Pages

Friday, January 11, 2013

ఎద్ధుపాలు

అక్భర్ పాదుషాకి ఒకసారి చిలిపి ఆలోచన వచ్చింది. ఏం చేసినా బీర్బల్ ఏదో ఒక విముక్తి పన్ని తప్పించుంటున్నాడు. కాబట్టి అతనికి కఠినమైన సమస్య ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. నిండు సభలో అక్బర్ బీర్బల్ ఇలా అన్నాడు. బీర్బల్ నాకు ఎద్దుపాలు కావాలి. ఎలాగైనా సరే తీసుకురా .. పిల్లలూ! ఆవులే పాలు ఇస్తాయ్ ఎద్దు అంటే మగది కదా ? మరి అవిపాలు ఇవ్వవు కదా! అందుకే బీర్బల్ ని ఇబ్బంది పెట్టడానికి అక్భర్ ఇలా అడిగాడు.

అక్బర్ అడిగిన దానికి బీర్భల్ ఫ్రభూ ఎద్దుపాలు అంతసులభంగా దొరకవు. కానీ మీరు అడిగారు. కాబట్టి తెస్తాను. నాకుమూడు, నాలుగు రోజుల సమయం ఇప్పించండి అన్నాడు బీర్బల్జ అక్భర్ సరే అన్నాడు. ఆ మర్నాడు తన రాజప్రాసాదానికి దగ్గరలో ఉన్న యమునా నది ఒడ్డున విహరించడానికి అక్బరు వెళ్లాడు. అక్కడ అక్బర్ కి ఒక దృశ్యం కనిపించింది. ఒక స్త్రీ బండెడు బట్టలు నది ఒడ్డున చెమటలు కక్కూతూ ఉతుకుతుంది. చూడడానికి ఆమె చాలా ఉన్నత కుటుంబం నుండి వచ్చిన దానిలా కనిపిస్తుంది.

అందుకని ఆశ్చర్యంగా ఇలా అడిగాడు అక్బర్. అమ్మాయి నువ్వు చూస్తే కలవారి పిల్లల ఉన్నావు. ఇన్ని బట్టలు నువ్వే స్వయంగా ఉతుకుతున్నావేంటి. ? ఒక దాసీదాన్ని పెట్టుకోలేపోయావా? దానికి ఆమె ప్రభూ మీరు ఊహించిన విధంగగా నేను అయినింటి పల్లనే, మా ఇంటి నిండా దాసీలు ఉన్నారు. కానీ మా ఆయన గర్భం దాల్చారు ఈ పనులన్నీ నేను చేయాల్సి వస్తుంది. అని సమాధానం చెప్పింది. మగవారు. ఏంటి, గర్భం ధరించడం ఏంటీ ? అని ఆశ్చర్యంగా అడిగాడు అక్బర్. దీనికింత ఆశ్చర్యం దేనికి ప్రభూ ? రోజులు మారాయి. ఈ రోజుల్లో ఎద్దులు పాలు ఇస్తాయ్. అలాగే మీ మీమగాళ్ళు గర్బం ధరించి పిల్లల్ని కూడా కంటారు. అంది ఆమె .

ఇదంతా తన చిలిపి కోరికకి సరైన సమాధానం ఇవ్వడానికి భీర్భల్ పన్నిన పన్నాగంమని అక్బర్ కి అర్థం అయిపోయింది. మర్నాడు సభలో అక్బర్ బీర్బల్ తెలివితేటలకి అతన్ని సత్కరించాడు.   

ఎవరు గ్రుడ్డివారు ?

ఒకసారి అక్బర్ దర్భారులో ఉన్నవారికి ఒక వింత ప్రశ్నవేశాడు. మన పట్టణంలో గ్రుడ్డివారు ఎక్కువ మంది ఉన్నారా లేకు మంచివారు ఎక్కువ మంది ఉన్నారా ? అని సభలోని వారంతా మంచివారే ప్రభూ అని సమాదానం ఇచ్చారు. బీర్బల్ మాత్రం మన పట్టణంలో గ్రుడ్డివారే ఎక్కువ మంది ఉన్నారు ప్రభూ. మన పట్టణమే కాదు. ఈ ప్రపంచంలో గ్రుడ్డివారు ఎక్కువ అని సమాదానం ఇచ్చాడు. అలా ఎలా చెప్పగలవు అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బర్. ఇప్పటికి ఇప్డు దీనికి నేను సమాధానం చెప్పలేను గానీ, నాకు ఒక రెండు రోజులు గడువు ఇస్తే మీకు ఋజువుతో గ్రుడ్డివారే ప్రపంచంలో ఎక్కువ అని నిరూపిస్తాను అని వినయంగా పలికాడు బీర్బల్.

 ఆ మర్నాడు బీర్బల్ ఊళ్లో జన సంచారం ఎక్కువగా ఉండే నాలుగు దారుల కూడలి దగ్గర కూర్చున్నాడు. అతని చుట్టూ పాత చెప్పులు ఉన్నాయ్. బీర్బల్ ఒక తెగిన చెప్పును చేతిలోకి తీసుకుని దాన్ని కుడుతూ కూర్చున్నాడు. ఆ దారిన పోయే ప్రతి ఒక్కరూ బీర్బల్ గారూ , అక్కడ కూర్చుని మీరే చేస్తున్నారు ? అని అడుగుతూ ఉన్నారు. అలా అడిగిన ప్రతి ఒక్కరి పేరూ, చిరునామా బీర్బల్ పక్కనే కూర్చుని, ఆయనచే నియిమించబడ్డ ఒక వ్యక్తి రాసుకుంటున్నాడు. సాయంత్రం పూట అక్బర్ వ్యాహ్యాళికి ఆ దారిన వెళ్తూ చెప్పులు కుడ్తున్న బీర్బల్ ని చూశాడు. ఏంటీ బీర్బల్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. అంటే, అక్బర్ పాదుషా పేరు కూడా పక్కన కూర్చున్న వ్యక్తి రాసుకున్నాడు.

ఆ మర్నాడు బీర్బల్ మామూలు ప్రకారం దర్బారుకి వెళ్లాడు. ప్రభూ పట్టణములోని కొంతమంది. గుడ్డివారి జాబితా నేను తయారు చేశాను చూడండి అంటూ తాను చెప్పులు కుడ్తున్నపుడు ఏం చేస్తున్నారు అని అడిగిన వారి పేర్లు జాబితాని అక్బర్ కి ఇచ్చాడు. అక్బర్ అందులోని పేర్లు చూశాడు. చివరగా తన పేరుకూడా అందులో ఉండటం చూశాడు. బీర్బల్ ఏమిటిది ? ఇందులో నా పేరు కూడా ఉందే ? అని కాస్త కోపంగా అడిగాడు. అందుకు నన్ను మీరు మన్నించాలి. నిన్న నేను పట్టణ కూడలిలో కూర్చుని చెప్పులు కుడ్డూవుంటే చూసి కూడా ఏమి చేస్తున్నారు అని అడిగారు. చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు. చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు. కాబట్టి ఆ జాబితాలోని వారందరూ గుడ్డివారే కదా ప్రభూ. నా ఉద్దేశంలో వాళ్ళంతా కళ్ళున్న గ్రుడ్డివారు ! బీర్భల్ ఋజువుతో సహా అంత తెలివిగా సమాదానం చెప్పినందుకు అక్బర్ సంతోషించి సత్కరించాడు.  

చెడిపోని చెలిమి

అనగ అనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం. పులి ప్రాణ స్నేహితులుగా ఉండేవి. రెండూ వేరు వేరు జాతులకు చెందినవి కదా, వాటి మధ్య స్నేహమేమటి ? అని సందేహం కలగవచ్చు. అదే మరి విచిత్రం. అవి ఊహ తెలియని వయసునుంచి అంటే పులి, సింహం అనే తేడాలేవి తెలియని వయసునుంచే స్నేహితులయ్యాయి. కాలం గడిచేకొద్దీ వాటి మధ్య స్నేహం మరింత బలపడింది. దానికి తోడు అవి నివసించే పర్వత ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ సమయంలోనే ఒక సన్యాసి ఉండేవాడు.

ఆయన సాత్విక, ప్రశాంత వైఖరి కూడా పులి, సింహాలపై ప్రభావం చూపిందని అనుకోవచ్చు. ఇలా ఏ చీకు చింతా లేకుండా కాలం హాయిగా సాగిపోతుండగా ఒక రోజు సింహం, పులి పిచ్చాపాటీ మాట్లాడుకోసాగాయి. కబుర్లు అలా అలా సాగి ‘ చలి ’ వైపు మళ్ళాయి. పులి ఇలా అంది ‘‘ చలి ఎప్పుడు వస్తుందో తెలుసా, పున్నమి నుంచి చంద్రుడు అమావాస్య దిశగా క్షీణించే కాలంలో చలి పెరుగుతుంది ఇలా చాలామంది అనుకోగా విన్నాను.’’ సింహ అందుకొని ‘ చాల్లే ఆపు నీ అర్థం లేని మాటలు, ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒక దారని సామెత ఉందిలే. అలా ఉంది నువ్వు చెప్పేది.

అందరూ అనేది అమావాస్య నుంచి చంద్రుడు పున్నమి దిశగా వృద్ది చెందే దశలో చలి గిలిగింతలు పెడుతుందని నువ్వెక్క విన్నావో ఆ లోకవిరుద్దమైన మాటలు అంది. అంతే ఆ రెండిటి మధ్య మాటమీద మాట పెరిగి అదొక వివాదంగా ముదిరింది. ఒకరి మాటను మరొకరు అంగీకరించటానికి సిద్దంగా లేరు. చిలికి చిలికి గాలివాన అన్న చందంగా పరిస్థితి మారింది. తామిద్దరూ మంచి మిత్రులు. ఇప్పుడే గొడవ మొదలైంది ఇక దీనికి పరిష్కారమేమిటి ? అని ఆ రెండూ అనుకున్నాయి.

వాటికి చటుక్కన సన్యాసి గుర్తుకు వచ్చాడు. ‘ ఆ! మహానుభావుడికి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి ఆయననే అడిగితే సరి’ అనుకొని రెండూ సన్యాసి దగ్గరకు వెళ్ళి, గౌరవభావంతో తలవంచి నమస్కరించాయి. ఆ తర్వాత తమ వివాదాన్ని వివరించి ‘‘ ఇపుడు మీరు చెప్పండి స్వామీ వాస్తవమేమిటో’’ అన్నాయి. అంతా విన్న సన్యాసి కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ‘ అమావాస్య నుంచి పున్నమి లోపల అయినా, పున్నమి నుంచి అమావాస్య లోపల అయినా ఎప్పుడయినా చలి రావచ్చు.

కాబట్టి ఈ విధంగా చూస్తే మీ ఇద్దరి మాటలూ సరైనవే, ఎవరూ, ఎవరి చేతిలో ఓడిపోయింది లేదు. వీటన్నింటికంటే ముఖ్య విషయమొకటి మీరు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే తగవులూ లేకుండా కలిసి మెలిసి ఉండటం. ఏ రకంగా చూసినా ఐకమత్యమే ఉత్తమం’’ సింహం, పులి ఆ మాటల అసలు అర్థాన్ని గ్రహించాయి. తమ స్నేహం చెడిపోనందుకు అవి ఎంతో సంతోషించాయి. ఈ కథలోని నీతి : వాతావరణంలో మార్పులు రావచ్చు. కానీ చెలిమి మాత్రం చెక్కు చెదరకుండా నిలుపుకోవాలి.   

నిధి రహస్యం

అనగనగా వారణాసిలో ఒక వృద్దుడు ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన స్నేహితుడు ఉండేవాడు. వృద్దుడి బార్య పడుచుది. అందమైంది. కూడా వృద్దుడికి ఒక కొడుకు పుట్టాడు. కుమారుడంటే వృద్దుడికి పంచప్రాణాలు. ఒక రోజు వృద్దుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ పడుచు భార్యను నమ్మడానికి లేదు. నేను గనుక చనిపోతే, ఈమె తప్పకుండా మరో పెళ్ళి చేసుకుంటుంది. తను కష్టపడి, కూడబెట్టిన సంపదంతా వారి విలాసాలకే ఖర్చు చేస్తారు. పిల్లవాడికి ఏమీ మిగలదు. కాబట్టి ఈ పసివాడికోసం సంపదంతా ఒకచోట రహస్యంగా పాతిపెట్టడం మంచిది. అలా అనుకోగానే నమ్మకస్తుడైన సేవకుడు నందుడిని పిలిచాడు. ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళి సంపదంతా ఒక చోట పాతిపెట్టారు ఆ తర్వాత వృద్దుడు, సేవకుడితో ఇలా అన్నాడు :

నందా ! నువ్వేంతో మంచివాడివి, నమ్మకపాత్రుడివి. నేను చనిపోయాక ఈ నిధిని, నా కుమారుడికి అప్పగించే బాధ్యత నీదే. ఈ సంపధను తెలివిగా, సద్వినియోగం చేయవలసిందిగా మా వాడడికి నా మాటగా చెప్పు. అలాగేనయ్యా అన్నాడు నందుడు. ఆ తర్వాత కొద్దికాలానికే వృద్దుడు మరణించాడు. కొన్నెళ్ళకు అతడి కుమారుడి చదువు పూర్తయింది. ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి, కుమారుడితో ఇలా అంది, అబ్బాయి! అనుమానపు మనిషి అయిన మీ నాన్నగారు నా మీద అపనమ్మకంతో, సంపదనంతా ఎక్కడో దాచి ఉంటాడు. ఆ సంగతి నందుడికి తెలిసే ఉంటుందని నానమ్మకం. నువ్వు వాడినడిగి ఆ విషయం తెలుసుకో ఆ సంపద లభిస్తే నువ్వు చక్కగా పెళ్ళి చేసుకుని, ఇంటి బాధ్య సమర్ధవంతంగా నిర్వహించవచ్చు.

కుమారుడు, తల్లి చెప్పినట్లు నందుడిని, తండ్రి దాచిన సంపద గురించి అడిగాడు, నందుడు సంపదనంతా అడవిలో పాతిపెట్టారని, ఆ చోటు తనకు తెలసుననీ చెప్పాడు. ఇద్దరూ ఒక గంప, పార తీసుకుని అడవికి వెళ్లారు. ధనం దాచిన చోటుకు చేరుకోగానే ఒక్కసారిగా నందుడి వైఖరి మారిపోయింది. తాను కేవలం సేవకుడే అయినా, నిధి రహస్యం తెలిసిన ఏకైక వ్యక్తి కనుక కుమారుడికన్నా తానే గొప్ప అన్న ఆహాంకారం తలెత్తింది. దాంతో ఛీ నీ పుట్టుకే నీచమైంది. నీకు నిధి దక్కటమా ? అంటే అవాకులూ, చవాకులూ వాగాడు. నెమ్మదస్తుడైన కుమారుడు ఆ మాటలకు నొచ్చుకున్నాడు. తిరిగి ఏమీ అనలేదు.

నందుడి ప్రవర్తన అతనికి వింతగా తోచింది. కొద్దిసేపటకి వారు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఇద్దరూ అడవికి వెళ్ళారు. రెండుసార్లూ నందుడు అలాగే ప్రవర్తించాడు. కుమారుడు ఇలా అనుకున్నాడు. ఇదేమిటి, నందుడు ఇంటి దగ్గర బాగానే ఉంటాడు. నిధి ఉన్నచోట చెపుతానంటారు. తీరా అక్కడికి వెళ్ళగానే మారిపోతున్నాడు. ఆ అన్నట్లు నాన్నగారి మిత్రుడు ఒకరున్నారు ఆయన చాలా తెలివైనవారు. ఆయనను అడిగితే సరి అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆయనతో జరిగినదంతా వివరించాడు.

ఆయన శ్రద్దగా విని ఇలా అన్నాడు. నువ్వు నందుడితో కలిసి మళ్ళీ అడవికి వెళ్లు అతడు నిన్ను దూషించే అధికారం అతనికి లేదని కోప్పడి, అక్కడినుంచి పంపించు. ఆ తర్వాత ఆ చోటులో నువ్వే తవ్వి చూడు. నిధి తప్పకుండా దొరుకుతుంది. నందుడిలో మానసిక బలహీనత ఉంది. అందుకే తన ప్రాముఖ్యత గుర్తుకు రాగానే అహంబావంతో ప్రవర్తిస్తున్నాడు. కుమారుడు ఆయన దగ్గర సెలవు తీసుకుని, ఆయన చెప్పినట్లుగానే చేశాడు. నిధి లభించింది. తండ్రి కోరుకున్నట్లుగానే ఆ సంపధను సద్వినియోగం చేశాడు.   

రాజుగారు – తెల్లవెంట్రుక

చాలాకాలం క్రితం మనిషి ఆయురార్థయం ఇప్పటికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేది, ఆ కాలంలో ప్రజలు వేల సంవత్సరాలు జీవించేవారు. ఆ కాలంలో జన్మించినవాడే ఈ కథలోని మఖదేవుడు. ఆయన బాలుడిగా 84.000 సంవత్సరాలు ఉండి, ఆ పైన యువరాజుగా కిరీటధారణ చేశాడు. యువరాజుగా 80,000 సంవత్సరాలు గడిపాడు. ఒక రోజు మఖదేవుడు, క్షురకుడితో ఇలా అన్నాడు. నా తలలో నెరిసిన వెంట్రుక కనిపిస్తే వెంటనే నాకు చెప్పు క్షురుకుడు సరేనన్నాడు. మరో నాలుగువేల ఏళ్ళ గడిచాయి. ఒక రోజు క్షరకుడు రాజుగారి జుట్టు కత్తిరిస్తుండగా, ఓ చిన్న తెల్లవెంట్రుక కనిపించింది.

వెంటనే క్షురకుడు, ప్రభూ మీ తలలో ఒక తెల్లవెంట్రుక వచ్చింది. అన్నాడు. అప్పుడు రాజు, అలాగా అయితే ఆ వెంట్రక పీకేసి నా చేతికివ్వు అన్నాడు. క్షురకుడు బంగారు పనిముట్టుతో ఆ తెల్లవెంట్రుకను పీకి, రాజు గారి చేతిలో ఉంచాడు. అప్పటికి రాజుగారికి ఇంకా 84,000 ఏళ్ళ ఆయుర్ధాయ ఉంది అయినా వెంట్రుకను చూసిన ఆయనలో చావు గురించి భయం మొదలైంది. మరణం ఆసన్నమయినట్లుగా తోచింది. కాలిపోతున్న ఇంట్లో బంధింపబడినట్లుగా మెల్లగా బాధపడ్డాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది.

రాజు ఇలా అనుకున్నాడు ఓ మూర్ఖరాజా ఇంతకాలం జీవితం వ్యర్థంగా గడిపావు. ఇప్పుడు చావును సమీపించావు. నీ స్వార్థాన్ని, అసూయను తొలగించుకోవటానికి ఏ ప్రయత్నం చేయలేదు. ద్వేషభావం విడనాడటం, సత్యాన్వేషణ, జ్ఞాన సముపార్జనకు కృషి... ఏమీ చేయలేదు. ఆ ఆలోచన రాగానే రాజుకు మళ్ళీ చెమటలు పట్టాయి. వెంటనే ఒక నిర్ణాయానికి వచ్చాడు. రాజ సింహసనాన్ని త్యజించటానికి ఇదే సమయం. సన్యాసిగా మారి ధ్యానం ప్రారంభించాలి. ఇలా అనుకొని ఆయన ఒక పట్టణం మీద వచ్చే ఆదాయమంతా క్షురకుడికి ఇస్లున్నట్లు ప్రకటించాడు. ఆ ఆదాయం సంవత్సరానికి లక్షరూపాయల దాకా ఉంటుంది. ఆ తర్వాత రాజు, తన పెద్ద కుమారుడిని పిలిచి కుమారా... నా తల నెరవటం ప్రారంభించింది. అంటే వృద్ధాప్యం మొదలైందన్నమాట.

అధికారాన్నీ, ప్రాపంచిక సుఖాలన్నిటినీ నేను అనుభవించాను. మరణానంతరం స్వర్గానికి వెళ్లాలన్నది నా కోరిక. అందుకే నేను సన్యాసినవుదామనుకుంటుంన్నాను. రాజ్య పరిపాలన బాధ్యత ఇక నీవు చేపట్టాలి. నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పాడు. ఈ విషయం తెలిసి మంత్రులు, రాజోద్యోగులు హుటాహుటిన రాజు వద్దకు వచ్చారు. ప్రభూ హఠాత్తుగా మీరి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అంటూ అడిగారు. అప్పుడు రాజు ఆ తెల్లవెంట్రుకను చూపుతూ ఈ వెంట్రుక జీవితంలోని మూడు దశలను సూచిస్తోందని నేను గుర్తించాను. యవ్వనం, నడివయసు, వృద్దాప్యాలే ఆ మూడు దశలు. మొదటి తెల్లవెంట్రుక నా తలమీద కూచున్న మృత్యుదేవత వంపే దేవతలవంటివి. కాబట్టి ఈ రోజే నేను అధికారాన్నిత్యజించాలనుకున్నాను. అన్నాడు.

రాజు అడవులకు వెళ్ళిపోతున్నాడని తెలిసిన ప్రజలు ధు:ఖించారు ముఖదేవుడు రాజభొగాలను విడనాడి. అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ సన్యాసిగా కాలం గడుపుతూ నాలుగు విశిష్ట లక్షణాలు సాధన చేయసాగాడు. అవి... అందరినీ ప్రేమగా, దయతో చూడటం, బాధితుల పట్ల కరుణ చూపడం. సుఖంగా ఉన్నవారిని చూసి సంతోషించడం, కష్టాలలో సైతం ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం, అలా 84,000 ఏళ్ళు గడిపాడు. ఆ తర్వాత ఒకరోజున ఆ మహాజ్ఞాని పరమవదించాడు. నీతి : వ్యర్థంగా గడపటానికి ఎంత ఎక్కువ కాలమయినా తక్కువగానే భావిస్తారు.   

పరమానందయ్య శిష్యులు - నెతి గిన్నె

పరమానందయ్యగారి దగ్గరకు ఒకసారొక తర్కపండితుడు వచ్చాడు. స్నేహంతో చూడాలని వచ్చిన అతను ఆ మాటలూ, యి మాటలూ ఆడాక తన తర్క శాస్త్రం గురించి ప్రస్తావించాడు. ఇద్దరు స్నేహితులూ తర్కం గురించి మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్ళేం మాట్లాడుకుంటున్నా శ్రద్దగా వినమని గురువుగారు చెప్పారుకదా... అందుకని వాళ్ళు ఆ మాటలర్థమయినా కాకపోయినా వినేస్తున్నారు శిష్యులు.

పండితులిద్దరూ తర్కం, మీమాంస మొదలయిన వాటి గురించి చర్చించుకుంటున్నారు. వాటిల్లో శిష్యులికేవీ అర్థంకావడంలేదు- ఏవో పొడిముక్కలు తప్ప. అయినా వినేస్తున్నారు. అంతలో గురుతపత్ని శిష్యులని పిలిచి – అతిథి వచ్చారు కదా. ఇంట్లోకి నెయ్యి తెండి అని గిన్నె, డబ్బులు ఇచ్చారు. ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే – ఈపాటిదానికిద్దరెందుకూ? అన్నారు గురుపత్రి. ఒక బుర్రకంటే రెండు బుర్రలు నయం అన్నారు గురువుగారు. అన్నాడు ఒకడు.

రెండు బుర్రలంటే ఇద్దరుండాలి కదా ? అన్నాడు రెండొవాడు. మీరెందరెళ్ళినా ఒక్క బుర్ర కూడా కాదు – గొణుక్కుందావిడ. వాళిద్దరూ బజారులకెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకుని వస్తూంటే – గురువుగారికీ పండితుడుగారికీ జరిగిన మాటలు గుర్తుకొచ్చాయి. వీళ్లకి ఈ నేతికి గిన్నె ఆధారమా ? అడిగాడొకడు. గిన్నెకు నెయ్యే ఆధారము అన్నాడు రెండోవాడు. మహాతెలిసినట్లుగా.

అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న నా సిద్దాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నావన్నమాట. అన్నారు అర్థం తెలియకపోయినా(పడికట్టు) పదం ఉపయోగిస్తూ. ఔనంతే అన్నాడు రెండోవాడు ధీమాగా. ఇద్దరూ కాస్సేపు వాధించుకుని ఆ పైన కొట్లాట వరకూ వెళ్లిపోయారు. గిన్నెకి నెయ్యి ఆధారమన్నావుగా... చూడు నీ నేతిగతేమవుతుందో ; అంటూ గిన్నెను బోర్లించేశాడు.

గాలిలో నెయ్యంతా నేలపాలయింది. రెండోవాడికి కోపమొచ్చింది. చటుక్కున మొదటివాడి చేతిలోని గిన్నెను గట్టిగా అతని చేతిమీద కొట్టి ఎగర కొట్టాడు. ఇప్పుడు నీ గిన్నె కాధారమేదీ? నెయ్యంది కనుక గిన్నె నీ చేతిలో ఉంది. నెయ్యినే ఆధారం పోవడంతో నీ గిన్నె హూష్ – నవ్వాడు రెండోవాడు. బంగారంలాంటి వెండిగిన్నె వాళ్ల తర్కవితర్కాలలో ఎగిరి పంటకాలవలో పడి ప్రవాహం పాలయింది మరి చిక్కకుండా. ఇంటికెళ్లాక – ‘‘ నెయ్యేదీ’’ అని అడిగారు గురుపత్ని జరిగినదంతా చక్కగా చెప్పారిద్దరూ. ఈ జన్మలో మీరు బాగుపడరు అని తలకొట్టుకుందావిడ.  

అపాయంలో ఉపాయం

ఒక రోజు అక్బర్, బీర్బల్ వనంలో విహారానికి వెళ్లారు. ఇద్దరూ కాస్సేపు వనంలో నడిచిన తర్వాత అక్బర్ పాదుషాకి ఒక సందేహం వచ్చింది. ‘‘ బీర్బల్ ! హఠాత్తుగా ఏదైనా అపాయం వచ్చిందనుకో, అప్పడు ఏ చెయ్యాలి ?’’ అని అడిగాడు.

‘‘ ఏముంది ప్రభూ! ఆ అపాయాన్న్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ‘‘ అపాయాన్ని తప్పించుకోవడానికి ఉపాయమే కావాలా ? ఆయుదం ఉంటే సరిపోదా?’’ అని అడిగాడు. అక్బర్. ‘‘ కాదు ప్రభూ! ఉపాయం ఆయుధం కంటే గొప్పది’’ అని సమాధానం చెప్పాడు బీర్బల్. బీర్బల్ చెప్పిన దాంతో అక్బర్ అంగీకరించలేదు. ఆయుదం ఉంటే ఎలాంటి అపాయం నుండైనా బయటపడొచ్చు. అని వాదించడం మొదలు పెట్టాడు.

ఇంతల వారిద్దరికీ ఎనుగు ఘీంకారం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. ఒక మందించిన ఎనుగు వనంలోని మనషుల్ని తొండంతో విసిరేస్తూ, చెట్లని తొక్కుతూ, బీకరంగా ఘీంకారం చేస్తూ వీరివైపు వచ్చింది. అక్బర్ వెంటనే ఒరలో ఉన్న కత్తిని తీసి, దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. అయినా ఏనుగుకి అది అని ఏం తెలసు? అది లెక్క చేయకుండా మీది మీదికి వచ్చేస్తుంది. ఆ చిన్న కత్తి, అంతపెద్ద ఏనుగుని ఏం చేయగలదు? దానికి తోడు అది మదించిన ఏనుగు.

జరగబోయే ప్రమాదం పసిగట్టిన అక్బర్, బీర్బల్ వెనక్కి పరుగుతీసి అక్కడ ఉన్న ఒక ఎత్తయిన అరుగని ఎక్కి ఏనుగు బారినుండి బయటపడ్డారు. ‘‘ చూశారా ప్రభూ!మీ దగ్గర కత్తి ఉన్నా మీరేమి చేయలేకపోయారు. పరిగెత్తి ఈ అరుగు ఎక్కడమన్నదే ఉపాయం! అన్నాడు బీర్బల్. ‘‘ నువ్వు చైప్పిందే సరియైనది’’ అంటూ అక్బర్ బీర్బల్ ని మెచ్చుకున్నాడు.    

రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్

ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చిక బయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు. ‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.

కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు.బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు. అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.

గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించ ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు. అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు.

బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే. కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు. ‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్.

కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు. అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.     

నలుగురు మూర్ఖులు

ఒకసారి అక్బర్ సభలోని వారినుద్దేశించి ఇలా ప్రకటన ఇచ్చాడు. ‘‘ సభికులారా మీలో ఎవరైతే నాకు నలుగురు మూర్ఖులను తెచ్చి చూపిస్తారో వారికి మంచి బహుమానం ఇస్తాను.’’ అక్బర్ చేసిన ఈ ప్రకటన విని సభలోని వారంతా అక్బరు దగ్గరికి మూర్ఖులను తెచ్చి వాళ్లు చేసే తెలివి తక్కువ పనుల గురించి వివరించడం మొదలుపెట్టారు.

కానీ ఎవరూ అక్బర్ ని సంతృప్తి పరచలేకపోయారు. చివరికి బీర్బల్ ఒకనాడు సభలోకి ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చాడు. ‘‘ ఈ ఇద్దరూ ఎవరూ ? ’’ అని అక్బర్ బీర్బల్ ని ప్రశ్నించాడు. ‘‘ వీళ్ళు పరమ మూర్ఖలు ప్రభూ!’’ అని చెప్పాడు బీర్బల్ ‘‘ సరే, అలాగయిత వీళ్లేం తెలివి తక్కువ పనులు చేశారో చెప్పు’’ అని అడిగాడి అక్బర్.

మొదటి మూర్ఖుడిని చూపించి బీర్బల్ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘ ప్రభూ! వీడు ఒక గేదె వీపు మీద ఎక్కి తన నెత్తిన గడ్డిమోపుని మోస్తూ వెళ్తున్నాడు. నీ నెత్తిన గడ్డిని ఎందుకలా పెట్టుకున్నావ్ అని నేను అడిగాను. దానికి వీడు నా గేదె అసలే బక్క చిక్కి చాలా నీర్సంగా ఉంది కాబట్టి అది గడ్డి మోపును మోయలేదని నేనే దాన్ని నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నాను అని అన్నాడు ప్రభూ! అది విని సభలోని వారందరూ పగలబడి నవ్వారు.

 రెండో మూర్ఖుడు చెట్టుమీద తాను కూర్చున్న చెట్టు కొమ్మనే గొడ్డలితో నరుకుతున్నాడు. నువ్వు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు అలా చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా ? అని నేను అడిగాను ప్రభూ! దానికి వాడు, ఎందుకు తెలీదు, కొమ్మని నరకగానే కొమ్మతో పాటు నేను కూడా కిందకి వచ్చేస్తాను కదా! చక్కగా నేను చెట్టు దిగే అవసరం లేదు అని చెప్పాడు.’’ సభలోని వారంతా మళ్లీ గట్టిగా నవ్వారు. ‘‘

నువ్వు చెప్పినట్టుగా నిజంగానే వీళ్ళిద్దరూ పరమ మూర్కులే. కానీ నేను తీసుకురమ్మన్నది నలుగురు మూర్ఖుల్ని కదా! అన్నాడు అక్బర్. ‘‘ మరో ఇద్దరు మూర్ఖులు ఇక్కడే ఉన్నారు ప్రభూ! అని సమాధానం చెప్పాడు బీర్బల్. ‘‘ ఇక్కడే ఉన్నారా? ఎవరు వాళ్ళు?’’ అంటూ ఆశ్ఛర్యంగా అడిగాడు అక్బర్.

 ‘‘ ఎంతో విలువైన నా సమయాన్ని ఎలాంటి పనికిరాని పనికి ఉపయోగించిన నేను ఒక మూర్ఖుడిని ప్రభూ, ఇలాంటి పనికి నన్ను ఉపయోగించిన మీరూ...’’ అంటూ ఆగాడు. అది అక్బర్ పాదుషాకి కోపం తెప్పించే సమాధానం అయినా బీర్బల్ మాటల్లో నిజాన్ని గ్రహించడం వల్ల అక్బర్ తన కోపాన్ని దిగమింగి, ఇచ్చిన మాట ప్రకారం బీర్బల్ కి బహుమాన ఇచ్చాడు.  

మీసాలు లాగేవాడు

ఒకరోజు దర్బారులో అందరూ కూర్చుని ఉన్నారు. అందరూ అక్బర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో అక్బర్ రానే వచ్చాడు. రాగానే తన సింహసనంలో కూర్చుంటూ సభలోని వారిని ఇలా అడిగాడు. ‘నిన్న ఒకరు నా మీసాలు లాగి, గడ్డం పట్టుకుని పీకాడు. వాడిని ఏం చేయాలి ? అది వినగానే సభలోని వారంతా ‘‘ హవ్వా హవ్వా! ఎంత అపచారం? అన్నారు.

‘‘ వాడిని దేశం నుండి బహిష్కరించండి’’ అని ఒకడు అన్నాడు. ‘‘ వాడిని జీవితాంతం ఖైదులో ఉంచండి.’’ అని మరొకరు అన్నాడు ఇలా ఆవేశంగా తలోక శిక్ష వెయ్యమని అందరూ అరవసాగారు. బీర్బల్ మాత్రం లేచి నలబడి ‘‘ ప్రభూ! మీతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు తినిపించండి. వాడికి మీ ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వండి’’ అన్నాడు వినయంగా.

‘‘ బీర్బల్ గారూ! ప్రభువుతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు పంచి ఆస్తి రాసివ్వాలా, మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?’’ అని సభలోని కొందరు బీర్బల్ మాటలకి అభ్యంతరాన్ని తెలియజేశారు. అప్పడు బీర్బల్ చిరునవ్వుతో పాదుషా వారితో అలా ప్రవర్తించే చనువు కేవలం మనవడికి లేదా మనవారిలికి మాత్రమే ఉంటుంది. అందుకే అలా అన్నాను’’ అన్నాడు.

‘నిజమే! నన్ను నా మీసాలు లాగి నా గడ్డాన్ని పీకింది నా మనవడే!’’ అని నవ్వుతూ పలికాడు అక్బర్. బీర్బల్ తెలివితేటల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు అక్బర్.   

మంత్రి పదవి కోరిన దిలవార్

అక్బర్ బావమరిది ఉన్నాడు. అతని పేరు దిలావర్! దిలావర్ చాలా కాలంగా ఒక కోరిక ఉంది. అదేమటంటే తనకి మంత్రి పదవి దక్కడం. అందుచేత బీర్బల్ ని మంత్రి పదవి నుండి తప్పించి తనకి ఆ పదవిని ఇవ్వమని బావగారైన అక్బరైని చాలాసార్లు కోరాడు. కానీ ఎంతో తెలివి తేటలు ఉన్న బీర్బల్ ని మంత్రి పదవినుండి తొలగించి అసమర్థుడైన దిలావర్ కి ఆ పదవిని ఎలా ఇస్తాడు ? అందుకే అక్బర్ దిలావర్ కోరికని పట్టించుకోకుండా ఊరుకున్నాడు.

 కానీ దిలావర్ పదే పదే మంత్రి పదవవి గురించి విసిగిస్తూ ఉంటే అక్బర్ చివరికి అతన్ని ఇలా అడిగాడు. ‘‘ చూడు దిలావర్. మంత్రి కావాలనుకున్న వాడికి ఎంతో పదునైన ఆలోచనా శక్తి, హాస్య చతురత, సమయస్ఫూర్తి ఇవన్నీ ఉండాలి! మరి అవన్నీ నీకు ఉన్నాయా ? ‘‘ ఓ! ఉన్నాయ్’’ అన్నాడు దిలావర్. ‘‘ ఉన్నాయంటే సరిపోదు. రేపు సభలో నిన్ను ఒక ప్రశ్న అడుగుతా. దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే నీకు మంత్రి పదవి ఇస్తాను!’’ అన్నాడు.

 అక్బర్ దిలావర్ సరేనన్నాడు. మర్నాడు సభలో ‘‘ దిలావర్! ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఈ సమయంలో వారివారి మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు!’’ దానికి దిలావర్ ‘‘ ఎంటీ ? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా ? నేనే కాదు. దీనికి ఈ దేవుడే తప్ప ఇంకెవ్వరూ సమాధానం చెప్పలేరు.!’’ అన్నాడు. అక్బర్ చిరునవ్వు నవ్వి బీర్బల్ వైపు తిరిగి ‘‘ బీర్బల్ పోనీ నువ్వు చెప్తావా?’’ అని అడిగాడు.

‘ ఓ, ఇంత అతి మామూలు ప్రశ్నకి నేనెందుకు సమాధానం చెప్పలేను ప్రభూ! అన్నాడు బీర్బల్. అది వినగానే దిలావర్ కి చాలా కోపం వచ్చింది. ‘‘ ఏంటీ? ’’ అక్బర్ పాదుషా అడిగింది అతి మామూలు ప్రశ్న ? అంటే పాదుషా వారి తెలివి తేటల్ని తమరు తక్కువగా అంచనా వేస్తున్నారా? అయితే మరి ఇక్కడివారు ప్రస్తుతం అక్బర్ పాదుషా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి మరి! అన్నాడు రోషంగా.

‘‘ చెప్పు బీర్బల్!’’ అన్నాడు అక్బర్. ‘‘ ప్రభూ! ఇక్కడ ఉన్నవారంతా మీ పరిపాలనతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉన్నారని అనుకుంటున్నారు. అంతేకాదు పాదుషా వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని ఆ అల్లాని వేడుకుంటున్నారు’’ అని సమాధానం ఇచ్చాడు. అక్బర్ ‘‘ చిరునవ్వుతో సభలోని వారందర్నీ చూశాడు. వారంతా ‘‘అవును, మే అలానే అనుకుంటున్నాం’’ అని ముక్త కంఠంతో అన్నారు.

 అక్బర్ చూశావా బీర్బల్ గొప్పదనం అని అర్థం వచ్చేలా దిలావర్ ని చూశాడు. దిలావర్ సిగ్గుతో తల దించుకున్నాడు. అక్బర్ బీర్బల్ ను ఘనంగా సత్కరించాడు.  

ఉత్తమమైన ఆయుధం ఏది?

అక్బర్‌ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్థుడై, "అహా! భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా!'' అన్నాడు. "అవును, ప్రభూ! మీరన్నది అక్షర సత్యం,'' అన్నారు వెనక నడుస్తూన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్‌ తప్ప. అక్బర్‌ బీర్బల్‌ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదేపనిగా వెతుకుతూ కనిపించాడు. "బీర్బల్‌, భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదేనని నేను అన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి,'' అన్నాడు అక్బర్‌. "ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది. అందులో సందేహం లేదు. అయినా,'' అంటూ ఆగాడు బీర్బల్‌. "అంటే నువు్వ నా అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్న మాట! అయినా, ఏమిటి అయినా...'' అన్నాడు అక్బర్‌ తీవ్రస్వరంతో.

"అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా,'' అన్నాడు బీర్బల్‌. ``ప్రమాదమా! గూలాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌."ముళ్ళు, గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు,'' అన్నాడు బీర్బల్‌. "మరి గడ్డిలో దాగి వుండే పాముల గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. "మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి. ప్రాణ రక్షణకు మాత్రమే కాటేస్తాయి,'' అన్నాడు బీర్బల్‌. "మరి ప్రమాదం దేనివల్లో కాస్త స్పష్టంగా చెప్పు,'' అన్నాడు అక్బర్‌. ``శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానో, అసూయ వల్లనో ఎలాగైనా పడ గొట్టాలని చూస్తూంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం,'' అన్నాడు బీర్బల్‌. ఆ మాటతో అక్బర్‌ ఆలోచనలో పడ్డాడు

మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్‌, "హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది?'' అని సభాసదులనుద్దేశించి అడిగాడు. "పదునైన ఖడ్గం,'' అన్నాడు ఒక సభికుడు. "కత్తి పట్టిన వాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది,'' అన్నాడు బీర్బల్‌. "దూరం నుంచే శత్రువు మీదికి ప్రయోగించవచ్చుగనక, ఈటె ఉత్తమమైన ఆయుధం,'' అన్నాడు ఇంకొక ముఖ్యుడు. "ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా?'' అన్నాడు బీర్బల్‌. "ఫిరంగి!'' అన్నాడు మరొక సభికుడు. "దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగిని వెతుక్కోవడం సులభం కాదు కదా?'' అన్నాడు బీర్బల్‌. "ఖడ్గమూ కాదు. ఈటే కాదు. ఫిరంగీ కాదు. మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏది బీర్బల్‌?'' అని అడిగాడు అక్బర్‌. "పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం!'' అన్నాడు బీర్బల్‌. "ఫలానా ఆయుధం అని చెప్పలేవు, అంతే కదా?'' అన్నాడు బీర్బల్‌ కాస్త కటువుగా.

"సమయస్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనాసరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది, ప్రభూ,'' అన్నాడు బీర్బల్‌ నెమ్మదిగా. "అసంబద్ధం!'' అన్నాడు అక్బర్‌ ఆగ్రహంతో. సభికులు లోలోపల నవు్వకున్నారు. "సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభూ!'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాళికి బయలుదేరాడు. వాళ్లు నదీ తీరాన్ని సమీపిస్తూండగా హాహాకారాలు చేస్తూ, కొందరు అటుకేసి రావడం కనిపించింది. వాళ్లు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే, "రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నది. అది ఇటువైవే వస్తున్నది. పారిపొండి. పారిపొండి!'' అంటూ వాడు వెళ్ళిపోయాడు.

వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటలనాదం, ఘీంకారం వినిపించాయి. అక్బర్‌ చేయి, మొలలో వేలాడుతూన్న కత్తి పిడి మీదికి వెళ్ళింది. తక్కినవారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా, మదపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్‌ కేసి చూశారు. అయితే, బీర్బల్‌ ఏనుగు వస్తూన్న దిక్కు కేసి కూడా చూడడం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకుని వున్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్‌ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది.

అయినా, అంతలో ఏనుగు సమీపించడంతో, పిల్లిని ఏనుగు వీపుమీద పడేలా గురి చూసి విసిరాడు. పిల్లి తల్లకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగు వీపుపై నాలుగు కాళ్ళ మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్ళతో గిచ్చసాగింది. ఏనుగు అక్కడే నిలబడి, కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందికి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంట బడి తరుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా, దాపులనున్న పొదలలోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. "బీర్బల్‌, నీ సమయస్ఫూర్తికి జోహార్లు! మదపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం! ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను,'' అన్నాడు అక్బర్‌ చక్రవర్తి మందహాసంతో.   

కోడిపుంజు తెలివి

ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్క. "అరే... మంచి విందు భోజనం దొరికిందే" అని సంతోషపడుతూ, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది. అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క."పుంజు తమ్ముడూ...! నీకో శుభవార్త" అంటూ పలకరించింది.శుభవార్తా...? నాకా? ఏంటది? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు.

స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. ఇక నుంచి పక్షులు, జంతువులు అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోకూడదని, ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క. కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిందికి దిగివస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క.

అరె... ఇది చాలా మంచి విషయమే. అందుకేనేమో నీ స్నేహితులు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు.నా స్నేహితులా...!? ఎక్కడ...? ఎవరబ్బా..!? అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క.అమ్మో...! వేటకుక్కలు. అవి తనవైపే వస్తుండటాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది.

అది చూసిన కోడిపుంజు...అదేంటి నక్క బావా, అంతగా భయపడుతున్నావు. ఇప్పుడు అందరం స్నేహితులమే కదా...!? అంటూ నవ్వింది.నిజమే... కానీ ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా.! అని కోడిపుంజుకు బదులిచ్చి... బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క.  

డి విటమిన్ లోపం

డి విటమిన్ లోపిస్తే ‘ రికెట్స్ ’ అనే ఎముకల జబ్బు ఏర్పడుతుంది. ఇది పిల్లలో వస్తుంది. డి విటమిన్ లోపంతో బాధపడే పెద్దలలో కూడా కొన్ని మార్పులు కనబడతాయి. అయితే అవి రికెట్స్ కి భిన్నమయినవి. రికెట్స్ పీడిత పిల్లలు కొన్ని ప్రత్యేక గుర్తుల్ని అక్షణాలను ప్రదర్శిస్తారు. మొదట్లో వీరికి విపరీతంగా చెమటలు పడతాయి. కడుపునొప్పి కూడా రావచ్చు. అయితే అధిక మార్పులు ఎముకలలో చోటుచేసుకొంటాయి.

 పుర్రె మెత్తగా వుండిపోతుంది. మూసుకోవడానికి, గట్టిపడడానికి ఫాంటానెల్ కి ఎక్కువ సమయం పడుతుంది. పుర్రె కన్పించేటట్లుగా తల వింత ఆకృతిని ధరిస్తుంది. దంతాలు పెరగడం ఆలస్యమవుతుంది. లేదా అవి అర్థంతరంగా పెరిగిపోతాయి. పక్కటెముకలు ప్రబావితమవుతాయి. చేతియెక్క పొడవాటి ఎముకలు అస్తవ్యస్తంగా పెరుగుతాయి. రికెట్స్ పీడిత పిల్లలలో వుబ్బిన మణికట్టులను మనం చూడవచ్చు. ఎముకలు మెత్తబడి, వంగి, వింత ఆకృతులు దాల్చుతాయి. పిల్లవాడు నడవడం ప్రారంబించగానే దేహబరాలనికి కాలి ఎముకలు విల్లు ఆకృతిని దాల్చుతాయి. 

వీటిని విల్లు కాళ్లు అని పిలుస్తారు. ఎముకలలో ఏర్పడే ఇవి శాశ్వతమైన మార్పులు. శరీరంలో ఎండలో ఉన్నపుడు, శరీరమే డి. విటమిన్ ను తయారుచేసుకుంటుంది. మన దేశంలో ఎండ కావలసినంత దొరుకుంతుంది. సరయిన గాలి చోరవ, ఇరుకయిన ఇళ్లో వుండే పిల్లలను బయటకి పంపి, ఎండలో తిరగనీయకపోతే, ఆ పిల్లలు కూడా ఈ వ్యాధికి గురుయ్యే అవకాశం ఉంది. మరో కారణం కూడావుంది. మొదటగా, రికెట్స్ డి. విటమిన్ ను లోపంవల్ల వస్తుంది.

అయితే పిల్లల్ని ఎండలో తిరగనిచ్చి వారిలో డి. విటమిన్ తయారయ్యే అవకాశాన్ని కల్పించినా మరొక ఇబ్బంది కూడా వుంది. శరీరానికి తగినంత కాల్షియ ఫాస్ఫరస్ అందాలి. లేకపోతే శరీరం డి.విటమిన్ ను ప్రయోజనాన్ని పొందలేదు. పిల్లలను ప్రతి రోజూ కొంత సమయంలో తిరగీయడము వాళ్ల ఆహారంలో పాలు, రాగులు చేర్చి తగినంత కాల్సియం, ఫాస్ఫరస్లు అందేటట్లు చేయడము చాలా మంచిది.   

నిజం నిప్పులాంటిది

రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటున్నది. పదేళ్ళ రాంబాబు, ‘‘నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో, ‘కృష్ణమూర్తి తన తెలివితేటలతో పదిమంది కళ్ళూ కప్పుదామనుకున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా? వాడికి తగిన శిక్షే పడింది,' అనడం విన్నాను. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటి బామ్మా?'' అని అడిగాడు. బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ‘‘కొందరు గోప్యంగా చెడుపనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడే తీరుతుంది. దీన్నే మీ బాబాయి చెప్పాడు. వెనకటికి రామచంద్రం, జోగినాధం అనే వాళ్ళు ఇలాగే ప్రవర్తించారు. వాళ్ళ కథ చెబుతాను వినండి,'' అంటూ ప్రారంభించింది:

గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, ‘‘అయ్యూ నా పేరు విశ్వనాధం. నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే, మీ పేరు చెప్పుకుని బతుకుతాను,'' అన్నాడు. జమీందారు, ‘‘మా దివాణంలో రామచంద్రం, జోగినాధం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటినుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల్లాళ్ళ పాటు వాళ్ళిద్దరి దగ్గరా పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే, అప్పుడు చూద్దాం,'' అన్నాడు. తెలివితేటలూ, మాటకారితనమూ కలిగిన విశ్వనాథం ప్రవర్తన, ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే వున్న ఆ ఇద్దరికీ కూడా, విశ్వనాథాన్ని మంచి చేసుకుని, తమ పిల్లనిచ్చి పెళ్ళి చేద్దామన్న ఆలోచన వచ్చింది.

జోగినాధం వీలుదొరికినపుడల్లా విశ్వనాధంతో,‘‘నువ్వా రామచంద్రాన్ని నమ్మకు. అతడికి జమీందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటుంది,'' అనేవాడు. ఇక రామచంద్రం విశ్వనాధంతో, ‘‘జోగినాధం చీటికీ మాటికీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చి, జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు. అలాంటి వాడితో జతకట్టావనుకో, నీకూ చెడ్డ పేరు రావడం ఖాయం!'' అంటూ పదే పదే చెబుతూండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు వినీవినీ విసిగిపోయిన విశ్వనాధం, వాళ్ళ మాటల్లో వున్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతూన్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణం, ‘‘ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్ళే! ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాలకోసం జమీందారిచ్చిన డబ్బులో చాలా భాగం, సొంతం చేసుకున్నాడు. ఇక జోగినాధం-జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు.

ఇదంతా, నాకూ, గ్రామ పెద్దలకూ తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేక పోతున్నాం,'' అన్నాడు. విశ్వనాధం జమీందారును ఏకాంతంలో కలుసుకుని, ఇరవై రోజులుగా రామచంద్రం జోగినాధాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్లా గ్రామ కరణం, పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి, ‘‘తమరు అనుమతిస్తే, వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజ స్వరూపమేమిటో, విన్నవించుకోగలరు,'' అన్నాడు. జమీందారు, విశ్వనాధం మాటలకు ఒక్క క్షణం మాటరానట్టు ఉండిపోయి, ‘‘కరణం, ఊరి పెద్దలూ వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయితీని నేనెరుగుదును. నిజం నిప్పులాంటిది కదా! ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం నుంచీ రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీదా అధికారిగా నిన్ను నియమిస్తున్నాను,'' అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు.

కథ ముగించిన బామ్మ, ‘‘మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పదు. కాబట్టి మంచి పనులను చేయడమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?'' అన్నది. ‘‘తెలిసింది, బామ్మా,'' అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తలలు ఊపారు.   

ఎవరు తిండిపోతు ?

ఒక సారి బీర్బల్ బజారు వెంటవెళ్తూ ఉంటే దారిలో రేగుపళ్లు అమ్మేవాడు కనిపించాడు. నిగనిగలాడుతున్న ఆ రేగుపళ్లని చూడగే బీర్బల్ కి తినాలనిపించింది. తీరా ఆ రుగుపళ్లని కొన్నాక అంతటి మంచి రేగుపళ్లని అక్బర్ పాదుషాకి కూడా తినిపించాలని అనిపించింది. వెంటనే రేగుపళ్లు తీసుకుని వెళ్లాడు.

 ఏంటీ బీర్బల్, హఠాత్తుగా ఇలా వచ్చావ్ ? అని అడిగాడు అక్బర్. మీరు తింటారని మంచి రేగుపళ్లు తెచ్చాను ప్రభూ అని అన్నాడు బీర్బల్. ఓ రేగుపళ్లా ? మా రాణిగారికి రేగుపళ్లంటే చాలా ఇష్టం. మన ముగ్గురం రేగుపళ్లు తిందా?! అని రాణి గార్ని కూడా అక్బర్ అక్కడికి పిలిపించాడు. ఒక పెద్ద పళ్ళెంలో రేగుపళ్లు పోసి ముగ్గురూ దాని చుట్టూ కూర్చుని రేగుపళ్లు తినడం మొదలుపెట్టారు. రేగుపళ్లు చాలా రుచిగా ఉన్నాయ్. ముగ్గురికీ అవి ఎంతోగానో నచ్చాయ్.

 అక్బర్ పాదుషాకైతే మరిమరీ నచ్చాయ్. అవి తింటున్నపుడు అక్బర్ కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. రాణిగారిని ఒక తిండిపోతుగా చిత్రించి సర్దాగా ఆట పట్టిద్దాం అని అనుకున్నాడు. అందుచేత తాను తిన్న రేగుపళ్లు గింజలను రాణిగారివైపు ఆమె గమనించకుండా మెల్లగా చెయ్యసాగాడు. కానీ అక్బర్ చేస్తున్న పనిని గమనిస్తూనే ఉన్నాడు. అక్బర్ మనసులో ఏముందో గ్రహించిన బీర్బల్ నవ్వుకున్నాడు. ముగ్గురు రేగుపళ్లు తినేశారు. అక్బర్ పక్కన కేవలం అయిదారు రేగు గింజలు మాత్రం ఉన్నాయ్.

బీర్బల్ పక్కన కొన్ని గింజలు ఉన్నాయ్. కానీ రాణిగారి పక్కన బోలెడన్ని గింజలు ఉన్నాయ్ అవును మరి, వాటిలో సగానికి పైగా అక్బర్ పాదుషా తిన్న రేగుపళ్లగింజలే. రాణి వైపు ఉన్న గింజల్ని చూపిస్తూ.. చూశావా బీర్బల్! మీ మహారాణి ఎంత తిండిపోతో? ఆ గింజల్ని చూస్తేనే తెలుస్తుంది ఆమె ఎన్ని రేగుపళ్లు తినిందో ? అన్నాడు అక్బర్ నవ్వుతూ.

 అందుకు బీర్బల్ ‘‘ కాని రాణివారికంటే ప్రభువులే ఎక్కువ తిండిపోతని నా అభిప్రాయం ఎందుకంటే రాణివారు పళ్లతిని, గింజల్ని వదిలేశారు. తమరు ఆ గింజల్ని కూడా వదలకుండా తినేశారు’. అన్నాడు బీర్బల్ కొంటెగా. బీర్బల్ తన పక్షాన మాట్లాడినందుకు మహారాణి ఎంతో సంతోషించింది. అక్బర్ మాత్రం ‘‘ అబ్బో, ఈ బీర్బల్ ఉండగా తన ఆటలు సాగవు’’ అనుకుంటూ సిగ్గుతో తలవంచుకున్నాడు.  

ఆ అడవిలో పాముల పుట్ట

అనగా అనగా ఒక అడవి.. ఆ అడవిలో పాముల పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒక రోజు బాగా బలిసిన ముళ్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చిది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి. ముళ్ల పందిని చూసి ఏంటి కథ అని అడిగాయి.

"ఈ రోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో ఆబగా తినేశా. భుక్తాయాసం ఎక్కువై ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షికూతలు, ఇతర శబ్దాలతో గోల గోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాస్సేపు నిద్రపోయి తిరిగి వస్తాను: అని అడుక్కుంది ముళ్లపంది.

 "అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే. ఫరవాలేదు మేం కాస్త ఒదిగి పడుకుంటాం. ఇదిగా ఈ మూల నువ్వు సర్దుకో" అంటూ కొద్దిగా చోటి్చ్చాయి. ముళ్లపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది.పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీదగల ఒక్కొక్క ముల్లు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి.

పాములు దాని ముందుకెళ్లి అవతలకు పో అని ఒక్క అరుపు అరిచాయి. ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది. పైగా బాగా నిద్రవస్తోంది కూడా. నా నిద్ర పాడు చేయకండి. అంతకూ మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్లను ఇంగా బాగా చాపింది. దీంతో ఆ ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి. పాపం పాములు. ఇంకేం చేస్తాయి. దీన్ని రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి.  

నీలిరంగు నక్క

అనగనగా ఒక నక్క. ఆహారం కోసం వెతుకుతూ అది అడవిని దాటింది. నగరంలోకి వచ్చి పడింది. నెమ్మదిగా నేత పనివాళ్ల వాడకు వెళ్లింది. దాహం వేయడంతో నీళ్ల పీపా అనుకుని నీలిమందు కలిపిన ఓ పీపాలోకి దూకింది. దాంతో అది నీలినక్కగా మారిపోయింది. ఎలాగో మళ్లీ అడవిలోకి చేరుకుంది. తీరా అది అడవిలోకి వెళ్లేసరికి జంతువులు దాన్ని గుర్తించలేక పోయాయి.

నీలిరంగులో వుండే సరికి ఇదేదో కొత్త జంతువనే అనుకున్నాయి. ఆ జిత్తుల మారి నక్క తన రంగుతో లాభం పొందాలనుకుంది. అన్ని జంతువులను చేరబిలిచి, ‘‘నేను మీ కొత్త రాజును. నాకు రోజూ మీరే ఆహారం తెచ్చి పెట్టాలి’’ అంది. ‘‘...అందుకు ప్రతిఫలంగా మీకే హానీ చేయను’’ అని కూడా హామీ ఇచ్చింది. దాంతో జంతువులన్నీ తలలూపాయి. అప్పటినుంచి దానికి తామే ఆహారం సమకూర్చి పెట్టసాగాయి.

 అలా కాలం గడిచింది. ఒక రాత్రి కొన్ని నక్కలు ఊళ వేయసాగాయి. ఒంటరిగా ఉన్న నక్క అది వింది. తాను కూడా బదులుగా వూళ వేసింది. అంతే, దొరికిపోయింది. ఆ జంతువులన్నీ అది నక్కే అని తెలుసుకుని ఇక తరిమి తరిమి కొట్టాయి.  

జ్ఞానోదయం

సింహపురి గ్రామంలో శివయ్య అనే పేద రైతుండేవాడు. అతని భార్య సావిత్ర. వాళ్ళిద్దరూ కూలి పని చేస్తూ జీవించేవారు. వారి కొడుకు రంగడు. తాము తిన్నా తినకపోయినా వాడినెప్పుడూ పస్తుపెట్టకుండా చదివించి, ఆ గ్రామ పెద్ద సహకారంతో చిన్న ఉద్యోగం కూడా సంపాదించి పెట్టారు. రంగడు తల్లిదండ్రుల పట్ల వినవిధేయలతో ఉండేవాడు. చెప్పినట్లు వినేవాడు. ఉద్యోగంలో మొదటిసారి జీతం తీసుకున్నవెంటనే వాళ్లను కూలి పని మానిపించి, కుటుంబ భాద్యత తనే వహించాడు. కొడుక్కి తమ పట్ల గల ప్రేమకు సావిత్రి, శివయ్య ఎంతగానో పొంగిపోయేవారు. ఊళ్ళో నలుగురికీ వాడి గురించి ఎంతోగొప్పగా చెప్పుకుని మురిసిపోయేవారు.

కొంతకాలం తర్వాత రంగడికి విమల అనే అమ్మాయితో పెళ్ళయింది. కన్నవారు ధనవంతులు కావడంతో రంగడికి కట్నకానుకలు కాస్త ఎక్కువగానే ముట్టజెప్పారు. అయితే, విమల బాగా గడుసు మనిషి ఆమె నోరు చాలా చెడ్డది. పైగా డబ్బు పిచ్చి ఎక్కువ. అత్తామామలు ఊరికే కూర్చుని తినడం, ఆ ఇంట్లో ఉండటం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. రంగడు ఇంటికి రావడమే ఆలస్యంగా వాళ్ళమీద లేని పోని చాడీలు చెబుతుండేది. చెప్పుడు మాటలు విషం లాంటివి. ఎంత మంచివారైనా వాటి ప్రభావంలో పడిపోతారు. భార్య ఎక్కించే విషంతో రంగడిలో విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించింది.

తల్లిదండ్రులు బారంగా తోచారు... ఎక్కడికైనా పంపుదామన్నా వాళ్ళు వెళ్లరు. కాబట్టి మొత్తంగా ఈ లోకం నుంచే పంపించేయాలని నిశ్ఛయించుకున్నాడు. ఒక రోజు సంచి ఒకటి భుజాన తగిలించుకొని, పతంగిపురంలో జరుగుతున్న తలుపులమ్మ తల్లి తీర్థానికి వెళదామని చెప్పి. వాళ్లను బయలుదేరమన్నాడు. వాళ్ళు కోడల్ని కూడా రమ్మన్నారు. కానీ ఏదో వంక పెట్టి తప్పించుకుంది విమల. పతంగిపురం వెళ్లడానికి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించాలి. అడవి మద్యకు రాగానే రంగడు విశ్రాంతి మిషతో ఓ చెట్టు నీడన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టాడు. ఇప్పడే వస్తానని చెప్పి, వెళ్ళి సంచిలో ఉన్న సామాగ్రితో దొంగోడి వేషం వేసుకున్నాడు.

ధృఢంగా ఉన్న ఓ చెట్టు కొమ్మను విరిచి పట్టుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. దానితో కొట్టి తల్లిదండ్రులను చంపాలని కర్రను పైకెత్తాడు. మారువేషంలో ఉన్న కొడుకుని గుర్తుపట్టలేదు వాళ్ళు. ‘‘ ఒరే రంగా  ఎవడో మమ్మల్ని కొట్టిచంపబోతున్నాడు. ఎక్కడున్నావో గాని నువ్వు ఇటు రావద్దు. వెంటనే పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకో’’ అంటే అదే పనిగి అరవసాగారు. రంగడి చేతిలోని చెట్టు కొమ్మ అసంకల్పితంగా కిందికి జారిపోయింది విమల ఎక్కించిన విషం విరిగి, వాడికి జ్ఞానోదయమైంది.తల్లిదండ్రులకు తమ పిల్లల మీదుండే ప్రేమ అమృతం లాంటిదని, అనంతమైనదని అర్థమైంది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతూండగా మారువేషం తీసేశాడు. తల్లిదండ్రుల కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.

 వాళ్లను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి రంగడు బార్యను అదుపులో పెట్టి, తల్లిదండ్రుల్ని ఎప్పటిలా ఆదరంగా, ఆప్యాయంగా చూసుకోసాగాడు.   

అనగా అనగా ఒక పండితుడు

అనగా అనగా ఒక పండితుడు. తన పాండిత్యం మీద ఆయనకి అపారమైన విశ్వాసం. తనకు గొప్ప మంత్రాలు తెలుసుననీ, వాటిని నిష్ఠగా, తప్పులు లేకుండా జపించగలననీ గర్వం కూడా. ఒక రోజు ఆయన వద్దకు ఒక భక్తుడు వస్తాడు. ఏదైనా మంత్రం ఉపదేశించమని ప్రార్థిస్తాడు. ఏమీ చదువుకోని వాడు కనక అతను మంత్రాలు సరిగా పలకలేడనీ, మంత్రం సరిగ్గా పలకకపోతే అది పాపం అనీ చెప్తాడు పండితుడు.

తను పలక గలిగే మంత్రమేదైనా ఉపదేశించమని వేడుకుంటాడు ఆ భక్తుడు. ఏమీ తెలియదు కదా అని అతనిని ఆటపట్టిద్దామని అనుకుంటాడు పండితుడు. “రామ” నామాన్ని తిరగేసి, “మరా” అని ఉపదేశిస్తాడు. ఆ భక్తుడు శ్రద్ధగా “మరా మరా మరా” అని జపిస్తూ ధ్యానం చేస్తాడు. కొన్నాళ్ళకు భగవంతుడు ప్రత్యక్షమై ఆ భక్తుడిని ఆశీర్వదిస్తాడు. ఆ సంగతి తెలిసిన పండితుడు, తన గురువు గారిని కలిసి, “గురు వర్యా, దేవుడి పేరు తప్పుగా పలికిన అతనికి దేవుడు ఎలా కనిపించాడు?” అని అడుగుతాడు.

గురువు గారు పండితుడిని, “మరామరామరామ” అని అనమంటారు. పండితుడు “మరామరామరామ” అంటాడు. చివరికి “రామ” అని ఆగడం గమనిస్తాడు. తను “మరా” అని చెప్పినా, తీరా జపించేటప్పుడు అది “రామ” నామమే అయ్యిందని గ్రహిస్తాడు. తప్పు తెలుసుకుంటాడు.  

కోయిల పాట

మృగరాజు అడవిలో సపరివారంగా విందులారగించి గుహకు తిరిగి వచ్చేసరికి అర్థరాత్రి దాటింది. అమ్మాజీ! అప్పాజీ బయటకు వెళ్లి కాసేపు ఆడుకుంటాను. అంది సింహం పిల్ల. సరే వెళ్లిరా అన్నాయి పెద్ద సింహాలు. గుహకు దిగువగా ఉన్న చిన్న నీటి మడుగు వద్దకు నడిచింది. సింహం పిల్ల. అక్కడ ఆడుకుంటున్న కుండేళ్ళు, లేడి కూనలు, ఉడతలు, పావురాలు చెంగున గెంతి పొదల్లో దాక్కున్నాయి. ఇఫ్పుడే కడుపు నిందా తిని వస్తున్నాను. భయపడకండి ఆడుకుందా రండి. అంటూ ఆ మృదువుగా పిలిచింది. సింహం పిల్ల.

ఆ మాట విని అవన్నీ బయటకు వచ్చి. యువరాజుకు జయము జయము అన్నాయి. ఆహా.. వెన్నెల ఎంత హాయిగా వుంది. అంది సింహం పిల్ల. ఔనౌను అంటూ వంత పాడాయి నేస్తాలు. ఈ వెన్నెలలో ఎవరైనా చక్కగా పాటలు పాడితే బాగుంటుంది కదూ? వెంటనే మడుగులోని కప్పలన్నీ రకరకాల పాటలు పాడాయి. సింహ కిషోరం చెవులు మూసుకుంది. కొండ గొర్రెపిల్ల బేబే అని పాడింది. నక్కపిల్ల ఊళ పెట్టింది. ఇంతటి విశాల సామ్రాజ్యంలో తియ్యగా పాడేవాళ్ళు ఒక్కరూ లేరా అని నిట్టూర్చింది. సింహం పిల్ల. లేకేం కోయిలతో సాటి వచ్చే వారెవరూ లేరు. అంది కాకిపిల్ల అయితే వెళ్ళు ఇక్కడికి వచ్చి పాడమన్నానని చెప్పు.. ఇది నా ఆజ్ఞ! అంది సింహం పిల్ల. కాకిపిల్ల తుర్రున ఎగిరి వెళ్ళి. కాసేపటికి తిరిగి వచ్చింది. రానంటున్నది యువరాజా... పాడనంటున్నది అని చెప్పింది. అంత పొగరా దానికి ? ఆజ్ఞ పాటించకపోతే రాజ్య బహిష్కరణ శిక్ష తప్పదని చెప్పు అంది. కాకిపిల్ల వెళ్లి వచ్చి చెప్పాను యువరాజా అని నోరు విప్పలేదు. అడవిదాటి ఎగురుతూ వెళ్ళిపోయింది. అంది.

యువరాజు కబుర్లన్నీ విన్న మృగరాజు మడుగు దగ్గరకు వచ్చి హితువు చెప్పింది. పుత్రా... కవులను, గాయకులను ఆజ్ఞాపించడం తప్పు. కోయిలది స్వేచ్చాగానం. అది పాడేదాకా మనం వేచి ఉండాలి. నాలుగైదు నెలలు గడిచాయి. చెట్టు చివుల్లు తొడిగాయి. దిక్కుల చివరి నుంచి ఓ శ్రావ్యమైన పాట లీలగా అడవిలోకి ప్రవేశించింది. కూ... కూ... ఆహా... ఎంత హాయి. ఆ పాట కోయిలదే... చివుల్లు తొడిగిన ఓ మామిడి చెట్లో కోయిల నక్కి కూర్చుని వసంత రాగాలు ఆలపిస్తోంది. సింహం పిల్ల వెళ్లి కోయిల ముందు మోకరిల్లింది. మిత్రమా... నా అపరాధాన్ని మన్నించు. ఈ వనసీమలకు సామ్రాట్టును నేను నువ్వే అడివిలోకి తిరిగిరా అని ప్రార్థించింది. ఔనౌనంటూ ప్రాణకోటి ముక్త కంఠంతో వంతపాడింది.    

రహస్యం

 పెసరపాడు గ్రామాధికారి భూషయ్య ఏడేళ్ళ కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి ‘నాన్నా రహస్యం అంటే ఏమిటీ’ అనడిగింది. ‘ఎందుకూ?’ అనడిగాడతను. కమల తన స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటూంటే, ఒకావిడ వచ్చి వనజ తల్లితో, ఏదో చెప్పబోయింది. అప్పడు వనజ తల్లి పిల్లలతో, ‘రహస్యాలు పిలలు వినకూడదు. బైటకు వెళ్ళి ఆడుకోండి.’ అంది. ‘ సమాచారం, రహస్యం అంటే ఏమిటి నాన్నా ? అనడిగింది. కమల.

భూషయ్య ‘ వాటి అర్థం తరువాత చెబుతాను కాని, ముందు నువ్వు రచ్చబండ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వారందరితోనూ సాయంత్రం నేను మామిడితోపు దగ్గరకు రమ్మన్నానని చెప్పిరా, అన్నాడు.

 కమల వెంటనే పరుగెత్తుకు వెళ్ళి చెప్పి వచ్చింది. కాసేపటి తరువాత భూషయ్య కొబ్బరితోటకు వెళ్తూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. త్రోవలో ఓ ఇంటి వద్ద ఆగి, ఆ ఇంటి ఆసామీని పిలిచాడు. అతను బైటకు రాగానే, గొంతు తగ్గించి, ‘ వచ్చే నెలలో పెసర వెల పెరగబోతున్నట్లు సమాచారం అందింది. తొందరపడి నీ పంటంతా చవగ్గా అమ్మేయకు, ఈ సంగతి ఎవరికి చెప్పకు’ అన్నాడు. భూషయ్య.

 కొంతదూరం వెళ్ళాక మరోవ్యక్తి కనిపిస్తే అతన్ని పక్కకు పిలిచి, ముందు వ్యక్తికి చెప్పినట్టే చెప్పాడు. భూషయ్య. త్రోవ పొడువునా మరో అరడజనుమందికి అలాగే చెప్పాడు. అదంతా గమనిస్తూన్న కమల విస్తుపోతూ, అదేంటి నాన్నా, ఎవరికి చెప్పొద్దంటూ అందరికి నువ్వే చెప్పేశావు.? అనడిగింది.

 భూషయ్య నవ్వి, రహస్యమంటే ఇదేనమ్మా? ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కక్కరికే చాటుగా చెప్పేదే రహస్యం!’ అన్నాడు. సమాచారమంటే భాహుటంగా పదిమందికి తెలియపరచేది. నువ్వు రచ్చబండకు వార్తమోసుకుపోలా? అదన్నమాట,’ రహస్యమంటే ఇధా! అంటూ బుర్ర గోక్కుంది కమల. భూషయ్య నవ్వి, కొబ్బరి బొండాలు దింపించి తీయటి కొబ్బరినీటిని కమలకు ఇప్పించాడు.  

బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్

 ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు దీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూసాడు. అక్బర్ పాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో ఖంగుమని వినిపించింది.

 "సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా?" సభలోని వారెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరేత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంత సేపు గడిచిన పిదప అక్బర్, బీర్బల్ వైపు చూశాడు. అదేసమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెదుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు.

అక్బర్ : బీర్బల్ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు
బీర్బల్ : చిత్తం ప్రభూ! సత్యం-అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం జహపనా! అక్బర్‌తో పాటు సభలోనివారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్ధం బోధపడలేదు.
అక్బర్ : బీర్బల్ నీ సమాధానాన్ని మరింతగా వివరిస్తావా?
బీర్బల్ : తప్పకుండా ప్రభూ! మహారాజా కంటికి, చెవికి మధ్య దూరం నాలుగు వేళ్లేనన్నది అందరికి తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది.

బీర్బల్ వివరణకు అక్బర్‌తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్, అతనిని వేయి బంగారు నాణేలతో సత్కరించాడు.