Pages

Wednesday, April 22, 2015

ఈగ పేరు

ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది. ఎంతాలోచించినా పేరు గుర్తు రాలేదు.


ఇంట్లో వున్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది.

“పెద్దమ్మా, నా పేరేంటి?” అంది.

“నాకేమి తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే వుంటాను, అడవిలో వున్న నా కొడుకునడుగు” అంది పెద్దమ్మ.
ఈగ అడవిలోకి వెళ్ళింది.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకా, నా పేరేంటి?” అంది.

“నాకేంతెలుసు, నేను నరుకుతున్న చెట్టునడుగు, నాకన్నా బలంగా వుంది” అన్నాడు పెద్దమ్మ కొడుకు.



“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి?” అంది ఈగ.



“నాకు తెలీదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు”, అంది చెట్టు.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, నా పేరేంటి?” అంది ఈగ.



“నాకన్నా పెద్దది, ఈ నదినడుగు” అంది గొడ్డలి.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నా పేరేంటి?” అంది ఈగ.


“నా నీళ్ళన్నీ తాగేస్తున్న ఈ రాజుగారి గుఱ్ఱముంది కద, దీనిని అడుగు” అంది నది.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నది నీళ్ళు తాగే గుఱ్ఱం, నా పేరేంటి?” అంది ఈగ.

“నాకు తెలీదు, నా కడుపులోని బిడ్డనడుగు” అంది గుఱ్ఱం

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నది నీళ్ళు తాగే గుఱ్ఱం, గుఱ్ఱం కడుపులో బిడ్డా, నా పేరేంటి?” అంది ఈగ.

గుఱ్ఱం పిల్ల, “ఇహి ఇహి ఇహి ఇహి ఇహి ఈగ!” అంటూ నవ్వింది!

అయోమొహం పెట్టుకుంది మన మతిమరుపు ఈగ.

No comments:

Post a Comment