు. ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు! ఉయ్యాలలాగా ఊగిపోతున్నది. చివరికి అక్కడి చెట్లుకూడా అటూ ఇటూ సోలిపోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఊగుతూనే, చంద్ర ఆ గ్రహంమీద నడవటం మొదలుపెట్టాడు. నడిచీ నడిచీ కాళ్ళు నొప్పులైతే పుట్టాయిగానీ, అక్కడ జనసంచారం అన్నది లేదు.

అంతలో అతనికి ఒకచోట పే..ద్ద- మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. 'ఏమిటా?' అనుకుని దాని దగ్గరికెళ్ళి చూశాడు- చూస్తే, ఆశ్చర్యం! అది ఒక భారీ వజ్రం. దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర. అయితే ఆ వజ్రం సుమారు ఇరవై కిలోల బరువు ఉంటుందేమో, అసలు కదలలేదు. ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవాల్సిందే అని, వాడు ముందుకు వంగి, రెండు చేతుల్తోటీ వజ్రాన్ని పట్టుకొని, అతి ప్రయత్నంమీద, బలంగా ఎత్తాడు!! - ఇంకేం చెప్పాలి? వజ్రంకోసం చేతులు వదిలిన చంద్ర, ఉయ్యాలలోంచి దబ్బున కిందపడ్డాడు .


పాపం, చంద్ర! కలలచంద్రకు పళ్ళు ఊడినంత పనైంది. దగ్గర్లోనే ఉన్న వాసు, వాసంతిలు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి, "ఏమైంది? ఎందుకు, కింద పడ్డావు?" అని అడిగారు. అప్పుడే కల నుండి తేరుకొన్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ, మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వివరించాడు.

ఆ తర్వాత వాసు, వాసంతిలు చాలాకాలం వరకూ కలల రాకుమారుణ్ని తలుచుకుని నవ్వుకున్నారు.
చంద్ర మాత్రం అప్పటినుంచి పగటి కలలు కనడం మానేశాడు. 

ముందుచూపు

ఒక అడవిలో చాలా పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి దగ్గర్లో ఉన్న పొలాలలో రైతులు రకరకాల పంటలు పండించేవారు. ఒకనాడు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండగా, క్రింద పొలంలో ఒక రైతు ఏవో గింజలు నాటుతూ కనబడ్డాడు. అన్ని పక్షులూ 'అది మామూలే' అనుకొని, తమ మానాన తాము ఎగురుకుంటూ‌వెళ్లిపోయాయి. కాని చురుగ్గా ఆలోచించే ఓ చిన్న పిచ్చుక మాత్రం ఆ పొలంలోకి దిగి, ఆ రైతు ఏం విత్తనాలు నాటుతున్నాడో గమనించింది జాగ్రత్తగా. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆ పిచ్చుకకు అర్థమైపోయింది వెంటనే.

"ఆ రైతు తన పొలంలో జనప విత్తనాలు నాటుతున్నాడు. ఆ మొక్కల నుంచి వచ్చే నారతో తాళ్లనూ, వలలను తయారు చేస్తారు. ఆ వలలతో మన లాంటి పక్షులని, చేపలను పట్టుకుంటారు. అందుకని మనం వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి " అని తెలివైన ఆ పిట్ట తన జట్టు పక్షులతో అంది.


కాని, దాని మాటలను ఏ పక్షీ వినిపించుకోలేదు. కొన్ని రోజులకు పొలంలో జనప మొలకలు వచ్చాయి.

"ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇకనైనా మనం మేలుకోవాలి. వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి" అన్నది పిచ్చుక.

"ఆ... ఇప్పుడే ఏం తొందరొచ్చింది?!" అంటూ మిగతా పక్షులు దాని మాటలు పెడచెవిన పెట్టాయి.

రోజు రోజుకూ మొక్కలు పెరగసాగాయి! కొంతకాలం గడిచాక, "ఇక లాభం లేదు" అని, తెలివైన ఆ పిచ్చుక అక్కడినుండి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయింది.


ఇంకొంతకాలానికి నిజంగా ఆ పిచ్చుక చెప్పినట్లే జరిగింది. కొందరు మనుషులు జనపనారతో వలలను చేసి, వాటితో పిట్టలను, చేపలను పట్టడం మొదలుపెట్టారు. పిచ్చుక హెచ్చరికను పెడచెవిన పెట్టిన పిట్టలన్నీ ఆ వలలో చిక్కుకొని పోయాయి, పాపం!! 

డాం డాం డాం

చిన్నారి తేజ ముద్దుగా చిత్తూరుజిల్లా యాసతో చెప్పిన కథని మేం కొద్దిగా మార్చినా, అదే యాసలో ఇస్తున్నాం, మీరూ ఇష్టపడతారేమోనని.

సేకరణ: వి.ఆర్. తేజ, మూడవ తరగతి, విజ్ డమ్ స్కూల్, గుడిపాల, చిత్తూరు జిల్లా.


ఒక ఊళ్ళో ఒక కోతంట. ఆ కోతి కొండమీదికి ఎక్కుతావుంటే తోకలోకి ఒక ముల్లు గుచ్చుకుందంట. అప్పుడా కోతి ఊళ్ళోకి వచ్చిందంట. అప్పుడొక వేటగాడు ఒక కత్తి ఎత్తుకుని పోతావుంటే, ఆ కోతి వేటగాడి దగ్గరకిపోయి "నాకు ముల్లు తీయవా?" అని అడిగిందంట.

అప్పుడు వాడు ముల్లు తీసెయ్యడానికని ప్రయత్నిస్తే, దాని తోక తెగిపోయిందంట. అప్పుడా కోతి, వేటగాడితో "నాకు నా తోకిస్తావా, లేక నీ కత్తిస్తావా?" అని అడిగిందంట. అప్పుడు ఆ వేటగాడు కత్తినిచ్చేశాడంట.
కోతి, కత్తెత్తుకుని పోతావుంటే, ఒక అక్క చేత్తోనే కట్లించుతా కనబడిందంట. "ఎందుకక్కా కట్టెలను చేత్తో ఇంచుతావున్నావు?. కత్తుంది ఇద్దో తీసుకో. తీసుకొని దీంతో‌ కట్లు నరుక్కో" అని కత్తిచ్చిందంట.

ఆ అక్క కత్తితో కట్లు నరుకుతావుంటే కత్తిశీల పూడ్చిందంట.
అప్పుడు కోతి ఆ అక్కతో "నా కత్తిస్తావా, లేక నీ కట్లిస్తావా?" అని అడిగిందంట.


అప్పుడా అక్క కోతికి కట్లిచ్చేసిందంట.


కోతి ఆ కట్టెలను తీసుకొని పోతావుంటే, ఒక అవ్వ పొయ్యిలో కాగితాలుపెట్టి దోసలు కాలుస్తా కనబడిందంట. చూసిన కోతి, "ఎందుకవ్వా కాగితాలు పెట్టి కాలుస్తున్నావు? ఇవిగో ఈ కట్లు తీసుకుని కాల్చుకో" అని కట్లిచ్చిందంట.

ముసలమ్మ దోసెలన్నీ కాల్చేపాటికి కోతి తనకిచ్చిన కట్టెలన్నీ అయిపోయాయంట. అప్పుడు కోతి ఆ అవ్వతో, "నా కట్లిస్తావా? లేక నీ దోసెలిస్తావా?" అని అడిగిందంట.


అవ్వ కోతికి దోసెలు ఇచ్చిందంట.
దోసెలు తీసుకుని పోతున్న కోతికి మడకను దున్నే ఒక అన్న ఆకలిగొని నీరసంగా కనిపించాడంట. "ఇవిగో ఇవి తినన్నా" అని ఆ కోతి అతనికి దోసెలిచ్చిందంట. అతనేమో ఆకలితో ఉండి దోసెలన్నీ తినేశాడంట.

అప్పుడు కోతి "నా దోసెలిస్తావా, లేక నీ మడకిస్తావా?" అని ఆ అన్నను అడిగిందంట.

అన్న మడకిచ్చేసినాడంట. మడకను తీసుకుని ఒకచోట పెట్టిందంట కోతి. దావంట బొయ్యే చాకలాయన దొందురుకుని పడితే, మడక ఇరిగిపోయిందంట. "నా మడకనిస్తావా, లేక నీ తొట్టిబాననిస్తావా?" అని అడిగిందట. "సరే, నీతో నాకెందుకు?" అని చాకలాయన దానికి బాననిచ్చేశాడంట.


తొట్టిబాననుకూడా తీసుకుని పోతావుంటే దానికి ఒకచోట చేతుల్తో పూలతోటకు నీళ్లుపోస్తున్న మనుషులు కనిపించారంట. అప్పుడది "ఎందుకన్నా, చేతుల్తో నీళ్లు పోస్తున్నారు? ఇదిగో ఈ బానతో పోసుకోండ"ని వాళ్లకు ఆ బానను ఇచ్చిందంట.


బాన తీసుకుని పూల తోటకునీళ్ళు పోస్తుంటే ఆ బానకు చిల్లు పూడ్చిందంట. అప్పుడు కోతి నాబానిస్తావా లేక నీ పూలిస్తావా?" అని అడిగిందంట.

"పూలే తీసుకొమ్మ"ని కాసిన్ని పూలిచ్చారంట వాళ్లు.

పూలను తీసుకుని పోతున్న కోతికి , తలలో పూలు లేకుండా పోతున్న ఒక పెళ్లి కూతురు కనిపించిందంట. అప్పుడు కోతి "ఓ పెళ్లికూతురా! ఎందుకట్లా పూలు పెట్టుకోకుండానే పోతున్నావు, ఇవిగో పూలు తీసుకో"మని ఆమెకు పూలిచ్చిందంట. పెళ్లికూతురు పూలు పెట్టుకున్నాక ఆ పూలన్నీ వాడిపోయాయంట.

అప్పుడా కోతి, అక్కడే ఉన్న డప్పునెత్తుకొని,


"కాలు పోయి కత్తొచ్చె డాం డాం డాం!
కత్తిపోయి కట్లొచ్చె డాం డాం డాం!
కట్లు పోయి దోసెలొచ్చె డాం డాం డాం!
దోసెలు పోయి మడకొచ్చె డాం డాం డాం!
మడకా పోయి తొట్టిబానొచ్చె డాం డాం డాం!
తొట్టిబాన పోయి పూలొచ్చె డాం‌ డాం డాం!
పూలు పోయి పెళ్లికూతురొచ్చె డాం డాం డాం!!! అని పాడిందంట. 

గుర్తింపు

చంటి వాళ్ళ మావయ్య దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎంతో మంది పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెళ్ళ వాళ్ళు వస్తున్నారు. చాలా ప్రశ్నలు వేసి, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా సహజమే మరి, మావయ్య తీసిన పక్షుల ఫోటోకి జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి వచ్చింది!

విలేఖర్లడిగే ప్రశ్నలన్నింటికీ మావయ్య చిరునవ్వుతో సమాధానాలు చెప్తున్నాడు. "మీ ఈ ఛాయాగ్రహణ విద్యకు వారసులెవరైనా ఉన్నారా" అని ఒకరడిగిన ప్రశ్నకి, మావయ్య తనను ఒళ్ళోకి తీసుకుంటూ- "ఏం చంటీ, నువ్వు కూడా నాలాగే ఫోటోగ్రాఫర్ అవుతావు కదూ" అని అడిగాడు. చంటిగాడికి ఆ పక్షుల ఫోటో తీసిన రోజు గుర్తుకొస్తోంది:
మావయ్య ఫోటోలు తీయడానికని దగ్గర్లో ఉన్న చిట్టడవికి వెళ్తూ కేమెరాలు, లెన్సులూ సర్దుకుంటుంటే ఎప్పటిలాగానే తనూ వస్తానన్నాడు. అడవుల్లో తిరుగుతూ అక్కడి పక్షుల్నీ, జంతువుల్నీ కళ్ళారా చూడటం భలే మజాగా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది గానీ, మావయ్య పక్కనే ఉంటాడుగా. ముక్కాలిస్టాండు మీద పెద్ద పెద్ద కేమెరాలు బిగించి, క్షణంలో మాయమైపోయే జంతువుల ఫొటోలు తీసే మావయ్య హీరోలా కనిపిస్తూ ఉంటాడు తన కళ్ళకి. పెద్దయ్యాక తను కూడా మంచి ఫోటోలు తీస్తానని చాలా సార్లు అనుకున్నాడు కూడా.

ఆ రోజు మావయ్య ముందుగానే పక్షుల ఫోటో తీద్దామని నిర్ణయించుకున్నట్లున్నాడు, ఒక గుబురు చెట్టు మీద పెద్ద పక్షి గూడు కనిపించగానే ఆగిపోయాడు. గూటిలోంచి అప్పుడప్పుడు చిన్నగా 'కూకూ' శబ్దాలొస్తున్నాయి. పక్షి పిల్లలు మాత్రమే ఉన్నాయనుకుంటా- 'వాళ్ళమ్మ, నాన్న పిల్లలకి ఆహారం తేవడానికి వెళ్ళుంటాయి; అవి కూడా వచ్చాక, అన్నింటికీ కలిపి ఫోటో తీయాలి' అన్నాడు మావయ్య.

కేమెరాని సిద్ధం చేసుకుని వాటి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఇద్దరూ. ఎర్రని ముక్కులతో తెల్లగా ఉన్న పక్షిపిల్లల తలలు మాత్రం కనిపిస్తున్నాయి తనకు అప్పుడప్పుడూ. ఎంత ముద్దుగా ఉన్నాయో అవి! మావయ్య దృష్టి మాత్రం వాటి అమ్మానాన్నల మీదే ఉన్నట్లుంది. కానీ అవి ఎంతకీ రాలేదు.

సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు. ఎండ బాగా పెరిగిపోయింది. తెచ్చుకున్న బిస్కట్లు, మంచి నీళ్ళు అయిపోవచ్చాయి.
ఇక ఉండబట్టలేక మావయ్య "పెద్ద పక్షులు కూడా ఇక్కడికి దగ్గర్లోనే తిరుగుతూ ఉండి ఉంటాయి, నువ్వెళ్ళి ఈ కర్రని ఆ గూడుకి తాకించడానికి ప్రయత్నించు" అని ఒక పొడుగాటి కర్రని తనకిచ్చాడు. మావయ్య చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు కానీ, తన కన్నా ఓ మూడు రెట్లు పొడుగున్న ఆ కర్రని పట్టుకుని పక్షి గూడు కింద ఎగరడం మొదలుపెట్టాడు తను- కర్ర ఆ గూటికి తగలకుండా జాగ్రత్త పడుతూనే. మావయ్యేమో కేమెరా ఫోకస్ చేసుకుని, ఫోటోలు తీసుకుంటూనే, "ఇంకొంచెం చంటీ ఇంకాస్త ఎత్తుకి ఎగరాలి" అంటూ తనను ప్రోత్సహించాడు.

అయితే అలసట వల్ల తన చెయ్యి పట్టు తప్పింది! తన చేతిలోని కర్ర వెళ్ళి పక్షిపిల్లల గూటి కింద తగిలింది. పిల్లలేమౌతాయో అన్న బాధతో, భయంతో తను కళ్ళు తిరిగి పడిపోవటం, ఎక్కడినుంచో పెద్ద పక్షులు తమ పిల్లల్ని రక్షించుకోటానికి రావడం ఒక్కసారే జరిగిపోయాయి.

తరువాత మావయ్య నన్ను తెగ మెచ్చుకున్నాడు, "నాక్కావల్సినట్లు ఫోటో వచ్చిందిరా, ఒక అద్భుతమైన ఫోటో తీయడానికి సాయం చేసావు" అంటూ. కొంచెం చెదిరిన గూడు, దానిలోపల, తమ చిన్ని చిన్ని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భయంతో పక్షిపిల్లలు, తమ రెక్కలతో గూడును పడిపోకుండా పట్టుకుని, వాత్సల్యంతో పిల్లలవంకే చూస్తున్న రెండు పెద్ద పక్షులు - ఇదీ ఆ "అద్భుతమైన" ఫోటోలోని దృశ్యం. మావయ్యకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందికూడా ఆ ఫోటో వల్లనే!


ఆ రోజు గుర్తుకు రాగానే ఎనిమిదేళ్ళ చంటిగాడు మావయ్య చేతుల్ని విదిలించుకుంటూ చెప్పేశాడు - "నీలాంటి ఫోటోగ్రాఫర్ని మాత్రం నేనెప్పటికీ కాను" అని. ఆ పెద్ద పక్షులు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే, ఆ చిన్ని పక్షి పిల్లలు తన మూలంగా చనిపోయేవన్న నిజాన్ని మర్చిపోవడానికి వాడికి నెల రోజులు పట్టింది మరి! 

నేను కొనబోయే ఆవు కథ

పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.

భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని.

భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని.

మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: " ఏం కొనుక్కొచ్చావు?" అని.

"ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!" అన్నది భార్య.
"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌" అడిగాడు భర్త.

"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌" అన్నది భార్య.

"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.

ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని.

"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.

ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని.

" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త.

"మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్.

"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!"

"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్.

భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని.

"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.

"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.

"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్.

"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?"

"నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి.


పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు. 

సువర్ణ సాహసం

అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు.

ఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.


అయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్తుకెళ్లిపోయిన తమ కొడుకును గురించే బాధపడుతూ ఉండేవారు. సువర్ణకూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది.

అలా వెళ్ళిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దు:ఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్లవ్వ ఇంట ఆగి, అక్కడి విశేషాలను కనుక్కున్నది: "ఒక రాక్షసుడు ఏరోజుకారోజు అక్కడి పిల్లలను ఎత్తుకు పోతున్నాడు. నగరమంతా హాహాకారాలు అలుముకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు."

"అయితే నేను వెళ్లి వాడి పనిపడతా"నన్నది సువర్ణ.

"నీకెందుకమ్మా? అదీకాక ఆడపిల్లవు. నీ వల్ల ఏమి అవుతుంది?. మా మహారాజే ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా!" అంది అవ్వ. కానీ సువర్ణ తన పట్టు విడువలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడునాడంటున్న అడవిలోకే పోయింది. కానీ ఎంత వెతికినా రాకాసి జాడ లేదు.

అలసిన సువర్ణ ఒక చెట్టుకిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి ఆమెకు. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరునూ ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి, పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి, ఏదైనా సహాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ.

"ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడకాదు. వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూతా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూతా కొరివిదెయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్లాలంటే ముందుగా ఆ కనబడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకుగాను నేను ఈ పాదరక్షలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దెయ్యాలకు కనిపించవు. ఆ దెయ్యాలను దాటిన తరువాత నువ్వు గుహకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణిని ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు" అని పాదరక్షల్నీ, మణినీ సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని, పాముకు కృజ్ఞతలు చెప్పి అక్కడినుండి గుహవైపుకు బయలుదేరింది.

గుహను చేరుకొని, ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దెయ్యాలకు కనిపించలేదు. ఆపైన ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు- ఆమె మెడలోని మణిప్రభావం చేతనే!

అలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప, అక్కడ జనసంచారమనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలాసేపటికి ఒక పండుముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ "అమ్మా పాపా! ఇంత వరకూ తమంతట తాముగా ఇక్కడికి ఏ నరపురుగూ రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీచేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తోస్తున్నది. ముందుజాగ్రత్తగా నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటిదాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు" అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది.
కోట లోపలచూస్తే ఒక్కరు తక్కువగా పదివేలమంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్నపిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆరోజు సాయంత్రం రాక్షసుడు వచ్చీరాగానే అవ్వను "పదివేలమందీ పూర్తయ్యారా?" అని అడిగాడు. "అయ్యార"న్నది అవ్వ. "అయితే బలికి అన్నీ సిద్దం చేయమన్నాడు రాకాసి. అవ్వ అన్నీ సిధ్ధంచేసి, మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది.

రాక్షసుడు సురర్ణను చూసి వికవికా నవ్వాడు. "పాపా, నువ్వు స్వర్గం చేరుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాతకు మోకరిల్లు" అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని.

సువర్ణ రెండు చేతులూ జోడించి అమ్మకు మొక్కింది. "అలాకాదు పాపా, వంగి, నేలబారుగా పడుకొని నమస్కరించాలి" అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. "నాకు తెలియదు, నువ్వే చేసి చూపించు" అన్నది సువర్ణ. "అయ్యో! ఆ మాత్రం తెలీదా, ఇలా పడుకొని, ఇలా మొక్కాలి" అని రాక్షసుడు నేలబారున పడుకోగానే, ప్రక్కనున్న కత్తిని తీసుకొని, సువర్ణ ఒక్కవేటుతో అతని శిరస్సును ఖండించివేసింది.

రాక్షసుడు చనిపోగానే, అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన పదివేలమంది పిల్లలకూ వాళ్ల వాళ్ల రూపాలు లభించాయి. అవ్వకుకూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి! అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావులకు వారు చేరుకున్నారు.


ఆ పిల్లల్లోనే ఒకడు, రవివర్మ! అలా అనుకోకుండా తన అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకూ వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దానధర్మాలు చేసి, ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు. 

సోము-తాబేలు

అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు. దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.


సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి. అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు. అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది.

వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. "ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది. ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!" అన్నది. సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.


ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు.


ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు. ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది.


ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు. గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.

ఇక చేసేదేమీలేక, 'తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు చాటింపించారు.

చాటింపును విన్న సోము ఆలోచించాడు: 'ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు.' అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది- ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు!

సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది.




హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు. సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు. 

ఒకటి-రెండు

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని, అందులో ఒక ముసలమ్మ జీవించేది.


ముసలమ్మ మహా ధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒక్కతే రోజూ అడవికి పోయి, ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్లు, మేడిపండ్లు, బలిజ పండ్లు, నేరేడుపండ్లు వంటి రకరకాల పళ్లను బుట్ట నిండా ఏరి తెచ్చేది. వాటిని ఊళ్లో అమ్మి, వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది.


ఇలా ఉండగా, ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్లదయ్యాలకు కాళ్లూ చేతులు ఉలఉలా అన్నాయి. ముసలమ్మను ఆటపట్టించాలన్న ఆలోచన ఆ తుంటరి పిల్లదయ్యాలు రెండింటికీ ఒకేసారి కలిగింది. ఆ ఆలోచన రాగానే అవి రెండూ ముసలమ్మకు దగ్గరగా వెళ్ళి, ఏదైనా చేద్దామనుకున్నాయి; కానీ కొంచెం ఆలోచించినమీదట, తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి.


ఇక ముసలమ్మేమో పళ్ళన్నిటినీ బుట్టనిండా ఏరి, ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దెయ్యాలు రెండింటికీ ముసలమ్మ కొట్టం ఉన్న మర్రిచెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. రెండూ మర్రి ఊడల్ని పట్టుకొని ఊగడం ప్రారంభించాయి. అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళి, పళ్ళన్నీ అమ్మి, చీకటిపడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండూ ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉన్నది. ఇక అవి రెండూ అవ్వకు కనిపించాలనుకుని, ఒక్కసారిగా కనిపించి ఇకిలించాయి.


ఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దయ్యాలను చూసి ముసలమ్మ ఖంగుతిన్నది. కానీ లేని గాంభీర్యాన్ని నటిస్తూ- "ఎవరు మీరు? ఏం కావాలి మీకు?" అని ప్రశ్నలు వేసింది దర్జాగా.

"మేము దయ్యాలం. మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడివేడి రొట్టెలు కావాలి" అని దయ్యాలు రెండూ ఏకకంఠంగా అరిచాయి.


ముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలెమ్మని, ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ `దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా?' అని ఆలోచించేసుకుంది ముసలమ్మ.

ఆపైన పథకం ప్రకారం మూడు జొన్న రొట్టెలను చేసి, వాటిని ఒకే కంచంలో పెట్టి దెయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి.

"కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం" అన్నది మొదటి దయ్యం.

`సరే'నన్నది రెండో దయ్యం.

మరి లెక్కపెడితే రొట్టెలేమో మూడున్నాయి! ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్కపెట్టిన మొదటి దయ్యం. దానికిగాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించి, రెండో దెయ్యంతో ఒక చిన్న పందెం కాసింది:


"ఒరేయ్! మనం ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకటే రొట్టె. గెలిచిన వాడికి రెండు రొట్టెలు" అన్నది.


"సరే" అన్నది రెండవ దెయ్యం.


ఇక అవి రెండూ ఒకదాని కళ్లల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంత సేపటికీ పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళ రెప్పలు ఆర్పలేవాయె!

ఇక అదే అదననుకున్న ముసలమ్మ పొయ్యిలో నాలుగు ఇనుప చువ్వలను పెట్టి ఎర్రగా కాల్చి, ఆ రెండింటినీ తీసుకొని, మెల్లగా వెళ్ళి, ఒక దయ్యానికి వెనక అంటించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పోయినంత పనైంది. అది ఎగ్గిరి దూకి, బోర్లా పడి, మొత్తుకోసాగింది.

తనే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండవ దెయ్యం అవ్వను, అవ్వ చేతిలోకి చేరుకున్న మరో రెండు చువ్వల్నీ గమనించలేదు. అది గంతులేసుకుంటూ "నాకు రెండు! నాకు రెండు! అని బిగ్గరగా అరిచింది.


'రెండేం ఖర్మ! నాలుగిస్తా'నని అవ్వ దానికీ రెండు అంటించింది. ఆ వాతల దెబ్బకు దెయ్యాలు రెండూ ఒక్కసారిగా అక్కడి నుండి అదృశ్యమయ్యాయి.


మూడు రొట్టెల్నీ మిగుల్చుకున్న అవ్వ వాటిని తిని, హాయిగా నిద్రపోయింది! 

ఆశపోతు నక్క

ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది.

ఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- "ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది.

నది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క క్షణంపాటు. కానీ నదిలో ముసళ్లున్నాయి! అవి ఆకలిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాయి కూడాను! మరెలాగ?
నక్కకు జింక మాంసాన్ని వదలటం ఇష్టం కాలేదు. అలాగని మాంసపు తునకల్నీ వదలలేదు! అందుకని అది కష్టపడి, ఎలాగో ఒకలా ముసళ్ల కళ్లు కప్పి, నోట్లో ఉన్న మాంసపు తునకలను తన నోట్లోనే ఉంచుకొని నదిలోకి దిగి, అవతలి వైపుకు ఈదసాగింది. అయితే అనుకోకుండా నోట్లోని మాంసం ముక్కలు రెండూ నీళ్లల్లో పడిపోయాయి!

'అందని ద్రాక్షపళ్లు పుల్లన ' అన్నట్లు, నక్క అనుకున్నది- "ఈ రెండు ముక్కలు పోతే పోనీలే! అవతల వైపున పెద్ద జింకే దొరకబోతూంటే, ఈ చిన్న తునకలు ఎందుకు?" అని. ఇక వేరే అడ్డు లేదు గనక, అది ఈదుతూ సులభంగా అవతలి ఒడ్డుకు చేరుకుని, దాని అలవాటు ప్రకారం జింకను ఈడ్చుకుంటూ వెళ్లి నదిలోకి దిగింది.


అయితే చాలా రోజులనుండీ ఆహారం లేక విలవిలలాడుతున్న ఆ నదిలోని ముసళ్లు అంతకుముందే నక్క నోట్లోంచి పడ్డ మాంసపు తునకల్ని నమిలి, 'ఇంకా ఏం దొరుకుతుందా' అని ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇప్పుడు జింక మాంసపు వాసన రాగానే అవన్నీ వెంటబడి వేటాడి జింకను, దాన్ని‌ ఈడ్చుకెళ్తున్న నక్కను కూడానూ కరకరామని నమిలి తినేశాయి.

ఆశపోతు నక్క తన చావును తానే కొని తెచ్చుకుంది. 

విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు

  1. మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథం.
  2. ఙ్ఞాపకశక్తి పెంపొందించాలంటే ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉండాలి.
  3. ఙ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన అవసరం.
  4. మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి.
  5. సరైన ఙ్ఞాపకశక్తి కోసం చక్కటి ఆహారం.
  6. ఒక చిన్న ధ్యానపు టెక్నిక్ ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
  7. ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుగొనుట.
  8. లింకు పద్థతి ద్వారా జ్ఞాపకం వుంచుకోవడం (Acronym method).
  9. ఫార్ములాలని గుర్తు పెట్టుకోవడం.
  10. ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం.


  11. పదాలు/అంకెలు విడగొట్టడం (Chunking).
  12. బట్టీ పట్టే విధానం.
  13. జ్ఞాపకశక్తికి మరో టెక్నిక్ కుదించడం, వ్యాపించడం.
  14. ఫ్లాష్ కార్డులను ఉపయోగించుట.
  15. రేఖాపటం ద్వారా వివిధ అంశాలను గుర్తుంచుకోవడం.
  16. పదం లేక వాక్యాల తాలూకు బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకొని జ్ఞాపకం చేసుకోవడం.
  17. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అనేక పదాలను ఒకే ఒక అర్థవంతమైన వాక్యం సృష్టించి జ్ఞాపకం ఉంచుకోవడం.
  18. వివిధ పాయింట్లని కలపడం ద్వారా వ్యాస ప్రశ్నలో జవాబుని గుర్తుంచుకోవడం.
  19. చరిత్ర, సైన్స్‌లో వివిధ నాయకులు, సైంటిస్ట్‌ల పేర్లు గుర్తు పెట్టుకోవడం.
  20. ఆటల ద్వారా వివిధ అంశాలను జ్ఞాపకం వుంచుకోవడం.


  21. కథల రూపంలో పేర్చుకుని జ్ఞాపకం వుంచుకోవడం.
  22. పంచేంద్రియాల ద్వార జ్ఞాపకశక్తిని పెంచుకోవడం.
  23. హాస్యం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవడం.
  24. 'క్యూ కార్డ్'ల (క్లుప్తంగా కాగితాల మీద వ్రాసి వుంచుకోవటం) ద్వారా జ్ఞాపకం ఉంచుకోవడం.
  25. మీ సబ్జెక్టుని మీ కళ్ళముందు మెరుపు మెరిసేటట్లుగా చేసుకోండి.
  26. అర్థం చేసుకొని చదవడం ఒక టెక్నిక్.
  27. సంక్షిప్త పద్దతుల ద్వారా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
  28. తిరిగి రాయడం ద్వారా తేలికగా జ్ఞాపకం ఉంచుకోవడం.
  29. ముఖ్యమైన పదాలను నోట్ చేసుకోండి.
  30. జ్ఞాపకశక్తి పద్దతుల్లో దృశ్యమాలిక.


  31. పెగ్ పద్దతి (లింకు పద్దతిలో) ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోండి.
  32. ప్రత్యేక జ్ఞాపకశక్తి పద్దతులను ఉపయోగించి పాఠాలను గుర్తు పెట్టుకోవడం.
  33. నిత్య జీవన పరిణామంలో మీ జ్ఞాపకశక్తిని వృద్థి చేసుకోవడం.
  34. అసలు మనం పాఠాలను ఎందుకు మర్చిపోతాం?
  35. మీ చదువు సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకొని జ్ఞాపకం వుంచుకోవడం ఎలా?

స్నేహ ఫలం

చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలు పెట్టాయి. ఆయన కరుణతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు సంతోషపడ్డాడు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. జాలర్లు వల పైకి తీసి ఆ మహామునిని చూసి భయపడ్డారు. తప్పు క్షమించమని ఆయన కాళ్ళమీద సాష్టాంగపడ్డారు. "ఈ చేపలతో కొన్నేళ్ళుగా సహవాసం చేయడం వల్ల నాకు వాటిమీద మక్కువ ఏర్పడింది. వాటితో సహా ప్రాణాలు విడవడం కూడా ఇష్టమే నాకు! కనుక అలా చేయ్యండి. లేదా మీకో ఉపాయం చెబుతాను. ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా! వాటితోపాటు నన్ను కూడా అమ్మెయ్యండి" అన్నాడు. జాలర్లు భయపడుతూ వెళ్ళి ఆ సంగతి నహుష మహారాజుతో చెప్పారు. ఆయన భయసంభ్రమాలతో మంత్రి, పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. 'మహాత్మా! తెలియక అపరాధం చేశారు బెస్తలు. అది ఏం చేస్తే పోతుందో సెలవియ్యండి' అన్నాడు. 'మహారాజా! బెస్తలు తమ కుల ధర్మం చేశారు. అందులో వారి తప్పేముంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు. అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్ళకివ్వు' అన్నాడు చ్యవన మహర్షి. ఆయన మనస్సులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు. మంత్రిని పిలిచి, ఈ బెస్తలకు వెయ్యి మాడలు ఇవ్వండి అన్నాడు. 'ధర్మంగా ఇవ్వు మహారాజా' అన్నాడు ముని. 'అయితే పదివేలివ్వండి' చాలదు. 'లక్ష!' న్యాయం కాదు. సరే, 'కోటి' ఉహూ. 'పోనీ నా రాజ్యంలో సగం ఇస్తాను.' 'నువ్వూ నీ మంత్రులూ ఆలోచించుకుని తగిన వెల ఇవ్వండి!' దీనికింత చర్చేమిటి' 'నా రాజ్యమంతా ఇచ్చేస్తాను.' చ్యవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు. నహుషుడు విచార పడిపోయాడు. మంత్రులందరిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి 'ఇకేం చేద్దాం' అని ఆలోచన అడిగాడు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు. నహుషుడి సమస్యేమిటో అడిగి తెలుసుకున్నాడు. 'మహారాజా! చింత విడిచిపెట్టు, గోవులకు, విప్రులకు భేదం లేదు ఆ ఇద్దరూ హవికీ, మంత్రాలకూ ఆధారమైన వాళ్ళు. సకల వేదాలకూ ఆశ్రయుడైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లబమైన పని. బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడాను. కనుక గోవు నివ్వు. వెల సరిపోతుంది.' అని ఉపాయం చెప్పాడు. నహుషుడు సంతోషించాడు. చ్యవనుడి దగ్గరకు వెళ్ళి "మహాత్మా! నన్ను దయ చూడు. మీకు వెల కట్టడం ఎవరికి సాధ్యం? గోవునిస్తాను. అనుగ్రహించు అన్నాడు.
 
చ్యవనుడు సంతోషించాడు. తగిన మూల్యమే నిర్ణయించావు. అలాగే ఇవ్వు అన్నాడు. నహుషుడు గోవును జాలరులకిచ్చాడు. జాలరులు గోవుతో సహా చ్యవనుడి దగ్గరకు వెళ్ళారు. "అయ్యా! మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు. మమ్మల్ని కరుణించి ఈ గోవును మా దగ్గర నుంచి మీరు తిసుకోండి" అని వేడుకున్నారు. కాదనలేకపోయాడు చ్యవనుడు. "సరే అలాగే ఇవ్వండి" అని ఆ గోవును వాళ్ళ దగ్గర్నుంచి తీసుకొని, మీరూ, ఈ చేపలూ స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా శరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్ళారు. నహుషుడూ, ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడూ, గవిజాతుడూ కలిసి నహుషుణ్ణి పిలిచి - "నీకు మేము చెరో వరం ఇస్తాం. ఏం కావాలో కోరుకో" అన్నాడు. "మీరు తృప్తిపొందడం కంటే నాకింకేం కావాలి" అన్నాడు నహుషుడు వినయంగా. "రాజా! నీకు ధర్మపరత్వం, దేవేంద్ర వైభవం కలుగుతాయి" అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు. నహుషుడు పరమానంద భరితుడయ్యాడు. "సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని" చెబుతూ నారదుడు ధర్మరాజుకి కథ చెప్పాడు.       

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం

ఆనందపాలుడు ఆ వినతిపత్రం చదివి, వెంటనెె ఒకసైనికుని పిలిపించి, అతనికి ఏదోవిషయం రహస్యంగా చెప్పి పంపాడు. ''నాయనా! ఏదీ నీవు శిసు ్తచెల్లించి న పత్రం?'' ని దగ్గరగా పెట్టుకుని పరిశీలించి,'' నీవు శిస్తుకట్టడానికి ఎంత సొమ్ము ఇచ్చావు?'' అని అడిగాడు. దానికినాగప్ప'' అయ్యా! నేను పది బంగా రుకాసులు ఇచ్చా ను. నాకు ఐదువెండికాసులు తిరిగి ఇవ్వవల సి ఉండగా, అవి ఇవ్వకనే రసీదుపత్రం ఇచ్చాడు లేఖకు డు , 'ఇదేమినిటి?' అడిగితే, వెళ్ళి దిక్కు న్న చోట చెప్పుకోమ న్నాడు. రెక్కా డి లేకానిడొక్కడని నిరుపేదలం, మా మొర ఆలకించేవారెవరు? మీరే న్యాయం చేయాలి''అని విన యంగా కోరాడు. ఆనందపాలుడు లేఖకుని పిలిపించి'' దీనికి నిసమాధానమేమి'' అని ప్రశ్నిం చాడు. ''ప్రభూ! నేను తిరిగి ఇవవ్వలసిన ఐదు వెండి కాసులూ ముందుగా ఇచ్చేసీ, ఆపైన, రాజ ముద్ర వేసి శిసు ్తరసీదు ఇచ్చాను. ఐతే ఆసమయంలో అక్కడెవ్వరూలేనందున నేను సాక్ష్యం చెప్పించలేను'' అన్నాడు భయభయంగా.
మీరెవ్వరూసాక్ష్యం చెప్పినవసరంలేదు. నేనే చెప్పాను దోషమెవరిదో!'' అంటూ మహారాజు విజయవర్మ సమీపానికి వెళ్ళి, ఆ రశీదు పత్రాన్ని ఇచ్చి రహస్యంగా ఏదో చెప్పాడు. ఆ రసీదు అందుకుని దగ్గరగా పెట్టుకుని చూశాడు విజయవర్మ. ''ఆనందపాలా! నీవే ఈసమస్యను పరిష్కరించు'' అన్నాడు. మహారాజా! మనం మన రాజోద్యోగులకు జీతాలు పెంచి చాలా కాలమైంది. ముందుగా చిరు ఉద్యోగుల కు ఈ మాసం నుండీ జీతాన్ని పెట్టింపు చేయవలసినదిగాను, చిరుద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కూడా కలిగించమని, ఈ రైతుకు ఇవ్వలసిన ఐదు వెండికాసులకూమరో ఐదు కలిపి పది కాసులు ఖజానా నుండీ చెల్లించవలసినది గాను, పేదరైతులకు శిస్తు సొమ్ము సగానికి తగ్గించి వారిని ఆదుకోవలసినదిగాను, మనవిచేసుకుంటున్నాను. ''అన్నాడు. ఆ తీర్పు విని మహారాజు ఆశ్చర్యపోగా సభికులంతా అయోమయంలో పడ్డారు. ఉద్యోగులంతా కరతళధ్వనులు చేశారు. విజయవర్మ ''ఆనందపాలా! నీనిర్ణయాలు ఆమోదిస్తున్నాను, నీవే సభికులకు విష యం వివరించ కోరుతున్నాను. నీవు గుర్తుచేసే వరకూ నా కర్తవ్యం మరచి నందుకు బాధపడుతున్నాను''అన్నాడు రాజు.

ఆనందపాలుడు తన స్థానం నుంచి లేచినిలబడి, స్వరంసవరించుకుని ''ప్రభూ! సభి కులారా! మన నిత్యజీవన సంభా రాలన్నీ సామాన్యులకు అందుబా టులోలేని విధంగా ధరలన్నీ పెరిగి పోయాయి. సామాన్యుల జీవనం భారమైంది. కనుకే చిరుద్యోగులు వారికి అందుబాటు లో ఉన్నంత మేరకు ప్రజలనుండీ కొంత సొమ్ము మిగిలించు కోజూడటం జరుగుతు న్నది. ఈ విషయం నాకు చూచాయ గా తెలుస్తునే ఉంది చారుల వలన. కానీ అది ప్రభువుల సమక్షానికి వచ్చిన ప్పుడు వారే పర్యవసానం ప్రస్తావించాలని ఇంతకాలం ఆగా ను. నేను పంపిన సేవకుడు వెళ్ళి ఈ లేఖకుని ఇంటి పరిస్థితి పరికించి వచ్చి చెప్పాడు. వయోభారంతో అనా రోగ్యం తో ఉన్న తల్లి, వింత వ్యాధి తో బాధపడుతున్న భార్య దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతడు వారికి వైద్య సేవలు అందించడానికి కావల్సిన డబ్బుల కోసం ఇలా చేశాడు. అది అతడి తప్పుకాదు.

అతని పరిస్థితి గ్రహించిన నేను ప్రభువుల వారిని చిరు ఉద్యోగుల జీతభత్యాలు పెంచమని కోరాను. అంతేకాదు అన్ని నాణాల సంచు లలోనూ కస్తూరీతైలం ఉంచుతాను. అది ఎవ్వరికీ తెలీయదు.

కాసులను తీసే సమయంలో ఆ తైలం వారికి చేతులు అంటుకుని రసీదు పత్రానికి అంటుకుంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నివాసన తెలుస్తుంది ఈ రైతుకువెండికాసులు ఇవ్వలేదని తైలం అంటనందున తెల్సుకున్నాను. మహారాజా! ఎవ్వరూ పుట్టుకతో దొంగలూ, లంచగొండులుకారు. వారిపరిస్థితులు, వారినలా చెస్తాయి. ప్రభువులు ప్రజల, ఉద్యోగుల అవసరాలు గుర్తిస్తే ఈ ఇబ్బందులు ఏర్పడవు. నేనే ముందుగా ప్రభువులకు విన్నవించుకోకపోవడం నాదే పొరబాటు.'' అని ముగిం చాడు. ఆనంపాలుడి తెలివిని అభినందిస్తూ.. ఆయన చేసిన సూచనలను ఆమో దించాడు రాజు.


ప్రజల బాధల గుర్తించే ప్రజ్ఞ పాలకులకుంటే అంతటా నీతినిజాయితీలు కలకాలముంటాయి.

Saturday, June 15, 2013

పులి-కప్ప

ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. "ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది.

ఇక ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో, "ఒరే కుర్రవాడా! సంస్కారం ఉందా, నీకేమయినా? దున్నపోతులా ఉన్నావు! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!" అని అరిచింది.
ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. "అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా" అంటూ గాండ్రించింది.
కప్ప గర్వంగా తల పైకెత్తి "నువ్వు నన్ను తినలేవు. నేను కప్పల రాజును. నీకంటే తెలివైన వాడిని!" అంటూ బెకబెకలాడింది.

"నిరూపించు చూద్దాం!" అంది పులి.

"అయితే, దుమకడంలో, తినటంలో, కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా" అన్నది కప్ప.
`సరే'నంది పులి.

ఇక దూకే పందెం మొదలయింది. పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది. అవతలి గట్టును దాటి మూడు మీటర్లు దూకిందది. కానీ ఆశ్చర్యం! కప్ప పులి కంటే ఒక మీటరు ఎక్కువ దూరం దూకగలిగింది! అయితే అది పులి తోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియలేదు.
ఇక కప్ప విజయ గర్వంతో "నేను ఈ రోజు ఉదయాన్నే రెండు పులులను తిన్నాను. మరి నువ్వేమి తిన్నావు?" అని అడిగింది.

ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు.


పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది.

పులి కొంచెం సేపు ఆలోచించి, ఇక అక్కడి నుండి పారిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకుంది. వెంటనే ఏటి అవతలికి దూకి, ఆపకుండా అడవిలోకి పరుగుతీసింది. చాలా సేపు పరుగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురయింది.


రొప్పుతూ, భయపడుతూ ఉన్న పులిని చూసి, నక్క "సంగతేంటి పులిమామా?" అని అడిగింది.
జరిగినదంతా నక్కకు వివరించింది పులి.

"ఒక్క పూటకు రెండు పులులను తినే కప్ప ఎక్కడా ఉండద"ని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క. కావాలంటే తనవెంట కప్ప దగ్గరకు రమ్మని, అప్పుడు ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని పిలిచింది కూడా.

నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకుగాను, ఇద్దరి తోకల్నీ కలిపి కట్టేసుకునే షరతుమీద కప్ప దగ్గరికి ఇంకోసారి వెళ్లేందుకు అంగీకరించింది పులి.

ఇక రెండూ తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకొని, ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవిగా వాటికి ఎదురుగా నిలబడి " ఓ! తెలివైన నక్కా! నువ్వే నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను. కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను" అన్నది గట్టిగా.


ఆ మాటలు విన్న పులి వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించేసుకున్నది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరుగెత్తడం మొదలెట్టింది. నక్క ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరుగెత్తాక గానీ అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్లంతా హూనమయిపోయి, శరీరమంతా రక్తమోడుతూ ఉండింది. చాలా ఎముకలు విరిగిపోయాయి పాపం.

 అప్పుడుగానీ తోక ముడిని విప్పలేదు పులి! విప్పి, అయాసపడుతూ, అది నక్కతో "ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు" అని చెప్తూ, అయినా కోపం ఆగక దాని చెంప ఛెళ్ళుమనిపించింది! 

కనువిప్పు

ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.

వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.

అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.

బాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. 'ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.

కొండయ్యకు కోపం వచింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.

కట్టెలు కొట్టువాడు - బంగారు గొడ్డలి

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.

అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

వాడు ఇంటికి వెళ్ళి ఊరంతట ఈ సంగతి చెప్పెను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్భుద్ది పుట్టెను. మరుసటి దినము తాను ఒక ఇనుపగొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలని గొడ్డలిని నీటిలో పడవేసెను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలు పెట్టెను. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయెనని చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పెను. దేవతకు కోపం వచ్చి, వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా, తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలికూడా దక్కలేదు.

నీతి: నిజము మేలు చేయును. అబద్దము ఆపద తెచ్చును. 

ఎప్పుడో చదువుకున్న చందమామ కథ


 అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది.

ఒకరోజు దూరపు బంధువు ఒకతను ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి మన సౌరభూడి ఇంటిలో దిగాడు. సౌరభూడి కవిత్వం గురించి విని మద్యాహ్నం తనుకూడా తీరిక చేసుకొని విన్నాడు. విని బాగుంది అని చెప్పి, ఊరకుండకుండా ఇలా అప్పుడప్పుడూ కవిత్వం చెప్పకపోతే ఏదన్నా పుస్తకం వ్రాయరాదు అని ఓ ఉచిత సలహా ఇస్తాడు.

దానికి సమాధానంగా సౌరభుడు తను ఎంతోకాలం నుండి వ్రాస్తూ పూర్తికావచ్చిన 'దేవపరిణయం' అనే పుస్తకాన్ని ఇంటికి వెళ్ళాక చూపిస్తాడు. దాన్ని చదివిన పెద్దాయన చాలా సంతోషించి రాజాశ్రయం పొందితే కవిత్వం ఇంకా రాణిస్తుందని చెప్పి ఒకసారి తనతో పాటు రమ్మని తన ప్రక్కింటిలోనే రాజకవి ఉంటాడని పిల్చినాడు.

ఇంటిలోని వారు, పొరుగువారు కూడా వచ్చినాయనకే వంతపాడేసరికి సౌరభుడు అతనితో పాటు బయలుదేరి రాజధాని చేరతాడు.

పక్కింటాయనే కాకుండా రాజకవి మన సౌరభుడి చుట్టానికి మంచి మిత్రుడు కూడా! అతన్ని కలుసుకొని తన పుస్తకం చూపిస్తాడు. మొత్తం ఓపిగ్గా చదివిన రాజకవి కొన్ని మార్పులూ, చేర్పులూ సూచిస్తాడు. అవి అన్నీ చేసి రాజుగారికి వినిపించి మంచి బహుమతి మెచ్చుకోళ్ళు పొందుతాడు.

తరువాత అందరూ అక్కడనే ఉండి మంచి మంచి కవిత్వం వ్రాయమని అడుగుతారు, కానీ వినకుండా ఇంటికి వెళ్ళి తన పుస్తకాన్నీ, బహుమతులను ముందేసుకొని బావురుమంటాడు. తను వ్రాయాలనుకున్నది ఒకటి చివరికి మార్పులూ, చేర్పులు తరువాత ఆత్మలేని శరీరంలా తయారవుతుంది. ముగింపు కూడా తను అనుకున్నది ఒకటి అక్కడ వ్రాసినది మరొకటి.

ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవచనాలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. "వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.

రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.

మా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి "పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.

ఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత "కథ అంతా పుక్కిటి పురాణం" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు.

ఊరికోసం బావి

వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము.

ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది.

ఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.

ఇది నిజం

ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. అప్పుడే ఆ సంసారం రచ్చకెక్కకుండా ఉంటుంది. 'స్నేహితం' కూడా ఇలానే ఉండాలి తెలుసా" అని సలహా ఇచ్చాడట.

విన్న ఆ ఇద్దరూ పక్కున ఓ నవ్వు నవ్వారటా. పైపెచ్చు ఆ వ్యక్తి వంక పిచ్చివాడివన్నట్లు చూస్తూ, "చూడూ ఒక్క మనిషి తన వంద తరాల బాగుకై పరితపిస్తున్నప్పుడు, ఇద్దరం మనుషులం కలిస్తే గొడవకాక ఏమవుతుంది. ఒక్కడి ఆలోచనైతే అది పాపమైనా, పుణ్యమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఇది తప్పు అనిచెప్పే దిక్కులేక చేసుకుపోతూనే ఉంటాడు కానీ, మంచీ చెడు అని రెండు పదాలు ఉన్నట్లు మేమిద్దరం ఉన్నాము. కాబట్టే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి చేసే విషయంలోనే మేము కీచులాడుకుంటామే కానీ, మరొకటికాదు" అన్నారట.

విన్న ఆపెద్ద మనిషి "మీరు చెప్పేది నాకు అర్ధం కావటంలేదు. కొంచం విపులంగా చెప్పండి" అని అడగగా, "ఇందులో అర్ధమైయ్యేలా చెప్పేదేముంది బాబుగారూ నంగిలా నిమ్మనంగా ఉండి గోతులు త్రవ్వే వారి వలన సమాజానికి హానికానీ కల్మషం లేకుండా గలగలా సెలయేరులా గోలచేసే మావల్ల ఎవరికీ హాని ఉండదు ఏమంటారు" అని అడిగారట. ఆ విషయం నిజమేననిపించిన ఆ ఆసామి తనదారిన తాను వెళ్ళిపోయాడు. 

ఏడు కూజాల కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.

ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.

రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.

రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకాక్ ఊజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు.

ఐకమత్యమే బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. "ఐకమత్యమేబలం" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి 

ఆత్మవిశ్వాసము

కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.

సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం" అని వెండి నాణెము తీసి చూపించి "నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.

నేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు.

ఆటో డ్రైవర్ నిజాయితీ

ఏలూరు పట్టణములో నరేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సంపాదన చాలక అవస్థలు పడుతుండేవారు.తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే. అయినా నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున ఇద్దరు దంపతులు అతని ఆటోలో అశోక్‌నగర్‌కి స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంటిలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ వూడదీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు వున్నాయి. వెంటనే తల్లిదండ్రులకి చెప్పింది.

నరేష్ వెంటనే భోజనము ముగించుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి బ్యాగ్ విషయము చెప్పి, వారి ఇంటి గుర్తులు చెప్పాడు. పోలీస్ వారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళి విషయము చెప్పగా, వారు బ్యాగ్ తమదేనని ప్రయాణ బడలికలో గమనించలేదని చెప్పి, ఆటో డ్రైవర్ నిజాయితీకి సంతసించి పదివేల రూపాయలు ఇచ్చి, తమ పిల్లల్ని రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకొని వెళితే నెలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేసి తన సంపాదన పెంచుకున్నాడు. అంతేగాక ఆ వీధిలోని పిల్లల్ని తీసుకెళ్ళి తన సంపాదన పెంచుకొని తన తల్లి ఆరోగ్యము బాగు చేయించుకొని సుఖముగా ఉన్నాడు.

నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అని గ్రహించి నిజాయితీగా ఉండటం అలవరచుకోవాలి. 

అసూయ

ఒక ఆసుపత్రి గదిలో ఇద్దరు రోగులు వుండేవారు. ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండేది. రెండవ రోగి మంచం కిటికీకి దూరంగా వుండేది. కిటికీ దగ్గర వున్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యం ఎంత అందంగా వుంది. ఎంత పెద్ద మైదానం. ఎంత పచ్చని పచ్చిక. ఎంత చక్కని తోట. ఆ చక్కని తోటలో ఎన్నెన్ని రంగుల సువాసనల పూవులు. ఈ చల్లని సాయంకాలంలో ఎంత చల్లని గాలి వీస్తోంది. ఈ గాలిలో ఆ పచ్చిక అటూ ఇటూ కదులుతూ మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఆ తోట మధ్య ఎంత పెద్ద చెరువు!ఎ న్ని బాతులు, ఎన్ని కలువ పూలు అని మంచం మీది రోగికి వర్ణించి చెబుతుండేవాడు. ఇది వింటున్న మంచం మీది రోగికి "నేనూ హాయిగా కిటికీ దగ్గర వుంటే బాగుండేది. బయట దృశ్యాలన్నింటినీ చూసేవాడ్ని" అని అనుకున్నాడు. ఆ రాత్రి కిటికీ దగ్గర రోగికి దగ్గుతో చాలా సీరియస్ అయింది. ప్రక్క మంచం మీద రోగి బటన్ నొక్క గలిగే స్థితిలో వున్నా నొక్క లేదు దుష్టబుద్దితో.

కిటికీ దగ్గర రోగి రాత్రి మరణించాడు. మరునాడు ఉదయం పక్క మంచం మీద ఉన్న రోగి కోరికపై అతన్ని అతి కష్టం మీద కిటికీ దగ్గర మంచం మీద పడుకోపెట్టారు. అతను అతి కష్టం మీద లేచి కూర్చుని బైటకు చూస్తే, బైట ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప ఏమీలేవు. "ఇన్ని రోజులూ నా తోటి రోగి నన్ను సంతోషపెట్టడానికే ఇన్ని దృశ్యాలూ కల్పించి చెప్పేవాడు. అతను నా మిత్రుడు" అని రెండవ రోగి బాధపడ్డాడు.

నీతి: పక్కన వాళ్ళకు ఉంది అని మనకు లేదని ఎప్పుడూ అసూయ పడకూడదు.

అసలుకి ఎసరు

ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయినాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.

ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయి.

ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి.

అభిమాని

అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.

పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.

అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.

ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.

సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.

మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.

"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.

ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.

అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ను షాపు యజమానికి ఇచ్చాడు. ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని బాబూ! నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్‌కు చూపించుకో అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి ఏంటిరా! కాలికి ఏమి అయింది? ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.

చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది. అని మరలా అబద్దం చెప్పాడు వాసు. నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు. చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు. ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది. అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు. ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది అందుకే పెద్దలు అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో. ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు. బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది. 

అపాయానికి ఉపాయము

అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.

ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.

అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం. అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.

కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.

"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.

"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా "నేనే ఈ అడవికి రాజుని" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. "మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి". అంది.

కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు.