Pages

Sunday, September 9, 2012

తండ్రిని ఉప్పులాగా ప్రేమించిన యువరాణి


ఒకానొకప్పుడు పరమ గర్విష్ఠి అయిన ఒక రాజుకు ఏడుగురు కుమార్తెలు ఉండేవారు. యుక్త వయస్కులయ్యూక వారికి వివాహాలు జరిపించాలని రాజు నిర్ణయించాడు. అంతకు ముందు తన కుమార్తెలు తనను ఎవరెవరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలన్న వింత కోరిక రాజుకు కలిగింది. వెంటనే వారిని పిలిపించి, ‘‘మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో, ఒక్కొక్కరుగా చెప్పండి,'' అన్నాడు.
 
‘‘నాన్నా, నేను నిన్ను తియ్యటి పంచదారను ప్రేమించినట్టు ప్రేమిస్తున్నాను,'' ‘‘మధురమైన తేనెలా ప్రేమిస్తున్నాను,'' ‘‘తియ్యటి మిఠాయిలా ‘ప్రేమిస్తున్నాను,'' అంటూ ఆరుగురు పెద్ద కూతుళ్ళూ ఒకరితో ఒకరు పోటీపడి తమ మనోభావాలను వెలిబుచ్చారు. ఆ మాటలు విని రాజు పరవసించి పోయూడు. ఆ తరవాత మౌనంగా ఉన్న చిన్న కుమార్తెను దగ్గరికి పిలిచి, ‘‘నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, చెప్పు తల్లీ,'' అన్నాడు ఆప్యాయంగా.
 
‘‘నాన్నా, నేను మిమ్మల్ని చాలా గొప్పగా ఉప్పులాగా ప్రేమిస్తున్నాను,'' అన్నదామె మృదువైన కంఠస్వరంతో. ఆ మాట విని రాజు దిగ్భ్రాంతి చెందాడు.

తను ఎంతగానో ప్రేమించే చిన్న కూతురు ఇంత తేలిగ్గా తీసిపారేసిందేమిటి అనుకుంటూ, ‘‘నిరుపేదలకుసైతం అందుబాటులో ఉండే ఉప్పుతో నన్ను పోలుస్తూ గొప్పగా ప్రేమిస్తున్నాను అంటావేమిటి? అదెలా సాధ్యం? నన్నెలా ప్రేమిస్తున్నావో చెప్పు,'' అని అడిగాడు రాజు ఆశ్చర్యమూ కోపమూ కలిసిన కంఠస్వరంతో. అయితే, యువరాణి మళ్ళీ, ‘‘నేను నిజమే చెబుతున్నాను నాన్నా! మిమ్మల్ని ఉప్పులాగానే ప్రేమిస్తున్నాను,'' అన్నది.

ఆ మాటతో రాజు అమితాగ్రహానికి లోనయ్యూడు. పెద్ద కుమార్తెలారుగురికీ రాకుమారులతో వివాహాలు జరిపించాడు. ఏడవ కూతురిని అడవి సమీపంలో కట్టెలు కొట్టుకుని పొట్టపోసుకునే ఒక నిరుపేదవాడికి కట్టబెట్టాలని నిర్ణయించాడు. తండ్రి నిర్ణయూనికి యువరాణి మౌనంగా రోదించింది. అయినా, తండ్రిని తను ఎంతగా ప్రేమిస్తున్నదీ తండ్రి అర్థంచేసుకునేలా చేయూలని నిశ్చయించింది.
 
పెళ్ళయ్యూక భర్త వెంట అతడి గుడిసెకు బయలుదేరింది. మరునాడు భర్త అడవికి బయలుదేరుతూండగా, ‘‘మీరు రోజూ తిరిగి వచ్చేప్పుడు అడవినుంచి ఏదైనా కానుక తీసుకురావడానికి మరిచిపోకండి. అది మనలను త్వరలో సంపన్నులను చేస్తుంది,'' అన్నదామె. భర్త అందుకు వెంటనే అంగీకరించాడు. ఆ రోజు అతడు అడవిలో కట్టెలు కొట్టడానికి బాగా ఆలస్యమైపోయింది. అతడు కట్టెల మోపుతో తిరుగు ప్రయూణమయ్యేసరికి సూర్యుడు అస్తమించాడు.
 
భార్య చెప్పిన కానుక మాట గుర్తురావడంతో ఏం చేయడమా అని కంగారు పడ్డాడు. కాలికి అడ్డంగా ఏదో మెత్తగా తగిలింది. అది పొడవుగా ఉండడంతో దారం అని భావించి దాన్నయినా తీసుకువెళ్ళి భార్యకు ఇద్దామని వంగితీసుకున్నాడు. ఇంటిని సమీపించగానే భార్యకు ఇచ్చాడు. దాన్ని దీపం వెలుగులో చూసిన యువరాణి, ‘‘చచ్చిన పామును తెచ్చారేమిటి?'' అని అడిగింది. భయంకరమైన పొరబాటు జరిగిపోయినందుకు వాడు నొచ్చుకుని, ‘‘ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం?'' అని అడిగాడు భార్యను.
 
‘‘గుడిసె పైకప్పు మీదికి విసిరివేయండి. ఉదయం లేచాక ఏం చేద్దామో ఆలోచిద్దాం,'' అన్నది ఆమె. ఇక్కడ ఇలా ఉండగా, అక్కడ రాజధానిలో మహారాణి తన గారాల చిన్న కూతురికి జరిగిన అన్యాయూనికి తల్లఢిల్లి పోయింది. అయినా రాజుకు ఎదురు చెప్పలేక విచారంతో ఉద్యానవనంలో తిరుగుతూండగా, ఆమె మెడలోని వజ్రాలహారం జారి కింద పడిపోయింది. దుఃఖంలో మునిగి వుండడంవల్ల ఆమె దానిని గమనించలేదు. మౌనంగా రాజభవనానికి తిరిగివెళ్ళింది. రాజోద్యానం మీద తిరుగుతూన్న ఒక డేగ మెరుస్తూన్న వజ్రాల హారాన్ని చూసింది.

కిందికి వాలి దాన్ని ముక్కున కరుచుకుని అడవికేసి ఎగిరి వెళుతూ, కట్టెలు కొట్టేవాడి గుడిసె మీద ఉన్న చచ్చిన పామును చూసింది. వెంటనే ఆ గుడిసె మీద వాలి, వజ్రాల హారాన్ని అక్కడ పడేసి చచ్చిన పామును తన్నుకుని ఎగిరివెళ్ళింది. అదే సమయంలో రాజభవనంలో మహారాణి వజ్రాల హారం కనిపించలేదని వెతకసాగారు.
 
ఎలాగైనా దాన్ని మళ్ళీ తెప్పిస్తానని రాజు రాణిగారికి మాట ఇచ్చాడు. ఆ తరవాత రాణిగారి వజ్రాల హారం ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి ఇచ్చినవారికి కోరిన బహుమతి ఇస్తానని రాజ్యం నాలుగు చెరగులా చాటింపు వేయమని భటులను ఆజ్ఞాపించాడు. మరునాటి ఉదయం కట్టెలు కొట్టేవాడు ఇంటి కప్పు మీదికి విసిరిన చచ్చిన పామును తీసివేద్దామని నిచ్చెన వేసి ఇంటి కప్పు మీదికి ఎక్కాడు. అక్కడ మిలమిలా మెరుస్తూన్న హారాన్ని చూసి బిత్తరపోయి, ‘‘యువరాణీ! ఇలా వచ్చి చూడు. ఇంటి కప్పు మీద ప్రకాశం!
 
కప్పుకు నిప్పంటుకుందేమో చూడు!'' అంటూ కేకలు పెట్టసాగాడు. యువరాణి వచ్చి చూసి నవ్వుతూ, ‘‘అది నిప్పు కాదు. మా తల్లిగారి విలువైన వజ్రాల హారం! విధియే దాన్ని మన దగ్గరికి చేర్చింది. నన్ను మా తండ్రిగారు సరిగ్గా అర్థం చేసుకునేలా చేయడానికి మంచి అవకాశం దొరికింది!'' అన్నది. ఆమె మాట ముగించే లోపలే దండోరా శబ్దం, ఆ తరవాత, ‘‘అందరూ వినండహో! మహారాణిగారి అమూల్యమైన వజ్రాల హారం కనిపించడం లేదు. అది దొరికితే, తెచ్చి అప్పగించే వారికి కోరిన బహుమతి ఇవ్వబడుతుంది! ఇది రాజుగారి ప్రకటన! అందరూ వినండహో!'' అన్న భటుల చాటింపు వినిపించింది.
 
యువరాణి భర్త కేసి తిరిగి, ‘‘నువ్వు వెంటనే వజ్రాలహారంతో వెళ్ళి దాన్ని మహారాజుకు అప్పగించు. నువ్వు ఎవరు అన్నది చెప్పవద్దు. ఎలాంటి బహుమతినీ కోరవద్దు. రేపు మధ్యాహ్నం మహారాజు వచ్చి మన ఇంట్లో భోజనం చెయ్యూలి. అదే ఆయన మీకిచ్చే బహుమతిగా చెప్పండి,'' అన్నది.
 
కట్టెలు కొట్టేవాడు అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళి, రాజును సందర్శించి వజ్రాల హారాన్ని అప్పగించి, ‘‘మహారాజా! మహారాణిగారి వజ్రాల హారాన్ని విధి మా ఇంటి కప్పు మీదికి చేర్చింది,'' అన్నాడు.హారాన్ని తీసి పరిశీలనగా చూసిన మహారాజు, ‘‘మహారాణి పోగొట్టుకున్న వజ్రాల హారం ఇదే. తెచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఏం బహుమతి కావాలో కోరుకో. ఇప్పుడే ఇస్తాను,'' అన్నాడు ఎంతో ఆనందంగా.

‘‘నేను కట్టెలు కొట్టుకుని బతికే ఒక నిరుపేదను. నాకు ఎలాంటి బహుమతీ వద్దు. మహారాజుగారు రేపు ఒంటరిగా మా ఇంటికి వచ్చి మాతో కలిసి భోజనం చేస్తే, అదే మహాభాగ్యంగా భావిస్తాను,'' అన్నాడు కట్టెలు కొట్టేవాడు వినయంగా. వాడి కోరిక విని రాజు ఒక్క క్షణం విస్మయం చెందాడు. అయినా ఆహ్వానాన్ని మన్నించక తప్పలేదు.
 
చెప్పిన ప్రకారం మరునాడు రాజు ఒంటరిగా కట్టెలు కొట్టే వాడి గుడిసెకు వెళ్ళాడు. అక్కడున్న యువరాణి, ముఖం కనిపించకుండా మేలి ముసుగు వేసుకుని ఎదురువచ్చిరాజుకు నమస్కరించి మౌనంగా గుడిసెలోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. ఆ తరవాత రకరకాల మధురమైన పిండివంటలను వడ్డించింది. మహారాజు వాటిని తిన్నాక మరికొన్ని మధుర పదార్థాలు వడ్డించింది. వాటిని ముగించాక ఇంకా కొన్ని తీపి వంటకాలను వడ్డించ బోయింది.
 
కాని రాజు అడ్డుకుంటూ, ‘‘క్షమించు తల్లీ, ఇక ఒక్క ముక్క కూడా తినలేను. జబ్బు చేస్తుంది. వెగటు పుట్టిస్తోంది. ఏదైనా ఉప్పగా ఉంటే ఇవ్వు తింటాను,'' అన్నాడు. వెంటనే యువరాణి మేలిముసుగును తొలగిస్తూ, ‘‘ఇప్పుడు తెలిసిందా నాన్నా ఉప్పు విలువ! తమరిని నేను ఉప్పులాగా ప్రేమిస్తున్నాను అని చెప్పినందుకు ఆరోజు ఆగ్రహించారు. ఇవాళ తీపి పదార్థాలు వద్దు, ఉప్పటి వంటకం కావాలంటున్నారు,'' అన్నది. రాజు అవాక్కయి పోయూడు.
 
ఆనాటి తన చర్యకు సిగ్గు పడి తల పంకిస్తూ, ‘‘నన్ను క్షమించు తల్లీ! ఉప్పువిలువ తెలుసుకోలేక పోయూను. తక్కిన వారికన్నా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఇప్పుడు అర్థమయింది,'' అన్నాడు. యువరాణి తండ్రికి మళ్ళీ ఒకసారి నమస్కరించి ఆప్యాయతతో ఆయన చేతులు పట్టుకున్నది.
 
కుమార్తె తెలివినీ, మంచితనాన్నీ గ్రహించిన రాజు ఆమెను రాజభవనానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. తన రాజ్యంలో కొంత భాగాన్ని ఆమెనూ ఆమె భర్తనూ పాలించుకోమని ఇచ్చాడు. వాళ్ళు చక్కగా పరిపాలిస్తూ, మహారాజు ఉన్నంత వరకు ఆయన్ను ఎంతో అభిమానంగా చూసుకున్నారు.

No comments:

Post a Comment