Pages

Wednesday, September 19, 2012

కృతజ్నుడైన రాజు

కాశీరాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడుండేవాడు. అతడు చిన్నతనం నుంచీ బహుక్రూరస్వభావుడు. ఏ కారణమూ లేకుండానే దారేపోయే వాళ్ళను భటులచేత పట్టించి, నానా హింసలపాలుచేసి ఆనందించేవాడు. వృద్ధులపట్లా, పండితులపట్లా చిన్నమెత్తు గౌరవభావం లేకపోగా, అనవసరంగా వాళ్ళను అవమానిస్తూండేవాడు. ఈ కారణాల వల్ల, యువరాజన్న గౌరవభావం అతడి పైన ఎవరికీ వుండేది కాదు. అందరూ అతణ్ణి అసహ్యించుకునేవారు.

 అతడు ఇరవై ఏళ్ళ వయసువాడై వుండగా, కొందరు స్నేహితులతో కలిసి నదికి స్నానానికి వెళ్ళాడు. అతడికి ఈతరాదు. అందువల్ల గజ ఈతగాళ్ళయిన కొందరు నౌకర్లను వెంట తీసుకుపోయాడు. యువరాజూ, అతడి స్నేహితులూ నదిలో స్నానం చేస్తూండగా, హఠాత్తుగా ఆకాశాన్ని మేఘాలు కప్పి వేసినై. భయంకరమైన ఉరుములూ, మెరుపులతో జడివాన ప్రారంభమయింది. అది చూసి యువరాజు పట్టలేని ఆనందంతో చప్పట్లు చరిచి నౌకర్లతో, ``ఇలాంటి సమయంలో నది మధ్య స్నానం చేయడం చాలా బావుంటుంది. నన్ను అక్కడికి తీసుకుపొండి,'' అన్నాడు.

నౌకర్లు ఈ ఆజ్ఞ వింటూనే నదిలోకి దిగి, యువరాజును నది మధ్యకు తీసుకు పోయారు. అతడి స్నేహితులు మాత్రం జాగ్రత్తకొద్దీ గట్టు దగ్గిర అంతగా లోతులేని నీళ్ళలో వుండిపోయారు. ఉన్నకొందికీ వాన అధికం కాసాగింది. దానికితోడు కొద్దిగజాల దూరంలో ఏమున్నదీ కానరాకుండా, అంతటా చీకటి అలముకున్నది. నౌకర్లకు పరమ దుష్టుడైన యువరాజు మీద పగతీర్చుకునేందుకు, ఇది మంచి సమయంగా తోచింది. వాళు్ళ అతణ్ణి నది మధ్య అలాగే వదిలి, వేగంగా ఒడ్డుకు ఈదుకువచ్చేశారు.


``యువరాజేమయ్యాడు?'' అని అతడి స్నేహితులు నౌకర్లను అడిగారు. ``ఆయన, మా చేతుల పట్టు వదిలించుకుని, ఈదుతూ వెళ్ళాడు. బహుశా, వెంటనే రాజభవనానికి వెళ్ళాలన్న కోర్కె కలిగి వుంటుంది,'' అని జవాబు చెప్పారు నౌకర్లు. అందరూ తిరిగి వచ్చాక, రాజు తన కొడుకును గురించి నౌకర్లను అడిగాడు. వాళు్ళ, అతడి స్నేహితులకు ఇచ్చిన జవాబే ఇచ్చారు. వెంటనే రాజు సైనికులను పిలిచి, నదీ ప్రాంతాలన్నీ యువరాజు కోసం వెతకమన్నాడు. వాళు్ళ నడిరేయి వరకూ అంతా గాలించి, యువరాజు జాడలేదని రాజుకు చెప్పారు. అయితే, యువరాజు మరణించలేదు.
ప్రవాహ వేగానికి అతడు మునుగుతూ, తేలుతూ కొట్టుకుపోతూండగా, అదృష్ట వశాత్తూ అతడికి నీటివాలున పడి తేలుతూ వస్తున్న ఒక చెట్టు కొమ్మ దొరికింది. దాని ఆధారంతో అతడు ప్రాణరక్షణ చేసుకు న్నాడు. అయితే, ఆ కొమ్మ మీద అప్పటికే మూడు ప్రాణులున్నవి; అవి ఒక పామూ, ఎలుకా, చిలుకా. యువరాజు అంత తుఫాను హోరులోనూ మధ్య, మధ్య పెద్దగా గొంతెత్తి, ``రక్షించండి! రక్షించండి!'' అని కేకలు పెట్టసాగాడు. ఈ విధంగా, కొమ్మతోపాటు యువరాజు నదీ జలంలో కొట్టుకుపోతూండగా సూర్యాస్తమయకాలం అయింది. ఆ సమయంలో నది ఒక అరణ్యంగుండా ప్రవహిస్తున్నది. సాధువుగా జన్మించి, నది ఒడ్డున ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న బోధిసత్వుడు, యువరాజు కేకలు విన్నాడు.
ఆయన దృఢకాయుడు; ధైర్యశాలి. వెంటనే అంత తుఫాను మధ్య బోధిసత్వుడు నదిలో దిగి, ఈదుకుంటూ పోయి, కొమ్మను తీరానికి లాక్కువచ్చాడు. తరవాత యువరాజుతోపాటు వున్న మూడు ప్రాణుల్నీ తన కుటీరానికి తీసుకుపోయి, చలిమంట వేసి, భోజనం తయారుచేశాడు.
ఆయన ముందుగా అల్పజీవులైన పామూ, ఎలుకా, చిలుకలకు ఆహారం పెట్టి, యువరాజు భోజనం ముగించాక పక్క ఏర్పాటుచేశాడు. ఈ విధంగా వాళు్ళ రెండు రోజులు బోధిసత్వుడికి అతిథులుగా వున్నారు. ఈ లోపల తుఫాను తగ్గిపోయింది. యువరాజుతోపాటు, మూడు ప్రాణులూ తిరిగి స్వస్థత చెందాయి.

చిలుక అక్కడినుంచి తన నివాసానికి బయలుదేరుతూ బోధిసత్వుడితో, ``అయ్యా, తమరు నా ప్రాణదాతలు. నది పక్కన వున్న ఒక చెట్టుతొర్ర, నా నివాసస్థానం. తుఫాను తాకిడికి అది నదిలో పడిపోయింది. నేను ఎగరలేకపోయాను. నాకు హిమాలయాల్లో చాలా మంది మిత్రులున్నారు. మీకు ఏనాడైనా అవసరం కలిగితే, నదికి ఆవలనున్న పర్వతపాదం దగ్గిర నిలబడి, నన్ను పిలవండి. నా మిత్రులచేత మీకు అపూర్వమైన ధాన్యాలూ, ఫలాలూ తెప్పించి ఇవ్వగలను,'' అన్నది. ``నీ వాగ్దానం గుర్తుంచుకుంటాను!'' అన్నాడు బోధిసత్వుడు.
పాము, బోధిసత్వుడితో, ``నేను పూర్వ జన్మలో ఒక వర్తకుణ్ణి. కొన్ని కోట్ల బంగారు నాణేలను నది గట్టున ఒక చోట గుప్తపరిచాను. ఆ బంగారం మీది వ్యామోహం వల్ల, ఈ జన్మలో ఇలా పామునై పుట్టాను. నా జీవితం ఆ నిధిని కాపాడడంతో గడిచిపోతున్నది. ఆ బంగారాన్ని తమరు ఏదైనా నలుగురికీ ప్రయోజనకరంగా ఉపయోగించగలిగితే, దాన్ని తమపరం చేస్తాను,'' అన్నది. ఆ తరవాత ఎలుక కూడా తనను గురించి చెప్పుకున్నది. బోధిసత్వుడు ఆ మూడింటినీ భవిష్యత్తులో తిరిగీ కలుసుకుంటానన్నాడు. యువరాజు బోధిసత్వుడితో, ``ఏదో ఒకనాడు నా తండ్రి తరవాత నేను కాశీరాజ్యానికి రాజునవుతాను.
అప్పుడు మీరు నగరానికి రండి. తమను సకల మర్యాదలతో ఆహ్వానించగలను,'' అన్నాడు. కొన్ని సంవత్సరాల తరవాత బోధిసత్వుడు కాశీకి వెళ్ళాడు. అప్పటికి బ్రహ్మదత్తుడు చనిపోయి యువరాజు సింహాసనానికి వచ్చాడు. బోధిసత్వుడు నగరం చేరి, రాజవీధిన నడుస్తూండగా, ఏనుగు అంబారీలో షికారు పోతున్న అతడు, బోధిసత్వుణ్ణి చూస్తూనే, తన అంగరక్షకులతో, ``ఆ సాధువును వెంటనే పట్టుకుని స్తంభానికి కట్టి, కొరడాలతో గట్టిగా కొట్టండి. ఆపైన వధ్యస్థానానికి తీసుకుపోయి, తల నరకండి. వీడికి ఎంత పొగరంటే-అప్పట్లో యువరాజైన నన్ను కాదని, నా కంటె ఎక్కువగా ఒక పాముకూ, ఎలుకకూ, చిలుకకూ సేవలు చేశాడు,'' అన్నాడు. ఇలా రాజాజ్ఞ కాగానే అంగరక్షకులు బోధిసత్వుణ్ణి పట్టుకుని కొరడాలతో కొట్టసాగారు. 

అది చూసిన ప్రజలు బోధిసత్వుణ్ణి, ``అయ్యా, మరేనాడైనా, ఈ రాజుకు ఉపకారం చేశారా?'' అని అడిగారు. ``అవును, చేశాను!'' అని బోధిసత్వుడు జరిగినదంతా చెప్పాడు. కాశీరాజ్య ప్రజలు ఈ కొత్త రాజుపాలనలో నానా హింసలకూ, అవమానాలకూ గురవుతున్నారు. ఇంతకాలంగా రాజుపట్ల వాళ్ళకున్న మితిమీరిన ద్వేషం, బోధిసత్వుణ్ణి అతడి అంగరక్షకులు హింసించడం చూసేసరికి భగ్గుమన్నది.
వాళు్ళ చేతికందిన ఆయుధాలు తీసుకుని అంగరక్షకులపైబడి, వాళ్ళను తరిమివేసి, బోధిసత్వుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశారు. దుష్టుడైన రాజు ప్రజల ఆగ్రహం చూసి, అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. కాని, ప్రజలు అతణ్ణి తరిమి ఏనుగుపై నుంచి కిందికి పడదోసి చంపివేశారు. ప్రజల కోరికపై బోధిసత్వుడు, వాళ్ళకు రాజై ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాడు. ఆయన పామునూ, ఎలుకనూ, చిలుకనూ మరిచిపోలేదు. ఒకసారి అరణ్యానికి పోయి అక్కడ పామునూ, ఎలుకనూ కలుసుకున్నాడు.
అవి తమ నిధి నిక్షేపాలను స్వీకరించవలసిందిగా ఆయన్ను కోరినై. బోధిసత్వుడు ఆ కోర్కెను కాదనలేక ధనంతోపాటు వాటిని కూడా నగరానికి తీసుకు వచ్చాడు. చిలుకను కూడా కలుసుకుని, దాన్ని కూడా తన వెంట రావలసిందిగా ఆహ్వానించాడు. ఆయన ప్రజల క్షేమం కోసం నిధిని ఖర్చు పెట్టటమే గాక, పాము నివసించేందుకు రాజప్రాసాదం పైన ఒకచోట బంగారంతో చిన్న సొరంగం ఏర్పాటు చేశాడు.
దానితోపాటు ఎలుక వుండేందుకు మణిమాణిక్యాలు తాపడం చేసిన ఒక పెద్ద కలుగూ, చిలుకకు అందమైన ఒక బంగారు పంజరం తయారు చేయించాడు. ఈ విధంగా కృతఘు్నడూ, దుష్టుడూ అయిన రాజు పోయి, కాశీరాజ్య ప్రజలకు ధర్మస్వరూపుడైన బోధిసత్వుడు రాజుగా దొరకడంతో, వాళు్ళ ఎంతోకాలం, సుఖంగా జీవించారు.

No comments:

Post a Comment