Pages

Tuesday, October 2, 2012

రాజభక్తి


పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ పట్టుదల, పరాక్రమాలు మరెవరికీ సాధ్యంకానివి. ఇందుకు నిన్ను అభినందించకుండా వుండలేకపోతున్నాను. కానీ, వీటితోపాటు నీలాంటి మహావీరుడికి కొంత తర్కసహిత వివేచన లేకపో వడం విచారం కలిగిస్తున్నది. వీరదత్తుడి లాగా సూక్ష్మపరిశీలనాజ్ఞనం లేక ఇంత, అర్ధరాత్రివేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో అవస్ధలపాలవుతున్నావేమో అన్న శంక కలుగుతున్నది. నీలో వున్న లోపాలను సరిదిద్దుకునేందుకు గాను, ఆ వీర దత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పాసాగాడు:

పూర్వం కేయూరదేశంలో మహాయోధుడైన వీరదత్తుడనే యువకుడుండే వాడు. అతడు మల్లయుద్దం, సాముగరిడీల వంటి దేశవాళీ యుద్ధ విద్యలలోనే కాకుండా, విలువిద్య, గదాయుద్దం, కత్తిసాము వంటి క్షాత్రవిద్యలలో కూడా అపారమైన నైపుణ్యం కనబరిచేవాడు. వీటికి తోడుగా అనేక శాస్త్రవిషయాలలో కూడా అతడికి చెప్పుకోతగ్గ పాండిత్యముండేది.


ఇలా వుండగా- కేయూర రాజ్యపు సైన్యాధక్షుడు అకస్మాత్తుగా మరణించడంతో, ఆ పదవిని చేపట్టగల వీరుడికోసం , రాజధానీ నగరంలో ప్రతిష్ఠాత్మకమైన పోటీ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ సంగతి తెలుసుకున్న వీరదత్తుడు, ఆ పోటీలో పాల్గొని రాజ్యంలో అత్యుత్తమ పదవులలో ఒకటైన సైన్యాధక్ష పదవిని పొందాలని నిర్ణయించుకున్నాడు. వీరదత్తుడి కొరిక తెలుసుకున్న అతడి తండ్రి, "నాయనా! రాజుల కొలువు అపాయాలకు నెలవు. ఏ మాత్రం పొరబాటు జరిగినా ప్రాణానికే ముప్పు వస్తుంది. పాము పడగ నీడలాంటి జీవితం నీకెందుకు? హాయిగా మనకున్న వ్యవసాయం చూసుకుంటూ సుఖంగా కాలం గడుపు," అని హిత బోధ చేశాడు.

అందుకు అంగీకరించని వీరదత్తుడు, "ఎంతో శ్రమించి నేను గడించిన విద్యలకు రాచకొలువులోనే సార్ధకత లభిస్తుంది, నాన్నా!" అంటూ తండ్రిమాట కాదని, పోటీలో పాల్గొనేందుకు బయలుదేరి రాజధానీ నగరం చేరాడు. అక్కడ అసం ఖ్యాకంగా వచ్చిన వీరులతో పాటు పోటీలో పాల్గన్న వీర దత్తుడు, పోటీలోని ప్రధమచరణాలైన శారీరక దారుఢ్యం, వ్యాయామ యోగవిద్యాపరిచయం, దేశీ యక్షాత్రవిద్యానైపుణ్యం వంటి అంశాలలో అవలీలగా విజయం సాధించాడు. అలా అనేక అంచె లుగా జరిగిన పోటీలలో తన ప్రతిద్వందులైన అనేకమంది వీరులను గెలిచి ప్రధముడుగా నిలిచాడు.

ఆ తర్వత జరిగిన ముఖ్యమైన పరీక్షలలో-కేయూరదేశ బౌగోళిక పరిస్థితులు, చుట్టుపక్కల వున్న మిత్ర శత్రు రాజ్యల బలాబలాలు, యుద్ద తంత్రాలలో పట్టు విడుపులు; ఇలా అనేక రకాల ప్రశ్నలకు, వీరదత్తుడు తెలివిగా తేలికగా సమాధానాలు చెప్పాడు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక వీరదత్తుడికి, తను ఈ పోటిలో గెలుపొందగలనన్న నమ్మకం బలంగా ఏర్పడింది. అందుకు తగిన ట్టుగానే, ఆ సాయంత్రం అతడి వసతి మామూలు పోటీ దారుల సామాన్య వసతి నుంచి అత్యంత భద్రతతో వైభవంగా వున్న పెద్ద భవనానికి మారింది.


ఆ మరుసటిరోజే కేయూరదేశపు మహామంత్రి త్రినాధుడు స్వయంగా వచ్చి వీరదత్తుణ్ణి కలిశాడు. ఆయన ముందుగా అన్ని విద్యల లోనూ వీరదత్తుడి నైపుణ్యాన్ని ప్రశంసించి, "సైన్యాధ్యక్షపదవికి కావలసిన అన్ని అర్హతలూ నీకున్నాయని భావిస్తున్నాము. అయితే, దేశరక్షణలో అతి కీలకమైన ఈ పదవి నిర్వ హించే వ్యక్తికి కేవలం పరాక్రమం, యుద్దతంత్ర నైపుణ్యం మాత్రం వుంటే చాలదు. అంతకు మించి రాజభక్తి, దేశభక్తి కూడా వుండాలి. దేహదారుఢ్యం, నేర్చిన విద్యలలో ప్రావీణ్యం లాంటి పరీక్షలలో అవినిరూపితం కావు. కనుక, కాలానుగుణమైన సహజపరీక్ష కోసం నువ్వు కొంతకాలం పాటు వేచివుండక తప్పదు. ఒక ఆరునెలల పాటు రాచకొలువులో ఏ హొదాలేని ఉన్నతోద్యోగిగా, నీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించు. త్వరితంగానే నువ్వు సైన్యాధ్యక్ష పదవిని స్యీకరించగలవని ఆశిస్తాను," అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత రండు నెలలపాటు వీరదత్తుడుకి ఎలాంటి పనీ అప్పగించబడలేదు. ఒకనాడు అకస్మాత్తుగా త్రినాధుడి నుంచి పిలుపు రావడంతో, వీరదత్తుడు ఆయనను చూడబోయాడు.

త్రినాధుడు, వీరదత్తుణ్ణి సాదరంగా ఆహ్వానించి, వీరదత్తా, మన గూఢచారుల నాయకుడి నుంచి అతి ముఖ్యమైన సమాచారం ఒకటి అందింది. మన మహారాజు కేయూరసింహులకు క్రమం తప్పని అలవాటు ఒకటి వుంది.

ఆయన ప్రతిరోజూ సాయంత్రం మహారాణితో కలిసి ఉద్యానవనానికి వెళతారు. ఆ సమయం రాజదంపతులకు ఏకాంతం అన్నమాట! వ్యక్తిగత భద్రతా సిభ్భందిని కూడా ఉద్యానంలోకి అనుమతించరు. ఈ సంగతి తెలుసుకున్న శత్రువులు, ఆ సమయంలో మహారాజును హత్య చేయడానికి పధకం వేశారు. ఈరోజు నుంచి సాయంత్రపువేళ నువ్వు, రాజదంపతులకు రక్షణగా ఉద్యానంలో వుండాలి. అయితే, ఆ సంగతి ఎవరికీ తెలియకూడదు. నీ కదలికలు రాజదంపతుల  ఏకాంతానికి ఏవిధంగానూ భంగం కలిగించ కూడదు. అందుకు శిక్ష చాలా తీవ్రంగా వుంటుంది, జాగ్రత్త!" అని చెప్పాడు.


ఇందుకు అంగీకరించిన వీరదత్తుడు, ఆ రోజు సాయంత్రం నుంచీ ఉద్యానంలో రాజదంపతులకు రక్షణగా, వారికి తెలియకుండా జాగ్రత్తగా, వారిని అను సరిస్తూ వచ్చాడు. ఇలా నాలుగు రోజులు గడిచాక, ఐదవ రోజు సాయంత్రం హఠాత్తుగా నలుగురు దుండగులు, రాజదంపతులపై దాడి చేయబోయారు. కేయూరసింహుడు, వారిని ప్రతిఘటించే లోపలే, వీరదత్తుడు కత్తి దూసి పెద్దగా హుంకరిస్తూ, వారిమీదికి ఉరికాడు. దుండగులు భయకంపితులై, తలా ఒక దిక్కుగా పరిపోయారు. వీరదత్తుడు, రాజు కేయూరసింహుడికి నమస్కరించి, రాజదంపతుల రక్షణకై నాలుగు రోజులుగా తాను, వారిని అతి రహస్యంగా అనుసరిస్తున్న సంగతి చెప్పడు. ఇది వింటూనే రాజు, వీరదత్తుడికేసి తీవ్రంగా ఒకసారి చూసి, చప్పట్లు చరిచి ఉద్యాన ద్వారరక్షకులను పిలిచి, వీరదత్తుణ్ణి బంధింపజేసి, మర్నాటి ఉదయం అతణ్ణి తన వద్దకు విచారణకై తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.

ఆ రాత్రి వీరదత్తుణ్ణి కారాగారంలో కలిసిన మహామంత్రి జరిగిన దానికి బాధ పడి, "వీరదత్తా! రేపు నీకు మహారాజు విచారణలో కఠినశిక్ష తప్పదు. రాజ కొలువు ఈ విధంగానే ప్రమాద భూయిష్టంగా వుంటుంది. ఏమైనా నీకు కలిగిన ఈ ఆపదకు ఒక విధంగా కారణం నేను. అందువల్ల, నువ్వు తక్షణం కారాగారం నుంచి పారిపోయే అవకాశం కలిగిస్తున్నాను, పారిపో! నేను మహారాజుకు ఏదో విధంగా నచ్చచెప్పుకుంటాను," అన్నాడు.


వీరదత్తుడు ఒక్కక్షణం ఆలోచించి, "మహామంత్రివర్యులు, నాకు అప్పగించన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగాను. రేపు మహారాజు వేయబోయే శిక్ష గురించి నాకేచింతా లేదు, నేనెక్కడికీ పారిపోను. నాపట్ల మీకున్న ఆదరాభి మానాలకు కృతజ్ఞతలు," అన్నడు. ఆ మాటలు విన్న మంత్రి త్రినాధుడు తనలో తానే నవ్వుకుని, వీరదత్తుడి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళి పోయాడు.

బేతాళుడు ఈ కధ చెప్పి, "రాజా, వీరదత్తుడు మహావీరుడు కావచ్చునేమో కానీ, దానితో పాటు మహామూర్ఖుడన్న అనుమానం కలుగుతున్నది. తండ్రి మాటలు పెడచెవిన పెట్టి, రాజుకొలువులో చేరప్రయత్నిచడం ఏ మూర్ఖత్వమైతే, మంత్రి త్రినాధుడి సలహాలనుకూడా పాటించకుండా, కారాగారంలో వుండి పోవాలనుకోవడం మహామూర్ఖత్వం కాదా? తన ప్రాణాలను కాపాడినవాడినే కారాగారంలో బంధించిన మహారాజు చిత్తప్రవృత్తిపై ఏ నమ్మకంతో వీరదత్తుడు రాజు విచారణకు సిద్దపడుతున్నట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమా ర్కుడు, "వీరదత్తుడు మహావీరుడనే దాంట్లో సందేహానికి తావులేదు. అతడు మూర్ఖుడనుకోవడం పొరబాటవుతుంది. అటువంటివాడు రాచకోలువులోనే రాణిస్తాడు. అందుకే వీరదత్తుడు సైన్యాధ్యక్షుడి పదవికి పోటీపడ్డాడు. అయితే, మంత్రి త్రినాధుడు చెప్పినట్టు కేవలం పరాక్రమం, యుద్దతంత్రంలో నేర్పరితనం మాత్రమే, రాజ్య సైన్యాధక్షపదవికి అంతిమ అర్హత్లు కాభోవు . రాజదంపతుల రక్షణకుగాను అతడు ఒంటరిగా నలుగురు దుండగులపై కత్తి దూశాడు. రాజదంపతుల ఏకాంతానికి భంగం కలిగించాడనేది కేవలం నెపం మాత్రమే. ఆ దుండగులూ, వీరదత్తుణ్ణి కారాగారంలో బంధించడం, మర్నాడు విచారణా-ఇదంతా రాజూ, మంత్రీ అతడి రాజభక్తిణి, దేశభక్తినీ పరీక్షించేందుకు కల్పిం చినవి. మంత్రి, అతడికి కారాగారం నుంచి పారిపోయోందుకు అవకాశం కల్పిస్తానన్న, వీరదత్తుడు తిరస్కరించడంతో, అతడి రాజభక్తి పూర్తిగా రుజువైంది. అందువల్లనే, మంత్రి నవ్వుకుని, అతడి భుజం తట్టడు. అంటే-సైన్యాధ్యక్ష పదవికి నెగ్గడం జరిగిందన్న మాట!" అన్నాడు.

రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.  




No comments:

Post a Comment