Pages

Sunday, September 16, 2012

స్మిత్‌, తిరిగి వెళ్ళిపో!


ఆ దృశ్యం చాలా మందికి 1927లో భారత స్వాతంత్య్ర సమరయోధులు సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ఆనాడు బ్రిటిష్‌ పాలకులు నియమించిన సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా, ``సైమన్‌, తిరిగి పో!'' అంటూ నినాదాలు చేస్తూ ఎలాగైనా స్వాతంత్య్రం సాధించి తీరాలన్న పట్టుదలతో స్వాతంత్య్ర యోధులు పోరాడారు. అయితే, ఇప్పుడు చెబుతున్న దృశ్యం 1927 నాటికి సంబంధించినదీ కాదు.
 
పోరాటం జరిపిన వారు స్వాతంత్య్ర యోధులూ కారు. ఇది మన స్వతంత్ర భారతంలో పదేళ్ళ క్రితమే జరిగింది. పోరాటం సాగించిన వారు మత్స్యకారులు. ఆ ఉద్యమంలో స్త్రీ పురుషులు దాదాపు రెండువేల మంది పాల్గొన్నారు. బోర్డులను పట్టుకుని నినాదాలు చేశారు. బోర్డుల మీది సందేశాలలో, మాటలలో కొద్దిగా తేడా కనిపించినప్పటికీ వాటి సారాంశం మాత్రం ఒక్కటే: ``స్మిత్‌, తిరిగి వెళ్ళిపో!'' `స్మిత్‌ కంజెనెరేషన్‌' అనే ఒక ప్రైవేటు కంపెనీ కర్నాటక సముద్ర తీరంలో బెంగ్రే గ్రామ సమీపంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక పెద్ద యంత్రాన్ని నెలకొల్పడానికి ఉద్దేశిం చింది.
 
బెంగ్రే గ్రామానికీ, పరిసర గ్రామాలకూ చెందిన మత్స్యకారులు దానిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ రోజు కంపెనీకి చెందిన కొందరు అధికా రులు-అసలు విషయాన్ని దాచి, పెద్ద యంత్రం ఆర్ధికాభివృద్ధికి దోహదం చేయగలదని బెంగ్రే ప్రాంత మత్స్యకారులకు వివరించడానికి స్థానిక కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణానికి చేరారు. అయితే, తరతరాల అనుభవంగల మత్స్యకారులకు అసలు జరగబోయేది ఏమిటో బాగా తెలుసు.
 
కంపెనీ అధికారులు మాట్లాడడం పూర్తిచేశాక మత్స్యకారులు తమకు సముద్రం అంటే కేవలం ఆదాయవనరు మాత్రమే కాదనీ; దానికీ, తమకూ తల్లీ బిడ్డల విడదీయరాని అనుబంధం ఉన్నదనీ, సముద్రం తమకు దేవత అనీ వివరించారు. మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు పాటు పడుతున్న కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు కూడా ఆనాటి సమావేశానికి హాజరయ్యారు.
 
వాళ్ళ సాయంతో, మత్స్యకారులు పెద్ద యంత్రం వస్తే సముద్రానికీ, తీరంలోని ఇసుకకూ కలిగే ముప్పు గురించి స్మిత్‌కూ, ఆయన మనుషులకూ తెలియ జెప్పారు. యంత్రం నుంచి వెలువడే చమురు సముద్ర జలాలను కలుషితం చేస్తుందనీ, అందువల్ల సముద్రంలోని చేపలు ఊపిరాడక చచ్చి పోగలవనీ చెప్పారు.

ఒక వేళ చేపలు చచ్చిపోక పోయినా, యంత్రం పుట్టించే శబ్దం వాటిని దూరంగా తరుమగొడుతుందనీ, ఆ తరవాత తాము పట్టడానికీ, తమ స్త్రీలు అమ్మడానికీ ఏమి మిగులుతాయని ప్రశ్నించారు. అదే సమయంలో కంపెనీ మనుషులు అక్కడ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల, బెంగ్రేకూ, పరిపర గ్రామాలకూ సమకూరనున్న ప్రయోజనాల గురించి వివరించే నివేదికను అందించారు. నిజానికి ఆ యంత్రాన్ని అక్కడ నెలకొల్పడం ఆ ప్రాంతానికి ఎంతగానో మేలు చేస్తుందనే తప్పుడు సమాచారాన్ని అందించి ప్రజలను నమ్మించి, వ్యతిరేకతను పోగొట్టాలని ప్రయత్నించారు.
 
దాన్ని చదివి చూసిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందులోని వివరాలు పూర్తి వాస్తవాలు కావని గ్రహించారు. కంపెనీ మనుషులు తమ నివేదికను సమర్పించాక, మత్స్యకారుల మిత్రులైన స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు దానికి తీవ్రమైన అభ్యంతరాలను తెలియజేశారు. నివేదిక సరైనది కాదని చెప్పారు. అది తీరంలో ఏర్పడే దీర్ఘకాల పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. ``స్మిత్‌, తిరిగి వెళ్ళి పో,'' లాంటి నినాదాలతో కలెక్టర్‌ కార్యాలయ ప్రాంతం మారుమోగింది. ఒకే గందరగోళం నెలకొన్నది. ఎట్టి పరిస్థితులలోనూ స్మిత్‌ పెద్దయంత్రాన్ని నెలకొల్పనీయరాదని మత్స్యకారులు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
 
సమావేశం ముగిసింది. మరునాడు వార్తా పత్రికలు ఈ సమావేశం గురించి వార్తలు ప్రచురించాయి. చాలా పత్రికలు మత్స్యకారులకూ, స్వచ్ఛంద సేవా సంస్థలకూ తమ మద్దతు తెలిపాయి. అయితే, కొన్ని రోజులు గడిచాక బెంగ్రేలో యంత్రం నెలకొల్పే పనులు ప్రారంభించమని ప్రభుత్వం స్మిత్‌ కంపెనీని ఆదేశించింది. మత్స్యకారుల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట! అయినా, మత్స్యకారులూ, స్వచ్ఛంద సేవాసంస్థలూ తమ పోరాటాన్ని మానుకోలేదు.
 
వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రముఖులను కలుసుకుని విషయం చెప్పారు. ఉత్తరాలు రాశారు. పెద్దయంత్రాన్ని నెలకొల్పకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నించారు. వాటి పర్యవసానంగా బెంగ్రేలో ఆ పెద్దయంత్రం ఇంతవరకు నెలకొల్పబడలేదు. మత్స్యకారుల సంకల్పం దృఢమైనది; ప్రశంసనీయమైనది. సముద్ర రక్షణకు కలిసి కట్టుగా ముందుకు వచ్చారు.        

No comments:

Post a Comment