Pages

Wednesday, September 19, 2012

వింత హెచ్చరిక

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, వారణాసిలో సేనకుడనే ఒక గొప్ప సాధువు వుండేవాడు. బోధిసత్వుడి అనేక పూర్వజన్మలలో, ఈ సాధుజన్మ ఒకటి. అదే కాలంలో నగరానికి దాపులనున్న ఒక గ్రామంలో, భిక్షాటనతో జీవించే బ్రాహ్మణుడొకడుండేవాడు.
అతడొకనాడు పొరుగు గ్రామాలలో బిచ్చం ఎత్తి, ఒక అడవిగుండా ఇంటికి తిరిగి వస్తూండగా, ``ఓయీ, బ్రాహ్మణుడా, ఈ రోజు నువు్వ ఇంటికి వెళ్ళకపోతే, నీకు మరణం తప్పదు; ఇంటికి వెళ్ళడం జరిగితే, నీ భార్య మరణం ఖాయం!'' అన్న మాటలు వినిపించినై. బ్రాహ్మణుడు ఉలిక్కిపడి, చుట్టూ కలయచూశాడు. ఎవరూ కనిపించ లేదు. ఆ హెచ్చరిక చేసినది ఏ పిశాచమో, యక్షుడో అన్న అనుమానం కలిగిందతడికి.
భయంతో నిలువెల్లా వణికిపోతూ బ్రాహ్మణుడు త్వరగా ఇల్లు చేరాలనుకున్నాడు. కాని, అలా చేయడం తన భార్య మరణానికి కారణం అవుతుంది. అడవిలోనే వుండిపోతే తన మరణం తప్పదు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చేయాలో తోచక అతడికి మతిపోయినంత పనయింది. బ్రాహ్మణుడు ఆ సంకట స్థితిలో అడవి దాటి; నగరంలోని ఒక వీధి వెంట నడుస్తూండగా, బోధిసత్వుడైన సేనకుడు ఒకచోట చాలామంది ప్రజలకు ధర్మబోధ చేస్తున్నాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుతూండగా చుట్టూ గుమిగూడిన ప్రజలు, ఆ మాటలను ఎంతో భక్తిశ్రద్ధలతో వింటున్నారు. బ్రాహ్మణుడు అక్కడికి పోయి జనం వెనకగా నిలబడ్డాడు.

ప్రాణభయంతో అల్లాడిపోతున్న అతడు బోధిసత్వుడు చెబుతున్న దేమిటో శ్రద్ధగా వినకపోయినా, ఆయనను చూస్తూ నిశ్చలంగా వుండిపోయాడు. కొంతసేపటికి బోధిసత్వుడు మాట్లాడడం ముగించగానే జనం హర్షధ్వానాలు చేశారు. బ్రాహ్మణుడు ఆవేదనపడుతూ, స్థాణువులా కదలామెదలక వూరుకున్నాడు. బ్రాహ్మణుణ్ణి చూసిన బోధిసత్వుడు, అతణ్ణి తన వద్దకు రమ్మన్న సూచనగా చేయివూపాడు. బ్రాహ్మణుడు ఆయన వద్దకు పోయి తలవంచి నమస్కరించాడు.
బోధిసత్వుడు అతణ్ణి, ``నీకు వచ్చిన కష్టమేమిటి?'' అని అడిగాడు. బ్రాహ్మణుడు కళ్ళనీళు్ళ పెట్టుకుని, అడవిలో జరిగిన దానిని గురించి ఆయనకు చెప్పాడు. ``ఆ అశరీరవాణి మాటలు వినే ముందు, నువ్వేం చేస్తున్నావు?'' అని అడిగాడు బోధిసత్వుడు. ``నేనొక చెట్టుకింద కూర్చుని, సంచీ విప్పి, అందులో వున్న ఆహారం తిన్నాను,'' అన్నాడు బ్రాహ్మణుడు. ``నువు్వ, ఆహారం దాచుకున్న సంచీ కనబడుతూనేవున్నది, వెంట నీటి పాత్ర మాత్రం లేదు. మరి అడవిలో భోజనం చేశాక దాహం ఎక్కడ తీర్చుకున్నావు?'' అని అడిగాడు బోధిసత్వుడు. ``దగ్గిర్లో ఒక సెలయేరున్నది. అక్కడికి పోయి దాహం తీర్చుకున్నాను,'' అన్నాడు బ్రాహ్మణుడు. ``నువు్వ పూర్తిగా తినేశావా? లేక తినగా, సంచీలో ఇంకేమైనా ఆహారం మిగిలిందా?'' అన్నాడు బోధిసత్వుడు.
``స్వామీ, సంచీలో వున్న ఆహారంలో సగమే తిన్నాను. తతిమ్మా సగం సంచీలోనే వున్నది,'' అని జవాబిచ్చాడు బ్రాహ్మణుడు. బోధిసత్వుడు ఒక క్షణం ఆగి, ``నువు్వ నీటికోసం సెలయేటి దగ్గిరకు వెళ్ళే ముందు, సంచీమూతి, తాడుతో బిగించి కట్టావా?'' అని అడిగాడు. ``ఆ పని సెలయేటి నుంచి తిరిగి వచ్చాక చేశాను. తరవాత సంచీ తీసుకుని అక్కణ్ణించి బయలుదేరాను,'' అన్నాడు బ్రాహ్మణుడు. ``సంచీమూతి బిగించేముందు, దాని లోపలికేమైనా చూశావా?'' అన్నాడు బోధిసత్వుడు.

బ్రాహ్మణుడు అప్పుడు జరిగిందేమిటో జ్ఞాపకం తెచ్చుకునేందుకు రెండు మూడు క్షణాలు ఆలోచిస్తూ వూరుకుని, తరవాత, ``స్వామీ, అలా చేయలేదు,'' అన్నాడు. బోధిసత్వుడు, ఆ సమయంలో ఏం జరిగివుంటుందో ఊహించేందుకు ప్రయత్నిస్తూ, కొంతసేపు మౌనంగా వుండిపోయి, బ్రాహ్మణుణ్ణి, ``నువు్వ చెట్టు కిందినుంచి బయలు దేరగానే, నీకూ, నీ భార్యకూ రానున్న ప్రమాదం గురించిన హెచ్చరిక వినబడిందా?'' అని అడిగాడు. ``అవును, స్వామీ! నేను కనీసం పదీ, పన్నెండడుగులైనా నడిచి వుండను. ఎవరో స్పష్టమైన కంఠస్వరంతో, ఆ వింతహెచ్చరిక చేశారు,'' అన్నాడు బ్రాహ్మణుడు.
``అంటే, నువు్వ చెట్టు దగ్గిరనుంచి బయలుదేరేముందు ఏదో జరిగివుండాలి. బహుశా, ఏపామో, సంచీలో వున్న ఆహారం కోసం అందులో ప్రవేశించివుంటుంది. అది గమనించిన, ఏ యక్షుడో లేక వృక్షదేవతో నిన్ను హెచ్చరించింది. నువు్వ, ఈ రోజు ఇంటికి చేరకపోతే, ఆహారం కోసం సంచీ మూతి విప్పి, అందులో చేయి పెడతావు. పాము నిన్ను తప్పక కాటువేసి, నీ మరణానికి కారణం అవుతుంది.
అలాకాక, ఈ రోజే నువు్వ ఇల్లు చేరితే, నీ భార్య సంచీలో ఏమున్నదో చూసేందుకు, దానిలో చేయి పెట్టి, పాము కాటుకు మరణిస్తుంది!'' అన్నాడు బోధిసత్వుడు. ఆయన, బ్రాహ్మణుడికి సంచీ తన పక్కన పెట్టవలసిందిగా చెప్పాడు. ఆ సమయంలో జనంలోవున్న ఒక పాములవాడు వచ్చి సంచీ మూతి విప్పాడు.
లోపలినుంచి ఒక నాగుపాము బయిటికి వచ్చింది. వెంటనే పాములవాడు నేర్పుగా దానిని వడిసి పట్టుకుని దూరంగా తీసుకుపోయాడు. అప్పుడు బోధిసత్వుడు బ్రాహ్మణుడితో, ``నువ్విప్పుడు అన్ని భయాలూ వదిలి, హాయిగా ఇంటికి పోవచ్చు,'' అన్నాడు. బ్రాహ్మణుడు, ఆయనకు తన కృతజ్ఞత చెప్పుకుని, తేలికపడిన మనస్సుతో, ఇంటి దారి పట్టాడు.

No comments:

Post a Comment