అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉండేది. ఆ ఈగ ఇల్లు అలుక్కుంటూ తన
పేరు మర్చిపోయిందట. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి "పెద్దమ్మా పెద్దమ్మా నా
పేరేమిటి?మర్చిపోయాను" అని అడిగిండట. అప్పుడు పెద్దమ్మ "నీ పేరు నాకేం
తెలుసు. నా కొడుకు నడుగు " అందట. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, "పేదరాసి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసా? అన్నదట. అప్పుడతను "నీ పేరు నాకేం తెలుసు? నా చేతిలోని గొడ్డలిని అడుగు
అన్నాడట.
అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి?"అనడిగిండట. అప్పుడు గొడ్డలి, "నీ పేరు నాకేం తెలుసు? నేను నరికే ఈ చెట్టునడుగు" అందట. ఈగ చెటు దగ్గరకు వెళ్ళి
"పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్దలి నరికే చెట్టా, నా పేరేమిటి?" అనడిగిండట.
అప్పుడా చెట్టు "నీ పేరు నాకేం తెలుసు? చెట్టుకట్టేసిన
గుర్రాన్నడుగు" అందట. అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా?" అనడిగిందట. అప్పుడా గుర్రం " నీ పేరు నాకేం తెలుసు? నా పొట్టలో ఉన్న
పిల్లనడుగు" అందట. అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా, గుర్రం పొట్తలోని పిల్లా నా పేరేమిటో తెలుసా?" అనిఅడిగిండట. అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల "ఇహిహి , నీ పేరు ఈగ కాదా అని నవ్వింది" . అప్పుడు పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.
No comments:
Post a Comment