Pages

Wednesday, October 3, 2012

తిట్ల భూతం


పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వుదేన్ని సాధించగోరి, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో, ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక వత్తిళ్ళుకు గురై విసిగి వేశారి, చివరకు తాము సాధించదలచినదేమిటో కూడా మరిచిపోతూండడం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి, ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక, ఇతరుల మేలుకోసం కోరింది. నువ్వు అలాంటి పొరబాటు చేయకుండా వుండేందుకు ఆమెకధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్ప సాగాడు:

వీరమ్మ పరమగయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్ళిచేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచానపడివుంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారూ, మనశ్శాంతి లేక మామగారూ ఎంతోకాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ, భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకూ, కూతురూ పుట్టారు. వీరమ్మ వాళ్ళనూ సాధిస్తూండేది. కూతురు పెద్దదై పెళ్ళి చేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది.


భీముడు, వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడిలా వుంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా ఒంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు, తల్లికి మాత్రం భయపడేవాడు.

ఒకసారి భీముడు తల్లికోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టు చీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు. కొడుక్కురంగులు, చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా, తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీరకనబడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని, భీముడికి తెలుసు. అందుకని, ఏం చేయాలో తోచక, ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టుకింద దిగులుగా కూర్చున్నాడు.

ఆ సమయంలో కొందరాడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజూ ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలుచేసి, బిందెలతో నీళ్ళు తీసుకుని వెళతారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి, చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి, "ఎవరయ్యా, సిగ్గులేదూ, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు!" అని చీవాట్లు పెట్టింది.

భీముడు దీనంగా ముఖంపెట్టి, తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పికున్నాడు. అది వన్న అరుణ హేళనగా నవ్వి, "హా, గొప్ప తెలివైనదే, మీ అమ్మ! చీరల ఎంపికకు తను రావాలి; ఎవరైన ఆడవాళ్ళను పంపాలి. మగవాణ్ణి - అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా! సరేలే, నీకు నేను సాయపడతానుకానీ, నువ్వు ఇక్కణ్ణుంచి లేచి, ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్యగారిల్లెక్కడా అని అడిగి తెలుసుకుని, ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక, మీ అమ్మ బాగుబాగు అని మెచ్చే చీర, నీ చేత కొనిపిస్తాను," అన్నది.

భీముడు అక్కడినుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి, సాంబయ్య ఇల్లు తెలుసుకుని, ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి, వాణ్ణి పలకరించి, వీరమ్మ చూపులకెలా వుంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని, ఒక నేతగాడి ఇంటికివెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది.


ఇలా పని ముగిశాక అరుణ, భీముడితో, "ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత, ఆమెతో - నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్ని విని, అచ్చం అలాంటి చీరే ఆరేళ్ళక్రితం ఈదేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులుగల మరొక స్త్రీ ఉన్నందుకు, అతడు ఆశ్చర్యపోయాడనికూడా చెప్పు. అయినా, అమ్మకు తృప్తి కలక్కపోతే - మహారాణి జాతకురాలికి, ఈ చీర నచ్చి తీరుతుందనీ, ఒక వేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయుండదనీ అన్నాడు నేతగాడని చెప్పు. నీకే ఇబ్బందీవుండదు," అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది.

భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి, అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి, భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. "వాడు, తండ్రితో జరిగిందంతా చెప్పి, "అరుణ ఈ ఇంటికోడలైతే, అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా వుంది," అన్నాడు. మర్నాడు వాడు పనిమీద పొరుగూరుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి, గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ, గబగబా వాడి దగ్గరకు వచ్చి, "మీ అమ్మ నిన్ను బాగా చీవాట్లు పెట్టిందా?" అంది, భీముడి మీద జాలిపడుతూ.

" లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను," అన్నాడు భీముడు.దానికి అరుణ ఆశ్చర్యపోయి, " ఏమిటా ముఖ్య విషయం?" అని అడిగింది. భీముడు కాస్త బెరుకు బెరుకుగా, "నిన్ను పెళ్ళాడాలని వుంది," అన్నాడు. "నువ్వు నన్నడుగుతావేమిటి? మీ పెద్దలతో, మా పెద్దలను అడగమని చెప్పు," అన్నది చిరాగ్గా అరుణ.

"పెద్దల సంగతి తర్వాత. నాకు నువ్వు నచ్చావు. నేను నీకు నచ్చానో లేదో తెలుసు కుందామనే, ఇప్పుడిలా వచ్చాను," అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడి ముఖంకేసి చూసి, "నువ్వు అందంగా వున్నావు. మంచి వాడివి. నచ్చావుకాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను," అంటూ సిగ్గుపడింది.అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, "నీ తెలివి తేటలతో, మా అమ్మను మార్చగలవా? బాగా ఆలోచించుకో!" అన్నాడు.

ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వమహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశసంచారం చేస్తూ, గంగవరం వచ్చి, కాలువ ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడతపడడంతో ఆయన లేవలేక అవస్థపడుతూంటే, స్నానానికి వచ్చిన ఆడపిల్లలు, ఆయన్ను అపహాస్యం చేయడమే కాక, తొందరగా అక్కణ్ణించి వెల్ళిపొమ్మని కేకలు వేశారు.


అరుణ వాళ్ళను మందలించి, బిల్వమహర్షికి తగిన శుశ్రూషచేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడాయన అరుణతో, "అమ్మాయీ, నీ సేవలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను!" అన్నాడు. అయితే, ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వమహర్షి సరేనని, "కళ్ళు మూసుకుని మూడుమార్లు నాపేరు తలచు కుంటే ప్రత్యక్షమై, నీకోరిక తీరుస్తాను," అని వెల్ళిపోయాడు.

అరుణ ఇప్పుడు భీముడికి, బిల్వమహర్షి కధ చెప్పి, "మీ అమ్మను మార్చడం మామూలు మనుషులవల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. మనం బిల్వమహర్షి సాయం అర్ధిద్దాం!" అంటూ, ముమ్మూరు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వమహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకుని, భీముడితో, "పద నాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం," అన్నాడు.

మహర్షి భీముడితో వాళ్ళ ఊరుచేరి, భీముడి ఇంట్లో ప్రవేశించి, మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, "అమ్మా, నాకు భిక్ష కావాలి!" అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చుని, "బిచ్చం కోసం వచ్చావు. మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా?" అంటూ మహర్షిని తిట్టడం మొదలు పెట్టింది.

"అమ్మా! ఇష్టముంటే బిచ్చం వెయ్యి; లేకుంటే పొమ్మని చెప్పు. నీ తిట్లు భూతమై నిన్నే బధిస్తాయి, "అన్నాడు బిల్వ మహర్షి. "తిట్టడం నాకు అలవాటు. అమ్మనాన్నలను తిట్టాను. నాకేమి కాలేదు. అత్తమామలను తిట్టాను, వాళ్ళే పోయారు. మొగుణ్ణీ, కొడుకునూ తిడుతున్నాను. చచ్చినట్టు పడుతున్నారు. నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు!" అన్నది వీరమ్మ నిరసనగా.

"నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది. అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడా తిట్టు నీ దగ్గరే వుండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్ధంకావడం కోసం, ఈ క్షణంలోనే -- అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్టున్నాను," అన్నాడు బిల్వమహర్షి.


అంతే! ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకరాకారంలో ఒక భూతం నిలబడి, " అహొ, వీరమ్మా! నేను నీ తిట్లభూతాన్ని! ఇంకొక నాలుగేళ్ళ తర్వాత, నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను. కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే, భూత రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు. లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను," అన్నది.

వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కు తోచక, మహర్షి కాళ్ళమీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, "భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటుమామిడి చెట్టుంది కదా! దాన్ని నాశనం చెయ్యమని చెప్పు. భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచి పెడుతుంది," అన్నాడు. వీరమ్మ సరేననగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే, అక్కడ మామిడి చెట్టు లేదు.

అప్పుడు బిల్వమహర్షి ఎంతో శాంతంగా, "వీరమ్మా! నువ్వికనుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు. అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా వుంటే, నిన్నే భూతమూ బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి! నీ కొడుక్కు, గంగవరంలో వుండే అరుణ అనే అమ్మయితో పెళ్ళి చేయి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే, క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో. నీ కష్టసుఖాలిక నీలోనే వున్నాయి," అని చెప్పి, బిల్వ మహర్షి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

తర్వాత కొద్దిరోజుల్లోనే భీముడికీ, అరుణకూ పెళ్ళయింది. భేతాళుడు ఈ కధ చెప్పి, "రాజా, బిల్వమహర్షి ఇచ్చిన వరాన్ని, అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనబడదు. ఆ వర ప్రభావంతో ఆమె, ఏ గొప్ప ధనవంతుడి ఇంటికోడలో అయి సర్వసుఖాలూ అనుభవించవచ్చు. ఆమె వరాన్ని, తనకోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలుకోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పాక పోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు.

దానికి విక్రమార్కుడు, "ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెల్ళి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనేగదా కోరుకునేది! ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనబడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికొస్తే - సాధారణంగా మగవాళ్ళకు చిరాకెక్కువ. అలాంటప్పుడు, ఎన్నిమాటలన్నా నోరెత్తకుండా వుండే భీముడులాంటివాణ్ణి ఏ ఆడపిల్లయినా కోరుకుంటుంది. అట్లని, తిట్లభూతం శక్తి చూసిన అరుణ, భీముడిపట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏ మాత్రం లేదు. ఈ కారణాలవల్ల అరుణ, మహర్షి ఇచ్చిన వరాన్ని తనకూ, తన వాళ్ళకూ శుభంకలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల, అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు," అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.




Tuesday, October 2, 2012

రాజభక్తి


పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ పట్టుదల, పరాక్రమాలు మరెవరికీ సాధ్యంకానివి. ఇందుకు నిన్ను అభినందించకుండా వుండలేకపోతున్నాను. కానీ, వీటితోపాటు నీలాంటి మహావీరుడికి కొంత తర్కసహిత వివేచన లేకపో వడం విచారం కలిగిస్తున్నది. వీరదత్తుడి లాగా సూక్ష్మపరిశీలనాజ్ఞనం లేక ఇంత, అర్ధరాత్రివేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో అవస్ధలపాలవుతున్నావేమో అన్న శంక కలుగుతున్నది. నీలో వున్న లోపాలను సరిదిద్దుకునేందుకు గాను, ఆ వీర దత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పాసాగాడు:

పూర్వం కేయూరదేశంలో మహాయోధుడైన వీరదత్తుడనే యువకుడుండే వాడు. అతడు మల్లయుద్దం, సాముగరిడీల వంటి దేశవాళీ యుద్ధ విద్యలలోనే కాకుండా, విలువిద్య, గదాయుద్దం, కత్తిసాము వంటి క్షాత్రవిద్యలలో కూడా అపారమైన నైపుణ్యం కనబరిచేవాడు. వీటికి తోడుగా అనేక శాస్త్రవిషయాలలో కూడా అతడికి చెప్పుకోతగ్గ పాండిత్యముండేది.


ఇలా వుండగా- కేయూర రాజ్యపు సైన్యాధక్షుడు అకస్మాత్తుగా మరణించడంతో, ఆ పదవిని చేపట్టగల వీరుడికోసం , రాజధానీ నగరంలో ప్రతిష్ఠాత్మకమైన పోటీ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ సంగతి తెలుసుకున్న వీరదత్తుడు, ఆ పోటీలో పాల్గొని రాజ్యంలో అత్యుత్తమ పదవులలో ఒకటైన సైన్యాధక్ష పదవిని పొందాలని నిర్ణయించుకున్నాడు. వీరదత్తుడి కొరిక తెలుసుకున్న అతడి తండ్రి, "నాయనా! రాజుల కొలువు అపాయాలకు నెలవు. ఏ మాత్రం పొరబాటు జరిగినా ప్రాణానికే ముప్పు వస్తుంది. పాము పడగ నీడలాంటి జీవితం నీకెందుకు? హాయిగా మనకున్న వ్యవసాయం చూసుకుంటూ సుఖంగా కాలం గడుపు," అని హిత బోధ చేశాడు.

అందుకు అంగీకరించని వీరదత్తుడు, "ఎంతో శ్రమించి నేను గడించిన విద్యలకు రాచకొలువులోనే సార్ధకత లభిస్తుంది, నాన్నా!" అంటూ తండ్రిమాట కాదని, పోటీలో పాల్గొనేందుకు బయలుదేరి రాజధానీ నగరం చేరాడు. అక్కడ అసం ఖ్యాకంగా వచ్చిన వీరులతో పాటు పోటీలో పాల్గన్న వీర దత్తుడు, పోటీలోని ప్రధమచరణాలైన శారీరక దారుఢ్యం, వ్యాయామ యోగవిద్యాపరిచయం, దేశీ యక్షాత్రవిద్యానైపుణ్యం వంటి అంశాలలో అవలీలగా విజయం సాధించాడు. అలా అనేక అంచె లుగా జరిగిన పోటీలలో తన ప్రతిద్వందులైన అనేకమంది వీరులను గెలిచి ప్రధముడుగా నిలిచాడు.

ఆ తర్వత జరిగిన ముఖ్యమైన పరీక్షలలో-కేయూరదేశ బౌగోళిక పరిస్థితులు, చుట్టుపక్కల వున్న మిత్ర శత్రు రాజ్యల బలాబలాలు, యుద్ద తంత్రాలలో పట్టు విడుపులు; ఇలా అనేక రకాల ప్రశ్నలకు, వీరదత్తుడు తెలివిగా తేలికగా సమాధానాలు చెప్పాడు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక వీరదత్తుడికి, తను ఈ పోటిలో గెలుపొందగలనన్న నమ్మకం బలంగా ఏర్పడింది. అందుకు తగిన ట్టుగానే, ఆ సాయంత్రం అతడి వసతి మామూలు పోటీ దారుల సామాన్య వసతి నుంచి అత్యంత భద్రతతో వైభవంగా వున్న పెద్ద భవనానికి మారింది.


ఆ మరుసటిరోజే కేయూరదేశపు మహామంత్రి త్రినాధుడు స్వయంగా వచ్చి వీరదత్తుణ్ణి కలిశాడు. ఆయన ముందుగా అన్ని విద్యల లోనూ వీరదత్తుడి నైపుణ్యాన్ని ప్రశంసించి, "సైన్యాధ్యక్షపదవికి కావలసిన అన్ని అర్హతలూ నీకున్నాయని భావిస్తున్నాము. అయితే, దేశరక్షణలో అతి కీలకమైన ఈ పదవి నిర్వ హించే వ్యక్తికి కేవలం పరాక్రమం, యుద్దతంత్ర నైపుణ్యం మాత్రం వుంటే చాలదు. అంతకు మించి రాజభక్తి, దేశభక్తి కూడా వుండాలి. దేహదారుఢ్యం, నేర్చిన విద్యలలో ప్రావీణ్యం లాంటి పరీక్షలలో అవినిరూపితం కావు. కనుక, కాలానుగుణమైన సహజపరీక్ష కోసం నువ్వు కొంతకాలం పాటు వేచివుండక తప్పదు. ఒక ఆరునెలల పాటు రాచకొలువులో ఏ హొదాలేని ఉన్నతోద్యోగిగా, నీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించు. త్వరితంగానే నువ్వు సైన్యాధ్యక్ష పదవిని స్యీకరించగలవని ఆశిస్తాను," అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత రండు నెలలపాటు వీరదత్తుడుకి ఎలాంటి పనీ అప్పగించబడలేదు. ఒకనాడు అకస్మాత్తుగా త్రినాధుడి నుంచి పిలుపు రావడంతో, వీరదత్తుడు ఆయనను చూడబోయాడు.

త్రినాధుడు, వీరదత్తుణ్ణి సాదరంగా ఆహ్వానించి, వీరదత్తా, మన గూఢచారుల నాయకుడి నుంచి అతి ముఖ్యమైన సమాచారం ఒకటి అందింది. మన మహారాజు కేయూరసింహులకు క్రమం తప్పని అలవాటు ఒకటి వుంది.

ఆయన ప్రతిరోజూ సాయంత్రం మహారాణితో కలిసి ఉద్యానవనానికి వెళతారు. ఆ సమయం రాజదంపతులకు ఏకాంతం అన్నమాట! వ్యక్తిగత భద్రతా సిభ్భందిని కూడా ఉద్యానంలోకి అనుమతించరు. ఈ సంగతి తెలుసుకున్న శత్రువులు, ఆ సమయంలో మహారాజును హత్య చేయడానికి పధకం వేశారు. ఈరోజు నుంచి సాయంత్రపువేళ నువ్వు, రాజదంపతులకు రక్షణగా ఉద్యానంలో వుండాలి. అయితే, ఆ సంగతి ఎవరికీ తెలియకూడదు. నీ కదలికలు రాజదంపతుల  ఏకాంతానికి ఏవిధంగానూ భంగం కలిగించ కూడదు. అందుకు శిక్ష చాలా తీవ్రంగా వుంటుంది, జాగ్రత్త!" అని చెప్పాడు.


ఇందుకు అంగీకరించిన వీరదత్తుడు, ఆ రోజు సాయంత్రం నుంచీ ఉద్యానంలో రాజదంపతులకు రక్షణగా, వారికి తెలియకుండా జాగ్రత్తగా, వారిని అను సరిస్తూ వచ్చాడు. ఇలా నాలుగు రోజులు గడిచాక, ఐదవ రోజు సాయంత్రం హఠాత్తుగా నలుగురు దుండగులు, రాజదంపతులపై దాడి చేయబోయారు. కేయూరసింహుడు, వారిని ప్రతిఘటించే లోపలే, వీరదత్తుడు కత్తి దూసి పెద్దగా హుంకరిస్తూ, వారిమీదికి ఉరికాడు. దుండగులు భయకంపితులై, తలా ఒక దిక్కుగా పరిపోయారు. వీరదత్తుడు, రాజు కేయూరసింహుడికి నమస్కరించి, రాజదంపతుల రక్షణకై నాలుగు రోజులుగా తాను, వారిని అతి రహస్యంగా అనుసరిస్తున్న సంగతి చెప్పడు. ఇది వింటూనే రాజు, వీరదత్తుడికేసి తీవ్రంగా ఒకసారి చూసి, చప్పట్లు చరిచి ఉద్యాన ద్వారరక్షకులను పిలిచి, వీరదత్తుణ్ణి బంధింపజేసి, మర్నాటి ఉదయం అతణ్ణి తన వద్దకు విచారణకై తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.

ఆ రాత్రి వీరదత్తుణ్ణి కారాగారంలో కలిసిన మహామంత్రి జరిగిన దానికి బాధ పడి, "వీరదత్తా! రేపు నీకు మహారాజు విచారణలో కఠినశిక్ష తప్పదు. రాజ కొలువు ఈ విధంగానే ప్రమాద భూయిష్టంగా వుంటుంది. ఏమైనా నీకు కలిగిన ఈ ఆపదకు ఒక విధంగా కారణం నేను. అందువల్ల, నువ్వు తక్షణం కారాగారం నుంచి పారిపోయే అవకాశం కలిగిస్తున్నాను, పారిపో! నేను మహారాజుకు ఏదో విధంగా నచ్చచెప్పుకుంటాను," అన్నాడు.


వీరదత్తుడు ఒక్కక్షణం ఆలోచించి, "మహామంత్రివర్యులు, నాకు అప్పగించన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగాను. రేపు మహారాజు వేయబోయే శిక్ష గురించి నాకేచింతా లేదు, నేనెక్కడికీ పారిపోను. నాపట్ల మీకున్న ఆదరాభి మానాలకు కృతజ్ఞతలు," అన్నడు. ఆ మాటలు విన్న మంత్రి త్రినాధుడు తనలో తానే నవ్వుకుని, వీరదత్తుడి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళి పోయాడు.

బేతాళుడు ఈ కధ చెప్పి, "రాజా, వీరదత్తుడు మహావీరుడు కావచ్చునేమో కానీ, దానితో పాటు మహామూర్ఖుడన్న అనుమానం కలుగుతున్నది. తండ్రి మాటలు పెడచెవిన పెట్టి, రాజుకొలువులో చేరప్రయత్నిచడం ఏ మూర్ఖత్వమైతే, మంత్రి త్రినాధుడి సలహాలనుకూడా పాటించకుండా, కారాగారంలో వుండి పోవాలనుకోవడం మహామూర్ఖత్వం కాదా? తన ప్రాణాలను కాపాడినవాడినే కారాగారంలో బంధించిన మహారాజు చిత్తప్రవృత్తిపై ఏ నమ్మకంతో వీరదత్తుడు రాజు విచారణకు సిద్దపడుతున్నట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమా ర్కుడు, "వీరదత్తుడు మహావీరుడనే దాంట్లో సందేహానికి తావులేదు. అతడు మూర్ఖుడనుకోవడం పొరబాటవుతుంది. అటువంటివాడు రాచకోలువులోనే రాణిస్తాడు. అందుకే వీరదత్తుడు సైన్యాధ్యక్షుడి పదవికి పోటీపడ్డాడు. అయితే, మంత్రి త్రినాధుడు చెప్పినట్టు కేవలం పరాక్రమం, యుద్దతంత్రంలో నేర్పరితనం మాత్రమే, రాజ్య సైన్యాధక్షపదవికి అంతిమ అర్హత్లు కాభోవు . రాజదంపతుల రక్షణకుగాను అతడు ఒంటరిగా నలుగురు దుండగులపై కత్తి దూశాడు. రాజదంపతుల ఏకాంతానికి భంగం కలిగించాడనేది కేవలం నెపం మాత్రమే. ఆ దుండగులూ, వీరదత్తుణ్ణి కారాగారంలో బంధించడం, మర్నాడు విచారణా-ఇదంతా రాజూ, మంత్రీ అతడి రాజభక్తిణి, దేశభక్తినీ పరీక్షించేందుకు కల్పిం చినవి. మంత్రి, అతడికి కారాగారం నుంచి పారిపోయోందుకు అవకాశం కల్పిస్తానన్న, వీరదత్తుడు తిరస్కరించడంతో, అతడి రాజభక్తి పూర్తిగా రుజువైంది. అందువల్లనే, మంత్రి నవ్వుకుని, అతడి భుజం తట్టడు. అంటే-సైన్యాధ్యక్ష పదవికి నెగ్గడం జరిగిందన్న మాట!" అన్నాడు.

రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.  




ఖడ్గమహిమ!


పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, అలౌకికశక్తులూ, ప్రాణులకు హాని కలిగిస్తూ జీవించడమే నైజంగాగల విషసర్పాల్లాంటి జీవులూ విచ్చలవిడిగా సంచరించే, ఈ భయంకర శ్మశానంలో, రాత్రివేళ నిర్భయంగా కార్యసాధనకు పూనుకున్న నిన్ను, ధీరాతి ధీరుడవని ప్రశంసించక తప్పదు.
 
నీ ధైర్యసాహసాలు అద్భుతం. ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు నీలాగే కఠిన శ్రమల కోర్చిన శశికాంతుడనే గ్రామీణ యువకుడి కథ చెబు తాను, శ్రమ తెలియకుండా, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం కనకవరం అనే గ్రామంలో శశికాంతుడనే యువకుడుండేవాడు.

అతడు అనేక విద్యలు నేర్చినవాడు. ముఖ్యంగా ఖడ్గ విద్యలో అతణ్ణి మించిన వాళ్ళు ఆ చుట్టుపక్కల మరెవ్వరూలేరు. అతడి తండ్రి పేరు మోసిన వ్యాపారి. దురదృష్టవశాత్తూ ఆయనా, భార్యా ఒక ఓడ ప్రమాదంలో మరణించారు. వాళ్ళు మిగిల్చిపోయిన ధనాన్ని శశికాంతుడు, మరికొందరు వ్యాపారులతో కలిసి, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు.
 
ఐతే, వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేని అతణ్ణి, ఆ వర్తకులు మోసగించి కట్టుబట్టలతో మిగిల్చారు. ఈ దుర్భరపరిస్థితుల్లో, జయూనందుడనే పక్క గ్రామం మిత్రుడు శశికాంతుణ్ణి చూడవచ్చి, ‘‘శశికాంతా! నీవు ఖడ్గవిద్యలో అసాధారణమైన శక్తిమంతుడివి. ఈ గ్రామానికే పరిమితమైతే ఆ విద్యలో రాణించలేవు. బయల్దేరి మన రాజధాని కరివీరపురం వెళ్ళు.
 
అక్కడ జరగనున్న విజయదశమి పోటీలలో పాల్గొని, నీ ఖడ్గ విద్యానైపుణ్యం చూపావంటే తప్పక రాజాస్థానంలో ఉద్యోగం దొరుకుతుంది,'' అని అతణ్ణి ప్రోత్సహించాడు. జయూనందుడిచ్చిన సలహాకు చాలా సంతోషించిన శశికాంతుడు, ఆ మర్నాటి ఉదయమే కరివీరపురానికి ప్రయూణమయ్యూడు.
 
అతడు మార్గమధ్యంలో వున్న అరణ్యం చేరి, ఎండతాపానికి ఓర్చలేక దారి పక్కనే వున్న ఒక చెట్టు నీడకు పోయి కూర్చోబోయేంతలో, దాపులనున్న పొదలనుంచి, ‘‘పులి! పులి! రక్షించండి,'' అన్న కేకవినిపించింది. శశికాంతుడు చప్పున ఒరలో నుంచి కత్తిలాగి అటుకేసి వెళ్ళాడు. పులి, ఒక ముని మీద దాడి చేయబోతున్నది. శశికాంతుడు, మునికీ, పులికీ మధ్యగా దూకి, కత్తితో పులి తలమీద బలంగా కొట్టాడు.
 
ఆ దెబ్బకు పులి కింద పడిందికాని, కత్తి శశికాంతుడి చేతి నుంచి జారిపోయింది. అంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ లేచింది. శశికాంతుడు ఎగిరి పులి డొక్కలో గట్టిగా తన్నాడు. పులి పక్కకు ఒరిగి మళ్ళీ దాడి చేయడానికి ముందుకు ఉరకబోయేంతలో అతడు, పులి వెనుక కాళ్ళను ఒడిసి పట్టుకుని విరిచాడు. అంతే! పులి నేలబడి గిలగిలా తన్నుకోసాగింది.


ఇదంతా గమనిస్తున్న ముని, శశికాంతుడితో, ‘‘ఓయీ, వీరయువకా! నువ్వు గొప్ప సాహసివి. నీవంటి నిస్వార్థ దయూపరులైన వీరులు చాలా అరుదుగా ఉంటారు. నేనీ ప్రాంతం వదిలి హిమాలయూలకు పోదలిచాను,'' అంటూ అందుబాటులో వున్న పొద నుంచి ఒక కత్తి తీసి, ‘‘ఇది మహిమగల ఖడ్గం. అట్లని దుస్సాహసానికి పూనుకోకు. నీలో ధైర్యసాహసం, ఖడ్గచాలనంలో నేర్పూవున్నప్పుడే ఇది నీకు సాయపడుతుంది!'' అని ఖడ్గాన్ని శశికాంతుడికిచ్చాడు.
 
శశికాంతుడు, మునికి పాదాభివందనంచేసి, అక్కడి నుంచి తన ప్రయూణాన్ని కొనసాగించాడు. చీకటి పడుతున్న వేళ నగరం చేరి, ఒక పూటకూళ్ళ ఇంట వసతి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరసటి రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయినై. రాజుగారి దగ్గరి బంధువు చక్రధరుడనే వాడు కత్తియుద్ధంలో పాల్గొన్నవాళ్ళందర్నీ ఓడించాడు. ఇందుకు రాజు చాలా సంతోషించి, అతడికి ఖడ్గవీరుడు అన్న బిరుదు ప్రదానం చేయబోతున్నంతలో శశికాంతుడు, ‘‘మహారాజా! క్షమించండి.
 
నేనీ పోటీలకు కొంత ఆలస్యంగా వచ్చాను,'' అంటూ ఖడ్గాన్ని ఒరలో నుంచి లాగిపైకెత్తాడు. ఇది చూస్తూనే చక్రధరుడు ఉగ్రుడైపోతూ, ‘‘ఎవ్వడితగాడు? పల్లెవాసిలా వున్నాడు. కత్తియుద్ధంలో నా అంతటివాడితో పోటీయూ! ఒకవేళ నేను ఓడటమే జరిగితే, ఆ క్షణమే రాజ్యం వదిలిపోతాను,'' అంటూ ఒరనుంచి చర్రున కత్తిలాగాడు. పోటీలు చూడవచ్చిన జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.
 
రాజు పక్కనే కూర్చుని వున్న ఆయన ఏకైక పుత్రిక మణికర్ణిక మందహాసం చేసింది. కత్తియుద్ధం ప్రారంభమైంది. చక్రధరుడి కత్తి విసురులను శశికాంతుడు సునాయూసంగా తిప్పికొట్టడమేగాక, ఒక్క పావుగంట కాలం గడిచేలోగా అతణ్ణి చిత్తుగా ఓడించి ఖడ్గాన్ని కళ్ళకద్దుకున్నాడు. ఎవరూ ఊహించని శశికాంతుడి విజయం ప్రేక్షకులతో పాటు రాజునూ, రాకుమారి మణికర్ణికనూ చాలా ఆశ్చర్య పరిచింది.
 
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం చక్రధరుడు వెంటనే విజయదశమి ఉత్సవాలను విడిచి వెళ్ళిపోయూడు. ఆనాటి వరకూ ఖడ్గనైపుణ్యంలో సాటిలేని మేటిగా ప్రసిద్ధిగల రాజుగారి బంధువు సామాన్య యువకుడి చేతిలో ఓడిపోవడం చూసిన జనం, శశికాంతుణ్ణి మెచ్చుకుంటూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.

రాజు, జనం చేసే కోలాహలం మధ్య, శశికాంతుడికి ఖడ్గవీరుడన్న బిరుదు ప్రదానం చేసి, అతణ్ణి ఆ సాయంత్రం ఉద్యానవనంలో తనను కలవవలసిందిగా ఆహ్వానించాడు. రాజు, యువరాణి మణికర్ణిక, ప్రధాన మంత్రి, ఆస్థాన పండితుడు భవనం చేరాక, రాజు మంత్రితో, ‘‘చక్కని అంగసౌష్ఠవం, వర్ఛస్సూగల ఈ శశికాంతుడు, ఏదో మారు మూల గ్రామాన్నుంచి పోటీలకు వచ్చానంటున్నాడు.
 
ఇతడేమైనా విద్యాగంధం కలవాడేనా అన్న సంశయం కలుగుతున్నది!'' అన్నాడు. దానికి మంత్రి, ‘‘మహారాజా! కొత్తగా నగరానికి వచ్చి పూటకూటి ఇండ్లా, సత్రాల్లో విడిది చేసే వాళ్ళ గురించి, మన గూఢచారులు అన్ని వివరాలూ సేకరిస్తారు గదా.ఈ శశికాంతుడు ఒకనాటి సంపన్నకుటుంబంవాడే, కాని కాలవశాన చితికిపోవడంతో, తన ఖడ్గవిద్యాకౌశలాన్ని ప్రదర్శించి, మన ఆస్థానంలో ఉద్యోగం సంపాయించేందుకు వచ్చాడు.
 
ఇతర విద్యల్లో కూడా ఆరితేరినవాడని కూడా తెలిసింది,'' అన్నాడు. ఇది విన్న రాకుమారి చిరునవ్వు నవ్వుతూ, ఆస్థాన పండితుడికేసి చూసింది. ఆయన ఆశీర్వదిస్తున్నట్టు చేయివూపాడు. కత్తియుద్ధంలో అందర్నీ ఓడించినవాణ్ణి, రాకుమారి వివాహమాడుతుందని రాజు ముందుగా ప్రకటించాడు. ఈ పోటీల్లో తప్పక తన బంధువు చక్రధరుడు విజయుడవుతాడని ఆయన నమ్మకం! అయితే, ఇప్పుడు జరిగింది ఆయన ఏమాత్రం ఊహించనిది.
 
ఆ సాయంత్రం రాజూ, యువరాణీ, మంత్రీ, శశికాంతుడూ, ఆస్థానపండితుడూ ఉద్యానవనంలో సమావేశమైవుండగా, గూఢచారుల నాయకుడు అక్కడికి వచ్చి, అందరికీ నమస్కరించి రాజుతో, ‘‘మహారాజా! చక్రధరుడు రాజ్య సరిహద్దు ప్రాంతాలకు చేరి, తిరుగుబాటుకు జనాన్ని కూడగట్టుకోవాలని యత్నిస్తున్నాడు.
 
శశికాంతుడు, ఒకానొక తాంత్రికుడు ప్రసాదించిన మహత్తుగల కత్తికారణంగానే, తనను కత్తియుద్ధంలో ఓడించాడనీ, అలాంటి వాడు కానున్న మహారాణి అయిన మణికర్ణికను వివాహమాడేందుకు యోగ్యుడుకాడనీ ప్రచారం చేస్తూ, తిరుగు బాటుకు జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు,'' అని చెప్పాడు. ఇది వింటూనే రాజు ఆశ్చర్యపోయి, ‘‘నా సొంత బంధువే రాజద్రోహానికి ఒడిగట్టడమా!'' అన్నాడు.

అందుకు ఆస్థాన పండితుడు మందహాసం చేస్తూ, ‘‘మహారాజా! అతడు చేస్తున్న దుష్ర్పచారం మనకు కీడుకాక, మేలే కలిగిస్తుంది. అందులో సందేహం లేదు. కానున్న మహారాణి భర్త వద్ద మహిమగల ఖడ్గం వున్నదంటే-ఇరుగుపొరుగు శత్రురాజులు మనరాజ్యం కేసి కన్నెత్తి కూడా చూడలేరు,'' అని, యువరాణీ, శశికాంతులను, ‘‘నేచెప్పింది అర్థమైనట్లేనా?'' అని అడిగాడు. ఇద్దరూ ఆనందంగా తలలూపారు.
 
బేతాళుడు ఈ కథ చెప్పి ‘‘రాజా, ఆస్థాన పండితుడన్న దాంట్లో ఏదో యుక్తి, చమత్కారం తప్ప, వాస్తవం ఉన్నట్టు కనబడడం లేదు కదా? శశికాంతుడి ఖడ్గం మహిమగలదన్న విషయం చక్రధరుడికి ఎలా తెలుసు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయూవో నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు. దానికి విక్రమార్కుడు, ‘‘ఆస్థాన పండితుడన్న దాంట్లో యుక్తీ, చమత్కారాలకు మించిన వాస్తవం కూడా ఉన్నది! ఓడటమే జరిగితే రాజ్యం వదిలి పోతానని మొదట బీరాలు పలికిన చక్రధరుడు, తీరా ఓడి పోయూక ఓటమిని భరించలేక, శశికాంతుడి ఖడ్గానికిగల మహిమవల్లనే తను ఓడిపోయూనని ప్రచారం చేస్తూ, తృప్తి పొందడానికి యత్నించాడు.
 
అది నిజమైన వీరుడి లక్షణం కాదు. పైగా, స్వార్థం కోసం తిరుగుబాటు చేయడానికి జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నించడం అతడి దుష్టబుద్ధిని చాటుతున్నది. ఆస్థాన పండితుడు చెప్పినట్టు అతడి ప్రచారం వల్ల రాజ్యానికి మేలు తప్ప, హాని జరగదు. స్వశక్తీ, ధైర్యసాహసం, ఖడ్గచాలనంలో నేర్పూ ఉన్నప్పుడే ఖడ్గం సాయపడగలదని ముని, స్పష్టంగా చెప్పాడు.
 
అవన్నీ పుష్కలంగా ఉన్న శశికాంతుడికి ఓటమి అన్నది లేదు. అందువల్ల రాజ్యానికి ఎలాంటి ఆపదారాదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మా…ుమై, తిరిగి చెటె్టక్కాడు. 

సఫలయాత్ర


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు బోధిసత్వుడు ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ వర్తకంలోని మెళకువలను పెద్దలనుంచి నేర్చుకున్నాడు. ప్రతి విషయాన్నీ అన్ని కోణాల నుంచీ పరిశీలించి నెమ్మదిగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునే వివేకం పెంపొందించుకున్నాడు. పెద్ద వాడై అతను అయిదువందల బండ్ల మీద సరకు వేసుకుని తూర్పు నుంచి పడమరకూ, పడమరనుంచి తూర్పుకూ తరచూ వెళ్ళి వర్తకం చేసేవాడు. అలా వెళ్ళిన ప్రతిసారీ మంచి లాభాలు గడించేవాడు.

కాశీనగరంలోనే మందమతి అయిన మరొక వర్తకుడు ఉన్నాడు. అతను ఉపాయహీనుడు కూడానూ. ఒకసారి బోధిసత్వుడు తన బండ్లమీద సరకు వేసుకుని, ప్రయాణానికి సిద్ధంగా ఉండగా, మందమతి ఆయన దగ్గరికి వచ్చి తాను కూడా అదే సమయంలో బయలుదేరుతానన్నాడు.

బోధిసత్వుడు మందమతితో, "నీ బళ్ళూ, నా బళ్ళూ ఒక్కసారిగా బయలుదే రితే, దారి ఇరుకై, ప్రయాణానికి ఇబ్బంది కలగవచ్చు. అందుచేత ఒకరి వెనుక ఒకరు బయలుదేరటమే అన్నివిధాలా మంచిది. ముందు నువ్వు బయలు దేరమన్నావా? నీ ఇష్టప్రకారమే చేద్దాం," అన్నాడు.

మందమతి తనలో ఇలా అనుకున్నాడు: "ముందు నేను పోయినట్టయితే చాలా లాభాలుంటాయి. దారి నలగదు. ప్రయాణం హాయిగాసాగుతుంది. దారి పొడవునా పశువులకు మంచి పచ్చికా, మనుషులకు మంచి కాయలూ, ఫలాలూ, కూరలూ లభించవచ్చు. నిర్మలమైన నీరు లభ్యమవుతుంది. వెళ్ళిన చోట సరకుల ధరలు నా ఇష్టప్రకారం నిర్ణయించవచ్చు." బోదిసత్వుడు కూడా తనలో ఇలా అనుకున్నాడు:


"అందరికన్నా ముందు వెళ్ళడంకన్నా, ఒకరు తొక్కిన దారిన ప్రయాణిం చటం తేలిక. ఒకసారి పశువులు మేసిన చోట గడ్డి మళ్ళీ చిగురు పట్టిన ప్పుడు రెండింతలు అవు తుంది. కూరగాయలు కూడా అంతే. ముందు వెళ్ళిన వారు నీటి వనరులు ఎక్కడ ఉన్నవో కష్టపడి కనిపెడతారు. లేదా నీటికోసం బావులు తవ్వుతారు. అని తవరాత వెళ్ళేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్త చోటికి మొదటి సారిగా వెళ్ళి అక్కడివారితో ధరలను గురించి బేరాలాడటం అంతమంచిది కాదు. ముందు వెళ్ళిన వాళ్ళూ నిర్ణయించిన ధరలకు వెనక వెళ్ళేవాళ్ళు ఎలాంటి సమస్యా లేకుండా అక్కడి వారితో చాలా మంచిగా వర్తకం చేసుకోవచ్చు."

ఇలా అనుకుని మందమతి ముందు తాను పోతాననేసరికి బోధిసత్వుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. మందమతి మనసులో ఎంతగానో సంతోషించాడు. మందమతి వెళ్ళవలసిన చోటు అరవై యోజనాల దూరాన ఉన్నది. మధ్యలో పెద్ద ఎడారి ఉన్నది. దానిని దాటి గమ్యం చేరుకోవాలి. అందుచేత ప్రయాణానికి అవసరమైన తినుబండారాలూ, పీపాలతో తాగటానికి నీరూ సిద్ధం చేసుకుని మందమతి బోధిసత్వుడికి మంచిటోపీ వేశాననుకుని సంతోషంగా బయలు దేరాడు.

మందమతి బిడారు చాలా దూరం ప్రయాణంచేసి, కొన్నిరోజులకు ఎడారి ప్రాంతం చేరుకున్నది. అందులో కొంత దూరం వెళ్ళేసరికి మందమతికి అపూ ర్వమైన వాహనం ఒకటి ఎదురయింది. దానికి ఉత్తమజాతి ఎద్దులు, తెల్లనివి, పూన్చి ఉన్నాయి. అందులో ఒక రాజపురుషుడు చాలా ఠీవిగా కూర్చుని ఉన్నాడు. ఆ బండి ముందు సేవకులు కత్తులూ, కటార్లూ, విల్లమ్ములూ ధరిం చి నడుస్తున్నారు. వెనక మరికొందరు నడుస్తున్నారు. బండిచక్రాలకు బురద అంటి ఉన్నది. అందరి తలలకూ తామర తూండ్లు చుట్టి ఉన్నాయి. వారి చేతు ల్లో తామరపూలు ఉన్నాయి.

రాజపురుషుడు మందమతితో, "ఏం వర్షం! కుంభపోతగా ఒకటే వాన! అదుగో, కనిపిస్తూన్న ఆ అడవి ఆ ప్రాంతమంతా జలమయమే. ఏళ్ళూ, ఊళ్ళూ ఏకమై పోయాయి! అలాంటి వర్షం నా జీవితంలో చూడలేదు. మీరు అటే పోతున్నారు గదా, ఈ పీపాలతో నీరేమిటి? ఎందుకొచ్చిన బరువు? నీరు పారబోసి తేలికగా వెళ్ళండి," అని సలహా ఇచ్చాడు మందహాసం చేస్తూ.

ఆ రథంలో ఉన్నవాడూ, వాడి వెంటవున్న పరివారమూ నరభక్షకులైన యక్షు లు. వాళ్ళు ఇటువైపు వచ్చే ఎడారి ప్రయాణీకులను ఇలాగే మంచి మాటలతో వంచించి, వారు తిండికి మాడి, దాహంతో చచ్చినాక వాళ్ళను హాయిగా పీక్కు తింటారు.

ఈ సంగతి గ్రహించక మందమతి బండ్లలోని పీపాలన్నీ ఖాళీ చేయించి, ముందుకు కదిలాడు. దూరాన రాజపురుషుడు చూపిన అడవి కనబడుతు న్నదేగాని, ఎంత దూరం వెళ్ళీనా అది చేరువకాలేదు. వర్షం కురిసిన ఆనవాలు ఏ మాత్రం కనిపించలేదు.

అందరూ దాహంతో బాధపడుతున్నారు. తాగటానికి నీటిచుక్క కూడా లేదు. గొంతులు ఎండిపోయి సొమ్మసిల్లి ఒక్కొక్కరే మరణించసాగారు. క్రమంగా ఎడ్లు కూడా సోలిపోయాయి, చచ్చిన మనుషులనూ, పశువులనూ యక్షులు వచ్చి తెనేసి, అస్థిపంజరాలను ఎడారి ఇసుకలో వదిలేశారు.

నలభై అయిదు రోజులు గడవనిచ్చి, బోధిసత్వుడు కూడా తన బిడారుతో అదే తోవన బయలుదేరాడు. అతను కూడా సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన తిను బండారాలూ, పీపాలతో నీరూ బళ్ళల్లో సమకూర్చుకున్నాడు.
వాళ్ళూ ఎడారి ప్రాంతం చేరగానే బోధిసత్వుడు తన మనుషులతో, "నాతో చెప్పకుండా ఎవరూ ఒక్కచుక్క నీరు పారబోయవద్దు. ఇలాటి ఎడారిలో రకర కాల విషవృక్షాలుంటాయి. కొత్తరకం కాయగాని, ఆకుగాని ఎవరూ తినవద్దు," అన్నాడు.


బిడారు కొంత దూరం వెళ్ళేసరికి రాజపుషుడు రథం లాంటి తన వాహనంలో అంతకు ముందు ఎదురుపడి, మందమతితో చెప్పినట్టే చెప్పాడు. అతనితో బోధిసత్వుడు, "మీ దారిన మీరు వెళ్ళండి. చాలా దూరం ప్రయాణం చేయవల సి ఉంది. మేం వర్తకులం. ఇంకో చోట నీరు కనబడితేగాని ఉన్న నీరు పారబో యం. మొదటి నీరు కనిపించనీ. కావాలంటే అప్పుడు బరువు తగ్గించుకుం టాం,"  అన్నాడు.

యక్షుడు ఆ తరవాత ఏమీ చెప్పకుండా మౌనంగా తనదారిన వెళ్ళిపోయాడు. అతని మాటలు నమ్మి సేవకులు కొందరు నీరు పారబోద్దామన్నారు. బోధిస త్వుడు వారితో ఇలా అన్నాడు:

"ఈ ప్రాంతంలో జలాశయం ఏదన్నా ఉన్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ మనిషి కుంభపోతగా వర్షం కురిసిందన్నాడు. మనకేసి తడిగాలి ఏమైనా వీచిం దా? ఆకాశంలో ఎక్కడైనా మబ్బుతునకలాటిది కనబడుతున్నదేమో చూడం డి? మెరుపులు కనబడ్డాయా? ఉరుములు వినబడ్డాయా? మనం చూసిన వాళ్ళు యక్షులు. మనం శోషపడి పోతే తినటానికి ఎత్తు వేశారు. మన ముందు పోయిన వర్తకుణ్ణీ, అతని మనుషులనూ తినేసే ఉంటారు. వాళ్ళ అస్థిపంజరాలు దారిలో మనకు కనబడవచ్చు కూడా!" అతను చెప్పినట్టే, బిడారు కొంత దూరం వెళ్ళేసరికి, మందమతి తాలూకు అయిదువందల బళ్ళూ, వాటిలోని వర్తక సరులులూ కనిపీంచాయి. వాటి చుట్టూ మనుషులవీ, పశువులవీ అస్థిపంజరాలు చెదురు మదురుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూడడానికి చాలా బీభత్సంగా ఉంది.

"చూశారా? మందమతి దూరాలోచన చెయ్యక, ఎవరో చెప్పిన మాటలు నమ్మి నీరు పారబోసుకోవటం వల్ల ఏం జరిగిందో? " అన్నాడు బోధిసత్వుడు.

ఆ ప్రాంతంలోనే ఆ రాత్రి మజిలీ చేసి, బోధిసుత్వుడు, మర్నడు ఉదయం, చచ్చి పోయిన వర్తకుడి బళ్ళలో చెడిపోనివీ, సరుకులలో బాగా ఉన్నవీ తన వెంట తీసుకుని గమ్యస్థానానికి వెళ్ళి, లాభసాటిగా తన దేశనికి తిరిగి వచ్చాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక్క ప్రాణి కూడా నష్టం కాలేదు.


తల్లి ఋణం


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు. ఆ గిత్త నల్లని నిగనిగ లాడే రంగుతో, చూడముచ్చటగా వుండేది. దాని అందం, గాంభీర్యం చూసి, దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసి పోయేవారు.

ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశిపెద్దమ్మ ఇంటి భాగంలో కాపరం వుంటూ వచ్చారు. కొన్నాళ్ళ తరవాత వాళ్ళు, ఆ ఊరు వదిలి పోవలసి వచ్చింది. వాళ్ళు పేదరాసి పెద్దమ్మకు ఇంటి అద్దెకింద, ఆ నల్లగిత్తను ఇచ్చేశారు. పెద్దమ్మకు నా అన్నవళ్ళెవరూ లేరు. ఆమె ఆ నల్లగిత్తనే బిడ్డలా చూసుకుంటూ రాసాగింది.

బియ్యపు కడుగూ, గంజినీళ్ళూ కలిపి, అందులో తౌడువేసి మంచి కుడితి తయారు చేసి, పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది. రోజూ కాలవకు తీసుకుపోయి మెత్తని గడ్డిపరకలతో దాని ఒళ్ళంతా తోమి, శుభ్రంగా కడిగేది. ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడూ కట్టుకొయ్యకు కట్టివేసి ఎరగదు.

నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ, దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చినై. అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్చగ తిరెగేది. పిల్లలూ దానిమీద ఎక్కి స్వారీ చేసేవాళ్ళు. దాని గంగడోలు దువ్విదానితో ఎన్నో ఆటలు ఆడేవారు.ఒక రోజున నల్లగిత్త తనలో ఇలా అనుకున్నది: "నన్ను పెంచే పెద్దమ్మకడు పేదరాలు. నా కోసం ఎంతో శ్రమ పడుతున్నది. నే నామెకు కొంత ధనం సంపాయించి పెట్టగలిగితే, ఆమె శ్రమ చాలావరకు తగ్గించిన దానినవుతాను!"

ఇటువంటి ఆలోచన కలగగానే, అది ధనం సంపాయించే మార్గాలకోసం వెదకసాగింది. ఆ స్థితిలో ఒక రోజున, ఐదు వందల బండ్లపైన ధాన్యం వేసుకుని వర్తకుడొకడు, ఆ ఊరు కేసి బయలుదేరాడు. బళ్ళన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులూ లేకుండా కదిలినై. కాని, ఒకచోట అవి చిన్న ఏరు దాటవలసి వచ్చింది. ఆ ప్రాంతమంతా ఇసుకమయం.


ఆ ఇసుకలో బళ్ళవాళ్ళూ ఎంత ప్రయత్నించినా ఎడ్లు బండ్లను లాగలేక పోయినై. ఆ కారణంగా అన్ని బళ్ళూ ఏటిపక్కన ఆగిపోవలసి వచ్చింది. ఊరి నుంచి ఎడ్లను తీసుకుపోయి, బళ్ళను లాగించాలని చూశారు. కాని, ఆ ప్రయత్నం ఫలించలే దు. ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త, ఏటికి ఆవలిగట్టున మరికొన్ని పశువులతో కలిసి మేతమేస్తున్నది. ఆ పశువులలో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులేమైనా వున్నవేమో అని చూసేందుకు, వర్తకుడు తన మనుషు లతో అక్కడికి వచ్చాడు.

ఆ వర్తకుడి దృష్టిని బలంగా, చలాకీగా వున్న నల్లగిత్త ఆకర్షించింది. "ఈ నల్లగిత్త చాలా అసామాన్యంగా కనిపిస్తున్నది. దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరుదాటించవచ్చు,"  అనుకున్నాడు వర్తకుడు.

వర్తకుడు, అక్కడ వున్న పశువుల కాపరి కుర్రవాళ్ళను పిలిచి,, "ఒరే, ఈ నల్లగిత్త ఎవరిది? దీన్ని కొంచెం సేపు ఎరువిస్తారా? బళ్ళను ఏరు దాటించాలి. కోరిన ధనం ఇస్తాను," అన్నాడు. "గిత్తను తోలుకుపోయి మీ బళ్ళు లాగించుకోండి. దీనికి యజమాని అంటూఎవరూ లేరు. అలా ఇష్టం వచ్చిన చోటునల్లా  తిరుగుతూంటుంది," అన్నారు పశువుల కాపరి కుర్రవాళ్ళు.

వర్తకుడు గిత్తమెడకు తాడు కట్టించు దాన్ని అక్కడినుంచి లాక్కుపోవాలని చూశాడు. కాని, నల్లగిత్త ఒక అంగుళమైనా కదలలేదు. దాన్ని ఈడ్చుకు పోవడం వర్తకుడి మనుషుల వల్ల కాలేదు.

వర్తకుడు కొంచెం సేపు ఆలోచించి, బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తూండాలి, అనుకుని, నల్లగిత్తతో, "నీ రూపురేఖలు చూస్తుంటే, వృషభరాజులా వున్నావు! దయతలచి నా ఐదు వందల బళ్ళనూ ఏరు దాటించు. నీ కష్టం ఉంచు కోను. బండి ఒక్కింటికి రెండేసి వరహాల చోప్పున వేయి వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను," అన్నాడు.


వర్తకుడు ఇలా అనగానే నల్లగిత్త కదిలి, ఏటి ఒడ్డున వున్న బళ్ళ దగ్గిరకు పోయి నిలబడింది. వర్తకుల మనుషులు దానిని ఒక బండికి కట్టారు. గిత్త సునాయాసంగా బండిని అవతలి గట్టుకు లాక్కుపోయింది. ఇలా ఐదువందల బళ్ళనూ అది కొద్ది సేపట్లో అవతలిగట్టుకు చేర్చింది.

తన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టీలోపల ఐదువందల వరహాలు పెట్టి, ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు. వర్తకుడు మోసం గ్రహించిన బోధిస త్వుడు, "ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది. మాట తప్పాడు!" అనుకుని ఏటిగట్టున తాను మొట్టమొదట చేర్చిన బండికి అడ్డుగా నిలబడి, అటకాయిం చాడు.

దానితో వర్తకుడికి, నల్లగిత్త మామూలు పశువు కాదనీ, మహత్తు గలదనీ అర్థమైంది. అతను మరొక ఐదువందల వరహాలు ఇంకొక పట్టీలో పెట్టి, దానిని గిత్తమెడకు బిగిస్తూ, "అయ్యా, నన్ను క్షమించు. నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలూ నీ మెడకు కట్టాను. ఇక, నా బండ్లు గ్రామానికి పోయేందుకు దారి వదులు," అన్నాడు.

గిత్త అక్కడినుంచి బయలుదేరి, సరాసరి తనను ఇంతకాలంగా సాకుతూన్న పెద్దమ్మ దగ్గరకు పోయింది. ఐదువందల బండ్లను ఏటి ఇసుకలో లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా అలిసిపోయివున్నది. అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గుడ్డతో తుడుస్తూ, మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టివున్న పట్టీలు కనిపించినై.

వాటిని ఊడదీసి చూడగా పెద్దమ్మకు వరహాలు కంటబడినై. ఆమె ఆశ్చర్య పోతునంతలో గొడ్లకాపరి కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి, జరిగింది చెప్పారు. పెద్దమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని, గిత్త తల నిమురుతూ , "తండ్రీ, నా కోసం ఎంత శ్రమ పడ్డావు! ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను?" అని, అప్పటికప్పుడు దాని ఒంటి నొప్పులు పోయేందుకు నూనె రాసి, వేడినీళ్ళతో కడిగింది.

ఈ విధంగా బోధిసత్వుడు తననెంతో ప్రేమగా పెంచిన తల్లిఋణం తీర్చిన కొంత కాలానికి, సంతోషంగా నల్లగిత్త అవతారం చాలించాడు.


లంచగొండి


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు ఆయన వద్ద క్రయాధికారిగా వుండేవాడు. క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరం అయిన వస్తు, వాహనాల్లాంటివి నాణ్యం చేయటంలోనూ, వాటి విలువ కట్టటంలోనూ నేర్పుగలవాడన్నమాట.

బోధిసత్వుడు, కాశీరాజ్యానికి కావలసిన ఏనుగులనూ గుర్రాలనూ, వెండి బంగారాలనూ పరీక్ష చేసి, విలువ కట్టి, తన అంచనా ప్రకారం, ఆ జంతువులనూ, వస్తువులనూ తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లించుతూండేవాడు.

రాజు బ్రహ్మదత్తుడు పరమలోభి. ఈ క్రయాదికారి కొనే ప్రతి వస్తువుకూ ఎక్కువ ధర చెల్లిస్తున్నాడని కొందరంటున్నారు. ఇది నిజమే అయుండాలి. ఇలా అయితే, త్వరలోనే నా రాజ్యం దివాలా ఎత్తుతుంది!
రాజు ఒకనాడు ఇలా ఆలోచిస్తూ, ఉద్యానం వైపు కిటికీరెక్కలు తెరిచాడు. అక్కడ ఎండలో ఎంతో శ్రమిస్తూ చెట్లకు నీళ్ళు పోస్తున్నవా

డొకడు ఆయన కంటబడ్డాడు. వెంటనే ఆయనకు, "ఆహా, వీడెంత నమ్మకస్థుడు కాకపోతే, ఇలా ఎండలో శ్రమపడతాడు!" అన్న ఆలోచన వచ్చింది.

ఆ మర్నాడే రాజు తోటపని చేసేవాణ్ణి, బోధిసత్వుడి స్థానంలో క్రయాధికారిగా నియమించాడు. ఈ కొత్తవాడు తన బుద్ధికుశలత వల్ల వస్తువులు క్రయం చేయటంలో యుక్తిచేసి, తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ. కాని ఈ కొత్తక్రయాధికారి దురాశపరుడేతప్ప, వివేకం గలవాడు కాదు. అతడికి వస్తుతత్వం గాని, నాణ్యం గాని, దాని విలువ తెలియదు. అందుచేత ఏనుగులూ, గుర్రాలూ, వస్తు సామాగ్రీ బేరం చేయవలసి వస్తే, తన బుద్ధికి ఏమి తోస్తే అది అడగటమే తప్ప, ఒక సరఅయిన పద్ధతీ, అంచనా వుండేది కాదు. ఆ కారణంగా వస్తువులు అమ్మకానికి తెచ్చే వర్తకులకు తరుచు నష్టం కలుగుతూండేది. తన వస్తువులు కొనేది రాజుగారి క్రయాధికారి గనక, నష్టం కలిగినా మారు మాట్లాడలేక వర్తకులు, ఇచ్చిందేదో పుచ్చుకుని ఇళ్ళకు పోయేవాళ్ళు.


ఒక రోజున ఉత్తరదేశం నుంచి, ఒక అశ్వవ ర్తకుడు, ఐదు వందల మేలుజాతి గుర్రాలను తీసుకుని కాశీ రాజు వద్దకు వచ్చాడు.

క్రయాధికారి వచ్చి ఐదువందల గుర్రాలనూ పరీక్షించి, "ఎంత ఆలొచిం చినా వీటి విలువ ఒక కుంచెడు బియ్యం కన్న ఎక్కువ కాదని పిస్తున్నది. వీటి యజమానికి కుంచెడు బియ్యం ఇచ్చి గుర్రాలను శాలలో కట్టి వెయ్యండి," అని ఉత్తరువులు జారీ చేశాడు.

అశ్వవర్తకుడు సరాసరి రాజుగారి పూర్వపు క్రయాధికారి అయిన బోధిసత్వుడి దగ్గిరకు పోయి, తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు.

బోధిసత్వుడు అంతా విని, "అయ్యా, ఒకపని చెయ్యి. ఈ కొత్త క్రయాధి కారిని తృప్తి పరిచేందుకు, ముందుగా అతడికి లంచం డబ్బులు ఇచ్చి, తరవాత ఇలా అడుగు: ' నా గుర్రాలకు తమరు కట్టిన కుంచెడు బియ్యం విలువ న్యాయం గానే ఉన్నది. అయితే ఈ కుంచెడు బియ్యానికి విలువ ఎంతో తమరు సభలో రాజు గారి ఎదుట చెప్పగలరా?' ఇందుకు క్రయాధికారి అంగీకరిస్తే అతణ్ణి రేపు రాజుగారి దగ్గిరకు తీసుకుపో, ఆ సమయంలొ నేను అక్కడ వుండి, నీకు న్యాయం జరిగేలా చూస్తాను," అన్నాడు.

బోధిసత్వుడు చెప్పినట్టుగా ఆ అశ్వవర్తకుడు అప్పటికప్పుడే క్రయాధి కారి దగ్గరకు బయలు దేరి వెళ్ళి, అతడికి లంచంగా కొంతడబ్బిచ్చి, బోధిసత్వుడు అడగమన్న విధంగా అడిగాడు.

క్రయాధికారి పరమానంద పడిపోతూ, "దానిదేముంది! ఈ కుంచెడు బియ్యం విలువ చెప్పటం ఏమంత కష్టం కాదు. రేపు సభలో రాజు గారికి ఆ సంగతి చెప్పి, ఆయన చేత సరే అనిపిస్తాను," అన్నాడు. మర్నాడు రాజసభ కిటకిటలాడుతున్నది. రాజు గారి అనుమతి పొంది బోధిసత్వుడు కూడా వచ్చాడు.

నష్టపోయిన అశ్వవర్తకుడు రాజుతో, "ప్రభూ, తమ కొత్త క్రయాధికారి, నా ఐదు వందల గుర్రాలకూ కుంచెడు బియ్యం విలువ కట్టటం బాగానే వున్నది. ఇందులో నాకొక చిన్న సందేహం కలుగుతున్నది. ఆ కుంచెడు బియ్యానికీ విలువ ఎంత?" అన్నాడు.

ఆ క్షణం వరకూ రాజుకు ఈ విషయంగా జరిగినదేమిటో అసలు తెలియదు. ఆయన ఆశ్చర్యపోతూ, కొత్త క్రయాధికారిని, "ఐదు వందల గుర్రాల విలువ ఎంత కట్టావు?" అని అడిగాడు.


"కుంచెడు బియ్యం, ప్రభూ!" అన్నాడు క్రయాధికారి తొణకకుండా. "అలాగా! అయిదు వందల గుర్రాల విలువ కుంచెడు బియ్యం అయితే, ఆ కుంచెడు బియ్యం విలువ ఎంత?" అన్నాడు రాజు.

కొత్త క్రయాధికారి తడువుకోకుండా, "కుంచెడు బియ్యం విలువ మరెంతో కాదు, ప్రభూ! కాశీరాజ్యమూ, ఇరుగు పొరుగు సామంత రాజ్యాలూ కలిపితే, ఎంత విలువ వుంటుందో, అంత!" అన్నాడు.

విడ్డూరమైన ఈ జవాబు విని, మంత్రులూ సభలోని రాజోద్యోగులూ, పురప్రముఖులూ అవహేళన చేస్తూ చప్పట్లు కొడుతూ రాజు సభలో వున్న సంగతే మరిచి, పొట్టలు చక్కలయ్యేలా నవ్వటం ప్రారంభించా రు.

వాళ్ళల్లో ఒక ప్రముఖుడు లేచి, కొత్త క్రయాధికారితో, "ఇంతకాలం రాజ్యాలకు విలువ కట్టటం అసాధ్యం అనుకుంటూ వచ్చాం. కానీ, కాశీరాజ్యమంతా కలిసి కుంచెడు బియ్యం విలువ చేస్తుందని, నీ వల్ల ఇప్పుడే తెలుసుకున్నాం. ఆహా, నీ తెలివితేటలు అద్భుతం. ఎంత గొప్ప వివేకివి!" అంటూ గేలిచేశాడు.

అప్పుడు బోధిసత్వుడు సభ ముందుకు వచ్చి," ఈ క్రయాధికారి చెప్పినది పరమసత్యం, అందులొ విడ్డురం ఏమీ లేదు. అతణ్ణి చూసి నవ్వకండి. ఐదు వందల గుర్రాలూ ఒక కుంచెడు బియ్యం విలువ అన్నాడు. ఒక కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యమూ, సామంత రాజ్యాలూ కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి, ఆ ఐదు వందల గుర్రాల విలువ, కాశీ రాజ్యమూ, సామంతరాజ్యాలూ కలిపినంత అని అర్ధమవుతున్నది. ఇందువల్ల క్రయాధికారి గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా కనబడుతున్నది," అన్నాడు.

బోధిసత్వుడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. విచారించగా జరిగినదంతా తెలియవచ్చింది. అప్పుడు కాశీ రాజు తన పొరబాటు గ్రహించి, లంచగొండి క్రయాధికారిని పదవి నుంచి తొలిగించి, తిరిగి బోధిసత్వుణ్ణి ఆ పదవిలో నియమించాడు.


వరహాల మూట

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక భూస్వామికి కుమారుడుగా జన్మించాడు.అతడు పెరిగి,పెద్దవాడవుతున్న కాలంలో ఆ కుటుంబం మరింత సంపన్నమయింది. అతడికి ఒక తమ్ముడు కూడా వున్నాడు.

కొంత కాలానికి భూస్వామి కాలధర్మం చెందాడు.

కుటుంబానికి సంబంధించిన ఒక గ్రామంలో తమకు రావలసిన వసూళ్ళ కోసం అన్నదమ్ములిద్దరూ ఒకనాడు బయలుదేరి వెళ్ళారు.అక్కడ రైతుల నుంచి తమకు రావలసిన ధాన్యం వగైరా వసూళ్ళ ద్వారా వెయ్యి వరహాల నగదు లభ్యమయింది.

ఆ డబ్బు తీసుకుని అన్నదమ్ములిద్దరూ కాశీనగరానికి బయలుదేరారు.దారిలో వారొక నది దాటవలసి వున్నది. అవతలి తీరానికి తీసుకువెళ్ళే పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి వుండడం చేత,వాళ్ళు ఒకచెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకున్న ఫలహారం మూటవిప్పి తిని, ఇన్ని మంచినీళ్ళు తాగారు.

భోధిసత్వుడు అలవాటు చొప్పున తన భాగంలో కొంత ఫలహారం మిగిల్చి, దానిని నదిలోకి విసిరాడు.

భోధిసత్వుడు విసిరిన ఫలహారాన్ని నదిలో వుండే ఒక జలభూతం అందుకున్నది. ఆ ఫలహారాన్ని తినగానే దానికొక దివ్యమైన శక్తి కలిగింది.దాని ద్వారా, ఆ జలభూతం తనకు ఫలహారం వేసిన వారెవరైందీ సులభంగా గ్రహించింది.

భోధిసత్వుడు ఆకలి తీరడంతో నది ఒడ్డున ఇసుక మీద పైబట్ట పరుచుకుని పడుకున్నాడు.అతడి తమ్ముడిది దొంగబుద్ధి.అన్నకు భాగం లేకుండా వెయ్యి వరహాల సొమ్ము తనదిగా చేసుకోవాలని అతడికి బుద్ధిపుట్టింది. ఆ వెంటనే అతడు వరహాలున్న మూట వంటిదే,అక్కడ దొరికిన రాళ్ళతో మరొక మూట తయారు చేశాడు. ఆ రెండు మూటలూ అన్నకు కనబడకుండా తన దుస్తుల్లో భద్రంగా దాచాడు.

తరవాత కొంతసేపటికి పడవవాడు రాగానే బోధిసత్వుడు నిద్రలేచాడు.అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు.పడవనది మధ్యకు వచ్చింది.తమ్ముడు అతి తీవ్రంగా ఆలోచించసాగాడు.తను చేసిన యుక్తిప్రకారం అతడు రాళ్ళమూటను నదిలో జారవిడవ దలిచాడు.చేసేది దొంగపని గనక,చేతులు వణుకుతూండగా అతడు మూటల్లో ఒకదాన్ని నదిలోకి జారవిడిచి, "అయ్యో,అన్నయ్యా!వరహాలమూట కాస్తా నదిలో పడిపోయింది," అంటూ బిగ్గరగా అరిచాడు.

ఈ మాటకు అన్న, "పోనీలే తమ్ముడూ, అది మన సొమ్ముకాదు, అందువల్లనే నదిలో పడిపోయింది. దానికోసం విచారించడం తెలివిమాలిన పని అవుతుంది," అని వూరుకున్నాడు.

బోధిసత్వుడు విసిరిన ఫలహారం తిన్న జలభూతం, ఆ నదిలో పడింది వరహాలమూట అని తెలుసుకోవడమేగాక, తమ్ముడి దుర్మార్గం కూడా గ్రహించింది.అది వెంటనే ఒక పెద్ద చేపను ప్రోత్సహించి, ఆ వరహాల మూటను మింగేలా చేసింది.

ఆ తరవాత, ఆ చేప తన కన్నుగప్పి,ఎక్కడికీపోకుండా జలభూతం దివారాత్రాలు కాపలాకాయసాగింది.

బోధిసత్వుడూ, అతడి తమ్ముడూ కాశీనగరానికి తిరిగి వచ్చారు.ఇంటికి చేరుతూనే తమ్ముడు తనవద్ద వున్న రెండవ మూటనువిప్పి చూశాడు. అందులో రాళ్ళు కనిపించాయి.తను చేసిన పొరబాటు తెలుసుకుని అతడు విచారంతో కుంగిపోతూ, మంచం పట్టాడు.

ఒక రోజున జాలరివాళ్ళు నదిలో వలలు వేశారు.జలభూతం తన శక్తి వల్ల, లోగడ వరహాలమూటను మింగిన చేప వాళ్ళ వలల్లో పడేలా చేసింది.

జాలరివాళ్ళు ఆ చేపను నగరానికి తీసుకుపోయి,'దీని ఖరీదెంత?' అని అడిగిన వాళ్ళతో, "వెయ్యివరహాలూ,అదనంగా ఒక్క వరహా!" అనసాగారు.

జాలరివాళ్ళకు మతులు పోయినవని అందరూ నవ్వుకోసాగారు.వాళ్ళు ఆ వీధీ,ఈ వీధీ తిరిగి ఎవరూ కొనక పోవడంతో ఆ చేపను బోధిసత్వుడి ఇంటికి తీసుకుపోయి,దాన్ని అమ్మజూపారు.

"ఈ చేప ఖరీదెంత?" అని అడిగాడు బోధిసత్వుడు "మీకైతే ఒక వరహా మాత్రమే!" అన్నారు జాలరివాళ్ళు.

"ఇతరులకైతే ఎంత వెల చెబుతున్నారు? మీ మాటల ధోరణి చూస్తూంటే,నాకు ఆశ్చర్యం కలుగుతున్నది," అన్నాడు బోధిసత్వుడు.

"మరెవరికైనా అయితే వెయ్యివరహాలు,పైన మరొకవరహా తీసుకుంటాం," అన్నారు జాలరివాళ్ళు.

బోధిసత్వుడు వాళ్ళ జవాబుకు ఆశ్చర్యపోతూ, వాళ్ళడిగిన వరహాయిచ్చి ఆ పెద్ద చేపను కొన్నాడు.

తరవాత అతడూ,భార్యా ఆ చేపను కోయగా,దాని పొట్టలో నుంచి వెయ్యివరహాలున్న మూట బయటపడింది.బోధిసత్వుడు దాన్ని గుర్తించాడు.

"ఈ వరహాల మూట మనదే!" అని బోధిసత్వుడు భార్యకు జరిగినదంతా చెప్పి, "ఈ జాలరివాళ్ళు దివ్యజ్ఞానం కలవాళ్ళలా కనబడుతున్నారు.చేప పొట్టలోని వరహాల మూట నాదేనని వాళ్ళు గ్రహించారు.అందుకే ఇతరులకైతే చేప ఖరీదు వెయ్యిన్నొక్క వరహా,నాకైతే వరహా అని చెప్పారు.వాళ్ళు చేపను పట్టేందుకు పడిన శ్రమకు కూలీ అన్నమాట," అన్నాడు బోధిసత్వుడు.

తరవాత బోధిసత్వుడు,జాలరి వాళ్ళకు అంతటి దివ్యజ్ఞానం ఎలా కలిగిందా అని ఆలోచిస్తూండగా, ఒక దివ్యవాణి ఇలా పలికింది: "మహానుభావా, నేను నదిలో నివసించే జలభూతాన్ని.ఒకనాడు నువ్వు నదిలోకి విసిరిన ఫలహారాన్ని తిని,దివ్యశక్తిని పొంద గలిగాను.నీటిలో పడిన వరహాల మూటను చేప చేత మింగింప చేసినది నేనే.జాలరి వాళ్ళను ప్రోత్సహించి నీ వద్దకు పంపినది కూడా నేనే.ఈ విధంగా నీ రుణం తీర్చుకో గలిగాను.ధనాశాపరుడూ,దుర్మార్గుడూ అయిన నీ తమ్ముడికి మాత్రం, ఆ ధనంలో భాగం ఇవ్వకు."

జలభూతం చేసిన ఉపకారానికీ, దాని మంచితనానికీ బోధిసత్వుడు చాలా సంతోషించాడు.ఐతే,అతడు తన తమ్ముడి విషయంలో మాత్రం దాని సలహా పాటించలేదు.సోదరన్యాయాన్ని అనుసరించి,బోధిసత్వుడు తన తమ్ముడికి ఐదు వందల వరహాలు ఇచ్చి,తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు.

ఆశ-పేరాశ

రఘువీరపురంలో అజయుడు, విజయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ, జీవితంలో ఒక్కొక్కమెట్టుగా పైకిరావాలని ఆశించే మనస్తత్వం మధ్యతరగతికి చెందిన అజయుడిది. అయితే, విజయుడిది ఎప్పుడూ పెద్ద పెద్ద ఆలోచనలే. "పులి ఏనుగు మెదడునే కోరుకుంటుందిగాని, ఆకలయిందని పచ్చిగడ్డి తినదు కదా. నేను పులిలాంటి వాణ్ణి. అజయుడిలా పరిగ ఏరడం నా వల్ల కాదు," అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. బాగా డబ్బున్న కుటుంబం గనక, విజయుడు సంపాయించక పోయినా పెద్దలు అంతగా పట్టించుకునేవారు కాదు. కాకుంటే అతడి భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బెంగపడేవారు.

ఇలా ఉండగా మిత్రులిద్దరికీ విద్యనేర్పిన గురువు విద్యాసాగరుడు, తన పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వెళదామని ఒకనాడు రఘువీరపురానికి వచ్చాడు. మిత్రులిద్దరూ గురువుగారికి సాదర స్వాగతం పలికి ఘనంగా ఆతిథ్యమిచ్చారు. గురువు చాలా సంతోషించి వారి స్థితిగతులు గురించి ఆరా తీశాడు.

"వ్యవసాయంలోనూ, వ్యాపారంలోనూ నేను మా తండ్రికి సాయపడుతున్నాను. సొంతంగా వ్యాపారం పెట్టడానికి మరికొంత కాలం పట్టవచ్చు," అన్నాడు అజయుడు వినయంగా.

"చాలా సంతోషం. చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ, అనుభవం అవసరం కదా. మంచిపనే చేస్తున్నావు," అని గురువు, "నీ పరిస్థితి ఏమిటి?" అన్నట్టు విజయుడికేసి చూశాడు.

"ప్రస్తుతానికిఏమీ చేయడం లేదు. చేయవలసిన అవసరం కూడా లేదు. మా తండ్రి నడుపుతూన్న నగల దుకాణానికి సాటిరాగల దుకాణం ఈ చుట్టుపక్కలలేదు. మా నగలు నాణ్యతకు పెట్టింది పేరు.
నేను దుకాణానికియజమానినైతే, నా ఇష్టానుసారం వ్యాపారం చేసి కావలసినంత సంపాదించగలను. మా నాన్నకన్నా పదింతలు ఎక్కువ సంపాయించి, పట్టణంలోనే నా అంత ధనవంతులులేరని పేరుతెచ్చుకుంటాను," అన్నాడు విజయుడు ధీమాగా.

ఆ మాటకు విస్తుపోయిన గురువు, "ఏ వ్యాపారమైనా ధర్మబద్ధంగా సాగాలి. లేని పోని దురాశకు పోతే అరిష్టాలు తప్పవు. పేరాశకుపోయి, విపరీతమైన కోరిక కోరుకున్న తిమ్మయ్య గతి ఏమయిందో చెబుతాను, విను," అంటూ ఇలా చెప్పాడు:

లంబోదరపురంలో తిమ్మయ్య అనే ఒక తిండిపోతు ఉండేవాడు. వాడికి ఎంత తిన్నా ఇంకా తినాలన్న కోరిక ఉండేది. ఇంట్లో వండిన వంటంతా తినేసి ఇంకా పెట్టండి అని అడిగేవాడు. పనిపాటుల మీద దృష్టిపెట్టి, తిండియావ తగ్గించుకోమని పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాడు. ఇంట్లో వాళ్ళు ఖాళీగిన్నెలు చూపించే సరికి, ఊళ్ళో ఇంటింటికీ వెళ్ళి తిండి పెట్టమనేవాడు.

ఊళ్ళో వాళ్ళు ఎంత కాలం పెడతారు? కొన్నాళ్ళు భరించి మావళ్ళ కాదన్నారు. ఎవరూ ఆదరించక పోవడంతో, రాత్రి వేళ ఇళ్ళల్లో జొరబడి తిండి దొంగిలించేవాడు.

పగటి పూట వాడు దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడి జంతువులను చూడగానే వాడికి నోరూరేది. ఒక బల్లెం సంపాదించి జంతువులను వేటాడి రాక్షసతిండి తినడం ఆరంభించాడు.

తిండిపోతు తిమ్మయ్యను చూడగానే చిన్నా చితక జంతువులు భయంతో పారిపోతూండేవి. ఒకరోజు తిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది. మొదట దానిని చూసి భయపడ్డాడు. ఆ ఏనుగు అవలీలగా చెట్టు కొమ్మలను విరిచి ఆకులు రెమ్మలతో సహా తినడం; చూస్తూండగానే అంత పెద్ద చెట్టు క్షణాలలో మోడయిడపోవడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తరువాత అంత పెద్ద ఏనుగును అమాంతం పట్టి నమిలి మింగాలన్న విపరీతమైన కోరిక కలిగింది. వెంటనే చిన్నదిగా ఉన్న పొట్టను చూసుకుని ఏనుగు ఇందులో పట్టదు కదా అన్న నిరుత్సాహంతో చాలా బాధ పడిపోయాడు.

ఎలాగైనా ఏనుగును తినాలన్న కోరికతో అసహనంగా తిరుగుతున్న తిమ్మయ్యకు దూరంగా ఒక మునీశ్వరుడు కనిపించాడు.

 వాడు పరుగునవెళ్ళి ఆయన పాదాలపై బడి, తన కూరికను చెప్పి, అది తీరే మార్గం చెప్పమని దీనంగా వేడుకున్నాడు.

మునీశ్వరుడు వాడి కోరిక విని విస్తుపోయాడు. అయినా, అడిగిన వారికి లేదనకూడదనే నియమం ఉన్న వాడు గనక ఆయన, "నేనొక మంత్రం ఉపదేశిస్తాను. అదిగో, ఆ కనిపిస్తున్న కొండ గుహలోకి దూరి, ఆ మంత్రాన్ని దీక్షగా జపించు, నీ కోరికనెరవేరుతుంది," అని మంత్రం ఉపదేశించాడు.

వెంటనే, తిమ్మయ్య గుహలోకి వెళ్ళి, "ఏనుగును కూడా ఇముడ్చుకోగలిగినంత పెద్ద్డపొట్ట నాకు కావాలి," అనుకుంటూ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని పట్టుడలతో జపించసాగాడు.

మూడో రోజు తెల్లవారుతూండగా తిమ్మయ్యపొట్ట ఎంతో పెరిగిపోయింది వాడి ఆనందానికి హద్దులు లేకపోయింది. ఇక అరణ్యంలోని అన్నిరకాల జంతువులనూ హాయిగా తినవచ్చుననుకుంటూ గుహ లోపలి నుంచి బయటకు రాబోయాడు.

అయితే భారీకాయం వల్ల గుహ ద్వారం నుంచి బయట పడలేకపోయాడు.ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెలుపలికి మరొక దారిలేదు. విపరీతమైన ఆకలి. గుహలో రాళ్ళూ రప్పలూ తప్ప మరేమీ లేవు. గుహ లోపలికి జొరబడేప్పుడు, గుహ ముఖద్వారం మనిషి ప్రవేశించడానికి చాలినంత మాత్రమే ఉందన్న విషయం గుర్తించలేకపోయాడు. తన పేరాశకూ, విపరీత కోరికకూ పశ్చాత్తాప పడుటూ ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గుహలోనే ప్రాణాలు వదిలాడు.

గురువు ఈ కథ చెప్పి, "చూశావా, పేరాశకు పోయి తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే దురాశ దు:ఖం చేటు అన్నారు పెద్దలు. ఆకాశానికి నిచ్చెన వేయడం ఎలాగా అని ఆలోచించడంమాని, మొదట ఎదుట ఉన్న సొంత చెట్టెక్కి పళ్ళుకోయటం నేర్చుకో," అన్నాడు మందహసంతో.

"చిత్తం, గురువర్యా. ఈ రోజు నుంచే మా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి, వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంటాను," అన్నాడు విజయుడు గురువుకు నమస్కరిస్తూ. 

నగరాన్ని జయించబోయిన నక్క

పూర్వం ఒకప్పుడు బోధిసత్వుడు వారణాశీ నగరంలోని ఒక గొప్ప పండిత కుటుంబంలో జన్మించాడు. అతడు యుక్తవయస్కుడవుతూనే సర్వ శాస్త్రాలూ అభ్యసించి, పండితులందరిలోనూ గొప్పవాడనిపించుకున్నాడు. ఆ కారణంగా రాజు అంత చిన్న వయసులోనే ఆయనను తన ఆస్థానంలో ప్రధాన పౌరోహితుడుగా నియమించాడు.

బోధిసత్వుడు తాను శాస్త్రగ్రంథాలు పఠిస్తున్న సమయంలో, ఒక అద్భుతమైన మంత్రాన్ని కనుగొన్నాడు. దాని ప్రభావంతో ఇతరుల మీద సర్వాధికారాలు చలాయించవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి చదివితే, ఎంతటి వాళ్ళయినా దాసోహం అనవలసిందే!

ఆ మంత్ర ప్రభావంతో ఎవరిపైనా అధికారం నెరపాలని బోధిసత్వుడికి ఆశలేదు కాని, దాన్ని మరిచిపోకుండా జాగ్రత్తపడాలన్న ఆలోచన కలిగింది.

ఇందుకు బోధిసత్వుడు అరణ్యంలోని ఒకానొక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ వున్న ఒక ఎత్తయిన రాతిపై కూర్చుని, ఆయన పరిసరాలను ఒకసారి చూశాడు. ఎక్కడా మనిషిగానీ,జంతువుగానీ ఆయన కంటబడలేదు.

బోధిసత్వుడు ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివి, సూర్యాస్తమయం అవుతూండగా, రాతి మీది నుంచి లేచి నగరానికి బయలుదేరాడు.

ఆ సమయంలో రాతి వెనుక వున్న బొరియలోంచి నక్క ఒకటి గెంతుతూ బయటికి వచ్చి, "ఓయ్, పండితుడా! నువ్వు చదివిన మంత్రాన్ని, నేను కంఠస్థం చేశాను; వేయి నమస్కారాలు!" అంటూ అక్కణ్ణించి పరిగెత్త సాగింది.

నక్కలాంటి హీనప్రాణి అంత శక్తివంతమైన మంత్రం నేర్చుకోవడం చూసి, బోధి సత్వుడు ఎలా అయినా దాన్ని పట్టుకోవాలని వెంటబడ్డాడు. కాని,అప్పటికే చీకటి కమ్ముతున్న కారణంగా దాపులవున్న పొదలచాటున నక్కుతూ, అది పారిపోయింది.

ఈ నక్క అంతకు పూర్వజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి, బతికినన్నాళ్ళూ అమితమైన జిత్తులమారితనం తోనూ, పరులకు హాని చేస్తూనూ కాలం వెళ్ళబుచ్చింది. ఆ మానవ జన్మ కారణంగా దానికి మంత్రానికి వున్న అద్భుతశక్తి తెలిసిపోయింది.

పారిపోతున్న నక్కకు ఎదురుగా తనకన్న మంచి కండబలం, వాడిపళ్ళూ వున్న నక్క ఒకటి రావడం కంటబడింది. వెంటనే అది భయంతో మంత్రం చదివింది. ఎదురు వస్తున్న నక్క అక్కడే ఆగి మెల్లగా దానికి వంగి నమస్కరించి, ఎంతో అణకువగా దారి తొలిగింది. మంత్రం నేర్చిన నక్కకు ఎక్కడలేని ఆనందం కలిగింది.

ఈ విధంగా నక్క కొద్దిరోజుల్లో ఎన్నో వందల నక్కల పై ఆధిపత్యం సంపాయించింది. తరవాత అది తన మంత్రశక్తిని అడవి పందుల మీదా; పులులూ, సింహాలూ, ఏనుగుల పై ప్రయోగించి, వాటన్నిటినీ లోబరుచుకున్నది. ఆ జంతువులన్నీ నక్కను తమ రాజుగా అంగీకరించి, గొప్ప ఉత్సవం జరిపినై.

రాజు నక్క, ఒక ఆడనక్కను వివాహమాడి, దాన్ని రాణీగా ప్రకటించింది. సింహాలూ, పులులలో నుంచి కొన్నింటిని మంత్రులుగా, సేనానాయకులుగా ఎన్నిక చేసింది. ఇన్ని అరణ్యమృగాలు తన ఆజ్ఞలను శిరసావహిస్తూ, తనకూ, తన భార్యకూ సేవలు చేస్తూండడం దానికి ఎక్కడలేని గర్వాన్నీ కలిగించింది.

రెండు ఏనుగులను పక్క పక్కన నిలబెట్టి, వాటిపైన సింహాన్ని నిలిపి, దానిపైన రాజునక్క ఆసీనురాలయ్యేది. కొన్ని జంతువులు, దాన్ని మించిన రాజు ప్రపంచంలో లేడంటూ విపరీతంగా పొగడసాగినై.

నక్కకు ఇవన్నీ వింటూంటే ఆనందంతో పాటు గర్వం కూడా అధికం కాసాగింది. "ఈ జంతువులకు రాజునన్న తృప్తితో ఎందుకు కాలం గడపాలి? ఏకంగా వారణాశీ నగరాన్నే ఎందుకు జయించ కూడదు?" అన్న ఆలోచన దానిక్కలిగింది.

కొద్ది రోజుల్లోనే అది మృగాల్లో సాటిలేని బలంగల సింహాలనూ, కొద్దిపాటి ఇతర జంతువులనూ సైన్యంగా సమకూర్చుకుని వారణాశీ నగరం పైకి దాడివెళ్ళింది. అవి రావడం చూసిన నగర వాసులు కొందరు భయకంపితులై, నగర వీధుల్లో పరిగెత్తుతూ, ఈ వార్తను ప్రజలకు తెలియబరిచారు. నగరంలో కల్లోలం ప్రారంభమయింది.

రాజునక్క నగర ద్వారం చేరి, చావు భయంతో వణికిపోతున్న కాపలావాళ్ళతో, "ఒరే, మీరు తక్షణం పోయి, మీ రాజును లొంగిపొమ్మని చెప్పండి. అలా లొంగక పోయాడో, నా సైన్యంతో మీ నగరం మీద దాడి చేయగలను," అన్నది.

కాపలావాళ్ళ ద్వారా ఆ సంగతి విన్న రాజుకు ఏమిచేయాలో పాలుబోలేదు. బోధిసత్వుడు ఆయనతో, "మహారాజా, ఈ సమస్యను పరిష్కరించే పని నాకు వదలండి," అన్నాడు.

తరవాత ఆయన కోటగోడ మీదికిపోయి, నక్కరాజును, "నగరాన్ని ఎలా జయించదలిచావు?" అని అడిగాడు.

రాజునక్క పెద్దగా నవ్వి, "ఆ పని చాలా తేలిక! నా సైనిక సింహాలన్నీ ఏకకంఠంతో ఒక్కసారి గర్జించితే, మీ సైనికులూ, పౌరులూ ప్రాణభయంతో చెల్లా చెదురుగా పారి పోతారు," అన్నది.

బోధిసత్వుడికి నక్కమాటలు అబద్ధం కాదని తోచింది. ఆయన గోడదిగువ నున్న రాజోద్యోగులతో, "మీరు వెంటనే వెళ్ళి, నగరవాసులందర్నీ బయటి శబ్దం వినిపించకుండా తమ చెవుల్లో దూది పెట్టుకోవసిందిగా చెప్పండి," అన్నాడు.

ఆ పని పూర్తికాగానే ఆయన రాజునక్కతో, "నగరాన్ని జయించేందుకు నువ్వేం చేయదలిచావో చెయ్యి!" అన్నాడు.

రెండు ఏనుగుల పై నిలబడిన సింహం మీద కూర్చుని వున్న రాజునక్క, సింహాలన్నిటినీ ఒక్కసారిగా భయంకర గర్జన చేయమని ఆజ్ఞాపించింది. ఆ మరుక్షణం పరిసరాలన్నీ దద్దరిల్లిపోయేలా సింహాలు గర్జించినై. తమ చెవి రంధ్రాలను దూదితో దట్టించిన కారణం వల్ల నగరవాసులకు సింహగర్జనలేవీ వినిపించలేదు. కాని, ఆ గర్జనలు వింటూనే రాజు నక్కను మోస్తున్న రెండు ఏనుగులూ ఎగిరి గంతు వేసినై. దానితో వాటి మీద నిలబడి వున్న సింహం కిందపడింది.ఏనుగులు భీతిల్లి పరిగెత్తుతూ తమ కాళ్ళతో రాజునక్కను చితకతొక్కినై. మిగిలిన మృగాలు భయపడి పారిపోతూ, ఒక దాన్నొకటి తొక్కుకుని కొన్ని చావగా, కొన్ని అరణ్యం చేరినై.

ఈ జరిగినది చాటింపు ద్వారా తెలుసుకుని నగరవాసులు తమ చెవులలో దట్టించిన దూదిని తీసి వేశారు. ముంచుకు వచ్చిన ఆపద తప్పిపోయినందుకు వాళ్ళందరూ ఎంతో సంతోషించారు.

రాజుతోపాటు నగరవాసులందరూ, తమను ఇంత ఘోరమైన ఆపద నుంచి కాపాడిన బోధిసత్వుడికి తమ కృతజ్ఞత తెలియజేశారు.

మేక నవ్వింది!

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక కొండ మీద గొప్ప దేవదారువృక్షంగా పుట్టి, ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూండేవాడు. ఆ కొండ దిగువున పండితుడొకాయన గురుకులం స్థాపించి, శిష్యులకు విద్యా బోధ చేసేవాడు.

ఒకసారి ఆ పండితుడు కూడనిపని ఏదో చేసి, ఆ పాపపరిహారానికి ఒక వ్రతం చేయ సంకల్పించాడు. ఆ వ్రతం ఫలించాలంటే, విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి వుంటుంది.

ఆయన ఒక ధనవంతుణ్ణి మేక కోసం యాచించాడు. అతడు తన మందలో వున్న మేకల్లో నుంచి వయసులో బలంగా వున్న దాన్ని పండితుడికి దానం చేశాడు. పండితుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, దాన్ని నదిలో శుభ్రంగా స్నానం చేయించి, మెడలో ఒక పూలదండ వేసి, తిరిగి తన వద్దకు తీసుకురమ్మనాడు.

శిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేకను నది దగ్గిరకు తీసుకుపోయారు. ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి వున్నది. శిష్యుల్లో ఒకడు దాన్ని నదిలో దింపి శరీరమంతా కడిగాడు. ఆ పని పూర్తయ్యేలోపల రెండవవాడు తీరంలో వున్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు.

శిష్యులిద్దరూ పూలదండను మేక మెడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో, అది బిగ్గరగా నవ్వింది.మొదట్లో వాళ్ళు, ఆ నవ్వింది మేక కాదనుకున్నారు. కాని, చుట్టు పక్కల మరొక

వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని జంటగా పారిపోయేందుకు కూడబలుక్కుంటున్నంతలో,మేక నవ్వడం మాని, కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. ఇది చూసి దైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు.

వాళ్ళు గురువుతో రహస్యంగా, "ఈ మేక నేదో భూతం ఆవహించినట్టున్నది. నది దగ్గిర ఇది మనిషిలా నవ్వింది; ఏడ్చింది. ఇలాంటిది బలిపశువుగా పనికి వస్తుందా?" అన్నారు.

గురువు ఏదో అనబోయేంతలో మేక, "నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి.ఎందుకు సంశయిస్తారు!" అన్నది.

ఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ వణుకుతున్నంతలో మేక, "అలా భయపడకండి. మీకెలాంటి ప్రాణహానీ కలిగించను," అన్నది.

పండితుడు భయం నుంచి కాస్త తేరుకుని, "మేక మనిషిలా మాట్లాడడం ఎంతటి మహాశ్చర్యం!" అన్నాడు.

"ఇందులో ఆశ్చర్యపడవలసింది రవంత కూడా లేదు. నేనూ ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణ్ణీ, పండితుణ్ణీ కూడా!" అన్నది మేక.

"అలాగా! అయితే, ఇంత నీచజన్మ నీకెందుక్కలిగింది?" అని అడిగాడు పండితుడు.

ఆ ప్రశ్నకు మేక దీనంగా ముఖం పెట్టి, "నేను చాలా పాపకర్మలు చేశాను. ఒకానొక వ్రతం చేసి వాటినుంచి బయటపడవచ్చునన్న భ్రమతో, నేనూ ఒక మేకను బలి ఇచ్చాను. అయినా, విధిని మోసగించలేకపోయాను. ఆ తర్వాత ఐదువందలసార్లు మేకగా జన్మ ఎత్తడం జరిగింది!" అన్నది.

పండితుడు అమితాశ్చర్యంతో, "ఐదు వందలసార్లు మేకజన్మా!" అన్నాడు.

"అవును. ఇందులో నాలుగువందల తొంభైతొమ్మిది సార్లు ఎవరో ఒకరు నన్ను బలిపశువుగా వాడుకున్నారు. ఇవాళ నా తల ఐదు వందలసారి తెగబోతున్నది. దీనితో నాకు పాపవిముక్తి కలుగుతుంది. నదిలో స్నానం చేశాక, హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అందుకే నవ్వాను," అన్నది మేక.

"అది బాగానే వుంది, మరి ఎందుకు ఏడ్చావు?" అని పండితుడు అడిగాడు.

"నిజం చెబుతున్నాను. ఐదు వందల జన్మల ముందు, నేనేం చేసి పాపం మూట కట్టుకున్నానో, అలాంటి పనే నువ్వు చేయబోతున్నావని గ్రహించాను. కనుక, నువ్వూ నాలాగే మేక జన్మలు ఎత్తి బాధల పాలవుతావు. నీ బుద్ధిహీనతకూ, ముందు ముందు నువ్వు అనుభవించే కష్టాలూ తలుచుకుని,నాకు కన్నీరాగింది కాదు," అన్నది మేక.

పండితుడు ఆలోచనలోపడ్డాడు. ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి, మేక చెప్పినదంతా విని ఆశ్చర్యం చెందారు.మేకను బలి ఇవ్వడం ద్వారా, రాబోయే జన్మల్లో గురువు గారికి పట్టనున్న దుర్గతి తలుచుకుంటే, వాళ్ళకు ఆగకుండా కళ్ళవెంట నీరు కార సాగింది. పండితుడు తన శిష్యుల కేసీ, మేక కేసీ ఒకసారి సాలోచనగా చూశాడు. ఏవో మంత్రాలు చదివి, ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన, తాను చేసిన పాపాలు తుడిచి పెట్టుకు పోతాయనుకోవడం అజ్ఞానం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది.అంతే కాక, ఇప్పుడు తానొక అల్పజీవిని చంపడం ద్వారా, మరింత పాపాన్ని మూటకట్టుకోవడం జరుగుతుందని గ్రహించాడు.

ఆయన మేకతో, "భయపడకు! నేను, నిన్ను బలియివ్వను," అన్నాడు.

"నాకు చావంటే భయంలేదు. ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను," అన్నది మేక.

"అదంతా నీ ఇష్టం. నేను మాత్రం చంపను! నువ్వెంత బ్రతిమాలినా, నా నిర్ణయం మాత్రం మార్చుకోను," అన్నాడు పండితుడు పట్టుదలగా.

"నాకు ఇవ్వాళ మృత్యువు రాసి పెట్టి వున్నది. అది నీ చేతి మీదుగా జరక్కపోతే, మరొకరు చేస్తారు!" అన్నది మేక.

పండితుడు ఒక్క క్షణం అలోచించి, "అలా జరగకూడదు. నీ కెవ్వరి నుంచీ హాని కలగకుండా చూసే బాధ్యత నాది," అన్నాడు.

ఆయన తన శిష్యులకు మేకను వదిలి పెట్టవలసిందిగా చెప్పాడు. మేక అక్కడి నుంచి బయలుదేరి, దాపులనున్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటూ ఇటూ తిరిగింది. తరవాత నదీతీరానికి బయలుదేరింది. పండితుడూ, ఆయన శిష్యులూ దానికి కొంచెం దూరంగా నడవసాగారు.

రెండు, మూడు గంటలకాలం మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి కొండ కేసి బయలుదేరింది. అది కొండ పైకి ఎక్కుతుండగా పండితుడూ, ఆయన శిష్యులూ దిగువున వుండి దాన్ని గమనించసాగారు.

ఆ సరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింతగా గుమిగూడాయి. మేక ఒక్కొక్క కొండరాయినే ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది. పండితుడూ, ఆయన శిష్యులూ చూస్తూండగా ఆకాశం పెద్దగా ఒకసారి ఉరిమింది. ఆ వెంటనే కళ్ళను మిరుమిట్లు కొల్పుతూ పిడుగొకటి వచ్చి మేక మీద పడింది.

పండితుడూ, ఆయన శిష్యులూ ఈ జరిగింది చూసి, ఒకసారి నిట్టూర్చి, వెనుదిరిగి గురుకులానికి బయలుదేరారు.

కొండ మీద దేవదారు వృక్షంగా వున్న బుద్ధుడు వాళ్ళను చూసి చాలా సంతృప్తి చెందాడు. తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలూ, యజ్ఞాల్లాంటివి చేసి బలులు ఇవ్వడం వృధా అన్న జ్ఞానం మనుషుల్లో ఏ కొద్దిమందికైనా కలగడం, ఆయనకు సంతోషకారణం అయింది.

నరకవాసి


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ధనికుడైన ఒక గొప్ప వర్తకుడుండేవాడు. ఆయనకు మిత్రవిందకుడని ఒక కొడుకుండేవాడు. ఈ మిత్రవిందకుడు ఎంతో పాపాత్ముడు. వర్తకుడు చనిపోయాక, ఆయన భార్య తన కుమారుడికి, ``నాయనా, ఇకనైనా సత్ప్రవర్తన అలవరుచుకో. దానాలు చెయ్యి; నియమాలు పాటించు; ధర్మం అనుసరించు!'' అని ఎంతో హితబోధ చేసింది. కాని వాడు తల్లి మాటలు కొంచెమైనా వినిపించుకోలేదు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది.
 
మిత్రవిందకుడితో అతని తల్లి, ``నాయనా, ఇవాళ పుణ్యదినం. తెల్లవార్లూ విహారంలో ధర్మోపదేశం చేస్తారు. నువు్వ అక్కడ అందరితో పాటు పూజ చేసుకుని, ఉపదేశం విని రా. తిరిగి వచ్చాక నీకు వెయ్యి రూపాయలిస్తాను,'' అన్నది. డబ్బుకోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు. అతను ఉపదేశం వినటానికి విహారానికి వెళ్ళాడు గాని, ఒకమూల పడుకుని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుతూనే లేచి హడావుడిగా ముఖం కడుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు.
 
 తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి ఎంతో సంతోషంగా వంటచేసి సిద్ధంగా వుంది. కొడుకు ఒంటరిగా రావటం చూసి, ``ధర్మబోధకుణ్ణి తీసుకురాలేదా, నాయనా?'' అని అడిగింది. ``ఆయనను ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా? నా కాయనతో పని లేదు!'' అన్నాడు మిత్రవిందకుడు. అతను భోజనం చేసి తల్లి దగ్గిర వెయ్యి రూపాయలు తీసుకుని తన పని మీద తాను వెళ్ళాడు. ఈ డబ్బుతో అతను బాగా వ్యాపారం చేసి అతి త్వరలోనే ఇరవై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు.

ఈ డబ్బు పెట్టుబడి చేసి సముద్ర వ్యాపారం సాగిస్తాను; ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను; అనుకున్నాడు మిత్రవిందకుడు. అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి, సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పిపోవటానికి, తల్లి వద్దకు వచ్చాడు. అంతా విని తల్లి కంటతడి పెట్టి, ``నాయనా, నాకు నీవొక్కడవే కొడుకువు! నీ దగ్గిర ఇంత డబ్బున్నది గదా. ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? సముద్ర ప్రయాణం క్షేమం కాదు.
 
 
నిన్ను వదిలి నేను ఉండలేను. నా మాట విని ఈ ప్రయాణం మానుకో, ఇంటి పట్టున వుండు!'' అన్నది. మిత్రవిందకుడు తల్లి మాట వినక, పోయితీరాలని మూర్ఖించాడు. ఆవిడ చెయ్యి పట్టుకుని వెళ్ళవద్దని ఎంతగానో బతిమాలింది. అతడు ఆగ్రహంతో తల్లిని కొట్టి, తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజే అతని పడవ బయలుదేరింది. ఏడు రోజులపాటు ప్రయాణం సరిగానే సాగింది. కాని ఎనిమిదవ రోజున నడి సముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది.
 
 ఈ దుర్ఘటనకు కారకులెవరో పడవలోనేవున్నారనే ఉద్దేశంతో నావికులు చీటీవేశారు. చీటీ మిత్రవిందకుడికి వచ్చింది. నావికులు మూడుసార్లు చీటీ వేశారు. మూడు సార్లూ అది మిత్రువిందకుడికే వచ్చింది. నావికులు మిత్రవిందకుడికి, ఒక తెప్ప ఇచ్చి దాని మీద అతణ్ణి వుంచారు. మరు క్షణం పడవ శరవేగంతో ముందుకు వెళ్ళిపోయింది. కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకకు చేరుకున్నాడు. ఆ లంకలో అతని కొక స్ఫటికభవనం కనబడింది. అందులో నాలుగు ఆడపిశాచాలు కాపురం వుంటున్నాయి. ఈ పిశాచినులు వారం రోజులు సరదాగా గడుపుతాయి; మరి వారం రోజులు అవి పాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి. మిత్రవిందకుడు ఆ పిశాచినులతో ఒక వారం పాటు ఇంద్రవైభోగాలు అనుభవించాడు.

పిశాచి నులు వ్రతం ఆరంభించేసరికి అతనికి అక్కడ వుండబుద్ధి కాలేదు. అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు. అతను సముద్రం మీద వెళ్ళగా వెళ్ళగా మరొక లంక తగిలింది. దానిలో ఎనిమిదిమంది పిశాచినులున్నారు. మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి, వారు కఠోరవ్రతాలు ఆరంభించగానే మళ్ళీ తెప్పమీద బయలుదేరాడు. ఈ విధంగా అతను మరొక దీవిలో పదహారు మంది పిశాచినులతోనూ, ఇంకొక దీవిలో ముపై్ఫరెండు పిశాచినులతోనూ ఒక్కొక్క వారం గడిపి, ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు.
 
 ఈ లంకలో ఒక పెద్ద నగరం వున్నది. దాని చుట్టూ గోడా, ఆ గోడలో నాలుగు ద్వారాలూ వున్నాయి. అది ఉస్సదనరకం. అయితే, మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు. అందమైన నగరం లాగా కనబడింది. ``నేనీ నగరంలో ప్రవేశించి దీనికి రాజునవుతాను!'' అనుకున్నాడతను. నగరంలో ఒక చోట మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన నెత్తిన అసిధారాచక్రం మోస్తున్నాడు. దాని అంచు పదునుగా వుండటం వల్లనూ, అది చాలా బరువైనది గనకనూ, ఆ చక్రం అతని తలలోకి దిగబడిపోయింది. తల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది. ఆ మనిషి శరీరం అయిదు పేటల గొలుసుతో బంధించబడి వున్నది. అతను బాధతో దీనంగా మూలుగుతున్నాడు.

ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు. అసిధారాచక్రం మిత్రవిందకుడి కళ్ళకు పద్మంలాగా కనబడింది; అతని వంటి మీది గొలుసు అలంకార భూషలలాగా తోచింది; అతని మూలుగు గంధర్వ గానంలాగా వినిపించింది. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించి, ``అయ్యా, తమరు చాలాకాలంగా ఆ పద్మాన్ని శిరస్సున ధరించారు. నన్ను కూడా ధరించనివ్వండి!'' అని అడిగాడు.
 
``బాబూ, ఇది పద్మం కాదు, అసిధారా చక్రం!'' అన్నాడు నరకవాసి. ``చూశావా? నాకివ్వటం ఇష్టంలేక ఆ మాట అంటున్నావు!'' అన్నాడు మిత్రవిందకుడు. ``నేటితో నా పాపానికి పరిహారం అయి పోయినట్టుంది. వీడు కూడా నాలాగే తల్లిని కొట్టినవాడై ఉంటాడు. పాపఫలం అనుభవించటానికే వీడిక్కడికి చేరివుంటాడు!''అని అనుకుని నరకవాసి తన నెత్తి మీద వున్న అసిధారాచక్రాన్ని, మిత్రవిందకుడి నెత్తిన పెట్టి, సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. అప్పుడు స్వర్గంలో ఇంద్రుడుగా వుంటున్న బోధిసత్వుడు దేవగణాలను వెంటబెట్టుకుని నరకాలన్నిటినీ తణిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడుండే చోటికి వచ్చాడు.
 
ఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ, ``స్వామీ, కరుణించండి! ఈ చక్రం నన్నెప్పుడు వదులుతుందో చెప్పండి!'' అని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు, మిత్రవిందకుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు: ``నీకు ఎంత డబ్బున్నా ఇంకా కావాలని కోరావు. పిశాచినులతో కాలక్షేపం చేశావు. మానవుడు నడవదగిన ఉన్నత మార్గాలు నీకు నచ్చలేదు. ఇతరులు నీ మేలుకోరి చెప్పిన సలహా వినక ఈ చక్రాన్ని కోరి నెత్తికి తెచ్చుకున్నావు! నువు్వ బతికి వున్నంత కాలమూ ఆ అసిధారా చక్రం నిన్ను వదలదు.'' మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్దశ తెలుసుకుని, విచారంతో కుంగిపోయాడు. 

జ్ఞానోదయం


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తుండగా బోధిసత్వుడు కోసలరాజుగా జన్మించాడు. ఆయనకు సత్యసేనుడని ఒక కుమారుడుండేవాడు. యుక్తవయసు రాగానే రాజు సత్యసేనుణ్ణి యువరాజుగా చేశాడు. యువరాజు భార్య శంబులాదేవి అపురూప సౌందర్యవతి. మంచి గుణవంతురాలు. దురదృష్టవశాత్తూ యువరాజుకు భయంకరమైన కుష్ఠువ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి లొంగక ఆనాటికానాడు ఎక్కువ కాసాగింది.
 
అటువంటి భయంకరమైన వ్యాధి పెట్టుకుని నలుగురి మధ్యా ఉండటానికి నామోషీ వేసి, యువరాజు తండ్రి అనుమతితో, నిర్జనారణ్యంలో ఉండటానికి బయలుదేరాడు. అప్పుడు శంబులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది. యువరాజు వద్దని ఎన్ని విధాల చెప్పినా ఆమె ఏమాత్రం వినలేదు. అరణ్యంలో జలసమృద్ధీ, ఫలసమృద్ధీ ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో ఉండసాగాడు. శంబులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి, భర్తకు పలుదోము పుల్లా, నీళూ్ళ ఇచ్చి, అతను ముఖం కడుక్కున్నాక తినటానికి పళు్ళ ఇచ్చి, తట్టా గునపమూ తీసుకుని అడవిలోకి వెళ్ళేది.
 
పళూ్ళ కందమూలాలూ తెచ్చేది. కొలను నుంచి నీరు తెచ్చేది. భర్తచేత స్నానం చేయించేది. తరవాత భర్తకు భోజనం పెట్టి తాను భోజనం చేసేది. ఈ విధంగా ఆమె అహోరాత్రాలు అత్యంత శ్రద్ధగా భర్తను కనిపెట్టి ఉంటున్నది. ఒకనాడామె పళ్ళకోసమని కొత్తవైపుగా బయలుదేరింది.

కొంతదూరం వెళ్ళేసరికామె కొక కొండకోన కనిపించింది. ఆ కోనలో కోనేరు ఒకటున్నది. దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం చెయ్య బుద్ధి పుట్టింది. ఆమె అందులో స్నానం చేసి బయటికి వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారు చాయతో ప్రకాశించసాగింది. ఈ సంగతి ఆమె గమనించలేదు గాని, ఆ సమయానికి అటుగా పోతున్న కిరాతుడొకడు ఆమెను చూసి నిర్ఘాంతపోయి ఆగాడు.
 
వాడు ఆమెను తన గూడానికి రమ్మనీ, తనను పెళ్ళాడమనీ బతిమాలాడు. ఆమె దారికి అడ్డు నిలబడి కదలనివ్వలేదు. ఇది చూసి శంబులాదేవి, ``ఓరీ, పాపాత్ముడా! నాశనమై పోతావు!'' అంటూ బిందెలో నీరు వాడి మీద చల్లింది. పిడుగుదెబ్బ తిన్నవాడల్లే వాడు పడిపోయాడు. కిరాతుడి బెడద వదిలించుకుని నీరూ, పళూ్ళ తీసుకుని పర్ణశాలకు వచ్చే సరికి చాలా పొద్దుపోయింది. భర్త, ``ఇంత అలస్యమయిందేం?'' అని అడిగాడు. శంబులాదేవి జరిగినదంతా చెప్పింది.
 
కాని భర్త నమ్మక, ``ఆడవాళు్ళ ఎన్నయినా కల్పించగలరు! ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళు్ళ లేరు!'' అన్నాడు. ``స్వామీ, నేను చెప్పేది సత్యమైతే మీ వ్యాధి ఈ నీటితో నయమైపోవాలి!'' అంటూ బిందెతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది. వెంటనే, ఇంద్రజాలం లాగా, అతని వ్యాధి తుప్పురాలినట్టు రాలిపోయి, అతని శరీరం కూడా బంగారం లాగా మెరవసాగింది.

తన భార్య పాతివ్రత్యం కంటె, తనకు వ్యాధి నయమయిందన్న విషయం సత్యసేనుడికి ఎక్కువ ఆనందం కలిగించింది. అతను వెంటనే బయలుదేరి కోసల రాజధానీ నగరానికి వచ్చి ఉద్యానవనంలో విడిది చేసి తన రాకను గురించి తండ్రికి కబురు చేశాడు. రాజుగారు స్వయంగా ఛత్రచామరాలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి, తన కుమారుడికి స్వాగతం చెప్పాడు. యువరాజు వ్యాధి నయం కావటానికి గాను సహాయపడినందుకూ, అతనితో సమంగా అరణ్యవాసం చేసినందుకూ, శంబులాదేవికి పట్టపురాణి హోదా ఇస్తూ ఉత్తరువు చేశాడు.
 
తాను వానప్రస్థం స్వీకరించి సత్యసేనుడికి రాజ్యాభిషేకం చేసేశాడు. తండ్రి ఉత్తరువు ననుసరించి సత్యసేనుడు శంబులాదేవిని పట్టపురాణిగా చేసుకున్నాడే గాని, ఆమెపట్ల పూర్తిగా ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువగా కాలం గడపసాగాడు. భర్త అనాదరణవల్లా, సవతుల ఈర్ష్య వల్లా శంబులాదేవి చిక్కి శల్యమై పోయింది. ఇలా వుండగా ఒకనాడు మామగారు శంబులాదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆమె స్థితికి ఆశ్చర్యపడి, ``ఎందుకు ఇలా కృశించిపోయావు?'' అని అడిగాడు. ``భర్త ఆదరణ లేని భార్య ఇంకెలా ఉంటుంది?'' అన్నది శంబులాదేవి. వృద్ధరాజు జరిగినదంతా విని సత్యసేనుణ్ణి పిలిపించి, ``నాయనా, కృతఘ్నత కంటే మహాపాతకం ఇంకొకటి లేదు. భయంకరమైన వ్యాధితో నువు్వ మనుషుల మధ్య ఉండలేక అరణ్యానికి పారిపోయినప్పుడు నీ వెంట వుండి, రాత్రింబగళు్ళ నీకు సేవచేసి, చివరకు నీ వ్యాధి కూడా నయం చేసిన భార్యను, రాజ్యం చేతికి చిక్కగానే తృణీకరిస్తావా? ఈ రాజ్యాలూ, వైభవాలూ ఎవరికైనా లభిస్తాయి.
 
కాని పతివ్రత అయిన భార్య ఎవరో అదృష్టవంతుడికిగాని లభించదు. కనక శంబులాదేవిని అనాదరంతో చూడకు. అందువల్ల నష్టపడేది నువ్వే!'' అని బోధించాడు. సత్యసేనుడు జ్ఞానోదయం కలిగినవాడై భార్యకు క్షమాపణ చెప్పుకుని, ఆమెకు తనపైనా తన ఇతర భార్యల పైనా అంతులేని అధికారాలిచ్చి, ఆమెను ఆదరంతో చూస్తూ కాలం గడిపాడు.

దానపాత్రుడు


ఒకప్పుడు బోధిసత్వుడు కాశీ రాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దున కొందరు పితూరీ జరిపారు. పితూరీదార్లను అణచే నిమిత్తమై రాజు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుకు గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి, ఆయనతోపాటు యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతోసహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు.
 
ఆ సమయంలో అక్కడ గ్రామంలోని ముపై్ఫ గడపలవారూ చేరి గ్రామవ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తీ, డాలూ, కవచమూ ధరించి, యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి, రచ్చపట్టులో చేరినవారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక్క గ్రామస్థుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్థుడు రాజును సమీపించి, ``నువు్వ పితూరీదారువా? రాజు పక్షం వాడివా?'' అని అడిగాడు. ``అయ్యా, నేను రాజు పక్షమే!'' అని రాజు జవాబు చెప్పాడు.
 
ఈ మాట విని గ్రామస్థుడు, తృప్తి పడ్డట్టు కనబడి, ``అయితే, మా ఇంటికి పోదాం, రా!'' అని రాజును తన అతిథిగా తీసుకుపోయి, తన భార్యచేత ఆయన కాళు్ళ కడిగించి, భోజనం పెట్టించి, అతిథి మర్యాదలన్నీ చేయించాడు. తరవాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి నీరు పెట్టి, దాణా వేశాడు. రాజు ఆ గ్రామస్థుడి ఇంట నాలుగు రోజులు అతిథిగా ఉండి తన గాయాలను మాన్పుకున్నాడు. ఈ లోపలే ఆయన సైనికులు పితూరీని అణచి వేయడం జరిగింది.

రాజు తిరిగి వెళ్ళిపోతూ, గ్రామస్థుడికి కృతజ్ఞత తెలుపుకుని, ``అయ్యా, నేను కాశీనగరవాసిని, మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకొక భార్యా, ఇద్దరు కుమారులూ ఉన్నారు. మీరు కాశీ నగరానికి వచ్చి కుడిచేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గిర కాపలావాణ్ణి, `మహాశ్వారోహుడి ఇల్లెక్కడ?' అని అడిగితే, వాడు మిమ్మల్ని మా ఇంటికి తెస్తాడు.
 
మీరు మీ చిత్తం వచ్చినంతకాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు!'' అని చెప్పాడు. తరవాత రాజు తన బలాలను చేరుకుని, కాశీ నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వారపాలకుణ్ణి పిలిపించి, వాడితో రహస్యంగా, ``ఒరే, ఎవరన్నా నీ వద్దకు వచ్చి, `మహాశ్వారోహుడి ఇల్లెక్కడ?' అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గిరికి తీసుకురా!'' అని చెప్పాడు. ఆ గ్రామస్థుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురు చూశాడు. కాని అతను రానేలేదు. అతన్ని ఏవిధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు.
 
అప్పటికీ గ్రామస్థుడు రాజు వద్దకు రాలేదు. మరి కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు. ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగాక, ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళు్ళ గ్రామస్థుడి దగ్గిరికి పోయి, ``ఈ పన్నులతో చచ్చి పోతున్నాం. కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడున్నాడని చెప్పావు గదా. నువు్వ వెళ్ళి ఆయనను చూసి, పన్నులు ఇచ్చుకోలేక మనం అందరం నానా అగచాట్లూ పడిపోతున్నామని మొరపెట్టి, వీటిని తీసివేయించలేవా?'' అన్నారు.
 
``నా స్నేహితుణ్ణి చూడటం కష్టం కాదు. కాని ఆయన దగ్గిరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకొక భార్య ఉన్నదిట, ఇద్దరు కొడుకులున్నారుట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్యకు కానుకగా నగా నట్రా తీసుకుపోవద్దా? వాటన్నిటినీ త్వరలో సిద్ధం చెయ్యండి. అలాగే బయలుదేరి వెళతాను,'' అన్నాడు గ్రామస్థుడు. మిగిలినవాళు్ళ బట్టలూ, నగలూ సమకూర్చారు. అవి గ్రామస్థులకు పనికివచ్చే ముతక వస్త్రాలూ, మోటు నగలూనూ. గ్రామస్థుడు తన భార్యచేత రొట్టెలూ, పిండివంటలూ తయారు చేయించాడు.

తాను తీసుకుపోయే స్తువులన్నీ ఒక మూటకట్టి వెంటతీసుకుని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీ నగరపు కోట చేరి, కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి, అక్కడి ద్వారపాలకుణ్ణి, ``బాబూ, నేను మహాశ్వారోహుడింటికి వెళ్ళాలి. దారి ఎటు?'' అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్థుణ్ణి తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తీసుకుపోయి రాజుగారి ఎదట పెట్టాడు.
 
అతణ్ణి చూసి రాజుకు పరమానందమయింది. గ్రామస్థుడు తనకోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేతా, కుమారులచేతా, తన మంత్రి సామంతులచేతా తినిపించి, తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతకబట్టలను తన భార్యా బిడ్డలచేత కట్టించి, తాను కూడా కట్టుకున్నాడు. తరవాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి, తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు.
 
తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించటానికి అతను వచ్చాడని తెలిసి, రాజుగారు ఆ పన్నులను రద్దు చెయ్యవలసిందిగా మంత్రులకు ఉత్తరువిచ్చాడు. తరవాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన రాజు ఆ గ్రామస్థుణ్ణి తన అర్ధ రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ గ్రామస్థుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతనిపట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతడికి అర్ధ రాజ్యం పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది.

కాని రాజుగారికి ఎదురు చెప్ప టానికి వారికి సాహసం లేకపోయింది. అందుకని వారు రాజకుమారుణ్ణి చేరదీసి, ``నాయనా, మహారాజుగారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగం భాగం నిష్కారణంగా ఈ అనాగరికుడికి కట్టబెడుతున్నారు. ఇందుకు గాను మహారాజుగారి దగ్గిర ఆక్షేపణ తెలుపుకోవలసినవాడవు నువ్వే!'' అంటూ ఆ కురవ్రాడికి బాగా బోధించి పంపారు.
 
రాజకుమారుడు తండ్రి దగ్గిరికి వెళ్ళి, వాళు్ళ చెప్పినట్టే తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, ``నాయనా, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్నిప్పుడడిగిన ప్రశ్న సభలో అడుగు. అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను!'' అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ``ఈ గ్రామస్థుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణమేమిటి?'' అని అడిగాడు.
 
వెంటనే రాజు, ``కుమారా, ఈ గ్రామస్థుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు,'' అంటూ సరిహద్దున పితూరీ జరిగిన సమయంలో బాగా గాయపడిన తనను గ్రామస్థుడు కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తరవాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: ``అపాత్రుడికి దానం చెయ్యటం ఎంత తప్పో, పాత్రుడికి దానం చెయ్యకపోవటం కూడా అంత తప్పే. నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్థుడు నాపట్ల విశ్వాసం చూపాడు. సమయానికి సాయపడ్డాడు.
 
నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ, ప్రత్యుపకారం పొందే ఉద్దేశం లేని కారణంచేత, అతడు రానే లేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధ రాజ్యానికి ఇంతకంటె అర్హుడెవరు?'' ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటినుంచి రాజు తన జీవితాంతం వరకూ ఆ గ్రామస్థుణ్ణి ఎంతో ఆదరంతో చూశాడు.

కలల మర్మం


కోసలదేశానికి రాజైన బింబిసార మహా రాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కలలు వచ్చాయి. మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి, తనకు వచ్చిన కలల గురించి చెప్పి, ‘‘ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి!'' అని కోరాడు. బ్రాహ్మణులు రాజు నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశంగా భావించి, ‘‘మహారాజా, మీకు వచ్చిన కలలు చాలా ప్రమాదం కలిగించేవి.
 
వాటివల్ల మీకూ, మీ వంశానికీ, మీ రాజ్యానికీ, మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనున్నది!'' అని చెప్పారు. ఈ మాటలు వినగానే రాజుకు మతి పోయినట్టయింది. ‘‘అయితే ,ఈ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి?'' అని అడిగాడు. ‘‘దీనికల్లా ఒకటే విరుగుడు. మన రాజ్యంలో నాలుగు దారులు కలిసిన చోటనల్లా ఒక యజ్ఞం చేయించండి.
 
యజ్ఞం ముగిశాక బ్రాహ్మణులకు సంతర్పణలూ, దానాలూ ఇవ్వండి. దానితో అన్ని పీడలూ విరగడయిపోతాయి, మేలు కలుగుతుంది,'' అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. బింబిసార మహారాజు ముందూ వెనకా చూడకుండా, బ్రాహ్మణులు చెప్పినదంతా నమ్మేసి, తన కోశాధికారిని పిలిచి, ‘‘నాలుగు దారులు కలిసిన చోటనల్లో యజ్ఞం జరగాలి.
 
సంతర్పణలూ, సంభావనలూ, దానాలూ మొదలైనవి జరగాలి. అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి,'' అని చెప్పాడు. ఈ వార్త మహారాణి తెలుసుకున్నది. ఆమె తన భర్తతో, ‘‘ప్రభూ, తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి.

అన్నీ తెలిసిన మహాజ్ఞాని, బుద్ధభగవానుడు జేతవనంలో ఉంటున్నాడు. మీరు అక్కడికి వెళ్ళి, ఆయనకు మీ కలల వైనం చెప్పి, వాటి ఫలితం ఏమిటో అడగండి. ఆయన చెయ్యమంటే యజ్ఞాలు అలాగే చేద్దురుగాని!'' అన్నది. దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు. ఆయన స్వయంగా జేతవనానికి వెళ్ళి బుద్ధభగవానుణ్ణి తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు. బుద్ధుడు భిక్షకోసం రాజసౌధానికి వచ్చాడు.
 
అప్పుడు మహారాజు బుద్ధభగవానుడితో, ‘‘స్వామీ, తమకు తెలియని రహస్యాలుండవు. నాకు కొన్ని పీడకలలు వచ్చాయి. వాటివల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియజేయూలని నా ప్రార్థన!'' అన్నాడు. ‘‘ఆ కలలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను,'' అన్నాడు బుద్ధుడు, రాజు అమాయకత్వానికి నవ్వుతూ. ‘‘మొట్టమొదటగా నేను కలలో నాలుగు ఆబోతులను చూశాను. అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి.
 
అవి పోట్లాడుకుంటే చూసి ఆనందించుదామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు. కాని ఆ ఆబోతులు పోట్లాడుకోక, వేటి దారిన అవి వెళ్ళిపోయూయి. దీని అర్థమేమిటి?'' అని మహారాజు అడిగాడు. ‘‘రాజా, ఈ కల నీకుగాని, నీ తరానికిగాని సంబంధించినది కాదు. ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు. అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి. వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు, '' అన్నాడు బుద్ధుడు. ‘‘తరవాత ఇంకొక వింత చూశాను.
 
భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి, కాయలు కాయటం చూశాను. దీని రహస్యమేమిటి?'' అని మహారాజు అడిగాడు. ‘‘నే నింతకు మునుపు చెప్పిన పాపిష్ఠి కాలంలో స్ర్తీలకు బాల్యవివాహాలు జరుగు తాయి. వారు పెరిగి పెద్దవారు కాక పూర్వమే బిడ్డల తల్లులవుతారు! అంతకంటె ఇంకేమీలేదు!'' అన్నాడు బుద్ధుడు. ‘‘ఆవులు దూడలవద్ద పాలు తాగేట్టు మరొక కల వచ్చింది,'' అన్నాడు రాజు. ‘‘ముసలివాళ్ళు తమ తిండికోసం చిన్నవాళ్ళపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం,'' అన్నాడు బుద్ధుడు.

‘‘తరవాత కలలో కొందరు రైతులను చూశాను. వారు కాడి నుంచి బలిష్ఠమైన ఎద్దులను తొలగించి, ఆ కాడికి లేగదూడలను కట్టటం కనిపించింది,'' అన్నాడు మహారాజు. ‘‘నే నింతకు పూర్వం చెప్పిన అవినీతిగల రాజులు రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి, ప్రపంచజ్ఞానం లేని యువకులను ఆ పదవులలో నియోగించబోతారు. అదే ఆ కలకు అర్థం!'' అన్నాడు బుద్ధుడు. ‘‘తరవాత ఒక వింత గుర్రాన్ని చూశాను.
 
దానికి రెండు వైపులా తలలున్నాయి. ఆ రెండు తలలతోటీ అది దాణా తింటున్నది. ఈ ఘోరం ఏమిటి, స్వామీ?'' అని మహారాజు అడిగాడు. ‘‘రాబోయే పాపిష్ఠికాలంలో న్యాయూధికారులు తగాదాలు పరిష్కరించటంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు, రెండు పక్షాలవారి నుంచీ లంచాలు మేస్తారు.అదే దాని అర్థం,'' అన్నాడు బుద్ధుడు. ‘‘తరవాత ఇంకొక చిత్రం చూశాను.
 
రాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరున్నది, దాని చుట్టూ ఇంకా చిన్న కడవలెన్నో ఖాళీగా ఉన్నాయి. అక్కడికి అన్ని కులాలవారూ నీరు పట్టుకు వచ్చి, అదివరకే నిండివున్న కడవలోనే నీరు పోసి, అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళి పోతున్నారు. ఖాళీ కడవల్లో ఎవరూ నీరు పొయ్యరు. ఏమిటి దీని అర్థం?'' అని మహారాజు అడిగాడు. ‘‘ముందు, ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది.
 
ప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు. ఒక వంక ఖజానాలో ధనం మూలుగుతూ వుంటే, ఇంకో వంక శ్రమించే ప్రజల ఇళ్ళు ఆ ఖాళీ కుండల్లాగా ఉంటాయి,'' అన్నాడు బుద్ధుడు. ‘‘మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండటం చూశాను. ఆ అన్నమంతా ఒక రకంగా ఉడకడం లేదు.
 
ఒక భాగంలో ఉడుకు జాస్తి అయి మెతుకు చిమిడిపోయింది. ఒక భాగంలో అన్నం సరిగా ఉడికింది. వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది,'' అన్నాడు మహారాజు. ‘‘రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని, ఈ కల చెబుతున్నది.

పాలకులు వరదలను గురించీ, అనావృష్టి గురించీ తగు శ్రద్ధ తీసుకోరు. అందుచేత కొన్నిచోట్ల వర్షం హెచ్చుగా కురిసి, వరదలవల్ల పంటలు పాడవుతాయి. సరిగా వాన కురవని చోట అసలు పంటలే పండవు,'' అన్నాడు బుద్ధుడు. ‘‘స్వామీ, ఇంకొక కలలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుం టూండటం చూశాను,'' అన్నాడు మహారాజు.
 
‘‘భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధలు ప్రజల కిచ్చి, అతితుచ్ఛమైన ఐహికసుఖాలను దానికి ప్రతిఫలంగా పుచ్చుకుంటారు,'' అన్నాడు బుద్ధుడు. ‘‘ఇంకా, నా కలలలో నీళ్ళ మీద బరువైన రాళ్ళు తేలికొట్టుకుపోతూండటం చూశాను. ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను. మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే, తోడేళ్ళు సయితం భయంతో కంపించటం చూశాను.
 
ఇవన్నీ అరిష్ట దాయకాలు కావా, స్వామీ?'' అని మహారాజు అడిగాడు. ‘‘ఈ కలలు నీకుగాని, నీ కాలానికి గాని సంబంధించినవి కానేకావు. వాటిని గురించి నీకు ఎలాటి విచారమూ వద్దు. భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంత మహిమ గలవాళ్ళు సయితం నీచులైన రాజుల అనాదరానికి గురి అయి కాలప్రవాహంలో నువ్వు చూసిన రాళ్ళలాగా కొట్టుకుపోతారు.
 
పరమ నీచులు పదవులకు రావటంవల్ల రాజహంసల వంటి యోగ్యులు సయితం వారి అడుగుజాడలలోనే నడవవలసిన వారవు తారు. అధములకు అధికారబలం లభించేసరికి సత్వసంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది. అంతే కాదు, ఏమాత్రం సంకోచం అన్నది లేకుండా అధములు వారిని నిర్మూలించటం కూడా జరుగుతుంది,'' అన్నాడు బుద్ధుడు. బింబిసార మహారాజుకు సందేహం తీరిపోయింది. ఆయన భయూలు తొలగి పోయూయి. ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి, బుద్ధభగవానుడికి భిక్ష పెట్టి పంపేశాడు.

అరాజకం


బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఉత్తర పాంచాల దేశపు రాజధాని అయిన కాంపిల్య నగరానికి పాంచాలుడు రాజుగా ఉండేవాడు. ఆయన భోగలాలసుడూ, అవినీతిపరుడూ అయి, రాజ్యపరిపాలన విషయంలో కొంచెం కూడా శ్రద్ధ వహించ లేదు. యథా రాజా, తథా ప్రజా అన్నట్టు, రాజునుబట్టి మంత్రులు కూడా అవినీతిగా ప్రవర్తించ సాగారు. ప్రజలపై పన్నుల భారం హెచ్చసాగింది.
 
అరాజకం తల ఎత్తింది. ఈ అరాజక స్థితిలో ప్రజల జీవితం తారుమారయింది. పగలు రాజభటుల పీడా, రాత్రి దొంగల పీడా హెచ్చిపోయింది. అందు చేత నగరవాసులు తమ ఇళ్ళకు తాళాలు పెట్టి, వాకిళ్ళకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి, తమ భార్యాబిడ్డలతో అరణ్యానికి వెళ్ళి అక్కడ తల దాచుకోసాగారు. వాళ్ళు పగలల్లా అడవిలో గడిపి, అర్ధరాత్రివేళ తమ ఇళ్ళకు వస్తూండేవారు.
 
ఈ సమయంలో బోధిసత్వుడు నగరం వెలుపల వుండే ఒక తిందుకవృక్షానికి అధి ష్ఠాన దేవతగా జన్మించాడు. రాజు ఆ వృక్షానికి ఏటా పూజలు జరిపి, దాని కింద వెయ్యి మాడలు ఖర్చు చేసేవాడు. ‘‘అయ్యో, నన్ను ఇంత శ్రద్ధాభక్తులతో ఆరాధించే ఈ రాజు అవివేకంవల్ల తన దేశానికి అరాజకం తెచ్చి పెట్టుకుంటున్నాడు.
 
ఇతనికి సరి అయిన ఉపదేశం చెయ్యటానికి నేను తప్ప ఇంకెవరూ లేరు!'' అనుకున్నాడు తిందుకదేవుడు. ఆయన ఒక రాత్రి నిద్రిస్తున్న రాజుకు ప్రత్యక్షమై, ‘‘రాజా, నేను తిందుక దేవుణ్ణి. నీకు సరి అయిన బోధ చెయ్య వచ్చాను!'' అన్నాడు. ‘‘ఏమిటా బోధ?'' అని రాజు భక్తి పూర్వ కంగా అడిగాడు. ‘‘రాజా, నీ రాజ్యం నాశనమయి పోతున్నది.

అశ్రద్ధగా పరిపాలించే రాజు ఈ లోకంలో తన రాజ్యాన్ని పోగొట్టుకుని కడగండ్లపాలై, పర లోకంలో నరకం అనుభవిస్తాడు,'' అన్నాడు తిందుకదేవుడు. ‘‘దేవా, నే నిప్పుడేం చెయ్యూలి?''అని అడిగాడు రాజు. ‘‘ఇప్పటికైనా నీ రాజ్య పరిపాలన విషయూ లను నీవే స్వయంగా చూసుకుని అరాజ కాన్ని తొలగించి, రాజ్యాన్ని కాపాడుకో!'' అని తిందుకదేవుడు అదృశ్యుడయ్యూడు.
 
రాజుకు జ్ఞానోదయమయింది. ఆయన తన రాజ్యం ఎలా ఉన్నదీ స్వయంగా చూడ టానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయమే ఆయన తన మంత్రులను పిలిచి రాచకార్యాలు చూస్తూ ఉండమని నియో గించి, తన పురోహితుణ్ణి వెంటబెట్టుకుని, తూర్పుద్వారం కుండా నగరం దాటి మారు వేషంతో బయలుదేరాడు. నగరం వెలుపల ఒక ఇంటి ముందు వృద్ధు డొకడు కనిపించాడు. ఆయన ఇల్లు తాళం పెట్టి, ఇంటి చుట్టూ ముళ్ళకంప పెట్టి భార్యా బిడ్డలతో అడవికి పారిపోయూడు.
 
చీకటి పడగానే ఆయన తన ఇంటికి తిరిగివచ్చి, వాకిలి తీయబోతూండగా కాలిలో ఒక ముల్లు గుచ్చుకున్నది. వెంటనే ఆయన నేలపై చతికిలబడి, కాలిలో గుచ్చుకున్న ముల్లును తీస్తూ, ‘‘నా అరికాలిలో ఈ ముల్లు గుచ్చు కున్నట్టే పాంచాల రాజుకు యుద్ధంలో బాణం గుచ్చుకొనుగాక!'' అని తిట్టుకున్నాడు. ఈ తిట్టు విని రాజపురోహితుడు ఆ వృద్ధుణ్ణి సమీపించి, ‘‘అయ్యూ, తమరు వృద్ధులు. కన్ను సరిగా కనిపించక మీరు ముల్లు తొక్కితే అది రాజుగారి దోషం ఎలా అయింది?'' అని అడిగాడు.

‘‘రాజు అవినీతిపరుడైనందుచేతనే అధి కారులు దుష్టులైనారు. పగలు రాజభటుల బాధా, రాత్రి దొంగల బాధా భరించలేక ప్రజలు ఇళ్ళకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి, భార్యా బిడ్డలతో అడవికి పారిపోతున్నారు. లేకపోతే నా కాలిలో ఈ ముల్లు విరగవలసిన పనేమిటి?'' అన్నాడు వృద్ధుడు. రాజూ, పురోహితుడూ ఇంకొక గ్రామానికి వెళ్ళారు. అక్కడ వారికొక స్ర్తీ కనిపించింది. ఆమెకు యుక్తవయసు వచ్చి ఇంకా పెళ్ళి గాని కుమార్తెలు ఇద్దరున్నారు.
 
వారిని అడవికి తీసుకుపోవటం ఇష్టంలేక ఆమె తన ఇంటనే దాచివుంచి, ఇంటికి కావలసిన కట్టెలూ, ఆకులూ తానే తెస్తూవుండేది. ఇప్పుడామె ఏవో ఆకులు కొయ్యటానికి ఒక చెట్టెక్కి దానిపై నుంచి కిందపడి, ‘‘ఈ రాజు చచ్చి పోను! వీడు బతికుండగా కన్యలకు పెళ్ళిగీత కూడా లేదు!'' అన్నది. ఈ మాటలు విని పురోహితుడు ఆమెను సమీపించి, ‘‘బుద్ధిహీనురాలా, రాజ్యంలో ఉండే ప్రతి కన్యకూ భర్తను వెతకటమే రాజు గారి పనా?'' అన్నాడు.
 
‘‘పగలు రాజభటుల భయం, రాత్రి దొంగల భయం. కన్యలకు భర్తలెలా దొరుకు తారు?'' అన్నదా స్ర్తీ. రాజూ, పురోహితుడూ అక్కడి నుండి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్ళారు. ఒక పొలాన్ని దున్నుతూ ఒక రైతు వారి కంటపడ్డాడు. అతను దున్నుతూ వుండగానే నాగలికర్రు గుచ్చుకుని ఒక ఎద్దు పడి పోయింది.

వెంటనే ఆ రైతు పట్టలేని కోపంతో, ‘‘ఈ పాంచాల రాజు గుండెలో బల్లెం గుచ్చు కుని ఇలాగే పడిపోరాదా? మా కష్టాలు తీరు తాయి!'' అన్నాడు. పురోహితుడు రైతుతో, ‘‘ఏమోయ్‌! నీ అశ్రద్ధవల్ల ఎద్దుకు దెబ్బ తగిలి పడిపోతే అందులో రాజుగారి తప్పేమిటి?'' అన్నాడు. ‘‘రాజుగారి తప్పు కాకపోతే ఎవరి తప్పు? పాలకులు దుర్మార్గులయితే బక్కవాళ్ళేం బతుకుతారు? పగలు రాజభటుల భయం, రాత్రి దొంగల భయం.
 
నా భార్య, నా కోసం వండి తెచ్చిన కూడు బలవంతంగా లాక్కుని దుర్మార్గులు మెక్కేశారు. మళ్ళీ వండి ఎప్పుడు తెస్తుందా అని నేను నోరు తెరుచుకు చూస్తుండటం మూలాన బంగారమంటి ఎద్దు కాస్తా దెబ్బ తిని పడిపోయింది!'' అన్నాడు రైతు. అక్కడి నుండి బయలుదేరి రాజూ, పురోహితుడూ తమ రాజధానికి పోసాగారు. దారిలో వారికొక దృశ్యం కనిపించింది. ఒక మడుగులో వున్న కప్పలను, బతికి వుండగానే కాకులు పొడుచుకు తింటున్నాయి.
 
ఆ కప్పలలో ఒకటి క్రోధావేశంతో, ‘‘ఈ కాకులు మమ్మల్ని ఎలా బతికి వుండగానే పీక్కు తింటున్నాయో అలాగే పాంచాల రాజునూ, అతని సంతానాన్నీ శత్రువులు పీక్కు తిందురుగాక!'' అన్నది. ‘‘ఓసి మతిమాలిన కప్పా! మిమ్మల్ని పీక్కుతినే కాకుల్ని ఏమీ అనలేక రాజుగారికి శాపనార్థాలు పెడుతున్నావా?'' అన్నాడు పురోహితుడు కప్పతో. దానికి కప్ప, ‘‘రాజుగారిని తృప్తి చెయ్యటా నికి పురోహితుడు అలాగే అడుగుతాడు, అందులో ఆశ్చర్యంలేదు.
 
కాని దేశంలో కాకబలులు కూడా కరువై పోబట్టేగదా కాకు లకు బతికున్న కప్పల్ని పీక్కుతినే దుస్థితి పట్టింది. అటువంటి రాజు ఛస్తే ఎంత మేలు!'' అన్నది. అది విని రాజు, ‘‘నన్ను కప్పలు కూడా శపిస్తున్నాయి. ఇక లాభం లేదు. మనం నగరానికి తిరిగివెళ్ళి, ఈ అరాజకాన్ని తుద ముట్టించుదాం!'' అన్నాడు. ఆ ప్రకారమే ఆయన రాజ్యపాలనలో శ్రద్ధ చూపి, లోపాలను సవరణ చేసి, ప్రజలకు శాంతిసౌఖ్యాలు కలిగేలాగు చాలాకాలం పరి పాలన సాగించాడు.