Pages

Wednesday, April 22, 2015

అఙ్నానం, మూర్ఖత్వం

అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది.
ఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వూ నా మాట విను” అంది.
పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది. “అనుమతిని అడిగితే ఇలాగే వుంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి” అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దెగ్గిరకి వెళ్ళిపోయింది.
ఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్ల కప్ప అదే మొదటి సారి ఒక మనిషి ని చూడటం. ఆ ఎత్తూ ఆకారం చూసి చాలా జడుసుకుంది. ఖంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్పింది.
తల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదు గా, అందుకే, “ఎంత లావున్నాడు?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వున్నాడా?”
“ఊహూ” అని అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.
“ఊహూ” అని మళ్ళి అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అంటూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప.

No comments:

Post a Comment