బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తుండగా బోధిసత్వుడు
కోసలరాజుగా జన్మించాడు. ఆయనకు సత్యసేనుడని ఒక కుమారుడుండేవాడు. యుక్తవయసు
రాగానే రాజు సత్యసేనుణ్ణి యువరాజుగా చేశాడు. యువరాజు భార్య శంబులాదేవి
అపురూప సౌందర్యవతి. మంచి గుణవంతురాలు. దురదృష్టవశాత్తూ యువరాజుకు భయంకరమైన
కుష్ఠువ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి
లొంగక ఆనాటికానాడు ఎక్కువ కాసాగింది.
అటువంటి భయంకరమైన వ్యాధి పెట్టుకుని నలుగురి మధ్యా ఉండటానికి నామోషీ
వేసి, యువరాజు తండ్రి అనుమతితో, నిర్జనారణ్యంలో ఉండటానికి బయలుదేరాడు.
అప్పుడు శంబులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది. యువరాజు
వద్దని ఎన్ని విధాల చెప్పినా ఆమె ఏమాత్రం వినలేదు. అరణ్యంలో జలసమృద్ధీ,
ఫలసమృద్ధీ ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో ఉండసాగాడు.
శంబులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి, భర్తకు పలుదోము పుల్లా, నీళూ్ళ
ఇచ్చి, అతను ముఖం కడుక్కున్నాక తినటానికి పళు్ళ ఇచ్చి, తట్టా గునపమూ
తీసుకుని అడవిలోకి వెళ్ళేది.
పళూ్ళ కందమూలాలూ తెచ్చేది. కొలను నుంచి నీరు తెచ్చేది. భర్తచేత స్నానం
చేయించేది. తరవాత భర్తకు భోజనం పెట్టి తాను భోజనం చేసేది. ఈ విధంగా ఆమె
అహోరాత్రాలు అత్యంత శ్రద్ధగా భర్తను కనిపెట్టి ఉంటున్నది. ఒకనాడామె
పళ్ళకోసమని కొత్తవైపుగా బయలుదేరింది.
కొంతదూరం వెళ్ళేసరికామె కొక కొండకోన కనిపించింది. ఆ కోనలో కోనేరు
ఒకటున్నది. దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం చెయ్య బుద్ధి పుట్టింది.
ఆమె అందులో స్నానం చేసి బయటికి వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారు చాయతో
ప్రకాశించసాగింది. ఈ సంగతి ఆమె గమనించలేదు గాని, ఆ సమయానికి అటుగా పోతున్న
కిరాతుడొకడు ఆమెను చూసి నిర్ఘాంతపోయి ఆగాడు.
వాడు ఆమెను తన గూడానికి రమ్మనీ, తనను పెళ్ళాడమనీ బతిమాలాడు. ఆమె
దారికి అడ్డు నిలబడి కదలనివ్వలేదు. ఇది చూసి శంబులాదేవి, ``ఓరీ,
పాపాత్ముడా! నాశనమై పోతావు!'' అంటూ బిందెలో నీరు వాడి మీద చల్లింది.
పిడుగుదెబ్బ తిన్నవాడల్లే వాడు పడిపోయాడు. కిరాతుడి బెడద వదిలించుకుని
నీరూ, పళూ్ళ తీసుకుని పర్ణశాలకు వచ్చే సరికి చాలా పొద్దుపోయింది. భర్త,
``ఇంత అలస్యమయిందేం?'' అని అడిగాడు. శంబులాదేవి జరిగినదంతా చెప్పింది.
కాని
భర్త నమ్మక, ``ఆడవాళు్ళ ఎన్నయినా కల్పించగలరు! ఎక్కడ తిరిగినా నిన్ను
అడిగేవాళు్ళ లేరు!'' అన్నాడు. ``స్వామీ, నేను చెప్పేది సత్యమైతే మీ వ్యాధి ఈ
నీటితో నయమైపోవాలి!'' అంటూ బిందెతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది.
వెంటనే, ఇంద్రజాలం లాగా, అతని వ్యాధి తుప్పురాలినట్టు రాలిపోయి, అతని శరీరం
కూడా బంగారం లాగా మెరవసాగింది.
తన భార్య పాతివ్రత్యం కంటె, తనకు వ్యాధి నయమయిందన్న విషయం
సత్యసేనుడికి ఎక్కువ ఆనందం కలిగించింది. అతను వెంటనే బయలుదేరి కోసల రాజధానీ
నగరానికి వచ్చి ఉద్యానవనంలో విడిది చేసి తన రాకను గురించి తండ్రికి కబురు
చేశాడు. రాజుగారు స్వయంగా ఛత్రచామరాలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి, తన
కుమారుడికి స్వాగతం చెప్పాడు. యువరాజు వ్యాధి నయం కావటానికి గాను
సహాయపడినందుకూ, అతనితో సమంగా అరణ్యవాసం చేసినందుకూ, శంబులాదేవికి
పట్టపురాణి హోదా ఇస్తూ ఉత్తరువు చేశాడు.
తాను వానప్రస్థం స్వీకరించి సత్యసేనుడికి రాజ్యాభిషేకం చేసేశాడు.
తండ్రి ఉత్తరువు ననుసరించి సత్యసేనుడు శంబులాదేవిని పట్టపురాణిగా
చేసుకున్నాడే గాని, ఆమెపట్ల పూర్తిగా ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువగా
కాలం గడపసాగాడు. భర్త అనాదరణవల్లా, సవతుల ఈర్ష్య వల్లా శంబులాదేవి చిక్కి
శల్యమై పోయింది. ఇలా వుండగా ఒకనాడు మామగారు శంబులాదేవి ఇంటికి భోజనానికి
వచ్చాడు. ఆమె స్థితికి ఆశ్చర్యపడి, ``ఎందుకు ఇలా కృశించిపోయావు?'' అని
అడిగాడు. ``భర్త ఆదరణ లేని భార్య ఇంకెలా ఉంటుంది?'' అన్నది శంబులాదేవి.
వృద్ధరాజు జరిగినదంతా విని సత్యసేనుణ్ణి పిలిపించి, ``నాయనా, కృతఘ్నత కంటే
మహాపాతకం ఇంకొకటి లేదు. భయంకరమైన వ్యాధితో నువు్వ మనుషుల మధ్య ఉండలేక
అరణ్యానికి పారిపోయినప్పుడు నీ వెంట వుండి, రాత్రింబగళు్ళ నీకు సేవచేసి,
చివరకు నీ వ్యాధి కూడా నయం చేసిన భార్యను, రాజ్యం చేతికి చిక్కగానే
తృణీకరిస్తావా? ఈ రాజ్యాలూ, వైభవాలూ ఎవరికైనా లభిస్తాయి.
కాని పతివ్రత అయిన భార్య ఎవరో అదృష్టవంతుడికిగాని లభించదు. కనక
శంబులాదేవిని అనాదరంతో చూడకు. అందువల్ల నష్టపడేది నువ్వే!'' అని బోధించాడు.
సత్యసేనుడు జ్ఞానోదయం కలిగినవాడై భార్యకు క్షమాపణ చెప్పుకుని, ఆమెకు
తనపైనా తన ఇతర భార్యల పైనా అంతులేని అధికారాలిచ్చి, ఆమెను ఆదరంతో చూస్తూ
కాలం గడిపాడు.
No comments:
Post a Comment