Pages

Wednesday, September 19, 2012

ఉచ్చనీచలు


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక సింహంగా జన్మించాడు. ఆ సింహం ఒక కొండ గుహలో తన భార్యతో కూడా నివసిస్తూండేది. ఒకనాడా సింహం అమితమైన ఆకలిగొనివున్నదై, కొండ మీది నుంచి కిందికి చూసింది. కొండ కింద ఒక కొలను పక్కగల విశాలమైన పచ్చిక మైదానంలో దానికి కొన్ని కుందేళ్ళూ, జింకలూ ఆడుకుంటూ, అటూ ఇటూ గెంతుతూ కనిపించాయి. వెంటనే సింహం ఒక రంకె పెట్టి, కొండ దిగి వాటివేపు వేగంగా ఉరికింది. అలా పోతూ అది కొలను పక్కన ఉండే ఊబిలో పొరబాటున పడిపోయింది. ఈలోగా సింహాన్ని చూసి కుందేళ్ళూ, జింకలూ భయపడి పారిపోయూయి.
ఊబి నుంచి బయటపడటానికి ప్రయత్నించిన కొద్దీ సింహం మరింత లోపలికి దిగబడసాగింది. అందుచేత అది కదలకుండా అలాగే వుండిపోయి, తనను రక్షించగల వారెవరైనా అటుగా వస్తారా అని ఎదురు చూడసాగింది. ఆకటితో అలమటించుతూ ఆ సింహం ఒక వారంరోజులున్న మీదట, పక్కనే వున్న కొలనులో నీరుతాగటానికి నక్క ఒకటి వచ్చి, సింహాన్ని చూసి బెదిరి దూరంగా ఆగి పోయింది.
సింహం నక్కను చూసి, ‘‘నక్క తమ్ముడూ! వారం రోజులుగా ఈ ఊబిలో చిక్కి, ఎంత ప్రయత్నించినా వెలుపలికిరాలేక చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. నన్నెలాగైనా ఈ ఊబి నుంచి పైకి లాగి కాపాడి పుణ్యం కట్టుకో!'' అని ప్రాధేయపడింది. ‘‘అసలే ఆకలితో ఉన్నావు, నన్ను చంపేస్తావేమో? నిన్నెలా నమ్మటం?'' అన్నది నక్క భయపడుతూ.
‘‘ప్రాణభిక్ష పెట్టిన ప్రాణిని చంపుతానా? నేనంతటి పాపాత్ముణ్ణి కాను. నన్ను, ఈ ఊబి నుంచి రక్షించావంటే, నీకు బతికి ఉన్న న్నాళ్ళూ కృతజ్ఞతగా వుంటాను. నా మాట నమ్ము!'' అన్నది సింహం.

నక్క సింహం మాటలు నమ్మి, ఎండు కట్టెలను తెచ్చి ఊబిలో పడవేసింది. వాటిమీద కాళ్ళు ఊన్చి సింహం ఊబిలో నుంచి బయటికి రాగలిగింది. తరవాత రెండూ కలిసి అరణ్యంలో వేటకు బయలుదేరాయి. సింహం ఒక జంతువును చంపింది. దాన్ని రెండూ సమంగా పంచుకు తిన్నాయి. ‘‘ఇకనుంచీ మనం సోదరులం! నువ్వొకచోటా నేనొకచోటా ఉండటం దేనికి? నీ కుటుంబాన్ని మా గుహకే తీసుకురా! అందరం కలిసికట్టుగా జీవింతాం!'' అన్నది సింహం.
నక్క అంగీకరించి, భార్యతోసహా సింహం గుహలో కాపరం పెట్టింది. సింహం వెంట తాను కూడా కాపరం చెయ్యటం గొప్పగా ఉంటుందని నక్క ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే గాని, తన జాతివారికి దూరమైపోవటంలోగల నష్ట కష్టాలు తెలియక కాదు. సింహం కూడా నక్క చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని, ప్రతి స్వల్ప విషయంలోనూ తన మిత్రుణ్ణి తనతో సమంగా చూసుకుంటూ, నక్క మనసుకు ఏ మాత్రమూ బాధ కలగకుండా ప్రవర్తిస్తూ రోజులు గడపసాగింది.
సింహం నక్కను ఎంత ప్రేమతో చూసినా సింహం భార్య నక్క భార్యను తక్కువగానే చూసేది. అయితే నక్క భార్య తన జాతి తక్కువను ఆమోదించినది కావటం చేత రెండు కుటుంబాల మధ్యా ఎట్టి పేచీలూ రాలేదు. అయితే కాలక్రమాన సింహానికీ, నక్కకూ కూడా పిల్లలు కలిగి, అవి సమంగా ఆడుకుంటుండటం చూసి సింహం భార్యకు మండిపోయింది. తాము తక్కువనీ, సింహం పిల్లలు ఎక్కువనీ తెలియని నక్కపిల్లలు, సింహం పిల్లలతో భేదం పాటించకుండా కిందా మీదా పడి ఆడుకుంటున్నాయి. ఉచ్చనీచల విషయం తెలియని సింహం పిల్లలు కూడా నక్కపిల్లలతో సమంగా ఆడుతున్నాయి. ఇది చూసి ఓర్చలేని సింహం భార్య తన పిల్లలతో చాటుగా, ‘‘మనం గొప్ప పుటక పుట్టిన వాళ్ళం.
మీరా నక్కపిల్లలతో అంత చనువుగా ఆడరాదు. వాటిని దూరంగా ఉంచండి!'' అని చెప్పింది. సింహం పిల్లలకు తల్లి బోధ కొంచెం కొంచెమే తలకెక్క సాగింది. అవి నక్క పిల్ల లను లోకువగా చూడటమూ, వాటితో ఆడే టప్పుడు అన్యాయం చెయ్యటమూ, ‘‘మేము గొప్పవాళ్ళం.


 మిమ్మల్ని మేము పోషిస్తున్నాము. మాకు మీరు ఎదురు చెప్పకూడదు. మీరు తక్కువవాళ్ళు కనక, తిట్టినా పడి ఉండాలి!'' అనటమూ సాగించాయి. ఆడనక్కకు కష్టం వేసి ఒకనాడు తన భర్తతో సింహం భార్య వైఖరి గురించి చెప్పింది. సింహంతో మర్నాడు వేటకు వెళ్ళేటప్పుడు నక్క, ‘‘మీది రాచజాతి. మేం సామాన్యులం.
అందుచేత మనం కలిసి ఉండటం అంత మంచిది కాదు. మేము వెళ్ళి మా వాళ్ళ మధ్య బతుకుతాం!'' అన్నది. ఆకస్మికంగా తమ మిత్రుడిలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపడి సింహం కారణ మడిగింది. నక్క జరిగినదంతా వివరంగా చెప్పింది. ఆ రాత్రి గుహకు తిరిగి రాగానే సింహం తన భార్యతో, ‘‘నువ్వు నక్క పిల్లల్ని చూసి అసహ్యపడ్డావుట కదా?'' అని అడిగింది. ‘‘అవును, ఆ తక్కువజాతి పిల్లలు మన పిల్లలతో సమానంగా ఆడుకోవటం నాకేమీ బాగాలేదు.
మీకా నక్క ఏమి మందు పెట్టి మంచి చేసుకుందో నాకు తెలీదు. నా పిల్లలు పాడుకావటం మాత్రం నేను ఒప్పను!'' అన్నది సింహం భార్య. ‘‘అదా సంగతి? నక్క నాకేం మందు పెట్టిందో చెబుతాను విను: నేను ఒకసారి వారం రోజులు ఇంటికి రాలేదు, జ్ఞాపకం ఉన్నదా? ఆ వారం రోజులూ నేను తిండి లేక మాడుతూ ఊబిలో చిక్కాను. నా ప్రాణాలు పోతున్న సమయంలో ఈ నక్క వచ్చి యుక్తిగా నన్ను ఊబి నుంచి బయటికి లాగింది.
ఆనాడు ఆ ఆపద సమయంలో నక్కే గనక నన్ను ఆదుకోకపోతే నేనూ వుండను, మన పిల్లలూ ఉండరు! ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళ దగ్గిర ఉచ్చనీచలు పాటించడం మహాపచారం. అటువంటి వాళ్ళను అవమానించటం రక్తసంబంధం గల బంధువులను అవమానించటం లాటిదే!'' అన్నది సింహం. సింహం భార్య సిగ్గుపడి నక్క భార్యకు క్షమాపణ చెప్పుకున్నది. తరవాత ఏడు తరాల దాకా సింహం సంతతీ, నక్క సంతతీ అదే గుహలో ఎంతో సఖ్యంగా కలిసి సుఖంగా జీవించాయి.

No comments:

Post a Comment