Pages

Friday, January 11, 2013

అనగా అనగా ఒక పండితుడు

అనగా అనగా ఒక పండితుడు. తన పాండిత్యం మీద ఆయనకి అపారమైన విశ్వాసం. తనకు గొప్ప మంత్రాలు తెలుసుననీ, వాటిని నిష్ఠగా, తప్పులు లేకుండా జపించగలననీ గర్వం కూడా. ఒక రోజు ఆయన వద్దకు ఒక భక్తుడు వస్తాడు. ఏదైనా మంత్రం ఉపదేశించమని ప్రార్థిస్తాడు. ఏమీ చదువుకోని వాడు కనక అతను మంత్రాలు సరిగా పలకలేడనీ, మంత్రం సరిగ్గా పలకకపోతే అది పాపం అనీ చెప్తాడు పండితుడు.

తను పలక గలిగే మంత్రమేదైనా ఉపదేశించమని వేడుకుంటాడు ఆ భక్తుడు. ఏమీ తెలియదు కదా అని అతనిని ఆటపట్టిద్దామని అనుకుంటాడు పండితుడు. “రామ” నామాన్ని తిరగేసి, “మరా” అని ఉపదేశిస్తాడు. ఆ భక్తుడు శ్రద్ధగా “మరా మరా మరా” అని జపిస్తూ ధ్యానం చేస్తాడు. కొన్నాళ్ళకు భగవంతుడు ప్రత్యక్షమై ఆ భక్తుడిని ఆశీర్వదిస్తాడు. ఆ సంగతి తెలిసిన పండితుడు, తన గురువు గారిని కలిసి, “గురు వర్యా, దేవుడి పేరు తప్పుగా పలికిన అతనికి దేవుడు ఎలా కనిపించాడు?” అని అడుగుతాడు.

గురువు గారు పండితుడిని, “మరామరామరామ” అని అనమంటారు. పండితుడు “మరామరామరామ” అంటాడు. చివరికి “రామ” అని ఆగడం గమనిస్తాడు. తను “మరా” అని చెప్పినా, తీరా జపించేటప్పుడు అది “రామ” నామమే అయ్యిందని గ్రహిస్తాడు. తప్పు తెలుసుకుంటాడు.  

No comments:

Post a Comment