Pages

Tuesday, October 22, 2013

ఉపకారం

రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజూ అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్ర్రెలను తీసుకెళ్ళి మేపేవాడు. ఓరోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు.

కొన్ని రోజుల తరువాత, అతను ఒక రాతిగుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి, అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరుగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శ బ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస,ి ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే, అప్పటిదాకా అతను కూర్చున్ను రాతి గుండు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా, అదే గద్ద తన ముందుకు వచ్చి, అతని టోపీని అతని మీద విడిచిపెట్టి, మళ్ళీ పైకి ఎగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం మరిచిపోవు అని తెలుసుకున్నాడు.

చెడ్డ కాకి

ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్ళే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణీకులకు చల్లటి నీళ్ళు ఇచ్చి, దాహం తీర్చేది.

ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే, చూసి ఓర్వలేక కొమ్మల మీద గెంతుతూ, ఆకులు గలగల లాడిస్తూ, కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది.

ఒక రోజు ఒక హంస ఆ చెట్టు మీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం.. చెట్టు ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి, ఎండ అతనిపై పడకుండా చూడసాగింది.

దుష్టబుద్ధి కాకి ఇది సహించలేక పోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించింది.

వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్ట వేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకుని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి, గాయమైంది.హంసకి ఆ గాయం మానడానికి చాలాకాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడమంటే ఇదే

వేటగాడు - చిలుక

ఓ అడవిలో ఒక చిలుకల గుంపు నివసించేది. ఇది గమనించిన ఒక బోయవాడు, ఓ రోజు ఉదయాన్నే వచ్చి చాలా చిలుకల్ని పట్టుకున్నాడు. 'ఆహా! ఎంత అందంగా ఉన్నాయి ఈ చిలుకలు. వీటిని పట్టణంలో మంచి ధరకు అమ్మవచ్చు. వీటికి కొన్ని చిన్న చిన్న మాటలు నేర్పితే ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చు' అని అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అతడు పట్టిన చిలుకలలో కుశలబుద్ధి అనే ఒక చిలుక ఉంది. అది చాలా తెలివైనది.

ఎలాగైనా ఆ బోయవాడి నుండి తప్పించుకోవాలనుకుంది. బోయవాడు చిలుకలను తన ఇంటికి తీసుకెళ్లి, ఒక్కో చిలుకను ఒక్కో పంజరంలో బంధించి, వాటికి ఆహారం, నీళ్ళు పెట్టాడు. తప్పించుకోవడానికి అప్పటికే ఒక ఉపాయం ఆలోచించిన కుశలబుద్ధి నీటిని కానీ, ఆహారాన్ని కానీ ముట్టుకోక, ఏదో రోగం వచ్చినట్టు, పంజరంలో పడి ఉంది.

'అయ్యో! దీనికి ఎదో జబ్బు చేసినట్టు ఉందే, ఇది కోలుకున్నాక అమ్ముదాం' అని మనసులో అనుకుంటూ, మిగతా చిలుకల్ని పట్టణానికి తీసుకెళ్ళి, అమ్మి బాగా డబ్బు సంపాదించాడు. అలా రోజులు గడుస్తున్నాయి గానీ చిలుక అసలు అహారం ముట్టుకోవడం లేదు. దీంతో అది బక్కచిక్కిపోయింది. ఆ బోయవాడు దానికి అసలు ఏమైందో చూద్దాం అనుకుంటూ ఆరుబయట కూర్చుని దాన్ని పంజరం నుండి బయటకి తీశాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్న ఆ చిలుక తుర్రుమని ఎగిరిపోయింది

గాడిద ప్రేమ!

రంగన్న ఒక గాడిదను, కుక్కను పెంచేవాడు. గాడిద చెరువుకు మాసిన దుస్తుల మూటలు మోసుకుని వెళ్ళేది. ఆ దుస్తులు ఉతికాక రంగన్న వెంట ఇంటింటికి తిరిగి ఎవరివి వారికి చేరవేసేది. ఈ విధంగా ఆ గాడిద దినమంతా పనిచేస్తూ విశ్రాంతి లేకుండా ఉండేది.

ఇంటికి కాపలాకాసే కుక్క మాత్రం రోజంతా ఆడుతూ పాడుతూ గడిపేది. హాయిగా దినమంతా ఇంటి అరుగుమీద పడుకుని, నిద్రపోయేది. రంగన్న భార్య పెట్టే భోజనం శుష్టుగా ఆరగించేది. రంగన్న పండూ ఫలహారం ఏది తిన్నా కొంచెం కుక్కకు పెట్టేవాడు. సాయంత్రం రంగన్న ఇంటికి తిరిగి రాగానే వీధి మలుపు దగ్గరే ఆ సంగతి పసిగట్టి, కుక్క తోక ఊపుతూ ఎదురు పరుగెత్తుకు వచ్చేది. రంగన్న శరీరాన్ని నాకుతూ, రెండు కాళ్ళెత్తి అతని మీద ఎగబడేది. రంగన్న ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ప్రేమగా దాని తల మీద నిమిరేవాడు.

ప్రతిరోజూ ఇదంతా చూసిన గాడిదకు ఒక ఆలోచన కలిగింది. యజమానితో కుక్క ఆ విధంగా మెలగడం వల్లే యజమాని దానిని అంత ప్రేమగా చూస్తున్నాడు. తను కూడా కుక్కలా యజమాని మీద ప్రేమ ఒలకబోయాలి అని అనుకుంది.

ఆ రాత్రి రంగన్న భోజనం ముగించుకుని అరుగు మీదకు వచ్చాడు. వెంటనే గాడిద సంతోషంగా అరుస్తూ కుక్కలా రెండుకాళ్లూ పైకెత్తి రంగన్న పైకి దూకింది. గాడిద బరువు భరించలేని రంగన్న వెల్లకిలా పడిపోయాడు. గాడిద అతని ముఖాన్ని నాకడానికి ప్రయత్నించడంతో భయపడి రంగన్న గట్టిగా కేకలు వేశాడు. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకొచ్చి దుడ్డు కర్రలతో గాడిదను చావబాదారు. పారిపోతున్న గాడిదను వెంటబడి ఊరవతలకి గెంటేశారు. దానితో ఆ గాడిదకు తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది.

జాలరి - రెండుచేపలు

ఓ కొలనులో చాలా చేపలు ఉండేవి. వాటిలో రెండుచేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ రెండు చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి. ఓ రోజు ఒక చేపలు పట్టేవాడు చేపల కోసం వల విసిరాడు. ఒక చేప వలలో పడగా ఇంకొకటి తప్పించుకుంది.

''ఆహా! ఈ చేప ఎంత పెద్దగా ఉంది. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది'' అని సంతోషపడ్డాడు చేపలవాడు. ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తుండగా అది ఏడుస్తున్నట్టు గ్రహించాడు అతడు.

''ఎందుకు ఏడుస్తున్నావు? వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా?'' అని అడిగాడు చేపలవాడు ఆ చేపని.

''నేను నా గురించి ఏడవట్లేదు. నా స్నేహితుడు కోసం ఏడుస్తున్నాను. అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది'' జవాబిచ్చింది ఆ చేప.

''బాధపడకు! నువ్వొక్కడివే వలలో చిక్కుకున్నావు. ఇంకో చేప తప్పించుకుంది'' అని అన్నాడు చేపలవాడు.
ఇది విని ఆ చేప చాలా సంతోషించింది.

''ఓ చేపలవాడా! నా మాట విను!'' అని నీటి నుంచి వినిపించింది. చేపలవాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని నీళ్ళల్లోకి చూశాడు. రెండో చేప నీటిపై తేలుతూ కనిపించింది.

''నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా?'' అడిగింది రెండోచేప. ''అవును!'' బదులిచ్చాడు చేపలవాడు.

''నీకు చేపలన్నీ సమానమే కదా! దయచేసి నన్ను పట్టుకుని, నా స్నేహితుడిని విడిచిపెట్టు! లేకపోతే నన్ను కూడా పట్టుకెళ్ళు. నేను నా స్నేహితుడు లేకుండా జీవించలేను'' అని ప్రాధేయపడింది రెండోచేప.

చేపలవాడు ఆ చేపల స్నేహానికి ముగ్దుడయ్యాడు. ''మిమ్మల్ని విడదీస్తే ఈ లోకంలో ఎవరూ కూడా నన్ను క్షమించరు!'' అని అంటూ మొదటిచేపను నీటిలో వదిలేశాడు.

వంకర చెట్టు

ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మొదలు, కొమ్మలు వంకరగా ఉండి చూడ్డానికే ఆ చెట్టు వింతగా ఉండేది. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు పొడవుగా, మంచి ఆకారంతో ఉండేవి. వాటిని చూసి ఆ వంకర చెట్టు 'ఆహా! ఆ చెట్లన్నీ ఎంత బాగున్నాయో!' అని అనుకుంటూ 'నేను ఎంత దురదృష్ట వంతురాలిని. నేనొక్కదానినే ఇలా వంకర టింకరగా, వికారంగా ఉన్నాను' అని బాధపడేది.

ఓ రోజు అడవికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. ఆ వంకర చెట్టును చూసి 'ఈ చెట్టు కట్టెతో ఏ వస్తువు చేయడానికి వీలుకాదు. ఈ ఒక్క చెట్టును వదిలి, మిగిలిన ఆ పొడవైన, మంచి ఆకారంతో ఉన్న చెట్లని కొట్టేస్తాను' అని అనుకుంటూ ఆ వంకర చెట్టుని తప్ప మిగతా చెట్లను కొట్టేశాడు.అప్పుడా చెట్టు 'నేను నా ఆకారము చూసి బాధపడేదాన్ని. ఈ రోజు ఈ ఆకారమే నన్ను ఆ కట్టెలు కొట్టేవాడి నుండి కాపాడింది' అని అనుకుని, ఆ రోజు నుండి హయిగా జీవించసాగింది.

గాడిద కథ

ఒకరోజు ఒకతను తన కొడుకును, గాడిదను తీసుకుని బజారుకి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్దమనిషి వీరిని చూసి, ''అదేంటయ్యా! అంత గాడిదను పెట్టుకుని నడుస్తూ పోతున్నారు?'' అని అడిగాడు.
నిజమే కదా అనుకుని ''బాబూ! నువ్వు ఎక్కు'' అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి, తను నడుస్తూ వెళ్తున్నాడు.

ఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్లని ఆపి, ''ఏం కొడుకువయ్యా నువ్వు? పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిదెక్కి పోతున్నావా?'' అన్నాడు.

దాంతో కొడుకు దిగిపోయి, తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా ఇంకొంతదూరం పోయాక ఇంకో మనిషి వీళ్లని ఆపి, ''అసలేం తండ్రివి నువ్వు? చిన్న వాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా?'' అన్నాడు.
అది విని, కొడుకు కూడా గాడిదపైకి ఎక్కి కూర్చున్నాడు.

అలా కాస్త దూరం వెళ్లారో లేదో - ఇంకొక అతను వీళ్లని చూసి, ''ఛ! ఛ! మీకసలు దయ, జాలి ఉన్నాయా? మీరే గాడిదల్లా పెరిగి, పాపం నోరు లేని జీవంపై కూర్చుంటారా?'' అన్నాడు.

ఇదెక్కడి గొడవరా బాబూ అనుకుని, తండ్రీ కొడుకులిద్దరూ దిగి, గాడిదను భుజాల మీదకెత్తుకుని నడవసాగారు. అది చూసి దారిన పోయేవాళ్లందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టారు. దాంతో గాడిద కంగారుపడి, పారిపోయింది.
చూశారా! ఏమైనా అందర్నీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా!

నిజమైన స్నేహితుడు!

పరీక్షిత్‌, గోపీనాథ్‌ ఇద్దరు స్నేహితులు. ఒకరిని వదిలి ఒకరు ఒక్కక్షణం కూడా విడిచి ఉండేవాళ్ళు కాదు. స్నేహితులంటే వాళ్ళిద్దరిలా ఉండాలని ఆ ఊరి వాళ్ళంతా ఎంతో పొగిడేవారు.
 
ఒకరోజు పరీక్షిత్‌, గోపీనాథ్‌లు కలిసి మరో స్నేహితుడి పెళ్ళికి పొరుగూరుకి వెళుతున్నారు. ఆ ఊరికి చేరుకోవాలంటే అడవి దాటాలి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ దట్టమైన అడవిమార్గంలో ప్రయాణిస్తు న్నారు. ఇంతలో ఒక ఎలుగుబంటి అరుపు వినిపిం చింది. అది ఆ దగ్గరలోనే ఉన్నట్టు ఆకుల గలగలలా డాయి. భయంగా స్నేహితులిద్దరు ముఖాలు చూసు కున్నారు. వాళ్ళు ఊహించినట్టుగానే పక్కనున్న పొదల్ని తప్పించుకుంటూ ఎలుగుబంటి రావడం కనిపించింది. గోపీనాథ్‌ గబుక్కున చెట్టెక్కి పోయాడు. చెట్టెక్కడం రాని పరీక్షిత్‌ భయంగా నిలబడిపోయాడు.

'ఎలుగుబంటి చాలా దగ్గరగా వచ్చేస్తోంది. పారిపోయే సమయం లేదు. ఎలా ఈ ఆపదలోంచి బయటపడటం?' ఒక పక్క భయపడుతూ, మరోపక్క ఆలోచించాడు. అడవి జంతువులకు సంబంధించి తను విన్న విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. 'క్రూర మృగాలు చనిపోయిన శరీరాలను గాయపర్చవు' తన తాతయ్య చెప్పిన సంగతి స్ఫురించింది. వెంటనే పరీక్షిత్‌ నేల మీద పడుకుండి పోయాడు.

ఎలుగుబంటి పరీక్షిత్‌కి దగ్గరగా వచ్చింది. అతని ముఖం దగ్గర ముఖం పెట్టి చూసింది. పరీక్షిత్‌ ఊపిరి బిగపట్టాడు. ఎలుగుబంటి అతన్ని నేలపైన అటు ఇటు దొర్లించింది. చూట్టూ తిరిగింది. మళ్లీ ఒకసారి అతని ముఖం దగ్గర వాసన చూసింది. అతను చనిపోయాడని నమ్మింది ఎలుగు బంటి.

కాస్సేపు అక్కడే తచ్చాడి ముందుకు వెళ్ళిపోయింది. పొదల చాటుకు కనుమరుగైంది ఎలుగుబంటి. ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక నెమ్మదిగా కిందకు దిగాడు గోపీనాథ్‌. పరీక్షిత్‌ని తట్టి లేపాడు.

'హమ్మయ్య! గండం గడిచింది' అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు పరీక్షిత్‌.

''నీ చెవిలో ఎలుగుబంటి ఏం చెప్పింది?'' ఆసక్తిగా అడిగాడు గోపీనాథ్‌.

అతని ప్రవర్తనవల్ల బాధపడుతున్న పరీక్షిత్‌ ''స్వార్థపరులైన వారితో స్నేహం చేయకూడదని ఎలుగుబంటి నాకు ఉపదేశం చేసింది'' అని చెప్పి ముందుకు కదిలాడు.

కష్టాలలో తోడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు.

చెడ్డ బేరం

పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లోనే మిగతా జంతువులతో పాటు కలిసి జీవించేవి. ఒకరోజు ఒక గుర్రం ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది. ''దయచేసి నన్ను కాపాడండి! అడవిలోని ఒక సింహం నన్ను చంపాలనుకుంటోంది'' అంటూ ప్రాధేయపడింది.

''భయపడకు మిత్రమా! నేను నిన్ను రక్షిస్తాను. సింహం నిన్ను ఏమీ చేయలేదు'' అన్నాడు మానవుడు.

దానితో గుర్రం ఎంతో సంతోషించింది. కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. తిరిగి మానవుడు ఇలా చెప్పాడు ''మరి నువ్వు నేను ఏం చెప్పినా వినాలి!'' అని.

''నువ్వేం చెప్పినా చేస్తాను. నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు'' అంది గుర్రం.

''సరే మరి నువ్వు నీ మీద నన్ను స్వారీ చేసుకోనివ్వాలి.'' అన్నాడు.

ప్రాణభయంతో ఉన్న ఆ గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకొంది. మానవుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు. అక్కడ పశువుల కొట్టంలో దాన్ని ఉంచి ''ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు. నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమీ ఉండదు. నేను నిన్ను బయటకు తీసుకెళ్ళినప్పు డల్లా నీ వీపు మీద స్వారీ చేస్తుంటాను. నేను నీతో ఉంటే ఆ సింహం నిన్ను ఏం చేయలేదు'' అని అన్నాడు. ఆ తర్వాత తలుపులు వేసి వెళ్ళిపోయాడు.

గుర్రం ఒంటరిగా మిగిలిపోయింది. ''నేనిక్కడ జాగ్రత్తగా ఉండగలను. కానీ నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. నా రక్షణను కొనుక్కున్నాను కానీ స్వేచ్ఛను కోల్పోయాను. ఇది చాలా చెడ్డ బేరం'' అనుకుని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం.
ఇక ఆ రోజు నుండి మానవుని అదుపాజ్ఞలో బతకసాగింది.

ముగ్గురు దొంగలు!

ఒకరోజు బ్రాహ్మ ణుడు మేకను తీసుకుని ఒంటరిగా అడవి మార్గంలో ప్రయాణించసాగాడు. అది చూసి ముగ్గురు దొంగలు ఆ బాటసారి దగ్గర నుండి మేకను దొంగలించాలనుకున్నారు.

''ఏరు చూడరా..! ఒంటరిగా ఉన్నాడు. ఈ అడవిలో అరిచినా కాపాడే దిక్కులేదు. అతని మేకను లాక్కుని పారిపోదామా?'' అన్నాడు ఒకడు.

''ఆ పని మనం చేయడం ఎందుకురా? నాలుగు తగిలిస్తే వాడే మేకను వదిలి పారిపోతాడు.'' అన్నాడు రెండోవాడు.
''బెదిరించో.... లేదా రహస్యంగానో దొంగతనాలు చేసి చేసి విసుగ్గా ఉందిరా... మన బుర్రలు ఉపయోగించి, అతన్ని బురిడీ కొట్టిద్దాం!'' అంటూ తన ఆలోచన చెప్పాడు మూడోవాడు. దానికి మిగతావాళ్ళు కూడా ఒప్పుకున్నారు.
ఇద్దరు చెట్టు చాటున దాక్కోగా, ఒకడు మాత్రమే బ్రాహ్మణుడి ముందుకు వెళ్ళాడు.

''అయ్యా, నమస్కారం! మీ కుక్క భలే అందంగా ఉంది ఇది ఏ జాతిది?'' అంటూ అడిగాడు.

''పరాచికాలు అడడానికి నీకు నేనే దొరికానా? మేకను పట్టుకుని కుక్కంటావా? వెళ్ళవయ్యా వెళ్ళు!'' అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా.

''ఏమిటి? ఇది మేకా? అహ్హా..హ్హా..!'' గట్టిగా నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయాడా దొంగ.

కొంతదూరం వెళ్ళాక మరొక దొంగ బ్రాహ్మణుడిని కలిశాడు.

''ఇది విచిత్రంగా ఉందే. గుర్రం ఉండగా ఎందుకు మీరు నడుస్తూ వెళుతున్నారు. దీనిపై స్వారీ చేయొచ్చుకదా?'' అన్నాడు రెండో దొంగ.

''ఏమిటి? నా మేక నీకు గుర్రంలా కనిపిస్తోందా?'' అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా.

''అయ్యా! మీరు గొప్ప పండితుడిలా ఉన్నారు. గుర్రానికి, మేకకు తేడా తెలీదంటే నేను నమ్మను'' అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు.

ఆ మాటలతో కొంత అయోమయంలో పడిపోయాడు బ్రాహ్మణుడు.

మరి కొంతదూరం వెళ్ళాక ఈసారి మూడో దొంగ ఎదురుపడ్డాడు.

''పండితులకు నమస్కారం. గాడిదను మీరు తాకటం ఏమిటి? పైగా దాన్ని మీవెంట తోలుకెళుతున్నారు. ఎందుకో నేను తెలుసుకోవచ్చా?'' అన్నాడా దొంగ వినయంగా.

''ఇది గాడిదా?'' భయంగా మేకవైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు బ్రాహ్మణుడు. ''అవును! ఇందులో సందేహం ఏముంది?'' అమాయకంగా చెప్పాడు మూడో దొంగ.

ఆ మాటలతో విపరీతంగా భయపడ్డాడు బ్రాహ్మణుడు. 'బహుశా ఇది దెయ్యమేమో? ఒక్కొక్కరికి ఒకోలా కనబడుతోంది. బాబోరు దీన్ని నా వెంట తీసుకుపోయి, నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటానా?' అని ఆలోచించిన ఆ బ్రాహ్మణుడు మేకను అక్కడే వదిలి పారిపోయాడు.

ఆ బ్రాహ్మణుడి తెలివి తక్కువతనానికి పెద్దపెట్టున నవ్వుకుంటూ... మేకను తీసుకుని వెళ్ళిపోయారు ముగ్గురు దొంగలు.

కుక్క-గాడిద

ఒక బట్టలు ఉతికేవాడి దగ్గర గాడిద, కుక్క ఉండేవి. కుక్క పగలూ, రాత్రీ యజమాని ఇంటికి కాపలా కాసేది. గాడిద బండెడు బట్టల మూటలు వీపుమీద మోసుకుని చెరువుకు తీసుకెళ్ళేది. కొంతకాలం గడిచాక 'ఇంతవరకూ ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్నిరోజులూ ఈ కుక్క తిండి కోసం అనవసరంగా చాలా ఖర్చు చేశాను'' అని యజమాని తన భార్యతో అన్నాడు.

ఈ మాటలు విన్నది కుక్క. 'రాత్రంతా మెలుకుని ఎంత సేవ చేశాను? నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం యజమాని విస్మరించాడు' అనుకుని ఎంతో బాధపడింది.

ఆ రోజు నుండి యజమాని భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి తిరిగి... ఏమైనా దొరికితే ఇంత తిని, ఓపిక ఉంటే యజమాని ఇంటికి వచ్చేది. లేదంటే ఉళ్లో ఎక్కడో ఒకచోట ముడుచుకుని పడుకునేది. కొన్నిరోజులు గడిచాక... ఒక అర్ధరాత్రి దొంగ ఒకడు యజమాని ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది కానీ మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసికట్టింది.

''ఒక దొంగ మన యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా?'' గుసగుసగా అంది గాడిద. ''అవును తెలుసు'' అంది కుక్క.
''మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు?''

''నా ఇష్టం'' నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.

''నీ ఇష్టప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత'' అని చెప్పింది గాడిద.
''నోర్మూసుకుని పడుకో! అనవ సరమైన సలహాలివ్వకు'' అని కుక్క కోపంగా చెప్పింది. ''సరే నువ్వు మొర గకు. నేను గట్టిగా అరిచి యజమాని ని నిద్రలేపుతాను. కుక్కకంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను'' అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.

లోపల గాఢనిద్రలో ఉన్న యజ మాని ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారంలాంటి నిద్ర చెడగొట్టినం దుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డుకర్ర తీసుకువచ్చి ''ఏం పోయేకాలమే నీకు. అర్ధరాత్రి రచ్చ చేస్తున్నావు''అంటూ గాడిదను రెండు బాది, తిరిగి వెళ్ళి నిద్రపోయాడు.

రహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తు వులను చక్కగా మూటకట్టుకుని, పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన యజమాని ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్కచిక్కిపోయి నీరసంగా పడుకున్న కుక్కని చూశాకగానీ అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న యజమాని ఆ రోజు నుండి కుక్కకు ఆహారం పెట్టి, మంచిగా చూసుకోసాగాడు.

తెలివైన ఎలుగుబంట్లు

ఒక వేటగాడు వేట కోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలాదూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు దాని కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ప్రయాణించలేరు.

వంతెనకు ఒక పక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు ఒక పెద్దరాయి వెనుక నక్కి అటుగా వచ్చే ఏదైనా ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.

కాస్సేపు గడిచాక నేరెడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతనికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని అతను భావించాడు. వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదురుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కిందకూర్చుని, చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి.

దీంతో వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని అతను గ్రహించాడు.

అందుకే మనిషి జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదా!

చిత్రపటం

ఒకసారి ఒక ధనవంతురాలు తన చిత్రపటాన్ని గీసే పని ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి అప్పగించింది. ఆ చిత్రకారుడు ఎంతో కష్టపడి, ఎన్నోరోజులు శ్రమించి ఆ ధనవంతురాలి చిత్రాన్ని చాలా గొప్పగా వేశాడు. చిత్రపటం పూర్తయ్యాక ఆ చిత్రకారుడు ఆమెను తన స్టుడియోకి ఆహ్వానించాడు.

ఆమె టామీ అనే తన పెంపుడుకుక్కను వెంటబెట్టుకుని వచ్చింది. ఆమెకు తన కుక్కంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో తన కుక్కను మించిన తెలివైన జంతువు మరొకటి ఉండదని నమ్ముతుంది.

''టామీ డార్లింగ్‌! ఇదుగో నీ యజమాని'' అంటూ ఆమె తన చిత్రపటాన్ని ఆమె టామీకి చూపించింది. టామీ ఆ బొమ్మను చూడటానికి ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.

అప్పుడా ధనవంతురాలు చిత్రకారుడివైపు తిరిగి ''ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది. అందుకే టామీ నా బొమ్మను గుర్తుపట్టలేక పోయింది'' అంది.

ఆ చిత్రకారుడు కాస్త తెలివైనవాడు. ధనవంతులు ఎన్నిరకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తారో అతను ఊహించగలడు. అతను ఆమెతో వాదించలేదు. ''మేడమ్‌! మీరు రేపు రాగలరా? మీ టామీకి నచ్చేలా ఈ బొమ్మలో మార్పులు చేస్తాను'' అన్నాడు.

మరునాడు ఆ ధనవంతురాలు టామీతో వచ్చింది. ఈ సారి టామీ చిత్రపటాన్ని చూడగానే తోక పైకెత్తి దాని దగ్గరకు పరుగుదీసింది. చాలా ఆసక్తిగా ఆ చిత్రపటాన్ని నాకడం మొదలెట్టింది.

''ఓV్‌ా అద్భుతంగా గీశారు. మా టామీకే కాదు నాకు కూడా బొమ్మ చాలా నచ్చింది'' సంతోషంగా అందామె.
ఆమె చిత్రకారుడు అడిగిన డబ్బు ఇచ్చి ఆ చిత్రపటాన్ని కొనుక్కుని తనతో తీసుకుని వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోÄయాక ఆ చిత్రకారుడు పడీ పడీ నవ్వాడు. అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు. ఆ మాంసం వాసన టామీ చిత్రపటాన్ని నాకేలా చేసింది అంతే!

చిలుక పలుకులు!

శ్రీధర్‌కు పక్షులు వేటాడటం సరదా. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు మీద చాలా చిలుకలు కనిపించాయి. అతనికి ఎప్పటినుండో ఒక చిలుకను పెంచుకోవాలనే కోరిక ఉంది. కొన్ని ధాన్యం గింజలు చెట్టుకింద నేలమీద చల్లి, వాటి మీద పలచని వల వేశాడు. చాలా జాగ్రత్తగా చూస్తే కానీ అక్కడ వల ఉందన్న విషయం తెలియదు. వల పన్నడం అయ్యాక, ఆ చెట్టు వెనకే నిశ్శబ్ధంగా మాటువేశాడు.

కాస్సేపు గడిచాక రెండు చిలుకలు నేల మీదున్న గింజలను పసికట్టాయి. ''ఆరు... ఎన్ని గింజలో! భలే.. భలే!'' అంటూ కిందకు రివ్వున దిగిందో చిలుక.

''ఆగు నేస్తం! ఈ అడవిలో ఒక చెట్టు కింద ధాన్యం రావడం ఆశ్చర్యంగా లేదూ..'' అని హెచ్చరించింది రెండో చిలుక. తిండి చూసిన తొందరలో దానికి ఆ మాటలు చెవికి ఎక్కలేదు. నేల మీద వాలడం..వలలో చిక్కుబడి పోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

''నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు వినలేదు. దేనికైనా అంత తొందర పనికిరాదు'' ఆ వలకి కొంచెం దూరంగా నేలమీద వాలుతూ అంది రెండోచిలుక. ''నిజమే! చాలా తొందరపడ్డాను ఇప్పుడు విచారించి ఏం లాభం! జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కదా!'' కన్నీళ్ళు పెట్టుకుంది మొదటి చిలుక.

ఇంతలో చెట్టు చాటు నుంచి ఇవతలకు వచ్చాడు శ్రీధర్‌. అతన్ని చూడగానే రెండో చిలుక చెట్టుపైకి ఎగిరిపోయింది. అతను వలలో చిక్కుకున్న చిలుకను బయటికి తీయడం, ఒక పంజరంలో బంధించడం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది అది.

శ్రీధర్‌ చిలుకును తన ఇంటికి తీసికెళ్లి ఒక పంజరంలో పెట్టాడు. అతని పిల్లలు దాన్ని చూసి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో బందీ అయింది చిలుక. ఎన్నో రకరకాల పండ్లు తినడానికి ఇచ్చేవారు. కానీ స్వేచ్ఛలేని ఆ జీవితం ఆత్మహత్యతో సమానంగా భావించింది చిలుక. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రతి క్షణం తన దుస్థితికి చింతిస్తూ రోజులు గడపసాగింది.

శ్రీధర్‌ ఆ చిలుకకు చిన్న చిన్న మాటలు పలకడానికి ప్రతిరోజూ తర్ఫీదు ఇవ్వసాగాడు. 'హలో..! నమస్కారం..! రండి..!' అనే చిన్న చిన్న పదాలు నేర్చుకుంది చిలుక. శ్రీధర్‌ దాన్ని ముందుగదిలో ఉంచి తన ఇంటికి వచ్చే బంధువులకు, స్నేహితులకు చిలుక పలుకులు వినిపించి, అందరిచేత ప్రశంసలు పొందసాగాడు. చిలుకను చూసి అందరు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ చిలుకకు మాత్రం ఎంతో విషాదంగా ఉండేది.

'ఒరే మీ ఆనందం పాడుగాను. నన్ను వదలండిరా! నేను మీలా స్వేచ్ఛగా బతుకుతాను' అని మనసులో ఆక్రోశించేది. కానీ తన భావం వాళ్ళకి తెలియజేయడానికి దానికి అంత భాష రాదు.

ఒకరోజు శ్రీధర్‌ని అతని కొడుకు బాగా విసిగించడంతో వాడి వీపుమీద ఒకటి పీకి, ''చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌'' అంటూ కోపంగా తిట్టాడు. అది విన్నది చిలుక. శ్రీధర్‌ తిట్టడంతో ఏడుస్తూ ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం చూసింది. వెంటనే దాని మనుస్సులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. 'చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌!' అన్న ఆ పదాలని పదే పదే మననం చేసుకుంది. రాత్రంతా అది తను నేర్చుకున్న మిగతా మాటలు మర్చిపోయి ఆ ఒక్క పదమే కంఠతా వచ్చేవరకూ మననం చేసుకుంటూనే ఉంది.

మరునాడు శ్రీధర్‌ వాళ్ళ ఆఫీసర్‌ ఇంటికి వచ్చాడు. ''ఏదయ్యా నీ దగ్గర ఒక మాట్లాడే చిలుక ఉందని విన్నాను.. చూపించు!'' అని ఆసక్తిగా అడిగాడు. శ్రీధర్‌ ఆయనకి ఎంతో గర్వంగా తన చిలుకను చూపించి... ''సార్‌కి హలో చెప్పు!'' అన్నాడు.

వెంటనే చిలుక ''చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌'' అంటూ ముద్దు ముద్దుగా పలికింది. ఆ మాటలు విని ఆఫీసర్‌ ముఖం అవమానంతో ఎర్రబడింది. శ్రీధర్‌ కంగారుపడి, వారిస్తున్నా చిలుక వినలేదు. ''రాస్కెల్‌ గెటవుట్‌! గెటవుట్‌!'' అని అంటూనే ఉంది. ఆఫీసర్‌ కోపంగా వెళ్లిపోయాడు.
ఆ రోజు నుండి అదే తంతు. ఎవరు ఇంటికొచ్చినా ఆ చిలుక 'గెటవుట్‌ రాస్కెల్‌! చంపేస్తాను రాస్కెల్‌!' అని గట్టిగా అరిచేది. దానితో ఎవరినైనా తనింటికి పిలవాలంటే భయపడే స్థితికి వచ్చాడు శ్రీధర్‌.

''ఏంటయ్యా చిలుకకు మంచి మాటలు నేర్పించాలి కానీ, తిట్లు నేర్పిస్తారా?'' అని చాలామంది శ్రీధర్‌ని ముఖం మీదే చివాట్లు వేయసాగారు. చిలుక చేత ఆ మాటలు మాన్పించాలని ఎంతో ప్రయత్నించాడు శ్రీధర్‌. అది నేర్చుకోగపోగా, మరింతగా రెచ్చిపోయి, అవే మాటలు పదే పదే అనసాగింది.

దీంతో అతను ఇక ఆ చిలుకను ఇంట్లో ఉంచకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే ఊరి బయటకు పంజరం తీసుకెళ్ళి, చిలుకను వదిలేశాడు. తన ఎత్తు పారినందుకు సంతోషిస్తూ.. ఆ చిలుక అరణ్యం వైపు హాయిగా ఎగిరిపోయింది. అందుకే అపాయం వచ్చినప్పుడు ఉపాయం చేయాలి. అప్పుడే ప్రమాదం నుండి బయటపడతాం.

కృతజ్ఞత

హిమాలయ పర్వతాల అడుగుభాగంలో ఒక దట్టమైన అరణ్యం ఉండేది. అందులో ఎన్నో పక్షులు, జంతువులు ఉండేవి. ఒక ముని తన తపస్సు కోసం ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు.

అది వేసవికాలం. ఆ ఎండలకు అరణ్యంలో ఉన్న నదులు, సరస్సులు ఎండిపోయాయి. నీళ్ళు దొరక్క పక్షులన్నీ వలస వెళ్ళగా, ఎక్కడికి వెళ్ళని జంతువులు అల్లాడిపోయాయి. వాటి పరిస్థితి చూస్తున్న ముని హృద యం జాలి పడింది. ఆ రోజు నుండి అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి కుండలతో నీళ్ళు నింపుకొని, అడవికి తీసుకురాసాగాడు. జంతువులు మూగేచోట వాటిని ఉంచసాగాడు. ప్రతిరోజూ ముని ఉదయం నుండి చీకటి పడేవరకూ ఆ పనే చేసేవాడు. ఆ పనిలో పడి తన భోజనం విషయం కూడా మర్చిపోయాడు.

ఇది గ్రహించిన జంతువులు తమ కోసం అంత కష్టపడుతున్నా మునికి కృతజ్ఞత చూపాలనుకున్నాయి. అన్నీ కలిసి నీళ్ళు తాగడానికి వస్తూ, తలా ఒక పండు తీసుకు రాసాగాయి. ముని వాటిలో కొన్ని తిని, మిగతావన్నీ పేద ప్రజలకు పంచిపెట్టేవాడు. వాళ్ళు ప్రతిగా నీళ్ళు అడవికి తీసుకురావటంలో సహాయం చేశారు. ఇలా ఆ వేసవి కాలమంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆనందంగా జీవించారు.

ఓడి గెలిచిన ఎద్దు!

అవంతీపురం అనే నగరంలో రామా చారి అనే బీదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తల్లా ఒక పెంకుటిల్లు, ఒక ఎద్దు. దూడగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే, రామాచారి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాడు. 'నంద కుమారా!' అని దాన్ని ఆప్యాయంగా పిలిచుకునేవాడు రామాచారి.

రామాచారి పేదరికాన్ని గమనించిన ఎద్దు 'తను పస్తులుండి నా కడుపు నింపడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఈ మహానుభావుడి రుణం తీర్చుకోవాలి' అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది.

ఒకరోజు అది రామాచారితో ''అయ్యా! మీకు తెలుసు, మీ నీడలో పెరిగిన నేను ఎంత బలశాలిగా తయారయ్యానో! నాలా బరువులు లాగే వారు ఈ రాజ్యంలోనే లేరు. మీరు భూస్వామి నరేంద్రభూపతిని కలుసుకుని, నా నందకుమారుడు యాభై నిండు బండ్లను లాగగలడని పందెం కాయండి!'' అని చెప్పింది.

రామాచారి నరేంద్రభూపతి దగ్గరకు వెళ్ళి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ నందకుమారుడి బలం గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు తన ఎద్దు యాభై బండ్లు లాగగలదని పందెం కాశాడు. అతని మాటలు విని, ఆశ్చర్యపోయిన నరేంద్రభూపతి వెయ్యి రూపాయల పందానికి సిద్ధపడ్డాడు.

ఆ పందెం గురించి తెలిసిన ఆ గ్రామ ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. ధాన్యం నింపిన యాభై బండ్లు నందకుమారిడికి కట్టారు. వాటిని ఆ ఎద్దు లాగడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రామాచారి దాన్ని ఎంతగానో అదిలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దానితో రామాచారి పందెం ఓడిపోయి వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాడు.

అతను ఎంతో విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడా ఎద్దు అతనితో ''అయ్యా! నన్ను మన్నించు. నేను లాగలేక కాదు. ఆ మాత్రం శక్తి నాలో ఉంది. ఎందుకనో నా కాళ్ళు ముందుకు పడలేదు. ఈసారి నూరు బండ్లు లాగగలనని పందెం కాయండి!'' అని అంది.

కానీ రామాచారి దాని మాటలు విశ్వసించలేదు.

''కొడుకులా మీ ఇంట పెరిగాను. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి. ఈసారి కానీ మీరు పందెం ఓడిపోయేలా చేస్తే నా ముఖం మీకు చూపించను'' అంటూ నంద కుమారుడు ఎంతో బతిమిలాడిన తర్వాత రామాచారి తిరిగి నరేంద్రభూపతిని కలుసు కున్నాడు. వృషభం చెప్పినట్లే పది వేలకు పందెం కాశాడు. అంతేకాదు ఊళ్ళో ఎవరైనా సరే పందెంలో పాల్గొనవచ్చని చెప్పాడు. రామాచారి తన పెంకుటిల్లు అమ్మేసి డబ్బు సిద్ధంచేశాడు.

అంతా రామాచారికి పిచ్చి పట్టిందనుకున్నారు. అయినా ఆ పందెం చూడడానికి తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. ధాన్యపు బస్తాలతో నిండిన నూరు బండ్లు ఒకదాని తర్వాత ఒకటి కట్టబడ్డాయి. రామాచారి మొదటి బండి ఎక్కి కూర్చుని పగ్గాలు పట్టుకుని ''నాయనా ముందుకు కదులు'' అని ప్రేమగా ఎద్దును తట్టాడు.

అంతే.. అందరు చూస్తుండగా ఆ ఎద్దు ముందుకు అడుగువేసింది. దానితో పాటే నూరు బండ్లూ కదిలాయి. అలా పదడుగులు ముందుకు నడిచింది వృషభం.

రామాచారి పందెం గెలిచాడు. నరేంద్రభూపతి పదివేల రూపాయలు అతనికి ఇచ్చాడు. అంతేకాదు ఆ ఎద్దు బలానికి ఆశ్చర్యపోయిన జనాలు కూడా తలా కొంత వేసుకుని డబ్బు పోగేసి, ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తున్న రామాచారితో నందకుమారుడు ''అయ్యా! నేను మొదటిసారే పందెం గెలిస్తే మీకు చాలా తక్కువ మొత్తం డబ్బు ముట్టేది. నేను మొదటిసారి లాగకపోవడానికి కారణం ఇదే'' అని చెప్పింది. ఆ మాటలు విన్న రామాచారి దాని వీపు మీద ఆప్యాయంగా నిమిరాడు.

పనికిరాని బంగారం

ఒకానొకప్పుడు రంగయ్య అనే ఓ పిసినారి ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపా దించాడు. అయినా ఒక నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన పెరట్లో ఓ గొయ్యిని తవ్వి, తను కూడబెట్టిన బంగారమంతటినీ అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం - బంగారాన్ని చూసి మురిసిపోవడం మళ్ళీ ఆ గొయ్యిని కప్పేయడం... కొన్నేళ్ళపాటు ఇదే అతని ముఖ్యమైన దినచర్యగా ఉండేది.

అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఓ దొంగ ఇదంతా చూడనే చూశాడు. ఇంకేముంది. ఆ రాత్రే గొయ్యిని తవ్వి, మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడు ఎప్పటిలాగే గొయ్యిని తవ్వి చూసుకున్న రంగయ్య తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. ''ఏదీ! నా బంగారం ఏదీ? అంటూ లబోదిబోమని ఏడ్వడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఓ పెద్దమనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు.

''అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు?'' అని అడిగాడు పెద్దమనిషి. ''ఏమీ చేయాలనుకోలేదు. కేవలం దాచుకుందామనుకున్నాను'' అన్నాడు రంగయ్య. ''అలాగా!... అయితే ఈ గులకరాయిని ఆ గోతిలో వేసి నీ బంగారం ఎక్కడికీ పోలేదనుకో. ఎప్పటిలాగే రోజూ వచ్చి, ఈ గులకరాయిని చూసి వెళ్ళిపో!'' అంటూ ఓ గులకరాయిని అందించి, తన దారిన తాను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. రంగయ్య అయోమయంగా చూశాడు. సరిగ్గా ఉపయోగించని వస్తువు ఎంత ఖరీదైనదయినా వ్యర్థమే కదా!

ఏనుగుకు కోపం వచ్చింది!

సీత శివాలయానికి చెందిన ఏనుగు. మావటివాడు రోజూ దాన్ని ఆ దగ్గరలో ఉన్న చెరువుకు తీసుకుని వెళ్ళేవాడు. చెరువుకు వెళ్ళేదారిలో గోపయ్య ఇల్లు ఉంది. అతను తన ఇంటి అరుగుమీద కూర్చుని బట్టలు కుట్టేవాడు.

సీత రోజూ గోపయ్య ఇంటి ముందు కొంచెంసేపు ఆగేది. గోపయ్య అరటి పండ్లు, కొబ్బరిచిప్పలు, తన దగ్గర ఏమి ఉంటే అవి ఏనుగుకు ఇచ్చేవాడు. సీత అవి తీసుకుని అతన్ని తన తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోయేది.

ఒకరోజు గోపయ్యకు, అతని భార్యకు మధ్య చిన్న తగువు జరిగింది. ఆ కోపంలోనే వచ్చి కుట్టుమిషను ముందు కూర్చున్నాడు. ఎప్పటిలా చెరువుకు వెళుతూ సీత అతని ముందు ఆగింది. కానీ కోపంగా ఉన్న గోపయ్య దాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. చాలాసేపు నిలబడి, నిలబడి తను వచ్చానని తెలపడానికి సీత గట్టిగా ఘీంకరించింది.

గోపయ్య ఆ శబ్ధానికి ఉలిక్కిపడ్డాడు. అతనికి చాలా చిరాకు కలిగింది. తన చేతిలో ఉన్న సూదితో ఏనుగు తొండంలో గుచ్చాడు.

తొందరపాటు

ఒక అరణ్యంలో జింక ఒకటి ఉండేది. దానికి తొందర పాటుతనం ఎక్కువ. అది పసికట్టి వాళ్ళమ్మ ''నీ ప్రవర్తన వల్ల నువ్వు ఒకరోజు ఏ వేటగాడి చేతిలోనో ఇరుక్కుంటావు!'' అని ఎప్పుడూ హెచ్చరించేది. కానీ తల్లి మాటలు ఈ జింకపిల్ల ఏ రోజూ పట్టించుకునేది కాదు. చాలా నిర్లక్ష్యంగా తల్లి మాటల్ని కొట్టిపారేసేది. తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించేది కాదు.

ఒకరోజు కొందరు వేటగాళ్లు ఒక జింకను తరమడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తి ఆ జింక చెట్ల పొదల వెనుక దాక్కుంది. ఆ వేటగాళ్ళు దానికోసం వెతికారు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. వారు అలాగే ఆలోచిస్తూ నిలబడ్డారు. వారు వెళ్ళిపోయారనుకున్న జింక అక్కడ చెట్లకున్న లేత ఆకులను కొరికి తినడం ప్రారంభించింది.

దానితో ఆ చెట్టుకొమ్మలు కదిలాయి. ఆలోచిస్తూ నిలబడ్డ వేటగాళ్ళలో ఒకరి దృష్టి కదిలే కొమ్మలపై పడింది.
వెంటనే అతడికి విషయం అర్థమైంది. ఇంకేం! తన విల్లు తీసి ఎక్కుపెట్టి బాణం వేశాడు. పాపం! జింక ప్రాణాలు కోల్పోయింది. దాని తొందరపాటే దాని ప్రాణాలు మీదకు తెచ్చింది.

నిర్ణయం!

ఒక జింకను వేట కుక్కలు తరుమడం ప్రారంభించాయి. దిక్కుతోచని ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది. అక్కడ ఒక ఎద్దు కోసం కేటాయిచిన స్థలానికి వచ్చింది. అక్కడ ఉన్న గడ్డిలోకి దూరింది. గడ్డితో తన శరీరాన్నైతే కప్పగలిగింది కానీ కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది.

నెమ్మదిగా చీకటి పడింది. జింక అమ్మయ్య అనుకుంది. ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడీచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది. అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం, అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది.

తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని, అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది. ఆ మాటలను పూర్తి చేస్తుండగానే, యజమాని ఆ పాకలోకి ప్రవేశించాడు. అక్కడ కుప్పలా ఉన్న గడ్డిని చూసి, తనతో వచ్చిన పాలేర్లను ఆ గడ్డిలోంచి పైకి కనిపించేవి ఏమిటని అడిగాడు. దానితో పాలేర్లు అవేమిటో చూసేందుకు వెళ్ళి జింకను పట్టుకున్నారు. ఇంక తప్పించుకోవడం దానికి అసాధ్యమై పోయింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటారు.

బడాయికి పోయిన దూడ!

ఒక రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక దూడ ఉండేవి. రైతు రోజూ పెందలాడే ఎదు,్ద దూడ లను పొలానికి తోలుకెళ్ళేవాడు. దూడను మేత మేయడానికి పొలంగట్టు వెంట వదిలేసేవాడు. ఎద్దుని నాగలికి కట్టేవాడు. ఎద్దు విశ్రాంతి అనేది లేకుండా చీకటిపడే వరకూ పొలం దున్నేది. దూడేమో చెట్లనీడలో కునుకు తీసేది. చెంగు చెంగున గంతులు వేస్తూ స్వేచ్ఛగా తిరిగేది.

ఒకరోజు ఎద్దు దగ్గరకు వెళ్ళింది దూడ. ''నిన్ను చూస్తోంటే చాలా జాలి కలుగుతోంది ఎద్దు మామా! నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేవరకూ విరామమనేది లేకుండా కష్టపడుతూనే ఉంటావు. ఎంతటి బానిస జీవితం గడుపుతున్నావు? నన్ను చూడు ఎంత స్వేచ్ఛగా, ఉల్లాసంగా జీవితం గడుపుతు న్నానో! నీ స్థితిపట్ల నాకు చాలా బాధ కలుగు తోంది'' అంది.

ఎద్దు ఆ మాటలు వినిపించుకోనట్టు తన పని తాను చేసుకుపోయింది. పొగరెక్కిన దూడ వదిలేస్తేగా! ఎద్దుకు అడ్డంపడి, తన జీవితంలోని సుఖం గురించి చెప్పసాగింది.

చీకటిపడే సమయానికి సుందరయ్య వచ్చి ఎద్దు కాడి విప్పి, గడ్డి మేయడానికి వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత దూడ మెడలో వేప మండలు కట్టి, పలుపుతాడు బిగించాడు. సుందరయ్య గ్రామదేవతకు మొక్కుకున్న మొక్కు ప్రకారం ఆ సాయంత్రం దూడను బలి ఇవ్వటానికి దాన్ని లాక్కుపోసాగాడు.

గింజుకుంటున్న దూడ దగ్గరకు వచ్చింది ఎద్దు. ''అల్లుడూ..! నా స్థితి చూసి గేలి చేశావు. నన్ను చూసి జాలిపడ్డావు. ఇప్పుడు చూడు నీకు ఎలాంటి గతి పట్టిందో? యజమాని ఈ పని కోసమే నిన్నింత స్వేచ్ఛగా తిరగనిచ్చి, బాగా బలిసేలా చేశాడు. ఇప్పుడు చెప్పు నీ స్థితి మంచిదా? నా స్థితి మంచిదా?'' అని అడిగింది ఎద్దు.
జవాబు చెప్పలేని దూడ తల వంచుకుని యజమాని వెంట నడిచింది.

''అందుకే ఏ ఒక్కరినీ ఎగతాళి చేయడం, మిడిసిపాటు పడడం తగదు'' అంటూ కథ ముగించాడు తాతయ్య.

తెలివి మీరిన కోతులు

ఒకప్పుడు ఒక ఆసామి వీధి వీధీ తిరిగి టోపీలు అమ్ముకొని జీవించే వాడు. ఒక రోజున మధ్యాహ్నం వరకు టోపీలు అమ్మి భోజనం చేద్దామని ఒక మర్రిచెట్టు నీడలో తన టోపీల బుట్టను దించుకొన్నాడు. భోజనం చేసేందుకు సిద్ధమయ్యేంతలో చెట్టు మీద గల రెండు కోతులు రంగు రంగుల టోపీలను చూసి, కిందకు దిగి రెండు టోపీలను పట్టుకొని పైకి పోయాయి. అయ్యో! నా టోపీలుఅంటూ అతడు ఎంత అరచినా అవి వినిపించుకోలేదు. ఇలా కాదని అతడొక టోపీని తలమీద పెట్టుకొని అటు ఇటు ఊగుతూ, టోపీని గాలిలోకి విసిరాడు. కోతులు కూడా అతడి లాగే అటు ఇటు వూగి టోపీలను గాల్లోకి విసిరాయి.బతుకు జీవుడా! అనుకొంటూ అతడు టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంత కాలానికి అతడు ముసలివాడై పోయాడు. అతడి కొడుకు టోపీల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఒక రోజున సరిగ్గా అతడికి తండ్రికి జరిగినట్టే జరిగింది. చెట్టు కింద టోపీల బుట్టను పెట్టుకొని, భోంచేస్తుంటే రెండు కోతులు వచ్చి రెండు టోపీలను ఎత్తుకు పోయాయి. కాని అతడికి వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి, అతడిలాగే అటు ఇటు వూగి టోపీని గాలిలోకి విసిరాడు. కాని కోతులు వాటి దగ్గర టోపీలను విసరలేదు. నువ్విలా వూగి టోపీని గాలిలోకి విసురుతావని అయినా సరే టోపీలను విసరొద్దని మా అమ్మ చెప్పిందిగాఅన్నాయి.

దాంతో ఇంకా చేసేదేమి లేక అతడు మిగిలిన టోపీలను తీసుకొని వెళ్ళి పోయాడు.

Monday, October 7, 2013

ఏమిలేదు


అల్లరి ఎలుకపిల్ల


ప్రకృతి విస్మయం


సహజ స్వాభావం


పేరు లేని పక్షి


చివరి కోరిక


ముల్లా దురాశ


ఎలుక-మిడత


నెలవంక


చంద్రుడు-చలి


కోతి చెప్పిన నీతి


కోతి చేసిన న్యాయం


కోతి గెంతులు


కోతి పాట్లు


కోతి-కొబ్బరికాయ


కోతి చేష్టలు


డబ్బు విలువ


లోభి దాచిన ధనం


పొగరుబోతు


అల్లరి విక్కీ