Pages

Wednesday, September 19, 2012

రాజైన మావటివాడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు వారణాసినగర సమీపంలో సాధువుగా జీవిస్తూండేవాడు. ఆయన ఒకనాడు భిక్షకోసం నగరానికి వచ్చి, ఒక మావటివాడి ఇంటికి వెళ్ళాడు. వాడు ఏనుగులకు శిక్షణ ఇవ్వడంలో చాలా సమర్థుడు, రాజు కొలువులో వుండేవాడు. మావటివాడు బోధిసత్వుణ్ణి భక్తిపూర్వకంగా ఇంట్లోకి తీసుకుపోయి, భోజనం పెట్టాడు. తరవాత ఆయనతో వినయంగా, ``తమరు కొద్ది రోజుల పాటైనా, నా ఇంట వుండవలసిందిగా ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు.
బోధిసత్వుడు, మావటివాడి ఇంట వారం రోజులపాటు అతిథిగా వుండి, వెళ్ళిపోయేటప్పుడు, అతడి మేలు కోరుతూ దీవించాడు. ఒకనాటి రాత్రి నగరంలోని ఒక దేవాలయ మండపం మీద, కట్టెలు కొట్టి జీవించేవాడొకడు పడుకున్నాడు. దాపుల నున్న ఒక చెట్టుకొమ్మల్లో కొన్ని కోళు్ళ నిద్రపోతున్నవి. చెట్టు కింద ఏదో శబ్దం కాగా, కోడిపుంజొకటి మేల్కొని గట్టిగా రెక్కలాడించింది. అప్పుడొక ఎండు పుల్ల విరిగి, కింద కొమ్మపై నిద్రపోతున్న మరొక కోడిపుంజు మీద పడడంతో, దానికి నిద్రాభంగమయింది.
కోడిపుంజు కోపంగా తల ఎత్తి పైకి చూస్తూ, ``అంత పొగరుబోతుతనం మంచిదికాదు! నేనెవరనుకుంటున్నావు? నేను మామూలు కోడినికాదు. నా మాంసం తిన్నవాడికెవడికైనా గొప్ప నిధి దొరికి తీరుతుంది,'' అన్నది. ఆ మాటకుపైకొమ్మ మీద వున్న కోడిపుంజు కెకకెకమంటూ నవ్వి, ``నా గొప్పతనం నీకేం తెలుసు! నా మాంసం తిన్నవాడు తప్పక రాజవుతాడు,'' అంటూ రహస్యం బయటపెట్టింది. ఈ సంభాషణ విన్న కట్టెలు కొట్టేవాడు పరమానందం చెందాడు.

వాడు కొంతసేపు వేచివుండి, కోళు్ళ తిరిగి నిద్రపోతున్నవని తెలుసుకుని, నిశ్శబ్దంగా చెట్టు మీదికి పాకిపోయాడు. తాను రాజే కాగలిగినప్పుడు, నిధులతో పనేమనిపించింది వాడికి. ఆ కారణం వల్ల వాడు కింద కొమ్మ మీద వున్న కోడిపుంజును వదిలి, పైకొమ్మ మీద వున్న కోడిపుంజును పట్టుకుని చెట్టు దిగి, ఇంటికి బయలుదేరాడు. వాడు ఇల్లు చేరుతూనే భార్యను పిలిచి, ``ఈ సంగతి తెలుసా? నువు్వ రాణివి కాబోతున్నావు!'' అన్నాడు.
వాడి భార్య కోపంగా, ``మతిలేని కబుర్లు చెప్పకు. నేను కట్టెలు కొట్టుకుబతికేవాడి పెళ్ళాన్ని,'' అన్నది. కట్టెలు కొట్టేవాడు పెద్దగా నవ్వి, ``కట్టెలు కొట్టుకు జీవించే నీ భర్త, సింహాసనం ఎక్కబోతున్నాడు! ఇదుగో, ముందు ఈ కోడిని కోసి వండు,'' అని భార్యకు, తాను తెచ్చిన కోడి మాంసానికున్న మహత్తును గురించి చెప్పాడు. వాడి భార్యకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆవిడ అప్పటికప్పుడే కోడిని కోసి వండింది. ``మనం ముందు నదిలో స్నానం చేసి, తరవాత భోజనం చేద్దాం,'' అన్నాడు కట్టెలు కొట్టేవాడు.
ఇద్దరూ కొంత అన్నంతోపాటు, కోడి మాంసాన్ని ఒక చిన్న కుండలో పెట్టి, దానికి మూత బిగించి తీసుకుని, నది దగ్గిరకు వెళ్ళారు. కుండను నది గట్టుమీద పెట్టి, స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. చూస్తూండగానే నది పొంగింది, ఆ ప్రవాహ వేగంలో గట్టుమీద పెట్టిన కుండ కొట్టుకుపోయింది. కట్టెలు కొట్టేవాడు తల బాదుకుంటూ, ``నేను రాజూ, నువు్వ రాణీ అయ్యే అదృష్టం లేదు; ఏం చేస్తాం!'' అన్నాడు.
ఇద్దరూ దుఃఖిస్తూ ఇంటిదారి పట్టారు. ఆ సమయంలో నదికి చాలా దిగువున, బోధిసత్వుడికి ఆతిథ్యం ఇచ్చిన మావటివాడు, ఒక ఏనుగును నదిలో కడుగుతున్నాడు. వాడికి నీటివాలునపడి కొట్టుకువస్తున్న కుండ కంటబడింది. వాడు దాన్ని పట్టుకుని, మూత విప్పిచూడగా, అప్పుడే వండిన మాంసం, అన్నం కనిపించినై. వాడు ఆశ్చర్యపోయాడు. బాగా ఆకలి గొనివుండడంతో మావటివాడు అప్పటికప్పుడే దొరికిన ఆహారాన్ని తిన్నాడు. ఇది జరిగిన మూడవ రోజున వారణాసి పైకి శత్రుసైన్యం దండెత్తి వచ్చింది.

రాజు, తాను మావటివాడుగా వేషం వేసుకుని, మావటి వాడికి రాజోచితమైన దుస్తులూ, ఇతర అలంకరణలూ చేశాడు. మావటివాడి వేషంలో తనకు శత్రువుల నుంచి ప్రమాదం జరగదని ఆయన భావించాడు. దండెత్తి వచ్చిన శత్రువులు రాజును ప్రాణాలతో పట్టుకోవాలని పథకం వేశారు. వాళు్ళ మావటివాణ్ణి చంపి, అంబారీలో వున్న రాజును బంధించేందుకు మావటివాడిపై బాణాలు కొట్టసాగారు.
వాళ్ళకు మావటివాడి వేషంలో వున్నవాడు రాజని తెలియదు. శత్రువులు వదిలిన బాణాలు తగిలి, మావటివాడి వేషంలో వున్న రాజు మరణించాడు. మావటివాడికి శత్రువుల ఎత్తుగడ అర్థమైంది. వాడు యుద్ధరంగం నుంచి పారిపోక, పగతీర్చుకోవాలన్న పట్టుదలతో శత్రువులను ఎదిరించి భయంకరంగా పోరాడసాగాడు. ఇది వారణాసి సైనికులకు ఎక్కడ లేని ధైర్యాన్ని కలిగించింది. వాళు్ళ ఆకలిగొన్న సింహాల్లా శత్రుసైనికుల మీది కురికారు.
కొద్ది సేపట్లో చచ్చినవాళు్ళ చావగా, మిగిలిన శత్రుసైనికులు యుద్ధరంగం మావటివాడి ఈటెపోట్లకు అక్కడికక్కడే మరణించారు. యుద్ధం ముగిసింది. శత్రువులపై తమ విజయానికి కారణం, తమ రాజు కాదనీ, ఆయన మావటివాడనీ, మంత్రులూ, ఇతర రాజోద్యోగులూ తెలుసుకున్నారు. రాజు మరణించాడు గనక, ఆ స్థానంలో మరొక రాజు అవసరం వున్నది. మరణించిన రాజుకు పిల్లలు లేరు. రాజుగారి ప్రధాన పౌరోహితుడు, ``రాజుగారే స్వయంగా తన దుస్తులూ, కిరీటం మావటివాడికి ఇచ్చాడు. కనక, మనకు రాజుకాదగినవాడు మావటివాడే!'' అన్నాడు.
``ఆ మాట నిజం! మావటివాడి పరాక్రమం వల్లనే శత్రువులు ఓడి, వారణాసి రక్షించబడింది. కనక, మావటివాడే సింహాసనానికి న్యాయమైన హక్కుదారు,'' అన్నాడు ప్రధానమంత్రి. పౌరోహితుడూ, ప్రధానమంత్రీ చెప్పినదానికి సేనానాయకులూ, ఇతర ప్రధానోద్యోగులూ; తమ ఆమోదం తెలిపారు. ఈ విధంగా మావటివాడు రాజయ్యాడు. అతడు కోరిన మీదట బోధిసత్వుడు ప్రధాన సలహాదారుగా ఉండేందుకు అంగీకరించాడు.

No comments:

Post a Comment