విశాలనగర రాజు రాజీవుడికి తిండి ధ్యాస ఎక్కువ. అందుకే వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకనందుడిని వంటవాడిగా నియమించాడు. ఎన్నో రకాల కొత్త కొత్త వంటలు చేస్తూ అలకనందుడు రాజీవుడికి వండి వడ్డిస్తున్నాడు. రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచిల్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడప్పుడు అలకనందుడు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంటకాలను నేర్చుకుని వచ్చి, రాజుగారికి కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకు నాలుగు రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తున్నాడు. ఈ మధ్య అలకనందుడి వంటల్లో పస తగ్గినట్టు రాజుకు సందేహం వచ్చింది. వెంటనే వంటవాణ్ని పిలిపించాడు. 'ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు. కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది. ఏవీ రుచిగా ఉండట్లేదు. నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి. లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది' అని హెచ్చరించాడు రాజు.ఆ మాటలకి ముందుగా అలకనందుడు బయపడిపోయాడు. తర్వాత తేరుకుని 'మహారాజా! మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం వండిపెడతాను. దానికి మీరు ఒక నియమం పాటించాలి. ఆ వంటకం రుచి చూడ్డానికి రెండ్రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. లేకపోతే ఈ వంటకం రుచి మీ మీద పని చేయదు' అన్నాడు అలకనందుడు.
ఆ షరతుకు ఒప్పుకున్నాడు రాజు. చెప్పినట్లుగానే రెండో రోజు అలకనందుడు ఘుమఘుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. రెండ్రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి, ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురంటూ తినేశాడు. 'అబ్బో! అద్భుతం! అమోఘం! చాలా రుచిగా ఉంది అలకనందా! నేనింత వరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు' అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు. 'కృతజ్ఞతలు మహారాజా!' అని వంగి వంగి దణ్నాలు పెట్టాడు అలకనందుడు. ఇదంతా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ని పక్కకి తీసుకెళ్లి అడిగాడు. 'అలకనందా! ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది!' అని అడిగాడు. 'మహామంత్రీ! నన్ను మన్నించండి. ఏ వంటకం రుచి అయినా దాన్ని తినే వారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువసార్లు భోంచేస్తున్నారు. ఒకటి అరగక ముందే మరోటి తినేసరికి ఆయనకు ఏదీ రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎప్పడూ చేసిన వంటనే అమృతంలా ఉందనుకుంటున్నారు' అని అన్నాడు. అలకనందుడి తెలివికి ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి.
- చొక్కాపు వెంకటరమణ@ఈనాడు న్యూస్ పేపర్

No comments:
Post a Comment