భీమసేనుడికీ, హిడింబకూ జన్మించిన ఘటోత్కచుడు తండ్రికి సాటి రాగల
బలపరాక్రమాలూ, తల్లికి మించిన రాక్షస మాయలూ ప్రదర్శించిన వీరుడు. రాక్షసి
కడుపున పుట్టినప్పటికీ సద్వర్తనుడు. పాండవులకు విధేయుడై వారికి అండగా
నిలబడ్డాడు. అతడి జన్మవృత్తాంతం చాలా ఆసక్తి కరమైనది: పాండవులు
వారణావతంలోని లక్క ఇంటి నుంచి తప్పించుకుని అర్ధరాత్రి సమయంలో సొరంగ మార్గం
గుండా అరణ్యం చేరారు.
కటిక చీకటిలో చాలా దూరం నడిచి గంగానదిని దాటి దక్షిణ దిశగా వెళ్ళారు.
చాలాసేపు నడిచి బాగా అలిసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకున్నారు. భీముడు
వాళ్ళకు కాపలా కాయసాగాడు. ఆ వనంలో హిడింబుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు
ఆహారం కోసం అరణ్యమంతా తిరిగి, ఒక మద్ది చెట్టెక్కి జుట్టు విదిలించుకుంటూ,
ఆవులిస్తూ చూస్తూండగా, వాడికి దూరాన మర్రి చెట్టు కింద పడుకుని కొందరు
మనుషులు కనిపించారు.
వాడు తన చెల్లెలైన హిడింబను పిలిచి, ‘‘ఆ మర్రి చెట్టు కింద
నిద్రపోతూన్న వారిని చంపి తీసుకురా, కడుపు నిండా తిందాం,'' అన్నాడు. హిడింబ
సరేనని బయలుదేరి పాండవులున్న చోటికి వచ్చి, నిద్రపోతూన్న కుంతినీ,
ధర్మరాజునూ, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనూ; వారికి కాపలా కాస్తున్న భీముణ్ణీ
చూసింది. హిడింబ కంటికి భీముడు నవమన్మథుడిలా కనిపించాడు.
వెంటనే సుందరమైన రూపం ధరించి, సిగ్గుతో కూడిన చిరునవ్వులు చిందిస్తూ
వచ్చి భీముడితో, ‘‘మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్నందరినీ చంపి
ఆహారంగా తెమ్మని మహాబలుడైన రాక్షసుడైన మా అన్న నన్ను పంపాడు. కానీ నిన్ను
చూడగానే నాలో నిన్ను పెళ్ళాడాలనే కోరిక కలిగింది. నన్ను పెళ్ళాడి నా కోరిక
తీర్చావంటే మీకు మా అన్న భయం లేకుండా కామగమనం గుండా మిమ్మల్ని ఈ క్షణమే
సురక్షిత ప్రాంతానికి చేరుస్తాను,'' అన్నది.
వెళ్ళిన హిడింబ రావడానికి ఆలస్యం కావడంతో హిడింబుడు అక్కడికి వచ్చి
చెల్లెలి అందమైన రూపం చూసి, మండిపోయి, ‘‘వాళ్ళను చంపి తీసుకురమ్మంటే,
మానవరూపంతో వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి చూస్తున్నావా? మొదట వాళ్ళను
చంపి, నీ ప్రాణం కూడా తీస్తానుండు,'' అంటూ భీముడితో తలపడ్డాడు. భీముడు
వాణ్ణి దూరంగా లాక్కు పోయూడు. ఇద్దరికీ ఘోరంగా యుద్ధం జరిగింది. భూమి
అదిరింది. చెట్టు చేమలు కూలాయి. హిడింబుడు భయంకరంగా పెడబొబ్బ పెట్టాడు.
అరుణోదయమవుతూండగా భీముడు హిడింబుణ్ణి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి
కొట్టి, నడుమువిరిచి చిత్రవధ చేశాడు. హిడింబుడు పెద్దగా అరుస్తూ ప్రాణాలు
వదిలాడు. అంతలో హిడింబ తన గురించీ, తన అన్న గురించీ-కుంతీదేవికీ,
ధర్మరాజుకూ వివరించి, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆమెను
వివాహమాడడానికి భీముడు మొదట వెనుకాడినప్పటికీ, తల్లీ, అన్నా చెప్పడంతో
హిడింబకు కొడుకు పుట్టేంతవరకూ ఆమెను తన భార్యగా చూసుకోవడానికి
ఒప్పుకున్నాడు.
హిడింబ భీముణ్ణి తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఇద్దరూ పర్వత
శిఖరాలపైనా, కొండ గుహల్లోనూ, నదీ తీరాలా, సరస్సులవద్దా, అందమైన
పొదరిళ్ళలోనూ విహరించారు. కాలక్రమాన హిడింబ గర్భవతియై ఒక కొడుకును కన్నది.
వాడు పుట్టుతూనే కామరూపుడై, అప్పటికప్పుడే పెరిగి పెద్దవాడే
తల్లిదండ్రులకు, పెద్దలకు మ్రొక్కి నిలబడ్డాడు. వాడి నెత్తిన ఒక్క వెంట్రుక
కూడా లేకుండా ఉండడం వల్ల వాడికి ఘటోత్కచుడు అంటే కేశరహితమైన కుండలాంటి తల
కలిగినవాడు అనే పేరు పెట్టారు.
ఘటోత్కచుడు పెద్దలకు మ్రొక్కి, ‘‘మీకు నా వల్ల ఏదైనా పనిపడితే నన్ను
తలుచుకోండి. తక్షణమే మీ ఎదుట నిలుస్తాను,'' అని చెప్పి ఉత్తర దిశగా
బయలుదేరాడు. మహావీరుడిగా రాక్షసులకు నాయకుడై మేఘవర్ణుడు, అంజన పర్వుడు అనే
ఇద్దరు కొడుకులను కన్నాడు. మహాభారత యుద్ధంలో కౌరవ సేనలను ముప్పుతిప్పలు
పెట్టి చీల్చి చెండాడాడు. భగదత్తుడికీ, ఘటోత్కచుడికీ యుద్ధం చిత్రంగా
జరిగింది.
భగదత్తుడు పెద్ద ఏనుగును ఎక్కి పాండవ సైన్యాన్ని చిందరవందర చేశాడు.
తమను కాపాడేవాళ్ళు లేక పాండవసేనలు పారిపోయూయి. ఘటోత్కచుడు అకస్మాత్తుగా
మాయమయ్యూడు. కౌరవ సేనలలో హాహాకారాలు చెలరేగాయి. ఘటోత్కచుడు మళ్ళీ కనిపించి
భగదత్తుడి మీద బాణవర్షం కురిపించి అదృశ్యమయ్యూడు. అర్జున కుమారుడైన
ఇరావంతుడు భయంకరంగా యుద్ధం చేసి మూర్ఛపోయి ఉన్నప్పుడు ఆర్షభృంగుడనే
రాక్షసుడు కత్తితో అతణ్ణి నరికి చంపాడు.
దానిని చూసి ఘటోత్కచుడు ఆగ్రహోదగ్రుడై భయంకరాకారంతో చేతిలో మెరిసే
శూలాన్ని పట్టుకుని రాక్షసగణాలతో కౌరవ సేనల మీద విరుచుకు పడ్డాడు.
దుర్యోధనుడు ఘటోత్కచుడికి ఎదురు వచ్చి సింహనాదం చేశాడు. అతడి వెనకగా ఏనుగుల
సేన వచ్చింది. రాక్షసులు ఏనుగు సేనల మీద పడి ధ్వసం చేయసాగారు. ఘటోత్కచుడు
దుర్యోధనుణ్ణి ఎదుర్కొని, తన చేతిలోని శక్తిని అతడిపై విసిరాడు. అంతలో
వంగదేశపు రాజు తను ఎక్కిన ఏనుగును దుర్యోధనుడి రథానికి అడ్డంగా తోలాడు.
ఘటోత్కచుడు విసిరిన శక్తి తగిలి ఆ ఏనుగు కూలిపోయింది. వంగరాజు దానిపై
నుంచి కిందికి దూకి తప్పించుకుని పారిపోయూడు. ఘటోత్కచుడు విజృంభించి
భయంకరంగా అరుస్తూ దుర్యోధనుణ్ణి పీడించసాగాడు. భీష్ముడి సలహా మేరకు
ద్రోణుడు-సోమదత్తుడూ, సైంధవుడూ మొదలైన వీరులతో కలిసి దుర్యోధనుడికి సాయంగా
వెళ్ళాడు. ఘటోత్కచుడు వాళ్ళందరినీ కూడా భయంకరంగా హింసించాడు.
అంతలో ధర్మరాజు కోరిక మేరకు అభిమన్యుడూ, ఉపపాండవులూ మొదలైన వారిని
వెంటబెట్టుకుని భీముడు ఘటోత్కచుడికి సాయంగా వెళ్ళాడు. ఉభయ పక్షాలకూ జరిగిన
యుద్ధంలో పాండవులదే పైచెయ్యి అయింది. ఆ తరవాత దుర్యోధనుడు భీముణ్ణి
ఎదుర్కొన్నాడు. భీముడు దెబ్బ తినడంతో ఘటోత్కచుడూ, అభిమన్యుడూ మొదలైన
పాండవవీరులు దుర్యోధనుణ్ణి చుట్టు ముట్టారు. అది తెలిసి ద్రోణుడు కౌరవ
వీరులను వెంటబెట్టుకుని దుర్యోధనుడికి సాయంగా వచ్చాడు.
అప్పుడు సాగిన యుద్ధంలో ఘటోత్కచుడు రాక్షస మాయలు ప్రయోగించి
శత్రుసేనలకు దిగ్భ్రమ కలిగించాడు. ఘటోత్కచుడి దెబ్బకు తట్టుకోలేక కౌరవ
సైన్యాలు చెల్లాచెదరై శిబిరాలకేసి పరిగెత్తసాగాయి. ఆ తరవాత భీష్ముడి సలహా
ప్రకారం భగదత్తుడు సుప్రతీకమనే ఏనుగు నెక్కి పాండవుల సేనల మీదికి వెళ్ళాడు.
ఘటోత్కచుడు ఎదుర్కొన్నాడు. ఇరువురికీ భీకరంగా యుద్ధం జరిగింది. ఆపిమ్మట
భీష్ముడు యుద్ధ రంగంలో దిగి పాండవ సేనలను నాశనం చేశాడు.
ఆఖరికి శిఖండిని అడ్డు పెట్టుకుని వచ్చిన అర్జునుడిపై బాణాలు
ప్రయోగించలేక, అంపశయ్య పాలయ్యూడు. ఆ తరవాత యుద్ధానికి వచ్చిన కర్ణుడు,
ఆర్షభృంగుణ్ణీ, అలాయుధాసురుణ్ణీ సంహరించి తన మీదికి వచ్చిన ఘటోత్కచుడి
ధాటికి తట్టుకోలేకపోయూడు. అన్నాళ్ళు అర్జునుడి మీద ప్రయోగించాలని భద్రంగా
ఉంచిన ఇంద్రుడిచ్చిన శక్తిని ఘటోత్కచుడి మీదికి ప్రయోగించడంతో అతడు వీరమరణం
పొందాడు.
No comments:
Post a Comment