హిమాలయాలలో నిధి నిక్షేపాలుంటాయని ఎందరో చెబితే, వాటిని సాధించి
తెచ్చుకుందామని నలుగురు మిత్రులు బయలుదేరారు. అక్కడ వాళ్లకు ఒక సిద్ధుడు
కనిపించాడు. అతడు వాళ్ల ప్రార్థన ఆలకించి, తలా ఓ ఉంగరం వేలికి తొడిగి,
'కొండల్లో, అడవుల్లో తిన్నగా వెళ్లండి. మీ వేలికున్న ఉంగరం ఎక్కడ
జారిపడుతుందో, అక్కడ తవ్వండి. ఎవరి ప్రాప్తం ఎలా ఉందో మరి!' అన్నాడు.
గునపాలు, గోనె సంచులు పట్టుకుని వాళ్లు కనుమ దారి పట్టారు. అలా రెండు
రోజులు నడిచేసరికి ఒకడి ఉంగరం జారి కింద పడింది. వాడు అక్కడ తవ్వాడు.
బండెడు రాగి ఇటుకలు కనిపించాయి. 'వీటిని తీసుకెళ్లి అమ్ముకుందాం. చాలా
డబ్బొస్తుంది' అన్నాడు. 'మేం ఇంకా ముందుకెళ్తాం' అన్నారు మిగతా వాళ్లు.
మొదటివాడు రాగి ముద్దలు తీసుకుని వెళ్లిపోయాడు. ముగ్గురు మిత్రులూ మరో
రెండు రోజులు నడవగానే రెండోవాడి ఉంగరం జారిపడింది. అక్కడ తవ్వితే, వెండి
దిమ్మెలు బయట పడ్డాయి. వాడు వాటిని తీసుకోగా మిగిలిన ఇద్దరూ ముందుకు
సాగారు. తర్వాత మూడోవాడి ఉంగరం జారి పడింది. అక్కడ తవ్వితే బంగారం
బయటపడింది. వాడు సంబరపడి, 'ఇద్దరం పంచుకుని వెళ్లిపోదాం!' అన్నాడు.
'నువ్వెళ్లు. నేనురాను! నాకు వెలకట్టలేని మణిమాణిక్యాలు దొరకవచ్చుకదా!'
అంటూ నాలుగోవాడు ముందుకు సాగిపోయాడు. వాడు చాలా దూరం నడిచి, ఓ పెద్దలోయ
అంచున ఆగాడు. అక్కడ వాడి ఉంగరం జారి ఆ లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది.
లోయ చుట్టూ రాతిగోడల్లా నిటారుగా కొండలు! వాడు అతి కష్టం మీద లోయలోకి
దిగాడు. ఎంత వెతికినా ఉంగరం కనిపించలేదు. దుబ్బులా పెరిగిన గడ్డమూ మీసాలతో ఓ
పిచ్చివాడు కనిపించాడు. మణులూ మాణిక్యాలూ పొదిగిన ఓ పెద్దచక్రం కళ్లు
మిరుమిట్లు గొలుపుతూ, వాడి తల మీద గిరగిరా తిరగుతోంది. ఎటు వెళితే అటు
వాడితో బాటే వస్తోంది. 'భయపడకు!' అంటూ దగ్గరికి వచ్చాడు వాడు. 'నేనూ
నీలాగా వచ్చిన వాణ్నే! ఇప్పుడు నేను నీకు కనిపించినట్లే, అప్పుడు ఈ
చక్రాన్ని నెత్తిన మోస్తూ ఒకడు నాకు కనిపించాడు. వాణ్ని వదిలేసి ఇది నన్ను
పట్టుకుంది. మణి మాణిక్యాలు లభించాయన్న సంతోషం క్షణమైనా లేకపోయింది. ఈ
చక్రం నెత్తి మీది నుంచి దిగదు. ఇంటికి పోదామంటే చక్రాన్ని మోసుకుంటూ
కొండలు ఎక్కలేను. ఎవరొస్తారా అని ఎదురుచూస్తూ, ఆకులలములతో ప్రాణం
నిలుపుకుంటున్నాను. నా పాలిట దేవుడిలా ఇన్నాళ్లకు నువ్వొచ్చావు' అంటూ
చేతులు మోడ్చాడు. వెంటనే ఆ చక్రం గిర్రున తిరుగుతూ, నాలుగో మిత్రుడి
తలమీదికెక్కింది. వాడు ఆర్తనాదాలు చెయ్యసాగాడు. 'మరేం దిగులు పడకు! మన
లాంటి వాడు మరొకడెవడైనా వచ్చి నిన్ను రక్షించేదాకా వేచి చూస్తూ ఉండు!' అని
ధైర్యం చెప్పి, ఆ పిచ్చివాడు లోయలోంచి బయటపడ్డాడు.
కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
No comments:
Post a Comment