కామేశం మొక్కు తీర్చుకునేందుకు ఒక రోజు రామేశాన్ని తోడు తీసుకుని
కాలినడకన చిన్నాపురం బయలుదేరాడు. దారిలో పెద్ద వానపడి ఇద్దరూ బాగా
తడిసిపోయూరు. వెంటనే కామేశానికి జలుబు చేసి తుమ్ములు ప్రారంభమయ్యూయి.
‘‘రోజూస్నానం చేశాక రెండు తులసాకులు తిను. జలుబన్నది రాదు. అందుకు నేనే
నిదర్శనం,'' అన్నాడు రామేశం. ‘‘తులసాకులు తిన్నా, జలుబురాక తప్పదు,
నువ్వూరుకో,'' అన్నాడు కామేశం విసుగ్గా.
చిన్నాపురం చేరాక వైద్యుడి వద్దకు వెళ్ళారు. రామేశం ఆయనతో, ‘‘రోజూ
తులసాకులు తింటే జలుబు రాదన్నాను. నమ్మడు. జలుబంటూ వస్తే దానికి మందు
లేదన్నాను. వినడు. నువ్వు చెబితే వింటాడేమో చూడు,'' అని కామేశం మీద
ఫిర్యాదు చేశాడు. వైద్యుడు అతణ్ణి గుర్రుగా చూసి, ‘‘నా దగ్గరికి
వచ్చేవాళ్ళలో సగం మంది జలుబు రోగులే. అది రాకుండా ఆపే చిట్కా ఉందనీ,
వచ్చినా మందు అక్కరలేదనీ చెప్పడమంటే నేను వృత్తి మానుకుని పోవాలి,'' అంటూ
కామేశానికి మూడు రోజులకు సరిపడా మందిచ్చాడు.
రామేశాన్ని వైద్యుడు కూడా తప్పు పట్టినందుకు మనసులో నవ్వుకున్న కామేశం
ఆరోజుకు మందువేసుకుని, రామేశంతో కలిసి గుడికి బయలుదేరితే ఆయనకు మళ్ళీ
మళ్ళీ తుమ్ములొచ్చాయి. ‘‘నేను చెప్పానుకదా. మందులు వేసుకున్నా మూడు
రోజులవరకు తగ్గదని. నా మాట విని రోజూ తులసాకులు తినడం ప్రారంభించు,''
అన్నాడు రామేశం.
‘‘అబ్బా! తులసాకుల సొద వదలవుకదా!'' అని విసుక్కున్నాడు కామేశం. ఇద్దరూ
గుడి మెట్లెక్కుతూంటే అక్కడ ఒకడు ఆగకుండా తుమ్ముతున్నాడు. రామేశం అతనికి
తులసాకుల సలహా ఇవ్వడానికి వెళ్ళాడు. అంతలో అక్కడికి వచ్చిన ధనరాజు అనే
వ్యక్తి కామేశానికి నమస్కరించి, ‘‘శ్రీనివాసుడి గుడికి వచ్చే భక్తుడి నుంచి
ఇరవై వరహాలు దానంగా పుచ్చుకుని వ్యాపారం ప్రారంభిస్తే అచ్చివస్తుందని ఒక
సాధువు చెప్పాడు.
తమరు సాయం చేయగలరా?'' అని అడిగాడు. అప్పుడు కామేశానికి అతణ్ణి
ఉపయోగించి రామేశాన్ని ఆటపట్టించాలనిపించి, అతనికి రామేశాన్ని చూపించి,
‘‘నువ్వాయన దగ్గరికి ఒకరొక్కరుగా మనుషుల్ని పంపి-జలుబురాకుండా ఏం చేయూలని
అడగమను. ఆయన చెప్పింది విని ఎకసక్కెంగా బదులిమ్మను. ఆయన్ను ఎకసక్కెం చేసిన
వారెంత మంది ఉంటే అన్ని వరహాలు నీకిస్తాను,'' అన్నాడు.
ధనరాజు సరేనని ఆయన చెప్పినట్టు చేశాడు. రామేశం మెట్లెక్కుతూ తనను
అడిగిన ఒక్కొక్కరికీ ఓపికగా తులసాకుల సలహా ఇచ్చాడు. బదులుగా, ‘‘మా ఊళ్ళో
తులసి మొక్కలు లేవు ఉసిరాకులు తినవచ్చా?'' అన్నాడొకడు. ‘‘నాకు జ్ఞాపకశక్తి
తక్కువ. రోజూ మా ఇంటికి వచ్చి గుర్తు చేస్తావా?'' అన్నాడు ఇంకొకడు. అలా
ఒక్కొక్కరే రామేశాన్ని వేళాకోళం చేస్తుంటే కామేశానికి చాలా సంతోషం
కలిగింది.
కొంత సేపయ్యూక ఒకడు ధనరాజు చెయ్యి పట్టుకుని రామేశం దగ్గరికి
లాక్కెళ్ళి, ‘‘అయ్యూ, ఇతగాడికి మీరంటే ఎగతాళిగా ఉన్నట్టుంది,'' అంటూ
జరిగింది చెప్పి వెళ్ళాడు. రామేశం ధనరాజువంక చూశాడు. అతడు ఏం చెప్పాలో
తెలియక కామేశం వంక చూస్తే ఆయన, ‘‘అవును రామేశం, మనమేం చేసినా దానివల్ల
కలిగే లాభం-నష్టం బేరీజు వేయూలి. చాదస్తం వల్ల నీకేం లాభం లేదు. నవ్వులపాలు
చేస్తుంది. నీకది తెలియూలనే ఈ నాటక మాడించాను,'' అంటూ ధనరాజు కథ చెప్పాడు.
‘‘నా స్వానుభవంలోని తులసాకుల వైద్యం వల్ల ఒక్కడు బాగుపడినా నాకది
లాభమే. ఆ ప్రయత్నంలో నన్ను చూసి వెయ్యిమంది నవ్వినా, ఎకసక్కెం చేసినా
నాక్కలిగే నష్టం ఏమీ లేదు,'' అన్నాడు రామేశం నవ్వుతూ. అప్పుడు ధనరాజు
రామేశానికి చేతులు జోడించి, ‘‘మిమ్మల్ని నవ్వులపాలు చేయూలనుకున్న ఆయనగారి
డబ్బు నాకు వద్దు, అది నాకు అచ్చిరాదు,'' అన్నాడు.
రామేశం అతడికి ఇరవై వరహాలు తీసి ఇచ్చి, ‘‘నువ్వు వ్యాపారం
ప్రారంభించు. తులసాకు వైద్యమేకాదు; నువ్వు మంచిదనుకున్న ప్రతి విషయూన్నీ
పదిమందికీ తెలియజెయ్యి,'' అన్నాడు. ఆ విధంగా కామేశం రామేశం చేతిలో మరోసారి
భంగపడ్డాడు.
No comments:
Post a Comment