Pages

Wednesday, September 19, 2012

స్వర్ణపాత్ర

అయిదు కల్పాలనాడు భోధిసత్వుడు సేరివ అనే రాష్ట్రంలో పాత్రసామాగ్రి అమ్మే వర్తకుడుగా జీవించాడు. అతను పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు న్యాయమైన లాభం మాత్రమే ఆశించేవాడు.

ఆ రాష్ట్రంలోనే పాత్రసామగ్రి క్రయ విక్రయాలుచేసే వర్తకుడు ఇంకొకడు ఉండేవాడు. అతను పరమలోభి. భోధిసత్వుడూ, అతనూ కలిసే వ్యాపారం చేస్తూ తిరిగేవారు. ఒకసారి ఇద్దరూ కలిసి తేలివాహఅనే నదిని దాటి ఆంధ్ర పురం చేరుకున్నారు. ఒకరి వ్యాపారానికి ఇంకొకరు అడ్డు లేకుండా, పురంలోని వీధులను రెండుగా భాగించుకుని, ఎవరి వీధులలో వారు వర్తకం సాగించటానికి బయలుదేరారు.

ఆ ఆంధ్రపురంలో ఒక శ్రేష్ఠికుటుంబం ఉంటున్నది. వాళ్ళు ఒకప్పుడు ధనికులే కాని, ఇప్పుడు చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులూ, అన్నదమ్ములూ, సంపద పోగా, ఒక కన్యా, ఒక అవ్వా, వారి దారిద్ర్యమూ మాత్రమే మిగలటం చేత, వాళ్ళిద్దరూ అక్కడా ఇక్కడా కూలి చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు.

వారి వద్ద అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర, బాగా బతికిన రోజుల్లో శ్రేష్ఠి ఉపయోగించింది. వాడుకలేని కారణం చేత అది మకలపట్టి ఉన్నది. అది బంగారుది అని ఆడవాళ్ళిద్దరూ ఎరగరు. లోభివర్తకుడు, "పణికలు కావాలా? మణికలు కావాలా? "అని కేకవేస్తూ, ఈ ఆడవాళ్ళు ఉంటున్న ఇంటి ముందుకు వచ్చాడు. పణికలు అంటే దండలు; మణికలు అంటే ముంతలు. ఆ కేక విని చిన్నపిల్ల ముసలిదానితో, "అమ్మా నా కేమైనా కొనిపెట్టవా? " అని అడిగింది. " ఏం పెట్టి కొననమ్మా? మన దగ్గర ఏ మున్నదనీ?" అన్నది తల్లి.


"మన దగ్గిర వాడకుండా పాత్ర ఒకటి ఉన్నది గదా, అది పెట్టి కొను," అన్నది కూతురు. పెద్దావిడ లోభివర్తకుణ్ణి లోపలికి పిలిచి, కూర్చోమని, మర్యాద చేసి, అతనికి పాత్ర ఇచ్చి, "బాబూ, ఇది తీసుకుని నీ చెల్లెలికి ఏమైనా వస్తువు ఇయ్యి," అన్నది. లోభివర్తకుడికి ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరగేసి, బోర్లవేసి, తిప్పి తిప్పి చూసి, కడ్డీతో గీరి, అది బంగారమేనని రూఢిచేసుకుని, దాన్ని కాజెయ్యటానికి నిశ్చయించుకుని, "దీనికి ఏం వస్తుందమ్మా? దీని ఖరీదు చాలా స్వల్పం," అంటూ ఆ పాత్రను విసిరి వేసి, లేచి వెళ్ళిపోయాడు.

వర్తకులకు మధ్య ఏర్పరచుకున్న నియమం ప్రకారం ఒకరు వెళ్ళిన వీధికి, వాళ్ళు వెళ్ళి పోయిన అనంతరం రెండవ వాడు వెళ్ళవచ్చు. ఆ కారణం చేత, కొంత సేపటికి బోధిసత్వుడు, ఆ వీధికి వచ్చి,"మణికలు కావాలా?" అంటూ స్త్రీలున్న ఇంటి ముందుకు వచ్చాడు. ఆ కేక విని కూతురు తల్లితో," అమ్మా, ఏదన్నా కొనిపెట్టవే!" అని తల్లిని అడిగింది. " ఆ పాత్ర తప్ప ఏ మున్నదమ్మా? అదీ ఎందుకూ పనికిరాదని ఒక వర్తకుడు విసిరి కొట్టి వెళ్ళిపోయాడాయె.

ఏం పెట్టి కొనమంటావు?" అన్నది తల్లి. " ఆ వర్తకుడు మంచివాడు కాడమ్మా, దుడుకు మనిషి. ఈ వర్తకుడి మాట చూడు ఎంత సౌమ్యంగా ఉన్నదో!" అన్నది కూతురు. తల్లి బోధిసత్వుణ్ణి లోపలికి పిలిచి, పాత్రను అతని చేతికి ఇచ్చింది.  బోధిసత్వుడు దాన్ని చూసి బంగారు పాత్ర అని గ్రహించి, "అమ్మా, ఇది లక్ష విలువచేస్తుంది. దీనికి సమానమైన విలువగల వస్తువులు నా వద్ద లేవు," అన్నాడు  "నాయనా, ఇంకో వర్తకుడు ఇది గుడ్డి గవ్వ చయ్యదని చెప్పి,  విసిరి కొట్టి వెళ్ళి పోయాడు. ఒక వేళ ఇది బంగారమో ఏమో! దీన్ని నువ్వు తీసుకుని, దానికి బదులుగా ఏదన్నా ఇచ్చివెళ్ళు," అన్నది ముసలావిడ.


బోధిసత్వుడు తన వద్ద ఉన్న అయిదు వందల వెండి మాడలూ, అయిదు వందల వెండి మాడలు చేసే పాత్రసామాగ్రీ ఆ ఆడవాళ్ళకు ఇచ్చి, "అమ్మా, ఎనిమిది వెండి మాడలూ, సంచీ, త్రాసూ తప్ప తతిమ్మావన్నీ మీకిస్తున్నాను, తీసుకోండి," అని సువర్ణపాత్ర తీసుకొని బయలదేరాడు. అతను ఉంచుకున్న ఎనిమిది వెండి మాడలూ, నది దాటేందుకు పడవ కిరాయికి పనికివచ్చాయి.

తరువాత లోభివర్తకుడు తాను వేసుకున్న పథకం ప్రకారం ఆ స్త్రీలున్న ఇంటికి వచ్చి, "పాత్ర ఇలా పారేసి, ఏదో ఒకటి తీసుకోండి," అన్నాడు గొప్ప త్యాగం చేస్తున్నట్టుగా. ముసలావిడకు మండుకొచ్చింది. ఆమె ఆ లోభితో,  "ఏం, నాయనా? లక్ష విలువ చేసే పాత్ర ఠోలీ విలువచెయ్యదంటివిగా! నువ్వు వెళ్ళిన తరువాత ఇంకో ధర్మాత్ముడు ఇక్కడికి వచ్చి, వెయ్యిమాడల విలువ ఇచ్చి ఆ పాత్రను తీసుకుపోయాడు!" అన్నది.

ఈమాట వినగానే లోభివర్తకుడి మతి పోయినట్టయింది."లక్ష చేసే పాత్రను వాడుకాజేశాడా? నాకు ఇంత నష్టం కలిగించాడా?" అంటూ వాడు ఆవేశపడిపోయి, ఏడుస్తూ, మతి పూర్తిగా చెడి, తన సరుకులూ, డబ్బూ ఆ ఆడవాళ్ళ దగ్గిరే వదిలేసి,  పైబట్ట జారిపోయినది కూడా తెలియకుండా,  త్రాసు చేతబట్టుకుని నదీతీరానికి పరుగు, పరుగున వెళ్ళాడు. అతడికి, బోధిసత్వుడు పడవలో నది దాటుతూండటం కనబడింది.

లోభివాడు పడవను వెనక్కు రమ్మని కేక పెట్టాడు. వెనక్కు పోవద్దని పడవ వాడితో బోధిసత్వుడు అన్నాడు. బోధిసత్వుడు అవతలి ఒడ్డుచేరటం చూడగానే లోభివాడి ఆవేశం కట్టలు తెంచుకున్నది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. నోట రక్తం వెలువడింది. బోధిసత్వుడి మీది ద్వేషంతో గుండె పగిలి, లోభివర్తకుడు అక్కడే ప్రాణాలు వదిలాడు. బోధిసత్వుడు దానాలూ, పుణ్య కార్యాలూ చేస్తూ జీవించాడు.


No comments:

Post a Comment