అనగా అనగా
ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ
మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా
రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత
ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను
నిర్ణయించారు: "రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక
పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!"ఇక ప్రజలు
ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా
అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు.
ఒకరోజున తన
శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు.
మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ
మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు
బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో
పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా
ఆశ్చర్యం వేసింది.
అయితే
సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరిపనులు
వాళ్ళు చకచకా చేసుకోవటం మొదలుపెట్టారు! గురుశిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే
ముచ్చట వేసింది.చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది. దుకాణాలు
తెరిచారు గనక, వెళ్ళి ఏమైనా భోజన సామగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు
వెళ్ళారిద్దరూ. చూస్తే ఆశ్చర్యం- అన్ని సామాన్లదీ ఒకే రేటు! ఒక్కోటీ ఒక్కో
'దుడ్డు'- అంతే. సోలెడు బియ్యమూ అంతే, డజను అరటి పళ్లూ అంతే. శిష్యుడు భోజన
ప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు
కొనుక్కున్నా నిండా పది దుడ్లు కూడా ఖర్చవ్వలేదు మరి!
"ఇది
పిచ్చివాళ్ల రాజ్యం నాయనా. ఇలాంటి చోట ఉండటం ప్రమాదం. వేరే ఎక్కడికైనా
పోదాం, త్వరగా. పోదాం పద, ఇక్కడ ఉండకూడదు" అన్నారు గురువుగారు శిష్యుడితో,
మెల్లగా. శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది.
పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు. "ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు
మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం,ఇది! ఇక్కడే
ఉండిపోదాం మనం" అన్నాడు వాడు. "ఇది ఎక్కువకాలం నడవదు నాయనా. అదీగాక వీళ్ళు
నిన్ను -ఎప్పుడు- ఏం-చేస్తారో ఎవ్వరికీ-తెలీదు- నా మాట విని, నాతో
వచ్చేయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం" అని నచ్చ చెప్ప చూశారు గురువుగారు.
కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచిమాటలు
తెలవెలబోయాయి. "ఏమైనా సరే! తను ఈ స్వర్గాన్ని వదిలి రాను" అన్నాడు
శిష్యుడు. చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, "నీకు అవసరమైనప్పుడు
పిలువు, వస్తాను" అని చెప్పి వెళ్ళారు.
శిష్యుడు
మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజూ అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం,
గోధుమరొట్టెలు- ఇట్లా ఏవిపడితే అవి మెక్కి, అచ్చోసిన ఆంబోతు మాదిరి-
గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు.
ఆ నగరంలో
ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జొరబడ్డాడు. మామూలుగా కాదు;
వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి, ఆ కన్నంలోంచి లోనికి దూరాడు. లోపల ఉన్న
విలువైన వస్తువుల్ని మూటగట్టుకొని, ఇక బయటపడదామనుకునేలోపల, వాడు కన్నం
వేసిన గోడ నిలువునా కూలింది! వాడు తను త్రవ్విన గోడ క్రింద తానే పడి
చచ్చిపోయాడు.
అయితే ఆ
దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు-"ప్రభూ!
మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతనిమీద కూలి
అతని ప్రాణాల్ని నిలువునా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారే. అతను గోడను
బలంగా, దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు. తమరు
ధర్మమూర్తులు- దోషిని కఠినంగా శిక్షించి, మా అన్న కుటుంబానికి న్యాయం
చెయ్యాలి" అని.రాజుగారు వాడికి "న్యాయమే గెలుస్తుంది" అని భరోసా ఇచ్చి,
వ్యాపారిని పిలువనంపాడు.
వ్యాపారి
రాగానే ప్రశ్నల వాన మొదలైంది: "నీ పేరు?" "వరహాల శెట్టి, ప్రభూ!"
"చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే
ఉన్నావా?" "మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా! వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి
దూరాడు. గోడ బలహీనంగా ఉంది. అది వాడి మీదనే కూలింది." "దోషి తన నేరాన్ని
ఒప్పుకున్నాడు. దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది. దీనికి
పూర్తి బాధ్యత దోషిదే. మేం నీకు తగిన దండన విధిస్తాం, వరహాల శెట్టీ!" "కానీ
మహారాజా.." అన్నాడు వరహాల శెట్టి, "కథ ఇలా అడ్డం తిరిగిందేమి?" అని
ఆశ్చర్యపోతూ. "కానీ-గీనీ ఏమీ లేదు. నేరం చేసినవాడికి శిక్ష పడవలసిందే"
అన్నాడు రాజు, గంభీరంగా.
తన
ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తర్వాత వరహాల శెట్టి మెదడు చురుకుగా పని
చేసింది. "ఒక్క క్షణం ఆగండి మహారాజా! నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు.
గోడను కట్టిన మేస్త్రీదే అసలు తప్పు. అతను దానిని గట్టిగా కట్టి
ఉండాల్సింది; అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు
అతన్ని శిక్షించాలి, మహా ప్రభూ!" అన్నాడు శెట్టి."గోడను కట్టిన మేస్త్రీ
ఎవరు?" అడిగారు రాజుగారు. "ప్రభూ! ఆ యింటిని మా నాన్నగారి హయాములో
కట్టారు. అప్పుడు మా యింటి గోడ కట్టిన మేస్త్రీ ఇప్పుడు ముసలివాడయ్యాడు.
నాకు బాగా తెలుసు అతను. ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు" అన్నాడు వరహాల శెట్టి,
ఊపిరి పీల్చుకుంటూ.
మేస్త్రీని
పిలుచుకురమ్మని సేవకులను పంపారు రాజుగారు, వరహాల శెట్టిని క్షమించి
వదిలేస్తూ. కొద్ది సేపటికి మేస్త్రీ వచ్చి నిలబడ్డాడు."ఏమయ్యా, వరహాల
శెట్టి తండ్రి బ్రతికున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు-
నిజమేనా?" "అవును ప్రభూ!""ఇట్లాంటి గోడనా, కట్టేది? అది ఒక పేద దొంగ మీద
కూలి, వాడి ప్రాణాలనే హరించింది. నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువైంది గనక,
మేం నీకు మరణ దండన విధించాలి ఇప్పుడు!"రాజుగారు తొందరపడి తనకు మరణదండన
విధించేలోగా మేస్త్రీ తెలివి మేల్కొన్నది. అతను గట్టిగా వాదించాడు-"ప్రభూ!
నన్ను శిక్షించేముందు నా మొరను ఒకసారి ఆలకించండి. నేను ఈ గోడను కట్టిన మాట
వాస్తవం. అది బాగా కట్టలేదన్నదీ వాస్తవమే. అయితే అది అలా ఎందుకు తయారైందో
కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసు మనసులోలేదు. నాకు ఇంకా గుర్తున్నది-
నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి, తన కాలి అందెల్ని, చేతి గాజుల్నీ
గలగలలాడించుకుంటూ అటూ-ఇటూ తిరుగుతూనే ఉన్నది, రోజంతా. దాంతోనా మనసు వశం
తప్పింది. నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. మీరు ఆ నర్తకిని
కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు తెలుసు, నాకు" అన్నాడు మేస్త్రీ.
"ఊఁ, నాకు
తెలుసు.. కథ లోతు పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా
వదిలేందుకు వీలు లేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకు రండి- ఆమె ఎక్కడున్నా సరే"
అన్నారు రాజుగారు.ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది- ఆమె వణుక్కుంటూ వచ్చి
నిలబడ్డది. "పాపం, ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు, నువ్వు
గాజులు, అందెలు గలగలలాడించుకుంటూ వీధిలో అటూ-ఇటూ తిరిగావా- నువ్వు వయసులో
ఉన్నప్పుడు ఒకరోజున?" అడిగారు రాజుగారు."నిజమే మహారాజా, తిరిగాను"
ఒప్పుకున్నదామె."అయితే నువ్వే దోషివన్నమాట. గాజులు, అందెలు గలగలలాడిం,
నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బ తీసావు. దాంతో వాడు కట్టే గోడ పాడైంది. అది ఒక
పేదవాడి మీద కూలి, వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణి
బలైంది- నీకు శిక్ష తప్పదు."
ఆమె ఒక్క
క్షణం ఆలోచించి అన్నది- "మహారాజా! ఆగండి. నేను ఆరోజున అట్లా రోడ్డు మీద అటూ
ఇటూ ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆ కంసాలి చేసిన పని! నేనూ
అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులిచ్చాను. అతను వాటిని
'ఇప్పుడిస్తాను-ఇప్పుడిస్తాను' అంటూ ఆ రోజంతా త్రిప్పుతూనే ఉన్నాడు. అతని
వల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజనుసార్లు అటూ ఇటూ తిరిగి ఉంటాను. అది నా తప్పు
కాదు ప్రభూ! అదంతా ఆ నీచుడు, కంసాలి చేసిన తప్పు!" అని. "పాపం, నిజంగానే
ఈమెది ఏ తప్పూలేదు" అనుకున్నాడు రాజుగారు, అందిన సాక్ష్యాధారాలను
పరిశీలిస్తూ. "అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు- పోండి! పోయి ఆ కంసాలిని
ఇటు ఈడ్చుకొని రండి!" అని సైనికులను ఆజ్ఞాపించాడు.సైనికులు పరుగున
వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు. తన మీద
వచ్చిన ఆరోపణలు వినగానే,అతను కూడా తన కథ వినిపించాడు.
"ప్రభూ!
నేనొక పేద కంసాలిని. ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు
తిప్పించుకున్న మాట నిజమే. అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పటానికి ఒక
కారణం ఉంది- నామీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ ధనిక
వర్తకుడి ఇంట్లో పెండ్లి ఉండింది, ఆ సమయంలో. ఆయన తన నగల్నే ముందుగా చేసి
ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు. ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు
తెలియని సంగతి కాదు గదా! ఆయన వల్లనే, నేను ఈమెకు నగల్ని అందివ్వటంలో జాప్యం
అయ్యింది.
""ఎవడా ధనిక
వర్తకుడు?! ధనబలంతో, తన నగల్ని ముందు చేయించుకొని, ఈ పేద నర్తకిని
అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరకు వాడెవ్వడు? వాడి
మూలంగానే మేస్త్రీ మనసు వశం తప్పింది. అతని వల్లనే గోడ సరిగ్గా కట్టబడలేదు.
అతని వల్లనే ఆ గోడ విరిగి, ఒక మామూలు దొంగమీదికి విరిగి పడి, వాడి ప్రాణం
తీసింది. దీనికంతకూ కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవ్వడు?" అని అడిగాడు
రాజుగారు, ఆవేశంగా.
"ఆ పని
చేసింది ఈ వరహాల శెట్టిగారి తండ్రే ప్రభూ!" అన్నాడు కంసాలి చల్లగా. "ఓహో!
న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట! పిలిపించండి,
వాడిని!" ఆజ్ఞాపించారు రాజుగారు. "మానాన్నగారిని ఇప్పుడు పిలిపించలేము
ప్రభూ! అయన చనిపోయి చాలా కాలమే అయ్యింది" అన్నాడు వరహాల శెట్టి. "అయితే
ఆ శిక్షను నువ్వు అనుభవించు" అన్నారు రాజుగారు, మంత్రిని సంప్రతించి."నీ
తండ్రి హంతకుడు అని రుజువైంది. అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన
బాధ్యత నీదే. అతను చనిపోయాడంటున్నావు. నిజమే కావచ్చు. అయినా, అతని బదులు
వేరే ఎవరో ఒకరు శిక్షను అనుభవించకపోతే ఎలాగ?హంతకుడైన నీ తండ్రినుండి నీకు
ఆస్తిపాస్తులన్నీ సంక్రమించాయి- వాటితోబాటు అతని నేరాలు కూడానూ! నువ్వు ఆ
నేరాలనుండి ఊరికే తప్పించుకొని పోలేవు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే
అనుకున్నాను- ఈ ఘోరనేరం వెనక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయిఉంటావని. నా ఊహ
నిజమైంది- నీకిక జీవించే అర్హత లేదు. మేం నీకు మరణ దండన విధిస్తున్నాం!!"
వర్తకుడిని
వధించటం కోసం కొత్త వధ్యశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు
రాజుగారు. ఒకవైపున కటికవాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధంచేసి, శిక్షను
అమలు చేసేందుకు కత్తులు నూరుకుంటుండగా, మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది-
"ఈ శిల పెద్దది. దీని నిడివి ఎక్కువ. చూడగా వ్యాపారి మెడ సన్నం! ఇంత సన్నగా
ఉండే మెడ, వధ్యశిలలో సరిగ్గా ఇమడదు గదా, మరెట్లా?" అని. మంత్రి తన
అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు.
"తను ఈ
సంగతిని ముందే ఎందుకు గమనించలేదు?" అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది.
"మరేం చేద్దాం?" అని అయన మంత్రినే అడిగారు, మంత్రిగారి ముందుచూపును
ప్రశంసిస్తూ. అయితే అదే సమయంలోఆయనకు ఒక ఉపాయం తోచింది- "ఇతని తల శిలలో
పట్టకపోతే మాత్రం నష్టం ఏముంది? శిక్షను ఎలాగైనా అమలు చేయవలసిందే. వీడి
బదులు, లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే
సరిపోతుంది!"అని.
మంత్రిగారికి
ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే సైనికులు ఊరంతా వెతకటం మొదలుపెట్టారు-
వధ్యశిలలో పట్టేంత పెద్ద మెడ ఉన్న, లావుపాటి మనుషులకోసం. అలా వెతుకుతున్న
సైనికుల చూపు సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యుడిమీద పడింది- అతను నెలల
తరబడి అరటిపళ్లు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు తినీ తినీ బాగా
క్రొవ్వు పట్టి ఉన్నాడు మరి! సైనికులు తన మీదికి దూకి పెడరెక్కలు విరిచి
పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు.
నేనేం తప్పు
చేశాను? నేను నిరపరాధిని. సన్యాసిని!" అని మొత్తుకున్నాడతను."కావచ్చు-
కానీ, వధ్య శిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకు రమ్మని రాజాజ్ఞ" అని,
సైనికులు శిష్యుడిని శిరచ్ఛేదం కోసం తీసుకుపోయారు! అప్పటికి గానీ తన
గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి. " 'ఇది పిచ్చోళ్ళ
రాజ్యం. ఇలాంటి చోట ఉండటం ప్రమాదం' అని తనకి చిలక్కి చెప్పినట్లు చెప్పారే,
అయినా తను వినలేదు. దీన్నే స్వర్గం అనుకున్నాడు. ఇప్పుడు ఏం
జరుగుతున్నదోచూడు!" అని అతనికి ఏడుపు వచ్చింది."ఇక వేరే దారేదీ లేదు,
దేవుడా! ఈ ఒక్కసారీ అవకాశం ఇవ్వు. మరెప్పుడూ గురువుగారి మాటను జవదాటను"
అని అతను మౌనంగా ప్రార్థన మొదలుపెట్టుకున్నాడు.
దేవుడు ఆ
ప్రార్థనను నేరుగా గురువుగారికే చేర్చాడు- అద్భుత శక్తులున్న ఆయన, తక్షణం
శిష్యుడిముందు ప్రత్యక్షమయ్యాడు. శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా
చీవాట్లు పెట్టి, ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు. ఆ పైన రాజుగారి దగ్గరికి
వెళ్ళి, ధైర్యంగా అడిగాడు- " రాజా! గురువు ఎక్కువా? శిష్యుడు ఎక్కువా?"
అని.
"గురువే
ఎక్కువ. సందేహం లేదు. అయినా నన్నెందుకు అడుగుతున్నారు?" అన్నారు
రాజుగారు."అయితే నా శిష్యుడికంటే ముందు నాకు శిరచ్ఛేదం చెయ్యండి. నా
తర్వాతగానీ వాడి తల తీసేందుకు వీలు లేదు" అన్నాడు గురువు.సంగతి అర్థమై
శిష్యుడు అక్కడినుండే అరవటం మొదలుపెట్టాడు- "నేను ముందు! మీరు ముందు నన్ను
కదా, ఇక్కడికి తెచ్చింది? నా మెడే కదా, వధ్యశిలలో పట్టేది? అందుకని ముందు
నన్నే వధించాలి. ఆయన్ని కాదు. ఆయనకు చెప్పండి, ఇక్కడినుండి వెళ్ళిపొమ్మనండి
ముందు!" అని. రాజుగారు, మంత్రిగారు నోళ్లప్పగించి చూస్తుండగానే
గురు-శిష్యులమధ్య పోట్లాట మొదలైంది. "నేను ముందు! నేను ముందు!" అని.
రాజుగారికి, మంత్రిగారికీ వాళ్ల ఈ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.
రాజుగారు
గురువుని అడిగారు- "మీరెందుకు, చనిపోవాలని తొందరపడుతున్నారు? వధ్యశిలకు
సరిపోయేంత మెడ ఉన్నది గనక మేం అతనిని ఎంపిక చేసుకున్నాం" అని. "మీరు నన్ను
ఎలాంటి ప్రశ్నలూ అడక్కండి. ముందుగా నన్ను వధించాలి- అంతే" అన్నాడు గురువు,
మొండిగా. "ఎందుకు? ఇందులో ఏదో రహస్యం ఉంది. మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా
మీకు తెలిసినదానిని మాబోటి వాళ్ళకు వివరించటం మీ బాధ్యత. చెప్పండి" అన్నారు
రాజుగారు. "నేను చెబితే మీరు నన్నే వధించాలి ముందు- మాట ఇస్తారా?" అడిగాడు
గురువు.రాజుగారు సరేనన్న మీదట, ఆయన రాజును దూరంగా తీసుకెళ్లి,
సేవకులెవ్వరికీ వినబడకుండా, గుసగుసగా చెప్పాడు.
"మేమిద్దరమూ
ఇప్పుడే, ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం
కాలేదా, మీకు? మేమిద్దరమూ అనేక దేశాలు తిరిగాం. ఈ భూమిమీద నిజానికి మేం
చూడని ప్రదేశమే లేదు- కానీ ఇంతవరకూ మాకు మీ రాజ్యంలాంటి రాజ్యంగాని,
మీలాంటి రాజుగారు గానీ ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు మీ ముందున్న వధ్యశిల
మామూలుది కాదు- సాక్షాత్తూ ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది. పైగా కొత్తది!
దానిమీద ఇంతవరకూఎలాంటి నేరమూ మోపబడి లేదు! అలాంటి ఈ శిల మీద మొదట మరణించే
వాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈరాజ్యానికి రాజుగా పునర్జన్మనొందుతాడు.
దీనిమీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి
జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది. కొంతకాలంపాటు
రాజుగాను, మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ
మాటను నిలబెట్టుకోండి మహారాజా! మమ్మల్ని వధించండి! నేనుముందు!
గుర్తుంచుకోండి!"
రాజుగారు
తీవ్రంగా ఆలోచించసాగారు. 'నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా?' అని ఆయనకు
చింత పట్టుకున్నది. "ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు. కొంచెం జాగ్రత్తగా
ఆలోచించిగానీ నిర్ణయం తీసుకునేందుకు లేదు" అని, ఆయన వెంటనే శిష్యుడి
శిక్షను వాయిదా వేసేశాడు. ఆపైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు-"వచ్చే
జన్మలోకూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. వీళ్ల బదులు
మనమే వధ్యశిలనెక్కితే ఎలా ఉంటుందంటావు, -వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే
అవుతుంది?" అని. మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది. "శిక్షను అమలు
చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది. మనల్ని వధించేందుకు
వాళ్ళకు చేతులు రావు. అందుకని, మనం ఈ గురుశిష్యుల్నిద్దరినీ వదిలేసి,
వాళ్ల మాదిరే బట్టలు వేసుకొని పోయి కూర్చుందాం. ఏమంటారు, ప్రభువులు?"
అన్నాడు మంత్రి.
ఇద్దరూ కూడ
బలుక్కొని, తలారులను పిలిచి, "రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి. ముందుగా
వచ్చిన వాడిని ముందు, తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి- తప్పు చేస్తే,
జాగ్రత్త. మాకోసం ఎదురు చూడకండి" అని చెప్పేశారు. ఆపైన
గురుశిష్యులిద్దర్నీ వదిలేసి, వాళ్ల స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి
తెలీని తలార్లు పాపం, వాళ్ల పని వాళ్ళు కానిచ్చేసారు. తర్వాత చూస్తే
ఏముంది? నేరస్తుల శరీరాలకు బదులు, తమ రాజు, మంత్రుల శరీరాలు కనబడ్డాయి!
ఇక రాజ్యం
అంతా అల్లకల్లోలమైంది. పెద్దలంతా కూర్చొని "రాజ్యం నడిచేదెలాగ? కొత్తరాజు
ఎవ్వరు? కొత్తమంత్రి ఎవ్వరు?" అని చర్చలు జరిపారు. చివరికి, ఎవ్వరికీ
తెలీకుండా రాజ్యం దాటి పోతున్న గురుశిష్యులిద్దర్నీ పట్టుకొని, "మీరే మా
రాజు, మంత్రీ" అన్నారు వాళ్లంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు గానీ,
గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి, "పాత చట్టాలన్నిటినీ
తొలగించచ్చు. పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయచ్చు" అని హామీ ఇచ్చాక, ఆయన
తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆపైన రాజ్యంలో పగలు పగలూ,
రాత్రి రాత్రీ అయిపోయాయి. కొంత కాలానికి ఆ రాజ్యానికీ, ఇతర రాజ్యాలకూ తేడా
లేకుండా అయ్యింది!
No comments:
Post a Comment