Pages

Wednesday, September 19, 2012

దేవధర్మం

చాలాకాలం క్రితం కాశీరాజుకు పట్టపు రాణియందు ఇద్దరు కొడుకులు కలిగారు. రాజు వారికి మహింసాసుడనీ, చంద్రకుమారుడనీ పేర్లు పెట్టాడు. మహింసాసుడే బోధిసత్వుడు. చంద్రకుమారుడు పసివాడుగా ఉండగానే తల్లి తీరని వ్యాధి సోకి హఠాత్తుగా చనిపోయింది.

అప్పుడు రాజు మరొక భార్యను పెళ్ళాడి, ఆమెను పట్టపురాణిని చేశాడు. ఆమె రాజుకు ప్రేమపాత్రురాలుగానూ, అనుకూలవతిగానూ ఉంటూ, కాలక్రమాన తాను కూడా ఒక అందమైన పిల్లవాణ్ణి కన్నది. వాడికి సూర్యకుమారుడని పేరు పెట్టారు. రాజు ఒకనాడు ఈ పుత్రుణ్ణి చూసి ఎంతగానో సంతోషించి పట్టపురాణితో, ‘‘నీ కొడుక్కు ఏదైనా వరం ఇస్తాను కోరుకో,’’ అన్నాడు.

‘‘మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అయితే, ఇప్పుడు కాదు, నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను,’’ అన్నది పట్టపురాణి.
కొంత కాలానికి సూర్యకుమారుడు యుక్తవయస్కుడయ్యాడు. అప్పుడు పట్టపురాణి రాజుతో, ‘‘నాకు కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానన్నారు. జ్ఞాపకం ఉన్నది కదా? ఇప్పుడా మాట చెల్లించి, నా కొడుక్కు రాజ్యం ఇయ్యండి,’’ అన్నది.

‘‘అగ్నిజ్వాలల లాగా ప్రకాశించే పెద్ద కొడుకులు ఇద్దరుండగా నీ కొడుక్కు రాజ్యం ఇవ్వటం ఏ ధర్మమూ అంగీకరించదు. అందువల్ల అది సాధ్యం కాదు,’’ అన్నాడు రాజు.

రాణి ఆగ్రహం చెందింది కాని, అప్పటికేమీ మాట్లాడకుండా మౌనం వహించింది.

 ఆమె తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది. ఆయన ఒకనాడు మహింసాసుణ్ణీ, చంద్రకుమారుణ్ణీ చేర పిలిచి, ‘‘అబ్బాయిలూ, నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి ఒక వరం ఇస్తానన్నాను. ఆమె ఇప్పుడు సూర్యకుమారుడికి రాజ్యం ఇవ్వమని కోరుతున్నది.

నేను అందుకు అంగీకరించలేదు. అయితే దురాశ ప్రళయాంతకమైనది. అది రాజ కుటుంబంలో మరింత హాని కలిగిస్తుంది. ఆమె మీకు ఏదన్నా కీడు చేయవచ్చు. అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి, నేను కన్ను మూశాక తిరిగి వచ్చి, ఈ రాజ్యం ఏలుకోండి,’’ అని చెప్పాడు.

ఇదేమీ సూర్యకుమారుడు ఎరగడు. ఒక నాడు తన అన్నలు చెప్పాపెట్టాకుండా రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉండటం చూసి, ఆశ్చర్యపోయాడు. అన్నలతోపాటు బయలుదేరాడు. ముగ్గురు అన్మదమ్ములూ కొన్నాళ్ళకు హిమాలయాల మీదికి వెళ్ళారు. బోధిసత్వుడు దారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సూర్యకుమారుడితో, ‘‘తమ్ముడూ, ఆ కనిపించే కొలనుకు వెళ్ళి, స్నానం చేసి, దాహం తీర్చుకుని, మా ఇద్దరికీ తాగటానికి తామరాకులతో నీరు పట్టుకురా,’’ అన్నాడు.

ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది. కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడి కిచ్చి, దేవధర్మం ఎరిగిన వారిని విడిచి పుచ్చమనీ, అది తెలియనివాళ్ళు ఎవరైనా కొలనులో దిగితే వారిని భక్షించమనీ, కొలనులోకి దిగనివారి జోలికి పోవద్దనీ చెప్పాడు. అది మొదలు ఆ యక్షుడు కొలనులో దిగిన ప్రతి మనిషినీ, ‘‘దేవధర్మం ఏమిటి?’’ అని అడిగి, చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు. అందుచేత, సూర్యకుమారుడు కొలనులోకి దిగగానే ఆ యక్షుడు అతణ్ణి అడ్డుకుని, ‘‘నీకు దేవధర్మం తెలుసునా?’’ అని అడిగాడు.

‘‘తెలుసు; దేవధర్మం అంటే ఆకాశంలో వెలుగుతూన్న సూర్యచంద్రులు,’’ అన్నాడు సూర్యకుమారుడు.

‘‘నీకు దేవధర్మం తెలియదు,’’ అని యక్షుడు సూర్యకుమారుణ్ణి కొలను లోపల ఉన్న తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు.
సూర్యకుమారుడు ఎంతకూ రాకపోవటం చూసి బోధిసత్వుడు చంద్రకుమారుణ్ణి కొలనుకు పంపాడు.


 యక్షుడు అతణ్ణి కూడా పట్టుకుని, ‘‘దేవధర్మం ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘దేవధర్మం అంటే నాలుగు దిశలూ,’’ అన్నాడు చంద్రకుమారుడు.
‘‘నీకు దేవధర్మం తెలియదు,’’ అని చెప్పి, యక్షుడు అతణ్ణి కూడా తీసుకుపోయి తన నివాసంలో ఉంచాడు.

చంద్రకుమారుడు కూడా ఎంతకూ రాకపోయేసరికి బోధిసత్వుడికి అనుమానం కలిగింది. ఏదో విపత్తు సంభవించి ఉంటుందనుకుని, తానే స్వయంగా బయలుదేరి కొలను దగ్గరికి వచ్చాడు. అక్కడ ఇద్దరు మనుషులు కొలనులోకి దిగిన అడుగుజాడలు కనిపించాయి గాని, అందులో నుంచి బయటికి వచ్చిన జాడ కనిపించలేదు. ‘‘ఇందులో ఎవరో రాక్షసుడున్నాడు కాబోలు,’’ అనుకుని బోధిసత్వుడు చుట్టుపక్కలు పరిశీలించి చూసి కత్తి దూసి చేత పట్టుకుని, యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు.

అతను నీటిలోకి దిగక పోవటం చూసి జలరాక్షసుడైన యక్షుడు ఆటవికుడి రూపంలో అతడి ముందుకు వచ్చి, ‘‘మహాశయా, నీటిలోకి దిగి, హాయిగా స్నానం చేసి, దప్పిక తీర్చుకోక, ఒడ్డున ఎందుకిలా అనుమానంతో నిలబడి ఉన్నావు?’’ అని అడిగాడు. ఈ కొలనుకు అధిపతి అయిన యక్ష రాక్షసుడు ఈ మనిషే అయి ఉంటాడని బోధిసత్వుడికి అనుమానం కలిగింది. ‘‘నా తమ్ములను పట్టుకుపోయినది నువ్వేనా?’’ అని ఆయన అడిగాడు.

‘‘అవును, వాళ్ళను పట్టుకుపోయింది, నేనే!’’ అన్నాడు యక్షుడు.

‘‘ఎందుకు అలా చేశావు?’’ అని బోధిసత్వుడు అడిగాడు.

‘‘ఈ కొలనులో దిగేవారు నాకు అధీనులవుతారు,’’  అన్నాడు యక్షుడు.

‘‘కొలనులో దిగిన ప్రతివాడూ నీకు లోబడవలసిందేనా?’’ అని అడిగాడు బోధిసత్వుడు.

‘‘దేవధర్మం తెలిసిన వాళ్ళు తప్ప అందరూ నా అధీనంలో ఉంటారు,’’ అన్నాడు యక్షుడు.

‘‘నీకు దేవధర్మం కావాలంటే నేను చెప్పగలను,’’ అన్నాడు బోధిసత్వుడు.

‘‘అయితే చెప్పు!’’ అన్నాడు యక్షుడు ఉత్సాహంగా.


‘‘అభిమానమూ, నిందాభయమూ, శుభకర్మమూ, సత్యమూ, శాంతమూ గల సత్పురుషుడి ధర్మమే దేవధర్మం,’’ అన్నాడు బోధిసత్వుడు.
యక్షుడు ఈ మాటకు ఎంతో తృప్తిపడి, బోధిసత్వుడికి సత్కారాలు చేసి, ‘‘నాకు నీపైన అనుగ్రహం కలిగింది. నీ తమ్ములలో ఒకణ్ణి నీకు తిరిగి ఇస్తాను. ఎవర్ని తీసుకురమ్మన్నావు?’’ అన్నాడు.

‘‘నా చిన్న తమ్ముణ్ణి తీసుకురా,’’ అన్నాడు బోధిసత్వుడు.

‘‘పండితుడా, నీకు దేవధర్మం తెలుసునేగాని, దాన్ని అమలుపరచటం తెలియదు,’’ అన్నాడు యక్షుడు.

‘‘అలాగా! ఆ మాట ఎలా చెప్పగలిగావు?’’ అని బోధిసత్వుడు అడిగాడు చిన్నగా నవ్వుతూ.

‘‘నీ తమ్ములలో పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి అడగటంలో పెద్దవాడికి గౌరవం లేకుండా చేస్తున్నావు,’’ అన్నాడు యక్షుడు.

‘‘యక్షుడా, నేను దేవధర్మాన్ని ఆచరించేవాణ్ణి కనకనే అలా కోరాను. నా చిన్న తమ్ముడి కారణంగానే నేను అరణ్యాలకు రావటం జరిగింది. అతడి తల్లి మా తండ్రిని రాజ్యం అడిగింది. మా క్షేమం కోరి మా తండ్రి మమ్మల్ని వనానికి పంపాడు. ఇతను లేకుండా నేను మా రాజ్యానికి తిరిగిపోయి, వాణ్ణి ఎవరో యక్షుడు మింగేశాడంటే భావ్య మౌతుందా? లోకం నన్ను నిందించదా? పైగా, నాపెద్ద తమ్ముడూ నేనూ ఒకే తల్లి బిడ్డలం. చిన్న తమ్ముడు పినతల్లి కొడుకు. అందువల్ల అతణ్ణి సజీవుణ్ణి చేయడమే అన్ని విధాలా ధర్మం,’’ అన్నాడు బోధిసత్వుడు.

‘‘నీకు దేవధర్మం తెలియటమే కాదు, అనుభవం కూడాను,’’ అని యక్షుడు చంద్రకుమారుణ్ణీ, సూర్యకుమారుణ్ణీ తీసుకు వచ్చి బోధిసత్వుడికి ఇచ్చాడు.
కొంతకాలం గడిచాక ముసలిరాజు చనిపోయినట్టు తెలిసింది. బోధిసత్వుడు తన తమ్ములిద్దరితోనూ తన దేశానికి తిరిగి వెళ్ళి, రాజ్యాభిషేకం చేసుకుని, తన తమ్ములైన చంద్రకుమారుణ్ణి యువరాజుగానూ, సూర్యకుమారుణ్ణి సేనాపతిగానూ నియమించి, రాజ్యపాలన చేశాడు.



No comments:

Post a Comment