Pages

Wednesday, September 19, 2012

తానుతవ్విన గొయ్యి

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడనే పురోహితుడు ఉండేవాడు. ఆయన శరీరచ్ఛాయ పింగళ వర్ణం, ఆయన తల బట్టతల, నోరు బోసినోరు. బోధిసత్వుడు తక్కారియుడనే యువకుడుగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు.
రాజపురోహితుడైన పింగళుడికి ఒక బావ మరిది ఉన్నాడు. ఆయన కూడా పింగళ వర్ణమూ, బట్టతలా, బోసినోరూ కలవాడు. అంతేగాక పింగళుడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడా. బావమరుదులిద్దరూ ఒకరి కంటే మరొకరు గొప్పవారమని తలచడంవల్ల ఇద్దరి మధ్యా బద్ధవైరం ఉంటూ వచ్చింది. తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా యత్నాలు చేశాడుగాని, అవేవీ ఫలించలేదు.
చిట్టచివరకు పింగళుడు తన బావమరిదిని చంపెయ్యటానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి, ‘‘మహా ప్రభూ, మన కాశీనగరం భారత దేశానికంతటికీ అత్యుత్తమ నగరం. తాము దేశంలోని రాజులందరిలోకీ చాలా గొప్పవారు. అలాంటప్పుడు మన కోటలోనే నిర్మాణ లోపం ఉండటం శోచనీయం. మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పున్నది. అది మనకు ఎంతో అశుభం. మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడానూ. ఉపేక్షించకుండా ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలి,'' అని చెప్పాడు.
‘‘అందుకుగాను మనం ఏం చేయాలి?'' అని రాజుగారు పింగళుణ్ణి అడిగారు. ‘‘ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి. తర్వాత, శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయించాలి. అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి, శుభ ముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి,'' అన్నాడు పింగళుడు.

రాజుగారు సమ్మతించాడు. ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు. దాని స్థానంలో ఏర్పరచటానికిగాను కొత్త ద్వారం త్వరగానే తయారయింది కూడా.
పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, ‘‘మహారాజా, కొత్త ద్వారం తయారయింది. అది నిలబెట్టటానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది. అవసరం అయిన బలి జరిపి ద్వారం నిలబెట్టటానికి తమ అనుమతి ఇవ్వండి!'' అన్నాడు వినయంగా.
‘‘బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి?'' అని రాజుగారు అడిగాడు. ‘‘పింగళ వర్ణమూ, బట్టతలా, బోసినోరూ గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది, మహారాజా! ఈ ద్వారాన్ని సంరక్షించే మహా శక్తులను అలాటి బ్రాహ్మడి రక్తమాంసాలతో ముందుగా తృప్తిపరచాలి. ఆ తరవాత ఆ బ్రాహ్మణ్ణి అక్కడే పాతిపెట్టి, పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి,'' అన్నాడు పింగళుడు.
‘‘సరే, అలాంటి బ్రాహ్మణ్ణి వెతికి తెప్పించి, ద్వారం పెట్టించు!'' అన్నాడు రాజుగారు.
తనకు ప్రబల శత్రువైన బావమరిదిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికిందిగదా అని పింగళుడికి పరమానందం కలిగింది. ఆయన ఇంటికివెళ్ళి తన భార్యతో, ‘‘ఇదుగో, రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది! వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను, చూసుకో!'' అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు.
‘‘మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి? దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు?'' అని పింగళుడి భార్య అడిగింది.


‘‘ఫలానివాణ్ణి బలి ఇస్తానని నేను రాజు గారితో చెప్పానా ఏమిటి? పింగళ వర్ణమూ, బోసి నోరూ గల బ్రాహ్మడు బలికి కావాలన్నాను, రాజుగారు సరేనన్నారు! రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి, వాడు బలికి పనికి వస్తాడంటాను. ఎవరు కాదంటారు?'' అన్నాడు పింగళుడు.
పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక, తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురుచేసి, ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారే లోపుగా ఊరు దాటి వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చింది.
తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నమంతా తెలియగానే ఆయన బావ మరిది, తనలాగే పింగళ వర్ణమూ, బోసి నోరూ, బట్ట తలా ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకుని, ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు.
మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, ‘‘మహారాజా, బలికి కావలసినటువంటి మనిషి ఫలాని చోట ఉంటాడు, వాణ్ణి ఇక్కడికి పిలిపించండి!'' అని చెప్పాడు. వెంటనే రాజుగారు తన భటులను పంపాడు.
వారు పింగళుడు చెప్పిన చోటికి వెళ్ళి, అక్కడ ఉండే మనిషి క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళి పోయినట్టు తెలుసుకుని, ఆ విషయం రాజు గారికి చెప్పటానికి తిరిగి వచ్చారు.
భటులు చెప్పిన సంగతి వినగానే రాజు గారు, ‘‘అరెరే, ఇప్పుడేం చేసేటట్టు? అలాటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి!'' అన్నాడు.

దానికి మంత్రులు, ‘‘ఇదేమంత పెద్ద సమస్య, మహారాజా? మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయిగదా! ఆయననే బలి ఇప్పించండి!'' అని రాజుకు సలహా ఇచ్చారు.
‘‘అలాగే చేయవచ్చుగాని, నాకు పురోహితుడు లేకుండాపోతే ఎలా? అందుకు తగినవాడు మరెవడైనా ఉన్నాడా? ఆ సంగతి ముందు ఆలోచించండి,'' అన్నాడు రాజు.
‘‘మన పురోహితుడి వద్ద తక్కారియుడనే శిష్యుడున్నాడు. అతను గురువు కన్న కూడా తెలివిగలవాడని పేరు పడ్డాడు. అతన్ని తమరు పురోహితుడుగా పెట్టుకోవచ్చు,'' అని మంత్రులు చెప్పారు.
వెంటనే రాజుగారు తక్కారియుణ్ణి పిలిపించి, ‘‘నిన్ను ఇకనుంచీ నా పురోహితుణ్ణిగా నియమిస్తున్నాను. నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా బలి ఇచ్చి, పాతి పెట్టించి, ఆయన మీదుగా ద్వారం పెట్టించు!'' అని ఆజ్ఞాపించాడు.
తక్కారియుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు. పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులూ, కాళ్ళూ బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు. బలి జరిపే నిమిత్తమై, ద్వారం ఏర్పాటు కావలసిన చోట, ఒక లోతైన గొయ్యి తవ్వి ఉన్నది. ఆ గోతిలోకి గురుశిష్యులిద్దరూ ప్రవేశించారు.
పింగళుడు వలవలా ఏడుస్తూ, ‘‘ఒరే శిష్యా! ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను గదరా!'' అన్నాడు.
‘‘స్వామీ, పనిగట్టుకొని పరులకు కీడు చేయాలని చూసేవాడు ఎప్పటికయినా తాను తీసుకున్న గోతిలో తాను పడక తప్పదు. మీరేమీ విచారించకండి. నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రిదాకా లేదని చెబుతాను. ఆ తరవాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడతాను!'' అన్నాడు తక్కారియుడు.
అతను ఆ ప్రకారమే పలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు. ఆ రాత్రి చీకటిలో అతను పింగళుణ్ణి ఊరు విడిచి పారిపొమ్మని, ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పించేసి, తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ఠ చేయించాడు.

No comments:

Post a Comment