Pages

Sunday, August 2, 2015

ఆభరణం ఎవరిది?తెలుసుకోవడం ఎలా ?

సిరిపురం శివాలయంలోని వటవృక్షం కింద ఓ సాధువు, తన శిష్యుడితో బస చేశాడు. రోజూ సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులకు పురాణ పఠనం చేస్తూ ప్రసంగాలు ఇవ్వసాగాడు.
ఓరోజు భక్తులందరూ వెళ్లిపోయిన తర్వాత ఆవరణను శుభ్రం చేస్తున్న శిష్యుడికి చీకట్లో ఏదో తళతళలాడుతూ కనిపించింది. దీపం వెలుగులో చూసేసరికి అదొక బంగారు హారం. శిష్యుడు దాన్ని గురువుకి చూపించాడు.
'ఎవరో భక్తురాలు పోగొట్టుకుని ఉంటుంది. రేపు అందజేద్దాం' అన్నాడు సాధువు.
'అంతమందిలో దీన్ని పోగొట్టుకున్నదెవరో తెలుసుకోవడం ఎలా స్వామీ?' అన్నాడు శిష్యుడు. సాధువు నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు ప్రసంగం పూర్తవగానే సాధువు, 'భక్తులారా! నిన్న ఇక్కడెవరో ఓ విలువైన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. పరిశీలించి చూడగా ఆ వ్యక్తి తీవ్రమైన గ్రహదోషంతో ఉన్నట్టు నా దివ్యదృష్టికి గోచరించింది. ఆ దోషం పోవాలంటే సుమారు యాభై వేల వరహాలు ఖర్చు చేసి యాగం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి వస్తే ఆ యాగాన్ని నేనే నిర్వహించగలను' అంటూ జోలెలో దాచిన ఆభరణాన్ని పైకి తీసి చూపించాడు.
భక్తులందరూ దాన్ని చూశారు. ఇంతలో ఓ మహిళ కంగారుగా సాధువు దగ్గరకి వచ్చి, 'స్వామీ! అది నాదే. నగ సంగతలా ఉంచి నా గ్రహదోషం పోవడానికి చేసే ఆ యాగానికి ఏం కావాలో సెలవీయండి' అంది.
సాధువు ఆమెను భక్తులంతా వెళ్లిపోయే వరకూ వేచి ఉండమని చెప్పి ఆభరణాన్ని ఇచ్చేశాడు. ఆపై కాసేపు కళ్లు మూసుకుని ధ్యానించి, 'నువ్వేమీ కంగారు పడకమ్మా! నీ గ్రహస్థితి మారింది. నువ్వే యాగాలూ చేయక్కర్లేదు' అన్నాడు. ఆమె సంబరంగా వెళ్లిపోయింది.
శిష్యుడు ఆశ్చర్యంగా సాధువుని సమీపించి, 'అదేంటి స్వామీ! యాభై వేల వరహాల యాగం చేయక తప్పదని చెప్పిన గ్రహస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోతుంది?' అన్నాడు.
సాధువు నవ్వి, 'బంగారం ఆశను రేకెత్తిస్తుంది నాయనా! ఇదెవరిదో చెప్పండంటే చాలా మంది నాదంటే నాదని ఎగబడేవారు. అందుకే పదివేల వరహాల ఆభరణానికి యాభై వేల యాగాన్ని అడ్డం వేశాను. ఆ నగ నిజంగా ఎవరిదో తెలుసుకోడానికే అలా చెప్పాను' అన్నాడు సాధువు నవ్వుతూ.

No comments:

Post a Comment