ఒకసారి
చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి
ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని
తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.
పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని
వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును
వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ
ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని
కోపమొచ్చింది.
అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా
తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి
రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు
నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే
మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన
విధించారు.
మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో
రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు.
మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన
తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు.
No comments:
Post a Comment