Pages

Wednesday, September 19, 2012

ధర్మాచరణ


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఇంద్రప్రస్థ నగరంలో ధనంజయుడనే కురురాజుగా జన్మించాడు. ఆయన పరిపాలనలో అతివృష్టి, అనావృష్టి, మొదలైన పీడలేవీ లేకుండా ప్రజలు సుఖ పడుతూ వచ్చారు. ధర్మాన్ని పాటించటం లోనూ, దాన ధర్మాలు చేయటంలోనూ, ధనంజయుడికి సాటి ఎవరూ లేరన్న ఖ్యాతి జంబూద్వీపమంతటా పాకింది. ఆ కాలంలోనే కళింగదేశానికి రాజధాని అయిన దంతపురమనే నగరాన్ని కాళింగుడనే పేరుగల రాజు పరిపాలిస్తూండేవాడు.
ఆ రాజ్యంలో ఒక ఏడు వానలు కురవక కరువేర్ప డింది. ప్రజలు తిండికి లేక అల్లాడారు. ఈ దుస్థితి చూసి కాళింగుడు తన మంత్రు లతో ఆలోచన జరిపాడు. ‘‘ఈ యేడు మన దేశంలో ఇంత క్షామం ఏర్పడటానికేమి కారణం? ఈ పీడ తొలగించడానికి మనం చేయవలసిన పని ఏమిటి?'' అన్నాడు రాజు. ‘‘మహారాజా! ధర్మానికి హాని జరిగినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. ఇంద్ర ప్రస్థం ఏలే ధనంజయుడు తన ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా పాటిస్తాడు.
అందుచేతనే ఆ దేశం కరువు కాటకాలు ఎరగకుండా సుభిక్షంగా వుంటుంది,'' అన్నారు మంత్రులు. ‘‘అలా అయితే, మీరు ఇంద్రప్రస్థం వెళ్ళి, ఆ ధనంజయ రాజు దర్శనం చేసుకుని, బంగారు రేకులమీద ధర్మాలన్నీ రాయించుకు రండి. వాటిని మనం కూడా అమలు చేసి అరిష్టాలు లేకుండా చేసుకుందాం!'' అన్నాడు కాళింగుడు. ఆ ప్రకారమే కళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులు తీసుకుని ఇంద్రప్రస్థానికి ప్రయూణమై వెళ్ళి, ధనంజయుడి దర్శనం చేసుకుని, ఆయనతో ఈ విధంగా అన్నారు: ‘‘మహారాజా, మేము కళింగ దేశం నుంచి వస్తున్నాము.
మా దేశప్రజలు భయంకరమైన క్షామంతో బాధపడ్తున్నారు. మీరు ధర్మస్వరూ పులుగా ఉండి, ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలిస్తుండటం చేత, మీ ప్రజలు ఈతి బాధలెరగక, సుఖంగా ఉంటున్నారు.

మారాజు పాటించవలసిన ధర్మాలేవో మీరు ఈ బంగారు పత్రాలపై లిఖించి ఇచ్చినట్టయితే, మా రాజు గారు వాటిని అమలు జరిపి, ప్రజలను పీడించే కరువును పోగొట్టగలుగుతారు!'' ధనంజయుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు: ‘‘మహామంత్రులారా, క్షమిం చండి! నేను ఈ పత్రాలపై ధర్మాన్ని లిఖించ డానికి తగినవాణ్ణి కాను. ఎందుచేతనంటే ఒకప్పుడు నా వల్లనే అధర్మం జరిగింది.
మా దేశంలో మూడేళ్ళకొకసారి కార్తికోత్సవం జరుగుతుంది. అప్పుడు రాజు ఒక చెరువు గట్టున యజ్ఞం చేసి, నాలుగు దిక్కులా నాలుగు బాణాలు వదలాలి. ఒకసారి నేను వదిలిన బాణాలలో మూడు దొరికాయి, కాని నాలుగవది చెరువులో పడిపోయింది. అది చెరువులో పడినప్పుడు దాని విసురుకు చేపలూ, కప్పపిల్లలూ చచ్చిపోయి ఉంటాయి. ఆ విధంగా నేను ధర్మం తప్పాను. మరి మా రాజ్యంలో అరిష్టాలు లేవంటే దానికి కారకులు పరిపాలక వర్గంలో ఇంకెవరైనా అయివుండ వచ్చు.
విచారించి చూడండి.'' ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్య పడ్డారు. వారు రాజమాత అయిన మాయూ దేవి వద్దకు వెళ్ళి, ‘‘తమరైనా మాకు ధర్మాలు రాసి పెట్టండి!'' అని కోరారు. ‘‘అయ్యో, నాయనా! నేనూ ధర్మం తప్పిన దాన్నే. ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు సువర్ణహార మొకటి కానుక ఇచ్చాడు. నా పెద్ద కోడలు ఐశ్వర్యవంతురాలనే ఉద్దేశంతో నేనా హారాన్ని చిన్న కోడలికిచ్చాను. కాని తరవాత నాలో కలిగిన భేదబుద్ధి నా కర్థమై బాధ కలిగింది.
అందుచేత ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చే అర్హత నాకు లేదు,'' అన్నది రాజమాత. కళింగ మంత్రులు రాజభ్రాత అయిన నందుడి వద్దకు వెళ్ళారు. అతను తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెప్పాడు. ‘‘నేను ప్రతి సాయంకాలమూ రాజాంతః పురానికి రథంలో వెళతాను. ఒక్కో రాత్రి అక్కడే వుండిపోతాను కూడా.
నేను కొరడా రథంలో వుంచి వెళితే, రాత్రికి ఉండనన్న మాట. అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు. కొరడా తీసుకుని వెళ్ళానంటే సారథి రథం తోలుకుపోయి, మర్నాడు ఉదయం తిరిగి తెస్తాడు. ఒక రోజు కొరడా రథంలోనే వదిలి రాజాంతఃపురం ప్రవేశిం చాను, తిరిగి వద్దామనే నా ఉద్దేశం.

అయితే ఇంతలో వాన ప్రారంభమయింది. రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్ళ నివ్వలేదు. ఆ రాత్రి అక్కడే వుండి పోయూను. వానకు తడుస్తూ, నా సారథి కూడా రథంలోనే ఉండి పోయూడు. అతన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి నేను ధర్మాన్ని తప్పాను,'' అన్నాడతను. కనీసం రాజపురోహితుడైనా తమ కోరిక నెరవేర్చుతాడని కళింగ మంత్రులు ఆయన వద్దకు వెళ్ళారు. కాని ఆయన కూడా ధర్మం తప్పినట్టు చెపుతూ, ఇలా అన్నాడు: ‘‘ఒక రోజు నేను రాజభవనానికి పోతుంటే దారిలో ఒక రథం కనిపించింది.
దానికి బంగారు తొడుగువున్నది. అది చూడగానే నాకు లోభం కలిగి, రాజుగారు దాన్ని నాకు దానం చేస్తే బాగుండుననిపించింది. నేను తీరా వెళ్ళే సరికి రాజుగారు, ‘ఈ రథం మీరు తీసుకోండి,' అన్నాడు. వెంటనే నా లోభం జ్ఞప్తికి వచ్చి, పశ్చాత్తాపం కలిగి రథాన్ని వద్దన్నాను. నేను మీకు ధర్మాలు రాసి పెట్టగల వాణ్ణి కాను!'' కళింగ మంత్రులకేమీ పాలుపోలేదు. వారు చివరి ఆశ మంత్రిమీద పెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళారు. కాని ఆయన కూడా వారికి ఆశాభంగం కలిగించాడు.
‘‘ఒకనాడు నేను ఒక రైతు తాలూకు పొలం కొలతలు వేయబోయూను. కొలత ప్రకారం కర్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉన్నది. అందులో ఏ ప్రాణి అయినా వుండ వచ్చునని అనుమానం వేసింది. కాని కర్ర కొంచెం ఇవతల పాతితే రైతుకు నష్టం, అవత లికి పాతితే రాజుకు నష్టం. అందుచేత ఆ బిలంలోనే కర్ర పాతమని ఆజ్ఞాపించాను. అదే సమయూనికి ఎండ్రకాయ ఒకటి బిలంలో నుంచి బయటికి వస్తూ కరప్రోటుకు చచ్చి పోయింది.
అందుచేత నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే. కనక, నా ఎక్కువ ఏమీ లేదు.'' కళింగ మంత్రులకు ఒక ఆలోచన తట్టింది. వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి, వాటిని తీసుకుపోయి తమ రాజుకు వినిపించారు. ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉత్తమ ధర్మమని కాళింగుడు తెలుసుకుని, ఆత్మవిమర్శనతో పరిపాలన సాగించాడు. వెంటనే వానలు కురిసి క్షామం తొలగి పోయింది. కళింగ ప్రజలు సుఖంగా జీవించారు.

No comments:

Post a Comment